| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 46 |
| Pages | 7 |
| Read Time | 11 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ చత్వారింశః సర్గః
సగరపుత్రులు అచిరకాలమున నశింపగల రని చెప్పి బ్రహ్మదేవుడు దేవతల నూరడించుట, భూమిని త్రవ్వుచు పాతాళమునకు పోయిన సగరపుత్రులు అచట కపిలుని దగ్గర యజ్ఞాశ్వమును చూచి ఆతనిని చంపుటకై వెళ్లగా అతడు వారిని హుంకరించి భస్మము చేయుట.
మూ. దేవతానాం వచః శ్రుత్వా భగవాన్వై పితామహః,
ప్రత్యువాచ సుసంతప్తాన్ కృతాన్తబలమోహితాన్. 1
ప్ర. అ. భగవాన్ = పూజ్యడైన, పితామహః = బ్రహ్మదేవుడు, దేవతానామ్ = దేవతలయొక్క, వచః = వాక్యమును, శ్రుత్వా = విని, కృతాన్తబలమోహితాన్ = దైవముయొక్క బలముచే మోహితులును, సుసంతస్తాన్ = చాల భయము చెందినవారును అగు వారిని గూర్చి, ప్రత్యువాచ = తిరిగి పలికెను.
తా. దేవతల వాక్యము విని బ్రహ్మదేవుడు, దైవబలముచేత మోహము చెంది, మిక్కిలి భయపడిన వారితో ఇట్లనెను.
మూ. యస్యేయం వసుధా కృత్స్నా వాసుదేవస్య ధీమతః,
కాపిలం రూపమాస్థాయ ధారయత్యనిశం ధరామ్. 2
తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యన్తి నృపాత్మజాః.
ప్ర. అ. కృత్న్సా = సమస్త మైన, ఇయం వసుధా = ఈ భూమి, యస్య = ఏ, ధీమతః = ధీమంతు డైన, వాసుదేవస్య = వాసుదేవునకు సంబంధించినదో, ఆ వాసుదేవుడు, కాపిలం రూపమ్ = కపిలు డను రూపమును, ఆస్థాయ = ధరించి, అనిశమ్ = ఎల్లప్పుడును, ధరామ్ = భూమిని, ధారయతి = ధరించుచున్నాడు. నృపాత్మజాః = సగరుని కుమారులు, తస్య = అతని యొక్క, కోపాగ్నినా = కోపాగ్ని చేత, దగ్ధాః = కాల్చబడినవారు, భవిష్యన్తి = కాగలరు.
తా. ఈ సమస్తభూమియు ఏ వాసుదేవునకు చెందినదో అట్టి వాసుదేవుడు, కపిలావతారము నెత్తి సర్వదా ఈ భూమిని ధరించుచున్నాడు. ఈ సగరకుమారులు ఆ కపిలుని కోపాగ్నిచే భస్మము కాగలరు.
మూ. పృథివ్యాశ్చాపి నిర్భేదో దృష్ట ఏవ సనాతనః,
సగరస్య చ పుత్రాణాం వినాశోఽదీర్ఘజీవినామ్. 3
ప్ర. అ. పృథివ్యాః = భూమియొక్క, నిర్భేదః = భేదనము, అదీర్ఘజీవినామ్ = అల్పాయుర్దాయవంతు లైన, సగరస్య పుత్రాణామ్ = సగరపుత్రుల, వినాశశ్చ = వినాశనము, సనాతనః = పురాతనముగా, దృష్ట ఏవ = చూడబడినదే.
తా. ఈ విధముగ భూమి త్రవ్వబడు ననియు, అల్పాయుర్దాయవంతులైన సగర కుమారులు నశించెద రనియు ఏ నాడో నిర్ణయింపబడినది.
