| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 48 |
| Pages | 6 |
| Read Time | 10 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ ద్విచత్వారింశః సర్గః
అంశుమంతుడు గంగను భూలోకమునకు తీసికొనివచ్చుటకై తపస్సుచేసి విఫలు డగుట. పిమ్మట భగీరథుడు తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పింపగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆతనితో భూలోకమునకు దిగు గంగను తన తలపై ధరించుటకై శివుని ప్రార్థించు మని చెప్పుట.
మూ. కాలధర్మం గతే రామ సగరే ప్రకృతీజనాః,
రాజానం రోచయామాసురంశుమన్తం సుధార్మికమ్. 1
ప్ర. అ. రామ = రామా! సగరే = సగరచక్రవర్తి, కాలధర్మమ్ = మరణమును, గతే = పొందినవా డగుచుండగా, ప్రకృతీజనాః = మంత్రులును ప్రజలును, సుధార్మికమ్ = మిక్కిలి ధార్మికు డైన, అంశుమన్తమ్ = అంశుమంతుని, రాజానమ్ = రాజునుగా, రోచయామాసుః = అంగీకరించిరి.
తా. రామా! సగరచక్రవర్తి మరణించిన పిమ్మట, మంత్రులును ప్రజలును, ధార్మికు డైన అంశుమంతుని రాజుగా చేసిరి.
మూ. స రాజా సుమహానాసీదంశుమాన్రఘునన్దన,
తస్య పుత్రో మహానాసీద్దిలీప ఇతి విశ్రుతః. 2
ప్ర. అ. రఘునన్దన = రామా! సః = ఆ, అంశుమాన్ = అంశుమంతుడు, సుమహాన్ = చాల గొప్ప, రాజా = రాజుగా, ఆసీత్ = ఆయెను. తస్య = అతనికి, దిలీపః ఇతి = దిలీపు డని, విశ్రుతః ప్రసిద్ధు డైన, మహాన్ = పూజ్యు డైన, పుత్రః = పుత్రుడు, ఆసీత్ = కలిగెను.
తా. రామా! ఆ అంశుమంతుడు గొప్ప రాజుగా ఉండి రాజ్యము చేసెను. అతనికి దిలీపు డను పూజ్యు డైన కుమారుడు కలిగెను.
మూ. తస్మిన్ రాజ్యం సమావేశ్య దిలీపే రఘునన్దన,
హిమవచ్ఛిఖరే పుణ్యే తపస్తేపే సుదారుణమ్. 3
ప్ర. అ. రఘునన్దన = రామా! తస్మిన్ = ఆ, దిలీపే = దిలీపునిమీద, రాజ్యమ్ = రాజ్యమును, సమావేశ్య = నిలిపి, పుణ్యే = పవిత్రమైన, హిమవచ్ఛిఖరే = హిమవత్పర్వతముయొక్క శిఖరమునందు, సుదారుణమ్ = మిక్కిలి తీవ్ర మైన, తపః = తపస్సును, తేపే = చేసెను.
తా. రామా! అంశుమంతుడు రాజ్యభారమును దిలీపునకు అప్పచెప్పి, పుణ్య మైన హిమవత్పర్వతశిఖరము పై తీవ్ర మైన తపస్సు చేసెను.
మూ. ద్వాత్రింశచ్చ సహస్రాణి వర్షాణి సుమహాయశాః,
తపోవనం గతో రామ స్వర్గం లేభే తపోధనః. 4
ప్ర. అ. రామ = రామా!, సుమహాయశాః = గొప్ప కీర్తి గల ఆ అంశుమంతుడు, ద్వాత్రింశత్ సహస్రాణి = ముప్పదిరెండువేల, వర్షాణి = సంవత్సరములు, తపోవనమ్ = తపోవనమును, గతః = పొందినవాడై, తపోధనః = తపస్సే ధనముగా కలవాడై, స్వర్గమ్ = స్వర్గమును, లేభే = పొందెను.
తా. రామా! గొప్ప తపస్సు గల ఆ అంశుమంతుడు ముప్పదిరెండువేల సంవత్సరములు తపోవనములో నివసించి, తపస్సు అనెడు ధనము నార్జించి, స్వర్గమును పొందెను.
