Chapter_26

Back
Book Balakandamu
Chapter No 32
Pages 9
Read Time 14 Minutes

Chapter_26

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ షడ్వింశః సర్గః

శ్రీరాముడు తాటకను సంహరించుట.

మూ. మునేర్వచనమక్లీబం శ్రుత్వా నరవరాత్మజః,

రాఘవః ప్రాఞ్జలిర్భూత్వా ప్రత్యువాచ దృఢవ్రతః. 1

ప్ర. అ. దృఢవ్రతః = దృఢమైన నియమములు గల, నరవరాత్మజః = రాజశ్రేష్ఠుని కుమారుడైన, రాఘవః = రాముడు, అక్లీబమ్ = దృఢనిశ్చయపూర్వకమైన, మునేః = మునియొక్క, వచనమ్ = వాక్యమును, శ్రుత్వా = విని, ప్రాఞ్జలిః = కట్టబడిన దోసిలి కలవాడు, భూత్వా = అయి, ప్రత్యువాచ = తిరిగి పలికెను.

తా. నిశ్చయపూర్వకముగ పలికిన విశ్వామిత్రుని మాటలు విని, దృఢ మైన నియమము కలవాడును, రాజశ్రేష్ఠుని కుమారుడును అగు రాముడు, అంజలి ఘటించి పలికెను.

మూ. పితుర్వచననిర్దేశాత్పితుర్వచనగౌరవాత్,

వచనం కౌశికస్యేతి కర్తవ్యమవిశఙ్కయా. 2

ప్ర. అ. పితుః = తండ్రిగారియొక్క, వచననిర్దేశాత్ = ఆజ్ఞావచనమువలనను, పితుః = తండ్రిగారియొక్క, వచనగౌరవాత్ = మాటయందు గౌరవమువలనను, కౌశికస్య = విశ్వామిత్రునియొక్క, వచనమ్ ఇతి = వాక్య మనెడు కారణమువలనను, అవిశఙ్కయా = సందేహము లేకుండగ, కర్తవ్యమ్ = చేయదగినదే.

తా. మా తండ్రిగారి ఆజ్ఞవలనను, ఆయన వాక్యమునందు నా కున్న గౌరవము వలనను, నీ వాక్య మగుటవలనను ఈ కార్యము నిస్సందేహముగ చేయదగినది.

మూ. అనుశిష్టోఽస్మ్యయోధ్యాయాం గురుమధ్యే మహాత్మనా,

పిత్రా దశరథేనాహం నామజ్ఞేయం హి తద్వచః. 3

ప్ర. అ. అయోధ్యాయామ్ = అయోధ్యలో, గురుమధ్యే = పెద్దల మధ్యయందు, మహాత్మనా = మహాత్ము డైన, పిత్రా = తండ్రి యైన, దశరథేన = దశరథునిచేత, అహమ్ = నేను, అనుశిష్టః అస్మి = ఆజ్ఞాపింపబడితిని, తద్వచః = ఆయనవాక్యము, నావజ్ఞేయం హి = ఉల్లంఘింపదగినది కాదు కదా?

తా. అయోధ్యానగరములో, వసిష్ఠాదిగురుజనుల మధ్య, మహాత్ముడైన మా తండ్రి దశరథమహారాజు ‘‘విశ్వామిత్రుడు చెప్పినట్లు చేయుము’’ అని ఆజ్ఞాపించినాడు. ఆయన మాటను ఉల్లఘింపరాదు కదా?

మూ. సోఽహం పితుర్వచః శ్రుత్వా శాసనాద్బ్రహ్మవాదినః,

కరిష్యామి న సన్దేహస్తాటకావధముత్తమమ్. 4

ప్ర. అ. సః అహమ్ = అట్టి నేను, పితుః = తండ్రియొక్క, వచః = వాక్యమును, శ్రుత్వా = విని, బ్రహ్మవాదినః = వేదాధ్యయనసంపన్నుడ వైన నీయొక్క, శాసనాత్ = ఆజ్ఞవలన, ఉత్తమమ్ = ఉత్తమ మైన, తాటకావధమ్ = తాటకయొక్క వధను, కరిష్యామి = చేయగలను; సన్దేహః = సందేహము, న = లేదు.

తా. నేను తండ్రిగారి ఆజ్ఞప్రకారము, బ్రహ్మవాది వైన నీ మాట పాటించి తప్పక తాటకను సంహరించెదను.

