Chapter_41

Back
Book Balakandamu
Chapter No 47
Pages 7
Read Time 10 Minutes

Chapter_41

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ ఏకచత్వారింశః సర్గః

సగరచక్రవర్తి ఆజ్ఞచే అంశుమంతుడు రసాతలమునకు వెళ్లి యజ్ఞాశ్వమును తీసుకొని వచ్చుట. అతడు తన పినతండ్రుల వినాశమును గూర్చియు, గంగోదకముతో తర్పణము చేసిననే వారు ఉద్ధరింపబడుదు రనియు సగరచక్రవర్తికి చెప్పుట.

మూ. పుత్రాంశ్చిరగతాన్ జ్ఞాత్వా సగరో రఘునన్దన,

నప్తారమబ్రవీద్రాజా దీప్యమానం స్వతేజసా. 1

ప్ర. అ. రఘునన్దన = రామా!, సగరః రాజా = సగరచక్రవర్తి, పుత్రాన్ = పుత్రులను, చిరగతాన్ = చిరకాలము క్రితము వెళ్లినవారినిగా, జ్ఞాత్వా = తెలుసుకొని, స్వతేజసా = సహజ మైన తేజస్సుతో, దీప్యమానమ్ = ప్రజ్వరిల్లుచున్న, నప్తారమ్ = పౌత్రుని గూర్చి, అబ్రవీత్ = పలికెను.

తా. రఘునందనా! తన కుమారులు వెళ్లి చాలకాల మైన దని గుర్తించిన సగరచక్రవర్తి సహజతేజస్సుతో ప్రకాశించుచున్న మనుమ డైన అంశుమంతునితో ఇట్లనెను.

మూ. శూరశ్చ కృతవిద్యశ్చ పూర్వైస్తుల్యోఽసి తేజసా,

పితౄణాం గతమన్విచ్ఛ యేన చాశ్వోఽపహారితః. 2

ప్ర. అ. శూరశ్చ = శూరుడవును, కృతవిద్యశ్చ = నేర్వబడిన విద్యలు కలవాడవును అగు నీవు, తేజసా = తేజస్సుచేత, పూర్వైః = పూర్వపురుషులతో, తుల్యః = సమానుడవుగా, అసి = అయి ఉన్నావు. పితౄణామ్ = నీ తండ్రులయొక్క, గతిమ్ = మార్గమును, అన్విచ్ఛ = వెదకుము. అశ్వః = అశ్వము, యేన = ఎవనిచేత, అపహారితః = అపహరింపబడినదో, (వాని మార్గమును గూడ వెదకుము).

తా. నీవు శూరుడవు. విద్య లన్నియు నేర్చినవాడవు. తేజస్సుచే పూర్వపురుషులతో సమానుడవు. నీవు వెళ్లి నీ పినతండ్రుల జాడను, అశ్వమును అపహరించినవాని జాడను తెలిసికొని రమ్ము.

మూ. అన్తర్భౌమాని సత్త్వాని వీర్యవన్తి మహాన్తి చ,

తేషాం త్వం ప్రతిఘాతార్థం సాస్త్రం గృహ్ణీష్వ కార్ముకమ్. 3

ప్ర. అ. అన్తర్భౌమాని = భూమిలోపలనుండు, సత్త్వాని = ప్రాణులు, వీర్యవన్తి = పరాక్రమముగలవి, మహాన్తి చ = చాల గొప్పవి కూడ. త్వమ్ = నీవు, తేషామ్ = వాటియొక్క, ప్రతిఘాతార్థమ్ = సంహారముకొరకు, సాస్త్రమ్ = అస్త్రములతో కూడిన, కార్ముకమ్ = ధనుస్సును, గృహ్ణీష్వ = గ్రహింపుము.

తా. భూమిలోపల నుండు ప్రాణులు పరాక్రమము, మహాప్రమాణము కలవై ఉండును. వాటిని చంపుటకై ధనుస్సును, అస్త్రములను తీసికొని వెళ్లుము.

