| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 49 |
| Pages | 10 |
| Read Time | 15 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ త్రిచత్వారింశః సర్గః
భగీరథుని తపస్సుచే సంతసించిన శివుడు గంగను శిరస్సుపై ధరించి ఆమెను బిందుసరోవరమునందు విడుచుట. గంగ అచట ఏడు ప్రవాహములుగ చీలి, భగీరథుని అనుసరించి పాతాళమునకు వెళ్ళి ఆతని తాతలగు సగర పుత్రులను ఉద్ధరించుట.
మూ. దేవదేవే గతే తస్మిన్ సోఽంగుష్ఠాగ్రనిపీడితామ్,
కృత్వా వసుమతీం రామ సంవత్సరముపాసత. 1
ప్ర. అ. రామ = రామా!, తస్మిన్ = ఆ, దేవదేవే = దేవతలకు దేవత యైన బ్రహ్మదేవుడు, గతే = వెళ్లినవా డగుచుండగా, సః = అతడు, వసుమతీమ్ = భూమిని, అఙ్గుష్ఠాగ్రనిపీడితామ్ = కాలి బొటనవ్రేలుచేత పీడింపబడిన దానినిగా, కృత్వా = చేసి, సంవత్సరమ్ = సంవత్సరము కాలము, ఉపాసత = ఉపాసించెను.
తా. రామా! బ్రహ్మదేవుడు వెళ్లిన పిదప, ఆ భగీరథుడు సంవత్సరకాలము భూమి పై కాలి బొటనవ్రేలుతో నిలచి తపస్సు చేసెను.
మూ. అథ సంవత్సరే పూర్ణే సర్వలోకనమస్కృతః,
ఉమాపతిః పశుపతీ రాజానమిదమబ్రవీత్. 2
ప్ర. అ. అథ = పిమ్మట, సంవత్సరే = ఒక సంవత్సరము, పూర్ణే = నిండగా, సర్వలోకనమస్కృతః = సమస్తలోకములచేతను నమస్కరింపబడినవాడును, ఉమాపతిః = ఉమయొక్క భర్తయు అగు, పశుపతిః = ఈశ్వరుడు, రాజానమ్ = రాజును గూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను.
తా. సంవత్సరకాలము పూర్తి యైన పిమ్మట, సర్వలోకములకును పూజనీయు డగు ఉమాపతి యైన, మహేశ్వరుడు రాజుతో ఇట్లు పలికెను.
మూ. ప్రీతస్తేఽహం నరశ్రేష్ఠ కరిష్యామి తవ ప్రియమ్,
శిరసా ధారయిష్యామి శైలరాజసుతామహమ్. 3
ప్ర. అ. నరశ్రేష్ఠ = ఓ నరశ్రేష్ఠుడా! అహమ్ = నేను, తే = నీకు, ప్రీతః = సంతసించినాను. తవ = నీకు, ప్రియమ్ = ప్రియమైన కార్యమును, కరిష్యామి = చేయగలను. అహమ్ = నేను, శైలరాజసుతామ్ = హిమవంతుని కుమార్తె యైన గంగను, శిరసా = శిరస్సుచేత, ధారయిష్యామి = ధరించెదను.
తా. ఓ నరశ్రేష్ఠా! నీ తపస్సునకు సంతసించినాను. గంగను శిరస్సుచే వహించి నీకు ప్రియము చేకూర్చెదను.
మూ. తతో హైమవతీ గఙ్గా సర్వలోకనమస్కృతా,
తదా సాతిమహద్రూపం కృత్వా వేగం చ దుస్సహమ్, 4
ఆకాశాదపతద్రామ శివే శివశిరస్యుత.
ప్ర. అ. రామ = రామా! తతః = పిమ్మట, హైమవతీ = హిమవంతుని కుమార్తె యగు, సర్వలోకనమస్కృతా = సమస్తలోకములచేతను నమస్కరింపబడిన, గఙ్గా = గంగ, తదా = అప్పుడు, అతిమహత్ చాల గొప్ప దైన, రూపమ్ = రూపమును, దుస్సహమ్ = సహింప శక్యము కాని, వేగం చ = వేగమును, కృత్వా = చేసి, ఆకాశాత్ = ఆకాశమునుండి, శివే = పవిత్ర మైన, శివశిరసి = శివుని శిరస్సు పైన, అపతత్ ఉత = పడెను.
తా. రామా! పిమ్మట ఆ హిమవత్పుత్రియు, సర్వలోకములచే నమస్కరింప బడినదియు అగు గంగ, గొప్ప ఆకారమును, సహింప శక్యముకాని వేగమును వహించి ఆకాశమునుండి, పవిత్ర మైన శివుని శిరస్సుపై పడెను.
