| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 43 |
| Pages | 8 |
| Read Time | 13 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ సప్తత్రింశః సర్గః
గంగనుండి కార్తికేయుడు జనించుట.
మూ. తప్యమానే తపో దేవే దేవాః సర్షిగణాః పురా,
సేనాపతిమభీప్సన్తః పితామహముపాగమన్. 1
ప్ర. అ. పురా = పూర్వము, దేవే = పరమేశ్వరుడు, తపః తప్యమానే = తపస్సు చేయుచుండగా, సర్షిగణాః = ఋషిగణములతో కూడిన, దేవాః = దేవతలు, సేనాపతిమ్ = సేనాపతిని, అభీప్సన్తః = కోరుచున్నవారై, పితామహమ్ = బ్రహ్మదేవుని, ఉపాగమన్ = సమీపించిరి.
తా. పూర్వము ఈ విధముగ పరమేశ్వరుడు తపస్సు చేయుచుండగా, దేవతలును, ఋషులను, సేనానాయకుడు కావలె నని కోరుచు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లిరి.
మూ. తతోఽబ్రువన్ సురాః సర్వే భగవన్తం పితామహమ్,
ప్రణిపత్య సురాః సర్వే సేన్ద్రాః సాగ్నిపురోగమాః. 2
ప్ర. అ. తతః = పిమ్మట, సేన్ద్రాః = ఇంద్రునితో కూడినవారును, అగ్నిపురోగమాః = అగ్ని ఎదుట కలవారును అగు, సురాః = దేవతలు, సర్వే = అందరును, భగవన్తమ్ = భగవంతుడైన, పితామహమ్ = బ్రహ్మదేవుని, ప్రణిపత్య = నమస్కరించి, అబ్రువన్ = పలికిరి.
తా. అగ్నిని ముందు ఉంచుకొని వెళ్లిన ఆ ఇంద్రాదిదేవత లందరును బ్రహ్మదేవునకు నమస్కరించి ఇట్లు పలికిరి.
మూ. యో నః సేనాపతిర్దేవ దత్తో భగవతా పురా,
తపః పరమమాస్థాయ తప్యతే స్మ సహోమయా. 3
ప్ర. అ. దేవ = దేవా! భగవతా = భగవంతుడ వైన నీచేత, పురా = పూర్వము, నః = మాకు, యః = ఏ, సేనాపతిః = సేనాపతి, దత్తః = ఇవ్వబడినాడో, అతడు, ఉమయా సహ = ఉమాదేవి కూడ, పరమమ్ = గొప్ప, తపః = తపస్సును (నియమమును), ఆస్థాయ = అవలంబించి, తప్యతే = తపస్సు చేయుచున్నాడు.
తా. పూర్వము నీవు మాకు సేనాపతిగా ఇచ్చిన మహేశ్వరుడు ఉమాదేవితో కూడ గొప్పనియమము నవలంబించి తపస్సు చేయుచున్నాడు.
మూ. యదత్రానన్తరం కార్యం లోకానాం హితకామ్యయా,
సంవిధత్స్వ విధానజ్ఞ త్వం హి నః పరమా గతిః. 4
ప్ర. అ. విధానజ్ఞ = ఉపాయములు తెలిసిన ఓ పితామహా! లోకానామ్ = లోకములయొక్క, హితకామ్యయా = హితమునందు కోరికచే, అత్ర = ఈ విషయమున, అనన్తరమ్ = దీని తరువాత, యత్ = ఏది, కార్యమ్ = చేయదగినదో, దానిని, సంవిధత్స్వ = చేయుము. త్వమ్ = నీవు, నః = మాకు, పరమా = గొప్పదైన, గతిః హి = గతి కదా.
తా. ఈ విషయమున లోకక్షేమముకొరకై ఇపు డేమి చేయవలెనో అది చేయుము. తగు ఉపాయములు నీకే తెలియును. మాకు శరణము నీవే గదా ?