మూ. పితామహవచః శ్రుత్వా త్రయస్త్రింశదరిందమ,
దేవాః పరమసంహృష్టాః పునర్జగ్ముర్యథాగతమ్. 4
ప్ర. అ. అరిందమ = శత్రువులను సంహరించువాడా! పితామహవచః = బ్రహ్మదేవుని వాక్యమును, శ్రుత్వా = విని, త్రయస్త్రింశత్ దేవాః = ముప్పది ముగ్గురు దేవతలు, పరమసంహృష్టాః = మిక్కిలి సంతసించిన వారై, యథాగతమ్ = వచ్చిన విధముగనే, పునః = మరల, జగ్ముః = వెళ్లిరి.
తా. రామా! మప్పదిముగ్గురు దేవతలును, ఇతరులును, బ్రహ్మదేవుని మాటలు విని, చాల సంతోషించి, తమ తమ స్థానములకు వెళ్లిపోయిరి.
వి. ఎనమండుగురు వసువులు, పదకొండుగురు రుద్రులు, పండ్రెండుగురు ఆదిత్యులు, ఇద్దరు అశ్వినులు కలిసి ముప్పదిముగ్గురు దేవతలు.
మూ. సగరస్య చ పుత్రాణాం ప్రాదురాసీన్మహాత్మనామ్,
పృథివ్యాం భిద్యమానాయాం నిర్ఘాతసమనిస్వనః. 5
ప్ర. అ. మహాత్మనామ్ = మహాత్ములైన, సగరస్య పుత్రాణామ్ = సగరుని కుమారులకు, పృథివ్యామ్ = భూమి, భిద్యమానాయామ్ = బ్రద్దలుకొట్టబడుచుండగా, నిర్ఘాతసమనిస్వనః = పిడుగు వంటి ధ్వని, ప్రాదురాసీత్ = పుట్టెను (వినబడెను).
తా. ఈ విధముగ భూమిని బ్రద్దలుకొట్టుచున్నప్పుడు సగరకుమారులకు పిడుగు వంటి ధ్వని, వారి వినాశమును సూచించుచు, వినబడెను.
మూ. తతో భిత్త్వా మహీం సర్వే కృత్వా చాభిప్రదక్షిణమ్,
సహితాః సగరాః సర్వే పితరం వాక్యమబ్రువన్. 6
ప్ర. అ. తతః = పిమ్మట, సర్వే = అందరును, మహీమ్ = భూమిని, భిత్త్వా = భేదించి, అభిప్రదక్షిణమ్ = ప్దక్షిణము, కృత్వా = చేసి, సర్వే సగరాః = ఆ సగరకుమారు లందరును, సహితాః = కలసిన వారై, పితరమ్ = తండ్రిని గూర్చి, వాక్యమ్ = వాక్యమును, అబ్రువన్ = పలికిరి.
తా. ఆ సగరకుమారు లందరును భూమిని భేదించి ఒక చుట్టు తిరిగి వచ్చిరి. అశ్వము కనబడలేదు. అంత వారందరును కలిసి తండ్రి వద్దకు పోయి ఇట్లు చెప్పిరి.
మూ. పరిక్రాంతా మహీ సర్వా సత్త్వవన్తశ్చ సూదితాః,
దేవదానవరక్షాంసి పిశాచోరగకిన్నరాః, 7
న చ పశ్యామహేఽశ్వం తమశ్వహర్తారమేవ చ,
కిం కరిష్యామ భద్రం తే బుద్ధిరత్ర విచార్యతామ్. 8
ప్ర. అ. సర్వా = సమస్త మైన, మహీ = భూమి, పరిక్రాన్తా = సంచరింపబడినది, సత్త్వవన్తః చ = బలవంతు లైన, దేవదానవరక్షాంసి = దేవతలు, దానవులు, రాక్షసులు, పిశాచోరగకిన్నరాః = పిశాచములు, ఉరగులు, కిన్నరులు, సూదితాః = చంపబడినారు. అశ్వమ్ = అశ్వమును, అశ్వహర్తారమేవ చ = అశ్వమును అపహరించినవానిని, న పశ్యామహే చ = చూడజాల మైతిమి. కిమ్ = ఏమి, కరిష్యామ = చేయుదుము? తే = నీకు, భద్రమ్ = క్షేమ మగుగాక. అత్ర = ఈ విషయమున, బుద్ధిః = బుద్ధి, విచార్యతామ్ = ఆలోచింపబడుగాక.
