| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 50 |
| Pages | 6 |
| Read Time | 9 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ చతుశ్చత్వారింశః సర్గః
బ్రహ్మదేవుడు భగీరథుని ప్రశంసించి గంగాజలముచే పితృతర్పణము చేయుటకై ఆతనికి అనుజ్ఞ ఇచ్చుట, అదంతయు చేసి భగీరథుడు తన పురమునకు వెళ్ళుట, గంగావతరణోపాఖ్యాన మహిమను వర్ణించుట.
మూ. స గత్వా సాగరం రాజా గఙ్గయానుగతస్తదా,
ప్రవివేశ తలం భూమేర్యత్ర తే భస్మసాత్కృతాః. 1
ప్ర. అ. సః = ఆ, రాజా = రాజు, తదా = అప్పుడు, గఙ్గయా = గంగచేత, అనుగతః = అనుసరింపబడిన వాడై, సాగరమ్ = సముద్రమును గూర్చి, గత్వా = వెళ్లి, యత్ర = ఎచట, తే = ఆ సగరకుమారులు, భస్మసాత్ = భస్మముగా, కృతాః = చేయబడినారో అక్కడ, భూమేః = భూమియొక్క, తలమ్ = అడుగు భాగమును, ప్రవివేశ = ప్రవేశించెను.
తా. అపుడు, గంగానది తన వెనుకనే వచ్చుచుండగా, భగీరథుడు సముద్రమునకు వెళ్లి, అచటనుండి, సగరకుమారులు భస్మమై పడి ఉన్న పాతాళలోకములో ప్రవేశించెను.
మూ. భస్మన్యథాప్లుతే రామ గఙ్గాయాః సలిలేన వై,
సర్వలోకప్రభుర్బ్రహ్మా రాజానమిదమబ్రవీత్. 2
ప్ర. అ. అథ = పిమ్మట, భస్మని = భస్మము, గఙ్గాయాః = గంగయొక్క, సలిలేన = నీటిచేత, ఆప్లుతే = ముంచబడగా, సర్వలోకప్రభుః = సమస్తలోకములకును ప్రభువైన, బ్రహ్మా = బ్రహ్మ, రాజానమ్ = రాజును గూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను.
తా. గంగాజలము భస్మమును ముంచెత్తిన పిమ్మట, సకలలోక ప్రభువైన బ్రహ్మదేవుడు భగీరథునితో ఇట్లు పలికెను.
మూ. తారితా నరశార్దూల దివం యాతాశ్చ దేవవత్,
షష్టిః పుత్రసహస్రాణి సగరస్య మహాత్మనః. 3
ప్ర. అ. నరశార్దూల = నరశ్రేష్ఠుడా!, మహాత్మనః = మహాత్ముడైన, సగరస్య = సగరునియొక్క, షష్టిః పుత్రసహస్రాణి = అరవై వేలమంది కుమారులు, తారితాః = తరింప చేయబడినారు. దేవవత్ = దేవతలవలె, దివమ్ = స్వర్గమును గూర్చి, యాతాః = వెళ్లినారు.
తా. మహాత్ము డైన సగరుని అరువదివేలమంది కుమారులును తరింపచేయబడిన వారై, దేవతల వలె స్వర్గమునకు వెళ్లినారు.
మూ. సాగరస్య జలం లోకే యావత్ స్థాస్యతి పార్థివ,
సగరస్యాత్మజాస్తావత్స్వర్గే స్థాస్యన్తి దేవవత్. 4
ప్ర. అ. పార్థివ = రాజా! సాగరస్య = సముద్రముయొక్క, జలమ్ = జలము, లోకే = లోకమునందు, యావత్ = ఎంతవరకు, స్థాస్యతి = ఉండగలదో, తావత్ = అంతవరకును, సగరస్య ఆత్మజాః = సగరుని కుమారులు, దేవవత్ = దేవతల వలె, స్వర్గే = స్వర్గమునందు, స్థాస్యన్తి = ఉండగలరు.
తా. రాజా! లోకములో సాగరజల మున్నంతవరకును, సగరకుమారులు దేవతల వలె స్వర్గములో ఉండగలరు.
మూ. ఇయం చ దుహితా జ్యేష్ఠా తవ గఙ్గా భవిష్యతి,
త్వత్కృతేన చ నామ్నాథ లోకే స్థాస్యతి విశ్రుతా. 5
ప్ర. అ. ఇయమ్ = ఈ, గఙ్గా = గంగ, తవ = నీ యొక్క, జ్యేష్ఠా = పెద్ద, దుహితా = కుమార్తెగా, భవిష్యతి = కాగలదు, అథ = ఇటు పిమ్మట, త్వత్కృ తేన = నీచే ఏర్పడిన, నామ్నా = పేరుతో, లోకే = లోకమునందు, విశ్రుతా = ప్రసిద్ధురాలై, స్థాస్యతి = ఉండగలదు.
