Chapter_33

Back
Book Balakandamu
Chapter No 39
Pages 7
Read Time 11 Minutes

Chapter_33

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ త్రయస్త్రింశః సర్గః

కుశనాభుడు వాయువు విషయమున ధైర్యముతో, ఓర్పుతో ప్రవర్తించినందుకు తన కుమార్తెలను మెచ్చుకొనుట. బ్రహ్మదత్తుని జన్మవృత్తాంతము. అతడు కుశనాభుని కుమార్తెలను పరిణయమాడుట.

మూ. తస్య తద్వచనం శ్రుత్వా కుశనాభస్య ధీమతః,

శిరోభిశ్చరణౌ స్పష్ట్వా కన్యాశతమభాషత. 1

ప్ర. అ. ధీమతః = బుద్ధిమంతు డైన, తస్య కుశనాభస్య = ఆ కుశనాభునియొక్క, తత్ వచనమ్ = ఆ వచనమును, శ్రుత్వా = విని, కన్యాశతమ్ = కన్యకల శతము, శిరోభిః = శిరస్సులచేత, చరణౌ = తండ్రిపాదములను, స్పష్ట్వా = స్పశించి, అభాషత = పలికెను.

తా. బుద్ధిమంతు డైన ఆ కుశనాభుని మాటలు విని, ఆ నూర్గురు కన్యలును తండ్రి పాదములకు నమస్కరించి ఇట్లు పలికిరి.

మూ. వాయుః సర్వాత్మకో రాజన్ ప్రధర్షయితుమిచ్ఛతి,

అశుభం మార్గమాస్థాయ న ధర్మం ప్రత్యవేక్షతే. 2

ప్ర. అ. రాజన్ = రాజా! సర్వాత్మకః = సర్వవ్యాపి యైన, వాయుః = వాయువు, అశుభమ్ = అశుభ మైన, మార్గమ్ = మార్గమును, ఆస్థాయ = అనుసరించి, ప్రధర్షయితుమ్ = తిరస్కరించుటకు, ఇచ్ఛతి = కోరుచున్నాడు. ధర్మమ్ = ధర్మమును, న ప్రత్యవేక్షతే = చూచుటలేదు.

తా. తండ్రీ! సర్వవ్యాపి యైన వాయువు చెడు మార్గము నవలంబించి మమ్ములను తిరస్కరించుటకు ప్రయత్నించుచున్నాడు. ధర్మమును లెక్క చేయుటలేదు.

మూ. పితృమత్యః స్మ భద్రం తే స్వచ్ఛన్దే న వయం స్థితాః,

పితరం నో వృణీష్వ త్వం యది నో దాస్యతే తవ. 3

ప్ర. అ. వయమ్ = మేము, పితృమత్యః = తండ్రికలవారముగా, స్మ = ఉన్నాము. తే = నీకు, భద్రమ్ = మంగళ మగుగాక, స్వచ్ఛన్దే = స్వాతంత్య్రమునందు, న స్థితాః = లేము. నః = మమ్ములను, తవ = నీకు, దాస్యతే యది = ఇచ్చునేమో, త్వమ్ = నీకు, నః = మాయొక్క, పితరమ్ = తండ్రిని, వృణీష్వ = కోరుము.

తా. ‘‘మా తండ్రిగా రున్నారు. నీకు భద్ర మగుగాక. మేము స్వతంత్రలము కాము. మా తండ్రి మమ్ములను నీ కిచ్చు నేమో కోరుము.’’

మూ. తేన పాపానుబన్ధేన వచనం నప్రతీచ్ఛతా,

ఏవం బ్రువన్త్యః సర్వాః స్మ వాయునా నిహతా భృశమ్. 4

ప్ర. అ. ఏవమ్ = ఈ విధముగా, బ్రువన్త్యః = పలుకుచున్న, సర్వాః = మేమందరము, పాపానుబన్ధేన = పాపసంబంధముగలవాడును, వచనమ్ = మా మాటను, నప్రతీచ్ఛతా = అంగీకరించని, తేన వాయునా = ఆ వాయువుచేత, భృశమ్ = మిక్కిలి, నిహతాః = కొట్టబడితిమి.

