Chapter_31

Back
Book Balakandamu
Chapter No 37
Pages 6
Read Time 9 Minutes

Chapter_31

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ ఏకత్రింశః సర్గః

శ్రీరామాదులతో కలిసి విశ్వామిత్రుడు మిథిలకు ప్రయాణమగుట. వారు మార్గమధ్యమున, సాయంకాలము శోణభద్రతీరమున విశ్రమించుట.

మూ. అథ తాం రజనీం తత్ర కృతార్థౌ రామలక్ష్మణౌ,

ఊషతుర్ముదితౌ వీరౌ ప్రహృష్టేనాన్తరాత్మనా. 1

ప్ర. అ. అథ = పిమ్మట, కృతార్థౌ = చేయబడిన కార్యము కలవారును, ముదితౌ = సంతసించినవారును, వీరౌ = వీరులును అగు, రామలక్ష్మణౌ = రామలక్ష్మణులు, తామ్ = ఆ, రజనీమ్ = రాత్రి, ప్రహృష్టేన = మిక్కిలి సంతోషించిన, అన్తరాత్మనా = మనస్సుతో, తత్ర = అచట, ఊషతుః = నివసించిరి.

తా. తమ కార్యమును పూర్తిచేసి ఆనందముతో కూడిన వీరు లైన రామలక్ష్మణులు, ఆ రాత్రి, ఆనందముతో నిండిన మనస్సుతో, ఆ ఆశ్రమమునందు నివసించిరి.

మూ. ప్రభాతాయాం తు శర్వర్యాం కృతపౌర్వాహ్ణికక్రియౌ,

విశ్వామిత్రమృషీంశ్చాన్యాన్ సహితావభిజగ్మతుః. 2

ప్ర. అ. శర్వర్యామ్ = రాత్రి, ప్రభాతాయామ్ = తెల్లవారగనే, కృతపౌర్వాహ్ణిక క్రియౌ = పూర్వాహ్ణమునకు సంబంధించిన క్రియలను చేసికొన్న వారై, సహితౌ = కలిసినవారై, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని, అన్యాన్ = ఇతరు లైన, ఋషీంశ్చ = ఋషులను గూర్చి, అభిజగ్మతుః = వెళ్లిరి.

తా. రాత్రి తెల్లవారగనే ప్రాతఃకాలము చేయదగిన సంధ్యావందనాదులు పూర్తి చేసికొని, ఇద్దరును కలిసి, విశ్వామిత్రుని వద్దకును, ఇతర ఋషులవద్దకును వెళ్లిరి.

మూ. అభివాద్య మునిశ్రేష్ఠం జ్వలన్తమివ పావకమ్,

ఊచతుర్మధురోదారం వాక్యం మధురభాషిణౌ. 3

ప్ర. అ. మధురభాషిణౌ = మధురముగా మాటలాడు ఆ రామలక్ష్మణులు, జ్వలన్తమ్ = ప్రజ్వలించుచున్న, పావకమ్ ఇవ = అగ్ని వలె ఉన్న, మునిశ్రేష్ఠమ్ = విశ్వామిత్రుని, అభివాద్య = నమస్కరించి, మధురోదారమ్ = మధురము ఉదారము అయిన, వాక్యమ్ = వాక్యమును, ఊచతుః = పలికిరి.

తా. మధురముగా మాటలాడు స్వభావము గల ఆ రామలక్ష్మణులు, ప్రజ్వలించు చున్న అగ్ని వలె ఉన్న విశ్వామిత్రునకు నమస్కరించి, మధురమును ఉదారమును అగు వాక్యమును పలికిరి.

మూ. ఇమౌ స్మ మునిశార్దూల కిఙ్కరౌ సముపస్థితౌ,

ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామ కిమ్. 4

ప్ర. అ. మునిశార్దూల = మునిశ్రేష్ఠుడా! కిఙ్కరౌ = కింకరుల మైన, ఇమౌ = ఈ మేము, సముపస్థితౌ స్మ = వచ్చి ఉన్నాము, యథేష్టమ్ = నీకు ఇష్టము వచ్చిన విధముగ, ఆజ్ఞాపయ = ఆజ్ఞాపించుము. కిమ్ = ఏ, శాసనమ్ = శాసనమును, కరవామ = చేయుదుము.

