| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 38 |
| Pages | 7 |
| Read Time | 10 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ ద్వాత్రింశః సర్గః
బ్రహ్మపుత్రు డైన కుశుని నలుగురు పుత్రుల వర్ణనము, శోణభద్ర తీరప్రాంతమునందలి దేశమునకు వసువు అధిపతి యని చెప్పుట. వాయువు కోపముచే కుశనాభుని నూర్గురు కుమార్తెలను గూనివారినిగా చేయుట.
మూ. బ్రహ్మయోనిర్మహానాసీత్కుశో నామ మహాతపాః,
అక్లిష్టవ్రతధర్మజ్ఞః సజ్జనప్రతిపూజకః. 1
ప్ర. అ. బ్రహ్మయోనిః = బ్రహ్మ కారణముగా కలవాడును, మహాతపాః = గొప్ప తపస్సు కలవాడును, అక్లిష్టవ్రతధర్మజ్ఞః = బాధింపబడని వ్రతములు కలవాడును ధర్మములను ఎరిగినవాడును, సజ్జనప్రతిపూజకః = సజ్జనులను పూజించువాడును, మహాన్ = గొప్పవాడును అగు, కుశో నామ = కుశు డను పేరు గల రాజు, ఆసీత్ = ఉండెను.
తా. బ్రహ్మకుమారు డైన కుశు డను ఒక మహాపురుషుడు ఉండెను. అతడు గొప్ప తపస్సు కలవాడు. ఎన్నడును నియమములకు భంగము కలిగించనివాడు. ధర్మములను ఎరిగినవాడు. సజ్జనులను పూజించువాడు.
మూ. స మహాత్మా కులీనాయాం యుక్తాయాం సుగుణోల్బణాన్,
వైదర్భ్యాం జనయామాస చతురః సదృశాన్ సుతాన్. 2
కుశామ్బం కుశనాభం చ అధూర్తరజసం వసుమ్.
ప్ర. అ. సః మహాత్మా = ఆ మహాత్ముడు, కులీనాయామ్ = సత్కులమునందు పుట్టినదియు, యుక్తాయామ్ = తనకు తగినదియు అగు, వైదర్భ్యామ్ = విదర్భరాజకుమారియందు, కుశామ్బమ్ = కుశాంబుని, కుశనాభం చ = కుశనాభుని, అధూర్తరజసమ్ = అధూర్తరజసుని, వసుమ్ = వసువును, సుగుణోల్బణాన్ = సుగుణములతో నిండిన, సదృశాన్ = తనకు తగిన, చతురః = నలుగురు, సుతాన్ = కుమారులను, జనయామాస = పుట్టించెను.
తా. ఆ మహాత్మునకు సత్కులసంజాతురాలును, తనకు తగినదియు అగు విదర్భరాజకుమారియందు కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, వసువు అనెడు సుగుణవంతు లైన, తనతో సమాను లైన నలుగురు కుమారులు జనించిరి.
మూ. దీప్తియుక్తాన్ మహోత్సాహాన్ క్షత్రధర్మచికీర్షయా,
తానువాచ కుశః పుత్రాన్ ధర్మిష్ఠాన్ సత్యవాదినః. 3
ప్ర. అ. కుశః = కుశుడు, దీప్తియుక్తాన్ = కాంతితో కూడినవారును, మహోత్సాహాన్ = గొప్ప ఉత్సాహము కలవారును, ధర్మిష్ఠాన్ = ధర్మనిరతులును, సత్యవాదినః = సత్యము పలుకువారును అగు, తాన్ = ఆ, పుత్రాన్ = పుత్రులను గూర్చి, క్షత్రధర్మచికీర్షయా = క్షత్రియధర్మమును ఆచరింప వలె ననెడు అభిలాషచే, ఉవాచ = పలికెను.
