| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 45 |
| Pages | 6 |
| Read Time | 9 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ ఏకోనచత్వారింశః సర్గః
సగరచక్రవర్తి విడచిన యజ్ఞాశ్వమును దేవేంద్రుడు అపహరించుట, సగరుని కుమారులు యజ్ఞాశ్వమును వెదకుచు భూమిని భేదించుట. దేవత లందరును పోయి బ్రహ్మవద్ద మొరపెట్టుకొనుట.
మూ. విశ్వామిత్రవచః శ్రుత్వా కథాన్తే రఘునన్దనః,
ఉవాచ పరమప్రీతో మునిం దీప్తమివానలమ్. 1
ప్ర. అ. రఘునన్దనః = రాముడు, విశ్వామిత్రవచః = విశ్వామిత్రుని వాక్యమును, శ్రుత్వా = విని, పరమప్రీతః = చాల సంతసించినవాడై, కథాన్తే = కథయొక్క అంతమునందు, దీప్తమ్ = ప్రజ్వలించుచున్న, అనలమివ = అగ్ని వలె ఉన్న, మునిమ్ = విశ్వామిత్రుని గూర్చి, ఉవాచ = పలికెను.
తా. రాముడు విశ్వామిత్రుని వచనమును విని, చాల సంతసించి, కథాంతమున ప్రజ్వలించుచున్న అగ్ని వలె ఉన్న ఆతనితో ఇట్లనెను.
మూ. శ్రోతుమిచ్ఛామి భద్రం తే విస్తరేణ కథామిమామ్,
పూర్వకో మే కథం బ్రహ్మన్ యజ్ఞం వై సముపాహరత్. 2
ప్ర. అ. బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! ఇమామ్ = ఈ, కథామ్ = కథను, విస్తరేణ = సవిస్తరముగ, శ్రోతుమ్ = వినుటకు, ఇచ్ఛామి = కోరుచున్నాను. తే = నీకు, భద్రమ్ = మంగళ మగుగాక. మే = నా యొక్క, పూర్వకః = పూర్వికుడు, యజ్ఞమ్ = యజ్ఞమును, కథమ్ = ఎట్లు, సముపాహరత్ = చేసెను ?
తా. ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! మా పూర్వపురుషు డైన సగరచక్రవర్తి యజ్ఞము ఎట్లు చేసెనో సవిస్తరముగా విన గోరుచున్నాను.
మూ. విశ్వామిత్రస్తు కాకుత్థ్స మువాచ ప్రహసన్నివ,
శ్రూయతాం విస్తరో రామ సగరస్య మహాత్మనః. 3
ప్ర. అ. విశ్వామిత్రస్తు = విశ్వామిత్రుడు, ప్రహసన్నివ = నవ్వుచు, కాకుత్థ్సమ్ = రాముని గూర్చి, ఉవాచ = పలికెను. మహాత్మనః = మహాత్ము డైన, సగరస్య = సగరునియొక్క, విస్తరః = కథావిస్తరము, శ్రూయతామ్ = వినబడుగాక.
తా. విశ్వామిత్రుడు చిరునవ్వు నవ్వి రామునితో ఇట్లు పలికెను. రామా! మహాత్ము డైన సగరుని కథావిస్తరమును చెప్పెదను, వినుము.
మూ. శఙ్కరశ్వశురో నామ హిమవానచలోత్తమః,
విన్ధ్యపర్వతమాసాద్య నిరీక్షేతే పరస్పరమ్. 4
ప్ర. అ. శంకరశ్వశురః = శివుని మామగారైన, హిమవాన్నామ = హిమవంతుడను పేరు గల, అచలోత్తమః = పర్వతశ్రేష్ఠము, విన్ధ్యపర్వతమ్ = వింధ్యపర్వతమును, ఆసాద్య = పొంది ఉన్నది. ఆ రెండు పర్వతములును, పరస్పరమ్ = పరస్పరము, నిరీక్షేతే = చూచుకొనుచున్నవి.
తా. మహేశ్వరుని మామగా రైన హిమవత్పర్వత మను పర్వతశ్రేష్ఠము వింధ్య పర్వతమును చూపుల ద్వారా పొంది ఉన్నది. అట్లే వింధ్యము దానిని పొంది యున్నది. ఆ రెండు పర్వతములును, పరస్పరము చూచుకొనుచుండును.
