Chapter_29

Back
Book Balakandamu
Chapter No 35
Pages 8
Read Time 12 Minutes

Chapter_29

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ ఏకోనత్రింశః సర్గః

విశ్వామిత్రుడు శ్రీరామునకు సిద్ధాశ్రమవృత్తాంతము చెప్పుట. రామ లక్ష్మణులతో తన ఆశ్రమము చేరిన విశ్వామిత్రుని అచటి మునులందరును పూజించుట.

మూ. అథ తస్యాప్రమేయస్య తద్వనం పరిపృచ్ఛతః,

విశ్వామిత్రో మహాతేజా వ్యాఖ్యాతుముపచక్రమే. 1

ప్ర. అ. అథ = పిమ్మట, తత్ = ఆ, వనమ్ = వనమును గూర్చి, పరిపృచ్ఛతః = ప్రశ్నించుచున్న, అప్రమేయస్య = అప్రమేయ ప్రభావు డైన, తస్య = ఆ రామునకు, మహాతేజాః = గొప్ప తేజస్సు గల, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, వ్యాఖ్యాతుమ్ = చెప్పుటకు, ఉపచక్రమే = ప్రారంభించెను.

తా. ఆ వనమును గూర్చి, అప్రమేయప్రభావు డగు రాముడు ప్రశ్నింపగా, మహాతేజఃశాలి యగు విశ్వామిత్రుడు చెప్పుట కుపక్రమించెను.

మూ. ఇహ రామ మహాబాహో విష్ణుర్దేవవరః ప్రభుః,

వర్షాణి సుబహూనీహ తథా యుగశతాని చ, 2

తపశ్చరణయోగార్థమువాస సుమహాతపాః.

ప్ర. అ. మహాబాహో = గొప్ప బాహువులు గల, రామ = ఓ రామా! ఇహ = ఇచట, దేవవరః = దేవతలలో శ్రేష్ఠుడును, ప్రభుః = సర్వసమర్థుడును, సుమహాతపాః = గొప్ప తపస్సు గలవాడును అగు, విష్ణుః = విష్ణువు, నుబహూని = అనేకమైన, వర్షాణి = సంవత్సరములను, యుగశతాని చ = వందలకొలది యుగములను, తపశ్చరణయోగార్థమ్ = తపస్సు చేయుటకై, ఉవాస = నివసించెను.

తా. మహాబాహువులు గల ఓ రామా! దేవతాశ్రేష్ఠుడును, సర్వశక్తుడును అగు విష్ణువు, చాల సంవత్సరముల పాటు, వందలకొలది యుగముల పాటు, మహాతపస్సు చేయుచు ఈ వనములో నివసించెను.

మూ. ఏష పూర్వాశ్రమో రామ వామనస్య మహాత్మనః, 3

సిద్ధాశ్రమ ఇతి ఖ్యాతః సిద్ధో హ్యత్ర మహాతపాః.

ప్ర. అ. రామ = రామా! ఏషః = ఇది, మహాత్మనః = మహాత్ము డైన, వామనస్య = వామనునియొక్క, పూర్వాశ్రమః = పూర్వాశ్రమము, సిద్ధాశ్రమః ఇతి = సిద్ధాశ్రమము అని, ఖ్యాతః = ప్రసిద్ధమైనది. హి = ఏలననగా, మహాతపాః = గొప్ప తపస్సు గల కాశ్యపుడు, అత్ర = ఇచట, సిద్ధః = తపస్సిద్ధిని పొందెను.

తా. రామా! ఇది వామనావతారమునకు పూర్వము వామనుడు (విష్ణువు) నివసించిన ఆశ్రమము. ఇచట కాశ్యపుడు తపస్సిద్ధి పొందుటచే దీనికి సిద్ధాశ్రమ మని పేరు.

