| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 41 |
| Pages | 6 |
| Read Time | 9 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ పఞ్చత్రింశః సర్గః
విశ్వామిత్రాదులు శోణభద్రను దాటి, గంగాతీరము చేరి, రాత్రి అచట నివసించుట. శ్రీరాముడు ప్రశ్నింపగా విశ్వామిత్రుడు గంగావతరణకథ చెప్పుట.
మూ. ఉపాస్య రాత్రిశేషం తు శోణాకూలే మహర్షిభిః,
నిశాయాం సుప్రభాతాయాం విశ్వామిత్రోఽభ్యభాషత. 1
ప్ర. అ. విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, రాత్రిశేషం = మిగిలిన రాత్రి, మహర్షిభిః = మహర్షులతో కూడ, శోణాకూలే = శోణానదీతీరమున, ఉపాస్య = ఉండి, నిశాయామ్ = రాత్రి, సుప్రభాతాయామ్ = బాగుగా తెల్లవారగా, అభ్యభాషత = పలికెను.
తా. ఆ రాత్రి అంతయు మహర్షులతో శోణానదీతీరమున గడపి, విశ్వామిత్రుడు, తెల్లవారగనే, ఇట్లు పలికెను.
మూ. సుప్రభాతా నిశా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే,
ఉత్తిష్ఠోత్తిష్ఠ భద్రం తే గమనాయాభిరోచయ. 2
ప్ర. అ. రామ = రామా! నిశా = రాత్రి, సుప్రభాతా = బాగా తెల్లవారినది. పూర్వా సన్ధ్యా = ప్రాతఃకాలసంధ్య, ప్రవర్తతే = వచ్చుచున్నది. ఉత్తిష్ఠ ఉత్తిష్ఠ = లెమ్ము లెమ్ము. తే = నీకు, భద్రమ్ = శుభ మగుగాక. గమనాయ = ప్రయాణమునకు, అభిరోచయ = ఆసక్తి కలవాడవు అగుము.
తా. రామా! రాత్రి బాగుగా తెల్లవారినది. ప్రాతఃకాలసంధ్య ప్రారంభమైనది. లెమ్ము లెమ్ము. నీకు మంగళ మగుగాక. ప్రయాణమునకు సన్నద్ధుడవు అగుము.
మూ. తచ్ఛ్రుత్వా వచనం తస్య కృత్వా పౌర్వాహ్ణికీం క్రియామ్,
గమనం రోచయామాస వాక్యం చేదమువాచ హ. 3
ప్ర. అ. తస్య = అతనియొక్క, తత్ వచనమ్ = ఆ వచనమును, శ్రుత్వా = విని, పౌర్వాహ్ణికీమ్ = పూర్వాహ్ణమునకు సంబంధించిన, క్రియామ్ = క్రియను, కృత్వా = చేసి, గమనమ్ = ప్రయాణము చేయుటకు, రోచయామాస = ఇష్టపడెను. ఇదమ్ = ఈ, వాక్యం చ = వాక్యమును, ఉవాచ హ = పలికెను.
తా. విశ్వామిత్రుని మాట విని రాముడు, పూర్వాహ్ణమునందు చేయవలసిన సంధ్యావందనాదులను పూర్తి చేసికొని, ప్రయాణమునకు సిద్ధుడై, ఇట్లు పలికెను.
మూ. అయం శోణః శుభజలో గాధః పులినమణ్డితః,
కతరేణ పథా బ్రహ్మన్ సంతరిష్యామహే వయమ్. 4
ప్ర. అ. బ్రహ్మన్ = బ్రాహ్మణోత్తమా! శుభజలః = శుభమైన ఉదకము గలదియు, పులినమణ్డితః = ఇసుకతిన్నెలచే అలంకరించబడిన, అయమ్ = ఈ, శోణః = శోణనదము, గాధః = లోతులేనిది. వయమ్ = మనము, కేన = ఏ, పథా = మార్గముచేత, సంతరిష్యామహే = దాటుదము.