తా. ఓ మునిశ్రేష్ఠా! ఇదిగో కింకరులము వచ్చినాము. నీకు ఏది ఇష్టమో ఆజ్ఞాపింపుము. ఏ ఆజ్ఞను చేయవలెను?

మూ. ఏవముక్తాస్తతస్తాభ్యాం సర్వ ఏవ మహర్షయః,

విశ్వామిత్రం పురస్కృత్య రామం వచనమబ్రువన్. 5

ప్ర. అ. తాభ్యామ్ = వారిరువురిచేత, ఏవమ్ = ఈ విధముగనే, ఉక్తాః = పలకబడిన, మహర్షయః = మహర్షులు, సర్వే ఏవ = అందరును, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని, పురస్కత్య = పురస్కరించుకొని, రామమ్ = రాముని గూర్చి, వచనమ్ = వాక్యమును, అబ్రువన్ = పలికిరి.

తా. రామలక్ష్మణులు తమతో కూడ ఇట్లు పలుకగా ఆ మహర్షులందరును, విశ్వామిత్రుని అనుజ్ఞను పొంది రామునితో ఇట్లనిరి.

మూ. మైథిలస్య నరశ్రేష్ఠ జనకస్య భవిష్యతి,

యజ్ఞః పరమధర్మిష్ఠస్తస్య యాస్యామహే వయమ్. 6

ప్ర. అ. నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా! మైథిలస్య = మిథిలారాజైన, జనకస్య = జనకుని యొక్క, పరమధర్మిష్ఠః = మిక్కిలి ధర్మముతో కూడిన, యజ్ఞః = యజ్ఞము, భవిష్యతి = కాగలదు, వయమ్ = మేము, తస్య = ఆ యజ్ఞమునకు యాస్యామహే = వెళ్లగలము.

తా. రామా! మిథిలాధిపతి యైన జనకుడు మిక్కిలి ధర్మ సంమతమైన యజ్ఞము చేయనున్నాడు. మేము ఆ యజ్ఞమునకు వెళ్లెదము.

మూ. త్వం చైవ నరశార్దూలస్సహాస్మాభిర్గమిష్యసి,

అద్భుతం ధనురత్నం చ తత్ర తద్ద్రష్టుమర్హసి. 7

ప్ర. అ. నరశార్దూలః = నరశ్రేష్ఠుడ వైన, త్వం చ = నీవు కూడ, అస్మాభిః సహ = మాతోకూడ, గమిష్యసి = రాగలవు. తత్ర = అచట, అద్భుతమ్ = ఆశ్చర్యకరమైన, తత్ = ఆ, ధనురత్నం చ = శ్రేష్ఠ మైన ధనుస్సును, ద్రష్టుమ్ = చూచుటకు, అర్హసి = తగియున్నావు.

తా. నరశ్రేష్ఠుడ వైన నీవు కూడ మాతో అచటికి వచ్చినచో అచట ఆశ్చర్యకర మైన శ్రేష్ఠ మైన ధనుస్సును చూడగలవు.

మూ. తద్ధి పూర్వం నరశ్రేష్ఠ దత్తం సదసి దైవతైః,

అప్రమేయబలం ఘోరం మఖే పరమభాస్వరమ్. 8

ప్ర. అ. నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడ వైన రామా!, అప్రమేయబలమ్ = ఊహింప రాని బలము గలదియు, ఘోరమ్ = భయంకర మైనదియు, పరమభాస్వరమ్ = మిక్కిలి ప్రకాశించునదియు అగు, తత్ = ఆ ధనుస్సు, పూర్వమ్ = పూర్వము, దైవతైః = దేవతలచేత, మఖే = యుద్ధమునందు, సదసి = సభలో, దత్తమ్ = ఇవ్వబడినది.

తా. రామా! అప్రమేయ మైన బలము గల, భయంకర మైన, గొప్ప ప్రకాశము గల ఆ ధనుస్సును పూర్వము దేవతలు యజ్ఞసదస్సులో ఇచ్చిరి.