మూ. గోబ్రాహ్మణహితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ,

తవ చైవాప్రమేయస్య వచనం కర్తుముద్యతః. 5

ప్ర. అ. గోబ్రాహ్మణహితార్థాయ = గోబ్రాహ్మణుల హితముకొరకును, అస్య = ఈ, దేశస్య = దేశముయొక్క, సుఖాయ చ = సుఖముకొరకును, అప్రమేయస్య = అమేయమైన శక్తి గల, తవ = నీయొక్క, వచనమ్ = వాక్యమును, కర్తుమ్ = చేయుటకు, ఉద్యతః = సిద్ధముగ నున్నాను.

తా. గోబ్రాహ్మణుల సుఖముకొరకును, ఈ దేశముయొక్క సుఖముకొరకును, అప్రమేయప్రభావశాలి వగు నీ ఆజ్ఞప్రకారము చేయుటకు సిద్ధముగా నున్నాను.

మూ. ఏవముక్త్వా ధనుర్మధ్యే బద్ధ్వా ముష్టిమరిన్దమః,

జ్యాశబ్దమకరోత్తీవ్రం దిశశ్శబ్దేన నాదయన్. 6

ప్ర. అ. అరిందమః = శత్రువులను నశింపచేయు రాముడు, ఏవమ్ = ఈ విధముగా, ఉక్త్వా = పలికి, ధనుర్మధ్యే = ధనుస్సుయొక్క మధ్యమునందు, ముష్టిమ్ = పిడికిలిని, బద్ధ్వా = బంధించి, శబ్దేన = శబ్దముచేత, దిశః = దిక్కులను, నాదయన్ = ధ్వనింపచేయుచు, తీవ్రమ్ = తీవ్రమైన, జ్యాశబ్దమ్ = నారియొక్క శబ్దమును, అకరోత్ = చేసెను.

తా. శత్రుసంహారకు డగు రాముడు ఈ విధముగ పలికి, పిడికిలితో ధనుర్మధ్యము నందు గట్టిగా పట్టి, దిక్కులు ప్రతిధ్వనించునట్లు తీవ్రమైన టంకార ధ్వనిని చేసెను.

మూ. తేన శబ్దేన విత్రస్తాస్తాటకావనవాసినః,

తాటకా చ సుసంక్రుద్ధా తేన శబ్దేన మోహితా. 7

ప్ర. అ. తాటకావనవాసినః = తాటకయొక్క అరణ్యములో నివసించు సర్వప్రాణులును, తేన శబ్దేన = ఆ ధ్వనిచేత, విత్రస్తాః = భయపడినవి. తాటకా చ = తాటక కూడ, తేన శబ్దేన = ఆ శబ్దముచేత, సుసంక్రుద్ధా = చాల కోపించినదై, మోహితా = మోహింప చేయబడినది.

తా. తాటకావనములో అన్ని ప్రాణులును ఆ ధ్వనికి భయపడినవి. తాటక కూడ ఆ శబ్దముచేత మిక్కిలి కోపించి దిగ్భ్రాంతి చెందెను.

మూ. తం శబ్దమభినిధ్యాయ రాక్షసీ క్రోధమూర్ఛితా,

శ్రుత్వా చాభ్యద్రవద్వేగాద్యతః శబ్దో వినిస్సృతః. 8

ప్ర. అ. రాక్షసీ = ఆ రాక్షసి, తం శబ్దమ్ = ఆ శబ్దమును, శ్రుత్వా = విని, క్రోధమూర్ఛితా = క్రోధావిష్టురాలై, అభినిధ్యాయ = ఆలోచించి, యతః = ఏ వైపునుండి, శబ్దః = శబ్దము, వినిస్సృతః = బయలుదేరినదో, ఆ వైపునకు, వేగాత్ = వేగమువలన, అభ్యద్రవత్ = పరుగెత్తెను.

తా. ఆ శబ్దము వినగనే కోపావిష్టురా లైన తాటక, క్షణకాల మాలోచించి ఆ శబ్దమువచ్చిన వైపు శీఘ్రముగ పరుగెత్తెను.

మూ. తాం దృష్ట్వా రాఘవః క్రుద్ధాం వికృతం వికృతాననామ్,

ప్రమాణేనాతివృద్ధాం చ లక్ష్మణం సోఽభ్యభాషత. 9

ప్ర. అ. సః రాఘవః = ఆ రాముడు, క్రుద్ధామ్ = కోపగించినదియు, వికృతామ్ = వికారముగా ఉన్నదియు, వికృతాననామ్ = వికృత మైన ముఖము కలదియు, ప్రమాణేన = ప్రమాణముచేత, అతివృద్ధాం చ = చాల పెద్దదియు అగు, తామ్ = ఆమెను, దృష్ట్వా = చూచి, లక్ష్మణం = లక్ష్మణునిగూర్చి, అభ్యభాషత = పలికెను.