మూ. దేవతానాం వచః శ్రుత్వా సర్వలోకపితామహః,
సాన్త్వయన్మధురైర్వాక్యైస్త్రిదశానిదమబ్రవీత్. 5
ప్ర. అ. సర్వలోకపితామహః = సమస్తలోకములకును పితామహుడైన బ్రహ్మదేవుడు, దేవతానామ్ = దేవతలయొక్క, వచః = వాక్యమును, శ్రుత్వా = విని, మధురైః = మధురములైన, వాక్యైః = వాక్యములచేత, త్రిదశాన్ = ఆ దేవతలను, సాన్త్వయన్ = ఓదార్చుచు, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను.
తా. దేవతల వాక్యము విని పితామహుడు వారిని మధురములైన మాటలచే ఓదార్చుచు ఇట్లు పలికెను.
మూ. శైలపుత్య్రా యదుక్తం తన్న ప్రజాస్యథ పత్నిషు,
తస్యా వచనమక్లిష్టం సత్యమేతన్న సంశయః. 6
ప్ర. అ. యత్ = ఎందువలన, శైలపుత్య్రా = ఉమాదేవిచేత, ఉక్తమ్ = చెప్పబడినదో, తత్ = ఆ కారణమువలన, పత్నిషు = భార్యలయందు, నప్రజాస్యథ = సంతానమును కనజాలరు. తస్యాః = ఆమెయొక్క, వచనమ్ = వాక్యము, అక్లిష్టమ్ = బాధింపబడనిది. ఏతత్ = ఇది, సత్యమ్ = సత్యము. సంశయః = సంశయము, న = లేదు.
తా. ఉమాదేవి చెప్పిన విధముగ మీకు మీ భార్యలయందు పుత్రులు పుట్టరు. ఆమె మాటకు అడ్డు లేదు. ఇది సత్యము. సందేహము లేదు.
మూ. ఇయమాకాశగా గఙ్గా యస్యాం పుత్రం హుతాశనః,
జనయిష్యతి దేవానాం సేనాపతిమరిన్దమమ్. 7
ప్ర. అ. యస్యామ్ = ఏ గంగయందు, హుతాశనః = అగ్ని, అరిందమమ్ = శత్రువును నశింపచేయు, దేవానామ్ = దేవతలయొక్క, సేనాపతిమ్ = సేనాపతియైన, పుత్రమ్ = పుత్రుని, జనయిష్యతి = పుట్టింపగలడో, ఇయమ్ = అట్టి, ఆకాశగా = ఆకాశమునందు ప్రవహించుచున్న, గఙ్గా = గంగ ఉన్నది.
తా. ఆకాశమునందు ప్రవహించు ఈ గంగ ఉన్నది కదా. ఈమె యందు అగ్నిదేవుడు, దేవతలకు సేనాపతియై శత్రుసంహారము చేయు పుత్రుని పుట్టించును.
మూ. జ్యేష్ఠా శైలేన్ద్రతనయా మానయిష్యతి తత్సుతమ్,
ఉమాయాస్తద్బహుమతం భవిష్యతి న సంశయః. 8
ప్ర. అ. జ్యేష్ఠా = పెద్దదైన, శైలేంద్రతనయా = శైలరాజదుహిత, తత్సుతమ్ = ఆ అగ్నియొక్క కుమారుని, మానయిష్యతి = అంగీకరింపగలదు. తత్ = అది, ఉమాయాః = ఉమకు, బహుమతమ్ = చాల ఇష్టమైనది, భవిష్యతి = కాగలదు. సంశయః = సంశయము, న = లేదు.
తా. హిమవంతుని జ్యేష్ఠపుత్రి యైన గంగ అగ్నిదేవునినుండి ఆ గర్భమును స్వీకరించును. ఇది యంతయు ఉమకు కూడ అంగీకారయోగ్యమగును. సందేహము లేదు.