వి. హిమవద్వింధ్యపర్వతముల నడుమ మరే పర్వతమును అడ్డు లేక పోవుటచేతను, ఆ రెండును చాల ఎత్తైన వగుటచేతను హిమవత్పర్వతము వింధ్య పర్వతమును పొంది, వింధ్యము హిమవత్పర్వతమును పొంది ఉన్నదనియు, ఆ రెండును ఒకదాని నొకటి చూచుచు నిలబడి ఉన్న వనియు చెప్పబడిన దని వ్యాఖ్యాతలు.
మూ. తయోర్మధ్యే ప్రవృత్తోఽభూద్యజ్ఞ స్స పురుషోత్తమ,
స హి దేశో నరవ్యాఘ్ర ప్రశస్తో యజ్ఞకర్మణి. 5
ప్ర. అ. పురుషోత్తమ = ఓ పురుషశ్రేష్ఠుడా! సః = ఆ, యజ్ఞః = యజ్ఞము, తయోః = ఆ హిమవద్వింధ్యముల, మధ్యే = మధ్యయందు, ప్రవృత్తః = జరిగినది. నరవ్యాఘ్ర = నరశ్రేష్ఠుడా! సః = ఆ, దేశః = దేశము, యజ్ఞకర్మణి = యజ్ఞకర్మయందు, ప్రశస్తః హి = ప్రశస్త మైనది కదా ?
తా. రామా! ఆ యజ్ఞము ఆ రెండు పర్వతముల మధ్య నున్న దేశమునందు జరిగినది. ఏల నన, యజ్ఞము చేయుటకు ఆ దేశము చాల ప్రశస్త మైనది.
మూ. తస్యాశ్వచర్యాం కాకుత్థ్స దృఢధన్వా మహారథః,
అంశుమానకరోత్తాత సగరస్య మతే స్థితః. 6
ప్ర. అ. తాత = తండ్రీ! కాకుత్థ్స = రామా!, దృఢధన్వా = దృఢమైన ధనుస్సు కలవాడును, మహారథః = మహారథుడును అగు, అంశుమాన్ = అంశుమంతుడు, సగరస్య = సగరునియొక్క, మతే = మతమునందు, స్థితః = ఉన్నవాడై, తస్య = ఆ యజ్ఞముయొక్క, అశ్వచర్యామ్ = అశ్వముయొక్క అనుసరణమును, అకరోత్ = చేసెను.
తా. రామా! దృఢ మైన ధనుస్సు కలవాడును, మహారథుడును అగు అంశుమంతుడు, సగరుని ఆజ్ఞ ప్రకారము యజ్ఞాశ్వమును రక్షించుచు దాని ననుసరించె3ను.
మూ. తస్య పర్వణి తం యజ్ఞం యజమానస్య వాసవః,
రాక్షసీం తనుమాస్థాయ యజ్ఞీయాశ్వమపాహరత్. 7
ప్ర. అ. వాసవః = ఇంద్రుడు, రాక్షసీమ్ = రాక్షససంబంధ మైన, తనుమ్ = శరీరమును, ఆస్థాయ = గ్రహించి, పర్వణి = ఉక్థ్యదివసమునందు, యజ్ఞం యజమానస్య = యజ్ఞము చేయుచున్న, తస్య = సగరునియొక్క, యజ్ఞీయాశ్వమ్ = యజ్ఞమునకు సంబంధించిన అశ్వమును, అపాహరత్ = అపహరించెను.
తా. దేవేంద్రుడు రాక్షసరూపమును ధరించి, ఉక్థ్యదివస మను పర్వమునందు, సగరుని యజ్ఞాశ్వమును అపహరించెను.
మూ. హ్రియమాణే తు కాకుత్స్థ తస్మిన్నశ్వే మహాత్మనః,
ఉపాధ్యాయగణాః సర్వే యజమానమథాబ్రువన్. 8
ప్ర. అ. కాకుత్థ్స = రామా! మహాత్మనః = మహాత్ముడైన ఆ సగరునియొక్క, తస్మిన్ అశ్వే = ఆ అశ్వము, హ్రియమాణే = హరింపబడుచుండగా, అథ = పిమ్మట, సర్వే = సమస్తమైన, ఉపాధ్యాయగణాః = ఋత్విక్కులు, యజమానమ్ = యజమానుని గూర్చి, అబ్రువన్ = పలికిరి.
