Chapter_28

Back
Book Balakandamu
Chapter No 34
Pages 5
Read Time 8 Minutes

Chapter_28

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ అష్టావింశః సర్గః

విశ్వామిత్రుడు శ్రీరామునకు ప్రయోగించిన అస్త్రములను ఎట్లు ఉప సంహరించవలెనో ఉపదేశించి మరికొన్ని అస్త్రములు కూడ ఉపదేశించుట. శ్రీరాముడు అచట నున్న ఆశ్రమమును గూర్చి ప్రశ్నించుట.

మూ. ప్రతిగృహ్య తతోఽస్త్రాణి ప్రహృష్టవదనః శుచిః,

గచ్ఛన్నేవ చ కాకుత్స్థో విశ్వామిత్రమథాబ్రవీత్. 1

ప్ర. అ. కాకుత్థ్సః = రాముడు, శుచిః = పవిత్రుడై, అస్త్రాణి = అస్త్రములను, ప్రతిగృహ్య = స్వీకరించి, తతః = పిమ్మట, ప్రహృష్టవదనః = వికసించిన ముఖము కలవాడై, గచ్ఛన్నేవ = నడచి వెళ్లుచునే, అథ = అటుపిమ్మట, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి, అబ్రవీత్ = పలికెను.

తా. రాముడు పవిత్రుడై అస్త్రములను గ్రహించి, ఆనందించి, నడచి వెళ్లుచునే విశ్వామిత్రునితో ఇట్లనెను.

మూ. గృహీతాస్త్రోఽస్మి భగవన్ దురాధర్షః సురైరపి,

అస్త్రాణాం త్వహమిచ్ఛామి సంహారం మునిపుఙ్గవ. 2

ప్ర. అ. భగవన్ = పూజ్యుడా! గృహీతాస్త్రః = గ్రహింపబడిన అస్త్రములు గల నేను, సురైరపి = దేవతలచేత కూడ, దురాధర్షః = ఎదిరింప శక్యము కాని వాడనుగా, అస్మి = అయిఉన్నాను. మునిపుఙ్గవ = ఓ మునిశ్రేష్ఠుడా! అహమ్ = నేను, అస్త్రాణామ్ = అస్త్రముల యొక్క, సంహారమ్ = ఉపసంహారమును కూడ, ఇచ్ఛామి = తెలుసుకొనగోరుచున్నాను.

తా. పూజ్యుడా! అస్త్రములను స్వీకరించి ఇపుడు నేను దేవతలచేత కూడ ఎదిరింప శక్యము కానివాడ నైతిని. మునిశ్రేష్ఠా! అస్త్రముల ఉపసంహారమును కూడ తెలిసికొన గోరుచున్నాను.

మూ. ఏవం బ్రువతి కాకుత్స్థే విశ్వామిత్రో మహామునిః,

సంహారం వ్యాజహారాథ ధృతిమాన్ సువ్రతః శుచిః. 3

ప్ర. అ. కాకుత్థ్సే = రాముడు, ఏవమ్ = ఈ విధముగా, బ్రువతి = పలుకగా, అథ = పిమ్మట, ధృతిమాన్ = ధైర్యవంతుడును, సువ్రతః = మంచి వ్రతము కలవాడును, శుచిః = పరిశుద్ధుడును అగు, విశ్వామిత్రః మహామునిః = విశ్వామిత్ర మహర్షి, సంహారమ్ = ఉపసంహారమును, వ్యాజహార = చెప్పెను.

తా. రాముని మాటలను అంగీకరించి విశ్వామిత్రమహర్షి అస్త్రముల ఉపసంహారమును కూడ ఉపదేశించెను.