తా. వికారముగా ఉన్న ముఖముతో, పెద్ద దేహముతో నున్న కోపించిన ఆమెను చూచి రాముడు లక్ష్మణునితో ఇట్లనెను.

మూ. పశ్య లక్ష్మణ యక్షిణ్యా భైరవం దారుణం వపుః,

భిద్యేరన్ దర్శనాదస్యా భీరూణాం హృదయాని చ. 10

ప్ర. అ. లక్ష్మణ = లక్ష్మణా! యక్షిణ్యాః = ఈ యక్షిణియొక్క, భైరవమ్ = భయంకరమైన, దారుణమ్ = క్రూరమైన, వపుః = శరీరమును, పశ్య = చూడుము. అస్యాః = ఈమెయొక్క, దర్శనాత్ = దర్శనమువలన, భీరూణామ్ = పిరికివారియొక్క, హృదయాని = హృదయములు, భిద్యేరన్ = పగిలిపోవును.

తా. లక్ష్మణా! ఈ యక్షిణి ఆకారము ఎంత భయంకరముగను, క్రూరముగను ఉన్నదో చూడుము. ఈమెను చూడగనే పిరికివాళ్ల గుండెలు పగిలిపోవును.

మూ. ఏనాం పశ్య దురాధర్షాం మాయాబలసమన్వితామ్,

వినివృత్తాం కరోమ్యద్య హృతకర్ణాగ్రనాసికామ్. 11

ప్ర. అ. దురాధర్షామ్ = ఎదిరింప శక్యము కానిదియు, మాయాబలసమన్వితామ్ = మాయాబలముతో కూడినదియు అగు, ఏనామ్ = ఈమెను, హృతకర్ణాగ్రనాసికామ్ = హరింపబడిన చెవులు నాసికాగ్రము కలిగి, వినివృత్తామ్ = మరలిపోవుదానినిగా, అద్య = ఇప్పుడు, కరోమి = చేయుదును, పశ్య = చూడుము.

తా. మాయాబలముచే ఎదిరింప శక్యము కాక ఉన్న ఈమెను, చెవులును నాసాగ్రమును ఖండించి వెనుకకు మరలిపోవు నట్లు చేసెదను చూడుము.

మూ. న హ్యేనాముత్సహే హన్తుం స్త్రీస్వభావేన రక్షితామ్,

వీర్యం చాస్యాం గతిం చాపి హనిష్యామీతి మే మతిః. 12

ప్ర. అ. స్త్రీస్వభావేన = స్త్రీఅగుటచే, రక్షితామ్ = రక్షింపబడిన, ఏనామ్ = ఈమెను, హన్తుమ్ = చంపుటకు, న ఉత్సహే = యత్నించను, అస్యామ్ = ఈమెయందలి, వీర్యమ్ = పరాక్రమమును, గతిం చాపి = గమనశక్తిని, హనిష్యామీతి = తొలగించెదను అని, మే = నాయొక్క, మతిః = అభిప్రాయము.

తా. ఆడు దగుటయే ఈమెను రక్షించుచున్నది. ఈమెను చంపుటకు యత్నింపక ఈమె పరాక్రమమును, గమనశక్తిని నశింపచేయ వలె నని అనుకొనుచున్నాను.

మూ. ఏవం బ్రువాణే రామే తు తాటకా క్రోధమూర్ఛితా,

ఉద్యమ్య బాహూ గర్జన్తీ రామమేవాభ్యధావత. 13

ప్ర. అ. రామే = రాముడు, ఏవమ్ = ఈ విధముగా, బ్రువాణే = పలుకుచుండగనే, తాటకా = తాటక, క్రోధమూర్ఛితా = కోపముచే వ్యాపింపబడినదై, బాహూ = బాహువులను, ఉద్యమ్య = ఎత్తి, రామమేవ = రాముని గూర్చియే, అభ్యధావత = పరుగెత్తెను.

తా. రాముడు ఇట్లు పలుకుచుండగనే తాటక క్రోధావిష్టురాలై, చేతులు ఎత్తి, గర్జించుచు, రామునిమీదికే పరుగెత్తెను.

