Chapter_34

Back
Book Balakandamu
Chapter No 40
Pages 6
Read Time 9 Minutes

Chapter_34

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ చతుస్త్రింశః సర్గః

గాధి జన్మవృత్తాంతము, విశ్వామిత్రుని సోదరి యైన కౌశికి ప్రశంస. కథ ముగించి విశ్వామిత్రుడు అర్ధరాత్రమును వర్ణించుచు, నిద్రించవలసినదిగా అందరిని ఆదేశించి, తాను కూడ నిద్రించుట.

మూ. కృతోద్వాహే గతే తస్మిన్ బ్రహ్మదత్తే చ రాఘవ,

అపుత్రః పుత్రలాభాయ పౌత్రీమిష్టిమకల్పయత్. 1

ప్ర. అ. రాఘవ = రామా!, తస్మిన్ = ఆ, బ్రహ్మదత్తే = బ్రహ్మదత్తుడు, కృతోద్వాహే = చేయబడిన వివాహము కలవాడై, గతే = వెళ్ళినవాడగుచుండగా, అపుత్రః = పుత్రులు లేని ఆ రాజు, పుత్రలాభాయ = పుత్రులను పొందుట కొరకు, పౌత్రీమ్ ఇష్టిమ్ = పుత్రకామేష్టిని, అకల్పయత్ = చేసెను.

తా. రామా! బ్రహ్మదత్తుడు వివాహము చేసికొని వెళ్లిన పిమ్మట, పుత్రులు లేని కుశనాభుడు, పుత్రుల కొరకై పుత్రకామేష్టిని చేసెను.

మూ. ఇష్ట్యాం తు వర్తమానాయాం కుశనాభం మహీపతిమ్,

ఉవాచ పరమోదారః కుశో బ్రహ్మసుత స్తదా. 2

ప్ర. అ. తదా = అప్పుడు, ఇష్ట్యామ్ = పుత్రకామేష్టి, వర్తమానాయామ్ = జరుగుచుండగా, పరమోదారః = మిక్కిలి ఉదారుడైన, బ్రహ్మసుతః = బ్రహ్మపుత్రుడైన, కుశః = కుశుడు, కుశనాభమహీపతిమ్ = కుశనాభ మహారాజును గూర్చి, ఉవాచ = పలికెను.

తా. పుత్రకామేష్టి జరుగుచున్న సమయమున మిక్కిలి ఉదారుడును, బ్రహ్మ పుత్రుడును అగు కుశుడు కుశనాభునితో ఇట్లనెను.

మూ. పుత్రస్తే సదృశః పుత్ర భవిష్యతి సుధార్మికః,

గాధిం ప్రాప్స్యసి తేన త్వం కీర్తిం లోకే చ శాశ్వతామ్. 3

ప్ర. అ. పుత్ర = కుమారుడా! తే = నీకు, సదృశః = తగినవాడును, సుధార్మికః = మిక్కిలి ధార్మికుడును అగు, పుత్రః = కుమారుడు, భవిష్యతి = పుట్టగలడు. గాధిమ్ = గాధి అనే కుమారుని, ప్రాప్య్ససి = పొందగలవు, తేన = అతనిచే, త్వమ్ = నీవు, లోకే = లోకమునందు, శాశ్వతామ్ = శాశ్వత మైన, కీర్తిం చ = కీర్తిని కూడ, (పొందగలవు).

తా. కుమారా! నీకు తగిన వాడును, మంచి ధార్మికుడును అగు కుమారుడు జనించగలడు. గాధి యను పేరు గల ఆ కుమారుని ద్వారా నీకు లోకమున శాశ్వత మగు కీర్తి లభింపగలదు.