మూ. ఏతస్మిన్నేవ కాలే తు రాజా వైరోచనిర్బలిః, 4

నిర్జిత్య దైవతగణాన్ సేన్ద్రాంశ్చ సమరుద్గణాన్,

కారయామాస తద్రాజ్యం త్రిషు లేకేషు విశ్రుతః. 5

ప్ర. అ. ఏతస్మిన్ = ఈ, కాలే ఏవ = కాలమునందే, వైరోచనిః = విరోచనునికుమారు డైన, రాజా = రాజైన, బలిః = బలి, సేన్ద్రాన్ = ఇంద్రునితో కూడిన, సమరుద్గణాన్ = మరుత్తుల గణములతో కూడిన, దైవతగణాన్ = దేవతా సముదాయములను, నిర్జిత్య = జయించి, త్రిషు = మూడు, లోకేషు = లోకములయందు, విశ్రుతః = ప్రసిద్ధుడై, తత్ = ఆ, రాజ్యమ్ = రాజ్యమును, కారయామాస = చేసెను.

తా. విష్ణువు ఈ ఆశ్రమములో తపస్సు చేయుచున్న కాలమున, విరోచనుని కుమారు డైన బలిచక్రవర్తి ఇంద్రమరుద్గణాదిసహితముగా దేవతలను జయించి, మూడు లోకములలో ప్రసిద్ధుడై, రాజ్య మేలెను.

మూ. బలేస్తు యజమానస్య దేవాః సాగ్నిపురోగమాః,

సమాగమ్య స్వయం చైవ విష్ణుమూచురిహాశ్రమే. 6

ప్ర. అ. బలేః = బలిచక్రవర్తి, యజమానస్య = యాగము చేయుచుండగా, సాగ్నిపురోగమాః = అగ్నిదేవుడు ముందు గల, దేవాః = దేవతలు, ఇహ = ఈ, ఆశ్రమే = ఆశ్రమమునందు, విష్ణుమ్ = విష్ణువును, స్వయమ్ = స్వయముగ, సమాగమ్య = సమీపించి, ఊచుః = పలికిరి.

తా. బలిచక్రవర్తి యాగము చేయుచుండగా అగ్ని మొదలైన దేవతలు ఈ ఆశ్రమములో నున్న విష్ణువును సమీపించి ఇట్లు పలికిరి.

మూ. బలిర్వైరోచనిర్విష్ణో యజతే యజ్ఞముత్తమమ్,

అసమాప్తే క్రతౌ తస్మిన్స్వకార్యమభిపద్యతామ్. 7

ప్ర. అ. విష్ణో = ఓ విషు! వైరోచనిః = విరోచనుని కుమారు డైన, బలిః = బలిచక్రవర్తి, ఉత్తమమ్ = గొప్ప, యజ్ఞమ్ = యజ్ఞమును, యజతే = చేయుచున్నాడు. తస్మిన్ = ఆ, క్రతౌ = యజ్ఞము, అసమాప్తే = సమాప్తము కాకుండగనే, స్వకార్యమ్ = స్వకార్యము, అభిపద్యతామ్ = సంపాదించబడుగాక.

తా. ఓ విషు! విరోచనుని పుత్రు డైన బలి గొప్ప యజ్ఞము చేయుచున్నాడు. ఆ యజ్ఞము పూర్తి కాక మునుపే స్వకార్యమును, అనగా నీవార మగు మా కార్యమును, సంపాదింపుము.

మూ. యే చైనమభివాఞ్ఛన్తి యాచితార ఇతస్తతః,

యచ్చ యత్ర యథావచ్చ సర్వం తేభ్యః ప్రయచ్ఛతి. 8

ప్ర. అ. యే = ఏ, యాచితారః = యాచకులు, ఇతస్తతః = ఇటునుంచి అటునుంచి, ఏనమ్ = ఈతనిని, అభివాఞ్ఛన్తి = కోరుచున్నారో, యచ్చ = ఏది, యత్ర = ఎచట, యథావచ్చ = ఏ విధముగ ఉన్నదో, సర్వమ్ = దాని నంతను, తేభ్యః = వారలకు, ప్రయచ్ఛతి = ఇచ్చుచున్నాడు.

తా. నలుమూలలనుండి వచ్చిన యాచకులు, ఇతనిని యాచించినచో, ఏది ఎచట, ఏ విధముగ నున్నదో దాని నంతను అచట ఆ విధముగనే ఇచ్చి వేయుచున్నాడు.

