| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 33 |
| Pages | 6 |
| Read Time | 10 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ సప్తవింశః సర్గః
విశ్వామిత్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రము లుపదేశించుట.
మూ. అథ తాం రజనీముష్య విశ్వామిత్రో మహాయశాః,
ప్రహస్య రాఘవం వాక్యమువాచ మధురాక్షరమ్. 1
ప్ర. అ. అథ = పిమ్మట, మహాయశాః = గొప్ప కీర్తి గల, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, తాం రజనీమ్ = ఆ రాత్రి, ఉష్య = ఉండి, ప్రహస్య = నవ్వి, రాఘవమ్ = రాముని గూర్చి, మధురాక్షరమ్ = మధుర మైన అక్షరములు కలిగిన, వాక్యమ్ = వాక్యమును, ఉవాచ = పలికెను.
తా. మహాయశస్సు గల విశ్వామిత్రుడు ఆ రాత్రి అచట నివసించి, మరునాడు, చిరునవ్వు నవ్వుచు, రామునితో, మధురముగ ఇట్లనెను.
మూ. పరితుష్టోఽస్మి భద్రం తే రాజపుత్ర మహాయశః,
ప్రీత్యా పరమయా యుక్తో దదామ్యస్త్రాణి సర్వశః. 2
ప్ర. అ. మహాయశః = గొప్ప కీర్తి గల, రాజపుత్ర = రామా! పరితుష్టః = సంతోషించినవాడను, అస్మి = అయినాను, తే = నీకు, భద్రమ్ = క్షేమము అగుగాక, పరమయా = గొప్ప, ప్రీత్యా = ప్రేమతో, యుక్తః = కూడినవాడనై, అస్త్రాణి = అస్త్రములను, సర్వశః = పూర్తిగా, దదామి = ఇచ్చెదను.
తా. గొప్ప కీర్తి గల రామా! నాకు చాలా సంతోషము కలిగినది. నీకు క్షేమ మగుగాక. నీకు ప్రేమపూర్వకముగా అస్త్రములను పూర్తిగ ఇచ్చెదను.
మూ. దేవాసురగణాన్వాపి సగన్ధర్వోరగానపి,
యైరమిత్రాన్ ప్రసహ్యాజౌ వశీకృత్య జయిష్యసి,
తాని దివ్యాని భద్రం తే దదామ్యస్త్రాణి సర్వశః. 3
ప్ర. అ. యైః = ఏ అస్త్రములచేత, దేవాసురగణాన్వాపి = దేవాసురసముదాయముల నైనను, సగన్ధర్వోరగానపి = గంధర్వులతో కూడిన ఉరగుల నైనను, అమిత్రాన్ = శత్రువులను, ఆజౌ = యుద్ధమునందు, ప్రసహ్య = బలాత్కారముగ, వశీకృత్య = వశము చేసికొని, జయిష్యసి = జయింపగలవో, తాని = అట్టి, దివ్యాని = దివ్యములైన, అస్త్రాణి = అస్త్రములను, సర్వశః = పూర్తిగా, దదామి = ఇచ్చెదను. తే = నీకు, భద్రమ్ = క్షేమ మగుగాక.
తా. దేవ - అసుర - గంధర్వ - ఉరగాదులు ఎవ్వరు శత్రువులుగా వచ్చినను యుద్ధరంగమునందు, వేటి సాహాయ్యముచే, వారిని బలాత్కారముగ వశము చేసికొని జయింపగలవో, అట్టి, దివ్యాస్త్రములను పరిపూర్ణముగ నీ కివ్వగలను. నీకు క్షేమ మగుగాక.
మూ. దణ్డచక్రం మహద్దివ్యం తవ దాస్యామి రాఘవ,
ధర్మచక్రం తతో వీర కాలచక్రం తథైవ చ, 4
విష్ణుచక్రం తథాత్యుగ్రమైన్ద్రమస్త్రం తథైవ చ.
వజ్రమస్త్రం నరశ్రేష్ఠ శైవం శూలవరం తథా, 5
అస్త్రం బ్రహ్మశిరశ్చైవ ఐషీకమపి రాఘవ.