తా. కుశమహారాజు, రాజధర్మమును అనుష్ఠింప వలె ననెడు అభిలాషచే, ప్రకాశవంతులును, గొప్ప ఉత్సాహము కలవారును, ధర్మనిరతులును, సత్యమునే పలుకువారును అగు ఆ పుత్రులతో ఇట్లు పలికెను.
మూ. క్రియతాం పాలనం పుత్రా ధర్మం ప్రాప్స్యథ పుష్కలమ్ 4
ఋషేస్తు వచనం శ్రుత్వా చత్వారో లోకసంమతాః,
నివేశం చక్రిరే సర్వే పురాణాం నృవరాస్తదా. 5
ప్ర. అ. పుత్రాః = పుత్రులారా! పాలనమ్ = పాలనము, క్రియతామ్ = చేయబడుగాక. పుష్కలమ్ = అధికమైన, ధర్మం = ధర్మమును, ప్రాప్స్యథ = పొందగలరు. తదా = అప్పుడు, ఋషేః = ఆ ఋషియొక్క, వచనమ్ = వాక్యమును, శ్రుత్వా = విని, లోకసంమతాః = లోకమునందు పూజ్యు లైన, చత్వారః = నలుగురు, నృవరాః = నరశ్రేష్ఠులు, సర్వే = అందరును, పురాణామ్ = పట్టణములయొక్క, నివేశమ్ = ఏర్పాటును, చక్రిరే = చేసిరి.
తా. ‘‘పుత్రులారా! పాలనము చేయుడు. అత్యధిక మైన ధర్మమును పొందెదరు.’’ ఆ ఋషి మాటలు విని, లోకముచే పూజింపబడిన ఆ నరశ్రేష్ఠులు నలుగురును పట్టణముల నిర్మాణము చేసిరి.
మూ. కుశామ్బస్తు మహాతేజాః కౌశామ్బీమకరోత్పురీమ్,
కుశనాభస్తు ధర్మాత్మా పురం చక్రే మహోదయమ్. 6
ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, కుశామ్బస్తు = కుశాంబుడైతే, కౌశామ్బీమ్ = కౌశాంబి యనెడు, పురీమ్ = పట్టణమును, అకరోత్ = నిర్మించెను. ధర్మాత్మా = ధర్మాత్ము డైన, కుశనాభస్తు = కుశనాభు డైతే, మహోదయమ్ = మహోదయ మనే పేరు గల, పురమ్ = పట్టణమును, చక్రే = నిర్మించెను.
తా. మహాతేజశ్శాలి యగు కుశాంబుడు కౌంశాబీనగరమును, ధర్మాత్ముడైన కుశనాభుడు మహోదయపురమును నిర్మించిరి.
మూ. అధూర్తరజసో రామ ధర్మారణ్యం మహీపతిః,
చక్రే పురవరం రాజా వసుశ్చక్రే గిరిప్రజమ్. 7
ప్ర. అ. రామ = రామా! అధూర్తరజసః = అధూర్తరజసు డనే పేరు గల, మహీపతిః = రాజు, ధర్మారణ్యమ్ = ధర్మారణ్య మనెడు, పురవరమ్ = శ్రేష్ఠమైన పురమును, చక్రే = నిర్మించెను. రాజా = రాజైన, వసుః = వసువు, గిరివ్రజమ్ = గిరివ్రజమనెడు పురమును, చక్రే = నిర్మించెను.
తా. రామా! అధూర్తరజసుడు ధర్మారణ్య మనెడు నగరశ్రేష్ఠమును, వసురాజు గిరివ్రజపురమును నిర్మించిరి.
మూ. ఏషా వసుమతీ రామ వసోస్తస్య మహాత్మనః,
ఏతే శైలవరాః పఞ్చ ప్రకాశన్తే సమన్తతః. 8
ప్ర. అ. రామ = రామా! ఏషా = ఇది, మహాత్మనః = మహాత్ము డైన, తస్య వసోః = ఆ వసువుయొక్క, వసుమతీ = భూమి. సమన్తతః = దీనిచుట్టును, పఞ్చ = ఐదు, శైలవరాః = శ్రేష్ఠ మైన పర్వతములు, ప్రకాశన్తే = ప్రకాశించుచున్నవి.