మూ. తచ్ఛ్రుత్వా వచనం తస్య కృతార్థా రఘునన్దన,
ప్రణిపత్య సురాః సర్వే పితామహమపూజయన్. 9
ప్ర. అ. రఘునన్దన = రామా! సురాః = దేవతలు, సర్వే = అందరును, తస్య = అతనియొక్క, తత్ = ఆ, వచనమ్ = వాక్యమును, శ్రుత్వా = విని, కృతార్థాః = కృతార్థులై, పితామహమ్ = బ్రహ్మదేవుని, ప్రణిపత్య = నమస్కరించి, అపూజయన్ = పూజించిరి.
తా. రామా! ఆ దేవత లందరును బ్రహ్మదేవుని వాక్యము విని, సఫలీకృత మనోరథులై, ఆయనకు నమస్కరించి పూజించిరి.
మూ. తే గత్వా పర్వతం రామ కైలాసం ధాతుమణ్డితమ్,
అగ్నిం నియోజయామాసుః పుత్రార్థం సర్వదేవతాః. 10
ప్ర. అ. తే = ఆ, సర్వదేవతాః = దేవతలందరును, ధాతుమణ్డితమ్ = ధాతువులచే అలంకరింపబడిన, కైలాసం పర్వతమ్ = కైలాసపర్వతమును గూర్చి, గత్వా = వెళ్లి, పుత్రార్థమ్ = పుత్రునికొరకై, అగ్నిమ్ = అగ్నిదేవుని, నియోజయామాసుః = ఆజ్ఞాపించిరి.
తా. దేవతలందరును ధాతువులచే అలంకృత మగు కైలాసపర్వతమునకు పోయి, ‘‘పుత్రుని కనుము’’ అని అగ్నిదేవుని ఆజ్ఞాపించిరి.
మూ. దేవకార్యమిదం దేవ సంవిధత్స్వ హుతాశన,
శైలపుత్య్రాం మహాతేజో గఙ్గాయాం తేజ ఉత్సృజ. 11
ప్ర. అ. దేవ = ప్రకాశమానుడ వగు, హుతాశన = అగ్నీ!, ఇదమ్ = ఈ, దేవకార్యమ్ = దేవతాకార్యమును, సంవిధత్స్వ = చేయుము. మహాతేజః = గొప్ప తేజస్సు కలవాడా, తేజః = మహేశ్వరుని తేజస్సును, శైలపుత్య్రామ్ = హిమవత్పుత్రి యగు, గఙ్గాయామ్ = గంగయందు, ఉత్సృజ = విడువుము.
తా. ఓ అగ్నిదేవా! ఈ దేవతాకార్యమును చేయుము. నీయం దున్న మహేశ్వరుని తేజస్సును హిమవంతుని పుత్రి యగు గంగయం దుంచుము.
మూ. దేవతానాం ప్రతిజ్ఞాయ గఙ్గామభ్యేత్య పావకః,
గర్భం ధారయ వై దేవి దేవతానామిదం ప్రియమ్. 12
ప్ర. అ. పావకః = అగ్నిదేవుడు, దేవతానామ్ = దేవతలకు, ప్రతిజ్ఞాయ = మాట యిచ్చి, గఙ్గామ్ = గంగను, అభ్యేత్య = సమీపించి, దేవి = ఓ దేవీ! గర్భమ్ = గర్భమును, ధారయ వై = ధరింపుము. ఇదమ్ = ఈ కార్యము, దేవతానామ్ = దేవతలకు, ప్రియమ్ = ఇష్టమైనది (అని పలికెను).
తా. అగ్నిదేవుడు ‘‘అటులనే’’ అని దేవతలకు మాట యిచ్చి, గంగను సమీపించి - దేవీ! గర్భమును ధరింపుము. ఈ కార్యము దేవతలకు ప్రియమైనది అని పలికెను.
మూ. తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్,
దృష్ట్వా తన్మహిమానం స సమన్తాదవకీర్యత. 13
ప్ర. అ. తస్య = అగ్ని యొక్క, తద్ వచనమ్ = ఆ వాక్యమును, శ్రుత్వా = విని, దివ్యమ్ = దివ్య మైన, రూపమ్ = రూపమును, అధారయత్ = ధరించెను. సః = ఆ అగ్ని, తన్మ హిమానమ్ = ఆ గంగయొక్క మహిమను, దృష్ట్వా = చూచి, సమన్తాత్ = అంతటను, అవకీర్యత = వ్యాపించెను.