తా. భూమండల మంతయు తిరిగితిమి. బలవంతులైన ఎందరో దేవదానవ రాక్షసపిశాచోరగకిన్నరులను పరిమార్చితిమి. ఆ గుఱ్ఱముగాని, దాని నపహరించినవాడు గాని కనబడలేదు. ఇపు డేమి చేయవలెనో ఆలోచించి చెప్పుము. నీకు భద్ర మగుగాక.
మూ. తేషాం తద్వచనం శ్రుత్వా పుత్రాణాం రాజసత్తమః,
సమన్యురబ్రవీద్వాక్యం సగరో రఘునన్దన. 9
ప్ర. అ. రఘునన్దన = రామా! తేషామ్ = ఆ, పుత్రాణామ్ = పుత్రుల యొక్క, తద్వచనమ్ = ఆ వచనమును, శ్రుత్వా = విని, రాజసత్తమః = ఆ రాజశ్రేష్ఠుడైన, సగరః = సగరుడు, సమన్యుః = కోపముతో కూడినవాడై, వాక్యమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.
తా. రామా! పుత్రుల మాటలు విని, రాజశ్రేష్ఠు డైన సగరుడు కోపముతో కూడినవాడై ఇట్లు పలికెను.
మూ. భూయః ఖనత భద్రం వో నిర్భిద్య వసుధాతలమ్,
అశ్వహర్తారమాసాద్య కృతార్థాశ్చ నివర్తథ. 10
ప్ర. అ. వసుధాతలమ్ = భూమిని, నిర్భిద్య = భేదించి, భూయః = మరల, ఖనత = త్రవ్వుడు, అశ్వహర్తారమ్ = అశ్వమును హరించినవానిని, ఆసాద్య = పొంది, కృతార్థాః = చరితార్థులై, నివర్తథ = మరలి రండు, వః = మీకు, భద్రమ్ = మంగళమగుగాక.
తా. మరల త్రవ్వి భూతలమును భేదింపుడు. అశ్వమును హరించినవానిని పట్టుకొని, కార్యము పూర్తి యైన పిమ్మటనే తిరిగి రండు.
మూ. పితుర్వచనమాసాద్య సగరస్య మహాత్మనః,
షష్టిః పుత్రసహస్రాణి రసాతలమభిద్రవన్. 11
ప్ర. అ. పితుః = తండ్రి అయిన, మహాత్మనః = మహాత్ముడైన, సగరస్య = సగరునియొక్క, వచనమ్ = వచనమును, ఆసాద్య = పొంది, షష్టిః = అరువది, పుత్రసహస్రాణి = పుత్రుల సహస్రములు, రసాతలమ్ = పాతాలమును గూర్చి, అభిద్రవన్ = శీఘ్రముగ పోయిరి.
తా. తండ్రి యైన సగరుని ఆజ్ఞ ననుసరించి ఆ అరువదివేల మంది కుమారులును పాతాళలోకమునకు శీఘ్రముగ పోయిరి.
మూ. ఖన్యమానే తతస్తస్మిన్ దదృశుః పర్వతోపమమ్,
దిశాగజం విరూపాక్షం ధారయన్తం మహీతలమ్. 12
ప్ర. అ. తతః = పిమ్మట, తస్మిన్ = ఆ ప్రదేశము, ఖన్యమానే = త్రవ్వబడుచుండగా, పర్వతోపమమ్ = పర్వతముతో సమాన మైనదియు, మహీతలమ్ = భూతలమును, ధారయన్తమ్ = ధరించుచున్నదియు నగు, విరూపాక్షమ్ = విరూపాక్ష మను పేరు గల, దిశాగజమ్ = దిగ్గజమును, దదృశుః = చూచిరి.
తా. ఆ ప్రదేశమును త్రవ్వుచున్నపుడు వారికి అచట పర్వతమువంటి ప్రమాణము గల విరూపాక్ష మగు దిగ్గజము కనబడెను. అది భూతలమును మోయుచుండెను.
