| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 31 |
| Pages | 5 |
| Read Time | 8 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ పఞ్చవింశః సర్గః
శ్రీరాముడు ప్రశ్నింపగా విశ్వామిత్రుడు తాటకాజననము, ఆమె వివాహము, శాపము మొదలగు విషయములు చెప్పి, ఆమెను సంహరింపు మని రాముని ప్రేరేపించుట.
మూ. అథ తస్యాప్రమేయస్య మునేర్వచనముత్తమమ్,
శ్రుత్వా పురుషశార్దూలః ప్రత్యువాచ శుభాం గిరమ్. 1
ప్ర. అ. అప్రమేయస్య = ఊహింప శక్యము కాని ప్రభావము గల, తస్య మునేః = ఆ మునియొక్క, ఉత్తమమ్ = ఉత్తమ మైన, వచనమ్ = వాక్యమును, శ్రుత్వా = విని, పురుషశార్దూలః = పురుషశ్రేష్ఠు డైన రాముడు, శుభామ్ = శుభ మైన, గిరమ్ = వాక్కును, ప్రత్యువాచ = తిరిగి పలికెను.
తా. అమేయప్రభావు డగు విశ్వామిత్రుని ఉత్తమము లగు మాటలు విని పురుషశ్రేష్ఠు డైన రాముడు శుభ మైన వాక్కు పలికెను.
మూ. అల్పవీర్యా యదా యక్షాః శ్రూయన్తే మునిపుఙ్గవ,
కథం నాగసహస్రస్య ధారయత్యబలా బలమ్. 2
ప్ర. అ. మునిపుఙ్గవ = మునిశ్రేష్ఠుడా!, యక్షాః = యక్షులు, అల్పవీర్యాః = అల్పమైన పరాక్రమము కలవారుగా, యదా శ్రూయన్తే = వినబడుచుండగా, అబలా = ఆ స్త్రీ, నాగసహస్రస్య = వేయి ఏనుగులయొక్క, బలమ్ = బలమును, కథమ్ = ఎట్లు ధారయతి = ధరించుచున్నది ?
తా. ఓ మునిపుంగవా! యక్షులు అల్పపరాక్రమవంతు లని వినుచుందుము కదా - ఈ అబలకు నాగసహస్రబలము ఎట్లు వచ్చినది ?
మూ. విశ్వామిత్రోఽబ్రవీద్వాక్యం శృణు యేన బలోత్తరా,
వరదానకృతం వీర్యం ధారయత్యబలా బలమ్. 3
ప్ర. అ. విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, వాక్యమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను. అబలా = ఆ అబల, యేన = ఏ కారణముచేత, బలోత్తరా = బలముచేత గొప్పదో, శృణు = వినుము. (ఆమె) వరదానకృతమ్ = వరదానము వలన లభించిన, వీర్యమ్ = పరాక్రమమును, బలమ్ = బలమును, ధారయతి = ధరించుచున్నది.
తా. విశ్వామిత్రుడు ఇట్లు పలికెను - ఆ అబల ఏ కారణముచేత బలమునందు చాల గొప్పదో వినుము. ఆమె వరదానమువలన లభించిన వీర్యమును, బలమును ధరించుచున్నది.
మూ. పూర్వమాసీన్మహాయక్షః సుకేతుర్నామ వీర్యవాన్,
అనపత్యః శుభాచారః స చ తేపే మహత్తపః. 4
ప్ర. అ. పూర్వమ్ = పూర్వము, సుకేతుర్నామ = సుకేతు వను పేరు గల, వీర్యవాన్ = పరాక్రమవంతు డైన, మహాయక్షః = గొప్ప యక్షుడు, ఆసీత్ = ఉండెను. అనపత్యః = సంతానము లేని, సః = అతడు, శుభాచారః = శుభమైన ఆచారముకలవాడై, మహత్ = గొప్ప, తపః = తపస్సు, తేపే = చేసెను.
తా. పూర్వము సుకేతు వనే పరాక్రమవంతు డగు గొప్ప యక్షుడొకడుండెను. సంతానము లేకపోవుటచే, అతడు సదాచారవంతుడై గొప్ప తపస్సు చేసెను.