తా. అగ్నిదేవుని మాట విని గంగ దివ్య మైన రూపమును ధరించెను. ఆమె మహిమను చూచి అగ్నిదేవుడు తన దేహము ఆమెపై అంతటను వ్యాపించునట్లు చేసెను.
మూ. సమన్తతస్తతో దేవీమభ్యషిఞ్చత పావకః,
సర్వస్రోతాంసి పూర్ణాని గఙ్గాయా రఘునన్దన. 14
ప్ర. అ. రఘునన్దన = రామా! తతః = పిమ్మట, పావకః = అగ్నిదేవుడు, దేవీమ్ = గంగాదేవిని, సమన్తతః = అంతటను, అభ్యషిఞ్చత = తనలో నున్న పరమేశ్వరుని వీర్యముచే తడిపెను. గఙ్గాయాః = గంగయొక్క, సర్వస్రోతాంసి = అవయవము లన్నియు, పూర్ణాని = నిండిపోయినవి.
తా. రామా! పిమ్మట ఆ అగ్నిదేవుడు తనలో నున్న పరమేశ్వరవీర్యము ఆమెయందు అంతటను వ్యాపించు నట్లు విడచెను. దానితో గంగ అవయవము లన్నియు నిండిపోయినవి.
మూ. తమువాచ తతో గఙ్గా సర్వదేవపురోహితమ్,
అశక్తా ధారణే దేవ తవ తేజస్సముద్ధతమ్. 15
దహ్యమానాగ్నినా తేన సంప్రవ్యథితచేతనా.
ప్ర. అ. తతః = పిమ్మట, గఙ్గా = గంగ, సర్వదేవపురోహితమ్ = సమస్తదేవతలకును అగ్రమునందు నిలుపబడు, తమ్ = ఆ, అగ్నిదేవుని గూర్చి, ఉవాచ = పలికెను. దేవ = ఓ అగ్నిదేవుడా! సముద్ధతమ్ = విజృంభించిన, తవ = నీ యొక్క, తేజః = తేజస్సును, ధారణే = ధరించుటయందు, అశక్తా = అసమర్థురాలను. తేన = ఆ, అగ్నినా = అగ్నిచేత, (రేతస్సుచేత), దహ్యమానా = కాల్చివేయబడుచున్న నేను, సంప్రవ్యథితచేతనా = మిక్కిలి క్షోభపెట్టబడిన చైతన్యము కలదానను.
తా. పిమ్మట ఆ గంగ సర్వదేవతలకును ముందుండెడు ఆ అగ్నిదేవునితో ఇట్లు పలికినది. ‘‘అగ్నిదేవా! విజృంభించిన నీ యొక్క ఈ తేజస్సును ధరింపజాలను. ఈ తేజస్సు నన్ను దహింపచేయుచున్నది. నాకు స్పృహ తప్పిపోవుచున్నది.’’
మూ. అథాబ్రవీదిదం గఙ్గాం సర్వదేవహుతాశనః,
ఇహ హైమవతే పాదే గర్భోఽయం సంనివేశ్యతామ్. 16
ప్ర. అ. అథ = పిమ్మట, సర్వదేవహుతాశనః = దేవత లందరికొరకును హోమము చేయబడిన హోమద్రవ్యములను భుజించు అగ్నిదేవుడు, గఙ్గామ్ = గంగను గూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను. అయమ్ = ఈ, గర్భః = గర్భము, ఇహ = ఇచట, హైమవతే = హిమవత్పర్వతమునకు సంబంధించిన, పాదే = సమీపపర్వతమునందు, సంనివేశ్యతామ్ = ఉంచబడుగాక.
తా. అగ్నిదేవుడు గంగతో - ‘‘ఈ గర్భమును ఇచట, హిమవత్పర్వత సమీపమునం దున్న చిన్న పర్వతము పై విడువుము’’ అని చెప్పెను.