మూ. విశ్వామిత్రస్తు బ్రహ్మర్షిర్హుంకారేణాభిభర్త్స్య తామ్,

స్వస్తి రాఘవయోరస్తు జయం చైవాభ్యభాషత. 14

ప్ర. అ. బ్రహ్మర్షిః = బ్రహ్మర్షియైన, విశ్వామిత్రస్తు = విశ్వామిత్రుడైతే, తామ్ = ఆమెను, హుంకారేణ = హుంకారముచేత, అభిభర్త్స్య = భయపెట్టి, రాఘవయోః = రామలక్ష్మణులకు, స్వస్తి = క్షేమము, అస్తు = అగుగాక అనియు, జయం చైవ = విజయమును, అభ్యభాషత = పలికెను.

తా. బ్రహ్మర్షియైన విశ్వామిత్రుడు హుంకారముచేత ఆమెను అదలించి, ‘‘రామలక్ష్మణులకు స్వస్తి అగుగాక’’ అని పలికి ‘‘జయము కలుగు గాక’’ అని కూడ పలికెను.

మూ. ఉద్ధూనానా రజో ఘోరం తాటకా రాఘవావుభౌ,

రజోమోహేన మహతా ముహూర్తం సా వ్యమోహయత్. 15

ప్ర. అ. సా తాటకా = ఆ తాటక, ఘోరమ్ = భయంకర మైన, రజః = పరాగమును, ఉద్ధూనానా = చిమ్ముచు, రాఘవౌ = రామలక్ష్మణులను, ఉభౌ = ఇద్దరిని, ముహూర్తమ్ = క్షణకాలము పాటు, మహతా = గొప్ప, రజోమోహేన = పరాగముచే కలిగిన మోహముచే, వ్యమోహయత్ = మోహింపచేసెను.

తా. ఆ తాటక భయంకర మైన పరాగమును చిమ్ముచు, ఆ రామలక్ష్మణులను, క్షణకాలము పాటు, ఆ పరాగములో ఏమియు తోచకుండ చేసెను.

మూ. తతో మాయాం సమాస్థాయ శిలావర్షేణ రాఘవౌ,

అవాకిరత్సుమహతా తతశ్చుక్రోధ రాఘవః 16

ప్ర. అ. తతః = పిమ్మట, మాయామ్ = మాయను, సమాస్థాయ = అవలంబించి, సుమహతా = చాల గొప్పదైన, శిలావర్షేణ = రాళ్ల వర్షముచేత, రాఘవౌ = రామలక్ష్మణులను, అవాకిరత్ = వెదజల్లెను. తతః = అటు పిమ్మట, రాఘవః = రాముడు, చుక్రోధ = కోపించెను.

తా. పిమ్మట మాయాప్రభావముచే రామలక్ష్మణులపై గొప్ప శిలావర్షమును కురిపించెను. దానితో రామునకు కోపము వచ్చెను.

మూ. శిలావర్షం మహత్తస్యాః శరవర్షేణ రాఘవః,

ప్రతిహత్యోపధావన్త్యాః కరౌ చిచ్ఛేద పత్రిభిః. 17

ప్ర. అ. రాఘవః = రాముడు, తస్యాః = ఆమెయొక్క, మహత్ = గొప్పదైన, శిలావర్షమ్ = శిలావర్షమును, శరవర్షేణ = బాణవర్షముచేత, ప్రతిహత్య = కొట్టివేసి, ఉపధావన్త్యాః = పరుగెత్తి మీదికి వచ్చుచున్న ఆమెయొక్క, కరౌ = హస్తములను, పత్రిభిః = బాణములచేత, చిచ్ఛేద = ఛేదించెను.

తా. రాముడు, ఆమె కురిపించిన శిలావర్షమును బాణవర్షముచేత వారించెను. ఆమె మీదికి వచ్చుచుండగా ఆమె హస్తములను బాణములచే ఛేదించెను.

మూ. తతశ్ఛిన్నభుజాం శ్రాన్తామభ్యాశే పరిగర్జతీమ్,

సౌమిత్రిరకరోత్క్రోధాద్ధతకర్ణాగ్రనాసికామ్. 18

ప్ర. అ. తతః = పిమ్మట, ఛిన్నభుజామ్ = ఛేదింపబడిన భుజములు కలదియు, శ్రాన్తామ్ = అలసిపోయినదియు, అభ్యాశే = సమీపమునందు, పరిగర్జతీమ్ = గర్జించుచున్న ఆమెను, సౌమిత్రిః = లక్ష్మణుడు, క్రోధాత్ = క్రోధము వలన, హృతకర్ణాగ్రనాసికామ్ = ఛేదింపబడిన కర్ణములు, నాసికాగ్రము కలదానినిగా, అకరోత్ = చేసెను.

తా. చేతులు తెగి, అలసిపోయి, సమీపమునందు గర్జించుచున్న ఆ తాటక చెవులను, ముక్కును, లక్ష్మణుడు క్రోధముతో ఛేదించివేసెను.