మూ. నాస్య దేవా న గన్ధర్వా నాసురా న చ రాక్షసాః,

కర్తుమారోపణం శక్తా న కథం చన మానుషాః. 9

ప్ర. అ. అస్య = ఈ ధనుస్సుయొక్క, ఆరోపణమ్ = ఆరోపణమును (నారి కట్టుటను), కర్తుమ్ = చేయుటకు, దేవాః = దేవతలు, న శక్తాః = సమర్థులు కారు. గన్ధర్వాః = గంధర్వులు, న = సమర్థులు కారు. అసురాః = అసురులు, న = సమర్థులు కారు. రాక్షసాః చ = రాక్షసులును, న = సమర్థులు కారు. మానుషాః = మనుష్యులు, కథంచన = ఏ విధముగను, న = సమర్థులు కారు.

తా. దేవతలు గాని, గంధర్వులు గాని, అసురులు గాని, రాక్షసులు గాని ఆ ధనుస్సును వంచి నారి కట్టజాలరు. మనుష్యుల మాట చెప్ప పనియే లేదు.

మూ. ధనుషస్తస్య వీర్యం తు జిజ్ఞాసన్తో మహీక్షితః,

న శేకురారోపయితుం రాజపుత్రా మహాబలాః. 10

ప్ర. అ. రాజపుత్రాః = రాజవంశములందు జనించిన, మహాబలాః = మహాబలవంతులైన, మహీక్షితః = రాజులు, తస్య ధనుషః = ఆధనుస్సు యొక్క, వీర్యమ్ = శక్తిని, జిజ్ఞాసన్తః = తెలియదలచిన వారై, ఆరోపయితుమ్ = ఎక్కు పెట్టుటకు, న శేకుః = సమర్థులు కాలేదు.

తా. రాజవంశములందు పుట్టిన, మహాబలశాలు లగు ఎందరో రాజులు ఆ ధనుస్సు శక్తిని పరీక్షింప గోరి, ప్రయత్నించి, ఎక్కు పెట్టలేక పోయిరి.

మూ. తద్ధనుర్నరశార్దూల మైథిలస్య మహాత్మనః,

తత్ర ద్రక్ష్యసి కాకుత్థ్స యజ్ఞం చాద్భుతదర్శనమ్. 11

ప్ర. అ. నరశార్దూల = నరశ్రేష్ఠుడా! కాకుత్థ్స = రామా! మహాత్మనః = మహాత్ముడైన, మైథిలస్య = జనకునియొక్క, తత్ ధనుః = ఆ ధనుస్సును, అద్భుతదర్శనమ్ = ఆశ్చర్యకర మైన దర్శనము గల, యజ్ఞం చ = యజ్ఞమును, తత్ర = అచట, ద్రక్ష్యసి = చూడగలవు.

తా. నరశ్రేష్ఠుడ వైన రామా! అచటికి వెళ్లి, మహాత్ము డైన జనకుని ధనుస్సును, ఆశ్చర్యకర మైన యజ్ఞమును చూడగలవు.

మూ. తద్ధి యజ్ఞఫలం తేన మైథిలేనోత్తమం ధనుః,

యాచితం నరశార్దూల సునాభం సర్వదైవతైః. 12

ప్ర. అ. నరశార్దూల = నరశ్రేష్ఠుడా! సునాభమ్ = దృఢమైన మధ్య ప్రదేశము గల, తత్ = ఆ, ఉత్తమం ధనుః = ఉత్తమ మైన ధనుస్సు, తేన = ఆ, మైథిలేన = మిథిలాధిపతి యైన దేవరాతునిచేత, సర్వదైవతైః = సకలదేవతలనుండి, యజ్ఞఫలమ్ = యజ్ఞఫలముగా, యాచితం హి = యాచింపబడినది కదా.

తా. రామా! మిథిలాధిపతి యైన దేవరాతుడు, దృఢ మైన మధ్యభాగము గల ఆ ధనుస్సును, దేవతలనుండి, యజ్ఞమునకు ఫలమునుగా యాచించి గ్రహించెను.