మూ. సత్యవన్తం సత్యకీర్తిం ధృష్టం రభసమేవ చ,

ప్రతిహారతరం నామ పరాఙ్ముఖమవాఙ్ముఖమ్. 4

లక్షాక్షవిషమౌ చైవ దృఢనాభసునాభకౌ,

దశాక్షశతవక్త్రౌ చ దశశీర్షశతోదరౌ. 5

పద్మనాభమహానాభౌ దున్దునాభసునాభకౌ,

జ్యోతిషం కృశనం చైవ నైరాశ్యవిమలావుభౌ. 6

యోగన్ధరహరిద్రౌ చ దైత్యప్రశమనౌ తథా,

సార్చిర్మాలీ ధృతిర్శాలీ వృత్తిమాన్ రుచిరస్తథా. 7

పితృసౌమనసం చైవ విధూతమకరావుభౌ,

కరవీరకరం చైవ ధనధాన్యౌ చ రాఘవ. 8

కామరూపం కామరుచిం మోహమావరణం తథా,

జృమ్భకం సర్వనాభం చ సన్తానవరణౌ తథా. 9

భృశాశ్వతనయాన్ రామ భాస్వరాన్కామరూపిణః,

ప్రతీచ్ఛ మమ భద్రం తే పాత్రభూతోఽసి రాఘవ. 10

ప్ర. అ. రాఘవ = రఘువంశమునందు పుట్టిన, రామ = రామా! సత్యవన్తమ్ = సత్యవంతమును, సత్యకీర్తిమ్ = సత్యకీర్తిని, ధృష్టమ్ = ధృష్టమును, రభసమ్ = రభసమును, ప్రతిహారతరమ్ = ప్రతిహారతరమును, పరాఙ్ముఖమ్ = పరాఙ్ముఖమును, అవాఙ్ముఖమ్ = అవాఙ్ముఖమును, లక్షాక్షవిషమౌ = లక్షాక్షమును, విషమమును, దృఢనాభసునాభకౌ = ధృడనాభమును, సునాభమును, దశాక్షశతవక్త్రౌ చ = దశాక్షమును, శతవక్త్రమును, దశశీర్షశతోదరౌ = దశశీర్షశతోదరములను, పద్మనాభమహానాభౌ = పద్మనాభమును, మహానాభమును, దున్దునాభసునాభకౌ = దుందునాభమును, సునాభమును, జ్యోతిషమ్ = జ్యోతిషమును, కృశనం చైవ = కృశనమును, ఉభౌ = రెండు, నైరాశ్యవిమలౌ = నైరాశ్యవిమలములను, యోగంధరహరిద్రౌ చ = యోగంధరమును హరిద్రమును, దైత్యప్రశమనౌ = దైత్యమును, ప్రశమనమును, సార్చిర్మాలీ = సార్చిర్మాలి యనుదానిని, ధృతిః = ధృతిని, మాలీ = మాలిని, వృత్తిమాన్ = వృత్తిమంతమును, తథా = మరియు, రుచిరః = రుచిర మను దానిని, పితృసౌమనసం చైవ = పితృ సౌమనసమును, ఉభౌ = రెండు, విధూతమకరౌ = విధూతమకరములను, కరవీరకరం చైవ = కరవీరకరమును, ధనధాన్యౌ = ధనధాన్యములను, కామరూపమ్ = కామరూపమును, కామరుచిమ్ = కామరుచిని, మోహమ్ = మోహమును, తథా = మరియు, ఆవరణమ్ = ఆవరణమును, జృమ్భకమ్ = జృంభకమును, సర్వనాభం చ = సర్వనాభమును, తథా = మరియు, సన్తానవరణౌ = సంతానవరణములను, భాస్వరాన్ = ప్రకాశించునట్టియు, కామరూపిణః = కామరూపము గల, భృశాశ్వతనయాన్ = భృశాశ్వుని కుమారు లైన అస్త్రములను, మమ = నానుండి, ప్రతీచ్ఛ = గ్రహించుము, తే = నీకు, భద్రమ్ = క్షేమ మగుగాక. పాత్రభూతః = సత్పాత్రమవుగా, అసి = అయి ఉన్నావు.

తా. రామా! భృశాశ్వుని కుమారులును, ప్రకాశించునవియు, కామరూపము కలవియు అగు - సత్యవంతము, సత్యకీర్తి, ధృష్టము, రభసము, ప్రతిహారతరము, పరాఙ్ముఖము, అవాఙ్ముఖము, లక్షాక్షము, విషమము, దృఢనాభము, సునాభము, దశాక్షము, శతవక్త్రము, దశశీర్షము, శతోదరము, పద్మనాభము, మహానాభము, దుందునాభము, సునాభము, జ్యోతిషము, కృశనము, నైరాశ్యము, విమలము, యోగంధరము, హరిద్రము, దైత్యము, ప్రశమనము, సార్చిర్మాలి, ధృతి, మాలి, వృత్తిమంతము, రుచిరము, పితృ సౌమనసము, విధూతము, మకరము, కరవీరకరము, ధనము, ధాన్యము, కామరూపము, కామరుచి, మోహము, ఆవరణము, జృంభకము, సర్వనాభము, సంతానము, వరణము, అను అస్త్రములను నావద్దనుండి స్వీకరించుము. నీకు క్షేమ మగును గాక. నీవు సత్పాత్ర మైనవాడవు.