తా. మునీంద్రా! శుభ మైన జలము గల ఈ శోణనదము ఇసుకతిన్నెలతో ప్రకాశించుచు, లోతు తక్కువగ ఉన్నది. మనము దీనిని ఏ మార్గమున దాటవలెను?
మూ. ఏవముక్తస్తు రామేణ విశ్వామిత్రోఽబ్రవీదిదమ్,
ఏష పన్థా మయోద్దిష్టో యేన యాన్తి మహర్షయః. 5
ప్ర. అ. రామేణ = రామునిచేత, ఏవమ్ = ఈ విధముగా, ఉక్తః = పలకబడిన, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, ఇదమ్ = ఈవాక్యమును, అబ్రవీత్ = పలికెను. మహర్షయః = మహర్షులు, యేన = ఏ మార్గముచేత, యాన్తి = వెళ్లుచున్నారో, ఏషః = ఈ, పన్థాః = మార్గము, మయా = నా చేత, ఉద్దిష్టః = నిశ్చయింపబడినది.
తా. రాముని మాటలు విని విశ్వామిత్రుడు ఇట్లు పలికెను. ‘‘మహర్షులు ఏ మార్గమున వెళ్లుచున్నారో ఆ మార్గముననే పోవుదము.’’
మూ. ఏవముక్తా మహర్షయో విశ్వామిత్రేణ ధీమతా,
పశ్యన్తస్తే ప్రయాతా వై వనాని వివిధాని చ. 6
ప్ర. అ. ధీమతా = బుద్ధిమంతుడైన, విశ్వామిత్రేణ = విశ్వామిత్రునిచేత, ఏవమ్ = ఈ విధముగా, ఉక్తాః = పలకబడిన, తే మహర్షయః = ఆ మహర్షులు, వివిధాని = అనేకవిధములైన, వనాని = వనములను, పశ్యన్తః = చూచుచున్న వారై, ప్రయాతాః = వెళ్లినారు.
తా. విశ్వామిత్రుని మాటలు విన్న మహర్షులు వివిధము లైన వనములను చూచుచు, ప్రయాణము చేసిరి.
మూ. తే గత్వా దూరమధ్వానం గతేఽర్ధదివసే తదా,
జాహ్నవీం సరితాం శ్రేష్ఠాం దదృశుర్మునిసేవితామ్. 7
ప్ర. అ. తే = వారు, దూరమ్ = దూరమైన, అధ్వానమ్ = మార్గమును, గత్వా = వెళ్లి, తదా = అప్పుడు, అర్ధదివసే = దివసముయొక్క సగము భాగము, గతే = కడచిన దగుచుండగా, మునిసేవితామ్ = మునులచే సేవింపబడినదియు, సరితామ్ = నదులలో, శ్రేష్ఠామ్ = శ్రేష్ఠ మైనదియు అగు, జాహ్నవీమ్ = గంగను, దదృశుః = చూచిరి.
తా. వారు చాల దూరము ప్రయాణము చేసి, మధ్యాహ్నసమయమునందు, నదులలో శ్రేష్ఠ మైనదియు, మునులచే సేవింపబడినదియు అగు గంగను చూచిరి.
మూ. తాం దృష్ట్వా పుణ్యసలిలాం హంససారససేవితామ్,
బభూవుర్ముదితాః సర్వే మునయః సహరాఘవాః. 8
ప్ర. అ. పుణ్యసలిలామ్ = పుణ్య మైన ఉదకము కల, హంస సారస సేవితామ్ = హంసలచేతను సారసపక్షులచేతను సేవింపబడిన, తామ్ = ఆ గంగానదిని, దృష్ట్వా = చూచి, సహరాఘవాః = రామునితో కూడిన, సర్వే మునయః = మునులందరును, ముదితాః = సంతసించినవారు, బభూవుః = అయిరి.
తా. పుణ్య మైన ఉదకము కలదియు, హంససారసపక్షులతో కూడినదియు అగు ఆ గంగను చూచి, రామలక్ష్మణులును, ఆ మునులును సంతోషించిరి.