మూ. ఏవముక్త్వా కుశో రామ కుశనాభం మహీపతిమ్,

జగామాకాశమావిశ్య బ్రహ్మలోకం సనాతనమ్. 4

ప్ర. అ. రామ = రామా! కుశః = కుశుడు, మహీపతిమ్ = రాజైన, కుశనాభమ్ = కుశనాభుని గూర్చి, ఏవమ్ = ఈ విధముగా, ఉక్త్వా = పలికి, ఆకాశమ్ = ఆకాశమును, ఆవిశ్య = ప్రవేశించి, సనాతనమ్ = శాశ్వత మైన, బ్రహ్మలోకమ్ = బ్రహ్మలోకమును గూర్చి, జగామ = వెళ్ళెను.

తా. రామా! కుశుడు కుశనాభునితో ఈ విధముగ చెప్పి, ఆకాశమార్గమున శాశ్వత మగు బ్రహ్మలోకమును చేరెను.

మూ. కస్యచిత్త్వథ కాలస్య కుశనాభస్య ధీమతః,

జజ్ఞే పరమధర్మిష్ఠో గాధిరిత్యేవ నామతః. 5

ప్ర. అ. అథ = పిమ్మట, కస్యచిత్ కాలస్య = కొంతకాలమునకు, ధీమతః = బుద్ధిమంతుడైన, కుశనాభస్య = కుశనాభునకు, పరమధర్మిష్ఠః = మిక్కిలి ధార్మికుడును, నామతః = పేరుచే, గాధిః ఇత్యేవ = గాధి యను, కుమారుడు, జజ్ఞే = పుట్టెను.

తా. కొంత కాలమునకు, ధీమంతు డైన ఆ కుశనాభునకు, గాధి యను పేరు గల పరమధార్మికు డైన కుమారుడు జనించెను.

మూ. స పితా మమ కాకుత్స్థ గాధిః పరమధార్మికః,

కుశవంశప్రసూతోఽస్మి కౌశికో రఘునన్దన. 6

ప్ర. అ. కాకుత్థ్స = రామా! పరమధార్మికః = మిక్కిలిధార్మికుడైన, సః = ఆ, గాధిః = గాధి, మమ = నా యొక్క, పితా = తండ్రి. రఘునన్దన = ఓ రామా! కుశవంశప్రసూతః = కుశుని వంశమునందు పుట్టిన నేను, కౌశికః = కౌశికు డను పేరు గలవాడనుగా, అస్మి = అయి ఉన్నాను.

తా. రామా! పరమధార్మికు డగు ఆ గాధి నా తండ్రి. కుశుని వంశము నందు పుట్టుటచే నాకు కౌశికు డను పేరు వచ్చినది.

మూ. పూర్వజా భగినీ చాపి మమ రాఘవ సువ్రతా,

నామ్నా సత్యవతీ నామ ఋచీకే ప్రతిపాదితా. 7

ప్ర. అ. రాఘవ = రామా! సువ్రతా = మంచి నియమములు కలదియు, నామ్నా = పేరుచేత, సత్యవతీ నామ = సత్యవతి యని ప్రసిద్ధురాలును అగు, మమ = నా యొక్క, పూర్వజా భగినీ = జ్యేష్ఠసోదరి, ఋచీకే = ఋచీకునికి, ప్రతిపాదితా = ఇవ్వబడినది.

తా. రామా! సత్యవతి యను పేరు గల, ఉత్తమవ్రత యగు నా అక్కగారిని ఋచీకున కిచ్చి వివాహము చేసిరి.

మూ. సశరీరా గతా స్వర్గం భర్తారమనువర్తినీ,

కౌశికీ పరమోదారా ప్రవృత్తా చ మహానదీ. 8

ప్ర. అ. (ఆమె) భర్తారమ్ = భర్తను, అనువర్తినీ = అనుసరించుచున్నదై, సశరీరా = సశరీరురాలుగ, స్వర్గమ్ = స్వర్గమును గూర్చి, గతా = వెళ్లినది. పరమోదారా = మిక్కిలి ఉదార మైన, కౌశికీ = కౌశికి అనెడు, మహానదీ = మహానదిగ, ప్రవృత్తా చ = ఏర్పడినది.

