Chapter_23

Back
Book Balakandamu
Chapter No 29
Pages 7
Read Time 10 Minutes

Chapter_23

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ త్రయోవింశః సర్గః

శ్రీరామలక్ష్మణసమేతు డైన విశ్వామిత్రుడు సరయూగంగాసంగమము దగ్గర నున్న ఆశ్రమములో రాత్రి విశ్రమించుట.

మూ. ప్రభాతాయాం తు శర్వర్యాం విశ్వామిత్రో మహామునిః,

అభ్యభాషత కాకుత్థ్సౌ శయానౌ పర్ణసంస్తరే. 1

ప్ర. అ. శర్వర్యామ్ = రాత్రి, ప్రభాతాయామ్ = తెల్లవారగా, మహామునిః = మహాముని యైన, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, పర్ణసంస్తరే = పర్ణశయనమునందు, శయానౌ = శయనించిఉన్న, కాకుత్థ్సౌ = రామలక్ష్మణులను గూర్చి, అభ్యభాషత = పలికెను.

తా. రాత్రి గడిచి తెల్లవారుచున్నది. అపుడు విశ్వామిత్రమహర్షి పర్ణశయనము పై శయనించి యున్న రామలక్ష్మణులతో ఇట్లు పలికెను.

మూ. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సన్ధ్యా ప్రవర్తతే,

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్. 2

ప్ర. అ. కౌసల్యా సుప్రజాః = కౌసల్యయొక్క ఉత్తమసంతాన మైన, రామ = ఓ రామా!, పూర్వా సంధ్యా = పూర్వసంధ్య, ప్రవర్తతే = ప్రవర్తించుచున్నది. నరశార్దూల = ఓ నరశ్రేష్ఠుడా! ఉత్తిష్ఠ = లెమ్ము, దైవమ్ = దేవతాసంబంధి యైన, ఆహ్నికమ్ = ప్రతిదినము చేయతగిన కర్మ, కర్తవ్యమ్ = చేయదగినది.

తా. కౌసల్యా సత్పుత్రుడ వైన ఓ రామా! ప్రాతఃకాలసంధ్య వచ్చినది. ఓ నరశ్రేష్ఠుడా! లెమ్ము. సంధ్యావన్దనాదినిత్యకర్మ చేయవలసి యున్నది.

మూ. తస్యర్షేః పరమోదారం వచః శ్రుత్వా నృపాత్మజౌ,

స్నాత్వా కృతోదకౌ వీరౌ జేపతుః పరమం జపమ్. 3

ప్ర. అ. వీరౌ = వీరులైన, నృపాత్మజౌ = రాజకుమారులు, తస్య ఋషేః = ఆ ఋషీశ్వరునియొక్క, పరమోదారమ్ = మిక్కిలి అంద మైన, వచః = వాక్కును, శ్రుత్వా = విని, స్నాత్వా = స్నానము చేసి, కృతోదకౌ = అర్ఘ్యప్రదానము చేసినవారై, పరమమ్ = గొప్ప దైన, జపమ్ = గాయత్రీజపమును, జేపతుః = జపించిరి.

తా. వీరు లైన ఆ రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఆ మధురవాక్యము విని, లేచి, స్నానము చేసి, సూర్యునకు అర్ఘ్యప్రదానము చేసి, అత్యుత్తమ మగు, గాయత్రీ మంత్రమును జపించిరి.

మూ. కృతాహ్నికౌ మహావీర్యౌ విశ్వామిత్రం తపోధనమ్,

అభివాద్యాభిసంహృష్టౌ గమనాయాభితస్థతుః. 4

ప్ర. అ. మహావీర్యౌ = గొప్ప పరాక్రమము గల ఆ రామలక్ష్మణులు, కృతాహ్నికౌ = చేయబడిన నిత్యకర్మలు కలవారై, అభిసంహృష్టౌ = ఉత్సాహవంతులై, తపోధనమ్ = తపస్సే ధనముగా గల, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని, అభివాద్య = నమస్కరించి, గమనాయ = ప్రయాణమునకు, అభితస్థతుః = సన్నద్ధులైరి.