మూ. సపర్వతవనాం కృత్స్నాం పృథివీం రఘునన్దన,
శిరసా ధారయామాస విరూపాక్షో మహాగజః. 13
ప్ర. అ. రఘునన్దన = రామా!, విరూపాక్షః = విరూపాక్ష మను పేరు గల, మహాగజః = ఆ మహాగజము, సపర్వతవనామ్ = పర్వతములతోడను వనములతోడను కూడిన, కృత్న్సామ్ = సమస్త మైన, మహీమ్ = భూమిని, శిరసా = శిరస్సుచేత, ధారయామాస = ధరించెను.
తా. రామా! విరూపాక్ష మనెడు ఆ దిగ్గజము పర్వతవనాదిసహితముగా ఈ భూమి నంతను తన శిరస్సుపై మోయుచుండును.
మూ. యదా పర్వణి కాకుత్థ్స విశ్రమార్థం మహాగజః,
ఖేదాచ్చాలయతే శీర్షం భూమికంపస్తదా భవేత్. 14
ప్ర. అ. కాకుత్థ్స = రామా! మహాగజః = ఆ మహాగజము, పర్వణి = పర్వకాలమునందు, యదా = ఎప్పుడు, విశ్రమార్థమ్ = విశ్రాంతికొరకై, ఖేదాత్ = అలసటవలన, శీర్షమ్ = శిరస్సును, చాలయతే = కదల్చునో, తదా = అప్పుడు, భూమికమ్పః = భూకంపము, భవేత్ = అగును.
తా. రామా! ఆ మహాగజము అలసట కలిగినపుడు అప్పుడప్పుడు, విశ్రాంతి కొరకై శిరస్సును కదల్చుచుండును. అపుడు భూకంపము కలుగుచుండును.
మూ. తం తే ప్రదక్షిణం కృత్వా దిశాపాలం మహాగజమ్,
మానయన్తో హి తే రామ జగ్ముర్భిత్త్వా రసాతలమ్. 15
ప్ర. అ. రామ = రామా!, తే = వారు, తమ్ = ఆ, దిశాపాలం మహాగజమ్ = దిగ్గజమును, ప్రదక్షిణం కృత్వా = ప్రదక్షిణము చేసి, మానయన్తః = పూజించుచున్నవారై, భిత్త్వా = భూమిని భేదించుకొని, రసాతలమ్ = పాతాలమును గూర్చి, జగ్ముః = వెళ్ళిరి.
తా. రామా! వారు ఆ దిగ్గజమునకు ప్రదక్షిణము చేసి, పూజించి, భూమిని భేదించుకొనుచు పాతాళమునకు పోయిరి.
మూ. తతః పూర్వాం దిశం భిత్వా దక్షిణాం బిభిదుః పునః.
దక్షిణస్యామపి దిశి దదృశుస్తే మహాగజమ్, 16
మహాపద్మం మహాత్మానం సుమహత్పర్వతోపమమ్,
శిరసా ధారయన్తం తే విస్మయం జగ్మురుత్తమమ్. 17
ప్ర. అ. తతః = పిమ్మట, పూర్వామ్ = తూర్పు దైన, దిశమ్ = దిక్కును, భిత్త్వా = త్రవ్వి, పునః = మరల (పిమ్మట), దక్షిణామ్ = దక్షిణదిక్కును, బిభిదుః = భేదించిరి. తే = వారు, దక్షిణస్యాం దిశ్యపి = దక్షిణదిక్కునందు కూడ, సుమహత్పర్వతోపమమ్ = గొప్పపర్వతముతో సమాన మైనదియు, శిరసా = శిరస్సుచేత, ధారయన్తమ్ = భూమిని ధరించుచున్నదియు, మహాత్మానమ్ = పూజ్యమైన స్వభావముకలదియు అగు, మహాపద్మమ్ = మహాపద్మమనే, మహాగజమ్ = గొప్ప ఏనుగును, దదృశుః = చూచిరి. తే = వారు, ఉత్తమమ్ = గొప్ప, విస్మయమ్ = ఆశ్చర్యమును, జగ్ముః = పొందిరి.
