Chapter_36

Back
Book Balakandamu
Chapter No 42
Pages 6
Read Time 10 Minutes

Chapter_36

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ షట్త్రింశః సర్గః

దేవతలు పార్వతీశివుల రతిక్రీడలు విఘ్నము కలిగింపగా పార్వతి దేవతలకును, భూదేవికిని శాపము నిచ్చుట.

మూ. ఉక్తవాక్యే మునౌ తస్మిన్నుభౌ రాఘవలక్ష్మణౌ,

ప్రతినన్ద్య కథాం వీరావూచతుర్మునిపుఙ్గవమ్. 1

ప్ర. అ. తస్మిన్ = ఆ, మునౌ = ముని, ఉక్తవాక్యే = చెప్పబడిన వాక్యము కలవాడగుచుండగా, వీరౌ = వీరు లైన, రాఘవలక్ష్మణౌ = రామలక్ష్మణులు, ఉభౌ = ఇరువురును, కథామ్ = కథను, ప్రతినన్ద్య = అభినందించి, మునిపుఙ్గవమ్ = ఆ మునిశ్రేష్ఠుని గూర్చి, ఊచతుః = పలికిరి.

తా. విశ్వామిత్రుని వాక్యము విని రామలక్ష్మణులు ఆ కథను మెచ్చుకొని, ఆ మునిపుంగవునితో ఇట్లు పలికిరి.

మూ. ధర్మయుక్తమిదం బ్రహ్మన్ కథితం పరమం త్వయా,

దుహితుః శైలరాజస్య జ్యేష్ఠాయా వక్తుమర్హసి. 2

విస్తరం విస్తరజ్ఞోఽసి దివ్యమానుషసంభవమ్.

ప్ర. అ. బ్రహ్మన్ = ఓ బ్రహ్మర్షీ! ధర్మయుక్తమ్ = ధర్మముతో కూడిన, పరమమ్ = ఉత్తమ మైన, ఇదమ్ = ఇది, త్వయా = నీచేత, కథితమ్ = చెప్పబడినది. శైలరాజస్య = హిమవంతునియొక్క, జ్యేష్ఠాయాః దుహితుః = పెద్ద కుమార్తెయొక్క, దివ్యమానుష సంభవమ్ = దేవలోకమునందును, మనుష్యలోకమునందును జరిగిన, విస్తరమ్ = కథా విస్తరమును, వక్తుమ్ = చెప్పుటకు, అర్హసి = తగి ఉన్నావు. విస్తరజ్ఞః = కథా విస్తరములు తెలిసినవాడవుగా, అసి = అయి ఉన్నావు.

తా. మునీంద్రా! ధర్మయుక్త మైన ఈ ఉత్తమకథను చెప్పినావు. హిమవంతుని పెద్ద కుమార్తెకు సంబంధించిన దేవలోకమనుష్యలోకములలో జరిగిన కథను సవిస్తరముగ చెప్పుము. నీవు కథావిస్తరములు తెలిసినవాడవు కదా.

మూ. త్రీన్ పథో హేతునా కేన ప్లావయేల్లోకపావనీ. 3

కథం గఙ్గా త్రిపథగా విశ్రుతా సరిదుత్తమా,

త్రిషు లోకేషు ధర్మజ్ఞ కర్మభిః కైః సమన్వితా. 4

ప్ర. అ. లోకపావనీ = లోకములను పవిత్రింపచేయు గంగ, కేన హేతునా = ఏ కారణముచేత, త్రీన్ = మూడు, పథః = మార్గములను, ప్లావయేత్ = ఉదకముచే నింపినది? ధర్మజ్ఞ = ధర్మములను ఎరిగినవాడా! త్రిపథగా = మూడు మార్గములందు ప్రవహించు, గఙ్గా = గంగ, కైః = ఏ, కర్మభిః = కర్మలతో, అన్వితా = కూడినదై, త్రిషు లోకేషు = మూడు లోకములలో, సరిదుత్తమా = నదులలో ఉత్తమ మైనదిగా, విశ్రుతా = ప్రసిద్ధ మైనది ?

తా. లోకపావని యైన గంగ ఏ కారణముచేత మూడు మార్గములలో ప్రవహించు చున్నది? ఓ ధర్మజ్ఞుడా! త్రిపథగ యైన ఈ గంగ, ఏ కర్మలను పట్టి, మూడు లోకములలో ఉత్తమనది యని ప్రసిద్ధి పొందినది ?