తా. రామా! మహాత్ము డైన సగరుని యజ్ఞీయాశ్వము అపహరింపబడుచుండగా ఋత్విక్కు లందరును యజమానునితో ఇట్లనిరి.
మూ. అయం పర్వణి వేగేన యజ్ఞీయాశ్వోఽపనీయతే,
హర్తారం జహి కాకుత్స్థ హయశ్చైవోపనీయతామ్. 9
ప్ర. అ. కాకుత్థ్స = ఓ సగరచక్రవర్తీ! పర్వణి = ఉక్థ్యాహపర్వమునందు, అయమ్ = ఈ, యజ్ఞీయాశ్వః = యజ్ఞాశ్వము, వేగేన = వేగముచేత, అపనీయతే = తీసికొనిపోబడుచున్నది. హర్తారమ్ = అపహరించువానిని, జహి = చంపుము. హయశ్చ = అశ్వము, ఉపనీయతామ్ = తీసికొనిరాబడుగాక.
తా. సగరచక్రవర్తీ! పర్వమునందు ఈ యజ్ఞాశ్వమును ఎవ్వరో వేగముగ అపహరించి తీసికొనిపోవుచున్నారు. అపహరించువానిని సంహరించి యజ్ఞాశ్వమును తీసికొనిరమ్ము.
మూ. యజ్ఞచ్ఛిద్రం భవత్యేతస్సర్వేషామశివాయ నః,
తత్తథా క్రియతాం రాజన్ యథాఽచ్ఛిద్రః క్రతుర్భవేత్. 10
ప్ర. అ. ఏతత్ = ఈ, యజ్ఞచ్ఛిద్రమ్ = యజ్ఞాపరాధము, నః = మనకు, సర్వేషామ్ = అందరికిని, అశివాయ = అమంగళకరము, భవేత్ = అగును. తత్ = ఆ కారణమువలన, రాజన్ = రాజా! క్రతుః = ఈ క్రతువు, అచ్ఛిద్రః = అపరాధరహితమై, యథా = ఎట్లు, భవేత్ = అగునో, తథా = ఆ ప్రకారము, క్రియతామ్ = చేయబడుగాక.
తా. రాజా! ఈ యజ్ఞాపరాధము మన అందరికిని అమంగళకరము. అందువలన యజ్ఞములో అపచారము కలుగకుండు నట్లు చేయుము.
మూ. ఉపాధ్యాయవచః శ్రుత్వా తస్మిన్ సదసి పార్థివః,
షష్టిం పుత్రసహస్రాణి వాక్యమేతదువాచ హ. 11
ప్ర. అ. పార్థివః = ఆ రాజు, ఉపాధ్యాయవచః = ఋత్విక్కుల వాక్యమును, శ్రుత్వా = విని, తస్మిన్ సదసి = ఆ యజ్ఞసదస్సునందు, షష్టిం = అరువది, పుత్రసహస్రాణి = పుత్రుల సహస్రములను, ఏతత్ వాక్యమ్ = ఈ వాక్యమును, ఉవాచ హ = పలికెను.
తా. సగరుడు ఋత్విక్కుల వాక్యములు విని, ఆ యజ్ఞసదస్సులో, అరువదివేల మంది కుమారులతో ఇట్లనెను.
మూ. గతిం పుత్రా న పశ్యామి రక్షసాం పురుషర్షభాః,
మన్త్రపూతైర్మహాభాగైరాస్థితో హి మహాక్రతుః. 12
ప్ర. అ. పురుషర్షభాః = పురుషశ్రేష్ఠు లైన, పుత్రాః = పుత్రులారా!, రక్షసామ్ = రాక్షసులకు, గతిమ్ = ఇచట ప్రవేశమును, న పశ్యామి = చూడను. హి = ఏలననగా, మహాక్రతుః = ఈ మహాయజ్ఞము, మన్త్రపూతైః = మంత్రములచే పవిత్రులైన, మహాభాగైః = మహాత్ములచేత, ఆస్థితః = అధిష్ఠింపబడినది.