మూ. స త్వం సురహితార్థాయ మాయాయోగముపాగతః,

వామనత్వం గతో విష్ణో కురు కల్యాణముత్తమమ్. 9

ప్ర. అ. విష్ణో = ఓ విష్ణూ! సః త్వమ్ = అట్టి నీవు, సురహితార్థాయ = దేవతల హితముకొరకై, మాయాయోగమ్ = మాయాసంబంధమును, ఉపాగతః = పొందినవాడవై, వామనత్వం = వామనత్వమును, గతః = పొందినవాడవై, ఉత్తమమ్ = ఉత్తమమైన, కల్యాణమ్ = కల్యాణమును, కురు = చేయుము.

తా. ఓ విష్ణూ! నీవు దేవతల హితముకొరకై మాయచే వామనరూపము దాల్చి, ఉత్తమమైన కల్యాణకర కార్యమును చేయుము.

మూ. ఏతస్మిన్నన్తరే రామ కాశ్యపోఽగ్నిసమప్రభః,

అదిత్యా సహితో రామ దీప్యమాన ఇవౌజసా. 10

దేవీసహాయో భగవాన్ దివ్యం వర్షసహస్రకమ్,

వ్రతం సమాప్య వరదం తుష్టావ మధుసూదనమ్. 11

ప్ర. అ. రామ = రామా! ఏతస్మిన్ అన్తరే = ఈ మధ్య, అగ్ని సమప్రభః = అగ్నితో సమాన మైన కాంతి గలవాడును, అదిత్యా = అదితితో, సహితః = కూడిన వాడును, ఓజసా = కాంతిచేత, దీప్యమానః ఇవ = మండుచున్నవాడు వలె ఉన్న వాడును, భగవాన్ = భగవంతుడును అగు, కాశ్యపః = కాశ్యపుడు, అదిత్యా = అదితితో, సహితః = కూడినవాడై, దివ్యం వర్షసహస్రకమ్ = వేయి దేవతా సంవత్సరములు, వ్రతమ్ = వ్రతమును, సమాప్య = పూర్తిచేసికొని, వరదమ్ = వరములనిచ్చు, మధుసూదనమ్ = విష్ణువును, తుష్టావ = స్తుతించెను.

తా. రామా! ఇంతలో, అగ్నితో సమాన మైన కాంతి గలవాడు, అదితితో కూడినవాడు, తేజస్సుతో దేదీప్యమానుడు, మాహాత్మ్యము కలవాడును అయిన కాశ్యపుడు వేయి దివ్యవర్షములు చేసిన వ్రతమును భార్యసాహాయ్యముతో పూర్తి చేసికొని, వరదు డైన మహావిష్ణువును స్తుతించెను.

మూ. తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపాత్మకమ్,

తపసా త్వాం సుతప్తేన పశ్యామి పురుషోత్తమమ్. 12

ప్ర. అ. తపోమయమ్ = అత్యధిక మగు తపస్సు కలవాడవు, తపోరాశిమ్ = తపస్సు యొక్క రాశివి, తపోమూర్తిమ్ = తపస్సే మూర్తిగా కలవాడవు, తపాత్మకమ్ = తపఃస్వరూపుడవు, పురుషోత్తమమ్ = పురుషశ్రేష్ఠుడవు అయిన, త్వామ్ = నిన్ను, సుతప్తేన = బాగుగ చేయబడిన, తపసా = తపస్సుచేత, పశ్యామి = చూచుచున్నాను.

తా. ఓ పురుషోత్తమా! నీవు తపోమయుడవు. తపస్సుయొక్క రాశివి. తపస్సు నీ మూర్తి. నీవు తపః స్వరూపుడవు. అట్టి నిన్ను బాగుగ తపస్సు చేసి నేడు నేను చూడగలుగుచున్నాను.

వి. తపశబ్దమునకు జ్ఞాన మని అర్థము గ్రహించి విష్ణువు జ్ఞానమయుడు, జ్ఞానరాశి, జ్ఞానమూర్తి, జ్ఞానస్వరూపుడు అని కొందరు అర్థము చెప్పిరి.