దదామి తే మహాబాహో బ్రాహ్మమస్త్రమనుత్తమమ్. 6
ప్ర. అ. రాఘవ = రామా! మహత్ = గొప్ప దైన, దివ్యమ్ = దివ్య మైన, దణ్డచక్రమ్ = దండచక్రమును, తవ = నీకు, దాస్యామి = ఇవ్వగలను. నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా, మహాబాహో = గొప్ప బాహువులు గలవాడా! వీర = ఓ వీరుడా! రాఘవ = రామా! తతః = పిమ్మట, ధర్మచక్రమ్ = ధర్మచక్రమును, తథైవ చ = మరియు, కాలచక్రమ్ = కాలచక్రమును, తథా = మరియు, విష్ణుచక్రమ్ = విష్ణుచక్రమును, తథైవ చ = మరియు, ఐన్ద్రమ్ అస్త్రమ్ = ఐంద్రాస్త్రమును, వజ్రమ్ అస్త్రమ్ = వజ్రాస్త్రమును, తథా = మరియు, శైవమ్ = శివుని సంబంధ మైన, శూలవరమ్ = శ్రేష్ఠ మైన శూలమును, బ్రహ్మశిరః = బ్రహ్మశిరస్సు అనెడు, అస్త్రమ్ = అస్త్రమును, ఐషీకమపి = ఐషీకాస్త్రమును, అనుత్తమమ్ = అతిశ్రేష్ఠ మైన, బ్రాహ్మమ్ అస్త్రమ్ = బ్రహ్మాస్త్రమును, తే = నీకు, దదామి = ఇచ్చెదను.
తా. నరశ్రేష్ఠుడవు, మహాబాహుడవు అయిన ఓ రామా! నీకు ధర్మచక్ర-కాలచక్ర- విష్ణుచక్రములను, అత్యుగ్ర మైన ఇంద్రాస్త్రమును, వజ్రాస్త్రమును, శివుని శ్రేష్ఠ మైన శూలమును, బ్రహ్మశిరోస్త్రమును, ఐషీకాస్త్రమును, అత్యుత్తమ మైన బ్రహ్మాస్త్రమును ఇచ్చెదను.
మూ. గదే ద్వే చైవ కాకుత్థ్స మోదకీ శిఖరీ ఉభే,
ప్రదీప్తే నరశార్దూల ప్రయచ్ఛామి నృపాత్మజ. 7
ప్ర. అ. కాకుత్థ్స = కకుత్థ్సవంశమునందు జన్మించిన, నరశార్దూల = నరశ్రేష్ఠుడవైన, నృపాత్మజ = రామా! ప్రదీప్తే = ప్రజ్వలించుచున్న, ద్వే = రెండు, మోదకీ శిఖరీ = మోదకి శిఖరి అనెడు, గదే = గదలను, ఉభే = రెండింటినీ, ప్రయచ్ఛామి = ఇచ్చెదను.
తా. నరశ్రేష్ఠుడ వైన రామా! మోదకి, శిఖరి అనెడు ప్రజ్వరిల్లు చున్న రెండు గదలను కూడ ఇచ్చెదను.
మూ. ధర్మపాశమహం రామ కాలపాశం తథైవ చ,
పాశం వారుణమస్త్రం చ దదామ్యహమనుత్తమమ్. 8
ప్ర. అ. రామ = రామా! అహమ్ = నేను, ధర్మపాశమ్ = ధర్మపాశమును, తథైవ చ = మరియు, కాలపాశమ్ = కాలపాశమును, వారుణమ్ = వరుణునికి సంబంధించిన, పాశమ్ = పాశమును, అనుత్తమమ్ = అత్యుత్తమమైన, అస్త్రం చ = అస్త్రమును, దదామి = ఇచ్చెదను.
తా. రామా! నేను ధర్మపాశమును, కాలపాశమును, వారుణపాశమును, గొప్ప దైన వారుణాస్త్రమును ఇచ్చెదను.
మూ. అశనీ ద్వే ప్రయచ్ఛామి శుష్కార్ద్రే రఘునన్దన,
దదామి చాస్త్రం పైనాకమస్త్రం నారాయణం తథా. 9
ప్ర. అ. రఘునన్దన = రామా! శుష్కార్ద్రే = శుష్కము (ఎండుది), ఆర్ద్రము (తడిది) అనెడు, ద్వే = రెండు, అశనీ = పిడుగులను, పైనాకమ్ అస్త్రమ్ = పైనాకాస్త్రమును, తథా = మరియు, నారాయణమ్ అస్త్రమ్ = నారాయణాస్త్రమును, దదామి = ఇచ్చెదను.