మూ. కామరూపధరా సద్యః కృత్వా రూపాణ్యనేకశః,

అన్తర్ధానం గతా యక్షీ మోహయన్తీవ మాయయా, 19

అశ్మవర్షం విముఞ్చన్తీ భైరవం విచచార హ.

ప్ర. అ. కామరూపధరా = ఇచ్ఛానుసారముగ రూపములను ధరించు ఆ తాటక, సద్యః = వెంటనే, అనేకశః = అనేక విధములుగ, రూపాణి = రూపములను, కృత్వా = చేసి, అశ్మవర్షమ్ = శిలావర్షమును, విముఞ్చన్తీ = విడచుచు, భైరవమ్ = భయంకరముగా, విచచార హ = సంచరించెను.

తా. ఇష్టము ప్రకారము రూపములను ధరింప గల ఆ తాటక అనేక విధములైన రూపములను ధరించుచు, రాళ్లవాన కురిపించుచు, అతిభయంకరముగ సంచరించెను.

మూ. తతస్తావశ్మవర్షేణ కీర్యమాణౌ సమన్తతః,

దృష్ట్వా గాధిసుతః శ్రీమానిదం వచనమబ్రవీత్. 20

ప్ర. అ. తతః = పిమ్మట, సమన్తతః = అంతటను, అశ్మవర్షేణ = రాళ్లవానచేత, కీర్యమాణౌ = కప్పబడుచున్న, తౌ = ఆ రామలక్ష్మణులను, దృష్ట్వా = చూచి, శ్రీమాన్ = కాంతి గల, గాధిసుతః = విశ్వామిత్రుడు, ఇదం వచనమ్ = ఈ వచనమును, అబ్రవీత్ = పలికెను.

తా. నలువైపులనుండి రాళ్లవానచే కొట్టబడుచున్న ఆ రామలక్ష్మణులను చూచి విశ్వామిత్రుడు ఇట్లు పలికెను.

మూ. అలం తే ఘృణయా రామ పాపైషా దుష్టచారిణీ,

యజ్ఞవిఘ్నకరీ యక్షీ పురా వర్ధతి మాయయా. 21

ప్ర. అ. రామ = రామా! తే = నీకు, ఘృణయా = జాలిచేత, అలమ్ = చాలును. పాపా = పాపాత్మురాలును, దుష్టచారిణీ = దుర్మార్గురాలును, యజ్ఞవిఘ్నకరీ = యజ్ఞములకు విఘ్నము చేయునదియు అగు, ఏషా యక్షీ = ఈ యక్షిణి, మాయయా = మాయచేత, పురావర్ధతి = వృద్ధి పొందగలదు.

తా. ‘‘రామా! ఈమె పై జాలి చూపకుము. యజ్ఞములకు విఘ్నము చేయు, పాపాత్మురాలు, దుర్మార్గురాలు అయిన ఈ యక్షిణి మాయాబలముచే వృద్ధి పొందగలదు.’’

మూ. వధ్యతాం తావదేవైషా పురా సన్ధ్యా ప్రవర్తతే,

రక్షాంసి సన్ధ్యాకాలేషు దుర్ధర్షాణి భవన్తి వై. 22

ప్ర. అ. సన్ధ్యా = సంధ్య, పురా ప్రవర్తతే = ప్రవర్తింప నున్నది. తావదేవ = అంతలోనే, ఏషా = ఈమె, వధ్యతామ్ = చంపబడుగాక. సన్ధ్యాకాలేషు = సంధ్యాకాలములయందు, రక్షాంసి = రాక్షసులు, దుర్ధర్షాణి = ఎదిరింప శక్యము కానివారు, భవన్తి వై = అగుదురు.

తా. సంధ్యాకాలము రాబోవుచున్నది. ఈ లోపుగనే ఈమెను చంపివేయుము. సంధ్యాకాలమునందు రాక్షసులను ఎదిరింప శక్యము కాదు.

మూ. ఇత్యుక్తస్తు తదా యక్షీమశ్మవృష్ట్యాభివర్షతీమ్,

దర్శయన్ శబ్దవేధిత్వం తాం రురోధ స సాయకైః. 23

ప్ర. అ. ఇతి = ఈ విధముగ, ఉక్తః = పలుకబడిన, సః = ఆ రాముడు, తదా = అప్పుడు, శబ్దవేధిత్వమ్ = శబ్దవేధిత్వమును, దర్శయన్ = చూపుచున్నవాడై, అశ్మవృష్ట్యా = రాళ్ల వానచే, అభివర్షతీమ్ = వర్షించుచున్న, తామ్ = ఆ, యక్షీమ్ = తాటకను, సాయకైః = బాణములచే, రురోధ = అడ్డగించెను.