మూ. అచిన్తయచ్చ సా దేవీ గఙ్గా పరమదుర్ధరా,
విశామ్యహం హి పాతాలం స్రోతసా గృహ్య శఙ్కరమ్. 5
ప్ర. అ. పరమదుర్ధరా = ధరించుటకు చాల కష్ట మైన, సా = ఆ, దేవీ = దేవి యైన, గఙ్గా = గంగ, అచిన్తయచ్చ = ఆలోచించెను కూడ, అహమ్ = నేను, స్రోతసా = నా ప్రవాహముచేత, శఙ్కరమ్ = శంకరుని, గృహ్య = గ్రహించి, పాతాలమ్ = పాతాలమును, విశామి = ప్రవేశింతును.
తా. ధరించుటకు చాల కష్ట మైన ఆ గంగాదేవి - ‘‘నా ప్రవాహమునందు శివుని గ్రహించి ఆతనితో సహా పాతాళమును ప్రవేశించెదను’’ అని తలచెను.
మూ. తస్యావలేపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు భగవాన్ హరః,
తిరోభావయితుం బుద్ధిం చక్రే త్రిణయనస్తదా. 6
ప్ర. అ. త్రిణయనః = మూడు నేత్రములు గల, భగవాన్ = భగవంతుడైన, హరః = ఈశ్వరుడు, తస్యాః = ఆ గంగయొక్క, వలేపనమ్ = గర్వమును, జ్ఞాత్వా = తెలుసుకొని, తదా = అప్పుడు, అతిమహత్ = చాల గొప్ప దైన, రూపమ్ = రూపమును, దుస్సహమ్ = సహింపశక్యము కాని, వేగం చ = వేగమును, కృత్వా = చేసి, ఆకాశాత్ = ఆకాశమునుండి, శివే = పవిత్ర మైన, శివశిరసి = శివుని శిరస్సు పైన, అపతత్ ఉత = పడెను.
తా. అప్పుడు, మూడు నేత్రములు గల భగవంతు డైన ఈశ్వరుడు ఆమె గర్వమును తెలిసికొని, ఆమె కనబడకుండ చేయవలె నని నిశ్చయించుకొనెను.
మూ. సా తస్మిన్ పతితా పుణ్యా పుణ్యే రుద్రస్య మూర్ధని,
హిమవత్ప్రతిమే రామ జటామణ్డలగహ్వరే. 7
ప్ర. అ. రామ = రామా!, సా = ఆ, పుణ్యా = పుణ్యనది యైన గంగ, హిమవత్ప్రతిమే = హిమవత్పర్వతముతో సమాన మైన, జటామణ్డలగహ్వరే = జటామండలముచే గుహ వలె నున్న, తస్మిన్ = ఆ, రుద్రస్య = శివునియొక్క, పుణ్యే = పవిత్రమైన, మూర్ధని = శిరస్సు పై, పతితా = పడినది.
తా. రామా! పవిత్ర మైన ఆ గంగ, హిమవత్పర్వతముతో సమాన మైనదియు, జటామండల మనెడు గుహలు కలదియు అగు, శివుని పవిత్ర మగు శిరస్సుపై పడినది.
మూ. సా కథంచిన్మహీం గన్తుం నాశక్నోద్యత్నమాస్థితా,
నైవ నిర్గమనం లేభే జటామణ్డలమోహితా. 8
ప్ర. అ. సా = ఆ గంగ, యత్నమ్ = ప్రయత్నమును, ఆస్థితా = అవలంబించినను, కథంచిత్ = ఏ విధముగను, మహీమ్ = భూమిని, గన్తుమ్ = పొందుటకు, న అశక్నోత్ = సమర్థురాలు కాలేదు. జటామణ్డలమోహితా = జటామండలముచే మోహితురాలై, నిర్గమనమ్ = బైటపడుటను, న లేభే = పొందలేదు.
తా. ఆ గంగ ఎంత ప్రయత్నించినను భూమిమీద పడలేకపోయెను. ఆ జటామండలములో చిక్కుకొని బైటకు రాజాలకపోయెను.
మూ. తత్రైవాబమ్భ్రమద్దేవీ సంవత్సరగణాన్ బహూన్,
తామపశ్యన్ పునస్తత్ర తపః పరమమాస్థితః. 9
ప్ర. అ. దేవీ = ఆ గంగ, బహూన్ = అనేకము లైన, సంవత్సరగణాన్ = సంవత్సర సముదాయములను, తత్రైవ = అచటనే, అబంభ్రమత్ = తిరిగెను. తామ్ = ఆ గంగను, ఆపశ్యన్ = చూడని వాడై, (భగీరథుడు), పునః = మరల, తత్ర = అచట, పరమమ్ = గొప్ప, తపః = తపస్సును, ఆస్థితః = అవలంబించెను.
తా. ఆ గంగ ఎన్నో సంవత్సరములు ఆ జటాజూటమునందే తిరిగెను. ఆమె కనబడకపోవుటచే భగీరథుడు మరల తీవ్రతపస్సు చేసెను.
