Chapter_38

Back
Book Balakandamu
Chapter No 44
Pages 6
Read Time 9 Minutes

Chapter_38

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ అష్టత్రింశః సర్గః

సగరచక్రవర్తికి సంతానోత్పత్తి, అతడు యాగము చేయుటకై సంకల్పించి ప్రారంభించుట.

మూ. తాం కథాం కౌశికో రామే నివేద్య కుశికాత్మజః,

పునరేవాపరం వాక్యం కాకుత్థ్సమిదమబ్రవీత్. 1

ప్ర. అ. కుశికాత్మజః = కుశవంశీయు డైన గాధి కుమారు డైన, కౌశికః = విశ్వామిత్రుడు, తాం కథామ్ = ఆ కథను, రామే = రామునియందు (నకు), నివేద్య = తెలిపి, పునరేవ = మరల, ఇదమ్ = ఈ, వాక్యమ్ = వాక్యమును, కాకుత్థ్సమ్ = రాముని గూర్చి, అబ్రవీత్ = పలికెను.

తా. విశ్వామిత్రుడు రామున కీ కథ చెప్పి మరల అతనితో ఇట్లనెను.

మూ. అయోధ్యాధిపతిః శూరః పూర్వమాసీన్నరాధిపః,

సగరో నామ ధర్మాత్మా ప్రజాకామస్స చాప్రజః. 2

ప్ర. అ. పూర్వమ్ = పూర్వము, అయోధ్యాధిపతిః = అయోధ్యకు అధిపతియు, శూరః = శూరుడును, ధర్మాత్మా = ధర్మాత్ముడును అగు, సగరో నామ = సగరు డను పేరు గల, నరాధిపః = రాజు, ఆసీత్ = ఉండెను. సః = అతడు, అప్రజః = సంతానము లేనివాడై, ప్రజాకామః = సంతానమునందు కోరిక గలవాడై ఉండెను.

తా. పూర్వము అయోధ్యాధిపతియు, శూరుడును, ధర్మాత్ముడును అగు సగరు డను రాజు ఉండెను. సంతానము కలుగకపోవుటచే ఆతడు సంతానమును కోరుచుండెను.

మూ. వైదర్భదుహితా రామ కేశినీ నామ నామతః,

జ్యేష్ఠా సగరపత్నీ సా ధర్మిష్ఠా సత్యవాదినీ. 3

ప్ర. అ. రామ = రామా! వైదర్భదుహితా = విదర్భదేశరాజుయొక్క కుమార్తెయు, నామతః = పేరువలన, కేశినీ నామ = కేశిని యను ప్రసిద్ధి కలదియు అగు ఒక ఉత్తమురాలు, జ్యేష్ఠా = పెద్ద దైన, సగరపత్నీ = సగరపత్నిగా ఉండెను. సా = ఆమె, ధర్మిష్ఠా = చాల ధార్మికురాలు, సత్యవాదినీ = సత్యమే పలుకునది.

తా. రామా! విదర్భాధీశుని కూతు రగు కేశిని సగరుని పెద్ద భార్య. ఆమె మిక్కిలి ధార్మికురాలు. సత్యమునే పలికెడిది.

మూ. అరిష్టనేమేర్దుహితా రూపేణాప్రతిమా భువి,

ద్వితీయా సగరస్యాసీత్పత్నీ సుమతిసంజ్ఞికా. 4

ప్ర. అ. అరిష్టనేమేః = అరిష్టనేమియొక్క, దుహితా = కుమార్తెయు, రూపేణ = రూపముచేత, భువి = భూలోకమునందు, ఆప్రతిమా = సాటి లేనిదియు అగు, సుమతిసంజ్ఞికా = సుమతి యను పేరు గలది, సగరస్య = సగరుని యొక్క, ద్వితీయా = రెండవ, పత్నీ = భార్యగా, ఆసీత్ = ఆయెను.