మూ. అభివాద్యాభివాద్యాంస్త్వం హత్వా విఘ్నకరానపి,

సిద్ధార్థః సంనివర్తస్వ మమ యజ్ఞస్య పారగః. 4

ప్ర. అ. త్వమ్ = నీవు, అభివాద్యాన్ = నమస్కరింపతగినవారిని, అభివాద్య = నమస్కరించి, విఘ్నకరాన్ = విఘ్నము చేయువారిని, హత్వా అపి = చంపి, సిద్ధార్థఃసన్ = సిద్ధమైన కార్యము కలవాడవై, మమ = నాయొక్క, యజ్ఞస్య = యజ్ఞముయొక్క, పారగః = పారమును పొందించువాడవై, నివర్తస్వ = తిరిగి రమ్ము.

తా. నీవు నమస్కరింపదగినవారికి నమస్కారము చేయుచు, విఘ్నమును చేసినవారిని చంపుచు, కార్యమును పూర్తిచేసికొని తిరిగి వచ్చి, నా యజ్ఞమును తుదముట్టింపుము.

మూ. ఏవముక్తోఽంశుమాన్ సమ్యక్సగరేణ మహాత్మనా,

ధనురాదాయ ఖడ్గం చ జగామ లఘువిక్రమః. 5

ప్ర. అ. అంశుమాన్ = అంశుమంతుడు, మహాత్మనా = మహాత్ము డైన, సగరేణ = సగరునిచేత, ఏవమ్ = ఈ విధముగా, సమ్యక్ = బాగుగా, ఉక్తః = పలకబడినవాడై, ధనుః = ధనుస్సును, ఖడ్గం చ = ఖడ్గమును, ఆదాయ = గ్రహించి, లఘువిక్రమః = శీఘ్రగమనము కలవాడై, జగామ = వెళ్లెను.

తా. మహాత్ము డైన సగరచక్రవర్తి ఈ విధముగ చక్కగా బోధింపగా, అంశుమంతుడు ధనుస్సును ఖడ్గమును గ్రహించి శీఘ్రముగ వెళ్లెను.

మూ. స ఖాతం పితృభిర్మార్గమన్తర్భౌమం మహాత్మభిః,

ప్రాపద్యత నరశ్రేష్ఠ తేన రాజ్ఞాభిచోదితః. 6

ప్ర. అ. నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా! సః = అతడు, రాజ్ఞా = రాజు చేత, అభిచోదితః = ప్రేరేపింపబడిన వాడై, మహాత్మభిః = మహాత్ములైన, పితృభిః = తండ్రులచేత, అన్తర్భౌమమ్ = భూమిలోపల, ఖాతమ్ = త్రవ్వబడిన, మార్గమ్ = మార్గమును, ప్రాపద్యత = పొందెను.

తా. ఓ నరోత్తమా! సగరునిచే ఆజ్ఞప్తుడై ఆ అంశుమంతుడు భూమిలోపల తన పినతండ్రులు త్రవ్విన మార్గమును అనుసరించి వెళ్లెను.

మూ. దైత్యదానవరక్షోభిః పిశాచపతగోరగైః,

పూజ్యమానం మహాతేజా దిశాగజమపశ్యత. 7

ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు గల అతడు, దైత్యదానవరక్షోభిః = దైత్యులచేత, దానవులచేత, రాక్షసులచేత, పిశాచపతగోరగైః = పిశాచములచేత, పక్షులచేత, సర్పములచేత, పూజ్యమానమ్ = పూజింపబడుచున్న, దిశాగజమ్ = దిగ్గజమును, అపశ్యత = చూచెను.

తా. మహాతేజఃశాలి యగు అంశుమంతుడు దారిలో దిగ్గజమును చూచెను. దైత్యదానవరక్షఃపిశాచపతగోరగులు దానిని పూజించుచుండిరి.