తా. రామా! శుష్కము, ఆర్ద్రము అనెడు రెండు పిడుగులను, పైనాకాస్త్రమును, నారాయణాస్త్రమును ఇచ్చెదను.
మూ. ఆగ్నేయమస్త్రం దయితం శిఖరం నామ నామతః,
వాయవ్యం ప్రథనం నామ దదామి చ తవానఘ. 10
ప్ర. అ. అనఘ = దోషరహితుడా! నామతః = పేరుచేత, శిఖరం నామ = శిఖర మను ప్రసిద్ధి గల, దయితమ్ = అగ్నికి ఇష్టమైన, ఆగ్నేయమ్ అస్త్రమ్ = అగ్నిదేవతాక మైన అస్త్రమును, ప్రథనం నామ = ప్రథన మను పేరు గల, వాయవ్యమ్ = వాయవ్యాస్త్రమును, తవ = నీకు, దదామి = ఇచ్చెదను.
తా. దోషరహితుడ వైన రామా! శిఖర మను పేరు గలదియు, అగ్నికి చాల ఇష్ట మైనదియు అగు ఆగ్నేయాస్త్రమును, ప్రథన మను పేరు గల వాయవ్యాస్త్రమును ఇచ్చెదను.
మూ. అస్త్రం హయశిరో నామ క్రౌఞ్చమస్త్రం తథైవ చ,
శక్తిద్వయం చ కాకుత్థ్స దదామి తవ రాఘవ. 11
ప్ర. అ. కాకుత్థ్స = కకుత్థ్సవంశోద్భవుడవైన, రాఘవ = రామా! హయశిరోనామ = హయశిరస్సు అను పేరు గల, అస్త్రమ్ = అస్త్రమును, తథైవ చ = మరియు, క్రౌఞ్చమ్ అస్త్రమ్ = క్రౌంచాస్త్రమును, శక్తిద్వయం చ = రెండు శక్తులను, తవ = నీకు, దదామి = ఇచ్చెదను.
తా. కకుత్థ్సవంశోద్భవుడ వైన రామా! హయశిరస్సు అను అస్త్రమును, క్రౌంచాస్త్రమును, రెండు శక్తులను ఇచ్చెదను.
మూ. కఙ్కాళం ముసలం ఘోరం కాపాలమథ కఙ్కణమ్,
ధారయన్త్యసురా యాని దదామ్యేతాని సర్వశః. 12
ప్ర. అ. ఘోరమ్ = భయంకరమైన, కఙ్కాళమ్ = కంకాళ మనెడు, ముసలమ్ = రోకలిని, కాపాలమ్ = కాపాల మనెడు ముసలమును, అథ = మరియు, కఙ్కణమ్ = కంకణ మనెడు ముసలమును, యాని = వేటిని, అసురాః = అసురులు, ధారయన్తి = ధరింతురో, ఏతాని = అట్టి, ఈ ముసలములను, సర్వశః = పూర్తిగా, దదామి = ఇచ్చెదను.
తా. అసురులు ధరించు కంకాళము, కపాలము, కంకణము అను ముసలములను గూడ పూర్తిగ ఇచ్చెదను.
మూ. వైద్యాధరం మహాస్త్రం చ నన్దనం నామ నామతః,
అసిరత్నం మహాబాహో దదామి చ నృపాత్మజ. 13
ప్ర. అ. మహాబాహో = గొప్ప బాహువులు గల, నృపాత్మజ = ఓ రాజకుమారా! వైద్యాధరమ్ = వైద్యాధర మనెడు, మహాస్త్రం చ = మహాస్త్రమును, నామతః = పేరుచేత; నన్దనం నామ = నందన మనెడు, అసిరత్నమ్ = శ్రేష్ఠ మైన ఖడ్గమును, దదామి = ఇచ్చెదను.