మూ. శ్రుత్వా త్వగ్నివచో గఙ్గా తం గర్భమతిభాస్వరమ్,
ఉత్ససర్జ మహాతేజః స్రోతోభ్యో హి తదానఘ. 17
ప్ర. అ. మహాతేజః = గొప్పతేజస్సు గలవాడా! అనఘ = పాపరహితుడవగు రామా! అగ్నివచః = అగ్ని యొక్క వాక్యమును, శ్రుత్వా = విని, గఙ్గా = గంగ, తదా = అప్పుడు, అతిభాస్వరమ్ = మిక్కిలి ప్రకాశించుచున్న, తం గర్భమ్ = ఆ గర్భమును, స్రోతోభ్యః = అవయవములనుండి, ఉత్ససర్జ = విడచెను.
తా. దోషరహితుడవు, తేజఃశాలివి అగు రామా! అపు డా గంగ అగ్నిదేవుడు చెప్పిన విధమున, మిక్కిలి ప్రకాశించుచున్న ఆ గర్భమును, తన అవయవములనుండి అచట విడచెను.
మూ. యదస్యా నిర్గతం తస్మాత్తప్తజామ్బూనదప్రభమ్,
కాఞ్చనం ధరణీం ప్రాప్తం హిరణ్యమమలం శుభమ్. 18
ప్ర. అ. అస్యాః = ఈ గంగానదినుండి, తప్తజామ్బూనదప్రభమ్ = కరిగిన బంగారము వంటి కాంతి గల, యత్ = ఏ తేజస్సు, నిర్గతమ్ = బయలు దేరినదై, ధరణీమ్ = భూమిని, ప్రాప్తమ్ = పొందినదో, తస్మాత్ = దానినుండి, శుభమ్ = శుభ మైన, కాఞ్చనమ్ = బంగారము, అమలమ్ = తెల్లని, హిరణ్యమ్ = వెండియు, (అభవత్ = పుట్టెను).
తా. ఆ గంగ వదిలిపెట్టగా బయటకు వచ్చిన భూమిపై పడిన, కరిగిన బంగారముతో సమాన మైన కాంతి గల, తేజస్సు నుండి, మంగళకర మైన బంగారము, పరిశుద్ధ మైన వెండియు పుట్టెను.
మూ. తామ్రం కార్ష్ణాయసం చైవ తైక్ష్ణ్యాదేవాభ్యజాయత, 19
మలం తస్యాభవత్తత్ర త్రపు సీసకమేవ చ.
తదేతద్ధరణీం ప్రాప్య నానాధాతురవర్ధత. 20
ప్ర. అ. తత్ర = అచట, తైక్క్ష్ణ్యా = తీక్ష్ణత్వమునుండి (క్షారము నుండి), తామ్రమ్ = రాగియు, కార్ష్ణాయసం చైవ = ఇనుము, అభ్యజాయత = పుట్టెను. తస్య = ఆ రేతస్సుయొక్క, మలమ్ = మలము, త్రపు = తగరము, సీసకమేవ చ = సీసము, అభవత్ = ఆయెను. తత్ ఏతత్ = ఆ ఈ వీర్యము, ధరణీమ్ = భూమిని, ప్రాప్య = పొంది, నానాధాతుః = అనేక విధము లైన ధాతువుగా, అవర్ధత = వృద్ధిచెందెను.
తా. అచట, రేతస్సులో నున్న క్షారము నుండి రాగి, ఇనుము పుట్టినవి. ఆ రేతస్సులోని మలము తగరముగాను, సీసము గాను అయినది. ఈ విధముగ ఆ వీర్యము నేలపై బడి అనేకధాతువుల రూపములో వృద్ధి పొందినది.
మూ. నిక్షిప్తమాత్రే గర్భే తు తేజోభిరభిరఞ్జితమ్,
సర్వం పర్వతసన్నద్ధం సౌవర్ణమభవద్వనమ్. 21
ప్ర. అ. గర్భే = గర్భము, నిక్షిప్తమాత్రే = ఉంచబడగానే, సర్వమ్ = సమస్తమైన, పర్వతసన్నద్ధమ్ = పర్వతమునందు మొలిచిన, వనమ్ = శరవణము, తేజోభిః = తేజస్సుల చేత, అభిరఞ్జితమ్ = రంజింపచేయబడినదై, సౌవర్ణమ్ = సువర్ణమయముగా, అభవత్ = ఆయెను.