తా. రామలక్ష్మణులు సంధ్యావందనాదినిత్యకర్మలను పూర్తి చేసికొని, విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి, ఉత్సాహముతో ప్రయాణోన్ముఖు లయిరి.

మూ. తౌ ప్రయాతౌ మహావీర్యౌ దివ్యాం త్రిపథగాం నదీమ్,

దదృశాతే తతస్తత్ర సరయ్వాః సఙ్గమే శుభే. 5

ప్ర. అ. తతః = పిమ్మట, మహావీర్యౌ = మహావీర్యవంతులగు ఆ రామలక్ష్మణులు, ప్రయాతౌ = కొంతదూరమువెళ్లినవారై, తత్ర = అచట, శుభే = పవిత్రమైన, సరయ్వాః = సరయూనదియొక్క, సంగమే = సంగమము నందు పుట్టిన, నదీమ్ = నదిని, దదృశాతే = చూచిరి.

తా. మహావీర్యు లగు రామలక్ష్మణులు కొంత దూరము ప్రయాణము చేసిన పిమ్మట పవిత్ర మగు సరయూనదీ సంగమస్థానమునందు గంగానదిని చూచిరి.

మూ. తత్రాశ్రమపదం పుణ్యమ్ ఋషీణామగ్య్రతేజసామ్,

బహువర్షసహస్రాణి తప్యతాం పరమం తపః. 6

ప్ర. అ. తత్ర = అచట, బహువర్షసహస్రాణి = ఎన్నో వేలసంవత్సరములు, పరమమ్ = గొప్ప, తపః = తపస్సును, తప్యతామ్ = చేయుచున్న, అగ్య్రతేజసామ్ = గొప్ప తేజస్సు గల, ఋషీణామ్ = ఋషీశ్వరుల, పుణ్యమ్ = పవిత్రమైన, ఆశ్రమపదమ్ = ఆశ్రమస్థానమును, (చూచిరి).

తా. అచట కొన్ని వేల సంవత్సరమునుండి గొప్ప తపస్సు చేయుచున్న, శ్రేష్ఠ మైన తేజస్సు గల ఋషుల ఆశ్రమమును చూచిరి.

మూ. తం దృష్ట్వా పరమప్రీతౌ రాఘవౌ పుణ్యమాశ్రమమ్,

ఊచతుస్తం మహాత్మానం విశ్వామిత్రమిదం వచః. 7

ప్ర. అ. తమ్ = ఆ, పుణ్యమ్ = పవిత్రమైన, ఆశ్రమమ్ = ఆశ్రమమును, దృష్ట్వా = చూచి, పరమప్రీతౌ = చాలసంతసించిన, రాఘవౌ = రామలక్ష్మణులు, మహాత్మానమ్ = మహాత్ముడైన, తం విశ్వామిత్రమ్ = ఆ విశ్వామిత్రుని గూర్చి, ఇదమ్ = ఈ, వచః = వాక్కును, ఊచతుః = పలికిరి.

తా. ఆ పుణ్యాశ్రమమును చూడగనే సంతుష్టాంతరంగులైన రామలక్ష్మణులు విశ్వామిత్రునితో ఇట్లు పలికిరి.

మూ. కస్యాయమాశ్రమః పుణ్యః కో న్వస్నిన్వసతే పుమాన్,

భగవన్ శ్రోతుమిచ్ఛావః పరం కౌతూహలం హి నౌ. 8

ప్ర. అ. భగవన్ = ఓ పూజ్యుడా! అయమ్ = ఈ, పుణ్యః = పవిత్రమైన, ఆశ్రమః = ఆశ్రమము, కస్య = ఎవనిది? అస్మిన్ = దీనియందు, కః ను = ఏ, పుమాన్ = పురుషుడు, వసతే = నివసించుచున్నాడు? శ్రోతుమ్ = వినుటకు, ఇచ్ఛావః = ఇచ్ఛయించుచున్నాము. నౌ = మాకు, పరమ్ = గొప్ప, కౌతూహలం హి = వేడుక ఉన్నది కదా.

తా. ఓ పూజ్యుడా! పవిత్ర మైన ఈ ఆశ్రమము ఎవ్వనిది ? దీనిలో ఎవ్వడు నివసించుచున్నాడు ? మాకు విన వేడుకగా నున్నది.