తా. అరిష్టనేమి కుమార్తెయు, రూపముచే భూలోకమునందు సాటి లేనిదియు అగు సుమతి సగరుని రెండవ భార్య.

మూ. తాభ్యాం స హి తదా రాజా పత్నీభ్యాం తప్తవాం స్తపః,

హిమవన్తం సమాసాద్య భృగుప్రస్రవణే గిరౌ. 5

ప్ర. అ. తదా = అప్పుడు, సః = ఆ, రాజా = రాజు, తాభ్యామ్ = ఆ, పత్నీభ్యామ్ = భార్యలతో, సహితః = కూడినవాడై, హిమవన్తమ్ = హిమవత్పర్వతమును, సమాసాద్య = చేరి, భృగు ప్రస్రవణే = భృగుప్రస్రవణ మనెడు, గిరౌ = పర్వతమునందు, తపః తప్తవాన్ = తపస్సు చేసినాడు.

తా. అపు డా రాజు ఆ భార్య లిద్దరితో కలిసి, హిమవత్పర్వతమునకు పోయి, భృగుప్రస్రవణ మనెడు పర్వతమునందు తపస్సు చేసెను.

మూ. అథ వర్షశతే పూర్ణే తపసారాధితో మునిః,

సగరాయ వరం ప్రాదాద్భృగుః సత్యవతాం వరః. 6

ప్ర. అ. అథ = అటుపిమ్మట, వర్షశతే = నూరు సంవత్సరముల కాలము, పూర్ణే = నిండిన దగుచుండగా, తపసా = తపస్సుచే, ఆరాధితః = సంతోష పెట్టబడిన, సత్యవతాం వరః = సత్యవంతులలో శ్రేష్ఠు డైన, భృగుః మునిః = భృగుమహర్షి, సగరాయ = సగరునకు, వరమ్ = వరమును, ప్రాదాత్ = ఇచ్చెను.

తా. ఇట్లు నూరు సంవత్సరములు గడచినవి. సత్యవంతులలో శ్రేష్ఠు డైన భృగుమహర్షి, సగరుని తపస్సునకు సంతోషించి ఆతనికి వర మిచ్చెను.

మూ. అపత్యలాభః సుమహాన్ భవిష్యతి తవానఘ,

కీర్తిం చాప్రతిమాం లోకే ప్రాప్స్యసే పురుషర్షభ. 7

ప్ర. అ. అనఘ = దోషములు లేనివాడా! తవ = నీకు, సుమహాన్ = చాల గొప్పదైన, అపత్యలాభః = సంతానప్రాప్తి, భవిష్యతి = కాగలదు. పురుషర్షభ = పురుషశ్రేష్ఠుడా! లోకే = లోకమునందు, అప్రతిమామ్ = సాటి లేని, కీర్తించ = కీర్తిని కూడ, ప్రాప్స్యసి = పొందగలవు.

తా. ఓ పుణ్యాత్మా! నీకు అత్యధికసంతానప్రాప్తి కలుగును. లోకములో సాటి లేని కీర్తి కూడ లభించును.

మూ. ఏకా జనయితా తాత పుత్రం వంశకరం తవ,

షష్టిం పుత్రసహస్రాణి అపరా జనయిష్యతి. 8

ప్ర. అ. తాత = నాయనా! ఏకా = ఒక భార్య, తవ = నీయొక్క, వంశకరమ్ = వంశమును నిలుపు, పుత్రమ్ = పుత్రుని, జనయిష్యతి = కనగలదు. అపరా = మరియొకభార్య, షష్టిమ్ = అరువది, పుత్రసహస్రాణి = పుత్రసహస్రములను, జనయిష్యతి = కనగలదు.

తా. నాయనా! ఒక భార్య నీ వంశమును నిలుపు ఒక కుమారుని కనగలదు. మరియొక భార్య అరువదివేలమంది కుమారులను కనగలదు.