మూ. బాఢమిత్యేవ కాకుత్థ్సః ప్రహృష్టేనాన్తరాత్మనా,

దివ్యభాస్వరదేహాశ్చ మూర్తిమన్తః సుఖప్రదాః. 11

కేచిదఙ్గారసదృశాః కేచిద్ధూమోపమాస్తథా,

చన్ద్రార్కసదృశాః కేచిత్ప్రహ్వాఞ్జలిపుటాస్తథా. 12

రామం ప్రాఞ్జలయో భూత్వాఽబ్రువన్ మధురభాషిణః,

ఇమే స్మ నరశార్దూల శాధి కిం కరవామ తే. 13

ప్ర. అ. కాకుత్థ్సః = రాముడు, ప్రహృష్టేన = సంతసించిన, అన్తరాత్మనా = హృదయముతో, ‘‘బాఢమ్’’ = తప్పక (అట్లు చేసెదను), ఇత్యేవ = అని, పలికి, (ఆ అస్త్రములను గ్రహించెను). దివ్యభాస్వరదేహాః చ = దివ్యము లైన ప్రకాశించుచున్న దేహములు కలవారును, మూర్తిమన్తః = మూర్తిని ధరించినవారును, సుఖప్రదాః = సుఖము నిచ్చువారును, కేచిత్ = కొందరు, అఙ్గారసదృశాః = బొగ్గు వలె నున్నవారును, తథా = మరియు, కేచిత్ = కొందరు, ధూమోపమాః = ధూమము వలె ఉన్నవారును, కేచిత్ = కొందరు, చన్ద్రార్క సదృశాః = చంద్రునితోడను సూర్యునితోడను సమానులును, తథా = మరియు, ప్రహ్వాఞ్జలిపుటాః = వంగిన దోసిళ్లు కలవారును అగు అస్త్రదేవతలు, ప్రాఞ్జలయః భూత్వా = కట్టబడిన దోసిలికలవారయి, మధురభాషిణః = మధురముగా మాటలాడుచున్నవారై, రామమ్ = రాముని గూర్చి, అబ్రువన్ = పలికిరి. నరశార్దూల = ఓ నరశ్రేష్ఠుడా!, ఇమే స్మః = ఇదిగో, ఇచట నున్నాము. శాధి = ఆజ్ఞాపించుము. తే = నీకు, కిమ్ = ఏమి, కరవామ = చేయుదుము.

తా. రాముడు సంతసించిన హృదయముతో ‘‘అటులనే గ్రహించెదను’’ అని పలికి ఆ అస్త్రములను గ్రహించెను. ఆ అస్త్రదేవతలలో కొందరు ఎఱ్ఱగా కాలిన బొగ్గునిప్పుల వలె నుండిరి. కొందరు ధూమమువలెను, కొందరు చంద్ర సూర్యుల వలెను ఉండిరి. దివ్యము లైన ప్రకాశించుచున్న దేహములు దాల్చి సుఖమును కలిగించు ఆ అస్త్రదేవతలు, వినయముతో చేతులు కట్టి మధురముగా మాటలాడుచు రామునితో ఇట్లనిరి. ‘‘ఓ నరశ్రేష్ఠుడా! ఇదిగో మే మిచట ఉన్నాము. ఏమి చేయవలెనో ఆజ్ఞాపింపుము.’’

మూ. మానసాః కార్యకాలేషు సాహాయ్యం మే కరిష్యథ,

గమ్యతామితి తానాహ యథేష్టం రఘునన్దనః. 14

ప్ర. అ. మానసాః = నా మనస్సులో నున్నవారలై, కార్యకాలేషు = కార్యసమయములయందు, మే = నాకు, సాహాయ్యమ్ = సాహాయ్యమును, కరిష్యథ = చేయగలరు. యథేష్టమ్ = ఇష్టము వచ్చినట్లుగా, గమ్యతామ్ = వెళ్లుడు, ఇతి = అని, రఘునన్దనః = రాముడు, తాన్ = ఆ అస్త్రదేవతలను గూర్చి, ఆహ = పలికెను.