మూ. దిలీపన్తు మహాతేజాః శ్రుత్వా పైతామహం వధమ్,
దుఃఖోపహతయా బుద్ధ్యా నిశ్చయం నాధ్యగచ్ఛత. 5
ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు కల, దిలీపస్తు = దిలీపుడైతే, పైతామహమ్ = పితామహుల సంబంధ మైన, వధమ్ = వధను, శ్రుత్వా = విని, దుఃఖోపహతయా = దుఃఖముచే పీడింపబడిన, బుద్ధ్యా = బుద్ధితో, నిశ్చయమ్ = నిర్ణయమును, నాధ్యగచ్ఛత = పొందలేదు.
తా. మహాతేజఃశాలి యగు దిలీపుడు తన పితామహుల వధవృత్తాంతమును విని, చాల విచారించి, గంగను తీసికొనివచ్చుటకు ఉపాయమును నిర్ణయింపజాలకపోయెను.
మూ. కథం గఙ్గావతరణం కథం తేషాం జలక్రియా,
తారయేయం కథం చైనానితి చిన్తాపరోఽభవత్. 6
ప్ర. అ. గఙ్గావతరణమ్ = గంగయొక్క అవతరణము, కథమ్ = ఎట్లు చేయవలెను? తేషామ్ = వారికి, జలక్రియా = జలతర్పణము, కథమ్ = ఎట్లు? ఏనాన్ = వీరిని, కథమ్ = ఎట్లు, తారయేయమ్ = తరింపచేయుదును? ఇతి = ఇట్లు, చిన్తాపరః = విచారముతో నిండినవాడు, అభవత్ = ఆయెను.
తా. గంగను ఎట్లు తేవలెను ? వీరికి జలతర్పణము లెట్లు ఈయవలెను ? వీరిని ఎట్లు తరింపచేయవలెను ? అను ఆలోచనలతో బాధపడెను.
మూ. తస్య చిన్తయతో నిత్యం ధర్మేణ విదితాత్మనః,
పుత్రో భగీరథో నామ జజ్ఞే పరమధార్మికః. 7
ప్ర. అ. విదితాత్మనః = ప్రసిద్ధ మైన బుద్ధి కలవాడైన, ధర్మేణ = ధర్మముచేత, నిత్యమ్ = నిత్యము, చిన్తయతః = గంగానయనమును గూర్చి ఆలోచించుచున్న, తస్య = అతనికి, భగీరథో నామ = భగీరథు డను పేరు గల, పరమధార్మికః = మిక్కిలి ధార్మికు డైన, పుత్రః = పుత్రుడు, జజ్ఞే = పుట్టెను.
తా. ధర్మమార్గమున గంగానయనమును గూర్చి నిత్యము ఆలోచించుచున్న, ప్రసిద్ధ మైన బుద్ధి గల ఆ దిలీపునకు, పరమధార్మికు డైన, భగీరథు డనెడు కుమారుడు జనించెను.
మూ. దిలీపస్తు మహాతేజా యజ్ఞైర్బహుభిరిష్టవాన్,
త్రింశద్వర్షసహస్రాణి రాజా రాజ్యమశాసయత్. 8
ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, దిలీపస్తు = దిలీపుడు, బహుభిః = అనేకమైన, యజ్ఞైః = యజ్ఞములచేత, ఇష్టవాన్ = యజించినాడు. రాజా = ఆ రాజు, త్రింశద్వర్ష సహస్రాణి = ముప్పదివేల సంవత్సరములు, రాజ్యమ్ = రాజ్యమును, అశాసయత్ = శాసించెను.
తా. మహాతేజఃశాలి యగు ఆ దిలీపుడు అనేకయజ్ఞములు చేసి, ముప్పది వేల సంవత్సరములు రాజ్యము పాలించెను.