మూ. స తం ప్రదక్షిణం కృత్వా పృష్ట్వా చాపి నిరామయమ్,

పితౄన్ స పరిపప్రచ్ఛ వాజిహర్తారమేవ చ. 8

ప్ర. అ. సః = అతడు, తమ్ = దానిని, ప్రదక్షిణం కృత్వా = ప్రదక్షిణము చేసి, నిరామయమ్ = ఆరోగ్యమును, పృష్ట్వా చాపి = అడిగి, సః = అతడు, పితౄన్ = తండ్రులను గూర్చియు, వాజిహర్తారమేవ చ = అశ్వమును అపహరించిన వానిని గూర్చియు, పరిపప్రచ్ఛ = ప్రశ్నించెను.

తా. అతడు ఆ దిగ్గజమునకు ప్రదక్షిణనమస్కారములు చేసి, కుశల ప్రశ్న కూడ వేసి, తన పినతండ్రులను గూర్చియు, అశ్వమును అపహరించిన వానిని గూర్చియు అడిగెను.

మూ. దిశాగజస్తు తచ్ఛ్రుత్వా ప్రత్యాహాంశుమతో వచః,

ఆసమంజ కృతార్థస్త్వం సహాశ్వః శీఘ్రమేష్యసి. 9

ప్ర. అ. దిశాగజస్తు = ఆ దిగ్గజమైతే, అంశుమతః = అంశుమంతునియొక్క, తత్ = ఆ, వచనమ్ = వచనమును, శ్రుత్వా = విని, ప్రత్యాహ = తిరిగి పలికెను. ఆసమంజ = అసమంజుని పుత్రుడా! త్వమ్ = నీవు, కృతార్థః = కృతార్థుడవై, సహాశ్వః = అశ్వముతో కూడిన వాడవై, శీఘ్రమ్ = శీఘ్రముగా, ఏష్యసి = రాగలవు.

తా. అంశుమంతుని వచనము విని దిగ్గజము - ‘‘ఓ అంశుమంతా! నీవు కృతార్థు డవై, అశ్వముతో శీఘ్రముగ తిరిగి రాగలవు’’ అని చెప్పెను.

మూ. తస్య తద్వచనం శ్రుత్వా సర్వానేవ దిశాగజాన్,

యథాక్రమం యథాన్యాయం ప్రష్టుం సముపచక్రమే. 10

ప్ర. అ. తస్య = దానియొక్క, తత్ వచనమ్ = ఆ వాక్యమును, శ్రుత్వా = విని, సర్వానేవ = సమస్త మైన, దిశాగజాన్ = దిగ్గజములను, యథాక్రమమ్ = క్రమానుసారముగా, యథాన్యాయమ్ = న్యాయానుసారముగా, ప్రష్టుమ్ = అడుగుటకు, ఉపచక్రమే = ఉపక్రమించెను.

తా. అంశుమంతుడు ఆ దిగ్గజము మాట విని, మిగిలిన దిగ్గజములను కూడ ఒకదాని తరువాత ఒకదానిని, న్యాయానుసారముగ ప్రశ్నించుటకు ప్రారంభించెను.

మూ. తైశ్చ సర్వైర్దిశాపాలైర్వాక్యజ్ఞైర్వాక్యకోవిదైః,

పూజితస్సహయశ్చైవ గన్తాసీత్యభిచోదితః. 11

ప్ర. అ. వాక్యజ్ఞైః = వాక్యములను ఎరిగిన, వాక్యకోవిదైః = వాక్యములందు సమర్థము లైన, సర్వైః = సమస్త మైన, తైః దిశాపాలైః = ఆ దిగ్గజముల చేత, పూజితః = పూజింపబడిన వాడై, సహయః = అశ్వముతోకూడిన వాడవై, గన్తాసి = వెళ్లగలవు, ఇతి = అని, అభిచోదితః = ప్రేరేపింపబడెను.

తా. ఆ దిగ్గజము లన్నియు మాటలలో సారమును గ్రహింపగల్గినవి. ఎట్లు మాటలాడవలెనో బాగుగ తెలిసినవి. అట్టి ఆ దిగ్గజములు ఆతనిని ఆదరించి, ‘‘అశ్వముతో తిరిగి వెళ్లెదవు’’ అని పలికి ప్రోత్సహించినవి.