మూ. తస్యాస్తీరే తతశ్చక్రు స్త ఆవాసపరిగ్రహమ్,
తతః స్నాత్వా యథాన్యాయం సంతర్ప్య పితృదేవతాః. 9
హుత్వా చైవాగ్నిహోత్రాణి ప్రాశ్య చామృతవద్ధవిః,
వివిశుర్జాహ్నవీతీరే శుచౌ ముదితమానసాః, 10
విశ్వామిత్రం మహాత్మానం పరివార్య సమన్తతః.
ప్ర. అ. తతః = పిమ్మట, తే = వారు, తస్యాః = ఆ గంగానదియొక్క, తీరే = తీరమునందు, ఆవాసపరిగ్రహమ్ = నివాసస్వీకారమును, చక్రుః = చేసిరి. తతః = పిమ్మట, స్నాత్వా = స్నానము చేసి, యథాన్యాయమ్ = యథాశాస్త్రముగా, పితృదేవతాః = పితృదేవతలను, సంతర్ప్య = తృప్తిపరచి, అగ్నిహోత్రాణి హుత్వా = అగ్నిహోత్రములు చేసి, అమృతవత్ = అమృతము వంటి, హవిః = హవిస్సును, ప్రాశ్య = భుజించి, ముదితమానసాః = ప్రశాంత మైన చిత్తములు కలవారై, మహాత్మానమ్ = మహాత్ముడైన, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని, సమన్తతః = నలుప్రక్కల, పరివార్య = చుట్టి, శుచౌ = పవిత్రమైన, జాహ్నవీతీరే = గంగానదీ తీరమునందు, వివిశుః = కూర్చుండిరి.
తా. వారందరును గంగాతీరమున నివసించిరి. స్నానములు చేసి యథాశాస్త్రముగ పితృతర్పణములు చేసిరి. అగ్నిహోత్రములు చేసికొని అమృతతుల్యమగు హవిస్సును భుజించిరి. ప్రశాంతచిత్తులై, పవిత్ర మగు ఆ గంగాతీరమున మహాత్ము డైన విశ్వామిత్రుని పరివేష్టించి కూర్చుండిరి.
మూ. అథ తత్ర తదా రామో విశ్వామిత్రమథాబ్రవీత్. 11
భగవన్ శ్రోతుమిచ్ఛామి గఙ్గాం త్రిపథగాం నదీమ్,
త్రైలోక్యం కథమాక్రమ్య గతా నదనదీపతిమ్. 12
ప్ర. అ. అథ = పిమ్మట, రామః = రాముడు, తదా = అప్పుడు, తత్ర = అచట, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి, అబ్రవీత్ = పలికెను. భగవన్ = పూజ్యుడా, త్రిపథగామ్ = మూడు మార్గములలో ప్రవహించు, గఙ్గాం నదీమ్ = గంగానదిని గూర్చి, శ్రోతుమ్ = వినుటకు, ఇచ్ఛామి = కోరుచున్నాను. త్రైలోక్యమ్ = మూడు లోకములను, ఆక్రమ్య = ఆక్రమించి, నదనదీపతిమ్ = సముద్రుని గూర్చి, కథమ్ = ఎట్లు, గతా = వెళ్లినది?
తా. అంతట రాముడు అచట సుఖాసీనుడై యున్న విశ్వామిత్రునితో ఇట్లనెను. ‘‘పూజ్యుడా! మూడు మార్గములందు ప్రవహించు గంగను గూర్చి తెలిసికొనదలచు చున్నాను. ఈ నది మూడు లోకములను ఎట్లు ఆక్రమించినది ? ఎట్లు సముద్రము లోనికి ప్రవేశించినది’’.
వి. తూర్పుగా ప్రవహించి తూర్పుసముద్రములో ప్రవేశించునవి నదులు. పశ్చిమముగా ప్రవహించి పశ్చిమసముద్రములో ప్రవేశించునవి నదములు. నదులకును నదములకును పతి సముద్రుడు.