తా. పురుషశ్రేష్ఠు లైన పుత్రులారా! ఇచటకు రాక్షసులు రాజాల రవి నా విశ్వాసము. ఏలననగా ఈ క్రతువును జరిపించువారు మంత్రములచే పవిత్రు లైన మహానుభావులు.
మూ. తద్గచ్ఛత విచిన్వధ్వం పుత్రకా భద్రమస్తు వః,
సముద్రమాలినీం సర్వాం పృథివీమనుగచ్ఛత. 13
ప్ర. అ. పుత్రకాః = కుమారులారా!, తత్ = ఆ కారణమువలన, గచ్ఛత = వెళ్ళుడు. వః = మీకు, భద్రమ్ = మంగళము, అస్తు = అగుగాక. సముద్ర మాలినీమ్ = సముద్రము లనెడు మాల గల, సర్వామ్ = సమస్త మైన, పృథివీమ్ = భూమిని, అనుగచ్ఛత = వెదకుడు.
తా. పుత్రులారా! మీకు మంగళ మగుగాక. మీ రందరును బయలుదేరుడు. సముద్రములచే చుట్టబడి యున్న భూమి నంతను వెదకుడు.
మూ. ఏకైకయోజనం పుత్రా విస్తారమధిగచ్ఛత,
యావత్తురగసన్దర్శస్తావత్ఖనత మేదినీమ్. 14
తం చైవ హయహర్తారం మార్గమాణా మమాజ్ఞయా.
ప్ర. అ. పుత్రాః = పుత్రులారా! ఏకైకయోజనమ్ = ఒక్కొక్క యోజనము చొప్పున, విస్తారమ్ = భూవైశాల్యమును, అధిగచ్ఛత = తీసికొనుడు. మమ = నాయొక్క, ఆజ్ఞయా = ఆజ్ఞచేత, తమ్ = ఆ, హయహర్తారమ్ = అశ్వమును హరించినవానిని, మార్గమాణాః = అన్వేషించుచున్న వారై, తురగసందర్శః = అశ్వముయొక్క దర్శనము, యావత్ = ఎప్పటికి అగునో, తావత్ = అంతవరకును, మేదినీమ్ = భూమిని, ఖనత = త్రవ్వుడు.
తా. పుత్రులారా! మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనము చొప్పున భూమియొక్క విస్తారమును పంచుకొని, అశ్వమును హరించినవానిని వెదకుచు, గుఱ్ఱము కనబడు నంతవరకును భూమిని త్రవ్వుడు. ఇది నా యాజ్ఞ.
మూ. దీక్షితః పౌత్రసహితః సోపాధ్యాయగణో హ్యహమ్,
ఇహ స్థాస్యామి భద్రం వో యావత్తురగదర్శనమ్. 15
ప్ర. అ. దీక్షితః = దీక్ష వహించిన, అహమ్ = నేను, పౌత్రసహితః = పౌత్రునితో కూడినవాడనై, సోపాధ్యాయగణః = ఋత్విగ్గణముతో కూడిన వాడనై, యావత్తురగదర్శనమ్ = గుఱ్ఱము కనబడు నంతవరకును, ఇహ = ఇచ్చటనే, స్థాస్యామి = ఉండగలను. వః = మీకు, భద్రమ్ = క్షేమ మగుగాక.
తా. గుఱ్ఱము కనబడువరకును, దీక్ష వహించిన నేను, ఋత్విక్కులును, పౌత్రుడును ఇచటనే ఉండగలము.
మూ. ఇత్యుక్తా హృష్టమనసో రాజపుత్రా మహాబలాః,
జగ్ముర్మహీతలం రామ పితుర్వచనయన్త్రితాః. 16
ప్ర. అ. రామ = రామా!, ఇతి = ఈ విధముగా, ఉక్తాః = పలకబడిన, మహాబలాః = మహాబలవంతు లైన, రాజపుత్రాః = రాజపుత్రులు, హృష్టమనసో = సంతసించిన మనస్సు కలవారై, పితుః = తండ్రియొక్క, వచనయన్త్రితాః = వాక్కుచే నియమితులై, మహీతలమ్ = భూతలమును గూర్చి, జగ్ముః = వెళ్లిరి.