మూ. తయో స్తద్వచనం శ్రుత్వా ప్రహస్య మునిపుఙ్గవః,

ఆబ్రవీచ్ఛ్రూయతాం రామ యస్యాయం పూర్వ ఆశ్రమః. 9

ప్ర. అ. మునిపుఙ్గవః = మునిశ్రేష్ఠుడు, తయోః = వారియొక్క, తత్ వచనమ్ = ఆ వచనమును, శ్రుత్వా = విని, ప్రహస్య = నవ్వి, అబ్రవీత్ = పలికెను. పూర్వే = పూర్వకాలమునందు, అయమ్ ఆశ్రమః = ఈ ఆశ్రమము, యస్య = ఎవనిదో, శ్రూయతామ్ = వినబడుగాక.

తా. వారి మాటలు విని, విశ్వామిత్రుడు నవ్వి, ‘‘పూర్వము ఈ ఆశ్రమమెవ్వరిదో చెప్పెదను, వినుడు’’ అని పలికెను.

మూ. కన్దర్పో మూర్తిమానాసీత్ కామ ఇత్యుచ్యతే బుధైః,

తపస్యన్తమిహ స్థాణుం నియమేవ సమాహితమ్. 10

కృతోద్వాహం తు దేవేశం గచ్ఛన్తం సమరుద్గణమ్,

ధర్షయామాస దుర్మేధా హుంకృతశ్చ మహాత్మనా. 11

ప్ర. అ. కన్దర్పః = మన్మథుడు, మూర్తిమాన్ = దేహముకలవాడై, ఆసీత్ = ఉండెను. బుధైః = పండితులచేత, కామః ఇతి = కాము డని, ఉచ్యతే = చెప్పబడుచున్నాడు. దుర్మేధాః = చెడ్డ బుద్ధి గల ఆ మన్మథుడు, ఇహ = ఇచట, తపస్యన్తమ్ = తపస్సుచేయుచున్నవాడును, నియమేన = నియమముచే, సమాహితమ్ = ఏకాగ్రచిత్తుడై ఉన్నవాడును, కృతోద్వాహమ్ = చేయబడిన వివాహము కలవాడై, సమరుద్గణమ్ = దేవతాసమూహసమేతముగా, గచ్ఛన్తమ్ = వెళ్లుచున్నవాడును, దేవేశమ్ = దేవతాప్రభువును అగు, స్థాణుమ్ = శివుని, ధర్షయామాస = ఎదిరించెను. మహాత్మనా = మహాత్ము డైన ఆ శివునిచేత, హుంకృతశ్చ = హుంకరించబడెను.

తా. మన్మథుడు మూర్తిమంతుడై ఉండెడివాడు. అతనికి కాము డని పేరు. నియమముచే సమాహితచిత్తుడై ఇచట తపస్సు చేయుచున్నవాడును, వివాహము చేసికొని దేవతాసమేతుడై వెళ్ళుచున్నవాడును, సకలదేవతలకు ప్రభువును అగు శివుని, దుష్టబుద్ధి యగు ఆ మన్మథుడు ఎదిరించెను. అపుడు శివుడు హుంకరించి కోపముగా చూచెను.

