| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 30 |
| Pages | 8 |
| Read Time | 12 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమఃబాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ చతుర్వింశః సర్గః
నావపై ఎక్కి నదిని దాటుచున్నపుడు ‘‘నీరు బ్రద్దలగుచున్నట్లు ఇంత గంభీరధ్వని వచ్చుచున్న దేమి కారణము?’’ అని శ్రీరాముడు అడుగగా విశ్వామిత్రుడు ప్రత్యుత్తర మిచ్చుట. విశ్వామిత్రుడు మలద-కరూష-తాటకావనములను గూర్చి రామునకు తెలిపి తాటకను చంపు మని శ్రీరాముని ప్రేరేపించుట.
మూ. తతః ప్రభాతే విమలే కృతాహ్నికమరిన్దమౌ,
విశ్వామిత్రం పురస్కత్య నద్యాస్తీరముపాగతౌ. 1
ప్ర. అ. తతః = పిమ్మట, అరిన్దమౌ = శత్రుసంహారకులైన, ఆ రామలక్ష్మణులు, విమలే = పరిశుద్ధ మైన, ప్రభాతే = ప్రాతఃకాలమునందు, కృతాహ్నికమ్ = చేయబడిన ఆహ్నికక్రియలు గల, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని, పురస్కత్య = ఎదుట ఉంచుకొని, నద్యాః = గంగానది యొక్క, తీరమ్ = తీరమును, ఉపాగతౌ = చేరిరి.
తా. శత్రుమర్దను లగు ఆ రామలక్ష్మణులు, పవిత్ర మైన ప్రాతఃకాలమునందు ప్రాతఃకాలకృత్యములు తీర్చుకొని ప్రయాణమునకు సిద్ధముగా ఉన్న విశ్వామిత్రుడు బయలుదేరి ముందు నడువగా గంగానదీతీరము చేరిరి.
మూ. తే చ సర్వే మహాత్మానో మునయః సంశితవ్రతాః,
ఉపస్థాప్య శుభాం నావం విశ్వామిత్రమథాబ్రువన్. 2
ప్ర. అ. మహాత్మానః = మహాత్ములును, సంశితవ్రతాః = తీవ్రమైన తపశ్చర్యకలవారును అగు, తే = ఆ, సర్వే = సమస్తమైన, మునయః = మునులు, శుభామ్ = శుభకర మైన, నావమ్ = నావను, ఉపస్థాప్య = తీసికొనివచ్చి, అథ = అటుపిమ్మట, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రునిగూర్చి, అబ్రువన్ = పలికిరి.
తా. తీవ్రతపశ్చర్య గల మహాత్ము లైన ఆ మును లందరును మంగళకర మైన నావనొకదానిని తీసికొని వచ్చి విశ్వామిత్రునితో ఇట్లనిరి.
మూ. ఆరోహతు భవాన్నావం రాజపుత్రపురస్కృతః,
అరిష్టం గచ్ఛ పన్థానం మా భూత్కాలవిపర్యయః. 3
ప్ర. అ. భవాన్ = నీవు, రాజపుత్రపురస్కృతః = రాజపుత్రులచే ముందు ఉంచుకొనబడిన వాడవై, నావమ్ = నావను, ఆరోహతు = ఎక్కెదవుగాక. అరిష్టమ్ = శుభము కలుగునట్లుగా, పన్థానమ్ = మార్గమును, గచ్ఛ = పొందుము. కాలవిపర్యయః = కాలమునందు మార్పు, మా భూత్ = కాకపోవుగాక.
తా. రామలక్ష్మణులను వెంటబెట్టుకొని నీవు నావను అధిరోహింపుము. శుభముగా, కాలవిలంబము జరుగకుండగా, ప్రయాణము చేయుము.
మూ. విశ్వామిత్రస్తథేత్యుక్త్వా తానృషీనభిపూజ్య చ,
తతార సహితస్తాభ్యాం సరితం సాగరంగమామ్. 4
ప్ర. అ. విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, తథేతి = ‘‘అటులనే’’ అని, ఉక్త్వా = పలికి, తాన్ = ఆ, ఋషీన్ = ఋషులను, అభిపూజ్య చ = పూజించి, తాభ్యామ్ = రామలక్ష్మణులతో, సహితః = కూడిన వాడై, సాగరంగమామ్ = సముద్రములోనికి ప్రవహించు, సరితమ్ = నదిని, తతార = దాటెను.
