| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 36 |
| Pages | 7 |
| Read Time | 10 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ త్రింశః సర్గః
శ్రీరాముడు రాక్షసులను సంహరించి విశ్వామిత్రుని యాగమును సంరక్షించుట.
మూ. అథ తౌ దేశకాలజ్ఞౌ రాజపుత్రావరిన్దమౌ,
దేశే కాలే చ వాక్యజ్ఞావబ్రూతాం కౌశికం వచః. 1
ప్ర. అ. అథ = పిమ్మట, దేశకాలజ్ఞౌ = దేశకాలములను ఎరిగినవారును, అరిన్దమౌ = శత్రు సంహారకులును, దేశే = దేశమునందును, కాలే చ = కాలము నందును, వాక్యజ్ఞౌ = వాక్యములను ఎరిగినవారును అగు, తౌ = ఆ, రాజపుత్రౌ = రామలక్ష్మణులు, కౌశికమ్ = విశ్వామిత్రునిగూర్చి, వచః = వాక్యమును, అబ్రూతామ్ = పలికిరి.
తా. పిమ్మట, ఏ దేశమునందు ఏ కాలమునందు ఎట్లు మసలుకొనవలెనో తెలిసినారును, శత్రుసంహారసమర్థులును, ఏ దేశమునందు, ఏ కాలమునందు ఎట్లు మాటలాడవలెనో తెలిసినవారును అగు రామలక్ష్మణులు విశ్వామిత్రునితో ఇట్లు పలికిరి.
మూ. భగవన్ శ్రోతుమిచ్ఛావో యస్మిన్ కాలే నిశాచరౌ,
సంరక్షణీయౌ తౌ బ్రహ్మన్ నాతివర్తేత తత్ క్షణమ్. 2
ప్ర. అ. భగవన్ = మాహాత్మ్యము గల, బ్రహ్మన్ = ఓ బ్రహ్మర్షీ, తౌ = ఆ, నిశాచరౌ = రాక్షసులు, యస్మిన్ కాలే = ఏకాలమునందు, సంరక్షణీయౌ = రక్షింపదగినవారో, శ్రోతుమ్ = వినుటకు, ఇచ్ఛావః = ఇచ్ఛయించుచున్నాము. తత్ = ఆ, క్షణమ్ = క్షణము, నాతివర్తేత = దాటిపోగూడదు.
తా. మహామహిమ గల ఓ బ్రహ్మర్షీ! ఆ రాక్షసులనుండి ఎపుడు రక్షింప వలెనో వినగోరుచున్నాము. ఆ కాలము దాటిపోగూడదు కదా ?
వి. ‘‘సంరక్షణీయౌ’’ అను పదమునకు రక్షింపదగినవారు అని అర్థము. రాక్షసులు సంరక్షణీయులు కాదు. అందుచేత కొందరు వ్యాఖ్యాతలు విపరీత లక్షణచేత ‘‘చంప దగినవారు’’ అని గాని, రక్షణ మనగా ఇష్టప్రాప్తి అనిష్టనివృత్తి గాన ఇచట అనిష్టనివృత్తి అను అర్థమును గాని గ్రహింపవె నని చెప్పినారు (గోవిందరాజులు). తిలకవ్యాఖ్యలో ‘‘యజ్ఞరక్షణమునకై నివారింపదగినవారు’’ అను అర్థము చెప్పబడినది. కాని ‘‘కృత్యల్యుటో బహులమ్’’ అను సూత్రముచే- ‘‘స్నాన్త్యనేనేతి స్నానీయం చూర్ణమ్’’ ‘‘దీయతే అస్మై దానీయః విప్రః’’ ఇత్యాదులలో కరణసంప్రదానార్థాలలో ‘‘అనీయర్’’ ప్రత్యయము వచ్చినట్లు, ‘‘రక్షన్తి ఆభ్యామితి రక్షణీయౌ’’ అనగా ‘‘ఎవరినుండి రక్షింతురో వారు’’ అను అపాదానార్థములో అనీయర్ ప్రత్యయము వచ్చిన దని సమర్థింపవచ్చును.