మూ. శరీరే తవ పశ్యామి జగత్సర్వమిదం ప్రభో,

త్వమనాదిరనిర్దేశ్యస్త్వామహం శరణం గతః. 13

ప్ర. అ. ప్రభో = ఓ ప్రభూ! తవ = నీయొక్క, శరీరే = శరీరమునందు, ఇదమ్ = ఈ, సర్వం జగత్ = సకలజగత్తును, పశ్యామి = చూచుచున్నాను. త్వమ్ = నీవు, అనాదిః = ఆదిలేనివాడవు; అనిర్దేశ్యః = వర్ణింప శక్యముకాని వాడవు. అహమ్ = నేను, త్వామ్ = నిన్ను, శరణం గతః = శరణు పొందినాను.

తా. ఓ ప్రభూ! ఈ ప్రపంచము నంతను నీ శరీరములో చూచుచున్నాను. నీకు ఆది లేదు. నీ విట్టివాడ వని వర్ణింప శక్యము కాదు. నిన్ను నేను శరణు జొచ్చుచున్నాను.

మూ. తమువాచ హరిః ప్రీతః కాశ్యపం ధూతకల్మషమ్,

వరం వరయ భద్రం తే వరార్హోఽసి మతో మమ. 14

ప్ర. అ. హరిః = విష్ణువు, ప్రీతః = సంతసించినవాడై, ధూతకల్మషమ్ = తొలగింపబడిన పాపములు గల, తమ్ = ఆ, కాశ్యపమ్ = కాశ్యపుని గూర్చి, ఉవాచ = పలికెను. వరమ్ = వరమును, వరయ = కోరుము, తే = నీకు, భద్రమ్ = క్షేమము అగుగాక. వరార్హః = వరమునకు తగినవాడవుగా, మమ = నాకు, మతః = ఇష్టుడవు, అసి = అయి ఉన్నావు.

తా. విష్ణువు సంతోషించి ఎట్టి పాపములును లేని ఆ కాశ్యపునితో ఇట్లనెను. వరమును కోరుకొనుము. నీకు క్షేమ మగుగాక. నీవు వరము నీయ దగిన వాడ వని నేను నమ్ముచున్నాను.

మూ. తచ్ఛ్రుత్వా వచనం తస్య మారీచః కాశ్యపోఽబ్రవీత్,

అదిత్యా దేవతానాం చ మమ చైవానుయాచతః, 15

వరం వరద సుప్రీతో దాతుమర్హసి సువ్రత.

ప్ర. అ. తస్య = విష్ణువుయొక్క, తత్ వచనమ్ = ఆ వచనమును, శ్రుత్వా = విని, మారీచః = మరీచుని కుమారుడైన, కాశ్యపః = కాశ్యపుడు, అబ్రవీత్ = పలికెను. వరద = వరములనిచ్చువాడా! సువ్రత = మంచి వ్రతము కలవాడా! అదిత్యాః = అదితికిని, దేవతానాం చ = దేవతలకును, అనుయాచతః = వారందరిని అనుసరించి యాచించుచున్న, మమ చ = నాకును, సుప్రీతః = బాగుగ అనుగ్రహించినవాడవై, వరమ్ = వరమును, దాతుమ్ = ఇచ్చుటకు, అర్హసి = తగియున్నావు.

తా. మరీచుని కుమారు డైన కాశ్యపుడు విష్ణువు మాటలు విని ఇట్లు పలికెను. ఓ వరదుడా! మంచి వ్రతము కలవాడా! నీవు అనుగ్రహించి, అదితికిని, దేవతలకును, వారితో పాటు నిన్ను ప్రార్థించుచున్న నాకును వరము నిమ్ము.

మూ. పుత్రత్వం గచ్ఛ భగవన్నదిత్యా మమ చానఘ. 16

భ్రాతా భవ యవీయాంస్త్వం శక్రస్యాసురసూదన,

శోకార్తానాం తు దేవానాం సాహాయ్యం కర్తుమర్హసి. 17

ప్ర. అ. భగవన్ = భగవంతుడా! అనఘ = దోషములు లేనివాడా! అదిత్యాః = అదితికిని, మమ చ = నాకును, పుత్రత్వమ్ = పుత్రత్వమును, గచ్ఛ = పొందుము. అసురసూదన = అసురసంహారము చేయువాడా! త్వమ్ = నీవు, శక్రస్య = దేవేంద్రునకు, యవీయాన్ = చిన్నవాడైన, భ్రాతా = సోదరుడవుగా, భవ = అగుము. శోకార్తానామ్ = శోకముచే ఆర్తులైన, దేవానామ్ = దేవతలకు, సాహాయ్యమ్ = సాహాయ్యమును, కర్తుమ్ = చేయుటకు, అర్హసి = తగి యున్నావు.