తా. ఆ గర్భమును అచట విడువగనే పర్వతము పై మొలచిన శరవణ మంతయు కాంతులచే రంజింపబడి నదై, సువర్ణమయ మైపోయినది.
మూ. జాతరూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ,
సువర్ణం పురుషవ్యాఘ్ర హుతాశనసమప్రభమ్. 22
తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాఞ్చనమ్.
ప్ర. అ. పురుషవ్యాఘ్ర = పురుషులలో శ్రేష్ఠుడా! రాఘవ = రామా! తదాప్రభృతి = అది మొదలు, హుతాశనసమప్రభమ్ = అగ్నితో సమాన మైన కాంతి గల, సువర్ణమ్ = బంగారము, జాతరూపమ్ ఇతి = పుట్టిన రూపము గలది అని, ఖ్యాతమ్ = ప్రసిద్ధ మైనది. సర్వమ్ = సమస్త మైన, తృణ వృక్షలతాగుల్మమ్ = తృణవృక్షలతాగుల్మాదికము, కాఞ్చనమ్ = బంగారముగా, భవతి = అయినది.
తా. పురుషశ్రేష్ఠుడా! రామా! అది మొదలు అగ్నితో సమాన మైన కాంతి గల బంగారము జాతరూపము (పుట్టిన రూపము కలది) అని ప్రసిద్ధి చెందినది. తృణము, వృక్షములు, లతలు, పొదలు, అన్నియు బంగారముగా మారిపోయినవి.
మూ. తం కుమారం తతో జాతం సేన్ద్రాః సహ మరుద్గణాః,
క్షీరసంభావనార్థాయ కృత్తికాః సమయోజయన్. 23
ప్ర. అ. తతః = పిమ్మట, జాతమ్ = పుట్టిన, తమ్ = ఆ, కుమారమ్ = కుమారుని, సేన్ద్రాః = ఇంద్రునితో కూడిన, మరుద్గణాః = దేవతాగణములు, సహ = ఒకేకాలమునందు, క్షీరసంభావనాయ = క్షీరమునిచ్చి ఆదరించుటకై, కృత్తికాః = కృత్తికలను, సమయోజయన్ = ఏర్పరచిరి.
తా. అంతట కుమారుడు పుట్టెను. అతనికి కృత్తికలు అందరును కలసి ఒకే కాలమునందు పాలు ఇచ్చి ఆదరించవలె నని, ఇంద్రసమేతులగు దేవతలు ఏర్పాటు చేసిరి.
మూ. తాః క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమమ్,
దదుః పుత్రోఽయమస్మాకం సర్వాసామితి నిశ్చితాః. 24
ప్ర. అ. తాః = ఆ కృత్తికలుస నిశ్చితాః = తమలో తాము నిశ్చయించుకొనిన వారై, అయమ్ = ఇతడు, అస్మాకమ్ = మాకు, సర్వాసామ్ = అందరికిని, పుత్రః = పుత్రుడు అగుగాక అని, ఉత్తమమ్ = గొప్ప దైన, సమయమ్ = కట్టుబాటును, కృత్వా = చేసి, జాతమాత్రస్య = అపుడే పుట్టిన ఆ పిల్లవానికి, క్షీరమ్ = చనుబాలను, దదుః = ఇచ్చిరి.
తా. ఆ కృత్తికలు తమలో తాము నిర్ణయము చేసుకొని, ‘‘ఈ పిల్లవాడు మా కందరకును పుత్రుడు కావలెను’’ అని దేవతలతో ఒక ఉత్తమ మైన ఒప్పంద మేర్పరచుకొని, అపుడే పుట్టిన ఆ పిల్లవానికి చనుబాలు ఇచ్చిరి.