వి. మన్మథుడు శివుని తపస్సు చేయుచుండగా ఎదిరించినాడు కాని వివాహము చేసికొని దేవతలతో కలిసి వెళ్లుచున్నప్పుడు కాదు. అందుచేత ‘‘కృతోద్వాహమ్’’ ఇత్యాదిపాదమునకు ‘‘వివాహము చేసికొనబోవువాడును, దేవతాగణముతో కలిసి వెళ్లబోవువాడును’’ అని కొందరు వ్యాఖ్యానము వ్రాసిరి. కాని ఇచట నున్న పదములకు ఆ అర్థము రాదు. మరికొందరు లేని పోని అర్థాలు కల్పించి ‘‘ప్రాణవాయువును నిగ్రహించి తపస్సు చేయుచున్నవాడు’’ అని మరొక అర్థము చెప్పి ఉన్నారు. అది అంతకంటె అసంగతము. ఇట్టి అర్థములు చెప్పుట వాల్మీకి హృదయమును గ్రహించుట కాదు. మన హృదయమును చూపుటమాత్రమే అగును. శివుడు హిమాచలముపై తపస్సు చేయుచుండగా మన్మథుడు తపోవిఘ్నము చేయ నెంచినా డని పురాణాంతరప్రసిద్ధము. ఇచట అంగదేశములో శివుడు తపస్సు చేసినట్లు వర్ణింపబడినది. ఈ విరోధము ఉండనే ఉన్నది. దీనికి సమాధానముగా కల్పాంతరములో అట్లు జరిగే ఉండవచ్చును అని ఒక వ్యాఖ్యాత వ్రాసినాడు. వాస్తవమున అన్ని కల్పములందును రామాయణ భారతపురాణ కథలు అనేకపర్యాయములు జరిగిన వని చెప్పు వాదము అర్థరహితము. అప్పుడు శాస్త్రపురుషకారములకు వైయర్థ్య మాపాదించినట్లగును. అన్ని కల్పాలలోను జగత్సృష్టి ఒకే విధముగ జరుగు పక్షమున ఈ పాపపుణ్యాదిచింత ఎందులకు? ఈ పురుషకారప్రబోధ మెందులకు? ఒక సినెమాను అనేకపర్యాయములు చూపినట్లు ఈ జగత్ప్రవృత్తి అని కదా ఈ వాదములోని ఆశయము. కృత్వాచింతచే ఈ వాదమును అంగీకరించినను అన్ని కల్పాలలోను శివుడు ఒకే చోట తపస్సు చేయవలెను. అన్నియు ఒకే విధముగా జరుగవలెను. ఈ మార్పులు ఎట్లు వచ్చును ? అందుచేత ఈ శ్లోకమున అక్షరార్థ మెట్లు ఉన్నదో అట్లే చెప్పుకొనవలెను. రామాయణము ప్రకారము - శివుడు ఈ ప్రాంతములో తపస్సు చేసెననియు, వివాహము చేసికొనిన పిమ్మట దేవతలతో కలిసి వెళ్లుచుండగా మన్మథుడు బహుశా తన ప్రభావముచేతనే శివుడు వివాహము చేసికొనె నని బీరములు పలుకగా అతనిని శివుడు భస్మము చేసె ననియు చెప్పవలెను. గ్రంథము ఎట్లున్నదో అట్లు వ్యాఖ్య వ్రాయుట ఉచితము. అతి ప్రాచీనములై, చాలకాలము శ్రుతానుశ్రవికముగ వచ్చు రామాయణాది గ్రంథములలో పాఠకాదుల ప్రమాదముచే అనేక నూత్నశ్లోకపాదాదులు ప్రవేశించుటతో సమన్వయము కుదరకపోవచ్చును. పూర్వదేశరామాయణాదులలో సర్గసంఖ్యాకాండవిభాగాదులే మారిపోయినవి కదా! అందుచే శ్రమపడి గ్రంథార్థమును మార్చుట అనావశ్యకము. ఆ సమన్వయమేదైన ఉన్నచో అది గ్రంథమునకు బైట చెప్పుకొనవచ్చును. వాస్తవమున ‘‘కృతోద్వాహమ్’’ ఇత్యాదిపాదద్వయము ప్రక్షిప్తమని అంగీకరించినచో అర్థము చక్కగ కుదురును.

మూ. అవదగ్ధస్య రౌద్రేణ చక్షుషా రఘునన్దన,

వ్యశీర్యన్త శరీరాత్ స్వా త్సర్వగాత్రాణి దుర్మతేః. 12

ప్ర. అ. రఘునన్దన = ఓ రామా! రౌద్రేణ = రుద్రునికి సంబంధించిన, చక్షుషా = నేత్రముచే, అవదగ్ధస్య = కాల్చివేయబడిన, దుర్మతేః = దుర్మతి యైన మన్మథుని యొక్క, స్వాత్ = తనయొక్క, శరీరాత్ = శరీరమునుండి, సర్వగాత్రాణి = అన్ని అవయవములును, వ్యశీర్యన్త = రాలిపోయినవి.

తా. శివుని నేత్రముచే కాల్చివేయబడిన ఆ దుర్మతి అవయవము లన్నియు అతని శరీరమునుండి జారిపోయినవి.