మూ. అనేన తోషితశ్చాసీదత్యర్థం రఘునన్దన,
విససర్జ తతో గఙ్గాం హరో బిన్దుసరః ప్రతి. 10
ప్ర. అ. రఘునన్దన = రామా!, అనేన = ఈ తపస్సుచేత, హరః = శివుడు, అత్యర్థమ్ = మిక్కిలి, తోషితః చ = సంతోష పెట్టబడినవాడు, అభూత్ = ఆయెను. తతః = పిమ్మట, గఙ్గామ్ = గంగను, బిన్దుసరః ప్రతి = బిందుసరస్సును గూర్చి, విససర్జ = విడచెను.
తా. రామా! దీనిచేత శివుడు చాల సంతసించినవాడై, బిందుసరః ప్రాంతమునందు గంగను విడచెను.
మూ. తస్యాం విసృజ్యమానాయాం సప్త స్రోతాంసి జజ్ఞిరే, 11
హ్లాదినీ పావనీ చైవ నళినీ చ తథాపరా,
తిస్రః ప్రాచీం దిశం జగ్ముర్గఙ్గాః శివజలాః శుభాః. 12
ప్ర. అ. తస్యామ్ = ఆ గంగ, విసృజ్యమానాయామ్ = విడవబడుచుండగా, సప్త = ఏడు, స్రోతాంసి = ప్రవాహములు, జజ్ఞిరే = పుట్టినవి, హ్లాదినీ = హ్లాదినియు, పావనీ చైవ = పావనియు, తథా = మరియు, అపరా = మరియొక, నళినీ చ = నళినియు అను, శివజలాః = మంగళప్రద మైన జలము గల, తిస్రః = మూడు, శుభాః = శుభమైన, గఙ్గాః = గంగలు, ప్రాచీమ్ = తూర్పుదిక్కును గూర్చి, జగ్ముః = వెళ్లినవి.
తా. శివుడు గంగను విడచి నప్పుడు ఏడు ప్రవాహములు పుట్టినవి. వాటిని హ్లాదిని, పావని, నళిని అను పవిత్రజలము గల శుభము లైన మూడు గంగలు తూర్పు వైపు ప్రవహించినవి.
మూ. సుచక్షుశ్చైవ సీతా చ సిన్ధుశ్చైవ మహానదీ,
తిస్రస్త్వేతా తా దిశం జగ్ముః ప్రతీచీం తు శుభోదకాః. 13
ప్ర. అ. సుచక్షుః = సుచక్షువు, సీతా చ = మహానదియు, శుభోదకాః = శుభ మైన ఉదకము గల, ఏతాః = ఈ, తిస్రః = మూడును, ప్రతీచీం దిశమ్ = పశ్చిమదిక్కును గూర్చి, జగ్ముః = వెళ్లినవి.
తా. సుచక్షువు, సీత, సింధునది అనెడు శుభోదకములు గల మూడు నదులును పశ్చిమదిక్కునకు ప్రవహించినవి.
మూ. సప్తమీ చాన్వగా త్తాసాం భగీరథమథో నృపమ్,
భగీరథోఽపి రాజర్షిర్దివ్యం స్యన్దనమాస్థితః, 14
ప్రాయాదగ్రే మహాతేజా గఙ్గా తం చాప్యనువ్రజత్.
ప్ర. అ. అథో = మరియు, తాసామ్ = వాటిలో, సప్తమీ = ఏడవది, భగీరథం నృపమ్ = భగీరథమహారాజును, అన్వగాత్ = అనుసరించి వెళ్లెను. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, రాజర్షిః = రాజర్షి యైన, భగీరథోఽపి = భగీరథుడుకూడ, దివ్యమ్ = దివ్యమైన, స్యన్దనమ్ = రథమును, ఆస్థితః = అధిష్ఠించినవాడై, అగ్రే = ఎదుట, ప్రాయాత్ = వెళ్లెను, గఙ్గా చ = గంగయు, తమ్ = అతనిని, అనువ్రజత్ = అనుసరించి వెళ్లెను.
తా. వాటిలో ఏడవ ప్రవాహము భగీరథుని అనుసరించెను. మహాతేజఃశాలియు, రాజర్షియు అగు భగీరథుడు దివ్య మైన రథము నెక్కి ముందు వెళ్లగా గంగ అతని వెనుక వెళ్లెను.
మూ. గగనాచ్ఛఙ్కరశిరస్తతో ధరణిమాశ్రితా,
వ్యసర్పత జలం తత్ర తీవ్రశబ్దపురస్కృతమ్. 15
ప్ర. అ. గగనాత్ = ఆకాశమునుండి, శంకరశిరః = శంకరుని శిరస్సును, తతః = అచటనుండి, ధరణిమ్ = భూమిని, ఆశ్రితా = ఆశ్రయించినది, తత్ర = అచట, జలమ్ = జలము, తీవ్రశబ్దపురస్కృతమ్ = తీవ్ర మైన శబ్దముతో కూడినదై, వ్యసర్పత = వ్యాపించెను.