తా. విశ్వామిత్రు డిట్లు చెప్పగా రాముడు తన శబ్దవేధిత్వ సామర్థ్యమును చూపుచు, రాళ్లవాన కురిపించుచున్న ఆ తాటకను బాణములచే అడ్డుపెట్టెను.

వి. శబ్ద మెచటినుండి వచ్చుచున్నదో దానినిబట్టి ఆ శబ్దము చేయు వ్యక్తి కనబడకున్నను ఆతనిని కొట్టగల సామర్థ్యము శబ్దవేధిత్వము.

మూ. సా రుద్ధా శరజాలేన మాయాబలసమన్వితా,

అభిదుద్రావ కాకుత్స్థం లక్ష్మణం చ వినేదుషీ. 24

ప్ర. అ. శరజాలేన = బాణసముదాయముచేత, రుద్ధా = అడ్డుకొనబడిన, మాయాబల సమన్వితా = మాయాబలము గల, సా = ఆమె, వినేదుషీ = గర్జించుచు, కాకుత్థ్సమ్ = రాముని, లక్ష్మణం చ = లక్ష్మణుని గూర్చి, అభిదుద్రావ = పరుగెత్తెను.

తా. మాయాబలము గల ఆ తాటక బాణజాలముచే అడ్డుకొనబడినదై, గర్జించుచు రామలక్ష్మణుల మీదికి పరుగెత్తికొని వచ్చెను.

మూ. తామాపతన్తీం వేగేన విక్రాన్తామశనీమివ,

శరేణోరసి వివ్యాధ సా పపాత మమార చ. 25

ప్ర. అ. విక్రాన్తామ్ = పరాక్రమము చూపుచు, అశనీమివ = పిడుగు వలె, వేగేన = వేగముతో, ఆపతన్తీమ్ = వచ్చి మీద పడుచున్న, తామ్ = ఆమెను, శరేణ = బాణముతో, ఉరసి = వక్షఃస్థలమునందు, వివ్యాధ = కొట్టెను, సా = ఆమె, పపాత = క్రిందపడిపోయెను, మమార చ = మరణించెను కూడ.

తా. పరాక్రమము చూపుచు పిడుగు వలె వేగముగ వచ్చి మీద పడుచున్న ఆమెను రాముడు, బాణముచే వక్షఃస్థలమునందు కొట్టెను. ఆమె క్రింద పడి చనిపోయెను.

మూ. తాం హతాం భీమసఙ్కాశాం దృష్ట్వా సురపతిస్తదా,

సాధు సాధ్వితి కాకుత్స్థం సురాశ్చ సమపూజయన్. 26

ప్ర. అ. తదా = అప్పుడు, సురపతిః = దేవేంద్రుడును, సురాశ్చ = దేవతలును, హతామ్ = చంపబడిన, భీమసఙ్కాశామ్ = భయంకరురాలుగా ఉన్న, తామ్ = ఆమెను, దృష్ట్వా = చూచి, సాధు సాధు, ఇతి = ‘‘బాగు బాగు’’ అని, కాకుత్థ్సమ్ = రాముని, సమపూజయన్ = పూజించిరి.

తా. భయంకరురా లైన ఆ తాటక మరణమును చూచి, దేవతలును, దేవేంద్రుడును, ‘‘బాగు బాగు’’ అని రాముని ప్రశంసించిరి.

మూ. ఉవాచ పరమప్రీతః సహస్రాక్షః పురన్దరః,

సురాశ్చ సర్వే సంహృష్టా విశ్వామిత్రమథాబ్రువన్. 27

ప్ర. అ. అథ = పిమ్మట, సహస్రాక్షః = వేయి నేత్రములు గల, పురన్దరః = దేవేంద్రుడు, పరమప్రీతః = చాల సంతోషించినవాడై, ఉవాచ = పలికెను. సర్వే = సమస్తమైన, సురాశ్చ = దేవతలును, సంహృష్టాః = సంతోషించిన వారై, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి, అబ్రువన్ = పలికిరి.

తా. సహస్రాక్షు డైన దేవేంద్రుడు దేవత లందరును కూడ సంతసించి విశ్వామిత్రునితో ఇట్లు పలికిరి.