మూ. ఆయాగభూతం నృపతేస్తస్య వేశ్మని రాఘవ,

అర్చితం వివిధైర్గన్ధైర్ధూపైశ్చాగురుగన్ధిభిః. 13

ప్ర. అ. రాఘవ = రామా! తస్య = ఆ, నృపతేః = రాజుయొక్క, వేశ్మని = గృహమునందు, ఆయాగభూతమ్ = ధనురుత్సవములలో ప్రధానముగ పూజింపదగిన ధనుస్సుగా అయిన ఆ ధనుస్సు, వివిధైః = అనేకవిధములైన, గన్ధైః = గంధములచేతను, అగురుగన్ధిభిః = అగురుగంధములతో గూడిన, ధూపైశ్చ = ధూపములచేతను, అర్చితమ్ = పూజింపబడినది.

తా. రామా! ఆ ధనుస్సు మిథిలాధిపతి గృహములో ప్రధానపూజ్య మగు ధనుస్సుగా ఉండి, వివిధము లైన గంధములచేతను, అగరుధూపములచేతను పూజింపబడు చున్నది.

మూ. ఏవముక్త్వా మునివరః ప్రస్థానమకరోత్తదా,

సర్షిసంఘః సకాకుత్థ్స ఆమన్త్య్ర వనదేవతాః. 14

ప్ర. అ. మునివరః = మునిశ్రేష్ఠుడు, ఏవమ్ = ఈ విధముగా, ఉక్త్వా = పలికి, సర్షిసంఘః = ఋషిసంఘముతో కూడినవాడై, సకాకుత్థ్సః = రామలక్ష్మణులతో కూడినవాడై, వనదేవతాః = వనదేవతలను, ఆమన్త్య్ర = పలకరించి, తదా = అప్పుడు, ప్రస్థానమ్ = ప్రయాణమును, అకరోత్ = చేసెను.

తా. విశ్వామిత్రుడు ఈ విధముగ పలికి, ఋషిసంఘముతోను, రామ లక్ష్మణులతోను కూడినవాడై, వనదేవతల సెలవు గైకొని బయలుదేరెను.

మూ. స్వస్తివోఽస్తు గమిష్యామి సిద్ధః సిద్ధాశ్రమాదహమ్,

ఉత్తరే జాహ్నవీతీరే హిమవన్తం శిలోచ్చయమ్. 15

ప్ర. అ. (ఓ వనదేవతలారా), వః = మీకు, స్వస్తి = క్షేమము, అగుగాక. సిద్ధః = సిద్ధించిన కార్యము గల, అహమ్ = నేను, సిద్ధాశ్రమాత్ = సిద్ధాశ్రమమునుండి, ఉత్తరే జాహ్నవీతీరే = గంగానదియొక్క ఉత్తరతీరమునందు, హిమవన్తమ్ = హిమవంతుడనెడు, శిలోచ్చయమ్ = పర్వతమును గూర్చి, గమిష్యామి = వెళ్లెదను.

తా. ఓ వనదేవతలారా! ఈ సిద్ధాశ్రమములో నాకు సంకల్పసిద్ధి కలిగినది. ఇచట నుండి గంగానదికి ఉత్తరతీరమునం దున్న హిమవత్పర్వతమునకు వెళ్లెదను. మీకు క్షేమ మగుగాక.

మూ. ప్రదక్షిణం తతః కృత్వా సిద్ధాశ్రమమనుత్తమమ్,

ఉత్తరాం దిశముద్దిశ్య ప్రస్థాతుముపచక్రమే. 16

ప్ర. అ. తతః = పిమ్మట, అనుత్తమమ్ = మిక్కిలిశ్రేష్ఠ మైన, సిద్ధాశ్రమమ్ = సిద్ధాశ్రమమును, ప్రదక్షిణం కృత్వా = ప్రదక్షిణము చేసి, ఉత్తరాం దిశముద్దిశ్య = ఉత్తరదిక్కును గూర్చి, ప్రస్థాతుమ్ = ప్రయాణము చేయుటకు, ఉపచక్రమే = ప్రారంభించెను.