మూ. తస్య గాత్రం హతం తత్ర నిర్దగ్ధస్య మహాత్మనా,

అశరీరః కృతః కామః క్రోధాద్దేవేశ్వరేణ హి. 13

ప్ర. అ. మహాత్మనా = మహాత్ము డైన శివునిచేత, నిర్దగ్ధస్య = కాల్చివేయబడిన, తస్య = అతనియొక్క, గాత్రమ్ = శరీరము, తత్ర = అచట, హతమ్ = నశించిపోయినది. దేవేశ్వరేణ = ఆ దేవతాధీశునిచేత, క్రోధాత్ = కోపమువలన, కామః = మన్మథుడు, అశరీరః = శరీరము లేనివాడుగా కృతః = చేయబడినాడు.

తా. శివునిచే కాల్చివేయబడిన మన్మథుని శరీరము నశించినది. ఈ విధముగ శివుడు కోపించి మన్మథుని శరీరము లేనివానినిగా చేసెను.

మూ. అనఙ్గ ఇతి విఖ్యాతస్తదాప్రభృతి రాఘవ,

స చాఙ్గవిషయః శ్రీమాన్ యత్రాఙ్గం ప్రముమోచ హ. 14

ప్ర. అ. రాఘవ = ఓ రామా! తదాప్రభృతి = అది మొదలు, అనఙ్గః ఇతి = అనంగుడు (శరీరములేనివాడు) అని, విఖ్యాతః = ప్రసిద్ధు డయ్యెను. యత్ర = ఎచట, అఙ్గమ్ = శరీరమును, ప్రముమోచ హ = విడచెనో, సః చ = ఆ దేశము, శ్రీమాన్ = శ్రీయుత మైన, అఙ్గవిషయః = అంగదేశము అని, విఖ్యాతః = ప్రసిద్ధమైనది.

తా. అది మొదలు మన్మథునికి అనంగు డని ప్రసిద్ధి వచ్చినది. అతడు దేహమును (అంగమును) విడచిన దేశమునకు అంగదేశ మని పేరు వచ్చినది.

మూ. తస్యాయమాశ్రమః పుణ్యస్తస్యేమే మునయః పురా,

శిష్యా ధర్మపరా నిత్యం తేషాం పాపం న విద్యతే. 15

ప్ర. అ. అయమ్ = ఇది, తస్య = ఆ శివునియొక్క, పుణ్యః = పుణ్య మైన, ఆశ్రమః = ఆశ్రమము. పురా = పూర్వము, తస్య = ఆ శివునియొక్క, శిష్యాః = శిష్యులైన, ఇమే = ఈ, మునయః = మునులు, నిత్యమ్ = ఎల్లప్పుడును, ధర్మపరాః = ధర్మపరాయణులు. తేషామ్ = వారికి, పాపమ్ = పాపము, న విద్యతే = లేదు.

తా. ఇది శివుడు తపస్సు చేసిన పుణ్య మైన ఆశ్రమము. ఈ మునులందరును పూర్వము, అనగా శివుడు ఇచట నున్నపుడు, ఆ శివుని శిష్యులుగా నుండెడివారు. నిత్యము ధర్మపరాయణులు. వీరికి పాపము అనునది లేదు.