తా. వైద్యాధర మనెడు మహాస్త్రమును, నందన మనెడు శ్రేష్ఠ మైన ఖడ్గమును ఇచ్చెదను.
మూ. గాన్ధర్వమస్త్రం దయితం మానవం నామ నామతః,
ప్రస్వాపనప్రశమనే దద్మి సౌరం చ రాఘవ. 14
ప్ర. అ. రాఘవ = రామా! గాన్ధర్వమ్ = గాన్ధర్వ మనెడు, అస్త్రమ్ = అస్త్రమును, నామతః = పేరుచేత, మానవం నామ = మానవ మనెడు, దయితమ్ = ఇష్టమైన అస్త్రమును, ప్రస్వాపన ప్రశమనే = నిద్ర కలిగించునదియు నిద్ర తొలగించునదియు అగు రెండు (గాంధర్వమానవ) అస్త్రములను, సౌరం చ = సౌరాస్త్రమును, దద్మి = ఇచ్చెదను.
తా. రామా! నిద్ర కలిగించునదియు, నిద్ర తొలగించునదియు అగు గాంధర్వ మానవాస్త్రములను సౌరాస్త్రమును ఇచ్చెదను.
మూ. దర్పణం శోషణం చైవ సన్తాపనవిలాపనే,
మదనం చైవ దుర్ధర్షం కందర్పదయితం తథా, 15
పైశాచమస్త్రం దయితం మోహనం నామ నామతః,
ప్రతీచ్ఛ నరశార్దూల రాజపుత్ర మహాయశః. 16
ప్ర. అ. మహాయశః = గొప్ప యశస్సు కలవాడా! నరశార్దూల = నరశ్రేష్ఠుడా! రాజపుత్ర = రామా! దర్పణమ్ = గర్వింపచేయు దర్పణాస్త్రమును, శోషణం చైవ = ఎండింపచేయు శోషణాస్త్రమును, సంతాపనవిలాపనే = తాపమును కలిగించు సంతాపనాస్త్రమును విలపింపచేయు విలాపనాస్త్రమును, తథా = మరియు, దుర్ధర్షమ్ = ఎదిరింప శక్యము కాని, కన్దర్పదయితమ్ = మన్మథునికి ఇష్టమైన, మదనం చ = మదనాస్త్రమును, నామతః = పేరుచేత, మోహనం నామ = మోహనమను ప్రసిద్ధి గల, దయితమ్ = పిశాచములకు ఇష్ట మైన, పైశాచమ్ అస్త్రమ్ = పిశాచములకు సంబంధించిన అస్త్రమును, ప్రతీచ్ఛ = తీసికొనుము.
తా. నరశ్రేష్ఠుడవును, కీర్తిమంతుడవును, అగు రామా! దర్పణ-శోషణ-సంతాపన -విలాపనాస్త్రములను, మన్మథునకు ఇష్ట మైనదియు, ఎదిరింప శక్యము కానిదియు అగు మదనాస్త్రమును, పిశాచములకు సంబంధించినదియు, వారికి ఇష్ట మైనదియు అగు మోహనాస్త్రమును, గ్రహింపుము.
మూ. తామసం నరశార్దూల సౌమనం చ మహాబల, 17
సంవర్ధం చైవ దుర్ధర్షం మౌసలం చ నృపాత్మజ,
సత్యమస్త్రం మహాబాహో తథా మాయాధరం పరమ్, 18
ఘోరం తేజఃప్రభం నామ త్వష్టురస్త్రం సుదామనమ్,
దారుణం చ భగస్యాపి శితేషుమథ మానవమ్. 19
ప్ర. అ. నరశార్దూల = నరశ్రేష్ఠుడా! మహాబల = గొప్ప బలము కలవాడా! నృపాత్మజ = రామా! తామసమ్ = తామసాస్త్రమును, సౌమనం చైవ = సౌమనాస్త్రమును, దుర్ధర్షమ్ = ఎదిరింప శక్యము కాని, సంవర్ధం చైవ = సంవర్ధాస్త్రమును, మౌసలమ్ = మౌసలాస్త్రమును, సత్యమ్ అస్త్రమ్ = సత్యాస్త్రమును, పరమ్ = శ్రేష్ఠమైన, మాయాధరమ్ = మాయాధరాస్త్రమును, పరతేజోపకర్షణమ్ = పరుల తేజస్సును లాగివేయు, ఘోరమ్ = భయంకరమైన, తేజఃప్రభం నామ = శిశిర మనెడి పేరు గల, సౌమ్యాస్త్రమ్ = సోమదేవతాకమైన అస్త్రమును, సుదామనమ్ = సుదామనమను పేరు గల, త్వష్టుః = త్వష్టయొక్క, అస్త్రమ్ = అస్త్రమును, భగస్య = భగునియొక్క, దారుణమ్ = భయంకర మైన, శితేషుమ్ = వాడియైన బాణరూపములో నున్న శితేష్వస్త్రమును, అథ = మరియు, మానవమ్ = మానవాస్త్రమును, ప్రతీచ్ఛస్వ = గ్రహింపుము.