మూ. తతస్తు దేవతాః సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్,
పుత్రస్త్రైలోక్యవిఖ్యాతో భవిష్యతి న సంశయః. 25
ప్ర. అ. తతః = పిమ్మట, సర్వాః = సమస్త మైన, దేవతాః = దేవతలు, పుత్రః = ఈ పుత్రుడు, కార్తికేయః ఇతి = కృత్తికల పుత్రుడు అని, త్రైలోక్యవిఖ్యాతః = మూడు లోకములలో విఖ్యాతుడు, భవిష్యతి = కాగలడు. సంశయః = సంశయము, న = లేదు, ఇతి = అని, బ్రువన్ = పలికిరి.
తా. ఈ పుత్రుడు కార్తికేయుడు (కృత్తికల కుమారుడు) అని మూడు లోకములలో ప్రసిద్ధి పొందును; సందేహము లేదు అని దేవత లందరును పలికిరి.
మూ. తేషాం తద్వచనం శ్రుత్వా స్కన్నం గర్భపరిస్రవే,
స్నాపయన్ పరయా లక్ష్మ్యా దీప్యమానం యథానలమ్. 26
ప్ర. అ. తేషామ్ = ఆ దేవతలయొక్క, తత్ = ఆ, వచనమ్ = వచనమును, శ్రుత్వా = విని, గర్భపరిస్రవే = గర్భస్రావమునందు, స్కన్నమ్ = జారిపడిన వాడును, అనలం యథా = అగ్ని వలె, పరయా = గొప్ప దైన, లక్ష్మ్యా = సౌందర్యములతో, దీప్యమానమ్ = ప్రకాశించు చున్నవాడును అగు, ఆ పిల్లవానిని, స్నాపయన్ = స్నానము చేయించిరి.
తా. దేవత లిట్లు చెప్పగా, గర్భస్రావమునందు జారిపడి, అగ్ని వలె శోభతో ప్రకాశించుచున్న ఆ పిల్లవానికి కృత్తికలు స్నానము చేయించిరి.
మూ. స్కన్ద ఇత్యబ్రువన్ దేవాః స్కన్నం గర్భపరిస్రవాత్,
కార్తికేయం మహాభాగం కాకుత్స్థ జ్వలనోపమమ్. 27
ప్ర. అ. కాకుత్థ్స = రామా! జ్వలనోపమమ్ = అగ్నితో సమానుడును, మహాభాగమ్ = గొప్ప భాగ్యము కలవాడును అగు, గర్భపరిస్రవాత్ = గర్భస్రావము వలన, స్కన్నమ్ = జారి పడిన, కార్తికేయమ్ = కార్తికేయుని, స్కన్దః ఇతి = స్కందుడు అని, అబ్రువన్ = పలికిరి.
తా. రామా! మహాభాగ్యవంతుడును, అగ్నితుల్యుడును, గర్భస్రావమువలన జారి పడినవాడును అగు ఆ కార్తికేయునకు ‘‘స్కందుడు’’ (జారిపడినవాడు) అని కూడ పేరు పెట్టిరి.
మూ. ప్రాదుర్భూతం తతః క్షీరం కృత్తికానామనుత్తమమ్,
షణ్ణాం షడాననో భూత్వా జగ్రాహ స్తనజం పయః. 28
ప్ర. అ. తతః = పిమ్మట, కృత్తికానామ్ = కృత్తికలకు, అనుత్తమమ్ = అత్యుత్తమమైన, క్షీరమ్ = క్షీరము, ప్రాదుర్భూతమ్ = పుట్టినది. షణ్ణామ్ = ఆరుగురియొక్క, స్తనజమ్ = స్తనములందు పుట్టిన, పయః = పాలను, షడాననః = ఆరుముఖములు గలవాడు, భూత్వా = అయి, జగ్రాహ = గ్రహించెను.
తా. అంత ఆ కృత్తికల స్తనములలో అత్యుత్తమ మైన క్షీరము పుట్టినది. ఆ శిశువు ఆరు ముఖములు కలవాడై, ఆ ఆరుగురి స్తనములలో పుట్టిన క్షీరమును ఒక్క సమయముననే త్రాగెను.