తా. పిమ్మట అత్యుత్తమ మైన ఆ సిద్ధాశ్రమమునకు ప్రదక్షిణముచేసి, ఉత్తరము వైపు ప్రయాణమై వెళ్లెను.

మూ. తం ప్రయాన్తం మునివరమన్వయాదనుసారిణామ్,

శకటీశతమాత్రం తు ప్రాయేణ బ్రహ్మవాదినామ్. 17

ప్ర. అ. ప్రయాన్తమ్ = వెళ్లుచున్న, తమ్ = ఆ, మునివరమ్ = మునిశ్రేష్ఠుని, అనుసారిణామ్ = అనుసరించుచున్న, బ్రహ్మవాదినామ్ = వేదవిద్వాంసులయొక్క, ప్రాయేణ = దాదాపు, శకటీశతమాత్రమ్ = నూరుబండ్లు, అన్వయాత్ = అనుసరించి వెళ్లెను.

తా. విశ్వామిత్రుడు ప్రయాణమై వెళ్లుచుండగా, అతనిని అనుసరించు బ్రహ్మవాదుల, దాదాపు, నూరు శకటములు అతనిని వెంబడించినవి.

మూ. మృగపక్షిగణాశ్చైవ సిద్ధాశ్రమనివాసినః,

అనుజగ్ముర్మహాత్మానం విశ్వామిత్రం మహామునిమ్. 18

నివర్తయామాస తతః పక్షిసంఘాన్ మృగానపి.

ప్ర. అ. సిద్ధాశ్రమనివాసినః = సిద్ధాశ్రమములో నివసించి, మృగపక్షి గణాశ్చెవ = మృగపక్షిగణములు, మహాత్మానమ్ = మహాత్ము డైన, విశ్వామిత్రం మహామునిమ్ = విశ్వామిత్ర మహర్షిని, అనుజగ్ముః = అనుసరించి వెళ్లినవి. పక్షిసంఘాన్ = పక్షుల సముదాయములను, మృగానపి = మృగములను కూడ, నివర్తయామాస = మరలి పోవునట్లు చేసెను.

తా. సిద్ధాశ్రమములో నున్న మృగపక్షులు కూడ మహాత్ము డగు ఆ విశ్వామిత్ర మహామునిని అనుసరించి వెళ్లినవి. విశ్వామిత్రుడు ఆ పక్షులను, మృగములను కూడ వెనుకకు పంపివేసెను.

మూ. తే గత్వా దూరమధ్వానం లమ్బమానే దివాకరే,

వాసం చక్రుర్మునిగణాః శోణాకూలే సమాహితాః. 19

ప్ర. అ. తే = ఆ, మునిగణాః = మునిగణములు, దూరమ్ అధ్వానమ్ = దూరమార్గమును, గత్వా = వెళ్లి, దివాకరే = సూర్యుడు, లమ్బమానే = వ్రేలాడుచుండగా, సమాహితాః = అందరును కలిసి, శోణాకూలే = శోణ మనెడు నదము యొక్క తీరమునందు, వాసమ్ = నివాసమును, చక్రుః = చేసిరి.

తా. ఆ మునులు చాల దూరము ప్రయాణము చేసి, సాయంకాలమున, శోణా నదితీరమున అందరును కలిసి నివాసము చేసిరి.

మూ. తేఽస్తంగతే దినకరే స్నాత్వా హుతహుతాశనాః,

విశ్వామిత్రం పురస్కృత్య నిషేదురమితౌజసః. 20

ప్ర. అ. అమితౌజసః = గొప్ప తేజస్సు గల, తే = వారు, దినకరే = సూర్యుడు, అస్తం గతే = అస్తమించినవా డగుచుండగా, స్నాత్వా = స్నానము చేసి, హుతహుతాశనాః = హోమము చేయబడిన అగ్నులు కలవారై, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని, పురస్కృత్య = పురస్కరించుకొని, నిషేదుః = కూర్చుండిరి.