తా. పాపాశయుడైన ఆ వాయువు మేమిట్లు చెప్పగా మా మాటల నంగీకరింపక మమ్ములను ఈ విధముగ పీడించినాడు.

మూ. తాసాం తద్వచనం శ్రుత్వా రాజా పరమధార్మికః,

ప్రత్యువాచ మహాతేజాః కన్యాశతమనుత్తమమ్. 5

ప్ర. అ. పరమధార్మికః = పరమధార్మికుడును, మహాతేజాః = గొప్పతేజస్సు కలవాడును అగు, రాజా = రాజు, తాసామ్ = వారియొక్క, తత్ వచనమ్ = ఆ వచనమును, శ్రుత్వా = విని, అనుత్తమమ్ = అత్యుత్తమ మైన, కన్యాశతమ్ = కన్యాశతమును గూర్చి, ప్రత్యువాచ = తిరిగిపలికెను.

తా. పరమధార్మికుడును, మహాతేజఃశాలియు అగు కుశనాభుడు వారి మాటలు విని వారితో ఇట్లనెను.

మూ. క్షాన్తం క్షమావతాం పుత్య్రః కర్తవ్యం సుమహత్కృతమ్,

ఐకమత్యముపాగమ్య కులం చావేక్షితం మమ. 6

ప్ర. అ. పుత్య్రః = పుత్రికలారా! క్షమావతామ్ = ఓర్పుకలవారియొక్క, కర్తవ్యమ్ = కర్తవ్య మైన, క్షాన్తమ్ = క్షమించుట, కృతమ్ = చేయబడినది. సుమహత్ = ఇది గొప్పకార్యము. ఐకమత్యమ్ = ఐకమత్యమును, ఉపాశ్రిత్య = ఆశ్రయించి, మమ = నాయొక్క, కులం చ = కులము కూడ, అవేక్షితమ్ = చూడబడినది.

తా. పుత్రికలారా! ఓర్పు కలవారు చేయతగిన క్షమించుట అను గొప్ప పని చేసినారు. ఇది చాల ప్రశంసనీయము. మీరందరును ఒకే విధమగు ఆలోచనతో నా వంశగౌరవమును కాపాడినారు.

మూ. అలఙ్కారో హి నారీణాం క్షమా తు పురుషస్య వా,

దుష్కరం తచ్చ యత్ క్షాన్తం త్రిదశేషు విశేషతః.

యాదృశీ వః క్షమా పుత్య్రః సర్వాసామవిశేషతః. 7

ప్ర. అ. నారీణామ్ = స్త్రీలకు గాని, పురుషస్య వా = పురుషులకు గాని, క్షమా = ఓర్పు, అలఙ్కారో హి = అలంకారము కదా. క్షాన్తమ్ ఇతి యత్ = క్షమించుట అనునది ఏది కలదో, తత్ = అది, దుష్కరమ్ = చేయ శక్యము కానిది. త్రిదశేషు = దేవతలయందు, అనగా - దేవాంశసంభూతులయందు, విశేషతః = విశేషముగ దుష్కరము. పుత్య్రః = పుత్రికలారా! వః = మీకు, సర్వాసామ్ = అందరికిని, అవిశేషతః = భేదము లేకుండగ, యాదృశీ = ఎట్టి, క్షమా = ఓర్పు ఉన్నదో, అది ఇంకను దుష్కర మైనది.

తా. స్త్రీల కైనను, పురుషుల కైనను ఓర్పు అనునది అలంకారము కదా ? క్షమించుట అనునది చేయశక్యము కాని పని. రూపయౌవనాదులు గల దేవతలకు ఓర్పు ఉండుట ఇంకను కష్టము. మీరందరును ఒకే విధమున ఓర్పు చూపుట ఇంకను మెచ్చుకొనవలసిన విషయము. (తన కుమార్తెలు దేవతాస్త్రీల వంటివారు గాన దేవత లని చెప్పినాడు. వారి తల్లి ఘృతాచి అప్సరస కదా.)