మూ. అగత్వా నిశ్చయం రాజా తేషాముద్ధరణం ప్రతి,
వ్యాధినా నరశార్దూల కాలధర్మముపేయివాన్. 9
ప్ర. అ. నరశార్దూల = నరశ్రేష్ఠుడా! రాజా = దిలీపమహారాజు, తేషామ్ = వారియొక్క, ఉద్ధరణం ప్రతి = ఉద్ధరణమును గూర్చి, నిశ్చయమ్ = నిశ్చయమును, అగత్వా = పొందజాలక, వ్యాధినా = మనోవ్యథతో, కాలధర్మమ్ = మరణమును, ఉపేయివాన్ = పొందినాడు.
తా. రామా! ఆ దిలీపుడు సగరపుత్రులను ఉద్ధరించు మార్గము తెలియక ఆ మనోవ్యథతోడనే మరణించెను.
మూ. ఇన్ద్రలోకం గతో రాజా స్వార్జితేనైవ కర్మణా,
రాజ్యే భగీరథం పుత్రమభిషిచ్య నరర్షభః. 10
ప్ర. అ. నరర్షభః = నరశ్రేష్ఠు డైన, రాజా = ఆ రాజు, పుత్రమ్ = పుత్రుడైన, భగీరథమ్ = భగీరథుని, రాజ్యే = రాజ్యమునందు, అభిషిచ్య = అభిషేకించి, స్వార్జితేనైవ = తనచేతనే ఆర్జింపబడిన, కర్మణా = కర్మచేత, ఇన్ద్రలోకమ్ = ఇంద్రలోకమును గూర్చి, గతః = వెళ్లినాడు.
తా. దిలీపమహారాజు పుత్రు డైన భగీరథుని రాజ్యమునందు అభిషిక్తుని చేసి, స్వయముగ సంపాదించిన పుణ్యకర్మలచే స్వర్గము చేరెను.
మూ. భగీరథస్తు రాజర్షిర్ధార్మికో రఘునన్దన,
అనపత్యో మహాతేజాః ప్రజాకామః స చాప్రజః. 11
ప్ర. అ. రఘునన్దన = రామా!, ధార్మికః = ధార్మికుడును, మహాతేజాః = గొప్పతేజస్సు కలవాడును, రాజర్షిః = రాజును ఋషియును అయిన, భగీరథస్తు = భగీరథుడైతే, అనపత్యః = సంతానములేనివాడు. సః = అతడు, ప్రజాకామః = సంతానమునందు కోరిక కలవా డైనను, అప్రజాః = సంతానము లేనివాడుగనే ఉండెను.
తా. రామా! ధార్మికుడును, మహాతేజఃశాలియు, రాజర్షియు అగు భగీరథునకైతే సంతానము లేదు. అతనికి సంతానము కావలెనని కోరిక యుండెడిది గాని సంతానము మాత్రము కలుగలేదు.
మూ. మన్త్రిష్వాధాయ తద్రాజ్యం గఙ్గావతరణే రతః,
స తపో దీర్ఘమాతిష్ఠద్గోకర్ణే రఘునన్దన, 12
ఊర్ధ్వబాహుః పఞ్చతపా మాసాహారో జితేన్ద్రియః.
ప్ర. అ. రఘునన్దన = రామా!, సః = అతడు, గఙ్గావతరణే = గంగను దింపుటయందు, రతః = ఆసక్తి కలవాడై, తద్రాజ్యమ్ = ఆ రాజ్యమును, మన్త్రిషు = మంత్రులయందు, ఆధాయ = ఉంచి, ఊర్ధ్వబాహుః = పైకి ఎత్తబడిన బాహువులు కలవాడై, పఞ్చతపాః = పంచాగ్నిమధ్య తపస్సు చేయుచున్నవాడై, మాసాహారః = మాసమున కొకసారి ఆహారము కలవాడై, జితేన్ద్రియః = జయింపబడిన ఇంద్రియములు గలవాడై, గోకర్ణే = గోకర్ణ క్షేత్రమునందు, దీర్ఘమ్ = దీర్ఘ మైన, తపః = తపస్సును, ఆతిష్ఠత్ = చేసెను.