తా. రామా! ఇది ఆ మహాత్ము డైన వసువు భూమి. దీని చుట్టును ఐదు ఉత్తమ పర్వతములు ప్రకాశించుచున్నవి.
మూ. సుమాగధీ నదీ రమ్యా మగధాన్ విశ్రుతా యయౌ,
పఞ్చానాం శైలముఖ్యానాం మధ్యే మాలేవ శోభతే. 9
ప్ర. అ. రమ్యా = సుందరమైన, విశ్రుతా = ప్రసిద్ధమైన, సుమాగధీ నదీ = మగధ దేశమునందు పుట్టిన శోణనది, మగధాన్ = మగధదేశమును, ఆయయౌ = పొందినది. పఞ్చానామ్ = ఐదు, శైలముఖ్యానామ్ = ముఖ్య మైన శైలములయొక్క, మధ్యే = మధ్యయందు, మాలేవ = మాల వలె, రాజతే = ప్రకాశించుచున్నది.
తా. మగధదేశమునందు పుట్టిన, రమ్య మైన, ప్రసిద్ధ మైన శోణనది మగధదేశమును పొందినది. ఇది ఐదు శైలముల మధ్య పుష్పమాల వలె ప్రకాశించుచున్నది.
మూ. సైషా హి మాగధీ రామ వసోస్తస్య మహాత్మనః,
పూర్వాభిచరితారామ సుక్షేత్రా సస్యమాలినీ. 10
ప్ర. అ. రామ = రామా! సా = ఆ, ఏషా = ఈ, మాగధీ = శోణనది, మహాత్మనః = మహాత్ము డైన, తస్య = ఆ, వసోః = వసువునకు సంబంధించినది. పూర్వాభిచరితా = తూర్పునుండి ప్రవహించుచున్నది. సుక్షేత్రా = మంచి క్షేత్రములు కలది. సస్యమాలినీ = సస్యపంక్తులు కలది.
తా. రామా! ఈ శోణనది ఆ వసువునకు సంబంధించినది. తూర్పునుండి పశ్చిమము వైపు ప్రవహించుచున్నది. దీని తీరప్రాంతములందు మంచి సస్యములతో నిండిన పొలము లున్నవి.
మూ. కుశనాభస్తు రాజర్షిః కన్యాశతమనుత్తమమ్,
జనయామాస ధర్మాత్మా ఘృతాచ్యాం రఘునన్దన. 11
ప్ర. అ. రఘునన్దన = రామా! ధర్మాత్మా = ధర్మాత్ముడును, రాజర్షిః = రాజర్షియు అయిన, కుశనాభస్తు = కుశనాభు డైతే, ఘృతాచ్యామ్ = ఘృతాచియందు, అనుత్తమమ్ = శ్రేష్ఠమైన, కన్యాశతమ్ = కన్యాశతమును, జనయామాస = పుట్టించెను.
తా. రామా! ధర్మాత్ముడును, రాజర్షియు అగు కుశనాభుడు, ఘృతాచి యను అప్సరఃస్త్రీయందు అత్యుత్తమ లైన నూరుగురు కన్యలను కనెను.