మూ. ఏవం బ్రువాణౌ కాకుత్స్థౌ త్వరమాణౌ యుయుత్సయా,
సర్వే తే మునయః ప్రీతాః ప్రశశంసుర్నృపాత్మజౌ. 3
ప్ర. అ. ఏవమ్ = ఈ విధముగా, బ్రువాణౌ = పలుకుచున్న, యుయుత్సయా = యుద్ధముచేయ వలె ననెడు ఇచ్ఛచేత, త్వరమాణౌ = తొందరపడుచున్న, నృపాత్మజౌ = రాజకుమారులను, తే = ఆ, మునయః = మునులు, సర్వే = అందరును, ప్రీతాః = సంతసించిన వారై, ప్రశశంసుః = ప్రశంసించిరి.
తా. ఈ విధముగ పలుకుచు, యుద్ధము చేయుటకై తొందరపడుచున్న ఆ రామలక్ష్మణులను ఆ మును లందరును సంతసించిన వారై ప్రశంసించిరి.
మూ. అద్యప్రభృతి షడ్రాత్రం రక్షతం రాఘవౌ యువామ్,
దీక్షాం గతో హ్యేష మునిర్మౌనిత్వం చ గమిష్యతి. 4
ప్ర. అ. రాఘవౌ = రామలక్ష్మణులారా! యువామ్ = మీరు, అద్యప్రభృతి = నేడు మొదలు, షడ్రాత్రమ్ = ఆరు రాత్రులు, రక్షతమ్ = రక్షించుడు. ఏషః = ఈ, మునిః = ముని, దీక్షామ్ = దీక్షను, గతః = పొందినాడు. మౌనిత్వం చ = మౌనమును కూడ, గమిష్యతి = పొందగలడు.
తా. రామలక్ష్మణులారా! నేడు మొదలు ఆరు రాత్రులు మీరు యాగ రక్షణము చేయుడు. విశ్వామిత్రమహర్షి దీక్ష వహించినాడు గాన మౌనమును పాటించును.
మూ. తౌ తు తద్వచనం శ్రుత్వా రాజపుత్రౌ యశస్వినౌ,
అనిద్రౌ షడహోరాత్రం తపోవనమరక్షతామ్. 5
ప్ర. అ. యశస్వినౌ = కీర్తి గల, తౌ = ఆ, రాజపుత్రౌ = రాజకుమారులు, తత్ = ఆ, వచనమ్ = వచనమును, శ్రుత్వా = విని, షడహోరాత్రమ్ = ఆరు రేయింబవళ్లు, అనిద్రౌ = నిద్ర లేనివారై, తపోవనమ్ = తపోవనమును, అరక్షతామ్ = రక్షించిరి.
తా. కీర్తిమంతు లైన రామలక్ష్మణులు వారి వాక్యము విని, ఆరు రేయింబవళ్లు, నిద్ర లేని వారై, ఆ తపోవనమును రక్షించిరి.
మూ. ఉపాసాఞ్చక్రతుర్వీరౌ యత్తౌ పరమధన్వినౌ,
రరక్షతుర్మునివరం విశ్వామిత్రమరిన్దమౌ. 6
ప్ర. అ. పరమధన్వినౌ = గొప్ప ధనుర్ధరులైన, వీరౌ = ఆ వీరులు, యత్తౌ = సన్నద్ధులై, ఉపాసాఞ్చక్రతుః = సమీపముననే ఉండిరి. అరిన్దమౌ = శత్రుసంహారకులైన వారు, విశ్వామిత్రం మునివరమ్ = విశ్వామిత్రమహర్షిని, రరక్షతుః = రక్షించిరి.
తా. ధనుర్ధరు లైన ఆ వీరులు సన్నద్ధులై ఆ విశ్వామిత్రుని సమీపముననే ఉండి ఆ మునిశ్రేష్ఠుని రక్షించిరి.