మూ. పితామహస్తు సుప్రీతస్తస్య యక్షపతేస్తదా,
కన్యారత్నం దదౌ రామ తాటకాం నామ నామతః. 5
ప్ర. అ. రామ = రామా! తదా = అపుడు, పితామహః = బ్రహ్మదేవుడు, సుప్రీతః = చాల సంతోషించినవాడై, తస్య = ఆ, యక్షపతేః = యక్షరాజునకు, నామతః = పేరుచే, తాటకాం నామ = తాటక అను ప్రసిద్ధి గల, కన్యారత్నమ్ = శ్రేష్ఠ యైన కన్యను, దదౌ = ఇచ్చెను.
తా. రామా! అపుడు బ్రహ్మదేవుడు అతని తపస్సునకు చాల సంతోషించి, ఆ యక్షాధిపతికి తాటక యను కన్యారత్నమును ప్రసాదించెను.
మూ. దదౌ నాగసహస్రస్య బలం చాస్యాః పితామహః,
న త్వేవ పుత్రం యక్షాయ దదౌ బ్రహ్మా మహాయశాః. 6
ప్ర. అ. పితామహః = బ్రహ్మదేవుడు, అస్యాః = ఈమెకు, నాగసహస్రస్య = వేయి ఏనుగులయొక్క, బలమ్ = బలమును, దదౌ = ఇచ్చెను. మహాయశాః = గొప్ప కీర్తి గల, బ్రహ్మా = ఆ బ్రహ్మదేవుడు, యక్షాయ = యక్షునకు, పుత్రం తు = పుత్రుని, న దదౌ = ఇవ్వలేదు.
తా. గొప్ప కీర్తి గల బ్రహ్మదేవుడు ఆ తాటకకు వేయి ఏనుగుల బలము ఇచ్చినాడు కాని, ఆ సుకేతునకు పుత్రుని మాత్రము ఇవ్వలేదు.
మూ. తాం తు జాతాం వివర్ధన్తీం రూపయౌవనశాలినీమ్,
జమ్భపుత్రాయ సున్దాయ దదౌ భార్యాం యశస్వినీమ్. 7
ప్ర. అ. జాతామ్ = పుట్టినదై, వివర్ధన్తీమ్ = పెరుగుచున్న, రూపయౌవనశాలినీమ్ = రూపయౌవనములతో ప్రకాశించుచున్న, యశస్వినీమ్ = కీర్తి గల, తామ్ = ఆమెను, జంభపుత్రాయ = జంభునికుమారు డైన, సున్దాయ = సుందునకు, భార్యామ్ = భార్యనుగా, దదౌ = ఇచ్చెను.
తా. సహస్రనాగబలముతో జనించిన ఆ తాటక పెరిగి, రూపయౌవనములతో ప్రకాశించుచుండెను. సుకేతువు, కీర్తిమంతురా లగు ఆమెను జంభుని పుత్రుడైన సుందున కిచ్చి వివాహము చేసెను.
మూ. కస్యత్త్వచిథ కాలస్య యక్షీ పుత్రమజాయత,
మారీచం నామ దుర్ధర్షం యశ్శాపాద్రాక్షసోఽభవత్. 8
ప్ర. అ. అథ = పిమ్మట, కస్యచిత్ కాలస్య = కొంత కాలమునకు, యక్షీ = తాటక, మారీచం నామ = మారీచు డను పేరు గల, దుర్ధర్షమ్ = ఎదిరింప శక్యము కాని, పుత్రమ్ = కుమారుని, అజాయత = కనెను. యః = ఎవడు, శాపాత్ = శాపమువలన రాక్షసః = రాక్షసుడుగా, అభవత్ = ఆయెనో.
తా. కొంతకాలమునకు ఆ తాటక మారీచు డనే మహాబలవంతు డగు కుమారుని కనెను. అతడు శాపవశముచేత రాక్షసు డయ్యెను.