మూ. క్షమా దానం క్షమా యజ్ఞః క్షమా సత్యం హి పుత్రికాః,

క్షమా యశః క్షమా ధర్మః క్షమయా విష్ఠితం జగత్. 8

ప్ర. అ. క్షమా = ఓర్పు, దానమ్ = దానము, క్షమా = ఓర్పే, యజ్ఞః = యజ్ఞము. పుత్రికాః = పుత్రికలారా! క్షమా = ఓర్పే, సత్యం హి = సత్యము కదా ? క్షమా = ఓర్పే, యశః = కీర్తి. క్షమా = ఓర్పే, ధర్మః = ధర్మము. జగత్ = జగత్తు, క్షమయా = ఓర్పుచేత, విష్ఠితమ్ = నిలచి ఉన్నది.

తా. పుత్రికలారా! ఓర్పే దానము; ఓర్పే యజ్ఞము; ఓర్పే సత్యము; ఓర్పే కీర్తి; ఓర్పే ధర్మము. ఓర్పుమీదనే ఈ జగత్తు నిలచి ఉన్నది.

మూ. విసృజ్య కన్యాః కాకుత్థ్స రాజా త్రిదశవిక్రమః. 9

మన్త్రజ్ఞో మన్త్రయామాస ప్రదానం సహ మన్త్రిభిః,

దేశకాలౌ ప్రదానస్య సదృశే ప్రతిపాదనమ్. 10

ప్ర. అ. కాకుత్థ్స = రామా!, త్రిదశవిక్రమః = దేవతల వంటి పరాక్రమము గల, మన్త్రజ్ఞః = ఆలోచనను ఎరిగిన, రాజా = రాజు, కన్యాః = కన్యకలను, విసృజ్య = విడచి, మన్త్రిభిః సహ = మంత్రులతో కూడ, ప్రదానమ్ = (కన్యకల) దానమును గూర్చి, మన్త్రయామాస = ఆలోచించెను. ప్రదానస్య = కన్యాదానమునకు, దేశ కాలౌ = తగినదేశ కాలములను, సదృశే = తగినవానికి, ప్రతిపాదనమ్ = ఇచ్చుటనుగూర్చి (ఆలోచించెను).

తా. రామా! దేవతలవంటి పరాక్రమము కలవాడును, ఆలోచన చేయుటలో సమర్థుడును అగు ఆ కుశధ్వజుడు, కన్యకలను లోనికి పంపివేసి, వారి వివాహమును గూర్చి మంత్రులతో ఆలోచన చేసెను. కన్యాదానము చేయుటకు తగిన దేశకాలములను గూర్చియు, తగిన వరునకు ఇచ్చట మొదలగు విషయములను గూర్చియు కూడ ఆలోచించెను.

మూ. ఏతస్మిన్నేవ కాలే తు చూళీ నామ మహాతపాః,

ఊర్ధ్వరేతాః శుభాచారో బ్రాహ్మం తప ఉపాగమత్. 11

ప్ర. అ. ఏతస్మిన్ = ఈ, కాలే ఏవ = కాలమునందే, మహాతపాః = గొప్ప తపస్సు కలవాడును, ఊర్ధ్వరేతాః = పైకి ప్రసరించు రేతస్సు కలవాడును, అనగా రేతస్ఖ్సలనము లేనివాడును, శుభాచారః = శుభమైన ఆచారము కలవాడును అగు, చూళీ నామ = చూళి అను మహర్షి, బ్రాహ్మమ్ = వేదోక్త మైన, తపః = తపస్సును, ఉపాగమత్ = పొందెను.

తా. ఆ కాలమునందే, మహాతపశ్శాలియు, ఊర్ధ్వరేతస్కుడును, శుభమైన ఆచారము కలవాడును అగు చూళి అను మహర్షి వేదోక్తరీతిని తపస్సు చేసెను.