తా. ఓ భగవంతుడా! దోషరహితుడా! అదితికిని, నాకును పుత్రుడవగుము. ఓ శత్రుసూదనా! దేవేంద్రునకు తమ్ముడ వగుము. శోకపీడితు లైన దేవతలకు సాహాయ్యము చేయుము.

మూ. అయం సిద్ధాశ్రమో నామ ప్రసాదాత్తే భవిష్యతి,

సిద్ధే కర్మణి దేవేశ ఉత్తిష్ఠ భగవన్నితః. 18

ప్ర. అ. దేవేశ = ఓ దేవతాప్రభూ! కర్మణి = నా తపస్సు, సిద్ధే = సఫలమైన దగుచుండగా, అయమ్ = ఇది, తే = నీయొక్క, ప్రసాదాత్ = అనుగ్రహమువలన, సిద్ధాశ్రమో నామ = సిద్ధాశ్రమ మను పేరు గలది, భవిష్యతి = కాగలదు. భగవన్ = ఓ భగవంతుడా! ఇతః = ఇచటినుండి, ఉత్తిష్ఠ = లెమ్ము.

తా. నీవు నాకు పుత్రుడవుగ జనించుటచే నా తపస్సు సఫలము కాగానే ఇది నీ అనుగ్రహమువలన సిద్ధాశ్రమ మను పేరు గలది కాగలదు. భగవంతుడా! ఇచటి నుండి లెమ్ము. నా పుత్రుడవు అగుము.

మూ. అథ విష్ణుర్మహాతేజా అదిత్యాం సమజాయత,

వామనం రూపమాస్థాయ వైరోచనిముపాగమత్. 19

ప్ర. అ. అథ = పిమ్మట, మహాతేజాః = గొప్ప తేజస్సు గల, విష్ణుః = విష్ణువు, అదిత్యామ్ = అదితియందు, సమజాయత = పుట్టెను. వామనం రూపమ్ = వామన రూపమును, ఆస్థాయ = ధరించి, వైరోచనిమ్ = బలిచక్రవర్తిని, ఉపాగమత్ = సమీపించెను.

తా. అంత విష్ణువు అదితిపుత్రుడుగ జనించి, వామనరూపము ధరించి, బలిచక్రవర్తి వద్దకు వెళ్లెను.

మూ. త్రీన్ క్రమానథ భిక్షిత్వా ప్రతిగృహ్య చ మానదః,

ఆక్రమ్య లోకాన్ లోకాత్మా సర్వభూతహితే రతః. 20

మహేన్ద్రాయ పునః ప్రాదాన్నియమ్య బలిమోజసా,

త్రైలోక్యం స మహాతేజాశ్చక్రే శక్రవశం పునః. 21

ప్ర. అ. అథ = పిమ్మట, మానదః = మానమును ఇచ్చువాడును, లేదా అభిమానమును తొలగించువాడును, లోకాత్మా = లోకస్వరూపుడును, సర్వభూతహితే = సమస్తభూతముల హితమునందు, రతః = ఆసక్తి కలవాడును అగు విష్ణువు, త్రీన్ = మూడు, క్రమాన్ = అడుగులను, భిక్షిత్వా = యాచించి, ప్రతిగృహ్య చ = స్వీకరించి, లోకాన్ = లోకములను, ఆక్రమ్య = ఆక్రమించి, బలిమ్ = బలిని, ఓజసా = తేజస్సుచేత, నియమ్య = బంధించి, మహేన్ద్రాయ = మహేంద్రునకు, పునః = మరల, ప్రాదాత్ = ఇచ్చెను. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, సః = ఆ విష్ణువు, త్రైలోక్యమ్ = మూడు లోకములను, పునః = మరల, శక్రవశమ్ = ఇంద్రునికి వశ మైన దానినిగా, చక్రే = చేసెను.