తా. గంగ ఆకాశమునుండి శివుని శిరస్సును, అచటనుండి భూమిని చేరినది. అచట జలము తీవ్రశబ్దముతో ప్రవహించెను.
మూ. మత్స్యకచ్ఛపసంఘైశ్చ శింశుమారగణైస్తదా,
పతద్భిః పతితైశ్చాన్యై ర్వ్యరోచత వసున్ధరా. 16
ప్ర. అ. తదా = అప్పుడు, వసుంధరా = భూమి, పతితైః = పడినవియు, పతద్భిశ్చః = పడుచున్నవియు అగు, మత్స్యకచ్ఛపసంఘైశ్చ = మత్స్యములయొక్క తాబేళ్లయొక్క సముదాయములచేతను, శింశుమారగణైశ్చ = మొసళ్ల సముదాయములచేతను, అన్యైః = ఇతర మైన జలజతువులచేతను, వ్యరోచత = ప్రకాశించెను.
తా. అపుడు భూమిపై కొన్ని మత్స్యములు, తాబేళ్లు, మొసళ్లు మొదలైనవి పడినవి, కొన్ని పడుచున్నవి. వాటితో భూమి ప్రకాశించెను.
మూ. తతో దేవర్షిగన్ధర్వా యక్షసిద్ధగణాస్తదా,
వ్యలోకయన్త తే తత్ర గగనాద్గాం గతాం తథా. 17
ప్ర. అ. తతః = పిమ్మట, దేవర్షిగన్ధర్వాః = దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షాః = యక్షులు, తే = ఆ, సిద్ధగణాః = సిద్ధుల గణములు, తదా = అప్పుడు, తథా = ఆ విధముగా, గగనాత్ = ఆకాశమునుండి, గామ్ = భూమిని, గతామ్ = పొందిన గంగను, వ్యలోకయన్త = చూచిరి.
తా. అపు డా గంగ ఆకాశమునుండి భూమిపై పడుచుండగా, దేవ-ఋషి-గంధర్వ- యక్ష-సిద్ధాదులు ఆశ్చర్యముతో చూచిరి.
మూ. విమానైర్నగరాకారైర్హయైర్గజవరైస్తదా,
పారిప్లవగతైశ్చాపి దేవతాస్తత్ర విష్ఠితాః. 18
ప్ర. అ. తదా = అప్పుడు, దేవతాః = దేవతలు, నగరాకారైః = నగరములవంటి, విమానైః = విమానములతోడను, పారిప్లవగతైః = వేగిరపాటు చెందిన, హయైః = గుఱ్ఱములతోడను, గజవరైః = శ్రేష్ఠము లైన ఏనుగులతోడను, తత్ర = అచట, విష్ఠితాః = నిలచిరి.
తా. నరగములవంటి విమానముల పైనను, తొందరగ నున్న గుఱ్ఱముల మీదను, ఏనుగులమీదను ఎక్కి వచ్చిన దేవతలు అచట నిలచి ఉండిరి.
మూ. తదద్భుతతమం లోకే గఙ్గాపతనముత్తమమ్,
దిదృక్షవో దేవగణాః సమీయురమితౌజసః. 19
ప్ర. అ. లోకే = లోకమునందు, అద్భుతతమమ్ = అత్యాశ్చర్యకర మైన, ఉత్తమమ్ = ఉత్తమ మైన, గఙ్గాపతనమ్ = గంగావతరణమును, దిదృక్షవః = చూడ అభిలాష కలవారై, అమితౌజసః = గొప్ప తేజస్సు గల, దేవగణాః = దేవగణములు, సమీయుః = వచ్చిరి.
తా. లోకములో అత్యాశ్చర్యకర మైన ఉత్తమ మైన ఆ గంగావతరణమును చూచుటకై గొప్ప తేజస్సు గల దేవత లందరును వచ్చిరి.
మూ. సంపతద్భిః సురగణైస్తేషాం చాభరణౌజసా,
శతాదిత్యమివాభాతి గగనం గతతోయదమ్. 20
ప్ర. అ. గతతోయదమ్ = తొలగిన మేఘములు గల, గగనమ్ = ఆకాశము, సంపతద్భిః = వేగముగా వచ్చుచున్న, సురగణైః = దేవతాగణములచేతను, తేషామ్ = వారియొక్క, ఆభరణౌజసా = ఆభరణముల కాంతిచేతను, శతాదిత్యమివ = నూర్గురు సూర్యులు కలది వలె, ఆభాతి = ప్రకాశించుచున్నది.
తా. మేఘములు లేని ఆకాశముమీద సురగణములు వచ్చి చేరగా వారి అలంకారముల కాంతిచేత నూర్గురు సూర్యు లున్నంత కాంతి కలిగెను.