తా. పిమ్మట తూర్పుదిక్కును తరువాత దక్షిణ దిక్కును భేదించిరి. దక్షిణ దిక్కునందు కూడ వారు గొప్ప పర్వతముతో సమాన మైన మహాపద్మ మనెడు మహాగజమును చూచిరి. అది కూడ శిరస్సుపై భూమిని మోయుచుండెను. దానిని జూచి వారు చాల ఆశ్చర్యము చెందిరి.
మూ. తతః ప్రదక్షిణం కృత్వా సగరస్య మహాత్మనః,
షష్టిః పుత్రసహస్రాణి పశ్చిమాం బిభిదుర్దిశమ్. 18
ప్ర. అ. తతః = పిమ్మట, మహాత్మనః = మహాత్ముడైన, సగరస్య = సగరునియొక్క, షష్టిః పుత్రసహస్రాణి = అరవైవేలమంది పుత్రులు, ప్రదక్షిణం కృత్వా = ప్రదక్షిణము చేసి, పశ్చిమాం దిశమ్ = పశ్చిమదిక్కును, బిభిదుః = భేదించిరి.
తా. పిమ్మట మహాత్ము డైన సగరుని అరువదివేలమంది కుమారులు, ఆ దిగ్గజమునకు ప్రదక్షిణము చేసి, పశ్చిమ దిక్కునందు త్రవ్విరి.
మూ. పశ్చిమాయామపి దిశి మహాన్తమచలోపమమ్,
దిశాగజం సౌమనసం దదృశుస్తే మహాబలాః. 19
ప్ర. అ. మహాబలాః = గొప్ప బలము గల, తే = వారు, పశ్చిమాయాం దిశ్యపి = పశ్చిమదిక్కునందు గూడ, మహాన్తమ్ = గొప్పదియు, అచలోపమమ్ = పర్వతముతో సమాన మైనదియు అగు, సౌమనసమ్ = సౌమనస మను పేరు గల, దిశాగజమ్ = దిగ్గజమును, దదృశుః = చూచిరి.
తా. మహాబలవంతు లైన ఆ సగరపుత్రులు పశ్చిమదిక్కునందు కూడ పర్వతసమాన మైన సౌమనస మనెడు దిగ్గజమును చూచిరి.
మూ. తం తే ప్రదక్షిణం కృత్వా పృష్ట్వా చాపి నిరామయమ్,
ఖనన్తః సముపక్రాన్తా దిశం హైమవతీం తతః. 20
ప్ర. అ. తే = వారు, తమ్ = దానిని, ప్రదక్షిణం కృత్వా = ప్రదక్షిణము చేసి, నిరామయమ్= ఆరోగ్యమును, పృష్ట్వా = అడిగి, ఖనన్తః = త్రవ్వుచున్న వారై, తతః = అక్కడినుండి, హైమవతీం దిశమ్ = ఉత్తరదిక్కును గూర్చి, సముపక్రాన్తాః = వెళ్లిరి.
తా. వారు ఆ దిగ్గజమునకు ప్రదక్షిణనమస్కారములు చేసి, కుశలప్రశ్న వేసి, అచటినుండి, భూమిని త్రవ్వుకొనుచు ఉత్తరము వైపు వెళ్లిరి.
మూ. ఉత్తరస్యాం రఘుశ్రేష్ఠ దదృశుర్హిమపాణ్డరమ్,
భద్రం భద్రేణ వపుషా ధారయన్తం మహీమిమామ్. 21
ప్ర. అ. రఘుశ్రేష్ఠ = రామా!, ఉత్తరస్యామ్ = ఉత్తరదిక్కునందు, హిమపాణ్డరమ్ = మంచు వలె తెల్లగా నున్నదియు, భద్రేణ వపుషా = మంగళకర మైన శరీరముతో, ఇమామ్ = ఈ, మహీమ్ = భూమిని, ధారయన్తమ్ = ధరించుచున్నదియు అగు, భద్రమ్ = భద్ర మనెడు దిగ్గజమును, దదృశుః = చూచిరి.