తా. రామా! ఆ భగీరథుడు గంగను స్వర్గమునుండి భూలోకమునకు తేవలె నను నిర్ణయముతో రాజ్యభారమును మంత్రులకు అప్పగించి గోకర్ణ క్షేత్రమునకు పోయెను. అచట చేతులను పైకెత్తి, జితేంద్రియుడై, మాసమున కొక సారి మాత్రమే ఆహారము భుజించుచు, గ్రీష్మమునందు పంచాగ్నిమధ్య చాలకాలము తపస్సు చేసెను.
మూ. తస్య వర్షసహస్రాణి ఘోరే తపసి తిష్ఠతః, 13
అతీతాని మహాబాహో తస్య రాజ్ఞో మహాత్మనః,
సుప్రీతో భగవాన్ బ్రహ్మా ప్రజానాం పతిరీశ్వరః. 14
ప్ర. అ. మహాబాహో = గొప్ప బాహువులు గల రామా!, తస్య = ఆతడు, ఘోరే తపసి = ఘోరమైన తపస్సులో, తిష్ఠతః = ఉండగా, వర్షసహస్రాణి = వేల కొలది సంవత్సరములు, అతీతాని = కడచిపోయినవి, ప్రజానామ్ = ప్రజలకు, పతిః = ప్రభువును, ఈశ్వరః = సమర్థుడును అగు, భగవాన్ బ్రహ్మా = భగవంతు డైన బ్రహ్మదేవుడు, తస్య = ఆ, మహాత్మనః = మహాత్ము డైన, రాజ్ఞః = రాజునకు, సుప్రీతః = చాల సంతసించినవాడు అయ్యెను.
తా. రామా! భగీరథుడు ఘోర మైన తపస్సు చేయుచుండగా, వేలకొలది సంవత్సరములు కడచిపోయినవి. ప్రజలకు పతియు, సమర్థుడును అగు భగవంతు డైన బ్రహ్మదేవుడు మహాత్ము డైన ఆ రాజు విషయమున సంతోషించెను.
మూ. తతః సురగణైః సార్ధముపాగమ్య పితామహః,
భగీరథం మహాత్మానం తప్యమానమథాబ్రవీత్. 15
ప్ర. అ. తతః = పిమ్మట, పితామహః = బ్రహ్మదేవుడు, సురగణైః = దేవతాగణములతో కూడ, ఉపాగమ్య = వచ్చి, అథ = పిమ్మట, తప్యమానమ్ = తపస్సు చేయుచున్న, మహాత్మానమ్ = మహాత్ము డైన, భగీరథమ్ = భగీరథుని గూర్చి, అబ్రవీత్ = పలికెను.
తా. బ్రహ్మదేవుడు దేవతాగణములతో కలసి వచ్చి తపస్సు చేయుచున్న మహాత్ము డైన ఆ భగీరథునితో ఇట్లు పలికెను.
మూ. భగీరథ మహాభాగ ప్రీతస్తేఽహం జనేశ్వర,
తపసా చ సుతప్తేన వరం వరయ సువ్రత. 16
ప్ర. అ. మహాభాగ = మహాభాగ్యవంతుడవైన, జనేశ్వర = మహారాజా! భగీరథ = భగీరథుడా! తే = నీయొక్క, సుతప్తేన = బాగుగా చేయబడిన, తపసా = తపస్సుచేత, అహమ్ = నేను, ప్రీతః = సంతసించినాను. సువ్రత = మంచి నియమము కలవాడా!, వరమ్ = వరమును, వరయ = కోరుకొనుము.
తా. మహాభాగ్యవంతుడ వగు ఓ భగీరథ మహారాజా! నీవు చేసిన గొప్ప తపస్సుకు సంతసించినాను. ఓ సువ్రతుడా! వరమును కోరుకొనుము.
మూ. తమువాచ మహాతేజాః సర్వలోకపితామహమ్,
భగీరథో మహాభాగః కృతాఞ్జలిరుపస్థితః. 17
ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, మహాభాగః = గొప్ప భాగ్యము గల, భగీరథః = భగీరథుడు, కృతాఞ్జలిః = దోసిలికట్టిన వాడై, ఉపస్థితః = సమీపించిన వాడై, తమ్ = ఆ, సర్వలోకపితామహమ్ = సమస్తలోకములకును పితామహు డైన బ్రహ్మదేవుని గూర్చి, ఉవాచ = పలికెను.