మూ. చోదితో రామవాక్యేన విశ్వామిత్రో మహామునిః,
వృద్ధిం జన్మ చ గఙ్గాయా వక్తుమేవోపచక్రమే. 13
ప్ర. అ. రామవాక్యేన = రాముని వాక్యముచేత, చోదితః = ప్రేరేపింపబడిన, విశ్వామిత్రః మహామునిః = విశ్వామిత్రమహర్షి, గఙ్గాయాః = గంగ యొక్క, జన్మ = పుట్టుకను, వృద్ధిం చ = వృద్ధిని, వక్తుమ్ = చెప్పుటకు, ఉపచక్రమే = ప్రారంభించెను.
తా. రాము డిట్లు ప్రశ్నింపగా విశ్వామిత్రమహాముని గంగానది ఉత్పత్తి, వృద్ధి మొదలైన విషయములను చెప్ప మొదలిడెను.
మూ. శైలేన్ద్రో హిమవన్నామ ధాతూనామాకరో మహాన్,
తస్య కన్యాద్వయం రామ రూపేణాప్రతిమం భువి. 14
ప్ర. అ. రామ = రామా! ధాతూనామ్ = ధాతువుయొక్క, మహాన్ = గొప్ప, ఆకరః = గని యైన, హిమవాన్నామ = హిమవంతుడనెడు, శైలేన్ద్రః = పర్వతరాజు ఉన్నాడు. తస్య = అతనికి, రూపేణ = రూపముచేత, భువి = భూలోకమునందు, అప్రతిమమ్ = సాటిలేని, కన్యాద్వయమ్ = కన్యాద్వయము ఉన్నది.
తా. రామా! హిమవంతు డనెడు పర్వతరాజు ఉన్నాడు. ఆతడు అనేక విధము లగు ధాతువులకు గొప్ప నిధి. అతనికి ప్రపంచమునందు సాటిలేని సౌందర్యము గల ఇద్దరు కన్యకలు ఉన్నారు.
మూ. యా మేరుదుహితా రామ తయోర్మాతా సుమధ్యమా,
నామ్నా మనోరమా నామ పత్నీ హిమవతః ప్రియా. 15
ప్ర. అ. రామ = రామా! నామ్నా = పేరుచేత, మనోరమా నామ = మనోరమ అను ప్రసిద్ధి గల, యా = ఏ, మేరుదుహితా = మేరుపర్వతము యొక్క కుమార్తె ఉన్నదో, సుమధ్యమా = అందమైన నడుము గల ఆమె, హిమవతః = హిమవంతుని యొక్క, ప్రియా = ఇష్టురాలైన, పత్నీ = భార్య. తయోః = ఆ కన్యకల యొక్క, మాతా = తల్లి.
తా. మేరుపర్వతము కుమార్తె యైన మనోరమ ఆ హిమవంతుని భార్య. ఆ కన్యకల తల్లి.
మూ. తస్యాం గఙ్గేయమభవజ్జ్యేష్ఠా హిమవతః సుతా,
ఉమా నామ ద్వితీయాభూన్నామ్నా తస్యైవ రాఘవ. 16
ప్ర. అ. రామ = రామా! ఇయమ్ = ఈ, గఙ్గా = గంగ, హిమవతః = హిమవంతునియొక్క, జ్యేష్ఠా = పెద్దదైన, సుతా = కుమార్తెగా, తస్యామ్ = మనోరమయందు, అభవత్ = జనించెను. తస్యైవ = అతనికే, నామ్నా = పేరుచేత, ఉమా నామ = ఉమ అను ప్రసిద్ధి గల, ద్వితీయా = రెండవ కుమార్తె, అభూత్ = జనించెను.
తా. రామా! ఈ గంగ హిమవంతునకు, మనోరమయందు పెద్ద కుమార్తెగా జనించినది. అతనికే ఉమ రెండవ కుమార్తెగా జనించినది.