తా. విశ్వామిత్రుడు ‘అలాగే’ అని చెప్పి, ఆ ఋషీశ్వరులను పూజించి, రామలక్ష్మణులతో గంగానదిని దాటెను.
మూ. తతః శుశ్రావ వై శబ్దమతిసంరమ్భవర్ధితమ్,
మధ్యమాగమ్య తోయస్య సహ రామః కనీయసా. 5
ప్ర. అ. తతః = పిమ్మట, రామః = రాముడు, తోయస్య = జలముయొక్క, మధ్యమ్ = మధ్యమును, ఆగమ్య = పొంది, అతిసంరమ్భవర్ధితమ్ = మిక్కిలి వేగముచే వృద్ధి పొందింపబడిన, శబ్దమ్ = శబ్దమును, కనీయసా సహ = తమ్మునితో కూడ, శుశ్రావ = వినెను.
తా. నదీమధ్యమున చేరిన పిమ్మట రామలక్ష్మణులు, మిక్కిలి వేగముచే వృద్ధిపొందింపబడిన ఒక శబ్దమును వినిరి.
మూ. అథ రామః సరిన్మధ్యే పప్రచ్ఛ మునిపుఙ్గవమ్,
వారిణో భిద్యమానస్య కిమయం తుములో ధ్వనిః. 6
ప్ర. అ. అథ = పిమ్మట, రామః = రాముడు, సరిన్మధ్యే = నదీమధ్యమునందు, మునిపుఙ్గవమ్ = మునిశ్రేష్ఠుని, పప్రచ్ఛ = ప్రశ్నించెను. భిద్యమానస్య = భేదింపబడుచున్న, వారిణః = ఉదకముయొక్క, అయమ్ = ఈ, తుములః = వ్యాకుల మైన, ధ్వనిః = ధ్వని, కిమ్ = ఏమి?
తా. నదీమధ్యమున రాముడు ‘‘నీరు బ్రద్ద లగుచున్నట్లు గంభీర మైన ధ్వని వచ్చుచున్నది, ఇది ఏమి?’’ అని విశ్వామిత్రుని ప్రశ్నించెను.
మూ. రాఘవస్య వచః శ్రుత్వా కౌతూహలసమన్వితః (తమ్),
కథయామాస ధర్మాత్మా తస్య శబ్దస్య నిశ్చయమ్. 7
ప్ర. అ. కౌతూహలసమన్వితమ్ = వేడుకతో కూడిన, రాఘవస్య = రాముని యొక్క, వచః = వాక్యమును, శ్రుత్వా = విని, ధర్మాత్మా = ఆ ధర్మాత్ముడు, తస్య శబ్దస్య = ఆ శబ్దమునకు సంబంధించిన, నిశ్చయమ్ = తత్త్వమును, కథయామాస = చెప్పెను.
తా. వేడుకతో కూడిన రామవాక్యమును విని విశ్వామిత్రుడు ఆ శబ్దము యొక్క తత్త్వమును విశదీకరించెను.
మూ. కైలాసపర్వతే రామ మనసా నిర్మితం సరః,
బ్రహ్మణా నరశార్దూల తేనేదం మానసం సరః. 8
ప్ర. అ. నరశార్దూల = నరశ్రేష్ఠుడా! రామ = రాముడా! కైలాసపర్వతే = కైలాస పర్వతమునందు, బ్రహ్మణా = బ్రహ్మదేవునిచేత, సరః = సరస్సు, మనసా = మనస్సుచే, నిర్మితమ్ = నిర్మింపబడినది. తేన = ఆకారణముచేత, ఇదం సరః = ఈ సరస్సు, మానసమ్ = మానస మని చెప్పబడుచున్నది.
తా. రామా! బ్రహ్మదేవుడు కైలాసపర్వతము పై, తన మనః సంకల్ప మాత్రముచే ఒక సరస్సును నిర్మించెను. మనస్సుచే నిర్మింపబడుటచే దానికి మానస మని పేరు.