మూ. భాషమాణం మహాత్మానం రాజపుత్య్రౌ ప్రసాద్య తమ్,

ఊచతుః పరమప్రీతే కృతాఞ్జలిపుటే తదా. 9

ప్ర. అ. తదా = అప్పుడు, పరమప్రీతే = చాల సంతసించిన, రాజపుత్ర్యౌ = రాజపుత్రికలు, కృతాఞ్జలిపుటే = కట్టబడిన దోసిలి కలవారై, భాషమాణమ్ = ఆ విధముగ మాటలాడు చున్న, మహాత్మానమ్ = ఆ మహాత్ముని, ప్రసాద్య = అనుగ్రహింపచేసికొని, తమ్ = అతనిని గూర్చి, ఊచతుః = పలికిరి.

తా. అపుడా రాజపుత్రికలు చాల సంతసించి, చేతులు జోడించి, ఆ విధముగ పలికిన ఆ మహాత్ముని అనుగ్రహింపచేసికొని ఇట్లు పలికిరి.

మూ. ఏకః కస్యాః సుతో బ్రహ్మన్ కా బహూన్ జనయిష్యతి,

శ్రోతుమిచ్ఛామహే బ్రహ్మన్ సత్యమస్తు వచ స్తవ. 10

ప్ర. అ. బ్రహ్మన్ = బ్రహ్మర్షీ! కస్యాః = ఎవతెకు, ఏకః = ఒక్క, సుతః = కుమారుడు పుట్టును? కా = ఎవతె, బహూన్ = చాల మందిని, జనయిష్యతి = కనును ? బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణోత్తమా! శ్రోతుమ్ = వినుటకు, ఇచ్ఛామహే = కోరుచున్నాము, తవ = నీ యొక్క, వచః = వాక్యము, సత్యమ్ అస్తు = సత్యమగుగాక.

తా. బ్రహ్మర్షీ! మా ఇద్దరిలో ఒక్క కుమారుడు ఎవతెకు కలుగును, చాలమంది ఎవతెకు కలుగుదురు. విన వలె నని కోరుచున్నాము. నీ వాక్యము సత్య మగు గాక.

మూ. తయో స్తద్వచనం శ్రుత్వా భృగుః పరమధార్మికః,

ఉవాచ పరమాం వాణీం స్వచ్ఛన్దోఽత్ర విధీయతామ్. 11

ప్ర. అ. పరమధార్మికః = మిక్కిలి ధార్మికు డైన, భృగుః = భృగువు, తయోః = వారియొక్క, తత్ వచనమ్ = ఆ వచనమును, శ్రుత్వా = విని, పరమామ్ = ఉత్తమ మైన, వాణీమ్ = వాక్కును, ఉవాచ = పలికెను. అత్ర = ఈ విషయమున, స్వచ్ఛన్దః = స్వేచ్ఛ, విధీయతామ్ = చేయబడుగాక.

తా. వారి మాటలు విని పరమధార్మికు డైన ఆ భృగుమహర్షి ఇట్లు పలికెను - ‘‘ఈ విషయమున మీరే కోరుకొనుడు.’’

మూ. ఏకో వంశకరో వాస్తు బహవో వా మహాబలాః,

కీర్తిమన్తో మహోత్సాహాః కా వా కం వరమిచ్ఛతి. 12

ప్ర. అ. వంశకరః = వంశమును నిలుపు, ఏకః = ఒక్కపుత్రుడు, అస్తువా = కలుగవలెనా? మహాబలాః = గొప్ప బలము కలవారును, కీర్తిమన్తః = కీర్తి కలవారును, మహోత్సాహాః = గొప్ప ఉత్సాహము కలవారును అగు, బహవో వా = చాలమంది కావలెనా ? కా వా = మీలో ఎవరు, కమ్ = ఏ, వరమ్ = వరమును, ఇచ్ఛతి = కోరుచున్నది ?

తా. వంశకరు డైన ఒక్క కుమారుడు కావలెనా ? మహాబలవంతులును, కీర్తిమంతులును, మహోత్సాహవంతులును అగు చాలమంది పుత్రులు కావలెనా ? మీలో ఎవరికి ఏ వరము కావలెను ?