తా. ‘‘మీరు నా మనస్సులో మెదలుచు పనిపడునప్పుడు నాకు సాహాయ్యము చేయుడు. యథేష్టముగ వెళ్లుడు’’ అని రాముడు ఆ అస్త్రములతో పలికెను.’’

మూ. అథ తే రామమామన్త్య్ర కృత్వా చాపి ప్రదక్షిణమ్,

ఏవమస్త్వితి కాకుత్థ్సముక్త్వా జగ్ముర్యథాగతమ్. 15

ప్ర. అ. అథ = పిమ్మట, తే = ఆ దేవతలు, ఏవమ్ అస్తు = అటులనే అగుగాక, ఇతి = అని, కాకుత్థ్సమ్ = రాముని గూర్చి, ఉక్త్వా = పలికి, ప్రదక్షిణమ్ = ప్రదక్షిణ నమస్కారమును, కృత్వా = చేసి, రామమ్ = రాముని, ఆమన్త్య్ర = అడిగి, యథాగతమ్ = వచ్చినట్లుగనే, జగ్ముః = వెళ్లిరి.

తా. ఆ దేవతలు - ‘‘అటులనే చేసెదము’’ అని పలికి, రామునికి ప్రదక్షిణ నమస్కారము చేసి, సెలవు గైకొని, వచ్చినట్లుగనే వెళ్లిపోయిరి.

మూ. స చ తాన్ రాఘవో జ్ఞాత్వా విశ్వామిత్రం మహామునిమ్,

గచ్ఛన్నేవాథ మధురం శ్లక్ష్ణం వచనమబ్రవీత్. 16

ప్ర. అ. సః రాఘవః = ఆ రాముడు, తాన్ = ఆ ఉపసంహారమంత్రమును, జ్ఞాత్వా = తెలిసికొని, అథ = పిమ్మట, గచ్ఛన్నేవ = నడచుచునే, విశ్వామిత్రం మహామునిమ్ = విశ్వామిత్రమహర్షిని గూర్చి, మధురమ్ = మధురము, శ్లక్ష్ణమ్ = మృదువు అయిన, వచనమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. రాముడు ఉపసంహారమంత్రములను తెలిసికొని, నడుచుచునే, విశ్వామిత్ర మహర్షితో మధురము, మృదువు అయిన వచనమును పలికెను.

మూ. కిం న్వేత న్మేఘసంకాశం పర్వతస్యావిదూరతః,

వృక్షషణ్డమితో భాతి పరం కౌతూహలం హి మే. 17

దర్శనీయం మృగాకీర్ణం మనో రమయతీవ చ,

నానాప్రకారైః శకునైర్వల్గునాదైరలఙ్కృతమ్. 18

ప్ర. అ. ఇతః = ఇటువైపు, పర్వతస్య = పర్వతమునకు, అవిదూరతః = సమీపమున, మేఘసఙ్కాశమ్ = మేఘముతో సమాన మైనదియు, దర్శనీయమ్ = అందమైనదియు, మృగాకీర్ణమ్ = మృగములచే వ్యాప్త మైనదియు, అతీవ = మిక్కిలి, మనోరమమ్ = మనస్సుకు ఆనందము కలిగించునదియు, వల్గునాదైః = మనోహరమైన ధ్వని గల, నానాప్రకారైః = అనేక విధములైన, శకునైః = పక్షులచేత, అలఙ్కృతమ్ = అలంకరించబడినదియు అగు, వృక్షషణ్డమ్ = వృక్షసముదాయము, భాతి = ప్రకాశించుచున్నది. ఏతత్ = ఇది, కింను = ఏమి ? మే = నాకు, పరమ్ = గొప్ప, కౌతూహలం హి = వేడుక ఉన్నది కదా ?

తా. ఇటు వైపు, పర్వతమునకు కొంచెము దూరమున ఒక వృక్షముల గుంపు మేఘము వలె చూడ ముచ్చటగా నున్నది. ఇది మృగములతో నిండియున్నది. చాల మనోరంజకముగ నున్నది. మధురనాదములు గల నానావిధపక్షులు ఇందు సంచరించు చున్నవి. ఇది ఏమి ? నాకు వినుటకు చాల కుతూహలముగ నున్నది.