మూ. తేషాం తద్వచనం శ్రుత్వా జగామ లఘువిక్రమః,

భస్మరాశీకృతా యత్ర పితరస్తస్య సాగరాః. 12

ప్ర. అ. తేషామ్ = వాటియొక్క, తద్వచనమ్ = ఆ మాటను, శ్రుత్వా = విని, లఘువిక్రమః = శీఘ్ర మైన గమనము కలవాడై, తస్య = అతనియొక్క, పితరః = తండ్రులైన, సాగరాః = సగరకుమారులు, యత్ర = ఎచట, భస్మరాశీకృతాః = భస్మరాశిగా చేయబడినారో, అచటికి, జగామ = వెళ్లెను.

తా. ఆ దిగ్గజముల మాటలు విని, సగరకుమారు లైన తన పినతండ్రులు భస్మరాశిగా పడి ఉన్న చోటికి శీఘ్రముగా వెళ్లెను.

మూ. స దుఃఖవశమాపన్నస్త్వసమంజసుతస్తదా,

చుక్రోశ పరమార్తస్తు వధాత్తేషాం సుదుఃఖితః. 13

ప్ర. అ. తదా = అప్పుడు, సః = ఆ, అసమఞ్జసుతః = అసమంజుని కుమారుడు, దుఃఖవశమ్ః = దుఃఖమునకు వశత్వమును, ఆపన్నః = పొందినవాడై, పరమార్తః = మిక్కిలి పీడితుడై, తేషామ్ = వారియొక్క, వధాత్ = వధవలన, సుదుఃఖితః = చాల దుఃఖితుడై, చుక్రోశ = ఏడ్చెను.

తా. అప్పుడా అంశుమంతుడు దుఃఖపరవశుడై, వారు మరణించినందులకు చాల బాధపడుచు ఏడ్చెను.

మూ. యజ్ఞీయం చ హయం తత్ర చరన్తమవిదూరతః,

దదర్శ పురుషవ్యాఘ్రో దుఃఖశోకసమన్వితః. 14

ప్ర. అ. దుఃఖశోకసమన్వితః = దుఃఖశోకములతో కూడిన, పురుషవ్యాఘ్రః = ఆ పురుషశ్రేష్ఠుడు, అవిదూరతః = సమీపమునందు, చరన్తమ్ = మేయుచున్న, యజ్ఞీయం హయమ్ = యజ్ఞాశ్వమును, దదర్శ = చూచెను.

తా. దుఃఖముతో ఏడ్చుచున్న ఆ అంశుమంతుడు అచట దగ్గరనే మేయుచు తిరుగు చున్న యజ్ఞాశ్వమును చూచెను.

మూ. స తేషాం రాజపుత్రాణాం కర్తుకామో జలక్రియామ్,

సలిలార్థీ మహాతేజా న చాపశ్యజ్జలాశయమ్. 15

ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, సః = అతడు, తేషామ్ = ఆ, రాజపుత్రాణామ్ = రాజపుత్రులకు, జలక్రియామ్ = జలతర్పణములను, కర్తుకామః = చేయుకోరిక గలవాడై, సలిలార్థీ = ఉదకమును కోరుచు, జలాశయమ్ = జలస్థానమును, న చ అపశ్యత్ = చూడలేదు.

తా. ఆ అంశుమంతుడు సగరపుత్రులకు జలతర్పణము లివ్వవలె నని తలచెను. ఉదకమునకై అన్వేషింపగా అచట జలాశయ మేదియు కనబడలేదు.

మూ. విసార్య నిపుణాం దృష్టిం తతోఽపశ్యత్ఖగాధిపమ్,

పితౄణాం మాతులం రామ సుపర్ణమనిలోపమమ్. 16

ప్ర. అ. రామ = రామా! తతః = పిమ్మట, నిపుణామ్ = సమర్థ మైన, దృష్టిమ్ = దృష్టిని, విసార్య= ప్రసరింపచేసి, పితౄణామ్ = పినతండ్రుల యొక్క, మాతులం = మేనమామయు, ఖగాధిపమ్ = పక్షిరాజును, అనిలోపమమ్ = వాయుసమానుడును అగు, సుపర్ణమ్ = గరుత్మంతుని, అపశ్యత్ = చూచెను.