మూ. తస్మాత్సస్రావ సరసః సాయోధ్యాముపగూహతే,
సరఃప్రవృత్తా సరయూః పుణ్యా బ్రహ్మసరశ్చ్యుతా. 9
ప్ర. అ. (యా = ఏ నది), తస్మాత్ = ఆ, సరసః = సరస్సునుండి, సస్రావ = ప్రవహించినదో, సా = ఆ నది, అయోధ్యామ్ = అయోధ్యాపట్టణమును, ఉపగూహతే = చుట్టుకొనియున్నది. సరఃప్రవృత్తా = సరస్సునుండి ప్రవహించినదగుటచే, సరయూః = సరయూనది అని చెప్పబడుచున్నది. బ్రహ్మసరశ్చ్యుతా = బ్రహ్మయొక్క సరస్సునుండి ప్రవహించుటచేత, పుణ్యా = పుణ్య మైన ఆ నది (ఉత్తరశ్లోకముతో అన్వయము).
తా. ఆ సరస్సునుండి పుట్టుటచే ‘‘సరయు’’ అను పేరు గల నది అయోధ్యను చుట్టి ఉన్నది. బ్రహ్మ సృజించిన మానససరస్సునుండి జనించిన దగుటచే చాల పవిత్ర మైన ఆ నది.
మూ. తస్యాయమతులః శబ్దో జాహ్నవీమభివర్తతే,
వారిసంక్షోభజో రామ ప్రణామం నియతః కురు. 10
ప్ర. అ. జాహ్నవీమ్ = గంగను, అభివర్తతే = ప్రవేశించుచున్నది. అయమ్ = ఈ, అతులః = గొప్ప, శబ్దః = శబ్దము, తస్యాః = ఆ నదియొక్క, వారిసంక్షోభజః = జలముయొక్క సంక్షోభమువలన కలిగినది. రామ = రామా!, నియతః = భక్తికలవాడవై, ప్రణామమ్ = నమస్కారమును, కురు = చేయుము.
తా. గంగలో ప్రవేశించుచున్నది. ఈ గంభీరధ్వని జలసంక్షోభమువలన కలిగినది. రామా! శ్రద్ధాభక్తియుక్తు డవై ఈ నదీద్వయసంగమమునకు నమస్కారము చేయుము.
మూ. తాభ్యాం తు తావుభౌ కృత్వా ప్రణామమతిధార్మికౌ,
తీరం దక్షిణమాసాద్య జగ్మతుర్లఘువిక్రమౌ. 11
ప్ర. అ. అతిధార్మికౌ = మిక్కిలిధార్మికులైన, తౌ ఉభౌ = వారిరువురును, తాభ్యామ్ = ఆ నదులకు, ప్రణామమ్ = నమస్కారమును, కృత్వా = చేసి, దక్షిణం తీరమ్ = దక్షిణ తీరమును, ఆసాద్య = పొంది, లఘువిక్రమౌ = శీఘ్రముగ నడుచుచున్న వారై, జగ్మతుః = వెళ్లిరి.
తా. అతిధార్మికు లైన ఆ రామలక్ష్మణులు ఆ రెండు నదులకును నమస్కారము చేసిరి. గంగానది దక్షిణతీరమును చేరి శీఘ్రగమనముతో ప్రయాణము చేసిరి.
మూ. స వనం ఘోరసంకాశం దృష్ట్వా నృపవరాత్మజః,
అవిప్రహతమైక్ష్వాకః పప్రచ్ఛ మునిపుఙ్గవమ్. 12
ప్ర. అ. ఐక్ష్వాకః = ఇక్ష్వాకువంశమునందు పుట్టిన, నృపవరాత్మజః = రాజశ్రేష్ఠుని కుమారుడైన, సః = అతడు, ఘోరసంకాశమ్ = భయంకర మైనదియు, అవిప్రహతమ్ = త్రొక్కబడనిదియు అగు, వనమ్ = అరణ్యమును, దృష్ట్వా = చూచి, మునిపుఙ్గవమ్ = మునిశ్రేష్ఠుని, పప్రచ్ఛ = అడిగెను.