తా. సగరుడు ఇట్లు పలుకగనే మహాబలశాలు లగు ఆ రాజపుత్రులు ఉత్సాహవంతులై, తండ్రి ఆజ్ఞ ప్రకారము భూమి నంతను వెదకుటకు వెళ్లిరి.
మూ. యోజనాయామవిస్తారమేకైకో ధరణీతలమ్,
బిభిదుః పురుషవ్యాఘ్ర వజ్రస్పర్శసమైర్నఖైః. 17
ప్ర. అ. పురుషవ్యాఘ్ర = ఓ పురుషశ్రేష్ఠుడా!, ఏకైకః = ఒక్కొక్కడు, యోజనాయామ విస్తారమ్ = ఒక యోజనము పొడవు ఒక యోజనము వెడల్పు గల, ధరణీతలమ్ = భూప్రదేశమును, వజ్రస్పర్శసమైః = వజ్రముయొక్క స్పర్శతో సమానమైన, నఖైః = గోళ్లతో, బిభిదుః = బ్రద్దలు కొట్టిరి.
తా. రామా! ఒక్కొక్కడు ఒక నలుచదరపు యోజనము చొప్పున భూప్రదేశమును వజ్రము వంటి సారము గల నఖములతో భూప్రదేశమును బ్రద్దలుగొట్టిరి.
మూ. శూలైరశనికల్పైశ్చ హలైశ్చాపి సుదారుణైః,
భిద్యమానా వసుమతీ ననాద రఘునన్దన. 18
ప్ర. అ. రఘునన్దన = రామా!, అశనికల్పైః = వజ్రాయుధముతో సమానమైన, శూలైః = శూలములతోడను, సుదారుణైః = చాల భయంకర మైన, హలైశ్చ = నాగళ్లతోడను, భిద్యమానా = భేదింపబడుచున్న, వసుమతీ = భూమి, ననాద = ధ్వనిచేసెను.
తా. వా రీవిధముగ వజ్రముల వంటి శూలములచేతను, భయంకరమైన నాగళ్లచేతను భూమిని భేదించుచుండగా గొప్ప ధ్వని బయలుదేరెను.
మూ. నాగానాం మథ్యమానానామసురాణాం చ రాఘవ,
రాక్షసానాం చ దుర్ధర్షః సత్త్వానాం నినదోఽభవత్. 19
ప్ర. అ. రాఘవ = రామా!, మథ్యమానానామ్ = నలగగొట్టబడుచున్న, నాగానామ్ = సర్పములయొక్క, అసురాణాం చ = అసురులయొక్కయు, రాక్షసానాం చ = రాక్షసులయొక్కయు, సత్త్వానామ్ = ఇతరజంతువులయొక్కయు, దుర్ధర్షః = సహింపరాని, నినదః = ధ్వని, అభవత్ = ఆయెను.
తా. రామా! వారు భూమిని త్రవ్వుచుండగా ఎన్నియో సర్పములు, అసురులు, రాక్షసులు, ఇతరజంతువులు నలిగిపోవుటచే సహింపరాని ఆర్తధ్వని బయలుదేరినది.
మూ. యోజనానాం సహస్రాణి షష్టిం తు రఘునన్దన,
బిభిదుర్ధరణీం వీరా రసాతలమనుత్తమమ్. 20
ప్ర. అ. రఘునన్దన = రామా!, వీరాః = ఆ వీరులు, యోజనానామ్ = యోజనములయొక్క, షష్టిం సహస్రాణి = అరువది వేలు, ధరణీమ్ = భూమిని, అనుత్తమమ్ = గొప్ప దైన, రసాతలమ్ = రసాతలమునుగా, బిభిదుః = త్రవ్విరి.
తా. రామా! ఆ వీరులు అరవైవేల యోజనముల భూమి పాతాళమై పోవునట్లుగా త్రవ్విరి.
మూ. ఏవం పర్వతసంబాధం జమ్బూద్వీపం నృపాత్మజాః,
ఖనన్తో నృపశార్దూల సర్వతః పరిచక్రముః. 21
ప్ర. అ. నృపశార్దూల = రాజశ్రేష్ఠుడా! నృపాత్మజాః = సగరునికుమారులు, పర్వతసంబాధమ్ = పర్వతములచేత ఇరుకైన, జమ్బూద్వీపమ్ = జంబూద్వీపమును, ఏవమ్ = ఈ విధముగ, ఖనన్తః = త్రవ్వుచున్న వారై, సర్వతః = అంతటను, పరిచక్రముః = సంచరించిరి.