తా. ఆమె భర్తను అనుసరించి సశరీరముగ స్వర్గమునకు వెళ్లినది. అతి శ్రేష్ఠ మగు కౌశికీమహానదిగా కూడ ప్రవహించినది.

మూ. దివ్యా పుణ్యోదకా రమ్యా హిమవన్తముపాశ్రితా,

లోకస్య హితకామార్థం ప్రవృత్తా భగినీ మమ. 9

ప్ర. అ. లోకస్య = లోకముయొక్క, హితకామార్థమ్ = పారలౌకిక హితము కొరకును ఐహిక సుఖము కొరకును, ప్రవృత్తా = ప్రవహించిన, దివ్యా = దివ్యమైన, పుణ్యోదకా = పుణ్య మైన ఉదకములు గల, రమ్యా = రమ్య మైన, మమ భగినీ = నా సోదరి యైన కౌశికీనది, హిమవన్తమ్ = హిమవత్పర్వతమును, ఉపాశ్రితా = ఆశ్రయించినది.

తా. లోకమునకు ఐహికాముష్మిక సుఖములను ప్రసాదించుటకై ప్రవహించు చున్నదియు, దేవతాశక్తి కలదియు, పుణ్యోదకము కలదియు, సుందర మైనదియు, నా సోదరియు అగు ఈ కౌశికీనది హిమవత్పర్వతముమీద ప్రవహించు చున్నది.

మూ. తతోఽహం హిమవత్పార్శ్వే వసామి నిరతః సుఖమ్,

భగిన్యాం స్నేహసంయుక్తః కౌశిక్యాం రఘునన్దన. 10

ప్ర. అ. రఘునన్దన = రామా! తతః = ఆ కారణమువలన, భగిన్యామ్ = సోదరియగు, కౌశిక్యామ్ = కౌశికియందు, స్నేహసంయుక్తః = స్నేహముతో కూడిన, అహమ్ = నేను, నిరతః = ఆసక్తి కలవాడనై, హిమవత్పార్శ్వే = హిమవత్పర్వతముయొక్క పార్శ్వమునందు, సుఖమ్ = సుఖముగా, వసామి = నివసించుచున్నాను.

తా. రామా! ఆ కారణముచే, సోదరి యగు కౌశికియందలి స్నేహముచే నేను హిమవత్ప్రాంతమునందు, ఎక్కువ ఆసక్తితో, సుఖముగా నివసించుచున్నాను.

మూ. సా తు సత్యవతీ పుణ్యా సత్యే ధర్మే ప్రతిష్ఠితా,

పతివ్రతా మహాభాగా కౌశికీ సరితాం వరా. 11

ప్ర. అ. సా = ఆ, సత్యవతీ = సత్యవతి, పుణ్యా = పుణ్యాత్మురాలు. సత్యే = సత్యమునందు, ధర్మే = ధర్మమునందును, ప్రతిష్ఠితా = స్థిరముగ నిలచినది. పతివ్రతా = పతివ్రత, మహాభాగా = పూజ్యురాలు, సరితాం వరా = నదులలో శ్రేష్ఠమైన, కౌశికీ = కౌశికిగా,(ఉన్నది).

తా. కౌశికి యను మహానదిగా ఏర్పడిన, ఆ సత్యవతి పుణ్యయైనది. సత్యమునందును, ధర్మమునందును స్థెర్యము కలది. పతివ్రత, గొప్ప భాగ్యము కలది.

మూ. అహం హి నియమాద్రామ హిత్వా తాం సముపాగతః,

సిద్ధాశ్రమమనుప్రాప్య సిద్ధోఽస్మి తవ తేజసా. 12

ప్ర. అ. రామ = రామా! అహమ్ = నేను, నియమాత్ = నియమము వలన, తామ్ = ఆమెను, హిత్వా = విడచి, సముపాగతః = వచ్చినాను. సిద్ధాశ్రమమ్ = సిద్ధాశ్రమమును, అనుప్రాప్య = పొంది, తవ = నీ యొక్క, తేజసా = తేజస్సు చేత, సిద్ధః = కార్యసిద్ధిని పొందినవాడను, అస్మి = అయి ఉన్నాను.