మూ. తాస్తు యౌవనశాలిన్యో రూపవత్యః స్వలఙ్కృతాః,
ఉద్యానభూమిమాగమ్య ప్రావృషీవ శతహ్రదాః. 12
గాయన్త్యో నృత్యమానాశ్చ వాదయన్త్యశ్చ సర్వశః,
ఆమోదం పరమం జగ్ముర్వరాభరణభూషితాః. 13
ప్ర. అ. యౌవనశాలిన్యః = యౌవనముతో ప్రకాశించుచున్న, రూపవత్యః = సౌందర్యవతు లైన, తాః = ఆ కన్యకలు, స్వలఙ్కృతాః = బాగుగా అలంకరించుకున్నవారై, ఉద్యాన భూమిమ్ = ఉద్యానప్రదేశమును, ఆగమ్య = చేరి, ప్రావృషి = వర్షాకాలమునందు, శతహ్రదః ఇవ = మెరుపుల వలె ప్రకాశించుచు, గాయన్త్యః = గానము చేయుచున్నవారై, నృత్యమానాశ్చ = నాట్యము చేయుచున్న వారై, వాదయన్త్యః = వీణాదులను మ్రోగించుచున్న వారై, సర్వాభరణభూషితాః = సమస్తములైన అలంకారములచే అలంకరింపబడినవారై, సర్వశః = అన్ని వైపుల తిరుగుచు, పరమమ్ = గొప్ప ఆమోదమ్ = ఆనందమును, జగ్ముః = పొందిరి.
తా. యౌవనముతో ప్రకాశించుచున్న, రూపవతు లగు ఆ కన్యలు సకలాభరణములతో చక్కగ అలంకరించుకొని, వర్షాకాలమునందు మెరుపు తీగల వలె ప్రకాశించుచు, ఉద్యానములో నలుమూలల విహరించుచు, గానము చేయుచు, నాట్య మాడుచు, వాద్యములను మ్రోగించుచు గొప్ప ఆనందమును పొందిరి.
మూ. అథ తాశ్చారుసర్వాఙ్గ్యో రూపేణాప్రతిమా భువి,
ఉద్యానభూమిమాగమ్య తారా ఇవ ఘనాన్తరే. 14
ప్ర. అ. అథ = పిమ్మట, చారుసర్వాఙ్గ్యః = సుందరమైన సకలావయవములు కల, రూపేణ = సౌందర్యముచేత, భువి = భూమియందు, అప్రతిమాః = సాటిలేని, తాః = ఆ కన్యలు, ఉద్యానభూమిమ్ = ఉద్యానప్రదేశమును, ఆగమ్య = పొంది, ఘనాన్తరే = మేఘముల మధ్య, తారాః ఇవ = నక్షత్రముల వలె, (ప్రకాశించిరి).
తా. అందమైన సకలావయవములు కలిగి భూలోకమునందు సాటి లేని రూపము గల ఆ కన్యకలు, ఉద్యానమును చేరి, మేఘమధ్యమునందు, నక్షత్రముల వలె ప్రకాశించిరి.
మూ. తాః సర్వగుణసంపన్నా రూపయౌవనసంయుతాః,
దృష్ట్వా సర్వాత్మకో వాయురిదం వచనమబ్రవీత్. 15
ప్ర. అ. సర్వాత్మకః = అంతటను సంచరించు, వాయుః = వాయుదేవుడు, సర్వగుణ సంపన్నాః = అన్ని సద్గుణములతో కూడినవారును, రూపయౌవనసంయుతాః = రూపముతోడను యౌవనముతోడను కూడినవారును అగు, తాః = వారిని, దృష్ట్వా = చూచి, ఇదమ్ = ఈ, వచనమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.
తా. అంతటను సంచరించు వాయుదేవుడు, సర్వగుణసంపన్నులై, రూప యౌవనములతో ప్రకాశించుచున్న ఆ కన్యలను చూచి ఇట్లు పలికెను.
మూ. అహం వః కామయే సర్వా భార్యా మమ భవిష్యథ,
మానుషస్త్యజ్యతాం భావో దీర్ఘమాయురవాప్స్యథ. 16
ప్ర. అ. అహమ్ = నేను, వః = మిమ్ములను, సర్వాః = అందరిని, కామయే = కోరుచున్నాను. మమ = నా యొక్క, భార్యాః = భార్యలుగా, భవిష్యథ = కాగలరు. మానుషః = మనుష్యసంబంధ మైన, భావః = స్వభావము, త్యజ్యతామ్ = విడువబడుగాక. దీర్ఘమ్ = దీర్ఘ మైన, ఆయుః = ఆయుర్దాయమును, అవాప్స్యథ = పొందుడు.