మూ. సున్దే తు నిహతే రామ సాగస్త్యమృషిసత్తమమ్,
తాటకా సహ పుత్రేణ ప్రధర్షయితుమిచ్ఛతి. 9
ప్ర. అ. రామ = రామా! సున్దే = సుందుడు, నిహతే = చంపబడినవాడగుచుండగా, సా తాటకా = ఆ తాటక, పుత్రేణ సహ = పుత్రునితో కూడి, ఋషిసత్తమమ్ = ఋషిశ్రేష్ఠు డైన, అగస్త్యమ్ = అగస్త్యుని, ప్రధర్షయితుమ్ = ఎదిరించుటకు, ఇచ్ఛతి = కోరెను.
తా. అగస్త్యుడు సుందుని శపించి చంపగా, తాటకయు మారీచుడును ఆ ఋషిశ్రేష్ఠుని ఎదిరించుటకై ప్రయత్నించిరి.
మూ. భక్షార్థం జాతసంరంభా గర్జన్తీ సాభ్యధావత,
ఆపతన్తీం తు తాం దృష్ట్వా అగస్త్యో భగవాన్ ఋషిః, 10
రాక్షసత్వం భజ స్వేతి మారీచం వ్యాజహార సః.
ప్ర. అ. సా = ఆమె, గర్జన్తీ = గర్జించుచున్నదై, జాతసంరంభా = పుట్టిన తొందరకలదై, భక్షార్థమ్ = భక్షించుటకై, అభ్యధావత = అగస్త్యునిమీదికి వెళ్లెను. భగవాన్ = పూజ్యుడైన, సః అగస్త్యః ఋషిః = ఆ అగస్త్య మహర్షి, ఆపతన్తీమ్ = మీదికి వచ్చుచున్న, తామ్ = ఆమెను, దృష్ట్వా = చూచి, రాక్షసత్వమ్ = రాక్షసత్వమును, భజస్వ = పొందుము, ఇతి = అని, మారీచమ్ = మారీచుని, వ్యాజహార = పలికెను.
తా. ఆమె గర్జించుచు, భక్షించుటకై తొందరగ అగస్త్యుని మీదికి వెళ్లెను. భగవంతు డైన అగస్త్యమహర్షి మీదికి వచ్చుచున్న ఆమెను చూచి, ‘‘రాక్షసుడ వగుదువు గాక’’ అని మారీచుని శపించెను.
మూ. అగస్త్యః పరమక్రుద్ధ స్తాటకామపి శప్తవాన్, 11
పురుషాదీ మహాయక్షీ విరూపా వికృతాననా,
ఇదం రూపం విహాయాథ దారుణం రూపమస్తు తే. 12
ప్ర. అ. పరమక్రుద్ధః = మిక్కిలి కోపించిన, అగస్త్యః = అగస్త్యుడు, తాటకామపి = తాటకను కూడ, శప్తవాన్ = శపించెను. ఇదమ్ = ఈ, రూపమ్ = రూపమును, విహాయ = విడిచి, అథ = పిమ్మట, విరూపా = వికృతరూపముకల దానవై, వికృతాననా = వికృత మైన ముఖము కలదానవై, పురుషాదీ = మనుష్యులను భక్షించు, మహాయక్షీ = మహాయక్షిణివిగ అగుదువు గాక. తే, = నీకు, దారుణమ్ = భయంకరమైన, రూపమ్ = రూపము, అస్తు = అగుగాక.
తా. అగుస్త్యుడు చాల కోపించి - ‘‘నీవు ఈ రూపమును విడచి, వికృత మైన రూపము, భయంకర మైన ముఖము కలదానవై, మనుష్యులను భక్షించు మహాయక్షిణివి అగుదువు గాక. నీకు అతిభయంకర మగు ఆకారము కలుగుగాక’’ అని తాటకను కూడ శపించెను.
మూ. సైషా శాపకృతామర్షా తాటకా క్రోధమూర్ఛితా,
దేశముత్సాదయత్యేనమగస్త్యచరితం శుభమ్. 13
ప్ర. అ. శాపకృతామర్షా = శాపముచేత చేయబడినకోపముగల, సా = అట్టి, ఏషా = ఈ, తాటకా = తాటక, క్రోధమూర్ఛితా = క్రోధముచేత వ్యాపింపబడినదై, అగస్త్యచరితమ్ = అగస్త్యునిచేత సంచరింపబడిన, శుభమ్ = శుభ మైన, ఏనం దేశమ్ = ఈ దేశమును, ఉత్సాదయతి = నశింపచేయుచున్నది.