తా. ఈ గంగ నీకు పెద్దకుమార్తె కాగలదు. నీ పేరుతో సంబంధించిన ‘‘భాగీరథి’’ అను పేరుతో లోకమునందు ప్రసిద్ధి పొందగలదు.
మూ. గఙ్గా త్రిపథగా రాజన్ దివ్యా భాగీరథీతి చ,
త్రీన్ పథో భావయన్తీతి తతస్త్రిపథగా స్మృతా. 6
ప్ర. అ. రాజన్ = రాజా! దివ్యా = స్వర్గలోకమునకు సంబంధించిన, గఙ్గా = గంగ, త్రిపథగా = త్రిపథగ యనియు, భాగీరథీతి చ = భాగీరథి అనియు, ప్రసిద్ధి చెందును. త్రీన్ = మూడు, పథః = మార్గములను, భావయన్తీ = పవిత్రము చేయుచు ప్రవహించు చున్నది, ఇతి = అని, తతః = ఆ కారణమువలన, త్రిపథగా = ‘త్రిపథగ’ అని, స్మృతా = చెప్పబడినది.
తా. రాజా! గంగ త్రిపథగ అనియు, భాగీరథి యనియు ప్రసిద్ధిపొందును. మూడు మార్గములను, అనగా, స్వర్గలోక-భూలోక-పాతాళలోక మార్గములను తన ప్రవాహముచే పవిత్రింపచేయుచున్నది గాన త్రిపథగ అని చెప్పబడుచున్నది.
మూ. పితామహానాం సర్వేషాం త్వమత్ర మనుజేశ్వర,
కురుష్వ సలిలం రాజన్ ప్రతిజ్ఞామపవర్జయ. 7
ప్ర. అ. మనుజేశ్వర = మనుజులకు ప్రభు వైన, రాజన్ = రాజా!, త్వమ్ = నీవు, అత్ర = ఈ గంగయందు, సర్వేషామ్ = సమస్త మైన, పితామహానామ్ = పితామహులకు, సలిలం కురుష్వ = జలతర్పణము లిమ్ము. ప్రతిజ్ఞామ్ = ప్రతిజ్ఞను, అపవర్జయ = పూర్తిచేసికొనుము.
తా. భగీరథా! ఈ గంగాజలముతో నీ పితామహు లందరికిని తర్పణములు చేసి నీ ప్రతిజ్ఞను నిలుపుకొనుము.
మూ. పూర్వకేణ హి తే రాజం స్తేనాతియశసా తదా,
ధర్మిణాం ప్రవరేణాపి నైష ప్రాప్తో మనోరథః. 8
ప్ర. అ. రాజన్ = రాజా!, తే = నీయొక్క, పూర్వకేణ = పూర్వపురుషుడును, అతియశసా = గొప్ప కీర్తి కలవాడును, ధర్మిణామ్ = ధర్మవంతులలో, ప్రవరేణ = శ్రేష్ఠుడును అగు, తేనాపి = ఆ సగరచక్రవర్తిచేత కూడ, తదా = అప్పుడు, ఏషః = ఈ, మనోరథః = మనోరథము, న ప్రాప్తః = పొందబడలేదు.
తా. రాజా! గొప్ప కీర్తి గలవాడును, ధార్మికులలో శ్రేష్ఠుడును అయిన నీ పూర్వపురుషుడు సగరచక్రవర్తి కూడ ఆనాడు, ఈ కోరికను తీర్చుకొన జాలక పోయెను.
మూ. తథైవాంశుమతా తాత లోకేఽప్రతిమతేజసా,
గఙ్గాం ప్రార్థయతా నేతుం ప్రతిజ్ఞా నాపవర్జితా. 9
ప్ర. అ. తాత = నాయనా! తథైవ = అట్లే, లోకే = లోకమునందు, అప్రతిమతేజసా = సాటిలేని తేజస్సు కలవాడును, గఙ్గామ్ = గంగను, ఆనేతుమ్ = తీసికొనివచ్చుటకు, ప్రార్థయతా = కోరుచున్నవాడును అగు, అంశుమతా = అంశుమంతునిచేత కూడ, ప్రతిజ్ఞా = ప్రతిజ్ఞ, నాపవర్జితా = పూర్తిచేయబడలేదు.