తా. రాము డచట మానవ సంచారము లేని, భయంకర మైన ఒక అరణ్యమును చూచి విశ్వామిత్రుని ప్రశ్నించెను.
మూ. అహో వనమిదం దుర్గం ఝిల్లికాగణనాదితమ్,
భైరవైః శ్వాపదైః శకునైర్దారుణారుతైః. 13
ప్ర. అ. ఝిల్లికాగణనాదితమ్ = ఈల పురుగుల సముదాయముచేత ధ్వనింపచేయ బడినదియు, భైరవైః = భయంకరములైన, శ్వాపదైః = ఘాతుకమృగములతోను, దారుణారుతైః = భయంకర మైన కూతలు గల, శకునైః = భాసపక్షులతోను, పూర్ణమ్ = నిండి యున్న, ఇదమ్ = ఈ, వనమ్ = వనము, దుర్గమ్ = ప్రవేశింపశక్యము కాక ఉన్నది. అహా = ఏమి ఆశ్చర్యము.
తా. ఓహో ! ఈ వనము ప్రవేశింప శక్యము కాక ఉన్నది. ఈల పురుగుల రొదచే ధ్వనింపచేయబడినది. భయంకరము లైన ఘాతుకమృగములతోను, భయమును కలిగించు నట్లు కూయుచున్న భాసపక్షులతోను నిండి యున్నది.
మూ. నానాప్రకారైః శకునైర్వాశ్యద్భిర్భైరవస్వనైః,
సింహవ్యాఘ్రవరాహైశ్చ వారణైశ్చోపశోభితమ్. 14
ప్ర. అ. వాశ్యద్భిః = కూయుచున్న, భైరవస్వనైః = భయంకరమైనధ్వనులుగల, నానాప్రకారైః = అనేకవిధము లైన, శకునైః = పక్షులచేతను, సింహవ్యాఘ్రవరాహైః చ = సింహ-వ్యాఘ్ర-వరాహములచేతను, వారణైః చ = గజములచేతను, ఉపశోభితమ్ = ప్రకాశింపచేయబడినది.
తా. ఈ వనమున అతిభయంకర మైన స్వరములతో కూయుచున్న అనేకవిధము లైన పక్షులు, సింహములు, పెద్దపులులు, అడవిపందులు, ఏనుగులు సంచరించు చున్నవి.
మూ. ధవాశ్వకర్ణకకుభైర్బిల్వతిన్దుకపాటలైః,
సంకీర్ణం బదరీభిశ్చ కిం న్వేతద్దారుణం వనమ్. 15
ప్ర. అ. ధవాశ్వకర్ణకకుభైః = చండ్ర ఇనుమద్ది ఏరుమద్ది చెట్లచేతను, బిల్వతిన్దుక పాటలైః = మారేడు తుమ్మికి కలిగొట్టు చెట్లచేతను, బదరీభిశ్చ = రేగు చెట్లచేతను, సంకీర్ణమ్ = వ్యాకులమై యున్నది ఏతత్ = ఈ, దారుణమ్ = భయంకరమైన వనమ్ = వనము, కిం ను = ఏది ?
తా. ఈ వనము చండ్ర, ఇనుమద్ది, ఏరుమద్ది, మారేడు, తుమ్మికి, కలిగొట్టు, రేగుచెట్లతో దట్టముగ నున్నది. ఈ భయంకర మైన వనము ఏమి?
మూ. తమువాచ మహాతేజా విశ్వామిత్రో మహామునిః,
శ్రూయతాం వత్స కాకుత్థ్స యస్యైతద్దారుణం వనమ్. 16
ప్ర. అ. మహాతేజాః = మహాతేజస్సు గల, మహామునిః = మహాముని యైన, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, తమ్ = అతనిని గూర్చి, ఉవాచ = పలికెను. వత్స = వత్సా, కాకుత్థ్స = రామా!, ఏతత్ = ఈ, దారుణమ్ = భయంకర మైన, వనమ్ = వనము, యస్య = ఎవనిదో, శ్రూయతామ్ = వినబడుగాక.