మూ. నిస్సృతాః స్మ మునిశ్రేష్ఠ కాన్తారాద్రోమహర్షణాత్,

అనయా త్వవగచ్ఛామి దేశస్య సుఖవత్తయా, 19

సర్వం మే శంస భగవన్ కస్యాశ్రమపదం త్విదమ్.

ప్ర. అ. మునిశ్రేష్ఠ = ఓ మునిశ్రేష్ఠుడా! అనయా = ఈ, దేశస్య = దేశముయొక్క, సుఖవత్తయా = సుఖవంతముగా ఉండుటచేత, రోమహర్షణాత్ = గగుర్పాటు కలిగించు, కాన్తారాత్ = అడవినుండి, నిస్సృతాః = బైటకు వచ్చినాము అని, అవగచ్ఛామి = తెలిసికొనుచున్నాను. ఇదమ్ = ఇది, కస్య = ఎవనియొక్క, ఆశ్రమపదమ్ = ఆశ్రమము ? భగవన్ = పూజ్యుడా! సర్వమ్ = సమస్తమును, మే = నాకు, శంస = చెప్పుము.

తా. ఓ మునిసత్తమా! ఈ ప్రదేశము సుఖకరముగా నుండుటచే భయంకర మైన ఆ అరణ్యమునుండి బైటకు వచ్చినా మని అనుకొనుచున్నాను. ఈ ఆశ్రమ మెవరిది? ఓ పూజ్యుడా! అంతయు నాకు తెలుపుము.

మూ. సంప్రాప్తా యత్ర తే పాపా బ్రహ్మఘ్నా దుష్టచారిణః,

తవ యజ్ఞస్య విఘ్నాయ దురాత్మానో మహామునే. 20

భగవన్ తస్య కో దేశః సా యత్ర తవ యాజ్ఞికీ,

రక్షితవ్యా క్రియా బ్రహ్మన్మయా వధ్యాశ్చ రాక్షసాః, 21

ఏతత్సర్వం మునిశ్రేష్ఠ శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో.

ఉపతస్థుర్మహార్హాణి సర్వాణ్యస్త్రాణి రాఘవమ్. 22

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే అష్టావింశః సర్గః

ప్ర. అ. మహామునే = ఓ మహామునీ! భగవన్ = ఓ పూజ్యుడా! బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణోత్తమా! బ్రహ్మఘ్నాః = బ్రహ్మహత్యచేయువారును, దుష్టచారిణః = దుర్మార్గులును, దురాత్మానః = దుష్టస్వభావులును అగు, తే పాపాః = ఆ పాపాత్ములు, యత్ర = ఎచటికి, తవ = నీయొక్క, యజ్ఞస్య = యజ్ఞముయొక్క, విఘ్నాయ = విఘ్నముకొరకు, సంప్రాప్తాః = వచ్చినారో, తవ = నీయొక్క, యాజ్ఞికీ = యజ్ఞసంబంధమైన, క్రియా = క్రియ, మయా = నాచేత, రక్షితవ్యా = రక్షింపదగి యున్నదో, రాక్షసాః చ = రాక్షసులు కూడ, వధ్యాః = చంపదగి యున్నారో, తస్య దేశః = ఆ యజ్ఞముయొక్క ప్రదేశము, కః = ఏది ? మునిశ్రేష్ఠ = ఓ మునిశ్రేష్ఠుడా! ప్రభో = ఓ సర్వసమర్థుడా! అహమ్ = నేను, ఏతత్సర్వమ్ = ఇది అంతయు, శ్రోతుమ్ = వినుటకు, ఇచ్ఛామి = కోరుచున్నాను.

తా. పూజ్యుడ వైన ఓ మహామునీ! బ్రహ్మహత్య చేయువారును, దుర్మార్గులును, దుష్టస్వభావులును అగు ఆ పాపాత్ములు ఎక్కడకు వచ్చి నీ యజ్ఞమునకు విఘ్నము చేయుచుందురు? నేను నీ యాగమును సంరక్షింపవలసిన ప్రదేశ మేది? నేను రాక్షసుల నెక్కడ చంపవలసి యున్నది? సర్వసమర్థుడ వగు ఓ మునిశ్రేష్ఠా! ఇది యంతయు వినవలె నని కోరుచున్నాను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో ఇరువదియెనిమిదవ సర్గ సమాప్తము.