మూ. తప్యన్తం తమృషిం తత్ర గన్ధర్వీ పర్యుపాసతే,

సోమదా నామ భద్రం తే ఊర్మిళాతనయా తదా. 12

ప్ర. అ. తదా = అప్పుడు, తత్ర = అచట, తప్యన్తమ్ = తపస్సు చేయుచున్న, తమ్ ఋషిమ్ = ఆ ఋషిని, ఊర్మిళాతనయా = ఊర్మిళయొక్క కుమార్తె యైన, సోమదా నామ = సోమద అను, గన్ధర్వీ = గంధర్వస్త్రీ, పర్యుపాసతే = సేవించెడిది, తే = నీకు, భద్రమ్ = మంగళ మగుగాక.

తా. అక్క డాతడు తపస్సు చేయుచుండగా ఊర్మిళ కుమార్తె యైన సోమద అనెడు గంధర్వస్త్రీ అతనికి ఉపచారములు చేయుచుండెను. రామా! ఈ పుణ్యకథను వినుటచే నీకు మంగళ మగుగాక.

మూ. సా చ తం ప్రణతా భూత్వా శుశ్రూషణపరాయణా,

ఉవాస కాలే ధర్మిష్ఠా తస్యాస్తుష్టోఽభవద్గురుః. 13

ప్ర. అ. సా చ = ఆమె, తమ్ = అతని విషయమున, ప్రణతా = వినయవంతురాలై, శుశ్రూషణపరాయణా = శుశ్రూషచేయుటయందు శ్రద్ధావంతురాలై, ధర్మిష్ఠా = ధర్మము నాచరించునదై, ఉవాస = వసించెను. కాలే = కొంతకాలమునకు, గురుః = గురువు, తస్యాః = ఆమె విషయమున, తుష్టః = సంతసించినవాడు, అభవత్ = ఆయెను.

తా. సోమద ఆ ఋషి విషయమున వినయవంతురాలై, శ్రద్ధాపూర్వకముశుశ్రూష చేయుచు, ధర్మమార్గము ననుసరించి అచట నివసించెను. కొంత కాలమునకు చూళికి ఆమెపై అనుగ్రహము కలిగెను.

మూ. స చ తాం కాలయోగేన ప్రోవాచ రఘునన్దన,

పరితుష్టోఽస్మి భద్రం తే కిం కరోమి తవ ప్రియమ్. 14

ప్ర. అ. సః చ = ఆ చూళిమహర్షి, కాలయోగేన = ఆమె చేసిన శుశ్రూష ఫలించు కాలము వచ్చుటచే, తామ్ = ఆమెను గూర్చి, ప్రోవాచ = పలికెను. పరితుష్టః = సంతసించిన వాడను, అస్మి = అయినాను. తే = నీకు, భద్రమ్ = మంగళము అగుగాక. తవ = నీకు, కిమ్ = ఏమి, ప్రియమ్ = ప్రియమును, కరోమి = చేయుదును ?

తా. రామా! ఆమె చేసిన శుశ్రూష ఫలించు కాలము వచ్చినది. ఆ ఋషి సోమదతో - ‘‘నీ విషయమున సంతోషించితిని, నీకు క్షేమ మగుగాక, నీకు ఏమి ప్రియము చేయవలెను?’’ అని పలికెను.

మూ. పరితుష్టం మునిం జ్ఞాత్వా గంధర్వీ మధురస్వరా,

ఉవాచ పరమప్రీతా వాక్యజ్ఞా వాక్యకోవిదమ్. 15

ప్ర. అ. మునిమ్ = మునిని, పరితుష్టమ్ = సంతోషించినవానినిగా, జ్ఞాత్వా = తెలిసికొని, మధురస్వరా = మధుర మైన స్వరముకలదియు, వాక్యజ్ఞా = వాక్యములను ఎరిగినదియు అగు, గంధర్వీ = ఆ గంధర్వాంగన, పరమప్రీతా = చాల సంతసించినదై, వాక్యకోవిదమ్ = వాక్యములను ఎరిగిన ఆ మునిని గూర్చి, ఉవాచ = పలికెను.