మూ. తథా బ్రువతి కాకుత్థ్సే విశ్వామిత్రస్తపోధనః,

నిఖిలేన కథాం సర్వా మృషిమధ్యే న్యవేదయత్. 5

ప్ర. అ. కాకుత్థ్సే = రాముడు, తథా = ఆ విధముగా, బ్రువతి = పలుకుచుండగా, తపోధనః = తపస్సే ధనముగా గల విశ్వామిత్రుడు, సర్వామ్ = సమస్తమైన, కథామ్ = కథను, నిఖిలేన = పూర్తిగా, ఋషిమధ్యే = ఋషులమధ్యయందు, న్యవేదయత్ = తెలిపెను.

తా. రాముని మాటలు విని విశ్వామిత్రమహర్షి ఆ కథ నంతను సంపూర్ణముగా, ఋషులమధ్యయందు చెప్పెను.

మూ. పురా రామ కృతోద్వాహో నీలకణ్ఠో మహాతపాః,

దృష్ట్వా చ స్పృహయా దేవీం మైథునాయోపచక్రమే. 6

ప్ర. అ. రామ = రామా! పురా = పూర్వము, కృ తోద్వాహః = చేసికొనబడిన వివాహము గల, మహాతపాః = మహాతపఃశాలి యైన, నీలకణ్ఠః = శివుడు, దేవీమ్ = దేవిని, దృష్ట్వా = చూచి, స్పృహయా = ఆసక్తితో, మైథునాయ = మైథునమునకు, ఉపచక్రమే = ప్రారంభించెను.

తా. రామా! మహాతపఃశాలి యగు ఈశ్వరుడు పూర్వము వివాహము చేసికొని, దేవిని చూచి, అత్యాసక్తితో మైథునమునకు ఉపక్రమించెను.

మూ. శితికణ్ఠస్య దేవస్య దివ్యం వర్షశతం గతమ్,

న చాపి తనయో రామ తస్యామాసీత్పరంతప. 7

ప్ర. అ. పరంతప = శత్రువును పీడించు, రామ = రామా!, దేవస్య = దేవుడైన, శితికంఠస్య = ఈశ్వరునకు, దివ్యమ్ = దివ్య మైన, వర్షశతమ్ = సంవత్సరముల శతము, గతమ్ = కడచినది. అపిచ = అయినను, తస్యామ్ = ఆమెయందు, తనయః = కుమారుడు, న అసీత్ = పుట్టలేదు.

తా. ఈశ్వరు డీ విధముగ క్రీడించుచుండగా నూరు దివ్య వర్షములు కడచిపోయినవి. కాని ఆ దేవియందు కుమారుడు జనించలేదు.

మూ. తతో దేవాః సముద్విగ్నాః పితామహపురోగమాః,

యదిహోత్పద్యతే భూతం క స్తత్ప్రతిసహిష్యతే. 8

ప్ర. అ. తతః = పిమ్మట, పితామహపురోగమాః = బ్రహ్మ మొదలైన, దేవాః = దేవతలు, ఇహ = ఈ దేవియందు, యత్ = ఏ, భూతమ్ = ప్రాణి, ఉత్పద్యతే = పుట్టునో, తత్ = దానిని, కః = ఎవడు, ప్రతిసహిష్యతే = సహింపగలడు అని, సముద్విగ్నాః = కలత చెందిరి.

తా. ‘‘ఈ దేవియందు పుట్టబోవు భూతమును ఎవ్వడైన సహింపగలడా?’’ అని బ్రహ్మదేవుడు మొదలైన దేవత లందరును కలత చెందిరి.

మూ. అభిగమ్య సురాస్సర్వే ప్రణిపత్యేదమబ్రువన్,

దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితే రత. 9

సురాణాం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి.

ప్ర. అ. సురాః = దేవతలు, సర్వే = అందరును, అభిగమ్య = ఈశ్వరుని వద్దకు వెళ్లి, ప్రణిపత్య = నమస్కరించి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రువన్ = పలికిరి. దేవదేవ = దేవతలకు దేవుడా! అస్య = ఈ, లోకస్య = లోకముయొక్క, హితే = హితమునందు, రత = ఆసక్తుడా! మహాదేవ = మహాదేవుడా! సురాణామ్ = దేవతలమైన మాయొక్క, ప్రణిపాతేన = నమస్కారముచేత, ప్రసాదమ్ = అనుగ్రహమును, కర్తుమ్ = చేయుటకు, అర్హసి = తదియున్నావు.