మూ. అథ కాలే గతే తస్మిన్ షష్ఠేఽహని సమాగతే,
సౌమిత్రిమబ్రవీద్రామో యత్తో భవ సమాహితః. 7
ప్ర. అ. అథ = పిమ్మట, తస్మిన్ = ఆ, కాలే = కాలము, గతే = కడచిన దగుచుండగా, షష్ఠే = ఆరవ, అహని = దివసము, సమాగతే = వచ్చిన దగుచుండగా, రామః = రాముడు, సౌమిత్రిమ్ = లక్ష్మణుని గూర్చి, యత్తః = సన్నద్ధుడవై, సమాహితః = ఏమరిపాటు లేనివాడవై, భవ = ఉండుము, అని, ఉవాచ = పలికెను.
తా. అయిదు దివసములు కడచి ఆరవ దివసము వచ్చినది. అపుడు రాముడు లక్ష్మణునితో - ‘‘సన్నద్ధుడవై, అప్రమత్తుడవై ఉండుము’’ అని పలికెను.
మూ. రామస్యైవం బ్రువాణస్య త్వరితస్య యుయుత్సయా,
ప్రజజ్వాల తతో వేదిః సోపాధ్యాయపురోహితా. 8
ప్ర. అ. యుయుత్సయా = యుద్ధము చేయవలె నను అభిలాషచే, త్వరితస్య = తొందరపడుచున్న, రామస్య = రాముడు, ఏవమ్ = ఈ విధముగా, బ్రువాణస్య = పలుకుచుండగా, తతః = పిమ్మట, సోపోధ్యాయ పురోహితా = ఋత్విక్కులతోను పురోహితునితోను కూడిన, వేదిః = వేది, ప్రజజ్వాల = ప్రజ్వలించెను.
తా. రాముడు యుద్ధాభిలాషతో తొందరపడుచు ఈ విధముగా పలుకుచుండగనే, ఋత్విక్కులతోను, పురోహితునితోను కూడిన యజ్ఞవేదిక భగ్గున మండెను.
మూ. సదర్భచమసస్రుక్కా ససమిత్కుసుమోచ్చయా,
విశ్వామిత్రేణ సహితా వేదిర్జజ్వాల సర్త్విజా. 9
ప్ర. అ. సదర్భచమసస్రుక్కా = దర్భలతోను, చమసములతోను (పానపాత్రలు) స్రుక్కులతోను (హోమము చేయు గరిటెలు) కూడినదియు, ససమిత్కుసుమోచ్చయా = సమిధలతోను పుష్పసముదాయముతోను కూడినదియు, విశ్వామిత్రేణ = విశ్వామిత్రునితో, సహితా = కూడినదియు, సర్త్విజా = ఋత్విక్కులతో కూడినదియు అగు, వేదిః = వేది, జజ్వాల = ప్రజ్వలించెను.
తా. దర్భలతో, చమసములతో, స్రుక్కులతో, సమిధలతో, పుష్పసముదాయముతో, విశ్వామిత్రునితో, ఋత్విక్కులతో కూడిన వేది జ్వలించినది.
వి. యాగవేది హఠాత్తుగా జ్వలించుట ఉత్పాతము. అనగా రాబోవు ఆపదను సూచించునది.
మూ. మన్త్రవచ్చ యథాన్యాయం యజ్ఞోఽసౌ సంప్రవర్తతే,
ఆకాశే చ మహాన్ శబ్దః ప్రాదురాసీద్భయావహః. 10
ప్ర. అ. అసౌ = ఈ, యజ్ఞః = యజ్ఞము, మన్త్రవత్ = మంత్రపూర్వకముగాను, యథాన్యాయమ్ = శాస్త్రానుసారముగాను, సంప్రవర్తతే = జరుగుచుండెను. ఆకాశే = ఆకాశమునందు, భయావహః = భయమును కలిగించు, మహాన్ శబ్దః = గొప్ప ధ్వని, ప్రాదురాసీత్ = పుట్టెను.