తా. పిమ్మట అతడు ప్రయత్నపూర్వకముగ దృష్టిని ప్రసరింపచేసి చూడగా, అచట పక్షిరాజు, వాయుసమానుడు, పినతండ్రుల మేనమామయు అయిన గరుత్మంతుడు కనబడెను.

మూ. స చైనమబ్రవీద్యాక్యం వైనతేయో మహాబలః.

మా శుచః పురుషవ్యాఘ్ర వధోఽయం లోకసంమతః. 17

ప్ర. అ. మహాబలః = గొప్ప బలము గల, సః = ఆ, వైనతేయః = గరుత్మంతుడు. ఏనమ్ = ఈతనిని గూర్చి, వాక్యమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను. పురుషవ్యాఘ్ర = పురుషశ్రేష్ఠుడా! మా శుచః = దుఃఖింపకుము, అయం వధః = ఈ వధ, లోకసంమతః = లోకమునకు ఇష్ట మైనదే.

తా. మహాబలశాలి యగు వైనతేయుడు ఇట్లు పలికెను. ఓ అంశుమంతుడా! దుఃఖింపకుము. మీ పినతండ్రుల మరణమునకు లోకులందరును హర్షించు చున్నారు.

మూ. కపిలేనాప్రమేయేన దగ్ధా హీమే మహాబలాః,

సలిలం నార్హసి ప్రాజ్ఞ దాతుమేషాం హి లౌకికమ్. 18

ప్ర. అ. మహాబలాః = గొప్ప బలము గల, ఇమే = వీరు, అప్రమేయేన = అమేయమైన ప్రభావము గల, కపిలేన = కపిలునిచేత, దగ్ధాః హి = కాల్చబడినారుకదా. ప్రాజ్ఞ = ఓ బుద్ధిమంతుడా! లౌకికమ్ = లౌకిక మైన, సలిలమ్ = ఉదకమును, దాతుమ్ = ఇచ్చుటకు, నార్హసి = తగవు.

తా. మహాబలవంతు లైన నీ పినతండ్రులను అప్రమేయ మైన ప్రభావము గల కపిలుడు కాల్చి వేసినాడుకదా ఓ బుద్ధిమంతుడా! వీరికి లౌకిక మైన ఉదకమును ఇచ్చుట యుక్తము కాదు.

వి. ‘‘చణ్డాలాదుదకాత్సర్పాద్వైద్యుతాద్బ్రాహ్మణాదపి,

దంష్ట్రిభ్యశ్చ పశుభ్యశ్చ మరణం పాపకర్మణామ్,

ఉదకం పిణ్డదానం చ ఏతేభ్యో యద్విధీయతే,

నోపతిష్ఠతి తత్సర్వమన్తరిక్షే వినశ్యతి.’’

(పాపాత్ములకు చండాలుడు, ఉదకము, పిడుగు, బ్రాహ్మణుడు, కోరలు గల జంతువులు, పశువులు, వీటివలన మరణము కలుగును. వారికి చేసిన జలతర్పణ పిండదానాదులు వారికి చెందక ఆకాశమునందే నశించును అని ధర్మశాస్త్రములలో చెప్పిన విధమున వీరు బ్రాహ్మణుని వలన మరణించినవా రగుటచే సాధారణ జలతర్పణములు వీరికి ముట్ట వని భావము (గోవిందరాజులు).

మూ. గఙ్గా హిమవతో జ్యేష్ఠా దుహితా పురుషర్షభ,

తస్యాం కురు మహాబాహో పితౄణాం తు జలక్రియామ్. 19

ప్ర. అ. పురుషర్షభ = పురుషశ్రేష్ఠుడా! హిమవతః = హిమవంతుని యొక్క, జ్యేష్ఠా = పెద్ద కుమార్తె యైన, గఙ్గా = గంగ ఉన్నది. మహాబాహో = గొప్ప బాహువులు కలవాడా!, పితౄణామ్ = పినతండ్రులకు, జలక్రియామ్ = జలతర్పణమును, తస్యామ్ = ఆ గంగయందు, కురు = చేయుము.