తా. ఈ లోకమునకు హితము చేయుటయందు ఆసక్తి గల, దేవాధిదేవుడ వైన మహాదేవా! దేవతలము మేము నమస్కరించుచున్నాము; అనుగ్రహింపుము.

మూ. న లోకా ధారయిష్యన్తి తవ తేజః సురోత్తమ. 10

బ్రాహ్మేణ తపసా యుక్తో దేవ్యా సహ తపశ్చర,

త్రైలోక్యహితకామార్థం తేజస్తేజసి ధారయ. 11

ప్ర. అ. సురోత్తమ = ఓ దేవతాశ్రేష్ఠుడా! తవ = నీయొక్క, తేజః = తేజస్సును, లోకాః = లోకములు, న ధారయిష్యన్తి = ధరింపజాలవు. బ్రాహ్మేణ = వేదోక్తమైన, తపసా = తపస్సుతో, యుక్తః = కూడినవాడవై, దేవ్యా సహ = పార్వతితో గూడ, తపః = తపస్సును, చర = చేయుము. త్రైలోక్యహితకామార్థమ్ = త్రైలోక్యముయొక్క హితమునందు కోరికతో, తేజః = తేజస్సును, తేజసి = తేజస్సునందు, ధారయ = నిలుపుము.

తా. ఓ సురోత్తమా! నీ తేజస్సును లోకములు ధరింపజాలవు. దేవితో కూడ వేదోక్తప్రకారమున తపస్సు చేయుము. తేజస్సును నీ తేజస్సునందే ధరించి మూడు లోకములకును హితము చేకూర్చుము.

మూ. దేవతానాం వచః శ్రుత్వా సర్వలోకమహేశ్వరః,

బాఢమిత్యబ్రవీత్సర్వాన్ పునశ్చేదమువాచ హ. 12

ప్ర. అ. సర్వలోకమహేశ్వరః = ఆ సర్వలోక ప్రభువు, దేవతానామ్ = దేవతలయొక్క, వచః = వాక్యమును, శ్రుత్వా = విని, బాఢమ్ = తప్పక అట్లే అగుగాక, ఇతి = అని, అబ్రవీత్ = పలికెను. పునశ్చ = మరల, ఇదమ్ = ఈ వాక్యమును, ఉవాచ హ = పలికెను.

తా. ఆ సర్వలోకమహేశ్వరుడు దేవతల వాక్యము విని తప్పక అటులనే అగుగాక అని పలికి మరల ఇట్లనెను.

మూ. ధారయిష్యామ్యహం తేజస్తేజస్యేవ సహోమయా,

త్రిదశాః పృథివీ చైవ నిర్వాణమధిగచ్ఛతు. 13

ప్ర. అ. ఉమయా సహ = ఉమాదేవితో గూడ, అహమ్ = నేను, తేజః = తేజస్సును, తేజస్యేవ = తేజస్సునందే, ధారయిష్యామి = ధరించగలను. త్రిదశాః = దేవతలును, పృథివీ చైవ = భూమియు, నిర్వాణమ్ = సుఖమును, అధిగచ్ఛతు = పొందుగాక.

తా. ఉమాసహితుడ నైన నేను నా తేజస్సును (రేతస్సును) తేజస్సునందే (నా శరీరమునందే) ధరించెదను. దేవతలును, పృథివియు భయపడకుందురు గాక.

మూ. యదిదం క్షుభితం స్థానాన్మమ తేజో హ్యనుత్తమమ్,

ధారయిష్యతి కస్తన్మే బ్రువన్తు సురసత్తమాః. 14

ప్ర. అ. మమ = నా యొక్క, అనుత్తమమ్ = శ్రేష్ఠమైన, యత్ = ఏ, ఇదమ్ = ఈ, తేజః = తేజస్సు, స్థానాత్ = స్వస్థానమునుండి, క్షుభితమ్ = క్షోభింపచేయబడినదో, తత్ = దానిని, కః = ఎవడు, ధారయిష్యతి = ధరించగలడు? సురసత్తమాః = దేవతాశ్రేష్ఠులారా! మే = నాకు, బ్రువన్తు = చెప్పుదురు గాక.