తా. రామా! ఉత్తరదిక్కునందు, వారు, మంగళకర మైన శరీరముతో ఈ భూమిని మోయుచున్న, మంచు వలె తెల్లగా ఉన్న భద్ర మనెడు దిగ్గజమును చూచిరి.
మూ. సమాలభ్య తతః సర్వే కృత్వా చైనం ప్రదక్షిణమ్,
షష్టిః పుత్రసహస్రాణి బిభిదుర్వసుధాతలమ్. 22
ప్ర. అ. తతః = పిమ్మట, సర్వే = సమస్త మైన, షష్టిః పుత్రసహస్రాణి = సగరుని అరువదివేలమంది పుత్రులు, ఏనమ్ = దీనిని, సమాలభ్య = స్పశించి, ప్రదక్షిణం చ = ప్రదక్షిణము కూడ, కృత్వా = చేసి, వసుధాతలమ్ = భూమిని, బిభిదుః = భేదించిరి.
తా. పిమ్మట ఆ సగరుని అరువదివేలమంది కుమారులును ఆ దిగ్గజమును స్పశించి, ప్రదక్షిణనమస్కారములు చేసి భూమిని త్రవ్విరి.
మూ. తతః ప్రాగుత్తరాం గత్వా సాగరాః ప్రథితాం దిశమ్,
రోషాదభ్యఖనన్ సర్వే పృథివీం సగరాత్మజాః. 23
ప్ర. అ. తతః = పిమ్మట, సాగరాః = సగరకుమారులు, ప్రథితామ్ = ప్రసిద్ధమైన, ప్రాగుత్తరాం దిశమ్ = ఈశాన్యదిక్కును గూర్చి, గత్వా = వెళ్లి, సర్వే = సమస్తమైన, సగరాత్మజాః = సగరుని కుమారులు, రోషాత్ = కోపమువలన, పృథివీమ్ = భూమిని, అభ్యఖనన్ = త్రవ్విరి.
తా. పిమ్మట ఆ సగరకుమారు లందరును ప్రసిద్ధ మైన ఈశాన్యదిక్కునకు వెళ్లి, రోషముతో భూమిని త్రవ్విరి.
మూ. తే తు సర్వే మహాత్మానో భీమవేగా మహాబలాః,
దదృశుః కపిలం తత్ర వాసుదేవం సనాతనమ్. 24
హయం చ తస్య దేవస్య చరన్తమవిదూరతః,
ప్రహర్షమతులం ప్రాప్తాః సర్వే తే రఘునన్దన. 25
ప్ర. అ. మహాత్మానః = గొప్ప బుద్ధి గలవారును, భీమవేగాః = భయంకరమైన వేగము గలవారును, మహాబలాః = గొప్ప బలము కలవారును అగు, తే సర్వే = వారందరును, తత్ర = అచట, కపిలమ్ = కపిలావతారములో నున్న, సనాతనమ్ = పురాణపురుషు డైన, వాసుదేవమ్ = వాసుదేవుని, తస్య దేవస్య = ఆ దేవునకు, అవిదూరతః = సమీపమున, చరన్తమ్ = మేయుచున్న, హయం చ = గుఱ్ఱమును, దదృశుః = చూచిరి. రఘునన్దన = రామా!, తే సర్వే = వారందరును, అతులమ్ = సాటి లేని, ప్రహర్షమ్ = సంతోషమును, ప్రాప్తాః = పొందినారు.
తా. రామా! భయంకర మైన వేగము గొప్ప బలము గల ఆ మహాత్ములు అందరును అచట కపిలరూపములో నున్న సనాతనపురుషు డైన శ్రీమహావిష్ణువును, ఆతని సమీపమున గడ్డి మేయుచు తిరుగుచున్న అశ్వమును చూచిరి. ఆ అశ్వము కనబడగనే చాల సంతసించిరి.