తా. ఓ నరశ్రేష్ఠుడా! మహాబలశా! రామా! తామస-సౌమనాస్త్రములను, ఎదిరింప శక్యము కాని సంవర్ధాస్త్రమును, మౌసలాస్త్రమును, సత్యాస్త్రమును, మాయాధరాస్త్రమును, ఇతరుల తేజస్సును ఆకర్షించు ఘోరమైన తేజః ప్రభాస్త్రమును, సోమదేవతాక మైన శిశిరాస్త్రమును, త్వష్టదేవతాకమైన సుదామనాస్త్రమును, భగుని యొక్క దారుణమైన శితేషువు (బాణము)ను, మరియు మానవాస్త్రమును గ్రహింపుము.
మూ. ఏతాన్ రామ మహాబాహో కామరూపాన్ మహాబలాన్,
గృహాణ పరమోదారాన్ క్షిప్రమేవ నృపాత్మజ. 20
ప్ర. అ. మహాబాహో = గొప్పబాహువులు కలవాడా! నృపాత్మజ = రాజకుమారా! రామ = రామా! కామరూపాన్ = స్వేచ్ఛాధీన రూపములు గల, మహాబలాన్ = గొప్ప బలము గల, పరమోదారాన్ = చాలా గొప్ప వైన, ఏతాన్ = అస్త్రములను, క్షిప్రమేవ = శీఘ్రముగ, గృహాణ = తీసికొనుము.
తా. మహాబాహూ! రాజకుమారా! రామా! ఇష్టము వచ్చిన రూపములు ధరింప గలవియు, చాల గొప్పవియు, గొప్ప బలము కలవియు అగు ఈ అస్త్రములను వెంటనే గ్రహింపుము.
మూ. స్థితస్తు ప్రాఙ్ముఖో భూత్వా శుచిర్మునివర స్తదా,
దదౌ రామాయ సుప్రీతో మన్త్రగ్రామమనుత్తమమ్. 21
ప్ర. అ. తదా = అపుడు, మునివరః = మునిశ్రేష్ఠుడు, శుచిః = పరిశుద్ధుడై, ప్రాఙ్ముఖః = తూర్పువైపు ముఖము కలవాడుగా, స్థితః = ఉన్నవాడు, భూత్వా = అయి, సుప్రీతః = చాల ప్రసన్నుడై, రామాయ = రామునకు, అనుత్తమమ్ = చాల ఉత్తమమైన, మన్త్రగ్రామమ్ = మంత్రసముదాయమును, దదౌ = ఇచ్చెను.
తా. అపుడు మునిశ్రేష్ఠు డైన విశ్వామిత్రుడు శుచియై ప్రసన్నచిత్తుడై, పూర్వాభిముఖుడై అత్యుత్తమ మగు అస్త్రసముదాయమును రామున కిచ్చెను.
మూ. సర్వసంగ్రహణం యేషాం దైవతైరపి దుర్లభమ్,
తాన్యస్త్రాణి తదా విప్రో రాఘవాయ న్యవేదయత్. 22
ప్ర. అ. యేషామ్ = ఏ అస్త్రముల యొక్క, సర్వసంగ్రహణమ్ = పరిపూర్ణస్వీకారము, దైవతైరపి = దేవతలచేత కూడ, దుర్లభమ్ = దుర్లభ మైనదో, తాని = అట్టి, అస్త్రాణి = అస్త్రములను, తదా = అప్పుడు, విప్రః = విశ్వామిత్రుడు, రాఘవాయ = రామునకు, న్యవేదయత్ = తెలిపెను.