తా. మహాతేజశ్శాలి యైన విశ్వామిత్రమహాముని రామునితో - ‘‘వత్స్ఙా రామా! భయంకర మైన ఈ వనము ఎవ్వరిదో చెప్పెదను; వినుము’’ అని పలికెను.
మూ. ఏతౌ జనపదౌ స్ఫీతౌ పూర్వమాస్తాం నరోత్తమ,
మలదాశ్చ కరూశాశ్చ దేవనిర్మాణనిర్మితౌ. 17
ప్ర. అ. నరోత్తమ = ఓ నరశ్రేష్ఠుడా! పూర్వమ్ = పూర్వము, దేవనిర్మాణనిర్మితౌ = దేవతల నిర్మాణముచేత నిర్మితము లైన, మలదాః చ = మలదము, కరూశాః చ = కరూశము అనెడు, స్ఫీతౌ = విశాలము లైన, ఏతౌ = ఈ, జనపదౌ = దేశములు, ఆస్తామ్ = ఉండెడివి.
తా. రామా! పూర్వము దేవతలు నిర్మించిన మలదము, కరూశము అనెడు రెండు విశాలము లైన, సమృద్ధము లైన దేశములు ఈ ప్రాంతమునందు ఉండెడివి.
మూ. పురా వృత్రవధే రామ మలేన సమభిప్లుతమ్,
క్షుధా చైవ సహస్రాక్షం బ్రహ్మహత్యా సమావిశత్. 18
ప్ర. అ. రామ = ఓ రామా! పురా = పూర్వము, వృత్రవధే = వృత్రాసురుని చంపినపుడు, మలేన = అశుచిత్వముచేతను, క్షుధా చైవ = ఆకలిచేతను, సమభిప్లుతమ్ = నిండిన, సహస్రాక్షమ్ = దేవేంద్రుని, బ్రహ్మహత్యా = బ్రహ్మహత్యా పాపము, సమావిశత్ = ప్రవేశించెను.
తా. రామా! పూర్వము ఇంద్రుడు వృత్రాసురుని చంపుటచే ఆతనిని బ్రహ్మహత్యా పాపము ఆవహించెను. అపు డాతనిని అశుచిత్వము, ఆకలి పీడింపదొడగినవి.
మూ. తమిన్ద్రం స్నాపయన్ దేవా ఋషయశ్చ తపోధనాః,
కలశైః స్నాపయామాసుర్మలం చాస్య ప్రమోచయన్. 19
ప్ర. అ. తమ్ = ఆ, ఇన్ద్రమ్ = ఇంద్రుని, దేవాః = దేవతలు, స్నాపయన్ = స్నానము చేయించిరి. తపోధనాః = తపస్సే ధనముగా గల, ఋషయశ్చ = ఋషులును, కలశైః = కలశములచేత, స్నాపయామాసుః = స్నానము చేయించిరి. అస్య = ఇతనియొక్క, మలమ్ = అశుచిత్వమును, ప్రమోచయన్ = తొలగింపచేసిరి.
తా. దేవతలును, తపశ్శాలు లగు మహర్షులును ఆ ఇంద్రుని తీర్థోదకములచేతను, కలశములలో అభిమంత్రితము లైన ఉదకముచేతను, స్నానము చేయించి అతని అశుచిత్వమును తొలగించిరి.
మూ. ఇహ భూమ్యాం మలం దత్వా దత్వా కారూశమేవ చ
శరీరజం మహేన్ద్రస్య తతో హర్షం ప్రపేదిరే. 20
ప్ర. అ. మహేన్ద్రస్య = మహేంద్రునియొక్క, శరీరజమ్ = శరీరము నుండి పుట్టిన, మలమ్ = అశుచిత్వమును, ఇహ = ఈ, భూమ్యామ్ = భూమియందు, దత్వా = ఇచ్చి, కారూశమేవ చ = ఆకలిని కూడ, దత్వా = ఇచ్చి, తతః = పిమ్మట, హర్షమ్ = ఆనందమును, ప్రపేదిరే = పొందిరి.
తా. మహేంద్రుని శరీరమున కున్న అశుచిత్వమును, ఆతని ఆకలిని ఈ ప్రదేశమునకు ఇచ్చివేసి సంతోషించిరి.