తా. మధుర మైన స్వరము కలదియు, మాటలాడుటలో నేర్పు కలదియు అగు ఆ గంధర్వస్త్రీ ముని అనుగ్రహించినా డని తెలిసి చాల సంతోషించినదై, మాటలలో నేర్పు గల ఆ మునితో ఇట్లనెను.

మూ. లక్ష్మ్యా సముదితో బ్రాహ్మ్యా బ్రహ్మభూతో మహాతపాః,

బ్రాహ్మేణ తపసా యుక్తం పుత్రమిచ్ఛామి ధార్మిక. 16

ప్ర. అ. మహాతపాః = గొప్ప తపస్సు గల నీవు, బ్రాహ్మ్యా = బ్రాహ్మణ సంబంధియైన, లక్ష్మ్యా = శోభతో, సముదితః = కూడినవాడవై, బ్రహ్మభూతః = బ్రహ్మవంటివాడవై యున్నావు. ధార్మిక = ఓ ధార్మికుడా! బ్రాహ్మేణ = బ్రాహ్మణ సంబంధ మైన, తపసా = తపస్సుతో, యుక్తమ్ = కూడిన, పుత్రమ్ = పుత్రుని, ఇచ్ఛామి = కోరుచున్నాను.

తా. మహాతపః శాలి వైన నీవు, బ్రాహ్మతేజస్సుచే బ్రహ్మదేవుని వంటి వాడవై ఉన్నావు. ఓ ధార్మికుడా! బ్రాహ్మ మగు తపస్సుతో కూడిన పుత్రుని కోరుచున్నాను.

మూ. అపతిశ్చాస్మి భద్రం తే భార్యా చాస్మి న కస్యచిత్,

బ్రాహ్మేణోపగతాయాశ్చ దాతుమర్హసి మే సుతమ్. 17

ప్ర. అ. అపతిః చ = భర్త లేనిదాననై, అస్మి = ఉన్నాను. తే = నీకు, భద్రమ్ = క్షేమ మగుగాక. కస్య చిత్ = ఎవ్వనికిని, భార్యా = భార్యగా, నాస్మి = లేను. ఉపగతాయాః = నిన్ను ఆశ్రయించి ఉన్న, మే = నాకు, బ్రాహ్మేణ = తపస్సుచేత (తపో మహిమచేత), సుతమ్ = కుమారుని, దాతుమ్ = ఇచ్చుటకు, అర్హసి = తగియున్నావు.

తా. నాకు భర్త లేడు. నీకు క్షేమ మగుగాక. నే నెవ్వరికిని భార్యను కాను. నిన్ను ఆశ్రయించి ఉన్న నాకు నీ తపోబలముచే కుమారుని ఇమ్ము.

మూ. తస్యాః ప్రసన్నో బ్రహ్మర్షిర్దదౌ పుత్రమనుత్తమమ్,

బ్రహ్మదత్త ఇతి ఖ్యాతం మానసం చూళిన స్సుతమ్. 18

ప్ర. అ. తస్యాః = ఆమెకు, ప్రసన్నః = అనుగ్రహించిన, బ్రహ్మర్షిః = బ్రహ్మర్షి, చూళినః = చూళియొక్క, మానసమ్ = మనస్సంకల్పమువల్లపుట్టిన, సుతమ్ = కుమారుడు గాను, బ్రహ్మదత్త ఇతి = బ్రహ్మదత్తు డనియు, ఖ్యాతమ్ = ప్రసిద్ధుడైన, అనుత్తమమ్ = అత్యుత్తము డైన, పుత్రమ్ = పుత్రుని, దదౌ = ఇచ్చెను.

తా. ప్రసన్ను డైన ఆ బ్రహ్మర్షి ఆమె కొక అత్యుత్తము డైన పుత్రుని ఇచ్చెను. అతడు బ్రహ్మదత్తు డనియు, చూళి మానసపుత్రు డనియు ప్రసిద్ధి పొందెను.