తా. ఏ అస్త్రములను సాంగోపాంగములుగ పరిపూర్ణముగ స్వీకరించుట అనునది దేవతలకు కూడ దుర్లభమో అట్టి అస్త్రములను విశ్వామిత్రుడు రామునకు ఇచ్చెను.
మూ. జపతస్తు మునేస్తస్య విశ్వామిత్రస్య ధీమతః,
ఉపతస్థుర్మహార్హాణి సర్వాణ్యస్త్రాణి రాఘవమ్. 23
ప్ర. అ. ధీమతః = బుద్ధిశాలి యైన, తస్య = ఆ, విశ్వామిత్రస్య మునేః = విశ్వామిత్ర మహాముని, జపతః = జపము చేయుచుండగా, మహార్హాణి = పూజ్యము లైన, అస్త్రాణి = అస్త్రములు, సర్వాణి = అన్నియు, రాఘవమ్ = రాముని, ఉపతస్థుః = (చేరినవి) సేవించినవి.
తా. ధీమంతు డైన ఆ విశ్వామిత్రుడు జపించు చుండగా, పూజనీయము లైన అస్త్రము లన్నియు రాముని సేవించినవి.
మూ. ఊచుశ్చ ముదితాః సర్వే రామం ప్రాఞ్జలయస్తదా,
ఇమే స్మః పరమోదారాః కింకరాస్తవ రాఘవ. 24
ప్ర. అ. పరమోదారాః = మిక్కిలి ఉదారు లైన, సర్వే = ఆ అస్త్రదేవత లందరును, తదా = అప్పుడు, ప్రాఞ్జలయః = దోసిలి కట్టిన వారై, ఊచుశ్చ = పలికిరి కూడ. రాఘవ = రామా్ఙ ఇమే = ఈ మేము, తవ = నీయొక్క, కింకరా = కింకరులముగా, స్మః = అయి ఉన్నాము.
తా. పరమోదారు లైన ఆ అస్త్రదేవత లందరును, అపుడు, నమస్కరించుచు, ‘‘రామా! మేమందరము నీ కింకరులము’’ అని పలికిరి.
మూ. ప్రతిగృహ్య చ కాకుత్స్థః సమాలభ్య చ పాణినా,
మానసా మే భవిష్యధ్వమితి తానభ్యచోదయత్. 25
ప్ర. అ. కాకుత్థ్సః = రాముడు, ప్రతిగృహ్య = స్వీకరించి, పాణినా = హస్తముతో, సమాలభ్య = స్పశించి, మే = నాయొక్క, మానసాః = మనస్సునందు సంచరించువారుగా, భవిష్యధ్వమ్ = అగుదురుగాక, ఇతి = అని, తాన్ = వారిని, అభ్యచోదయత్ = ఆజ్ఞాపించెను.
తా. రాముడు ఆ అస్త్రములను స్వీకరించి, హస్తముచే ఆ అస్త్రదేవతలను స్పశించి - ‘‘నా మనస్సులో సంచరించుచుందురు గాక’’ అని ఆ దేవతలను ఆజ్ఞాపించెను.
మూ. తతః ప్రీతమనా రామో విశ్వామిత్రం మహామునిమ్,
అభివాద్య మహాతేజా గమనాయోపచక్రమే. 26
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే సప్తవింశఃస్సర్గః
ప్ర. అ. తతః = పిమ్మట, మహాతేజాః = గొప్ప తేజస్సు గల, రామః = రాముడు, ప్రీతమనాః = సంతోషించిన మనస్సు కలవాడై, విశ్వామిత్రం మహామునిమ్ = విశ్వామిత్ర మహర్షిని, అభివాద్య = నమస్కరించి, గమనాయ = ప్రయాణము చేయుటకు,ఉపచక్రమే = ప్రారంభించెను.
తా. అటుపిమ్మట మహాతేజఃశాలి యగు రాముడు సంతోషించి విశ్వామిత్రమహర్షికి నమస్కరించి ప్రయాణ మయ్యెను.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో ఇరువదియేడవ సర్గ సమాప్తము.