మూ. తే తం హయవరం జ్ఞాత్వా క్రోధపర్యాకులేక్షణాః, 26
ఖనిత్రలాంగలధరా నానావృక్షశిలాధరాః,
అభ్యధావన్త సంక్రుద్ధాస్తిష్ఠ తిష్ఠేతి చాబ్రువన్. 27
ప్ర. అ. తే = వారు, తమ్ = ఆ, హయవరమ్ = అశ్వశ్రేష్ఠమును, జ్ఞాత్వా = గుర్తించి, క్రోధపర్యాకులేక్షణాః = క్రోధముచే వ్యాకుల మైన నేత్రములు కలవారై, ఖనిత్రలాంగలధరాః = గునపములను నాగళ్లను ధరించినవారై, నానావృక్షశిలాధరాః = అనేకవిధము లైన వృక్షములను శిలలను ధరించిన వారై, సంక్రుద్ధాః = కోపించినవారై, అభ్యధావన్త = ఆతని మీదికి పరుగెత్తిరి. తిష్ఠ తిష్ఠ = ఆగుము ఆగుము, ఇతి = అని, అబ్రువన్ చ = పలికిరి కూడ.
తా. వారు ఆ గుఱ్ఱమును గుర్తించిరి. వారి కళ్లు కోపముచే ఎఱ్ఱబారినవి. గునపము లను, నాగళ్లను, వృక్షములను, శిలలను ధరించి ఆగుమాగుము అని పలుకుచు ఆ కపిలునిమీదికి పరుగెత్తి వెళ్లిరి.
మూ. అస్మాకం త్వం హి తురగం యజ్ఞీయం హృతవానసి,
దుర్మేధస్త్వం హి సంప్రాప్తాన్ విద్ధి నః సగరాత్మజాన్. 28
ప్ర. అ. దుర్మేధః = ఓ దుర్బుద్ధీ, త్వమ్ = నీవు, అస్మాకమ్ = మా యొక్క, యజ్ఞీయమ్ = యజ్ఞమునకు సంబంధించిన, తురగమ్ = తురంగమును, హృతవాన్ అసి = హరించినావు. సంప్రాప్తాన్ = ఇచటికివచ్చిన, నః = మమ్ములను, సగరాత్మజాన్ = సగరుని కుమారులనుగా, విద్ధి = తెలుసుకొనుము.
తా. దుర్బుద్ధీ! నీవుమా యజ్ఞాశ్వమును హరించినావు. మేము ఎవరను కొంటివి? సగరచక్రవర్తి కుమారులము.
మూ. శ్రుత్వా తు వచనం తేషాం కపిలో రఘునన్దన,
రోషేణ మహతావిష్ణో హుంకారమకరోత్తదా. 29
ప్ర. అ. రఘునన్దన = రామా! కపిలః = కపిలుడు, తేషామ్ = వారి యొక్క, వచనమ్ = వచనమును, శ్రుత్వా = విని, తదా = అప్పుడు, మహతా = గొప్ప, రోషేణ = రోషముతో, ఆవిష్టః = కూడినవాడై, హుంకారమ్ = హుంకారమును, అకరోత్ = చేసెను.
తా. రామా! కపిలుడు వారి మాటలు విని కోపావిష్టుడై హుంకారము చేసెను.
మూ. తతస్తేనాప్రమేయేన కపిలేన మహాత్మనా,
భస్మరాశీకృతాః సర్వే కాకుత్థ్స సగరాత్మజాః. 30
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే చత్వారింశః సర్గః
ప్ర. అ. కాకుత్థ్స = రామా! తతః = పిమ్మట, అప్రమేయేన = ఊహింపరాని ప్రభావము కల, మహాత్మనా = మహాత్ముడైన, తేన కపిలేన = ఆ కపిలునిచేత, సర్వే = సమస్త మైన, సగరాత్మజాః = సగరపుత్రులు, భస్మరాశీకృతాః = భస్మరాశిగా చేయబడినారు.
తా. రామా! అప్రమేయప్రభావశాలి యైన, మహాత్ము డైన ఆ కపిలుడు హుంకరించగనే ఆ సగరపుత్రు లందరును భస్మమై పోయిరి.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో నలుబదియవ సర్గ సమాప్తము.