మూ. మునే కౌశిక భద్రం తే సేన్ద్రాస్సర్వే మరుద్గణాః,

తోషితాః కర్మణానేన స్నేహం దర్శయ రాఘవే. 28

ప్ర. అ. కౌశికమునే = ఓ విశ్వామిత్రమహామునీ, తే = నీకు, భద్రమ్ = క్షేమమగుగాక. సేన్ద్రాః = ఇంద్రునితో కూడిన, సర్వే = సమస్తమైన, మరుద్గణాః = దేవతలు, అనేన = ఈ, కర్మణా = కర్మచేత, తోషితాః = సంతోషింపచేయబడినారు. రాఘవే = రాముని విషయమున, స్నేహమ్ = స్నేహమును, దర్శయ = చూపుము.

తా. విశ్వామిత్రమహర్షీ! నీకు క్షేమ మగుగాక. ఈ పనిచేత సకల దేవతలును, ఇంద్రుడును చాల సంతోషింపచేయబడినారు. రామునియందు ప్రేమను చూపుము.

మూ. ప్రజాపతేర్భృశాశ్వస్య పుత్రాన్ సత్యపరాక్రమాన్,

తపోబలభృతాన్ బ్రహ్మన్ రాఘవాయ నివేదయ. 29

ప్ర. అ. బ్రహ్మన్ = ఓ బ్రహ్మర్షీ! ప్రజాపతేః = ప్రజాపతి యైన, భృశాశ్వస్య = భృశాశ్వుని యొక్క, పుత్రాన్ = పుత్రులును, సత్యపరాక్రమాన్ = సత్య మైన పరాక్రమము కలవియు, తపోబలభృతాన్ = తపోబలముచే పోషింపబడినవియు, అగు అస్త్రములను, రాఘవాయ = రామునకు, నివేదయ = ఇమ్ము.

తా. ఓ మహర్షీ! ప్రజాపతి యైన భృశాశ్వుని పుత్రులును, సత్య మైన పరాక్రమము కలవియు, తపోబలముచే పోషింపబడినవియు అగు అస్త్రములను రామునకు ఉపదేశింపుము.

మూ. పాత్రభూతశ్చ తే బ్రహ్మం స్తవానుగమనే ధృతః,

కర్తవ్యం చ మహత్కర్మ సురాణాం రాజసూనునా. 30

ప్ర. అ. బ్రహ్మన్ = ఓ బ్రహ్మర్షీ! తవ = నీ యొక్క, అనుగమనే = అనుసరించి వెళ్లుటయందు, ధృతః = స్థిరు డైన ఈ రాముడు, తే = నీకు, పాత్రభూతః చ = సత్పాత్ర మైనవాడు, రాజసూనునా = ఈ రాజకుమారునిచే, సురాణామ్ = దేవతలయొక్క, మహత్ = గొప్ప, కర్మ = పని, కర్తవ్యం చ = చేయతగియున్నది కూడ.

తా. ఓ విశ్వామిత్రా! భక్తితో, స్థిరచిత్తముతో నిన్ను అనుసరించి వచ్చుచున్న ఈ రాముడు అస్త్రములను ఉపదేశించుటకు తగిన సత్పాత్రము. ఈ రాముడు గొప్ప దేవకార్యమును చేయవలసి యున్నది.

మూ. ఏవముక్త్వా సురాః సర్వే హృష్టా జగ్ముర్యథాగతమ్,

విశ్వామిత్రం పురస్కృత్య తతః సన్ధ్యా ప్రవర్తతే. 31

ప్ర. అ. ఏవమ్ = ఈ విధముగా, ఉక్త్వా = పలికి, సురాః = దేవతలు, సర్వే = అందరును, హృష్టాః = సంతసించిన వారై, విశ్వామిత్రం = విశ్వామిత్రుని, పురస్కృత్య = పూజించి, యథాగతమ్ = వచ్చినట్లు, జగ్ముః = వెళ్ళిరి, తతః = పిమ్మట, సన్ధ్యా = సంధ్య, ప్రవర్తతే = ప్రవర్తించెను.

తా. ఈ విధముగ పలికి, దేవత లందరును సంతసించినవారై, విశ్వామిత్రుని పూజించి తమ తమ స్థానములకు వెళ్లిపోయిరి. పిమ్మట సంధ్యాసమయ మయ్యెను.

మూ. తతో మునివరః ప్రీతస్తాటకావధతోషితః,

మూర్ధ్ని రామముపాఘ్రాయ ఇదం వచనమబ్రవీత్. 32

ప్ర. అ. తతః = పిమ్మట, మునివరః = మునిశ్రేష్ఠుడు, ప్రీతః = ప్రీతియుక్తుడై, తాటకావధతోషితః = తాటకయొక్క సంహారముచేత సంతోషింపచేయబడినవాడై, రామమ్ = రాముని, మూర్ధ్ని = శిరస్సుపై, ఉపాఘ్రాయ = వాసన చూచి, ఇదం వచనమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. పిమ్మట తాటకాసంహారముచే సంతోషించిన విశ్వామిత్రుడు రాముని శిరస్సు పై వాసన చూచి ఇట్లు పలికెను.