తా. గౌరవమును ఇచ్చువాడును, లేదా అభిమానమును తొలగించువాడును, సర్వలోకస్వరూపుడును, సర్వభూతములకును హితమును చేయుటయందు ఆసక్తి కలవాడును అగు ఆ విష్ణువు, మూడు అడుగులు యాచించి, వాటిని ప్రతిగ్రహించి, మూడు లోకములను ఆక్రమించి, పరాక్రమముచే బలిని బంధించి, మరల మహేంద్రునకు ఇచ్చెను. ఈ విధముగ మహాతేజఃశాలి యగు ఆ విష్ణువు, త్రైలోక్యమును మరల దేవేంద్రుని వశ మగు నట్లు చేసెను.

మూ. తేనైష పూర్వమాక్రాన్త ఆశ్రమః శ్రమనాశనః,

మయాపి భక్త్యా తస్యైష వామనస్యోపభుజ్యతే. 22

ప్ర. అ. శ్రమనాశనః = శ్రమను తొలగించు, ఏషః = ఈ, ఆశ్రమః = ఆశ్రమము, తేన = ఆ వామనునిచేత, పూర్వమ్ = పూర్వము, ఆక్రాన్తః = అధిష్ఠింప బడినది. తస్య = ఆ, వామనస్య = వామనునియొక్క, భక్త్యా = భక్తి చేత, మయాపి = నాచేత కూడ, ఏషః = ఆ ఆశ్రమము, ఉపభుజ్యతే = అనుభవింపబడు చున్నది.

తా. పూర్వము వామనుడు శ్రమను తొలగించు ఈ ఆశ్రమములో ఉండెడివాడు. వామనునిపై నున్న భక్తిచేత నేను కూడ ఈ ఆశ్రమములో నివసించు చున్నాను.

మూ. ఏతమాశ్రమమాయాన్తి రాక్షసా విఘ్నకారిణః,

అత్రైవ పురుషవ్యాఘ్ర హన్తవ్యా దుష్టచారిణః. 23

ప్ర. అ. పురుషవ్యాఘ్ర = ఓ పురుషశ్రేష్ఠుడా! విఘ్నకారిణః = విఘ్నములు చేయు, రాక్షసాః = రాక్షసులు, ఏతమ్ = ఈ, ఆశ్రమమ్ = ఆశ్రమమును గూర్చి, ఆయాన్తి = వచ్చుచున్నారు. దుష్టచారిణః = ఆ దుర్మార్గులు, అత్రైవ = ఇచటనే, హన్తవ్యాః = చంపదగినవారు.

తా. ఓ పురుషశ్రేష్ఠుడా! యజ్ఞమునకు విఘ్నము చేయు రాక్షసులు ఈ ఆశ్రమమునకే వచ్చుచున్నారు. వారిని ఇక్కడనే చంపవలసి యున్నది.

మూ. అద్య గచ్ఛామహే రామ సిద్ధాశ్రమమనుత్తమమ్,

తదాశ్రమపదం తాత తవాప్యేతద్యథా మమ. 24

ప్ర. అ. రామ = రామా!, అద్య = ఇపుడు, అనుత్తమమ్ = అత్యుత్తమ మైన, సిద్ధాశ్రమమ్ = సిద్ధాశ్రమమును గూర్చి, గచ్ఛామహే = వెళ్లుదము. తాత = నాయనా!, తత్ = ఆ, ఏతత్ = ఈ, ఆశ్రమపదమ్ = ఆశ్రమము, మమ = నాకు, యథా = ఎట్లో, తవాపి = నీకును, తథా = అట్లే.

తా. రామా! ఇపుడు ఆ అత్యుత్తమ మైన సిద్ధాశ్రమములో ప్రవేశించెదము. నాయనా! ఈ ఆశ్రమము నా కెట్లో నీకును అట్లే.