మూ. శింశుమారోరగగణైర్మీనైరపి చ చఞ్చలైః,
విద్యుద్భిరివ విక్షిప్తమాకాశమభవత్తదా. 21
ప్ర. అ. తదా = అప్పుడు, శింశుమారోరగగణైః = మొసళ్లయొక్కయు, సర్పములయొక్కయు సముదాయములచేతను, చఞ్చలైః = చంచలము లైన, మీనై రపి చ = మీనములచేతను, ఆకాశమ్ = ఆకాశము, విద్యుద్భిః = మెరుపులచేత, విక్షిప్తమివ = వ్యాప్తమైనది వలె, అభవత్ = ఆయెను.
తా. అపుడు మొసళ్లు, సర్పములు, మీనములు కదలుచు పడుచుండగా ఆకాశము మెరపులచే వ్యాప్త మైన ట్లుండెను.
మూ. పాణ్డరైః సలిలోత్పీడైః కీర్యమాణైః సహస్రధా,
శారతాభ్రైరివాకీర్ణం గగనం హంససంప్లవైః. 22
ప్ర. అ. సహస్రధా = వేయివిధములుగా, కీర్యమాణైః = చిమ్మబడుచున్న, పాణ్డరైః = తెల్లని, సలిలోత్పీడైః = నీటినురుగులతో, గగనమ్ = ఆకాశము, హంససంప్లవైః = హంసలయొక్క గుంపులచేతను, శారదాభ్రైః = శరత్కాల మేఘములచేతను, ఆకీర్ణమివ = వ్యాప్త మైనది వలె ఉండెను.
తా. వేయి విధములుగా చిమ్మబడుచున్న నీటి నురుగులతో ఆకాశము, హంసల సముదాయములచేతను, శరత్కాలమేఘములచేతను వ్యాప్త మైనది వలె ఉండెను.
మూ. క్వచిద్ద్రుతతరం యాతి కుటిలం క్వచిదాయతమ్,
వినతం క్వచిదుద్ధూతం క్వచిద్యాతి శనైః శనైః. 23
ప్ర. అ. క్వచిత్ = కొన్నిచోట్ల, ద్రుతతరమ్ = అతి శీఘ్రముగా, యాతి = ప్రవహించుచున్నది. క్వచిత్ = కొన్ని చోట్ల, కుటిలం యాతి = వంకరగా ప్రవహించుచున్నది. క్వచిత్ = కొన్ని చోట్ల, ఆయతమ్ = పొడవుగా, ప్రవహించుచున్నది. క్వచిత్ = కొన్ని చోట్ల, వినతమ్ = వంగి ప్రవహించుచున్నది. క్వచిత్ = కొన్ని చోట్ల, ఉద్ధూతమ్ = పైకి లేచుచు ప్రవహించుచున్నది. క్వచిత్ = కొన్ని చోట్ల, శనైః శనైః = మెల్లమెల్లగా, యాతి = వెళ్లుచున్నది.
తా. ఆ గంగ కొన్ని చోట్ల శీఘ్రముగను, కొన్ని చోట్ల మెల్లగను, కొన్ని చోట్ల వంకరగను, కొన్ని చోట్ల పొడవుగను, కొన్ని చోట్ల క్రిందికిని, కొన్ని చోట్ల పైకిని ప్రవహించుచున్నది.
మూ. సలిలేనైవ సలిలం క్వచిదభ్యాహతం పునః,
ముహురూర్ధ్వముఖం గత్వా పపాత వసుధాతలమ్. 24
ప్ర. అ. క్వచిత్ = కొన్ని చోట్ల, సలిలమ్ = నీరు, సలిలేనైవ = నీటిచేతనే, అభ్యాహతమ్ = కొట్టబడినదై, ముహుః = మాటి మాటికిని, ఊర్ధ్వముఖమ్ = ఊర్ధ్వముఖముగా, గత్వా = వెళ్లి, పునః = మరల, వసుధాతలమ్ = భూమిని గూర్చి, పపాత = పడెను.
తా. కొన్ని చోట్ల నీటితో నీరు డీకొని, పైకెగసి, మరల భూమిపై పడుచుండెను.
మూ. తచ్ఛఙ్కరశిరోభ్రష్టం భ్రష్టం భూమితలే పునః,
వ్యరోచత తదా తోయం నిర్మలం గతకల్మషమ్. 25
ప్ర. అ. శఙ్కరశిరోభ్రష్టమ్ = శంకరుని శిరస్సుపై పడినదియు, పునః = మరల, భూమితలే = భూమిపై, భ్రష్టమ్ = పడిన, గతకల్మషమ్ = కాలుష్యము లేని, నిర్మలమ్ = నిర్మల మైన, తత్ = ఆ, తోయమ్ = ఉదకము, తదా = అప్పుడు, వ్యరోచత = ప్రకాశించెను.
తా. ఆకాశమునుండి శంకరుని శిరస్సుపై బడి, పిమ్మట భూమిపై బడిన ఆ కల్మషము లేని ఉదకము నిర్మలముగా ప్రకాశించెను.