మూ. స రాజా సౌమదేయస్తు పురీమధ్యవసత్తదా,

కామ్పిల్యాం పరయా లక్ష్మ్యా దేవరాజో యథా దివమ్. 19

ప్ర. అ. సౌమదేయః = సోమద కుమారు డైన, సః = ఆ, రాజా = రాజు, తదా = అప్పుడు, దేవరాజః = దేవేంద్రుడు, దివం యథా = స్వర్గమును వలె, కామ్పిల్యామ్ = కాంపిల్య అను పేరు గల, పురీమ్ = పట్టణమును, పరయా = గొప్ప, లక్ష్మ్యా = ఐశ్వర్యముతో, అధ్యవసత్ = అధిష్ఠించి ఉండెను.

తా. అపుడు, సోమదకుమారు డైన ఆ రాజు, దేవరాజు స్వర్గమునందు వలె, కాంపిల్యానగరమునందు అత్యధికైశ్వర్యముతో నివసించెను.

మూ. స బుద్ధిం కృతవాన్ రాజా కుశనాభః సుధార్మికః,

బ్రహ్మదత్తాయ కాకుత్స్థ దాతుం కన్యాశతం తదా. 20

ప్ర. అ. కాకుత్థ్స = రామా! తదా = అప్పుడు, సుధార్మికః = మంచిధార్మికుడైన, రాజా = రాజైన, సః = ఆ, కుశనాభః = కుశనాభుడు, కన్యాశతమ్ = కన్యాశతమును, బ్రహ్మదత్తాయ = బ్రహ్మదత్తునకు, దాతుమ్ = ఇచ్చుటకు, బుద్ధిమ్ = ఆలోచనను, కృతవాన్ = చేసినాడు.

తా. రామా! సుధార్మికు డైన ఆ కుశనాభమహారాజు తన నూర్గురు కన్యలను బ్రహ్మదత్తున కీయవలె నని నిశ్చయించెను.

మూ. తమాహూయ మహాతేజా బ్రహ్మదత్తం మహీపతిః,

దదౌ కన్యాశతం రాజా సుప్రీతేనాన్తరాత్మనా. 21

ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, మహీపతిః = భూమికి ప్రభువైన, రాజా = ఆ రాజు, తమ్ = ఆ, బ్రహ్మదత్తమ్ = బ్రహ్మదత్తుని, ఆహూయ = పిలచి, సుప్రీతేన = చాల సంతసించిన, అన్తరాత్మనా = హృదయముతో, కన్యాశతమ్ = కన్యాశతమును, దదౌ = ఇచ్చెను.

తా. మహాతేజఃశాలి యగు ఆ కుశనాభ మహారాజు, బ్రహ్మదత్తుని ఆహ్వానించి, ఆనందభరిత మైన హృదయముతో నూర్గురు కూతుళ్లను అతని కిచ్చి వివాహము చేసెను.

మూ. యథాక్రమం తతః పాణీన్ జగ్రాహ రఘునన్దన,

బ్రహ్మదత్తో మహీపాలస్తాసాం దేవపతిర్యథా. 22

ప్ర. అ. రఘునన్దన = రామా! దేవపతిర్యథా = దేవేంద్రుని వంటివా డైన, బ్రహ్మదత్తః మహీపాలః = ఆ బ్రహ్మదత్త మహారాజు, తతః = పిమ్మట, యథాక్రమమ్ = క్రమానుసారముగా, తాసామ్ = ఆ కన్యలయొక్క, పాణీన్ = హస్తములను, జగ్రాహ = పట్టుకొనెను.

తా. రామా! దేవేంద్రునితో సమాను డైన బ్రహ్మదత్త మహారాజు, క్రమానుసారముగా ఆ కన్యల హస్తములను గ్రహించెను.