తా. ఆ యజ్ఞము మంత్రపూర్వకముగాను, శాస్త్రానుసారముగాను జరుగుచుండెను. ఇంతలో, ఆకాశమునందు, భయంకర మైన ఒక శబ్దము వినబడెను.
మూ. ఆవార్య గగనం మేఘో యథా ప్రావృషి నిర్గతః,
తథా మాయాం వికుర్వాణౌ రాక్షసావభ్యధావతామ్ 11
ప్ర. అ. ప్రావృషి = వర్షాకాలమునందు, నిర్గతః = బయలుదేరిన, మేఘః = మేఘము, యథా = ఎట్లో, తథా = అట్లు, గగనమ్ = ఆకాశమును, ఆవార్య = కప్పివేసి, రాక్షసౌ = రాక్షసులు, మాయామ్ = మాయను, వికుర్వాణౌ = చేయుచు, అభ్యధావతామ్ = పరుగెత్తివచ్చిరి.
తా. వర్షాకాలమున బయలుదేరిన మేఘము వలె ఆకాశమును ఆవరించి, మారీచసుబాహువులు, మాయావికారములను చూపుచు పరుగెత్తి వచ్చిరి.
మూ. మారీచశ్చ సుబాహుశ్చ తయోరనుచరాశ్చ యే,
ఆగమ్య భీమసఙ్కాశౌ రుధిరౌఘమవాసృజన్. 12
ప్ర. అ. భీమసఙ్కాశౌ = భయంకరు లైన, మారీచశ్చ = మారీచుడును, సుబాహుశ్చ = సుబాహువు, తయోః = వారిద్దరియొక్క, యే = ఏ, అనుచరాః = అనుచరులు గలరో వారును, ఆగమ్య = వచ్చి, రుధిరౌఘమ్ = రక్తప్రవాహమును, ఆవాసృజన్ = వర్షించిరి.
తా. భయంకరు లైన మారీచబాహువులును, వారి అనుచరులును వచ్చి రక్త ప్రవాహమును వర్షించిరి.
మూ. సా తేన రుధిరౌఘేణ వేదిర్జజ్వాల మణ్డితా,
సహసాభిద్రుతో రామస్తావపశ్యత్తతో దివి. 13
ప్ర. అ. తేన = ఆ, రుధిరౌఘేణ = రక్తప్రవాహముచేత, మణ్డితా = నింపబడిన, సా = ఆ, వేదిః = వేది, జజ్వాల = ప్రజ్వలించెను. తతః = పిమ్మట, సహసా = శీఘ్రముగా, అభిద్రుతః = ఎదురుగా పరుగెత్తి వచ్చిన, రామః = రాముడు, దివి = ఆకాశమునందు, తాన్ = వారిని, అపశ్యత్ = చూచెను.
తా. రక్తప్రవాహముచే నింపబడిన ఆ వేది ప్రజ్వరిల్లెను. అంతలో, శీఘ్రముగ పరుగెత్తి వచ్చిన రాముడు ఆకాశమునందు ఆ రాక్షసులను చూచెను.
మూ. తావాపతన్తౌ సహసా దృష్ట్వా రాజీవలోచనః,
లక్ష్మణం త్వభిసంప్రేక్ష్య రామో వచనమబ్రవీత్. 14
ప్ర. అ. రాజీవలోచనః = పద్మములవంటి నేత్రములు గల, రామః = రాముడు, సహసా = శీఘ్రముగా, ఆపతన్తౌ = వచ్చిపడుచున్న, తౌ = వారిని, దృష్ట్వా = చూచి, లక్ష్మణమ్ = లక్ష్మణుని, అభిసంప్రేక్ష్య = చూచి, వచనమ్ = వచనమును, అబ్రవీత్ = పలికెను.
తా. కమలలోచను డైన రాముడు శీఘ్రముగ వచ్చి పడుచున్న ఆ మారీచ సుబాహువులను చూచి, లక్ష్మణునితో ఇట్లనెను.