మూ. అథ జ్యేష్ఠాం సురాః సర్వే దేవతార్థచికీర్షయా,
శైలేన్ద్రం వరయామాసుర్గఙ్గాం త్రిపథగాం నదీమ్. 17
ప్ర. అ. అథ = పిమ్మట, సర్వే సురాః = దేవత లందరును, దేవతార్థ చికీర్షయా = దేవతల ప్రయోజనమును చేయ నిచ్ఛతో, త్రిపథగామ్ = మూడు మార్గములలో ప్రవహించు, నదీమ్ = నది యైన, జ్యేష్ఠామ్ = పెద్ద కుమార్తె యైన, గఙ్గామ్ = గంగను, శైలేన్ద్రమ్ = పర్వతరాజును, వరయామాసుః = యాచించిరి.
తా. దేవత లందరును తమ ప్రయోజనమును సాధించుకొనుటకై, జ్యేష్ఠ పుత్రికయు, మూడు మార్గములలో ప్రవహించునదియు అగు గంగను తమ కిమ్మని హిమవంతుని కోరిరి.
మూ. దదౌ ధర్మేణ హిమవాన్ తనయాం లోకపావనీమ్,
స్వచ్ఛందపథగాం గఙ్గాం త్రైలోక్యహితకామ్యయా. 18
ప్ర. అ. హిమవాన్ = హిమవంతుడు, ధర్మేణ = ధర్మబుద్ధితో, త్రైలోక్యహితకామ్యయా = మూడు లోకములకు హితము చేయ వలె ననెడు అభిలాషతో, లోకపావనీమ్ = లోకములను పవిత్రింపచేయునదియు, స్వచ్ఛన్దపథగామ్ = తన కిష్టమైన మార్గమున ప్రవహించునదియు అగు, తనయామ్ = కుమార్తె యైన, గఙ్గామ్ = గంగను, దదౌ = ఇచ్చెను.
తా. హిమవంతుడు ధర్మమును పాటించి, మూడులోకములకును హితము కలుగ వలె ననెడు కోరికతో, లోకములను పవిత్రింపచేయునదియు, స్వేచ్ఛానుసారముగా ప్రవహింప సమర్థురాలును అగు తన జ్యేష్ఠపుత్రి యైన గంగను వారి కిచ్చెను.
మూ. ప్రతిగృహ్య తతో దేవాస్త్రిలోకహితకారిణః,
గఙ్గామాదాయ తేఽగచ్ఛన్ కృతార్థేనన్తరాత్మనా. 19
ప్ర. అ. తతః = పిమ్మట, తే దేవాః = ఆ దేవతలు, త్రైలోక్యహిత కారిణః = మూడు లోకములకును హితము చేయబోవు వారై, గఙ్గామ్ = గంగను, ప్రతిగృహ్య = స్వీకరించి, ఆదాయ = తీసికొని, కృతార్థేన = చరితార్థ మైన, అన్తరాత్మనా = మనస్సుతో, అగచ్ఛన్ = వెళ్లిరి.
తా. దేవతలు గంగను హిమవంతుని నుండి ప్రతిగ్రహించి, సఫల మైన కోరిక గల మనస్సుతో, ఆమెను, మూడు లోకములకును హితము చేయబోవు వారై, తీసుకొని వెళ్లిరి.
మూ. యా చాన్యా శైలదుహితా కన్యాసీద్రఘునన్దన,
ఉగ్రం సా వ్రతమాస్థాయ తపస్తేపే తపోధనా. 20
ప్ర. అ. రఘునన్దన = రామా! అన్యా = మరియొక, శైలదుహితా = హిమవంతుని పుత్రి యైన, యా = ఏ, కన్యా = కన్య, ఆసీత్ = ఉండెనో, సా = ఆమె, తపోధనా = తపోధనురాలై, ఉగ్రమ్ = ఉగ్ర మైన, వ్రతమ్ = వ్రతమును, ఆస్థాయ = అవలంబించి, తపః = తపస్సు, తేపే = చేసెను.
తా. రామా! హిమవంతుని రెండవ కుమార్తె యైన ఉమ, తపోధనురాలై, ఉగ్రమైన వ్రతమును అవలంబించి తపస్సు ఆచరించెను.