మూ. నిర్మలో నిష్కరూషశ్చ శుచిరిన్ద్రో యదాభవత్,
దదౌ దేశస్య సుప్రీతో వరం ప్రభురనుత్తమమ్. 21
ప్ర. అ. ఇన్ద్రః = ఇంద్రుడు, యదా = ఎపుడు, నిర్మలః = అశుచిత్వము తొలగిపోయినవాడై, నిష్కరూషశ్చ = ఆకలి తొలగిపోయినవాడై, శుచిః = పవిత్రుడు, అభవత్ = ఆయెనో, అప్పుడు, ప్రభుః = సర్వసమర్థు డైన అతడు, సుప్రీతః = చాల సంతోషించినవాడై, దేశస్య = ఈ దేశమునకు, అనుత్తమమ్ = చాల ఉత్తమ మైన, వరమ్ = వరమును, దదౌ = ఇచ్చెను.
తా. అశుచిత్వము, ఆకలి, తొలగిపోయి శుచి యైన పిమ్మట సర్వసమర్థుడగు ఇంద్రుడు ఈ దేశము విషయమున చాల సంతసించినవాడై ఒక వరమిచ్చెను.
మూ. ఇమౌ జనపదౌ స్ఫీతౌ ఖ్యాతిం లోకే గమిష్యతః,
మలదాశ్చ కరూశాశ్చ మమాఙ్గమలధారిణౌ. 22
ప్ర. అ. మమ = నా యొక్క, అఙ్గమలధారిణౌ = శరీరమలమును ధరించిన, ఇమౌ = ఈ, జనపదౌ = దేశములు, స్ఫీతౌ = సమృద్ధము లైనవై, మలదాశ్చ = మలదమనియు, కరూశాశ్చ = కరూశ మనియు, లోకే = లోకము నందు, ఖ్యాతిమ్ = ప్రసిద్ధిని, గమిష్యతః = పొందగలవు.
తా. నా శరీరమునందలి అశుచిత్వమును ఆకలిని గైకొనిన ఈ దేశములు, సర్వసమృద్ధము లై, మలదము, కరూశము అను నామధేయములతో లోకమునందు ఖ్యాతిని పొందగలవు.
మూ. సాధు సాధ్వితి తం దేవాః పాకశాసనమబ్రువన్,
దేశస్య పూజాం తాం దృష్ట్వా కృతాం శక్రేణ ధీమతా. 23
ప్ర. అ. ధీమతా = బుద్ధిమంతుడైన, శక్రేణ = దేవేంద్రునిచేత, కృతామ్ = చేయబడిన, తామ్ = ఆ, దేశస్య = దేశముయొక్క, పూజామ్ = పూజను, దృష్ట్వా = చూచి, దేవాః = దేవతలు, సాధు సాధు ఇతి = బాగున్నది బాగున్నది అని, తం పాకశాసనమ్ = ఆ ఇంద్రుని గూర్చి, అబ్రువన్ = పలికిరి.
తా. ధీమంతుడగు దేవేంద్రుడు ఆ దేశమునకు చేసిన గౌరవమును చూచి దేవతలు ‘‘బాగున్నది, బాగున్నది’’ అని అనుచు దేవేంద్రుని మెచ్చుకొనిరి.
మూ. ఏతౌ జనపదౌ స్ఫీతౌ దీర్ఘకాలమరిన్దమ,
మలదాశ్చ కరూశాశ్చ ముదితౌ ధనధాన్యతః. 24
ప్ర. అ. అరిన్దమ = ఓ శత్రుసంహారకుడా! మలదాశ్చ = మలదము, కరూశాశ్చ = కరూశము అనెడు, స్ఫీతౌ = విశాలము లైన, ఏతౌ = ఈ, జనపదౌ = దేశములు, దీర్ఘకాలం = చాలకాలము, ధనధాన్యతః = ధనధాన్యములతో, ముదితౌ = ఆనందముకలవై ఉండెడివి.
తా. రామా! విశాలము లైన ఈ మలదకరూశదేశములు చాల కాలము ధనధాన్య సమృద్ధములై ఉండెడివి.