తా. ఈ శాపముచే తాటకకు కోపము కలిగినది. అత్యధిక మైన కోపముతో ఈమె పూర్వము అగస్త్యుడు సంచరించిన ఈ దేశమును నశింపచేయుచున్నది.
మూ. ఏనాం రాఘవ దుర్వృత్తాం యక్షీం పరమదారుణామ్,
గోబ్రాహ్మణహితార్థాయ జహి దుష్టపరాక్రమమ్. 14
ప్ర. అ. రామ = రామా! దుర్వృత్తామ్ = దుర్మార్గురా లైన, పరమదారుణామ్ = మిక్కిలి క్రూరురాలైన, దుష్టపరాక్రమామ్ = చెడ్డ పరాక్రమము గల, ఏనామ్ = ఈ, యక్షీమ్ = యక్షిణిని, గోబ్రాహ్మణహితార్థాయ = గోవులయొక్క బ్రాహ్మణులయొక్క హితముకొరకు, జహి = చంపుము.
తా. రామా! దుర్మార్గురాలు, క్రూరురాలు, దుష్టపరాక్రమవంతురాలు అగు ఈ యక్షిణిని గోబ్రాహ్మణుల హితముకొరకై సంహరించుము.
మూ. న హ్యేనాం శాపసంస్పృష్టాం కశ్చిదుత్సహతే పుమాన్,
నిహన్తుం త్రిషు లోకేషు త్వామృతే రఘునన్దన. 15
ప్ర. అ. రఘునన్దన = రామా! శాపసంస్పృష్టామ్ = శాపముచే స్పశింపబడిన, ఏనామ్ = ఈమెను, నిహన్తుమ్ = చంపుటకు, త్వామ్ ఋతే = నీవు తప్ప, కశ్చిత్ పుమాన్ = ఏ పురుషుడును, త్రిషు లోకేషు = మూడు లోకములందు, న ఉత్సహతే హి = సమర్థుడు కాడు కదా.
తా. రామా! నీవు తప్ప, మూడు లోకములలో మరెవ్వడును శపింపబడిన ఈమెను చంపుటకు సమర్థుడు కాడు.
మూ. న హి తే స్త్రీవధకృతే ఘృణా కార్యా నరోత్తమ,
చాతుర్వర్ణ్యహితార్థాయ కర్తవ్యం రాజసూనునా. 16
ప్ర. అ. నరోత్తమ = నరశ్రేష్ఠుడా!, స్త్రీవధకృతే = స్త్రీవధను గూర్చి, తే = నీకు, ఘృణా = జాలి, న కార్యా = చేయతగినది కాదు. రాజసూనునా = రాజకుమారునిచేత, చాతుర్వర్ణ్య హితార్థాయ = నాలుగు వర్ణముల హితము కొరకై, కర్తవ్యమ్ = కార్యము చేయదగినది.
తా. ఓ నరశ్రేష్ఠుడా! స్త్రీని వధించుటయా అని సంకోచింపకుము. రాజకుమారుడు చాతుర్వర్ణ్యమువారి హితముకొరకై ఏ పని యైనను చేయవలయును.
మూ. నృశంసమనృశంసం వా ప్రజారక్షణకారణాత్,
పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సతా 17
ప్ర. అ. రక్షతా = రక్షించు, సతా = సత్పురుషు డైన రాజుచేత, ప్రజారక్షణకారణాత్ = ప్రజారక్షణము కొరకై, నృశంసం వా క్రూరమైనను, అనృశంసం వా = క్రూరము కాకపోయినను, పాతకం వా = పాపమైనను, సదోషం వా = దోషములతో కూడిన దైనను కార్యము, కర్తవ్యమ్ = చేయదగినదే.
తా. ధర్మాత్ము డైన రాజు, ప్రజారక్షణకొరకై ఉపయోగించు కార్యము క్రూర మైనను కాకపోయినను, పాపమైనను దోషములతో కూడిన దైనను చేయదగినదే.