తా. నేను మిమ్ముల నందరిని కోరుచున్నాను. నా భార్యలు కండు. నన్ను వివాహము చేసికొనినచో మనుష్యత్వము పోయి మీకు దీర్ఘాయువు లభించును.
మూ. చలం హి యౌవనం నిత్యం మానుషేషు విశేషతః,
అక్షయ్యం యౌవనం ప్రాప్తా అమర్యశ్చ భవిష్యథ. 17
ప్ర. అ. నిత్యమ్ = ఎల్లప్పుడును, యౌవనమ్ = యౌవనము, చలం హి = అస్థిర మైనది. మానుషేషు = మనుష్యులలో, విశేషతః = అధికముగ అస్థిరము. అక్షయ్యమ్ = అంతు లేని, యౌవనమ్ = యౌవనమును, ప్రాప్తాః = పొందినవారై, అమర్యః చ = దేవతాస్త్రీలుగాకూడ, భవిష్యథ = కాగలరు.
తా. యౌవన మనునది అస్థిరము. మనుష్యులలో ఇంకను అస్థిరము. నన్ను పెండ్లాడినచో శాశ్వత మైన యౌవనముతో దేవతాస్త్రీలుగా కాగలరు.
మూ. తస్య తద్వచనం శ్రుత్వా వాయోరక్లిష్టకర్మణః,
అపహాస్య తతో వాక్యం కన్యాశతమథాబ్రవీత్. 18
ప్ర. అ. తతః = పిమ్మట, అక్లిష్మకర్మణః = అడ్డు పెట్టబడని కర్మ గల, తస్య వాయోః = ఆ వాయుదేవునియొక్క, తత్ = ఆ, వచనమ్ = వాక్యమును, శ్రుత్వా = విని, అపహాస్య = పరిహసించి, కన్యాశతమ్ = కన్యకల శతము, అథ = అటుపిమ్మట, వాక్యమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.
తా. ఏ పనిచేయుటకైనను అడ్డు లేని ఆ వాయువు మాటలు విని, ఆ నూర్గురు కన్యలు పరిహాసపూర్వకముగా ఇట్లనిరి.
మూ. అన్తశ్చరసి భూతానాం సర్వేషాం త్వం సురోత్తమ,
ప్రభావజ్ఞాః స్మ తే సర్వాః కిమస్మానవమన్యసే. 19
ప్ర. అ. సురోత్తమ = ఓ దేవతాశ్రేష్ఠుడా! త్వమ్ = నీవు, సర్వేషామ్ = సమస్తమైన, భూతానామ్ = భూతములయొక్క, అన్తః = లోపల, చరసి = సంచరించుచున్నావు. సర్వాః = మేమందరము, తే = నీయొక్క, ప్రభావజ్ఞాః = ప్రభావమును ఎరిగిన వారముగా, స్మ = అయి ఉన్నాము. అస్మాన్ = మమ్ములను, కిమ్ అవమన్యసే = ఎందుకు అవమానము చేయుచున్నావు ?
తా. ఓ సురోత్తమా! నీవు సర్వప్రాణులలోపల సంచరించువాడవు. నీ ప్రభావము మాకందరకును తెలియును. మమ్ములను ఎందుకు ఇట్లు అవమానించు చున్నావు?