మూ. కస్య చిత్త్వథ కాలస్య యక్షీ వై కామరూపిణీ,
బలం నాగసహస్రన్య ధారయన్తీ తదా హ్యభూత్. 25
తాటకా నామ భద్రం తే భార్యా సున్దస్య ధీమతః,
మారీచో రాక్షసః పుత్రో యస్యాః శక్రపరాక్రమః. 26
ప్ర. అ. అథ = పిమ్మట, కస్య చిత్ కాలస్య = కొంత కాలమునకు, తదా = అపుడు, కామరూపిణీ = స్వేచ్ఛాధీన రూపము కలదియు, నాగసహస్రస్య = వేయి ఏనుగుల యొక్క, బలమ్ = బలమును, ధారయన్తీ = ధరించుచున్నదియు, ధీమతః = బుద్ధిమంతుడైన, సున్దస్య = సుందునియొక్క, భార్యా = భార్యయు, శక్రపరాక్రమః = దేవేంద్రులవంటి పరాక్రమము గల, మారీచః = మారీచుడనే రాక్షసుడు, యస్యాః = ఎవ్వతె యొక్క, పుత్రః = పుత్రుడో, అట్టి, తాటకా నామ = తాటక యనెడు, యక్షీ = యక్షిణి, అభూత్ = ఉండెను. తే = నీకు, భద్రమ్ = క్షేమ మగుగాక.
తా. కొంత కాలమునకు స్వేచ్ఛారూపధారిణి యగు ఒక యక్షిణి ఆవిర్భవించినది. ఆమెకు వేయి ఏనుగుల బల మున్నది. ఆమె ధీమంతు డైన సుందుని భార్య. ఇంద్రునితో సమాన మైన పరాక్రమము గల మారీచు డనే రాక్షసుడు ఆమె కుమారుడు. నీకు క్షేమ మగుగాక.
మూ. వృత్తబాహుర్మహావీర్యో విపులాస్యతనుర్మహాన్,
రాక్షసో భైరవాకారో నిత్యం త్రాసయతే ప్రజాః. 27
ప్ర. అ. వృత్తబాహుః = వర్తులాకార మైన బాహువులు కలవాడును, మహావీర్యః = గొప్ప పరాక్రమము కలవాడును, విపులాస్యతనుః = విశాల మైన ముఖము శరీరము కలవాడును, మహాన్ = పెద్ద ప్రమాణము కలవాడును, భైరవాకారః = భయంకర మైన ఆకారము కలవాడును అగు, రాక్షసః = ఆ రాక్షసుడు, నిత్యమ్ = ఎల్లప్పుడును, ప్రజాః = ప్రజలను, త్రాసయతే = భయ పెట్టుచున్నాడు.
తా. ఆ మారీచుని బాహువులు బలిసి ఉన్నవి. అతడు గొప్ప పరాక్రమము కలవాడు. విశాల మైన ముఖము శరీరము కలవాడు. గొప్ప ప్రమాణము కలవాడు. భయంకరాకారుడు. అట్టి మారీచుడు ఎల్లప్పుడును ప్రజలను బాధించుచున్నాడు.
మూ. ఇమౌ జనపదౌ నిత్యం వినాశయతి రాఘవ,
మలదాంశ్చ కరూశాంశ్చ తాటకా దుష్టచారిణీ. 28
ప్ర. అ. రాఘవ = రామా!, దుష్టచారిణీ = దుష్ట మైన ప్రవృత్తి గల, తాటకా = తాటక, మలదాంశ్చ = మలదము, కరూశాంశ్చ = కరూషము అనెడు, ఇమౌ = ఈ, జనపదౌ = దేశములను, నిత్యమ్ = ఎల్లప్పుడును, వినాశయతి = నశింపచేయుచున్నది.
తా. రామా! దుర్మార్గురా లగు తాటక, నిత్యము, ఈ మలదకరూశదేశములను నశింపచేయుచున్నది.