మూ. రాజ్యభారనియుక్తానామేష ధర్మస్సనాతనః,
అధర్మ్యాం జహి కాకుత్స్థ ధర్మో హ్యస్యా న విద్యతే. 18
ప్ర. అ. రాజ్యభారనియుక్తానామ్ = రాజ్యభారమునందు నియుక్తులైనవారికి, ఏషః = ఇది, సనాతనః = అతిప్రాచీన మైన, ధర్మః = ధర్మము. కాకుత్స్థ = రామా! అధర్మ్యామ్ = అధర్మము గల తాటకను, జహి = చంపుము. అస్యాః = ఈమెకు, ధర్మః = ధర్మము, న విద్యతే హి = లేదు కదా.
తా. ఇది రాజ్యపాలనభారమును వహించువారు పాటించవలసిన అతి ప్రాచీన మైన ధర్మము. రామా! ధర్మవిరుద్ధాచరణము గల ఈమెను సంహరించుము. ఈమెయందు ధర్మ మనునదియే లేదు కదా.
మూ. శ్రూయతే హి పురా శక్రో విరోచనసుతాం నృప,
పృథివీం హన్తుమిచ్ఛన్తీం మంధరామభ్యసూదయత్. 19
ప్ర. అ. నృప = రామా! పురా = పూర్వము, పృథివీమ్ = భూమిని, హన్తుమ్ = చంపుటకు, ఇచ్ఛన్తీమ్ = కోరుచున్న, విరోచనసుతామ్ = విరోచనుని కుమార్తె యైన, మంధరామ్ = మంధరను, శక్రః = దేవేంద్రుడు, అభ్యసూదయత్ = సంహరించెను అని, శ్రూయతే హి = వినబడుచున్నదికదా ?
తా. పూర్వము విరోచనుని కుమార్తె యగు మంధర భూమిని చంపగోరినప్పుడు దేవేంద్రుడు ఆమెను చంపె నని వినుచున్నాము కదా ?
మూ. విష్ణునాపి పురా రామ భృగుపత్నీ దృఢవ్రతా,
అనిన్ద్రం లోకమిచ్ఛన్తీ కావ్యమాతా నిషూదితా. 20
ప్ర. అ. రామ = రామా! పురా = పూర్వము, లోకమ్ = లోకమును, అనిన్ద్రమ్ = ఇంద్రుడు లేనిదానినిగా, ఇచ్ఛన్తీ = కోరుచున్న, దృఢవ్రతా = దృఢమైన నియమమును అవలంబించిన, కావ్యమాతా = శుక్రుని తల్లి యైన, భృగుపత్నీ అపి = భృగుమహర్షియొక్క భార్య కూడ, విష్ణునా = విష్ణువుచేత, నిషూదితా = సంహరింపబడినది.
తా. పూర్వము విష్ణువు కూడ, లోకములో ఇంద్రుడు ఉండకూడ దను కోరికతో తీవ్రతము నాచరించుచున్న, శుక్రాచార్యజనని యైన భృగుమహర్షి భార్యను చంపెను.
మూ. ఏతైశ్చాన్యైశ్చ బహుభీ రాజపుత్ర మహాత్మభిః,
అధర్మసహితా నార్యో హతాః పురుషసత్తమైః. 21
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే పంచవింశః సర్గః
ప్ర. అ. రాజపుత్ర = ఓ రాజకుమారా! మహాత్మభిః = మహాత్ము లైన, ఏతైశ్చ = వీరిచేతను, అన్యైః = ఇతరు లైన, పురుషసత్తమైశ్చ = పురుషశ్రేష్ఠులచేతను, బహుభిః = అనేకులచేత, అధర్మసహితాః = అధర్మవతు లగు, నార్యః = స్త్రీలు, హతాః = చంపబడినారు.
తా. ఓ రాజపుత్రా! మహాత్ములైన వీరును, ఇంకను ఎందరో పురుషశ్రేష్ఠులును ధర్మవిరుద్ధముగ ప్రవర్తించు స్త్రీలను చంపినారు.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో ఇరువది ఐదవ సర్గ సమాప్తము.