వి. ఇపుడు నేనిచట నుండి తపస్సు చేయుటచే ఇది నాకు సొంతమైనది. వామనావతారమునకు పూర్వము నీవు కూడ తపస్సు చేసిన ఆశ్రమమే కాన ఇది నీకును సొంతమే అని భావము (తిలకవ్యాఖ్య)

మూ. ప్రవిశన్నాశ్రమపదం వ్యరోచత మహామునిః,

శశీవ గతనీహారః పునర్వసుసమఞ్చితః. 25

ప్ర. అ. ఆశ్రమపదమ్ = ఆశ్రమమును, ప్రవిశన్ = ప్రవేశించుచున్న, మహామునిః = మహాముని, గతనీహారః = మంచు తొలగిపోయిన, పునర్వుసుసమఞ్చితః = పునర్వసునక్షత్రములతో కూడిన, శశీవ = చంద్రుడు వలె, వ్యరోచత = ప్రకాశించెను.

తా. రామలక్ష్మణులతో ఆశ్రమములోనికి ప్రవేశించుచున్న విశ్వామిత్ర మహాముని, మంచు తొలగి పునర్వసు నక్షత్రములతో కూడిన చంద్రుడు వలె ప్రకాశించెను.

మూ. తం దృష్ట్వా మునయః సర్వే సిద్ధాశ్రమనివాసినః,

ఉత్పత్యోత్పత్య సహసా విశ్వామిత్రమపూజయన్. 26

ప్ర. అ. సిద్ధాశ్రమివాసినః = సిద్ధాశ్రమమునందు నివసించుచున్న, మునయః = మునులు, సర్వే = అందరును, తమ్ = ఆతనిని, దృష్ట్వా = చూచి, ఉత్పత్య = ఎగిరి, సహసా = శీఘ్రముగా, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని, అపూజయన్ = పూజించిరి.

తా. సిద్ధాశ్రమములో నివసించు మును లందరును విశ్వామిత్రుని చూచి, తొందరగా పరుగెత్తి వెళ్లి అతనిని పూజించిరి.

మూ. యథార్హం చక్రిరే పూజాం విశ్వామిత్రాయ ధీమతే,

తథైవ రాజపుత్రాభ్యామకుర్వన్నతిథిక్రియామ్. 27

ప్ర. అ. ధీమతే = బుద్ధిమంతు డైన, విశ్వామిత్రాయ = విశ్వామిత్రునకు, యథార్హమ్ = తగు విధముగా, పూజామ్ = పూజను, చక్రిరే = చేసిరి. తథైవ = అట్లే, రాజపుత్రాభ్యామ్ = రాజపుత్రులకు, అతిథిక్రియామ్ = అతిథిసత్కారమును, అకుర్వన్ = చేసిరి.

తా. ధీమంతు డగు విశ్వామిత్రునకు తగు విధముగ పూజ చేసిరి. అట్లే రాజపుత్రులకు కూడ అతిథిపూజ చేసిరి.

మూ. ముహూర్తమథ విశ్రాన్తౌ రాజపుత్రావరిన్దమౌ,

ప్రాఞ్జలీ మునిశార్దూలమూచతూ రఘునన్దనౌ. 28

ప్ర. అ. అథ = పిమ్మట, అరిన్దమౌ = శత్రువులను పీడించువారును, రాజపుత్రౌ = దశరథ మహారాజపుత్రులును అగు, రఘునన్దనౌ = రామలక్ష్మణులు, ముహూర్తమ్ = క్షణకాలము పాటు, విశ్రాన్తౌ = విశ్రమించినవారై, ప్రాఞ్జలీ = కట్టబడిన దోసిళ్లు కలవారై, మునిశార్దూలమ్ = మునిశ్రేష్ఠు డైన విశ్వామిత్రునిగూర్చి, ఊచతుః = పలికిరి.

తా. పిమ్మట, శత్రుసంహారకు లైన రామలక్ష్మణులు క్షణకాలము విశ్రాంతి తీసికొని విశ్వామిత్రునకు నమస్కరించి ఇట్లు పలికిరి.