మూ. మునేస్తు వచనం శ్రుత్వా కేశినీ రఘునన్దన,

పుత్రం వంశకరం రామ జగ్రాహ నృపసన్నిధౌ. 13

ప్ర. అ. రఘునన్దన = రఘువంశీయులను ఆనందింపచేయువాడా! రామ = రామా! మునేః = మునియొక్క, వచనమ్ = వాక్యమును, శ్రుత్వా = విని, కేశినీ = కేశిని, వంశకరమ్ = వంశమును నిలబెట్టువాడైన, పుత్రమ్ = పుత్రుని, నృపసన్నిధౌ = రాజుయొక్క సంనిధియందు, జగ్రాహ = గ్రహించెను.

తా. ఓ రఘునందనా! రామా! కేశిని, ముని వాక్యమును విని, రాజు సన్నిధిలో, ‘‘నాకు వంశకరు డగు పుత్రుడు కావలెను’’ అని కోరుకొనెను.

మూ. షష్టిం పుత్రసహస్రాణి సుపర్ణభగినీ తదా,

మహోత్సాహాన్ కీర్తిమతో జగ్రాహ సుమతిః సుతాన్. 14

ప్ర. అ. తదా = అప్పుడు, సుపర్ణభగినీ = గరుత్మంతుని సోదరి యైన, సుమతిః = సుమతి, మహోత్సాహాన్ = గొప్ప ఉత్సాహము కలవారును, కీర్తిమతః = కీర్తికలవారును అగు, షష్టిమ్ = అరువది, పుత్రసహస్రాణి = పుత్రుల సహస్రములను, సుతాన్ = తన కుమారులనుగా, జగ్రాహ = గ్రహించెను.

తా. అపుడు, గరుత్మంతుని సోదరి యగు సుమతి మహోత్సాహవంతులును, కీర్తిమంతులును అగు అరువతి వేలమంది పుత్రులను కోరెను.

మూ. ప్రదక్షిణమృషిం కృత్వా శిరసాభిప్రణమ్య చ,

జగామ స్వపురం రాజా సభార్యో రఘునన్దన. 15

ప్ర. అ. రఘునన్దన = రామా! సభార్యః = భార్యాసహితు డగు, రాజా = రాజు, ఋషిమ్ = ఋషిని, ప్రదక్షిణం కృత్వా = ప్రదక్షిణము చేసి, శిరసా = శిరస్సుచేత, అభిప్రణమ్య = నమస్కరించి, స్వపురమ్ = తన పురమునుగూర్చి, జగామ = వెళ్లెను.

తా. రామా! భార్యాసమేతు డైన సగరచక్రవర్తి, ఋషికి ప్రదక్షిణనమస్కారములు చేసి తన పురమునకు వెళ్లెను.

మూ. అథ కాలే గతే తస్మిన్ జ్యేష్ఠా పుత్రం వ్యజాయత,

అసమంజ ఇతి ఖ్యాతం కేశినీ సగరాత్మజమ్. 16

ప్ర. అ. అథ = పిమ్మట, తస్మిన్ కాలే గతే = కొంత కాలము గడచిన పిమ్మట, జ్యేష్ఠా = జ్యేష్ఠ భార్య యైన, కేశినీ = కేశిని, సగరాత్మజమ్ = సగరుని కుమారు డైన, అసమంజ ఇతి = అసమంజుడు అని, ఖ్యాతమ్ = ప్రసిద్ధు డైన, పుత్రమ్ = పుత్రుని, వ్యజాయత = కనెను.

తా. కొంతకాలము గడచిన పిమ్మట, జ్యేష్ఠభార్య యైన కేశినియందు, సగరచక్రవర్తి కి అసమంజు డను పేరు గల పుత్రుడు కలిగెను.