మూ. సేయం పన్థానమావృత్య వసత్యధ్యర్ధయోజనే,
అత ఏవ న గన్తవ్యం తాటకాయా వనం యతః. 29
ప్ర. అ. సా = అట్టి, ఇయమ్ = ఈ తాటక, పన్థానమ్ = మార్గమును, ఆవృత్య = అడ్డగించి, అధ్యర్ధయోజనే = ఒకటిన్నర ఆమడల దూరమున, వసతి = నివసించుచున్నది. యతః = ఏ కారణమువలన, తాయకాయాః = తాటకయొక్క, వనమ్ = వనమో, అత ఏవ = ఆ కారణమువలననే, న గన్తవ్యమ్ = వెళ్ల దగినది కాదు.
తా. అట్టి ఈ తాటక మార్గమును అడ్డగించి, ఒకటిన్నర ఆమడల దూరములో నివసించుచున్నది. ఇది తాటకవనము కాన ఈ వనములోనికి ఎవ్వరును పోజాలరు.
మూ. స్వబాహుబలమాశ్రిత్య జహీమాం దుష్టచారిణీమ్,
మన్నియోగాదిమం దేశం కురు నిష్కణ్టకం పునః. 30
ప్ర. అ. స్వబాహుబలమ్ = నీ బాహుబలమును, ఆశ్రిత్య = ఆశ్రయించి, దుష్టచారిణీమ్ = దుర్మార్గురా లైన, ఇమామ్ = ఈమెను, జహి = చంపుము, మన్నియోగాత్ = నా యాజ్ఞవలన, ఇమమ్ = ఈ, దేశమ్ = దేశమును, పునః = మరల, నిష్కణ్టకమ్ = బాధలు లేనిదానినిగా, కురు = చేయుము.
తా. నీ బాహుబలముచేత, ఈ దుర్మార్గురాలిని వధింపుము. నా ఆజ్ఞను పాలించి ఈ దేశమును, మరల ఏ బాధలు లేనిదానివిగ చేయుము.
మూ. న వా కశ్చిదిమం దేశం శక్నోత్యాగన్తుమీదృశమ్,
యక్షిణ్యా ఘోరయా రామ ఉత్సాదితమసహ్యయా. 31
ప్ర. అ. రామ = ఓ రామా! ఘోరయా = భయంకరురాలైన, అసహ్యయా = ఎదిరింప శక్యము కాని, యక్షిణ్యా = తాటకచేత, ఉత్సాదితమ్ = నశింపచేయబడిన, ఈదృశమ్ = ఇట్టి, ఇమమ్ = ఈ, దేశమ్ = దేశమునుగూర్చి, ఆగన్తుమ్ = వచ్చుటకు, కశ్చిత్ = ఎవ్వడును, న శక్నోతి = సమర్థుడు కాడు.
తా. రామా! ఎవ్వరును ఎదిరింపలేని క్రూరురా లైన తాటకచే ఈ వన మంతయు పాడు పడినట్లు చేయబడినది. ఎవ్వడును ఈ ప్రదేశమునకు రాజాలడు.
మూ. ఏతత్తే సర్వమాఖ్యాతం యథైతద్ధారుణం వనమ్,
యక్ష్యా చోత్సాదితం సర్వమద్యాపి న నివర్తతే. 32
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే చతుర్వింశఃస్సర్గః
ప్ర. అ. ఏతత్ = ఈ, వనమ్ = వనము, సర్వమ్ = అంతయు, దారుణమ్ = భయంకరముగా, యక్ష్యా = తాటకచేత, యథా = ఏ విధముగా, ఉత్సాదితమ్ = పాడుపడి పోవునట్లు చేయబడినదో, అద్యాపి = ఇప్పటికిని, యథా = ఏ విధముగా, న నివర్తతే = మరలిపోకున్నదో, ఏతత్ సర్వమ్ = ఇది అంతయు, తే = నీకు, ఆఖ్యాతమ్ = చెప్పబడినది.
తా. తాటక ఈ వనమును ఏ విధముగ పాడుబరచి భయంకరమగునట్లు చేసినదో, ఈ వనము నింకను ఎట్లు విడువకున్నదో అంతయు నీకు చెప్పినాను.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో ఇరువది నాల్గవ సర్గ సమాప్తము.

16
17
18
19
20
21
22
23
24