తా. లోకములో సాటి లేని తేజస్సు గల అంశుమంతుడు గూడ గంగను తీసుకొని రావలె ననెడు ప్రతిజ్ఞను పూర్తిచేసికొనలేకపోయెను.
మూ. రాజర్షిణా గుణవతా మహర్షిసమతేజసా,
మత్తుల్యతపసా చైవ క్షత్రధర్మస్థితేన చ, 10
దిలీపేన మహాభాగా తవ పిత్రాతితేజసా,
పునర్న శకితాఽనేతుం గఙ్గాం ప్రార్థయతా నఘ. 11
ప్ర. అ. అనఘ = దోషములు లేనివాడా!, రాజర్షిణా = రాజర్షియు, గుణవతా = గుణవంతుడును, మహర్షిసమతేజసా = మహర్షితో సమాన మైన తేజస్సు కలవాడును, మత్తుల్యతపసా = నాతో సమాన మైన తపస్సు కలవాడును, క్షత్రధర్మస్థితేన = క్షత్రియధర్మమునం దున్నవాడును, అతితేజసా = గొప్పతేజస్సు కలవాడును, గఙ్గామ్ = గంగను, ప్రార్థయతా = ప్రార్థించినవాడును అగు, తవ పిత్రా = నీ తండ్రి యైన, దిలీపేన = దిలీపునిచేత, ఆనేతుం పునః = తీసికొనివచ్చుట కైతే, న శకితా = శక్యము కాలేదు.
తా. ఓ పుణ్యాత్ముడా! రాజర్షియు, గుణవంతుడును, మహర్షులతో సమాన మైన తేజస్సు కలవాడును, నా వంటి తపస్సు కలవాడును, క్షత్రియ ధర్మమును అవలంబించిన వాడును, మంచి తేజస్సు కలవాడును, అగు నీ తండ్రి దిలీపుడు గంగను తీసుకొని రావలె నని కోరెను గాని తీసికొనిరాలేక పోయెను.
మూ. సా త్వయా సమతిక్రాన్తా ప్రతిజ్ఞా పురుషర్షభ,
ప్రాప్తోఽసి పరమం లోకే యశఃపరమసంమతమ్. 12
ప్ర. అ. పురుషర్షభ = పురుషశ్రేష్ఠుడా! సా = ఆ, ప్రతిజ్ఞా = ప్రతిజ్ఞ, త్వయా = నీచేత, సమతిక్రాన్తా = దాటబడినది, లోకే = లోకమునందు, పరమసంమతమ్ = మిక్కిలి పూజ్య మైన, పరమమ్ = గొప్ప, యశః = కీర్తిని, ప్రాప్తః అసి = పొందినావు.
తా. పురుషశ్రేష్ఠుడా! ఆ ప్రతిజ్ఞను నీవు దాట గలిగినావు. లోకములో చాల మెచ్చుకొన దగిన గొప్ప కీర్తిని సంపాదించుకొనినావు.
మూ. యచ్చ గఙ్గావతరణం త్వయా కృతమరిన్దమ,
అనేన చ భవాన్ ప్రాప్తో ధర్మస్యాయతనం మహత్. 13
ప్ర. అ. అరిన్దమ = ఓ శత్రువినాశకుడా!, త్వయా = నీచేత, యత్ = ఏ, గఙ్గావతరణమ్ = గంగను దింపుట, కృతమ్ = చేయబడినదో, అనేన = దీనిచేత, భవాన్ = నీవు, ధర్మస్య = ధర్మముయొక్క, మహత్ = గొప్ప, ఆయతనమ్ = ప్రతిష్ఠను, ప్రాప్తః = పొందినావు.
తా. భగీరథా! నీవు గంగను క్రిందికి దింపుటవలన గొప్ప ధర్మప్రతిష్ఠను చేసినవాడ వైనావు.
మూ. ప్లావయస్వ త్వమాత్మానం నరోత్తమ సదోచితే,
సలిలే పురుషవ్యాఘ్ర శుచిః పుణ్యఫలో భవ. 14
ప్ర. అ. నరోత్తమ = నరులలో ఉత్తముడా! పురుషవ్యాఘ్ర = పురుషశ్రేష్ఠుడా!, ఉచితే = తగిన, సలిలే = గంగాజలమునందు, సదా = ఎల్పప్పుడును, త్వమ్ = నీవు, ఆత్మానమ్ = నిన్ను, ప్లావయస్వ = ముంచుకొనుము. శుచిః = పవిత్రుడవై, పుణ్యఫలః = పుణ్య మైన ఫలముకలవాడవు, భవ = అగుము.