తా. దేవతలారా! స్వస్థానమునుండి చలించిన నా యీ శ్రేష్ఠ మైన తేజస్సును ఎవరు ధరింతురో చెప్పుడు.

మూ. ఏవముక్తాః సురాస్సర్వే ప్రత్యూచుర్వృషభధ్వజమ్,

యత్తేజః క్షుభితం హ్యేతత్తద్ధరా ధారయిష్యతి. 15

ప్ర. అ. ఏవమ్ = ఈ విధముగా, ఉక్తాః = పలకబడిన, సురాః = దేవతలు, సర్వే = అందరును, వృషభధ్వజమ్ = వృషభము ధ్వజమునందు గల ఈశ్వరుని గూర్చి, ప్రత్యూచుః = తిరిగి పలికిరి. యత్ = ఏ, తేజః = తేజస్సు, క్షుభితమ్ = చలించినదో, తత్ = దానిని, ధరా = భూమి, ధారయిష్యతి = ధరించగలదు.

తా. ఆ మాటలు విని దేవతలు ఈశ్వరునితో ఇట్లు అనిరి -- ‘‘చలించిన తేజస్సును భూమి ధరించగలదు.’’

మూ. ఏవముక్తః సురపతిః ప్రముమోచ మహీతలే,

తేజసా పృథివీ యేన వ్యాప్తా సగిరికాననా. 16

ప్ర. అ. ఏవమ్ = ఈ విధముగ, ఉక్తః = పలకబడిన, సురపతిః = మహేశ్వరుడు, యేన = ఏ, తేజసా = తేజస్సుచేత, సగిరికాననా = పర్వతములతోడను అడవులతోడను గూడిన, పృథివీ = భూమి, వ్యాప్తా = వ్యాపింపబడినదో, అట్టి తేజస్సును, మహీతలే = భూమియందు, ప్రముమోచ = విడచెను.

తా. దేవతలు చెప్పిన విధముగ మహేశ్వరుడు తేజస్సును భూమిపై విడువగా అది పర్వతారణ్యాదులతో సహా భూమిపై అంతటను వ్యాపించెను.

మూ. తతో దేవాః పునరిదమూచుశ్చాథ హుతాశనమ్,

ప్రవిశ త్వం మహాతేజో రౌద్రం వాయుసమన్వితః. 17

ప్ర. అ. తతః = ఆ కారణమువలన, అథ = పిమ్మట, దేవాః = దేవతలు, పునః = మరల, హుతాశమ్ = అగ్నిని, ఇదమ్ = ఈ వాక్యమును, ఊచుః = పలికిరి. త్వమ్ = నీవు, వాయుసమన్వితః = వాయువుతో కూడినవాడవై, రౌద్రమ్ = రుద్రునిసంబంధమైన, మహాతేజః = గొప్ప తేజస్సును, ప్రవిశ = ప్రవేశించుము.

తా. అది చూచి దేవతలు ‘‘వాయువుతో కూడినవాడవై ఈ ఈశ్వర తేజస్సులో ప్రవేశించుము’’ అని అగ్నిని ఆదేశించిరి.

మూ. తదగ్నినా పునర్వ్యాప్తం సంజాతః శ్వేతపర్వతః,

దివ్యం శరవణం చైవ పావకాదిత్యసంనిభమ్. 18

యత్ర జాతో మహాతేజాః కార్తికేయోఽగ్నిసంభవః.

ప్ర. అ. అగ్నినా = అగ్నిచేత, వ్యాప్తమ్ = వ్యాప్త మైన, తత్ = ఆ తేజస్సు, పునః = మరల, శ్వేతపర్వతః = తెల్లని పర్వతముగా, సంజాతః = అయినది. పావకాదిత్యసంనిభమ్ = అగ్నితోడను ఆదిత్యునితోడను సమాన మైన, దివ్యమ్ = దివ్యమైన, శరవణం చైవ = ఱెల్లుగడ్డి వనము గాను, అయినది. యత్ర = దేనియందు, మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును, అగ్నిసంభవః = అగ్ని నుండి పుట్టినవాడును అగు, కార్తికేయః = కృత్తికాకుమారు డైన కుమారస్వామి, జాతః = పుట్టెనో.