మూ. తత్ర దేవర్షిగన్ధర్వా వసుధాతలవాసినః,
భవాఙ్గపతితం తోయం పవిత్రమితి పస్పృశుః. 26
ప్ర. అ. తత్ర = అచట, దేవర్షిగన్ధర్వాః = దేవతలు, ఋషులు, గంధర్వులు, వసుధాతల వాసినః = భూమిపై నివసించువారును, భవాఙ్గపతితమ్ = ఈశ్వరుని శరీరమునుండి జారిన, తోయమ్ = ఆ ఉదకము, పవిత్రమ్ ఇతి = పవిత్ర మైనది అని, పస్పశుః = స్పశించిరి.
తా. శివుని శరీరమునుండి పడిన దగుటచే ఆ జలము పవిత్ర మైన దను అభిప్రాయముతో, అచట దేవఋషిగంధర్వులును, భూమిపై నివసించువారును దానిని స్పశించిరి.
మూ. శాపాత్ప్రపతితా యే చ గగనాద్వసుధాతలమ్,
కృత్వా తత్రాభిషేకం తే బభూవుర్గతకల్మషాః. 27
ప్ర. అ. యే చ = ఎవరు, శాపాత్ = శాపమువలన, గగనాత్ = ఆకాశమునుండి, వసుధాతలమ్ = భూతలముగూర్చి, ప్రపతితాః = పడినారో, తే = వారు, తత్ర = దానియందు, అభిషేకమ్ = స్నానమును, కృత్వా = చేసి, గతకల్మషాః = తొలగిన కల్మషములు కలవారు, బభూవుః = అయిరి.
తా. శాపవశముచేత స్వర్గమునుండి భూలోకములో పడినవారు గంగలో స్నానము చేసి, పాపరహితు లైరి.
మూ. ధూతపాపాః పునస్తేన తోయేనాథ సుభాస్వతా,
పునరాకాశమావిశ్య స్వాన్ లోకాన్ ప్రతిపేదిరే. 28
ప్ర. అ. తేన = ఆ, సుభాస్వతా = బాగుగా ప్రకాశించుచున్న, తోయేన = జలముచేత, ధూతపాపాః = కడిగి వేయబడిన పాపములు కలవారై, పునః = మరల, ఆకాశమ్ = ఆకాశమును. ఆవిశ్య = ప్రవేశించి, అథ = పిమ్మట, పునః = మరల, స్వాన్ = తమ, లోకాన్ = లోకములను, ప్రతిపేదిరే = పొందిరి.
తా. ప్రకాశించుచున్న ఆ జలము పాపము లన్నింటిని కడిగివేయగా, వారు ఆకాశములోనికి ఎగిరి తమ లోకములు చేరిరి.
మూ. ముముదే ముదితో లోకస్తేన తోయేన భాస్వతా,
కృతాభిషేకో గఙ్గాయాం బభూవ విగతక్లమః. 29
ప్ర. అ. లోకః = జనము, భాస్వతా = ప్రకాశించుచున్న, తేన = ఆ, తోయేన = ఉదకముచేత, ముముదే = సంతసించెను. ముదితః = సంతసించినదై, గఙ్గాయామ్ = గంగయందు, కృతాభిషేకః = చేయబడిన స్నానము గలదై, విగతక్లమః = తొలగిన శ్రమ కలది, బభూవ = ఆయెను.
తా. ప్రకాశించు చున్న ఆ జలమును చూచి జను లందరును చాల సంతసించి, ఆ గంగలో స్నానము చేసి శ్రమమును పోగొట్టుకొనిరి.
మూ. భగీరథోఽపి రాజర్షిర్దివ్యం స్యన్దనమాస్థితః,
ప్రాయాదగ్రే మహాతేజా గఙ్గా తం పృష్ఠతోఽన్వగాత్. 30
ప్ర. అ. చూ. శ్లో. 14 గఙ్గా = గంగ, తమ్ = వానిని, పృష్ఠతః = వెనుక, అన్వగాత్ = అనుసరించెను.
మూ. దేవాః సర్షిగణాః సర్వే దైత్యదానవరాక్షసాః,
గన్ధర్వయక్షప్రవరాః సకిన్నరమహోరగాః, 31
సర్వాశ్చాప్సరసో రామ భగీరథరథానుగామ్,
గఙ్గామన్వగమన్ ప్రీతాః సర్వే జలచరాశ్చ యే. 32
ప్ర. అ. రామ = రామా! సర్షిగణాః = ఋషిగణములతో కూడిన, దేవాః = దేవతలును, సర్వే = సమస్త మైన, దైత్యదానవరాక్షసాః = దైత్యదానవరాక్షసులును, సకిన్నరమహోరగాః = కిన్నరులతోడను, మహోరగులతోడను కూడిన, గన్ధర్వయక్షప్రవరాః = గంధర్వులును శ్రేష్ఠు లైన యక్షులును, సర్వాః = సమస్తమైన, అప్సరసః = అప్సరసలును, ప్రీతాః = సంతోషించినవారై, భగీరథరథానుగామ్ = భగీరథుని రథమును అనుసరించి పోవుచున్న, గఙ్గామ్ = గంగను, అన్వగమన్ = అనుసరించిరి. యే = ఏ, జలరాశ్చ = జలచరము లున్నవో, సర్వే = అవి అన్నియు, అనుసరించినవి.