తా. ఓ పురుషశ్రేష్ఠా! హిమవంతుని జ్యేష్ఠపుత్రిక యగు గంగానదిలో నీ పినతండ్రులకు జలతర్పణము లిమ్ము.

మూ. భస్మరాశీకృతానేతాన్పావయేల్లోకపావనీ,

తయా క్లిన్నమిదం భస్మ గఙ్గయా లోకకాన్తయా, 20

షష్టిం పుత్రసహస్రాణి స్వర్గలోకం నయిష్యతి.

ప్ర. అ. లోకపావనీ = లోకములను పవిత్రము చేయు ఆ గంగ, భస్మరాశీ కృతాన్ = భస్మరాశిగా చేయబడిన, ఏతాన్ = వీరిని, పావయేత్ = పవిత్రింపచేయును. లోకకాన్తయా = లోకమునకు ఇష్టురాలైన, తయా = ఆ, గఙ్గయా = గంగచేత, క్లిన్నమ్ = తడపబడిన, ఇదం భస్మ = ఈ భస్మ, షష్టిం పుత్రసహస్రాణి = అరవైవేలమంది పుత్రులను, స్వర్గలోకం = స్వర్గలోకమును, నయిష్యతి = పొందించగలదు.

తా. ఆ లోకపావని భస్మరాశులుగా చేయబడిన వీరి నందరిని పవిత్రింప చేయును. లోకమునకు ఇష్టురా లైన ఆ గంగచే తడపబడిన ఈ భస్మము సగరుని అరువది వేలమంది కుమారులను స్వర్గలోకము చేర్చును.

మూ. గచ్ఛ చాశ్వం మహాభాగ తం గృహ్య పురుషర్షభ,

యజ్ఞం పైతామహం వీర సంవర్తయితుమర్హసి. 21

ప్ర. అ. మహాభాగ = గొప్ప భాగ్యము కలవాడా! పురుషర్షభ = పురుషశ్రేష్ఠుడా! తమ్ = ఆ, అశ్వమ్ = అశ్వమును, గృహ్య = గ్రహించి, గచ్ఛ = వెళ్లుము. వీర = వీరుడా!, పైతామహమ్ = నీ పితామహుని సంబంధ మైన, యజ్ఞమ్ = యజ్ఞమును, సంవర్తయితుమ్ = జరిగించుటకు, అర్హసి = తగి ఉన్నావు.

తా. మహాభాగ్యశాలి వైన ఓ పురుషశ్రేష్ఠుడా! ఈ గుఱ్ఱమును తీసికొని వెళ్లి నీ పితామహుడు ప్రారంభించిన యజ్ఞము జరిపింపుము.

మూ. సుపర్ణవచనం శ్రుత్వా సోఽంశుమానతివీర్యవాన్,

త్వరితం హయమాదాయ పునరాయాన్మహాయశాః. 22

ప్ర. అ. అతివీర్యవాన్ = మిక్కిలి పరాక్రమము గల, మహాయశాః = గొప్ప కీర్తి గల, సః = ఆ, అంశుమాన్ = అంశుమంతుడు, సుపర్ణవచనమ్ = గరుత్మంతుని వాక్యము, శ్రుత్వా = విని, త్వరితమ్ = శీఘ్రముగా, హయమ్ = గుఱ్ఱమును, ఆదాయ = గ్రహించి, పునః = తిరిగి, ఆయాత్ = వచ్చెను.

తా. వీర్యవంతుడును, మహాయశశ్శాలియు అగు ఆ అంశుమంతుడు గరుత్మంతుడు చెప్పిన విధముగ గుఱ్ఱమును తీసికొని తన పురము చేరెను.