తా. ఆ తేజస్సు అగ్నిచేత వ్యాప్తమై శ్వేతపర్వతముగ అయినది. అచటనే అగ్య్నాదిత్యులతో సమాన మైన, దివ్య మైన, శరవణము కూడ బయలుదేరినది. దానియందే మహాతేజఃశాలియు, అగ్నినుండి పుట్టిన వాడును, కృత్తికల కుమారుడును అగు కుమారస్వామి జనించెను.

వి. కుమారస్వామి అగ్నిచే ధరింపబడిన మహేశ్వరతేజస్సునుండి పుట్టుటచే అగ్నిసంభవఃఅనియు, కృత్తికలు పెంచుటచే కార్తికేయఃఅనియు చెప్పబడినాడు.

మూ. అథోమాం చ శివం చైవ దేవాః సర్షిగణాస్తదా,

పూజయామాసురత్యర్థం సుప్రీతమనసస్తతః. 19

ప్ర. అ. అథ = అటుపిమ్మట, సర్షిగణాః = ఋషులగణములతో కూడిన, దేవాః = దేవతలు, తతః = అట్లు జరుగుటవలన, సుప్రీతమనసః = చాల సంతోషించిన మనస్సులు కలవారై, తదా = అప్పుడు, ఉమాం చ = ఉమాదేవిని, శివం చైవ = శివుని, అత్యర్థమ్ = మిక్కిలి, పూజయామాసుః = పూజించిరి.

తా. పిమ్మట దేవతలును, మహర్షులును చాల సంతసించినవారై ఉమాదేవిని, పరమేశ్వరుని ఎక్కువగా పూజించిరి.

మూ. అథ శైలసుతా రామ త్రిదశానిదమబ్రవీత్,

సమన్యురశపత్సర్వాన్ క్రోధసంరక్తలోచనా. 20

ప్ర. అ. రామ = రామా! అథ = పిమ్మట, శైలసుతా = ఉమాదేవి, సమన్యుః = కోపముతో కూడినదై, త్రిదశాన్ = దేవతలను గూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను. క్రోధసంరక్తలోచనా = క్రోధముచేత ఎఱ్ఱ నైన నేత్రములు కలదై, సర్వాన్ = అందరిని, అశపత్ = శపించెను.

తా. రామా! ఉమాదేవి కోపించినదై, ఎఱ్ఱబడిన నేత్రములతో, దేవతల నందరిని శపించుచు ఇట్లు పలికెను.

మూ. యస్మాన్నివారితా చైవ సంగతిః పుత్రకామ్యయా,

అపత్యం స్వేషు దారేషు తస్మాన్నోత్పాదయిష్యథ. 21

ప్ర. అ. యస్మాత్ = ఎందువలన, పుత్రకామ్యయా = పుత్రుడు కావలె నను కోరికతో, సంగతిః = మేము చేయుచున్న సంగమము, నివారితా = నివారింపబడినదో, తస్మాత్ = ఆ కారణమువలన, స్వేషు = తమ, దారేషు = భార్యలయందు, అపత్యమ్ = సంతానమును, నోత్పాదయిష్యథ = పుట్టింపకుందురుగాక.

తా. ‘‘పుత్రుడు కావలె నను కోరికచే మేమిరువురము చేయుచున్న సంభోగమునకు అడ్డు తగిలినారు గాన మీకు మీ భార్యలయందు సంతానము కలుగుకుండుగాక.’’

మూ. అద్యప్రభృతి యుష్మాకమప్రజాః సన్తు పత్నయః,

ఏవముక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీమపి. 22

ప్ర. అ. అద్యప్రభృతి = నేడు మొదలు, యుష్మాకమ్ = మీయొక్క, పత్నయః = భార్యలు, అప్రజాః = సంతానము లేనివారుగా, సన్తు = అగుదురుగాక. సర్వాన్ సురాన్ = అందరు దేవతలను, ఏవమ్ = ఇట్లు, ఉక్త్వా = పలికి, పృథివీమపి = భూమిని కూడ, శశాప = శపించెను.

తా. ‘‘నేడు మొదలు మీ భార్యలకు సంతానము కలుగుకుండుగాక’’ దేవతల నందరిని ఈ విధముగ శపించి, ఉమాదేవి పృథివిని గూడ ఇట్లు శపించెను.