మూ. గృహీత్వా క్షీరమేకాహ్నా సుకుమారవపుస్తదా,
అజయత్స్వేన వీర్యేణ దైత్య సేనాగణాన్విభుః. 29
ప్ర. అ. విభుః = సమర్థు డైన ఆ కుమారుడు, ఏకాహ్నా = ఒక దినము మాత్రమే, క్షీరమ్ = క్షీరమును, గృహీత్వా = గ్రహించి, తదా = అప్పుడు, సుకుమారవపుః = సుకుమార మైన శరీరము కలవా డైనను, స్వేన = తన సంబంధమైన, వీర్యేణ = పరాక్రమముచేత, దైత్య సేనాగణాన్ = దైత్య సేనాసముదాయములను, అజయత్ = జయించెను.
తా. సామర్థ్యశాలి యగు ఆ కుమారుడు ఒక్క దినమునందు మాత్రమే పాలు త్రాగి, సుకుమారశరీరవంతు డైనను, తన పరాక్రమముచే దైత్య సేనలను జయించెను.
మూ. సురసేనాగణపతిం తత స్తమతులద్యుతిమ్,
అభ్యషిఞ్చన్ సురగణాః సమేత్యాగ్నిపురోగమాః. 30
ప్ర. అ. తతః = పిమ్మట, అగ్నిపురోగమాః = అగ్నిమొదలైన, సురగణాః = దేవతాగణములు, సమేత్య = కలిసి, అతులద్యుతిమ్ = సాటి లేని కాంతి గల, తమ్ = ఆతనిని, సురసేనాగణపతిమ్ = దేవ సేనాగణమునకు నాయకునిగా, అభ్యషిఞ్చన్ = అభిషేకించిరి.
తా. అగ్నిమొదలగు దేవత లందరును కలిసి సాటి లేని కాంతి గల ఆతనిని దేవసేనానాయకునిగా అభిషేకించిరి.
మూ. ఏష తే రామ గఙ్గాయా విస్తరోఽభిహితో మయా,
కుమారసంభవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవ చ. 31
ప్ర. అ. రామ = రామా! మయా = నాచేత, తే = నీకు, గఙ్గాయాః = గంగ యొక్క, ఏషః = ఈ, విస్తరః = కథావిస్తరము, తథైవ = మరియు, ధన్యః = ధన్యత్వమును కలిగించునదియు, పుణ్యః = పవిత్ర మైనదియు అగు, కుమారసంభవశ్చెవ = కుమార స్వామియొక్క పుట్టుకయు, అభిహితః = చెప్పబడినది.
తా. రామా! గంగకు సంబంధించిన విస్తృతకథను, ధన్యత్వమును కలిగించునదియు, పుణ్యమును అయిన కుమారసంభవ వృత్తాంతమును చెప్పితిని.
మూ. భక్తశ్చ యః కార్తికేయే కాకుత్స్థ భువి మానవః,
ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ స్కన్దసాలోక్యతాం వ్రజేత్. 32
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే సప్తత్రింశః సర్గః
ప్ర. అ. కాకుత్థ్స = రామా! భువి = భూలోకమునందు, యః = ఏ, మానవః = మానవుడు, కార్తికేయే = కుమారస్వామియందు, భక్తః చ = భక్తుడో, అతడు, ఆయుష్మాన్ = ఆయుర్దాయవంతుడై, పుత్రపౌత్రైః = పుత్రపౌత్రాదులతో కూడినవాడై, స్కన్దసాలోక్యతామ్ = స్కందునితో సాలోక్యమును, వ్రజేత్ = పొందును.
తా. రామా! భూలోకమున, కుమారస్వామియందు భక్తి గల మానవుడు దీర్ఘాయుర్దాయవంతుడై, పుత్రపౌత్రాది సౌఖ్యము లనుభవించి మరణానంతరము స్కందునిలోకము చేరును.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో ముప్పదియేడవ సర్గ సమాప్తము.