తా. మహాతేజఃశాలియు, మహాభాగ్యవంతుడును అగు భగీరథుడు, బ్రహ్మదేవుని సమీపించి, చేతులు జోడించి, అతనితో ఇట్లనెను.
మూ. యది మే భగవన్ ప్రీతో యద్యస్తి తపసః ఫలమ్,
సగరస్యాత్మజాః సర్వే మత్తస్సలిలమాప్నుయుః. 18
ప్ర. అ. భగవన్ = భగవంతుడా!, మే = నా విషయమున, ప్రీతః యది = సంతసించినట్లైతే, తపసః = తపస్సునకు, ఫలమ్ = ఫలము, అస్తి యది = ఉన్నట్లైతే, సగరస్య = సగరునియొక్క, ఆత్మజాః = కుమారులు, సర్వే = అందరును, మత్తః = నా నుండి, సలిలమ్ = ఉదకమును, ఆప్నుయుః = పొందుదురుగాక.
తా. భగవంతుడా! నీకు నాపై అనుగ్రహము కలిగినచో, తపస్సుకు ఫలమున్నచో, సగరుని కుమారు లందరికిని నేను జలతర్పణములు చేయగల్గుదును గాక.
మూ. గఙ్గాయాః సలిలక్లిన్నే భస్మన్యేషాం మహాత్మనామ్,
స్వర్గం గచ్ఛేయురత్యన్తం సర్వే మే ప్రపితామహాః. 19
ప్ర. అ. ఏషామ్ = ఈ, మహాత్మనామ్ = మహాత్ములయొక్క, భస్మని = భస్మము, గఙ్గాయాః = గంగయొక్క, సలిలక్లిన్నే = ఉదకముచేత తడుపబడిన దగుచుండగా, మే = నా యొక్క, సర్వే = సమస్త మైన, ప్రపితామహాః = ప్రపితామహులు, అత్యన్తమ్ = శాశ్వతముగా, స్వర్గమ్ = స్వర్గమునుగూర్చి, గచ్ఛేయుః = వెళ్లుదురుగాక.
తా. మహాత్ము లైన మా ప్రపితామహు లందరును, వారి భస్మము గంగా జలముచే తడుపబడి నంతనే శాశ్వతముగ స్వర్గమును చేరుదురు గాక.
మూ. దేయా చ సన్తతిర్దేవ నావసీదేత్కులం చ నః,
ఇక్ష్వాకూణాం కులే దేవ ఏష మేఽస్తు వరః పరః. 20
ప్ర. అ. దేవ = దేవా!, ఇక్ష్వాకూణామ్ = ఇక్ష్వాకువంశీయులయొక్క, కులే = కులమునందు, సన్తతిః = సంతానము, దేయా = ఇవ్వదగినది. నః = మాయొక్క, కులమ్ = కులము, నావసీదేత్ = నశింపకుండుగాక. ఏషః = ఇది, మే = నాయొక్క, పరః = మరియొక, వరః = వరము, అస్తు = అగు గాక.
తా. దేవా! నా రెండవ వర మేమనగా ఇక్ష్వాకు వంశీయుల మైన మా కులమునందు సంతానము కలుగవలెను. మా వంశ మెన్నటికిని నశించ కూడదు.
మూ. ఉక్తవాక్యం తు రాజానం సర్వలోకపితామహః,
ప్రత్యువాచ శుభాం వాణీం మధురాం మధురాక్షరామ్. 21
ప్ర. అ. సర్వలోకపితామహః = సమస్త లోకములకును పితామహు డైన బ్రహ్మదేవుడు, ఉక్తవాక్యమ్ = ఈ విధముగా పలకబడిన వాక్యము గల, రాజానమ్ = రాజును గూర్చి, శుభామ్ = శుభ మైన, మధురామ్ = మధుర మైన, మధురాక్షరామ్ = మధుర మైన అక్షరములు గల, వాణీమ్ = వాక్కును, ప్రత్యువాచ = తిరిగి పలికెను.
తా. భగీరథుడు ఇట్లు పలుకగా విని, బ్రహ్మదేవుడు, భగీరథునితో, మంగళకర మైన, మధురాక్షర మైన, మధుర మైన ఈ వచనము పలికెను.