మూ. అవనే నైకరూపా త్వం బహుభార్యా భవిష్యసి. 23

న చ పుత్రకృతాం ప్రీతిం మత్క్రోధకలుషీకృతా,

ప్రాప్స్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్ఛతీ. 24

ప్ర. అ. అవనే = ఓ భూమీ! త్వమ్ = నీవు, నైకరూపా = అనేక రూపములు గలదానవై, బహుభార్యా = చాలామందికి భార్యవు, భవిష్యసి = కాగలవు. సుదుర్మేధే = చాల చెడ్డబుద్ధి కలదానా! మమ = నాకు, పుత్రమ్ = పుత్రుడు కలుగుటకు, అనిచ్ఛతీ = ఇష్టపడని, త్వమ్ = నీవు, మత్క్రోధకలుషీకృతా = నా యొక్క క్రోధముచేత పీడితురాలవై, పుత్రకృతామ్ = పుత్రులవలన కలుగు, ప్రీతిం చ = ఆనందమును గూడ, న ప్రాప్స్యసి = పొందవు.

తా. ‘‘ఓ భూమీ! నీవు అనేక రూపములు కలదానవుగాను, అనేకులకు భార్యవుగాను అగుదువుగాక. చాల చెడ్డబుద్ధి గలదానా! నాకు పుత్రుడు జనించుటకు ఇష్టపడని నీవు నా కోపమునకు ఫలితముగా, పుత్రానందమును పొందకుందువుగాక.’’

మూ. తాన్ సర్వాన్ వ్రీళితాన్ దృష్ట్వా సురాన్ సురపతిస్తదా,

గమనాయోపచక్రామ దిశం వరుణపాలితామ్. 25

ప్ర. అ. సురపతిః = మహేశ్వరుడు, తదా = అప్పుడు, వ్రీడితాన్ = సిగ్గుచెందిన, తాన్ = ఆ, సర్వాన్ = సమస్త మైన, సురాన్ = దేవతలను, దృష్ట్వా = చూచి, వరుణపాలితామ్ = వరుణునిచే పాలింపబడిన, దిశమ్ = దిక్కును గూర్చి, గమనాయ = వెళ్లుటకు,ఉపచక్రామ = ఉపక్రమించెను.

తా. అపుడు మహేశ్వరుడు సిగ్గుచెందిన సురుల నందరిని చూచి, అచటి నుండి పశ్చిమదిక్కు వైపు వెళ్లుటకు బయలుదేరెను.

మూ. స గత్వా తప ఆతిష్ఠత్పార్శ్వే తస్యోత్తరే గిరేః,

హిమవత్ప్రభవే శృఙ్గే దేవ్యా సహ మహేశ్వరః. 26

ప్ర. అ. సః = ఆ, మహేశ్వరః = మహేశ్వరుడు, గత్వా = పశ్చిమము వైపు వెళ్లి, తస్య = ఆ, గిరేః = హిమవత్పర్వతముయొక్క, ఉత్తరే = ఉత్తరమునందున్న, పార్శ్వే = పార్శ్వమునందు, హిమవత్ప్రభవే = హిమవత్పర్వతమునందు పుట్టిన, శృఙ్గే = శిఖరమునందు, దేవ్యా సహ = ఉమాదేవితో గూడ, తవః = తపస్సును, ఆతిష్ఠత్ = చేసెను.

తా. మహేశ్వరుడు హిమవత్పర్వతమునందే పశ్చిమదిక్కుగా వెళ్లి, ఆ హిమవత్ప ర్వతము ఉత్తరపార్శ్వమునం దున్న శిఖరము పై, ఉమాసమేతుడై తపస్సు చేసెను.

మూ. ఏష తే విస్తరో రామ శైలపుత్య్రా నివేదితః,

గఙ్గాయాః ప్రభవం చైవ శృణు మే సహ లక్ష్మణః. 27

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే షట్త్రింశః సర్గః

ప్ర. అ. రామ = రామా! శైలపుత్య్రాః = ఉమాదేవికి సంబంధించిన, ఏషః = ఈ, విస్తరః = కథావిస్తరము, తే = నీకు, కథితః = చెప్పబడినది. గఙ్గాయాః = గంగ యొక్క; ప్రభవమ్ = పుట్టుకను; సహ లక్ష్మణః = లక్ష్మణుని తో కూడియున్నవాడవై మే = నా వలన; శృణు = వినుము.

తా. రామా! ఉమాదేవికి సంబంధించిన కథ చెప్పితిని. ఇపుడు నీవును, లక్ష్మణుడును, గంగాప్రభావమును వినుడు.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో ముప్పదియారవ సర్గ సమాప్తము.