తా. రామా! యాగనియమము పూర్తి చేసుకొనుటకై నే నామెను విడచి సిద్ధాశ్రమమునకు వచ్చితిని. నీ తేజస్సుచే కార్యసిద్ధి పొందితిని.

మూ. ఏషా రామ మమోత్పత్తిః స్వస్య వంశస్య కీర్తితా,

దేశస్య చ మహాబాహో యన్మాం త్వం పరిపృచ్ఛసి. 13

ప్ర. అ. మహాబాహో = గొప్ప బాహువులు కలవాడా! రామ = రామా! ఏషా = ఈ, మమ = నా యొక్కయు, స్వస్య వంశస్య = నా వంశముయొక్కయు, దేశస్య చ = దేశముయొక్కయు, ఉత్పత్తిః = పుట్టుక, కీర్తితా = చెప్పబడినది. యత్ = దేనినిగూర్చి, త్వమ్ = నీవు, మామ్ = నన్ను, పరిపృచ్ఛసి = అడుగుచున్నావో.

తా. ఓ మహాబాహూ! రామా! నీవు చెప్ప మని నన్ను అడిగితివి కదా; నేను ఎట్లు పుట్టితినో, నా వంశము, ఈ దేశము ఎట్లు పుట్టినవో చెప్పినాను.

మూ. గతోర్ధరాత్రః కాకుత్థ్స కథాఃకథయతో మమ,

నిద్రామభ్యేహి భద్రం తే మా భూద్విఘ్నోఽధ్వనీహ నః. 14

ప్ర. అ. కాకుత్థ్స = రామా! మమ = నేను, కథాః = కథలను, కథయతః = చెప్పుచుండగా, అర్ధరాత్రః = అర్ధరాత్రి, గతః = కడచినది. నిద్రామ్ = నిద్రను, అభ్యేహి = పొందుము, తే = నీకు, భద్రమ్ = క్షేమ మగుగాక, ఇహ = ఇచట, నః = మనకు, అధ్వని = మార్గమునందు, విఘ్నః = విఘ్నము, మాభూత్ = కాకుండుగాక.

తా. రామా! నేను ఈ కథలు చెప్పుటలో అర్ధరాత్రి గడచిపోయినది. ఇక నిద్రపొమ్ము. నీకు మంగళ మగుగాక. మనకు ఈ మార్గమధ్యమున ప్రయాణవిఘ్నము కాకుండుగాక.

మూ. నిష్పన్దాస్తరవః సర్వే నిలీనమృగపక్షిణః,

నైశేన తమసా వ్యాప్తా దిశశ్చ రఘునన్దన. 15

ప్ర. అ. రఘునన్దన = రామా! తరవః = వృక్షములు, నిష్పన్దాః = నిశ్చలముగా నున్నవి. మృగపక్షిణః = మృగములును పక్షులును, సర్వే = అన్నియు, నిలీనాః = అణగి యున్నవి. దిశశ్చ = దిక్కులు కూడ, నైశేన = రాత్రికి సంబంధించిన, తమసా = చీకటిచే, వ్యాప్తాః = వ్యాపింపబడినవి.

తా. రామా! వృక్షములు నిశ్చలముగ ఉన్నవి. మృగపక్ష్యాదులు తమ తమ స్థానములలో కదలకుండ అణగి యున్నవి. రాత్రి చీకటి అన్ని దిక్కులందును వ్యాపించినది.

మూ. శనైర్వియుజ్యతే సన్ధ్యా నభో నేత్రైరివావృతమ్,

నక్షత్రతారాగహనం జ్యోతిర్భిరవభాసతే. 16

ప్ర. అ. సన్ధ్యా = సంధ్యాకాలము, శనైః = మెల్ల మెల్లగా, వియుజ్యతే = తొలగిపోయినది. నక్షత్రతారాగహనమ్ = నక్షత్రములతోడను తారలతోడను నిండిన, నభః = ఆకాశము, జ్యోతిర్భిః = ఈ నక్షత్రములతో, నేత్రైః = నేత్రములచే, ఆవృతమ్ ఇవ = కప్పబడినది వలె, భాసతే = ప్రకాశించుచున్నది.