మూ. కుశనాభసుతాః సర్వాస్సమర్థాస్త్వాం సురోత్తమ,
స్థానాచ్చ్యావయితుం దేవం రక్షామస్తు తపో వయమ్. 20
ప్ర. అ. సురోత్తమ = ఓ దేవతాశ్రేష్ఠుడా! సర్వాః వయం = మేమందరము, కుశనాభసుతాః = కుశనాభుని కుమార్తెలము. దేవమ్ = దేవతవైన, త్వామ్ = నిన్ను, స్థానాత్ = నీ అధికారమునుండి, చ్యావయితుమ్ = తొలగించుటకు, సమర్థాః = సామర్థ్యము కలవారము. తు = కాని, తపః = తపస్సును, రక్షామః = రక్షించుకొనుచున్నాము.
తా. ఓ సురోత్తమా! మే మందరమును కుశనాభుని కుమార్తెలము. నీవు దేవతవే యైనను నిన్ను నీ అధికారమునుండి తొలగించు సామర్థ్యము మా కున్నది గాని తపస్సును రక్షించుకొనుటకై అట్లు చేయుటలేదు.
మూ. మా భూత్స కాలో దుర్మేధః పితరం సత్యవాదినమ్,
అవమన్య స్వధర్మేణ స్వయం వరముపాస్మహే. 21
ప్ర. అ. దుర్మేధః = దుష్టబుద్ధి కలవాడా! సత్యవాదినమ్ = సత్యమునే పలికెడు, పితరమ్ = తండ్రిని, అవమన్య = అవమానించి, స్వధర్మేణ = స్వేచ్ఛచేత, స్వయమ్ = స్వయముగనే, వరమ్ = వరుని, ఉపాస్మహే = ఎపుడు సేవింతుమో, సః = ఆ, కాలః = కాలము, మాభూత్ = రాక పోవుగాక.
తా. ఓ దుర్బుద్ధీ! సత్యవాది యైన తండ్రిని కాదని స్వేచ్ఛానుసారముగా, మేమే స్వయముగ వరుని పొందెడు కాలము ఎన్నటికిని రాకుండు గాక.
మూ. పితా హి ప్రభురస్మాకం పరమం దైవతం హి సః,
యస్య నో దాస్యతి పితా స నో భర్తా భవిష్యతి. 22
ప్ర. అ. అస్మాకమ్ = మాకు, పితా = తండ్రియే, ప్రభుః హి = ప్రభువు కదా. సః = అతడే, పరమమ్ = గొప్ప, దైవతమ్ = దేవత. పితా = మా తండ్రి నః = మమ్ములను, యస్య = ఎవనికి, దాస్యతి = ఇవ్వగలడో, సః = అతడే, నః = మాకు, భర్తా = భర్తగా, భవిష్యతి = కాగలడు.
తా. మాకు తండ్రియే ప్రభువు; తండ్రియే దేవత; మాతండ్రి మమ్ములను ఎవరి కిచ్చునో అతడే మా భర్త కాగలడు.
మూ. తాసాం తద్వచనం శ్రుత్వా వాయుః పరమకోపనః,
ప్రవిశ్య సర్వగాత్రాణి బభఞ్జ భగవాన్ ప్రభుః. 23
ప్ర. అ. తాసామ్ = ఆ కన్యలయొక్క, తత్ వచనమ్ = ఆ వాక్యమును, శ్రుత్వా = విని, ప్రభుః = సమర్థు డైన, భగవాన్ = మాహాత్మ్యము గల, వాయుః = వాయువు, పరమకోపనః = మిక్కిలి కోపము కలవాడై, సర్వగాత్రాణి = అన్ని అవయవములను, ప్రవిశ్య = ప్రవేశించి, బభఞ్జ = భగ్నము చేసెను.
తా. ఆ కన్యకల వాక్యము విని, సామర్థ్యవంతు డగు వాయువు చాల కోపించి, అవయవము లన్నింటిలోనికి ప్రవేశించి వాటిని దుర్బలములుగ చేసెను.