వి. ‘‘తస్య కామస్య స్థాణోర్వా’’- అనగా మన్మథునియొక్క లేదా స్థాణువు యొక్క ఆశ్రమము. ‘‘పురా పూర్వకాలమారభ్య’’ = పూర్వకాలమునుండియు, వీరు ‘‘సంతాన పరమ్పరయా శిష్యాః’’ - సంతానపరంపరాక్రమమున శిష్యులు. ప్రత్యక్షముగ శిష్యులు కారు. చాల కాలమునకు పూర్వము వీరి పూర్వపురుషులు ఆయనకు శిష్యులు. ‘‘అత ఏవ ధర్మపరాః’’ - అనగా వారి పూర్వపురుషులనుంచి వీరు ఇంత దూర మైనారు గాన ధర్మపరులు. ‘‘అత ఏవ పాపం తేషాం న విద్యతే. పూర్వం రుద్రశిష్యా అపి సంప్రతి తచ్ఛిష్యత్వకృతం పాపం న విద్యతే ఇత్యర్థః’’ - కావుననే వారిలో పాపము లేదు. అనగా పూర్వము వీరి ప్రాచీను లెవరో రుద్రునకు శిష్యులైనను, ఇపుడు వీరికి రుద్రులకు శిష్యు లగుటవలన కలుగు పాపము లేదు అని యర్థము.’’ ఇది గోవిందరాజులు విశదీకరించిన వాల్మీకి భావము. మన్మథుని ఆశ్రమము కావున ఇది పుణ్యాశ్రమము కావచ్చును కాని స్థాణువు ఆశ్రమమునకు పుణ్యత్వ మేమిటి అని మొదట తస్యఅనగా కామస్యఅని వ్యాఖ్యానించినారు. తప్పనిసరిమీద ‘‘స్థాణోర్వా’’ అన్నారు. పురాశిష్యాః ధర్మపరాః’ ‘‘తేషాం పాపం న విద్యతే’’ అను పదాలకు వారు చెప్పిన అర్థము స్పష్టమే. ‘‘పురాణమిత్యేవ న సాధు సర్వమ్’’ అనే దృష్టితో ప్రాచీన మైనంత మాత్రాన ప్రమాణము లని మనవారు భావించు వ్యాఖ్యానాలు ఎట్లున్నవో చూపుటకై అప్రస్తుతప్రసంగము చేయవలసివచ్చినది.

మూ. ఇహాద్య రజనీం రామ వసేమ శుభదర్శన,

పుణ్యయోః సరితోర్మధ్యే శ్వస్తరిష్యామహే వయమ్. 16

ప్ర. అ. శుభదర్శన = శుభకర మైన దర్శనము గల, రామ = రాముడా!, వయమ్ = మనము, అద్య = ఈనాడు, రజనీమ్ = రాత్రి, ఇహ = ఇచట, పుణ్యయోః = పుణ్యము లైన, సరితోః = నదులయొక్క, మధ్యే = మధ్యమందు, వసేమ = నివసించెదము. శ్వః = రేపు, తరిష్యామహే = దాటెదము.

తా. శుభకరదర్శనుడ వైన ఓ రామా! ఈ రాత్రి, పవిత్రము లైన గంగా సరయూనదుల మధ్య, ఇచట ఉండి రేపు గంగానదిని దాటెదము.

మూ. అభిగచ్ఛామహే సర్వే శుచయః పుణ్యమాశ్రమమ్,

స్నాతాశ్చ కృతజప్యాశ్చ హుతహవ్యా నరోత్తమ. 17

ప్ర. అ. నరోత్తమ = ఓ నరశ్రేష్ఠుడా! సర్వే = మన మందరము, స్నాతాశ్చ = స్నానము చేసినవారమై, కృతజప్యాశ్చ = జపము చేసినవారమై, హుతహవ్యాః = హోమము చేయబడిన హవ్యము కలవారమై, శుచయః = పవిత్రులమై, పుణ్యమ్ = పుణ్య మైన, ఆశ్రమమ్ = ఆశ్రమమును, అభిగచ్ఛామహే = ప్రవేశించెదము.

తా. ఓ నరోత్తమా! మన మందరము స్నానజపహోమాదులు చేసికొని, పరి శుద్ధులమై ఈ పుణ్యాశ్రమమును ప్రవేశింతుము.

మూ. తేషాం సంవదతాం తత్ర తపోదీర్ఘేణ చక్షుషా,

విజ్ఞాయ పరమప్రీతా మునయో హర్షమాగమన్. 18

ప్ర. అ. తత్ర = అచట, తేషామ్ = వారు, సంవదతామ్ = సంభాషించుకొనుచుండగా, మునయః = మునులు, తపోదీర్ఘేణ = తపస్సుచేత దీర్ఘమైన, చక్షుషా = నేత్రముచే, విజ్ఞాయ = తెలిసికొని, పరమప్రీతాః = మిక్కిలి సంతసించిన వారై, హర్షమ్ = ఆనందమును, ఆగమన్ = పొందిరి.