మూ. మనోరథో మహానేష భగీరథ మహారథ,
ఏవం భవతు భద్రం తే ఇక్ష్వాకుకులవర్ధన. 22
ప్ర. అ. మహారథ = మహారథుడ వైన, భగీరథ = భగీరథుడా! ఏషః = ఈ, మనోరథః = కోరిక, మహాన్ = చాల గొప్పది. ఇక్ష్వాకుకుల వర్ధన = ఇక్ష్వాకుకులమును వృద్ధి పొందించినవాడా! ఏవమ్ = ఇట్లు, భవతు = అగుగాక. తే = నీకు, భద్రమ్ = మంగళ మగుగాక.
తా. మహారథుడ వైన భగీరథుడా! ఈ కోరిక చాల గొప్పది. దుర్లభమైనది. ఓ! ఇక్ష్వాకుకులవర్ధనా! ఇట్లే అగుగాక. నీకు క్షేమ మగుగాక.
మూ. ఇయం హైమవతీ గఙ్గా జ్యేష్ఠా హిమవతః సుతా,
తాం వై ధారయితుం శక్తో హరస్తత్ర నియుజ్యతామ్. 23
ప్ర. అ. హైమవతీ = హిమవంతునినుండి పుట్టిన, ఇయమ్ = ఈ, గఙ్గా = గంగ, హిమవతః= హిమవంతునియొక్క, జ్యేష్ఠా సుతా = పెద్ద కూతురు. తామ్ = ఆమెను, ధారయితుమ్ = ధరించుటకు, శక్తః = సమర్థుడైన, హరః = శివుడు, తత్ర = ఆ కార్యమునందు, నియుజ్యతామ్ = నియమింపబడు గాక.
తా. హిమవంతుని పెద్దకూతు రైన గంగను వహింప సమర్థుడు శివుడొక్కడే. అందుచే అతనిని ఆ కార్యమునందు నియోగింపవలెను.
మూ. గఙ్గాయాః పతనం రాజన్ పృథివీ న సహిష్యతి,
తాం వై ధారయితుం వీర నాన్యం పశ్యామి శూలినః. 24
ప్ర. అ. రాజన్ = రాజా! గఙ్గాయాః = గంగయొక్క, పతనమ్ = పతనమును, పృథివీ = భూమి, న సహిష్యతి = సహింపజాలదు. వీర = ఓ వీరుడా!, తామ్ = ఆమెను, ధారయితుమ్ = ధరించుటకు, శూలినః = ఈశ్వరుని కంటె, అన్యమ్ = అన్యుని, న పశ్యామి = చూడను.
తా. రాజా! గంగ క్రిందికి పడుచున్నపుడు ఆ పడుటను భూమి సహింప జాలదు. ఓ వీరుడా! ఆ గంగను ధరించుటకు ఈశ్వరుడు తప్ప మరెవ్వరును నాకు కనబడుటలేదు.
మూ. తమేవముక్త్వా రాజానం గఙ్గాం చాభాష్య లోకకృత్,
జగామ త్రిదివం దేవః సహ దేవైర్మరుద్గణైః. 25
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే ద్విచత్వారింశః సర్గః
ప్ర. అ. లోకకృత్ = బ్రహ్మదేవుడు, తమ్ = ఆ, రాజానమ్ = రాజును గూర్చి, ఏవమ్ = ఈ విధముగా, ఉక్త్వా = పలికి, గఙ్గాం చ = గంగను కూడ, ఆభాష్య = మాటలాడి, సహ దేవైః = దేవతలతో గూడిన, మరుద్గణైః = మరుద్గణములతో కూడ, త్రిదివమ్ = స్వర్గమును గూర్చి, జగామ = వెళ్లెను.
తా. బ్రహ్మదేవుడు భగీరథునితో ఇట్లు చెప్పి, గంగతో కూడ మాటలాడి, దేవతలతోడను, మరుద్గణములతోడను స్వర్గమునకు వెళ్లెను.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో నలుబది రెండవ సర్గ సమాప్తము.