మూ. తతో రాజానమాసాద్య దీక్షితం రఘునన్దన,

న్యవేదయద్యథావృత్తం సుపర్ణవచనం తథా. 23

ప్ర. అ. రఘునన్దన = రామా!, తతః = పిమ్మట, దీక్షితమ్ = దీక్షవహించి ఉన్న, రాజానమ = రాజును, ఆసాద్య = పొంది, యథావృత్తమ్ = ఎట్లు జరిగినదో అట్లు, తథా = మరియు, సుపర్ణవచనమ్ = గరుత్మంతుని వాక్యమును, న్యవేదయత్ = తెలిపెను.

తా. రామా! అంశుమంతుడు, యజ్ఞదీక్షితు డైన సగరచక్రవర్తి వద్దకు వెళ్లి జరిగిన విషయమును, గరుత్మంతుని మాటలను అతనికి తెలిపెను.

మూ. తచ్ఛ్రుత్వా ఘోరసంకాశం వాక్యమంశుమతో నృపః,

యజ్ఞం నిర్వర్తయామాస యథాకల్పం యథావిధి. 24

ప్ర. అ. నృపః = రాజు, అంశుమతః = అంశుమంతునియొక్క, ఘోరసఙ్కాశమ్ = ఘోరమైన, వాక్యమ్ = వాక్యము, శ్రుత్వా = విని, యథాకల్పమ్ = పద్ధతిప్రకారము, యథావిధి = శాస్త్రప్రకారము, యజ్ఞమ్ = యజ్ఞమును, నిర్వర్తయామాస = జరిపించెను.

తా. సగరచక్రవర్తి అంశుమంతుని నుండి ఆ ఘోర మైన వార్త విని చాల విచారించెను. యజ్ఞమును శాస్త్రోక్తప్రకారము, చేయవలసిన పద్ధతిలో పూర్తి చేసెను.

మూ. స్వపురం చాగమచ్ఛ్రీమానిష్టయజ్ఞో మహీపతిః,

గఙ్గాయాశ్చాగమే రాజా నిశ్చయం నాధ్యగచ్ఛత. 25

ప్ర. అ. శ్రీమాన్ = శ్రీమంతు డైన, మహీపతిః = రాజు, ఇష్టయజ్ఞః = యజింపడిన యాగము కలవాడై, స్వపురమ్ = తన పురమును, ఆగమత్ = చేరెను. రాజా = రాజు, గఙ్గాయాః = గంగయొక్క, ఆగమే = రాకవిషయమున, నిశ్చయమ్ = నిశ్చయమును, నాధ్యగచ్ఛత = పొందలేదు.

తా. సగరచక్రవర్తి యజ్ఞము పూర్తి చేసికొని నగరములో ప్రవేశించెను. గంగను తీసికొనివచ్చుటకు ఉపాయ మేదియు అతడు కానజాలకపోయెను.

మూ. అకృత్వా నిశ్చయం రాజా కాలేన మహతా మహాన్,

త్రింశద్వర్షసహస్రాణి రాజ్యం కృత్వా దివం గతః. 26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే ఏకచత్వారింశః

ప్ర. అ. సర్గః మహాన్ = గొప్పవాడైన, రాజా = ఆ రాజు, మహతా కాలేన = చాలకాలముచేత కూడ, నిశ్చయమ్ = నిర్ణయమును, అకృత్వా = చేయకయే, త్రింశద్వర్షసహస్రాణి = ముప్పదివేల సంవత్సరములు, రాజ్యమ్ = రాజ్యము, కృత్వా = చేసి, దివమ్ = స్వర్గమునుగూర్చి, గతః = వెళ్లెను.

తా. గొప్పవా డైన ఆ సగరచక్రవర్తి చాలకాలమునకు గూడ గంగను తీసికొని వచ్చు ఉపాయము కానజాలక, ముప్పదివేల సంవత్సరములు రాజ్యము చేసి స్వర్గమునకు వెళ్లెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,

బాలకాండలో నలుబది ఒకటవ సర్గ సమాప్తము.