తా. మెల్ల మెల్లగా సంధ్య తొలగిపోయినది. నక్షత్రములతోడను, అశ్విన్యాది తారాగణముతోడను నిండిన ఆకాశము, జ్యోతీరూపము లైన వాటిచేత వ్యాప్తమై, నేత్రములతో నిండినట్లు ఉన్నది.

మూ. ఉత్తిష్ఠతి చ శీతాంశుః శశీ లోకతమోనుదః,

హ్లాదయన్ ప్రాణినాం లోకే మనాంసి ప్రభయా విభో. 17

ప్ర. అ. విభో = రామప్రభూ! శీతాంశుః = చల్లని కిరణములు గల, శశీ = చంద్రుడు, లోకతమోనుదః = లోకముయొక్క చీకటిని తొలగించుచు, ప్రభయా = కాంతిచేత, లోకే = లోకమునందలి, ప్రాణినామ్ = ప్రాణులయొక్క, మనాంసి = మనస్సులను, హ్లాదయన్ = సంతోషపెట్టుచు, ఉత్తిష్ఠతి = పైకి వచ్చుచున్నాడు.

తా. చల్లని కిరణములు గల చంద్రుడు లోకమునందలి చీకటిని తొలగించుచు, కాంతిచేత ప్రాణుల మనస్సులను ఆనందింపచేయుచు పైకి వచ్చుచున్నాడు.

మూ. నైశాని సర్వభూతాని ప్రచరన్తి తతస్తతః,

యక్షరాక్షససంఘాశ్చ రౌద్రాశ్చ పిశితాశనాః. 18

ప్ర. అ. నైశాని = రాత్రి సంచరించు, సర్వభూతాని = సకలప్రాణులును, యక్షరాక్షస సంఘాశ్చ = యక్షరాక్షస సంఘములును, రౌద్రాః = భయంకరులైన, పిశితాశనాశ్చ = మనుష్యమాంస భక్షకులును, తతస్తతః = అక్కడక్కడ, ప్రచరన్తి = సంచరించుచున్నారు.

తా. రాత్రి సంచరించు సకలప్రాణులును, యక్షులు, రాక్షసులు, భయంకరులైన మనుష్యాశనులును అక్కడక్కడ తిరుగుచున్నారు.

మూ. ఏవముక్త్వా మహాతేజా విరరామ మహామునిః,

సాధు సాధ్వితి తం సర్వే మునయో హ్యభ్యపూజయన్. 19

ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, మహామునిః = విశ్వామిత్రుడు, ఏవమ్ = ఈ విధముగా, ఉక్త్వా = పలికి, విరరామ = విరమించెను. సర్వే = సమస్తమైన, మునయః = మునులు, సాధు సాధు ఇతి = బాగున్నది బాగున్నది అని, తమ్ = అతనిని, అభ్యపూజయన్ = పూజించిరి.

తా. మహాతేజఃశాలి యగు విశ్వామిత్రుడు ఈ విధముగ పలికి విరమించెను. ‘‘బాగున్నది బాగున్నది’’ అని అనుచు మును లందరును ఆయనను ఈ విధముగ మెచ్చుకొనిరి.

మూ. కుశికానామయం వంశో మహాన్ ధర్మపరస్సదా,

బ్రహ్మోపమా మహాత్మానః కుశవంశ్యా నరోత్తమాః. 20

ప్ర. అ. కుశికానామ్ = కుశుని సంతానమునకు చెందిన వారియొక్క, అయమ్ = ఈ, వంశః = వంశము, మహాన్ = పూజ్య మైనది. సదా = ఎల్లప్పుడును, ధర్మపరః = ధర్మమునం దాసక్తికలది. కుశవంశ్యాః = కుశుని వంశము నకు చెందిన, నరోత్తమాః = నరోత్తములు, మహాత్మానః = పూజ్యమైన స్వభావము కల వారు బ్రహ్మపమాః = బ్రహ్మదేవునితో సమానులు.