మూ. పశ్య లక్ష్మణ దుర్వృత్తాన్ రాక్షసాన్ పిశితాశనాన్,
మానవాస్త్రసమాధూతాననిలేన యథా ఘనాన్. 15
ప్ర. అ. లక్ష్మణ = ఓ లక్ష్మణా! దుర్వృత్తాన్ = చెడ్డ నడవడిక కలవారును, పిశితాశనాన్ = నరమాంసమే ఆహారముగా కలవారును అగు, రాక్షసాన్ = రాక్షసులను, అనిలేన = వాయువు చేత, ఘనాన్ యథా = మేఘములను వలె, మానవాస్త్ర సమాధూతాన్ = మానవాస్త్రముచే ఎగురగొట్టబడుచుండగా, పశ్య = చూడుము.
తా. లక్ష్మణా! దుర్మార్గులును, నరమాంసభక్షకులును అగు ఈ రాక్షసులను, వాయువు మేఘములను ఎగురగొట్టినట్లు, మానవాస్త్రముచే ఎగురగొట్టి వేయుచున్నాను; చూడుము.
మూ. మానవం పరమోదారమస్త్రం పరమభాస్వరమ్,
చిక్షేప పరమక్రుద్ధో మారీచోరసి రాఘవః. 16
ప్ర. అ. రాఘవః = రాముడు, పరమోదారమ్ = చాల గొప్పదియు, పరమ భాస్వరమ్ = ఎక్కువ ప్రకాశించుచున్నదియు అగు, మానవమ్ అస్త్రమ్ = మానవాస్త్రమును, పరమక్రుద్ధః = చాల కోపగించినవాడై, మారీచోరసి = మారీచుని వక్షఃస్థలముపై, చిక్షేప = విసరెను.
తా. రాముడు చాల కోపించి, మంచి సామర్థ్యము కలదియు, మిక్కిలి ప్రకాశించు చున్నదియు అగు మానవాస్త్రమును మారీచుని వక్షఃస్థలము పై ప్రయోగించెను.
మూ. స తేన పరమాస్త్రేణ మానవేన సమాహతః,
సంపూర్ణం యోజనశతం క్షిప్తః సాగరసంప్లవే. 17
ప్ర. అ. తేన = ఆ, మానవేన = మానవ మనెడు, పరమాస్త్రేణ = గొప్ప అస్త్రముచేత, సమాహతః = కొట్టబడిన, సః = ఆ మారీచుడు, సంపూర్ణం = పూర్తిగా, యోజనశతమ్ = నూరు యోజనముల దూరము, సాగరసంప్లవే = పొర్లుచున్న సముద్రజలమునందు, క్షిప్తః = విసిరివేయబడెను.
తా. గొప్పదైన ఆ మానవాస్త్రముచేత కొట్టబడినవాడై ఆ మారీచుడు పూర్తిగ నూరు యోజనముల దూరములో సముద్రజలపూరమునందు పడవేయబడెను.
వి.‘‘స తేన’’ అను చోట ‘స’ అనునది గాయత్రీమంత్ర ద్వితీయాక్షరము. వెయ్యి శ్లోకములు పూర్తియైన తరువాత ద్వితీయ సహస్ర ప్రారంభ శ్లోకమున నిక్షిప్త మైనది.
మూ. విచేతనం విఘూర్ణన్తం శీతేషుబలతాడితమ్,
నిరస్తం దృశ్య మారీచం రామో లక్ష్మణమబ్రవీత్. 18
ప్ర. అ. శీతేషుబలతాడితమ్ = ఆ చల్లని అస్త్రముచే కొట్టబడినవాడును, విచేతనమ్ = చైతన్యము కోల్పోయినవాడును, విఘూర్ణన్తమ్ = తిరిగి పోవుచున్నవాడును, నిరస్తమ్ = దూరమున పడవేయబడినవాడును అగు, మారీచమ్ = మారీచుని, దృశ్య = చూచి, రామః = రాముడు, లక్ష్మణమ్ = లక్ష్మణునిగూర్చి, అబ్రవీత్ = పలికెను.