మూ. సుమతిస్తు నరవ్యాఘ్ర గర్భతుమ్బం వ్యజాయత,

షష్టిః పుత్రసహస్రాణి తుమ్బభేదాద్వినిఃసృతాః. 17

ప్ర. అ. నరవ్యాఘ్ర = ఓ నరశ్రేష్ఠా! సుమతిస్తు = సుమతియైతే, గర్భతుమ్బమ్ = సొరకాయ వంటి గర్భపిండమును, వ్యజాయత = కనెను. తుమ్బభేదాత్ = ఆ సొరకాయ వంటి గర్భపిండము పగులుటవలన, షష్టిః = అరువది, పుత్రసహస్రాణి = పుత్రసహస్రములు, వినిస్సృతాః = బైటకువచ్చినవి.

తా. రామా! సుమతి సొరకాయ వంటి గర్భపిండమును కనెను. ఆ గర్భపిండము పగులగా అరువది వేలమంది పుత్రులు బైటకు వచ్చిరి.

మూ. ఘృతపూర్ణేషు కుమ్భేషు ధాత్య్రస్తాన్సమవర్ధయన్,

కాలేన మహతా సర్వే యౌవనం ప్రతిపేదిరే. 18

ప్ర. అ. ధాత్య్రః = పెంపుడు తల్లులు, తాన్ = వారిని, ఘృతపూర్ణేషు = నేతితో నిండిన, పాత్రేషు = పాత్రలయందు, సమవర్ధయన్ = వృద్ధి పొందించిరి. సర్వే = వారందరును, మహతా కాలేన = చాల కాలమునకు, యౌవనమ్ = యౌవనమును, ప్రతిపేదిరే = పొందిరి.

తా. పెంపుడు తల్లులు వారిని నేతితో నింపిన పాత్రలలో ఉంచి పెంచిరి. చాల కాలమునకు వారు యౌవనవంతు లయిరి.

మూ. అథ దీర్ఘేణ కాలేన రూపయౌవనశాలినః,

షష్టిః పుత్రసహస్రాణి సగరస్యాభవం స్తదా. 19

ప్ర. అ. అథ = పిమ్మట, దీర్ఘేణ కాలేన = చాలాకాలముచేత, సగరస్య = సగరునియొక్క, షష్టిః పుత్రసహస్రాణి = అరువది వేలమంది పుత్రులును, తదా = అప్పుడు, రూపయౌవనశాలినః = రూపయౌవనములతో ప్రకాశించుచున్న వారుగా, అభవన్ = అయిరి.

తా. సగరుని అరువది వేలమంది కుమారులును దీర్ఘకాలమునకు రూప యౌవనములతో ప్రకాశించుచు పెరిగిరి.

మూ. సచ జ్యేష్ఠో నరశ్రేష్ఠ సగరస్యాత్మసంభవః,

బాలాన్ గృహీత్వా తు జలే సరయ్వా రఘునన్దన, 20

ప్రక్షిప్య ప్రహసన్నిత్యం మజ్జతస్తాన్ సవిూక్ష్య వై.

ప్ర. అ. నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా! రఘునన్దన = రామా! జ్యేష్ఠః = పెద్దవాడైన, సః = ఆ, సగరస్య ఆత్మసంభవః = సగరుని కుమారుడు, నిత్యమ్ = ప్రతిదినము, బాలాన్ = చిన్న పిల్లలను, గృహీత్వా = పట్టుకొని, సరయ్వాః = సరయూనదియొక్క, జలే = జలమునంద, ప్రక్షిప్య = పడవేసి, నిమజ్జతః = మునిగిపోవుచున్న, తాన్ = వాళ్లను, సమీక్ష్య = చూచి, ప్రహసన్ = నవ్వుచు, (ఆనందించుచుండెడివాడు).

తా. నరశ్రేష్ఠా! రామా! సగరుని జ్యేష్ఠకుమారుడు ప్రతిదినము, చిన్నపిల్లలను పట్టుకొని, సరయూనదీ జలములోనికి విసిరివేసి, వాళ్లు మునకలు కొట్టుచుండగా చూచి ఆనందించుచుండెడి వాడు.