తా. నరోత్తముడ వైన భగీరథా! స్నానోచిత మైన ఈ గంగాజలమునందు నిత్యము స్నానము చేసి పవిత్రుడవై, పుణ్యాత్ముడవు అగుము.
మూ. పితామహానాం సర్వేషాం కురుష్వ సలిలక్రియామ్,
స్వస్తి తేఽస్తు గమిష్యామి స్వం లోకం గమ్యతాం నృప. 15
ప్ర. అ. సర్వేషామ్ = సమస్త మైన, పితామహానామ్ = పితామహులకు, సలిలక్రియామ్ = జలతర్పణమును, కురుష్వ = చేయుము. తే = నీకు, స్వస్తి = క్షేమమగుగాక. గమిష్యామి = నేను వెళ్లెదను, నృప = రాజా! స్వం లోకమ్ = నీ లోకమును గూర్చి, గమ్యతామ్ = వెళ్లెదవుగాక.
తా. రాజా! నీ పితామహు లందరికిని జలతర్పణము చేయుము. నీకు క్షేమ మగుగాక. నేను వెళ్లెదను. నీవు కూడ నీ లోకమునకు వెళ్లుము.
మూ. ఇత్యేవముక్త్వా దేవేశః సర్వలోకపితామహః,
యథాగతం తథాగచ్ఛద్దేవలోకం మహాయశాః. 16
ప్ర. అ. సర్వలోకపితామహః = సమస్తలోకములకును పితామహుడును, మహాయశాః = గొప్ప కీర్తి కలవాడును అగు, దేవేశః = దేవతలకు ప్రభు వైన బ్రహ్మదేవుడు, ఇత్యేవమ్ = ఈ విధముగా, ఉక్త్వా = పలికి, యథాగతం తథా = వచ్చిన విధముననే, దేవలోకమ్ = దేవలోకమును గూర్చి, అగచ్ఛత్ = వెళ్లెను.
తా. సమస్తలోకములకును పితామహు డైన ఆ బ్రహ్మదేవుడు ఈ విధముగ పలికి స్వర్గలోకమునకు మరలి వెళ్లెను.
మూ. భగీరథోఽపి రాజర్షిః కృత్వా సలిలముత్తమమ్,
యథాక్రమం యథాన్యాయం సాగరాణాం మహాయశాః. 17
కృతోదకః శుచీ రాజా స్వపురం వ్రవివేశ హ,
సమృద్ధార్థో రఘుశ్రేష్ఠ స్వరాజ్యం ప్రశశాస హ. 18
ప్ర. అ. రాజర్షిః = రాజర్షియు, మహాయశాః = గొప్ప కీర్తి కలవాడును, రాజా = రాజును అగు, భగీరథోఽపి = భగీరథుడు కూడ, యథాక్రమమ్ = క్రమానుసారముగాను, యథాన్యాయమ్ = న్యాయానుసారముగాను, సాగరాణామ్ = సగరపుత్రులకు, ఉత్తమమ్ = ఉత్తమ మైన, సలిలమ్ = ఉదకమును, కృత్వా = చేసి, కృతోదకః = పూర్తి చేయబడిన ఉదకక్రియ కలవాడై, శుచిః = పవిత్రుడై, స్వపురమ్ = తనపట్టణమును, ప్రవివేశ హ = ప్రవేశించెను. రఘుశ్రేష్ఠ = రామా! సమృద్ధార్థః = తీరిన కోరిక గలవాడై, స్వరాజ్యమ్ = తన రాజ్యమును, ప్రశశాస హ = పరిపాలించెను.
తా. రామా! గొప్ప కీర్తి గల భగీరథుడు సగరకుమారు లందరికిని క్రమానుసారముగా శాస్త్రము ననుసరించి జలతర్పణములు చేసి, పవిత్రుడై తన పురమును ప్రవేశించెను. ఈ విధముగ చరితార్థుడై తన రాజ్యమును పరిపాలించెను.
మూ. ప్రముమోద హ లోకస్తం నృపమాసాద్య రాఘవ,
నష్టశోకః సమృద్ధార్థో బభూవ విగతజ్వరః. 19
ప్ర. అ. రాఘవ = రామా!, తమ్ = ఆతనిని, నృపమ్ = రాజునుగా, ఆసాద్య = పొంది, లోకః = లోకము, ప్రముమోద = సంతోషించెను. (అతడు) సమృద్ధార్థః = తీరిన కోరిక గలవాడై, విగతజ్వరః = పోయిన మనస్తాపము గల వాడై, నష్టశోకః = నశించిన శోకము కలవాడు, బభూవ = ఆయెను.