తా. రామా! భగీరథుని అనుసరించి గంగ వెళ్లుచుండగా, జలచరములే కాక, ఋషి-దైత్య-దానవ-రాక్షస-గంధర్వ-యక్ష-కిన్నర-మహోరగ-అప్సరసలు గూడ ఆ గంగ వెంట వెళ్లిరి.
మూ. యతో భగీరథో రాజా తతో గఙ్గా యశస్వినీ,
జగామ సరితాం శ్రేష్ఠా సర్వపాపప్రణాశినీ. 33
ప్ర. అ. రాజా = రాజైన, భగీరథః = భగీరథుడు, యతః = ఎటు వైపు వెళ్లెనో, యశస్వినీ యశఃశాలినియు, సరితాం శ్రేష్ఠా = నదులలో శ్రేష్ఠురాలును, సర్వపాపప్రణాశినీ = సమస్త పాపములను నశింపచేయునదియు అగు, గఙ్గా = గంగ, తతః = అటువైపునకే, జగామ = వెళ్లెను.
తా. భగీరథుడు ఎటు వైపు వెళ్లెనో, యశస్వినియు, నదీశ్రేష్ఠయు, సర్వపాప వినాశినియు అగు గంగ కూడ అటు వైపునకే ప్రవహించుచు వెళ్లెను.
మూ. తతో హి యజమానస్య జహ్నోరద్భుతకర్మణః,
గఙ్గా సంప్లావయామాస యజ్ఞవాటం మహాత్మనః. 34
ప్ర. అ. తతః = పిమ్మట, గఙ్గా = గంగ, యజమానస్య = యజ్ఞము చేయుచున్న, అద్భుతకర్మణః = అద్భుతమైన కర్మ గల, మహాత్మనః = మహాత్ముడైన, జహ్నోః = జహ్నుమహర్షియొక్క, యజ్ఞవాటమ్ = యజ్ఞశాలను, సంప్లావయామాస = నీటిలో ముంచెత్తివేసెను.
తా. ఆ విధముగ ప్రవహించుచు వెళ్లుచున్న గంగ మార్గమధ్యమున అద్భుత మైన కర్మ కలవాడును, మహాత్ముడును అగు జహ్నుమహర్షి యజ్ఞము చేయుచుండగా ఆ యజ్ఞవాటమును ముంచివేసెను.
మూ. తస్యావలేపనం జ్ఞాత్వా క్రుద్ధో యజ్వా తు రాఘవ,
అపిబచ్చ జలం సర్వం గఙ్గాయాః పరమాద్భుతమ్. 35
ప్ర. అ. రాఘవ = రామా! యజ్వా = యాగముచేయుచున్న ఆ జహ్నుమహర్షి, తస్యాః = ఆమెయొక్క, వలేపనమ్ = గర్వమును, జ్ఞాత్వా = తెలుసుకొని, క్రుద్ధః = కోపగించిన వాడై, గఙ్గాయాః = గంగయొక్క, సర్వమ్ = సమస్త మైన, జలమ్ = జలమును, పరమాద్భుతమ్ = చాల ఆశ్చర్యకర మగునట్లుగా, అపిబత్ = త్రాగివేసెను.
తా. రామా! యజ్ఞముచేయుచున్న ఆ జహ్నుమహర్షి గంగ గర్వమును చూచి, కోపించి ఆ గంగాజలము నంతను త్రాగివేసెను. అది చాల ఆశ్చర్యకరముగ నుండెను.
మూ. తతో దేవాః సగన్ధర్వా ఋషయశ్చ సువిస్మితాః, 36
పూజయన్తి మహాత్మానం జహ్నుం పురుషసత్తమమ్,
గఙ్గాం చాపి నయన్తి స్మ దుహితృత్వే మహాత్మనః. 37
ప్ర. అ. తతః = పిమ్మట, సగన్ధర్వాః = గంధర్వులతో కూడి, దేవాః = దేవతలును, ఋషయశ్చ = ఋషులును, సువిస్మితాః = చాల ఆశ్చర్యపడినవారై, పురుషసత్తమమ్ = పురుషశ్రేష్ఠుడైన, మహాత్మానమ్ = మహాత్ముడైన, జహ్నుమ్ = జహ్నుమహర్షిని, పూజయన్తి = పూజించుచున్నారు. గఙ్గాం చ = గంగను కూడ, మహాత్మనః = మహాత్ముడైన జహ్నుమహర్షియొక్క, దుహితృత్వే = దుహితగా అగుటను, నయన్తి = పొందించుచున్నారు.