తా. గొప్ప తేజస్సు గల ఆ ఋషు లందరును, సూర్యాస్తమయానంతరము అగ్నిహోమములు చేసికొని, విశ్వామిత్రుని పురస్కరించుకొని కూర్చుండిరి.

మూ. రామోఽపి సహసౌమిత్రిర్మునీంస్తానభిపూజ్య చ,

అగ్రతో నిషసాదాథ విశ్వామిత్రస్య ధీమతః. 21

ప్ర. అ. సహసౌమిత్రిః = లక్ష్మణసమేతుడైన, రామః అపి = రాముడు కూడ, తాన్ = ఆ, మునీన్ = మునులను, అభిపూజ్య = పూజించి, అథ = పిమ్మట, ధీమతః = ధీమంతుడైన, విశ్వామిత్రస్య = విశ్వామిత్రునియొక్క, అగ్రతః = ఎదుట, నిషసాద = కూర్చుండెను.

తా. లక్ష్మణసమేతు డైన రాముడు ఆ మునులను పూజించి, పిమ్మట, విశ్వామిత్రుని ఎదుట కూర్చుండెను.

మూ. అథ రామో మహాతేజాః విశ్వామిత్రం మహామునిమ్,

పప్రచ్ఛ నరశార్దూలః కౌతూహలసమన్వితః. 22

ప్ర. అ. అథ = పిమ్మట, మహాతేజాః = గొప్ప తేజస్సు గల, నరశార్దూలః = నరశ్రేష్ఠు డైన, రామః = రాముడు, కౌతూహలసమన్వితః = వేడుకతో కూడినవాడై, మహామునిమ్ = మహామునియైన, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని, పప్రచ్ఛ = అడిగెను.

తా. పిమ్మట, మహాతేజఃశాలి యైన రాముడు, విన వేడుకతో, విశ్వామిత్ర మహామునిని ఇట్లు ప్రశ్నించెను.

మూ. భగవన్ కోన్వయం దేశః సమృద్ధవనశోభితః,

శ్రోతుమిచ్ఛామి భద్రం తే వక్తుమర్హసి తత్త్వతః. 23

ప్ర. అ. భగవన్ = ఓ పూజ్యుడా! సమృద్ధవనశోభితః = సమృద్ధము లైన వనములతో శోభింపచేయబడిన, ఆయమ్ = ఈ, దేశః = దేశము, కః ను = ఏది ? శ్రోతుమ్ = వినుటకు, ఇచ్ఛామి = కోరుచున్నాను. తే = నీకు, భద్రమ్ = క్షేమ మగుగాక. తత్త్వతః = యథార్థముగ, వక్తుమ్ = చెప్పుటకు, అర్హసి = తగియున్నావు.

తా. ఓ పూజ్యుడా! ఫలపుష్పాదులతో సమృద్ధ మైన వనముచే శోభించు చున్న ఈ ప్రదేశము పేరేమి ? నేను విన గోరుచున్నాను, దీనిగూర్చి చెప్పుము.

మూ. చోదితో రామవాక్యేన కథయామాస సువ్రతః,

తస్య దేశస్య నిఖిలమృషిమధ్యే మహాతపాః. 24

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే ఏకత్రింశః సర్గః

ప్ర. అ. సువ్రతః = ఉత్తమ మైన వ్రతము గల, మహాతపాః = గొప్ప తపస్సు గల విశ్వామిత్రుడు, రామవాక్యేన = రాముని వాక్యముచేత, చోదితః = ప్రేరేపింపబడిన వాడై, ఋషిమధ్యే = ఋషుల మధ్యయందు, తస్య = ఆ, దేశస్య = దేశముయొక్క, నిఖిలమ్ = సకలవృత్తాంతమును, కథయామాస = చెప్పెను.

తా. ఉత్తమవ్రతుడును, మహాతపఃశాలియు అగు ఆ విశ్వామిత్రుడు, రాముని వాక్యముచే ప్రేరేపింపబడి, ఆ దేశమునకు సంబంధించిన సకల వృత్తాంతమును ఋషుల మధ్య ఇట్లు చెప్పదొడగెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో ముప్పదియొకటవ సర్గ సమాప్తము.