మూ. ఏవం పాపసమాచారః సజ్జనప్రతిబాధకః,

పౌరాణామహితే యుక్తః పుత్రో నిర్వాసితః పురాత్. 21

ప్ర. అ. ఏవమ్ = ఈ విధముగా, పాపసమాచారః = పాపప్రవృత్తి కలవాడును, సజ్జనప్రతిబాధకః = సజ్జనులను బాధించువాడును, పౌరాణామ్ = పౌరులయొక్క, అహితే = హితముకాని కార్యమునందు, రతః = ఆసక్తి గల, పుత్రః = పుత్రుడు, పురాత్ = పురమునుండి, నిర్వాసితః = వెడలగొట్టబడెను.

తా. ఈ విధముగ పాపకార్యములు చేయుచు, సజ్జనులను బాధించుచు, పౌరులకు అహితము చేయుటలో ఆసక్తుడైన ఆ పుత్రుని, సగరుడు పట్టణమునుండి వెడలగొట్టెను.

మూ. తస్య పుత్రోఽంశుమాన్నామ అసమంజస్య వీర్యవాన్,

సంమతః సర్వలోకస్య సర్వస్యాపి ప్రియంవదః. 22

ప్ర. అ. తస్య = ఆ, అసమంజస్య = అసమంజునియొక్క, పుత్రః = పుత్రుడును, వీర్యవాన్ = పరాక్రమవంతుడును అగు, అంశుమాన్ నామ = అంశుమంతుడు అను నతడు, సర్వలోకస్య = సమస్తలోకమునకును, సంమతః = ఇష్టుడు. సర్వస్యాపి = అందరికిని, ప్రియంవదః = ప్రియము మాటలాడువాడు.

తా. ఆ అసమంజుని కుమారుడు అంశుమంతుడు. అతడు పరాక్రమము కలవాడు. సకలలోకమునకును ఇష్టుడు. అందరితోను ప్రియముగా మాటలాడువాడు.

మూ. తతః కాలేన మహతా మతిః సమభిజాయత,

సగరస్య నరశ్రేష్ఠ యజేయమితి నిశ్చితా. 23

ప్ర. అ. నరశ్రేష్ఠ = ఓ రామా! తతః = పిమ్మట, మహతా కాలేన = చాల కాలము చేత, సగరస్య = సగరునకు, యజేయమ్ ఇతి = యాగము చేయుదును అని, నిశ్చితా = నిశ్చితమైన, మతిః = బుద్ధి, సుమభిజాయత = పుట్టినది.

తా. పురుషశ్రేష్ఠా! పిమ్మట చాలకాలమునకు, సగరునకు యజ్ఞము చేయ వలె నని ఆలోచన కలిగెను.

మూ. స కృత్వా నిశ్చయం రామ సోపాధ్యాయగణస్తదా,

యజ్ఞకర్మణి వేదజ్ఞో యష్టుం సముపచక్రమే. 24

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే అష్టత్రింశః సర్గః

ప్ర. అ. రామ = రామా! తదా = అపుడు, వేదజ్ఞః = వేదముల నెరిగిన, సః = అతడు, సోపాధ్యాయగణః = ఉపాధ్యాయసహితుడై, యజ్ఞకర్మణి = యజ్ఞానుష్ఠానము విషయమున, నిశ్చయమ్ = నిశ్చయమును, కృత్వా = చేసి, యష్టుమ్ = యాగము చేయుటకు, సముపచక్రమే = ఉపక్రమించెను.

తా. రామా! అపుడు వేదజ్ఞు డైన ఆ సగరుడు ఉపాధ్యాయులతో కూడ యజ్ఞానుష్ఠానము విషయమున నిశ్చయించుకొని యాగము చేయ ప్రారంభించెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో ముప్పది యెనిమిదవ సర్గ సమాప్తము.