తా. ఆ చల్లని బాణముచేత కొట్టబడి, చైతన్యము కోల్పోయి, గిఱ్ఱున తిరిగిపోవుచు దూరముగా పడవేయబడిన ఆ మారీచుని చూచి, రాముడు లక్ష్మణునితో ఇట్లనెను.
వి. మానవాస్త్రము సంధించిన బాణము శత్రువును చంపక, చైతన్య రహితుని చేయుటచే అది శీతేషు వని చెప్పబడినది.
మూ. పశ్య లక్ష్మణ శీతేషుం మానవం ధర్మసంహితమ్,
మోహయిత్వా నయత్యేనం న చ ప్రాణైర్వ్యయుజ్యత. 19
ప్ర. అ. లక్ష్మణ = లక్ష్మణా! ధర్మసంహితమ్ = ధర్మముతోకూడిన, మానవం శీతేషుమ్ = మానవాస్త్రము సంధించిన శీతబాణమును, పశ్య = చూడుము. ఏనమ్ = ఈతనిని, మోహయిత్వా = మోహముకలవానినిగా చేసి, నయతి = తీసికొనిపోవుచున్నది. ప్రాణైః = ప్రాణములతో, న వ్యయుజ్యత = వియుక్తుడు కాలేదు.
తా. లక్ష్మణా! ధర్మము ననుసరించి యున్న ఈ మానవాస్త్రము సంధించిన చల్లని బాణమును చూడుము. ఇది వీనికి మోహము కలుగజేసి తీసికొనిపోవుచున్నది. కాని ఇతని ప్రాణములు తీయలేదు.
మూ. ఇమానపి వధిష్యామి నిర్ఘృణాన్ దుష్టచారిణః,
రాక్షసాన్ పాపకర్మస్థాన్ యజ్ఞఘ్నాన్ రుధిరాశనాన్. 20
ప్ర. అ. నిర్ఘృణాన్ = జాలిలేనివారును, దుష్టచారిణః = దుష్టముగా ప్రవర్తించువారును, పాపకర్మస్థాన్ = పాపకర్మ చేయువారును, యజ్ఞఘ్నాన్ = యజ్ఞములను నశింప చేయువారును, రుధిరాశనాన్ = రక్తమును భుజించువారును అగు, ఇమాన్ = ఈ, రాక్షసానపి = రాక్షసులను కూడ, వధిష్యామి = వధించెదను.
తా. జాలి లేనివారు, దుర్మార్గులు, పాపములు చేయువారు, యజ్ఞములను చెరచువారు, రక్తమును త్రాగువారు అయిన ఈ రాక్షసులను కూడ చంపెదను.
మూ. సంగృహ్యాస్త్రం తతో రామో దివ్యమాగ్నేయమద్భుతమ్,
సుబాహూరసి చిక్షేప స విద్ధః ప్రాపతద్భువి. 21
ప్ర. అ. తతః = పిమ్మట, రామః = రాముడు, దివ్యమ్ = దివ్య మైనదియు, అద్భుతమ్ = ఆశ్చర్యకర మగునదియు అగు, ఆగ్నేయమ్ అస్త్రమ్ = ఆగ్నేయాస్త్రమును, సంగృహ్య = గ్రహించి, సుబాహూరసి = సుబాహువుయొక్క వక్షఃస్థలమునందు, చిక్షేప = విసరెను. సః = అతడు, విద్ధః = కొట్టబడిన వాడై, భువి = భూమిపై, ప్రాపతత్ = పడెను.
తా. పిమ్మట రాముడు దివ్యము, ఆశ్చర్యకరము అయిన ఆగ్నేయాస్త్రమును గ్రహించి, సుబాహువు వక్షస్థలము పై ప్రయోగించెను. అతడు దాని దెబ్బ తిని నేలపై కూలెను.