తా. ‘‘ఈ కుశ వంశము పూజ్య మైనది. సర్వదా ధర్మమునం దాసక్తి కలది. కుశవంశమునందు పుట్టిన మానవోత్తములు పూజింపదగిన స్వభావము కలవారు. బ్రహ్మదేవునితో సమానులు.’’

మూ. విశేషేణ భవానేవ విశ్వామిత్ర మహాయశః,

కౌశికీ సరితాం శ్రేష్ఠా కులోద్ద్యోతకరీ తవ. 21

ప్ర. అ. మహాయశః = గొప్ప కీర్తి గల, విశ్వామిత్ర = విశ్వామిత్రుడా! భవానేవ = నీవే, విశేషేణ = విశేషముగా, (మహాత్ముడవు, బ్రహ్మసదృశుడవు). సరితామ్ = నదులలో, శ్రేష్ఠా = శ్రేష్ఠ యైన, కౌశికీ = కౌశికి, తవ = నీయొక్క, కులోద్ద్యోతకరీ = కులమును ప్రకాశింపచేయునది.

తా. ‘‘మహాయశఃశాలి వైన ఓ విశ్వామిత్రమహామునీ! కుశవంశము లోని వారందరిలోను విశేషించి నీవు మహాత్ముడవు, బ్రహ్మతుల్యుడవు. నదులలో శ్రేష్ఠ యైన కౌశికి నీ వంశమునకు వన్నె తెచ్చి పెట్టినది.’’

మూ. ఇతి తైర్మునిశార్దూలైః ప్రశస్తః కుశికాత్మజః,

నిద్రాముపాగమచ్ఛ్రీమాన్ శ్రీమానస్తమివాంశుమాన్. 22

ప్ర. అ. ఇతి = ఈ విధముగ, తైః = ఆ, మునిశార్దూలైః = మునిశ్రేష్ఠులచేత, ప్రశస్తః = ప్రశంసింపబడిన, శ్రీమాన్ = తేజస్సు గల, కుశికాత్మజః = విశ్వామిత్రుడు, శ్రీమాన్ = కాంతిగల, అంశుమాన్ = సూర్యుడు. అస్తమివ = అస్తాద్రిని వలె, నిద్రామ్ = నిద్రను, ఉపాగమత్ = పొందెను.

తా. బ్రహ్మవర్చస్వి యగు విశ్వామిత్రుని ఆ మునిశ్రేష్ఠులు ఈ విధముగ ప్రశంసించిరి. పిమ్మట విశ్వామిత్రుడు, సూర్యుడు అస్తాద్రిని చేరినట్లు నిద్రను పొందెను.

మూ. రామోఽపి సహసౌమిత్రిః కించిదాగతవిస్మయః

ప్రశస్య మునిశార్దూలం నిద్రాం సముపసేవతే. 23

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే చతుస్త్రింశః సర్గః

ప్ర. అ. సహసౌమిత్రిః = లక్ష్మణునితో కూడిన, రామోఽపి = రాముడు కూడ, కించిత్ = కొంచెము, ఆగతవిస్మయః = పొందబడిన ఆశ్చర్యము కలవాడై, మునిశార్దూలమ్ = మునిశ్రేష్ఠుని, ప్రశస్య = ప్రశంసించి, నిద్రామ్ = నిద్రను, సముపసేవతే = సేవించెను.

తా. లక్ష్మణ సమేతు డగు రాముడు కూడ విశ్వామిత్రుడు చెప్పిన కథ వినుటచే కొంచెము ఆశ్చర్యము నొంది, ఆయనను ప్రశంసించి, నిద్రించెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో ముప్పది నాల్గవ సర్గ సమాప్తము.