మూ. ఇహాద్య రజనీం రామ వసేమ శుభదర్శన,

శ్వః ప్రభాతే గమిష్యామస్తదాశ్రమపదం మమ. 33

ప్ర. అ. శుభదర్శన = శుభ మైన దర్శనము గల, రామ = రామా! అద్య = ఈనాడు, రజనీమ్ = ఈ రాత్రి, ఇహ = ఇచట, వసేమ = నివసించెదము, శ్వః = రేపు, ప్రభాతే = ప్రాతఃకాలమున, మమ = నా యొక్క, తత్ = ఆ, ఆశ్రమపదమ్ = ఆశ్రమమును గూర్చి, గమిష్యామః = వెళ్లెదము.

తా. దర్శనమాత్రమున శుభముల నిచ్చు ఓ రామా! ఈ రాత్రి ఇచటనే నివసించి రేపు ప్రాతఃకాలమున నా ఆశ్రమమునకు వెళ్లెదము.

మూ. విశ్వామిత్రవచః శ్రుత్వా హృష్టో దశరథాత్మజః,

ఉవాస రజనీం తత్ర తాటకాయా వనే సుఖమ్. 34

ప్ర. అ. విశ్వామిత్రవచః = విశ్వామిత్రుని మాటలను, శ్రుత్వా = విని, దశరథాత్మజః = రాముడు, హృష్టః = సంతసించినవాడై, తత్ర = ఆ, తాటకాయాః = వనే తాటకయొక్క వనమునందు, సుఖమ్ = సుఖముగా, రజనీమ్ = ఆ రాత్రి, ఉవాస = నివసించెను.

తా. రాముడు విశ్వామిత్రుని మాటలు విని సంతోషించి, ఆ రాత్రి తాటకావనములో సుఖముగా నివసించెను.

మూ. ముక్తశాపం వనం తచ్చ తస్మిన్నేవ తదాహని,

రమణీయం విబభ్రాజ యథా చైత్రరథం వనమ్. 35

ప్ర. అ. తదా = అప్పుడు, తస్మిన్ = ఆ, అహని ఏవ = దినమునందే, తత్ = ఆ, వనం చ = వనము కూడ, ముక్తశాపమ్ = విడువబడిన శాపము కలదై, చైత్రరథమ్ = చైత్రరథ మనెడు, వనమ్ = వనము, యథా = ఎట్లో, అట్లే, రమణీయమ్ = సుందర మైనదై, విబభ్రాజ = ప్రకాశించెను.

తా. ఆ వనముకూడ, ఆ దినమునందే శాపమునుండి విముక్తమై కుబేరుని చైత్రరథోద్యానము వలె సుందరమై ప్రకాశించెను.

మూ. నిహత్య తాం యక్షసుతాం స రామః

ప్రశస్యమానః సురసిద్ధసంఘైః,

ఉవాస తస్మిన్మునినా సహైవ

ప్రభాతవేలాం ప్రతిబోధ్యమానః. 36

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే షడ్వింశః సర్గః

ప్ర. అ. సః రామః = ఆ రాముడు, తామ్ = ఆ, యక్షసుతామ్ = యక్షుని కుమార్తెను, నిహత్య = చంపి, సురసిద్ధసంఘైః = దేవతలయొక్కయు సిద్ధులయొక్కయు సంఘములచేత, ప్రశస్యమానః = ప్రశంసింపబడు చున్నవాడై, మునినా సహ = విశ్వామిత్రునితో కూడ, తస్మిన్నేవ = ఆ వనమునందే, ప్రభాతవేలామ్ = ప్రాతఃకాలమున, ప్రతిబోధ్యమానః = మేల్కొలుపబడు చున్నవాడై, ఉవాస = నివసించెను.

తా. రాముడు తాటకను చంపి, దేవతలు సిద్ధులు మొదలగు వారిచే ప్రశంసింపబడుచు, విశ్వామిత్రునితో ఆ రాత్రి, ఆ వనమునందే వసించెను. ప్రభాతసమయమున విశ్వామిత్రుడు అతనిని మేల్కొలిపెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో ఇరువది యారవ సర్గ సమాప్తము.

© 2026 Ebook Library