మూ. శేషాన్ వాయవ్యమాదాయ నిజఘాన మహాయశాః
రాఘవః పరమోదారో మునీనాం ముదమావహన్. 22
ప్ర. అ. మహాయశాః = గొప్ప కీర్తి కలవాడును, పరమోదారః = మిక్కిలి ఉదారుడును అయిన, రాఘవః = రాముడు, మునీనామ్ = మునులకు, ముదమ్ = ఆనందమును, ఆవహన్ = కలిగించుచు, వాయవ్యమ్ = వాయవ్యాస్త్రమును, ఆదాయ = గ్రహించి, శేషాన్ = మిగిలిన రాక్షసులను, నిజఘాన = చంపెను.
తా. గొప్ప కీర్తి గల, పరమోదారు డైన రాముడు, మునులకు ఆనందము కలిగించుచు, మిగిలిన రాక్షసులను, వాయవ్యాస్త్రము ప్రయోగించి చంపెను.
మూ. స హత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునన్దనః,
ఋషిభిః పూజితస్తత్ర యథేన్ద్రో విజయే పురా. 23
ప్ర. అ. రఘునన్దనః = ఆ రాముడు, యజ్ఞఘ్నాన్ = యజ్ఞములను చెరచు, రాక్షసాన్ = రాక్షసులను, సర్వాన్ = అందరిని, హత్వా = చంపి, పురా = పూర్వము, విజయే = విజయము కలిగినప్పుడు, ఇన్ద్రః యథా = ఇంద్రుడు వలె, తత్ర = అచట, ఋషిభిః = ఋషులచేత, పూజితః = పూజింపబడెను.
తా. యజ్ఞవిఘ్నకరు లగు ఆ రాక్షసుల నందరిని సంహరించిన రాముని, పూర్వము విజయము కలిగి నపుడు దేవేంద్రుని పూజించి నట్లు ఋషులందరును ప్రశంసించిరి.
మూ. అథ యజ్ఞే సమాప్తే తు విశ్వామిత్రో మహామునిః,
నిరీతికా దిశో దృష్ట్వా కాకుత్థ్సమిదమబ్రవీత్. 24
ప్ర. అ. అథ = పిమ్మట, యజ్ఞే = యజ్ఞము, సమాప్తే = సమాప్త మైన దగు చుండగా, విశ్వామిత్రః మహామునిః = విశ్వామిత్రమహర్షి, నిరీతికాః = ఈతిబాధలు లేని, దిశః = దిక్కులను, దృష్ట్వా = చూచి, కాకుత్థ్సమ్ = రాముని గూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను.
తా. యజ్ఞము సమాప్త మైన పిమ్మట విశ్వామిత్రమహాముని ఈతిభాదలన్నియు తొలగిపోయిన దిక్కులను చూచి, రామునితో ఇట్లనెను.
మూ. కృతార్థోఽస్మి మహాబాహో కృతం గురువచస్త్వయా,
సిద్ధాశ్రమమిదం సత్యం కృతం రామ మహాయశః. 25
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే త్రింశః సర్గః
ప్ర. అ. మహాబాహో = గొప్పబాహువులు కలవాడా! కృతార్థః = నెరవేరిన కార్యము కలవాడను, అస్మి = అయితిని. త్వయా = నీచేత, గురువచః = తండ్రివాక్యము, కృతమ్ = చేయబడినది. మహాయశః = గొప్ప కీర్తి గల, రామ = రామా! ఇదమ్ = ఈ, సిద్ధాశ్రమమ్ = సిద్ధాశ్రమము, సత్యమ్ = సత్య మైనదిగా, కృతమ్ = చేయబడినది.
తా. ఓ మహాబాహూ! నేను తలపెట్టిన పని పూర్తి యైనది. నీవు తండ్రిగారి ఆజ్ఞను నిర్వహించితివి. గొప్ప కీర్తి కల రామా! ఈ సిద్ధాశ్రమమును సత్యమైన పేరు గల దానినిగా చేసితివి.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో ముప్పదవ సర్గ సమాప్తము.