తా. రామా! భగీరథుడు రాజుగా ఉండుటచే లోక మంతయు సంతోషించెను. భగీరథుడు కూడ కోరిక తీరుటచే శోకము, మనస్తాపము తొలగి సుఖముగా నుండెను.
మూ. ఏష తే రామ గఙ్గాయా విస్తరోఽభిహితో మయా,
స్వస్తి ప్రాప్నుహి భద్రం తే సన్ధ్యాకాలోఽతివర్తతే. 20
ప్ర. అ. రామ = రామా!, గఙ్గాయాః = గంగయొక్క, ఏషః = ఈ, విస్తరః = కథావిస్తరము, మయా = నాచేత, తే = నీకు, అభిహితః = చెప్పబడినది. స్వస్తి = మంగళమును, ప్రాప్నుహి = పొందుము, తే = నీకు, భద్రమ్ = క్షేమ మగుగాక. సన్ధ్యాకాలః = సంధ్యా సమయము, అతివర్తతే = దాటి పోవుచున్నది.
తా. రామా! గంగను గూర్చి విస్తృత మైన కథను చెప్పినాను, దీనిని వినుటచే మంగళమును పొందుము. నీకు క్షేమ మగుగాక. సంధ్యాకాలము దాటి పోవుచున్నది. ఇక సంధ్యావందనాదికము చేసికొందము.
మూ. ధన్యం యశస్యమాయుష్యం పుత్య్రం స్వర్గ్యమతీవ చ,
యః శ్రావయతి విప్రేషు క్షత్రియేష్వితరేషు చ, 21
ప్రీయన్తే పితరస్తస్య ప్రీయన్తే దైవతాని చ.
ప్ర. అ. ధన్యమ్ = ధనము నిచ్చునదియు, యశస్యమ్ = యశస్సును కలిగించునదియు, ఆయుష్యమ్ = ఆయుస్సును పెంచునదియు, పుత్య్రమ్ = పుత్రులను ఇచ్చునదియు, ఆతీవ = మిక్కిలి, స్వర్గ్యమ్ = స్వర్గమును చేర్చునదియు అగు ఈ ఉపాఖ్యానమును, యః = ఎవడు, విప్రేషు = బ్రాహ్మణులకును, క్షత్రియేషు = క్షత్రియులకును, ఇతరేషు చ = ఇతరులకును, శ్రావయతి = వినిపించునో, తస్య = వానియొక్క, పితరః = పితృదేవతలు, ప్రీయన్తే = సంతోషింతురు, దైవతాని చ = దేవతలు కూడ, ప్రీయన్తే = సంతోషింతురు.
తా. ఈ గంగావతరణవృత్తాంతము ఐశ్వర్యమును, యశస్సును, అయుర్దాయము ను, పుత్రులను, స్వర్గమును ఇచ్చును. దీనిని బ్రాహ్మణులకును, క్షత్రియులకును, ఇతరులకును వినిపించువాని విషయమున ఆతని పితృదేవతలును, దేవతలును సంతోషింతురు.
మూ. ఇదమాఖ్యానమవ్యగ్రో గఙ్గావతరణం శుభమ్, 22
యః శృణోతి చ కాకుత్థ్స సర్వాన్ కామానవాప్నుయాత్,
సర్వే పాపాః ప్రణశ్యన్తి ఆయుః కీర్తిశ్చ వర్ధతే. 23
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే చతుశ్చత్వారింశః సర్గః
ప్ర. అ. కాకుత్థ్స = రామా! ఇదమ్ = ఈ, శుభమ్ = శుభ మైన, గఙ్గావతరణమ్ = గంగావతరణ మనెడు, ఆఖ్యానమ్ = ఆఖ్యానమును, యః = ఎవడు, అవ్యగ్రః = ఏకాగ్రచిత్తు డై, శృణోతి = వినునో, అతడు, సర్వాన్ = సమస్త మైన, కామాన్ = కామములను, అవాప్నుయాత్ = పొందును. సర్వే = సమస్త మైన, పాపాః = పాపములు, ప్రణశ్యన్తి = నశించును. ఆయుః = ఆయుర్దాయము, కీర్తిశ్చ = కీర్తియు, వర్ధతే = వృద్ధి పొందును.
తా. రామా! పవిత్ర మైన ఈ గంగావతరణ కథను వినువాడు సమస్త కామములను పొందగలడు. అతని పాపము లన్నియు నశించును. ఆయుర్దాయము, కీర్తి వృద్ధి పొందును.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో నలుబది నాల్గవ సర్గ సమాప్తము.