మూ. అద్యైవ దీక్షాం ప్రవిశ భద్రం తే మునిపుఙ్గవ,

సిద్ధాశ్రమోఽయం సిద్ధః స్యాత్సత్యమస్తు వచస్తవ. 29

ప్ర. అ. మునిపుఙ్గవ = ఓ మునిశ్రేష్ఠా! అద్యైవ = ఈ నాడే, దీక్షామ్ = దీక్షను, ప్రవిశ = ప్రవేశించుము. తే = నీకు, భద్రమ్ = క్షేమ మగుగాక. అయమ్ = ఈ, సిద్ధాశ్రమః = సిద్ధాశ్రమము, సిద్ధః = సిద్ధికలది, స్యాత్ = అగుగాక. తవ = నీయొక్క, వచః = వాక్యము, సత్యమ్ అస్తు = సత్య మగుగాక.

తా. ఓ! మునిశ్రేష్ఠా! ఈ రోజుననే యజ్ఞదీక్షలో ప్రవేశింపుము. నీకు క్షేమ మగుగాక. ఈ సిద్ధాశ్రమము సిద్ధిప్రదమై సార్థకనామధేయ మగుగాక. నీ వచనము సత్య మగుగాక.

మూ. ఏవముక్తో మహాతేజా విశ్వామిత్రో మహాన్ ఋషిః,

ప్రవివేశ తదా దీక్షాం నియతో నియతేన్ద్రియః. 30

ప్ర. అ. ఏవమ్ = ఈ విధముగా, ఉక్తః = పలకబడిన, మహాతేజాః = గొప్పతేజస్సు గల, విశ్వామిత్రః మహాన్ ఋషిః = విశ్వామిత్రమహర్షి, తదా = అప్పుడు, నియతః = నియమము అవలంబించిన వాడై, నియతేన్ద్రియః = నిగ్రహింపబడిన ఇంద్రియములు కలవాడై, దీక్షామ్ = దీక్షను, ప్రవివేశ = ప్రవేశించెను.

తా. మహాతేజఃశాలి యైన విశ్వామిత్రమహర్షి వారి వాక్యము విని, నియమము నవలంబించి, ఇంద్రియములను నిగ్రహించి యజ్ఞదీక్షలో ప్రవేశించెను.

మూ. కుమారావపి తాం రాత్రిముషిత్వా సుసమాహితౌ,

ప్రభాతకాలే చోత్థాయ పూర్వాం సన్ధ్యాముపాస్య చ, 31

స్పృష్టోదకౌ శుచీ జప్యం సమాప్య నియమేన చ.

హుతాగ్నిహోత్రమాసీనం విశ్వామిత్ర మవన్దతామ్. 32

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే ఏకోనత్రింశః సర్గః

ప్ర. అ. కుమారౌ అపి = రామలక్ష్మణులు కూడ, తామ్ = ఆ, రాత్రిమ్ = రాత్రి, సుసమాహితౌ = చాల సావధానచిత్తులుగ, ఉషిత్వా = ఉండి, ప్రభాతకాలే = ప్రాతఃకాలమునందు, ఉత్థాయ = లేచి, స్పృష్టోదకౌ = స్పశింపబడిన ఉదకము కలవారై, శుచీ = పవిత్రులై, పూర్వాం సన్ధ్యామ్ = ప్రాతఃకాలముసంధ్యను, ఉపాస్య = ఉపాసించి, నియమేన = నియమపూర్వకముగ, జప్యమ్ = మంత్రజపమును, సమాప్య = పూర్తిచేసి, హుతాగ్ని హోత్రమ్ = అగ్నిహోత్రమును చేసిన, ఆసీనమ్ = కూర్చున్న, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని, అవన్దతామ్ = నమస్కరించిరి.

తా. రామలక్ష్మణులు ఆ రాత్రి యంతయు సావధానచిత్తులై ఉండి, ప్రాతఃకాలమున లేచి, ఆచమనము చేసి, ప్రాతఃకాలసంధ్య నుపాసించి, నియమ పూర్వకముగ గాయత్య్రాదిమంత్రముల జపము చేసి, అగ్నిహోత్రము చేసికొని ఉపవిష్టుడై యున్న విశ్వామిత్రుని సమీపించి నమస్కరించిరి.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,

బాలకాండలో ఇరువదితొమ్మిదవ సర్గ సమాప్తము.