మూ. ఉగ్రేణ తపసా యుక్తాం దదౌ శైలవరః సుతామ్,
రుద్రాయాప్రతిరూపాయ ఉమాం లోకనమస్కృతామ్. 21
ప్ర. అ. శైలవరః = హిమవంతుడు, ఉగ్రేణ = ఉగ్రమైన, తపసా = తపస్సుతో, యుక్తామ్ = కూడినదియు, లోకనమస్కృతామ్ = లోకములచే నమస్కరింపబడినదియు అగు, సుతామ్ = కుమార్తె యైన, ఉమామ్ = ఉమను, అప్రతిరూపాయ = సాటి లేని, రుద్రాయ = రుద్రునకు, దదౌ = ఇచ్చెను.
తా. హిమవంతుడు ఉగ్ర మైన తపస్సు చేసిన, సర్వలోకనమస్కృతయైన కుమార్తె యగు ఉమను సాటి లేని రుద్రున కిచ్చి వివాహము చేసెను.
మూ. ఏతే తే శైలరాజస్య సుతే లోకనమస్కృతే,
గఙ్గా చ సరితాం శ్రేష్ఠా ఉమాదేవీ చ రాఘవ. 22
ప్ర. అ. రాఘవ = రామా! సరితామ్ = నదులలో, శ్రేష్ఠా = శ్రేష్ఠ యైన, గఙ్గా చ = గంగయు, ఉమాదేవీ చ = ఉమాదేవియు, ఏతే = వీరిద్దరును, శైలరాజస్య = శైలరాజుయొక్క, లోకనమస్కృతే = లోకములచే నమస్కరింపబడిన, తే = ప్రసిద్ధ లైన, సుతే = కుమార్తెలు.
తా. రామా! నదులలో శ్రేష్ఠురా లైన గంగ, ఉమాదేవి, వీరిరువురును హిమవంతుని పుత్రికలు, లోకములచే పూజింపబడిన వారు.
మూ. ఏతత్తే సర్వమాఖ్యాతం యథా త్రిపథగా నదీ,
ఖం గతా ప్రథమం తాత గతిం గతిమతాం వర. 23
ప్ర. అ. గతిమతామ్ = అందమైన నడక కలవారిలో, వర = శ్రేష్ఠుడా! తాత = నాయనా రామా! త్రిపథగా నదీ = మూడు మార్గములందు సంచరించు గంగానది, ప్రథమమ్ = ముందుగా, యథా = ఏ విధముగా, ఖమ్ = ఆకాశమును, గతా = పొందినదో, ఏతత్ = ఇది, సర్వమ్ = అంతయు, ఆఖ్యాతమ్ = చెప్పబడినది.
తా. అందమైన నడక గలవారిలో శ్రేష్టుడా! రామా! గంగానది మొదట ఆకాశమునకు ఎట్లు వెళ్ళినదో ఈ విషయ మంతయు చెప్పినాను.
మూ. సైషా సురనదీ రమ్యా శైలేంద్రస్య సుతా తదా,
సురలోకం సమారూఢా విపాపా జలవాహినీ. 24
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే పఞ్చత్రింశః సర్గః
ప్ర. అ. రమ్యా = సుందర మైనదియు, విపాపా = పాపములు లేనిదియు, జలవాహినీ = జలరూపమున ప్రవహించునదియు అగు, సా ఏషా = అట్టి ఈ, శైలేన్ద్రస్య = హిమవంతునియొక్క, సుతా = కుమార్తె, తదా = అప్పుడు, సురనదీ = సురనదిగా అయి, సురలోకమ్ = స్వర్గలోకమును, సమారూఢా = ఎక్కినది.
తా. రమ్య మైనదియు, పాపరహితము అగు ఆ హిమవత్పుత్రిక జల రూపమున ప్రవహించుచు, అపుడు స్వర్గమును అధిరోహించి సురనది యైనది.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో ముప్పది యైదవ సర్గ సమాప్తము.

25
26
27
28
29
30
31
32
33
34
35