తా. రామలక్ష్మణవిశ్వామిత్రులు మాటలాడుచుండగా, ఆ ఆశ్రమములోని మునులు తపస్సుచే ఎంత దూర మైనను ప్రసరించు దృష్టిచే (జ్ఞానముచే) తెలిసికొని, చాల సంతసించిన వారై, ఆనందము పొందిరి.

మూ. అర్ఘ్యం పాద్యం తథాతిథ్యం నివేద్య కుశికాత్మజే,

రామలక్ష్మణయోః పశ్చాదకుర్వన్నతిథిక్రియామ్. 19

ప్ర. అ. అర్ఘ్యమ్ = అర్ఘ్యమును, పాద్యమ్ = పాదోదకమును, తథా = మరియు, ఆతిథ్యమ్ = అతిథిసత్కారమును, కుశికాత్మజే = విశ్వామిత్రునియందు, నివేద్య = సమర్పించి, పశ్చాత్ = పిమ్మట, రామలక్ష్మణయోః = రామలక్ష్మణులకు, అతిథి క్రియామ్ = అతిథిసత్కారమును, అకుర్వన్ = చేసిరి.

తా. వారు ముందుగా విశ్వామిత్రునకు అర్ఘ్యపాద్యములను, ఆతిథ్యమును సమర్పించి, పిమ్మట రామలక్ష్మణులకు అతిథిసత్కారము చేసిరి.

మూ. సత్కారం సమనుప్రాప్య కథాభిరభిరఞ్జయన్,

యథార్హమజపన్ సన్ధ్యామృషయస్తే సమాహితాః. 20

ప్ర. అ. సత్కారమ్ = సత్కారమును, సమనుప్రాప్య = పొంది, కథాభిః = కథలచేత, అభిరఞ్జయన్ = ఆనందింపచేసిరి. తే ఋషయః = ఆ ఋషులు, సమాహితాః = సావధాన చిత్తము కలవారై, యథార్హమ్ = తగు విధమున, సన్ధ్యామ్ = సంధ్యను, అజపన్ = జపించిరి.

తా. రామలక్ష్మణవిశ్వామిత్రులు వారినుండి సత్కారములు గైకొని కథలచే ఆనందింపచేసిరి. పిదప ఆ ఋషు లందరును ఏకాగ్రచిత్తులై, తగు విధమున సంధ్యోపాసన చేసిరి.

మూ. తత్ర వాసిభిరానీతా మునిభిః సువ్రతైః సహ,

న్యవసన్ సుసుఖం తత్ర కామాశ్రమపదే తదా. 21

ప్ర. అ. తత్ర = అచట, వాసిభిః = నివసించు, సువ్రతైః = ఉత్తమ వ్రతము గల, మునిభిః = మునులచే, సహ = తమతో కూడ, ఆనీతాః = తీసికొని వెళ్లబడినవారై, తదా = అప్పుడు, తత్ర = ఆ, కామాశ్రమపదే = కామాశ్రమమునందు, సుసుఖమ్ = చాలసుఖముగా, న్యవసన్ = నివసించిరి.

తా. ఆ ఆశ్రమములో నివసించు సువ్రతు లగు మునులు రామలక్ష్మణ విశ్వామిత్రులను తమతో ఆశ్రమములోనికి తీసికొనివెళ్లిరి. వారు అచట సుఖముగా నివసించిరి.

మూ. కథాభిరభిరామాభిరభిరామౌ నృపాత్మజౌ,

రమయామాస ధర్మాత్మా కౌశికో మునిపుఙ్గవః. 22

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే త్రయోవింశః సర్గః

ప్ర. అ. ధర్మాత్మా = ధర్మాత్ముడును, మునిపుఙ్గవః = మునిశ్రేష్ఠుడును అగు, కౌశికః = విశ్వామిత్రుడు, అభిరామౌ = మనోహరులైన, నృపాత్మజౌ = రాజకుమారులను, అభిరామాభిః = మనోహరము లైన, కథాభిః = కథలచేత, రమయామాస = ఆనందింపచేసెను.

తా. విశ్వామిత్రమహాముని, మనోహరు లగు ఆ రాజకుమారులకు మనోహరము లగు కథలు చెప్పుచు ఆనందింపచేసెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో ఇరువది మూడవ సర్గ సమాప్తము.

© 2026 Ebook Library