మూ. స్పష్టమాత్రే తతః పాణౌ వికుబ్జా విగతజ్వరాః,

యుక్తాః పరమయా లక్ష్మ్యా బభుః కన్యాశతం తదా. 23

ప్ర. అ. తతః = పిమ్మట, పాణౌ = హస్తము, స్పృష్టమాత్రే = స్పశింపబడినంతనే, తదా = అప్పుడు, కన్యాశతమ్ = నూరుగురు కన్యలును, వికుబ్జాః = పోయిన గూని కలవారై, విగతజ్వరాః = పోయిన జ్వరము కలవారై, పరమయా = గొప్పదైన, లక్ష్మ్యా = శోభతో, యుక్తాః = కూడినవారై, బభుః = ప్రకాశించిరి.

తా. అతడు హస్తములు స్పృశింపగనే, ఆ నూర్గురు కన్యలును, గూను తొలగి, జ్వరము శాంతించి, గొప్ప శోభతో ప్రకాశించిరి.

మూ. స దృష్ట్వా వాయునా ముక్తాః కుశనాభో మహీపతిః,

బభూవ పరమప్రీతో హర్షం లేభే పునః పునః. 24

ప్ర. అ. మహీపతిః = రాజైన, సః = ఆ, కుశనాభః = కుశనాభుడు, వాయునా = వాయువుచేత, ముక్తాః = విడవబడిన కుమార్తెలను, దృష్ట్వా = చూచి, పరమప్రీతః = చాల సంతోషించినవాడు, బభూవ = ఆయెను. పునః పునః = మాటిమాటికిని, హర్షమ్ = ఆనందమును, లేభే = పొందెను.

తా. ఆ కుశనాభ మహారాజు వాయుదోషము తొలగిపోయిన కుమార్తెలను చూచి చాలా సంతోషించెను. మాటిమాటికిని ఆనందము పొందెను.

మూ. కృతోద్వాహం తు రాజానం బ్రహ్మదత్తం మహీపతిః,

సదారం ప్రేషయామాస సోపాధ్యాయగణం తదా. 25

ప్ర. అ. తదా = అప్పుడు, మహీపతిః = రాజు, కృతోద్వాహమ్ = చేసికొనబడిన వివాహము కలవాడును, సదారమ్ = భార్యలతో కూడినవాడును, సోపాధ్యాయగణమ్ = ఋత్విక్కుల సముదాయముతో కూడిన వాడును అగు, రాజానమ్ = రాజైన, బ్రహ్మదత్తమ్ = బ్రహ్మదత్తుని, ప్రేషయామాస = తన రాజ్యమునకు పంపెను.

తా. కుశనాభుడు వివాహము చేసికొనిన బ్రహ్మదత్త మహారాజును, భార్యా ఋత్విగాదిసమేతముగా అతని రాజ్యమునకు పంపెను.

మూ. సోమదా చ సుసంహృష్టా పుత్రస్య సదృశీం క్రియామ్,

యథాన్యాయం చ గన్ధర్వీ స్నుషాస్తాః ప్రత్యనన్దత. 26

స్పృష్ట్వాస్పృష్ట్వా చ తాః కన్యాః కుశనాభం ప్రశస్య చ.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే త్రయస్త్రింశః సర్గః

ప్ర. అ. గన్ధర్వీ = గంధర్వస్త్రీ యైన, సోమదాపి = సోమద కూడ, తాః = ఆ, కన్యాః = కన్యలను, స్పృష్ట్వా స్పృష్ట్వా = మాటిమాటికి స్పశించి, కుశనాభమ్ = కుశనాభుని, ప్రశస్య చ = ప్రశంసించి, పుత్రస్య = పుత్రునియొక్క, సదృశీమ్ = యుక్త మైన, క్రియామ్ = క్రియను, తాః = ఆ, స్నుషాః = కోడళ్లను, ప్రత్యనన్దత = అభినందించెను.

తా. సోమద ఆ కన్యకలను మాటిమాటికి ఒక్కరొక్కరుగ స్పృశించి, వారి తండ్రి యైన కుశనాభుని ప్రశంసించి, పుత్రుడు చేసిన ఆ యుక్త మైన కార్యమును (ఆ కన్యల వైరూప్యమును తొలగించుటను, లేదా వివాహక్రియను) ఆ కోడళ్లను అభినందించెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో ముప్పది మూడవ సర్గ సమాప్తము.