తా. రామా! సగరుని కుమారులు పర్వతములతో ఇరుకుగా ఉన్న జంబూ ద్వీపమును ఈ విధముగ త్రవ్వుచు అంతటను సంచరించిరి.
మూ. తతో దేవాః సగన్ధర్వాః సాసురాః సహపన్నగాః,
సంభ్రాన్తమనసః సర్వే పితామహముపాగమన్. 22
ప్ర. అ. తతః = పిమ్మట, సగన్ధర్వాః = గంధర్వులతో కూడిన, సాసురాః = అసురులతో కూడిన, సహపన్నగాః = సర్పములతో కూడిన, దేవాః = దేవతలు, సర్వే = అందరును, సంభ్రాన్తమనసః = కలతచెందిన మనస్సు కలవారై, పితామహమ్ = బ్రహ్మదేవుని, ఉపాగమన్ = చేరిరి.
తా. పిమ్మట దేవతలు, గంధర్వులు, అసురులు, పన్నగులు అందరును కలతచెంది బ్రహ్మదేవుని వద్దకు వెళ్లిరి.
మూ. తే ప్రసాద్య మహాత్మానం విషణ్ణవదనాస్తదా,
ఊచుః పరమసంత్రస్తాః పితామహమిదం వచః. 23
ప్ర. అ. పరమసంత్రస్తాః = మిక్కిలి భయపడినవారును, విషణ్ణవదనాః = దిగులు చెందిన ముఖము కలవారును అగు, తే = వారు, మహాత్మానమ్ = మహాత్ముడైన, పితామహమ్ = బ్రహ్మదేవుని, ప్రసాద్య = అనుగ్రహింపచేసికొని, ఇదం వచః = ఈ వాక్యమును, ఊచుః = పలికిరి.
తా. మిక్కిలి భయముతో దిగులుచెందిన ముఖములు గల వారందరును మహాత్ము డైన బ్రహ్మదేవుని అనుగ్రహింపచేసికొని ఇట్లు పలికిరి.
మూ. భగవన్ పృథివీ సర్వా ఖన్యతే సగరాత్మజైః.
బహవశ్చ మహాత్మానో హన్యన్తే తలవాసినః. 24
ప్ర. అ. భగవన్ = ఓ భగవంతుడా! సర్వా = సమస్త మైన, పృథివీ = భూమి, సగరాత్మజైః = సగరుని కుమారులచేత, ఖన్యతే = త్రవ్వబడుచున్నది. తలవాసినః = పాతాలములో నివసించు, బహవః = చాలమంది, మహాత్మానః = మహాత్ములు, హన్యన్తే = చంపబడుచున్నారు.
తా. భగవంతుడా! సగరకుమారులు భూమి నంతను త్రవ్వివేయుచున్నారు. పాతాలములో నివసించు ఎందరో మహాత్ములను చంపివేయు చున్నారు.
మూ. అయం యజ్ఞహనోఽస్మాకమనేనాశ్వోఽపనీయతే,
ఇతి తే సర్వభూతాని నిఘ్నన్తి సగరాత్మజాః. 25
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే ఏకోనచత్వారింశః సర్గః
ప్ర. అ. అయమ్ = వీడు, నః = మనయొక్క, యజ్ఞహనః = యజ్ఞమును పాడు చేసినవాడు. అనేన = వీనిచేత, అశ్వః = అశ్వము, అపనీయతే = అపహరింపబడుచున్నది. ఇతి = అని అనుచు, తే సగరాత్మజాః = ఆ సగరకుమారులు, సర్వభూతాని = సమస్త భూతములను, నిఘ్నన్తి = చంపుచున్నారు.
తా. ‘‘వీడే మన అశ్వమును అపహరించుచున్నాడు. మన యజ్ఞమును చెరచినవాడు వీడే’’ అని అనుచు ఆ సగరకుమారులు కనబడిన ప్రతి ఒక్క ప్రాణిని చంపుతున్నారు.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలోని ముప్పది తొమ్మిదవ సర్గ సమాప్తము.