తా. పిమ్మట, దేవతలును, గంధర్వులును, ఋషులును చాల ఆశ్చర్యము చెందిన వారై, పురుషశ్రేష్ఠు డైన, మహాత్ము డైన, జహ్నుమహర్షిని పూజించిరి. గంగను ఆ మహాత్ముని కుమార్తెనుగా చేయ నిర్ణయించిరి.
మూ. తతస్తుష్టో మహాతేజాః శ్రోత్రాభ్యామసృజత్పునః,
తస్మాజ్జహ్నుసుతా గఙ్గా ప్రోచ్యతే జాహ్నవీతి చ. 38
ప్ర. అ. తతః = పిమ్మట, తుష్టః = సంతసించిన, మహాతేజాః = గొప్ప తేజస్సు గల ఆ జహ్నుమహర్షి, పునః = మరల, శోత్రాభ్యామ్ = చెవులనుండి, అసృజత్ = సృజించెను, తస్మాత్ = ఆ కారణమువలన, గఙ్గా = గంగ, జహ్నుసుతా = ‘‘జహ్నుసుత’’ అనియు, జాహ్నవీతి చ = ‘‘జాహ్నవి’’ యనియు, ప్రోచ్యతే = చెప్పబడుచున్నది.
తా. పిమ్మట మహాతేజస్సు గల ఆ జహ్నుమహర్షి సంతసించిన వాడై, మరల చెవులనుండి గంగను విడచెను. అందుచే గంగకు ‘‘జహ్నుసుత’’ అనియు, ‘‘జాహ్నవి’’ అనియు పేర్లు వచ్చినవి.
మూ. జగామ చ పునర్గఙ్గా భగీరథపథానుగా,
సాగరం చాపి సంప్రాప్తా సా సరిత్ప్రవరా తదా, 39
రసాతలముపాగచ్ఛత్సిద్ధ్యర్థం తస్య కర్మణః.
ప్ర. అ. గఙ్గా = గంగ, పునః = మరల, భగీరథపథానుగాః = భగీరథుని మార్గమును అనుసరించినదై, జగామ = వెళ్లెను. తదా = అప్పుడు, సా = ఆ, సరిత్ప్రవరా = నదులలో శ్రేష్ఠ మైన గంగ, సాగరం = సముద్రమును, సంప్రాప్తాపి = పొందినదైనను, తస్య = ఆ, కర్మణః = పనియొక్క, సిద్ధ్యర్థమ్ = సిద్ధికొరకు, రసాతలమ్ = పాతాళమును, ఉపాగచ్ఛత్ = పొందెను.
తా. నదులలో శ్రేష్ఠ యైన ఆ గంగ మరల భగీరథుని అనుసరించి, వెళ్లి సముద్రములో ప్రవేశించి, సగరపుత్రులను తరింపచేయుట అను పని పూర్తి చేయుటకు పాతాళమునకు వెళ్లెను.
మూ. భగీరథోఽపి రాజర్షిర్గఙ్గామాదాయ యత్నతః,
పితామహాన్ భస్మకృతానపశ్యద్దీనచేతనః. 40
ప్ర. అ. రాజర్షిః = రాజర్షి యైన, భగీరథోఽ పి = భగీరథుడు కూడ, యత్నతః = ప్రయత్నమువలన, గఙ్గామ్ = గంగను, ఆదాయ = తీసికొని వెళ్లి, దీనచేతనః = దీన మైన మనస్సు కలవాడై, భస్మకృతాన్ = భస్మముగా చేయబడిన, పితామహాన్ = తాతలను, అపశ్యత్ = చూచెను.
తా. రాజర్షి యైన భగీరథుడు ఇంత ప్రయత్నము చేసి, గంగను తీసికొని వెళ్లెను. అచట భస్మమై పడి యున్న పితామహులను చూచి, దుఃఖితు డయ్యెను.
మూ. అథ తద్భస్మనాం రాశిం గఙ్గాసలిలముత్తమమ్,
ప్లావయద్ధూతపాప్మానః స్వర్గం ప్రాప్తా రఘూత్తమ. 41
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే త్రిచత్వారింశః సర్గః
ప్ర. అ. రఘూత్తమ = రామా! అథ = పిమ్మట, ఉత్తమమ్ = ఉత్తమ మైన, గఙ్గాసలిలమ్ = గంగాజలము, తత్ = ఆ, భస్మనామ్ = భస్మయొక్క, రాశిమ్ = రాశిని, ప్లావయత్ = ముంచెను. ధూతపాప్మానః = కడిగి వేయబడిన పాపములు కలవారై, స్వర్గమ్ = స్వర్గమును, ప్రాప్తాః = చేరినారు.
తా. రామా! ఉత్తమ మైన ఆ గంగోదకము ఆ భస్మరాశిని తడపగా సగరకుమారు లందరును, పాపములు నశించి, స్వర్గము చేరిరి.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో నలుబది మూడవ సర్గ సమాప్తము.