మూ. తాః కన్యా వాయునా భగ్నా వివిశుర్నృపతేర్గృహమ్,
ప్రాపతన్ భువి సంభ్రాన్తాః సలజ్జాః సాస్రలోచనాః. 24
ప్ర. అ. వాయునా = వాయువుచేత, భగ్నాః = బలవిహీనలుగా చేయబడిన, తాః కన్యాః = ఆ కన్యలు, నృపతేః = రాజుయొక్క, గృహమ్ = గృహమును, వివిశుః = ప్రవేశించిరి, సంభ్రాన్తాః = తొట్రుపడుచున్న వారై, సలజ్జాః = లజ్జతో కూడిన వారై, సాస్రలోచనాః = కన్నీళ్లతో కూడిన నేత్రములు కలవారై, భువి = భూమిపై, ప్రాపతన్ = పడిరి.
తా. వాయువుచేత ఆ విధముగ పీడింపబడిన ఆ కన్యకలు రాజగృహములోనికి ప్రవేశించి, తొట్రుబడుచు, కన్నీళ్లు కార్చుచు, సిగ్గుపడుచు నేలమీద పడిరి.
మూ. స చ తా దయితా దీనాః కన్యాః పరమశోభనాః,
దృష్ట్వా భగ్నాస్తదా రాజా సంభ్రాన్త ఇదమబ్రవీత్. 25
ప్ర. అ. సః రాజా = ఆ రాజు. తదా = అప్పుడు, దయితాః = ఇష్టమైనవారును, దీనాః = దీనలును, పరమశోభనాః = మిక్కిలి అందమైనవారును అగు, తాః కన్యాః = ఆ కన్యలను, భగ్నాః = ఆ విధముగ దుర్బలలుగ చేయబడిన వారినిగా, దృష్ట్వా = చూచి, సంభ్రాన్తాః = కలతచెందిన వాడై, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను.
తా. అప్పుడా కుశనాభుడు మిక్కిలి ప్రకాశించు తన ప్రియపుత్రికలు భగ్నలై, దైన్యముతో నుండుట చూచి ఇట్లు పలికెను.
మూ. కిమిదం కథ్యతాం పుత్య్రః కో ధర్మమవమన్యతే,
కుబ్జాః కేన కృతాః సర్వా వేష్టన్త్యో నాభిభాషథ. 26
ఏవం రాజా వినిఃశ్వస్య సమాధిం సందధే తతః.
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే ద్వాత్రింశః సర్గః
ప్ర. అ. పుత్య్రః = పుత్రికలారా! ఇదమ్ = ఇది, కిమ్ = ఏమి ? కః = ఎవడు, ధర్మమ్ = ధర్మమును, అవమన్యతే = అవమానముచేయుచున్నాడు ? కథ్యతామ్ = చెప్పబడుగాక. సర్వాః = మీరందరును, కుబ్జాః = గూనివారుగా, కేన = ఎవనిచే, కృతాః = చేయబడినారు ? వేష్టన్త్యః = దొర్లుచు, నాభిభాషథ = మాటలాడరేమి ? రాజా = రాజు, ఏవమ్ = ఈ విధముగా పలికి, వినిఃశ్వస్య = నిట్టూర్చి, తతః = పిమ్మట, సమాధిమ్ = సావధానత్వమును, సందధే = కూర్చుకొనెను.
తా. ‘‘పుత్రికలారా! ఇది యేమి ? ఈ విధముగ ధర్మమును అవమానించు చున్నవాడు ఎవడు ? చెప్పుడు. మిమ్ముల నందరిని గూనివాళ్లనుగా చేసినది ఎవడు ? నేలపై దొర్లుచు మాటలాడకున్నా రేమి ?’’ రాజు ఈ విధముగ పలికి, నిట్టూర్చి, ఏమి చెప్పెదరో అని వినుటకై సావధానచిత్తుడై ఉండెను.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండములో ముప్పది రెండవ సర్గ సమాప్తము.
