Chapter_45

Back
Book Balakandamu
Chapter No 51
Pages 11
Read Time 17 Minutes

Chapter_45

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ పఞ్చచత్వారింశః సర్గః

దేవతలును, దైత్యులును కలిసి క్షీరసాగరమును మథించుట, రుద్రుడు హాలాహలవిషమును భక్షించుట, విష్ణువు క్రిందికి దిగబడిన మందర పర్వతమును పాతాళమునుండి ఉద్ధరించుట, దానితో మరల సముద్రమును మథింపగా దాని నుండి ధన్వంతరి, అప్సరసలు, మద్యము, ఉచ్చైశ్శ్రవస్సు అను అశ్వము, కౌస్తుభము, అమృతము ఆవిర్భవించుట. దేవాసురుల మధ్య జరిగిన యుద్ధమునందు దైత్యులు మరణించుట.

మూ. విశ్వామిత్రవచః శ్రుత్వా రాఘవః సహ లక్ష్మణః,

విస్మయం పరమం గత్వా విశ్వామిత్రమథాబ్రవీత్. 1

ప్ర. అ. సహలక్ష్మణః = లక్ష్మణునితో కూడిన, రాఘవః = రాముడు, విశ్వామిత్రవచః = విశ్వామిత్రుని యొక్క వాక్యమును, శ్రుత్వా = విని, పరమమ్ = గొప్ప, విస్మయమ్ = ఆశ్చర్యమును, గత్వా = పొంది, అథ = పిమ్మట, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి, అబ్రవీత్ = పలికెను.

తా. లక్ష్మణసమేతు డైన రాముడు, విశ్వామిత్రుని మాటలను విని, చాల ఆశ్చర్యము చెంది ఆతనితో ఇట్లనెను.

మూ. అత్యద్భుతమిదం బ్రహ్మన్ కథితం పరమం త్వయా,

గఙ్గావతరణం పుణ్యం సాగరస్యాపి పూరణమ్. 2

ప్ర. అ. బ్రహ్మన్ = బ్రాహ్మణశ్రేష్ఠుడా!, త్వయా = నీచేత, కథితమ్ = చెప్పబడిన, పరమమ్ = గొప్ప దైన, ఇదమ్ = ఈ, గఙ్గావతరణమ్ = గంగయొక్క అవతరణము, పుణ్యమ్ = పుణ్య మైన, సాగరస్య = సముద్రముయొక్క, పూరణమ్ = నింపుటయు. అత్యద్భుతమ్ = చాల ఆశ్చర్యకర మైనది.

తా. ఓ బ్రహ్మర్షీ! నీవు చెప్పిన ఈ గొప్ప దైన గంగావతరణము, సాగరమును నింపుటయు చాల ఆశ్చర్యకరములు.

మూ. తస్య సా శర్వరీ సర్వా సహ సౌమిత్రిణా తదా,

జగామ చిన్తయానస్య విశ్వామిత్రకథాం శుభామ్. 3

ప్ర. అ. తదా = అప్పుడు, తస్య = ఆ రాముడు, సౌమిత్రిణా సహ = లక్ష్మణునితో, శుభామ్ = శుభ మైన, విశ్వామిత్రకథామ్ = విశ్వామిత్రుడు చెప్పిన కథను గూర్చి, చిన్తయానస్య = ముచ్చటించుచుండగా, సా = ఆ, సర్వా = సమస్త మైన, శర్వరీ = రాత్రి, గతా = కడచినది.

తా. విశ్వామిత్రుడు చెప్పిన కథను గూర్చి రామలక్ష్మణు లిరువురును ముచ్చటించు కొనుచుండగనే రాత్రి కడచిపోయినది.

మూ. తతః ప్రభాతే విమలే విశ్వామిత్రం మహామునిమ్,

ఉవాచ రాఘవో వాక్యం కృతాహ్నికమరిన్దమః. 4

ప్ర. అ. తతః = పిమ్మట, అరిన్దమః = శత్రువులను నశింపచేయు, రాఘవః = రాముడు, విమలే = స్వచ్ఛ మైన, ప్రభాతే = ప్రాతఃకాలమునందు, కృతాహ్నికమ్ = చేయబడిన ఆహ్నికకృత్యములు గల, మహామునిమ్ = మహాముని యైన, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి, వాక్యమ్ = వాక్యమును, ఉవాచ = పలికెను.

తా. అంతట, శత్రుసంహారదక్షు డగు రాముడు, ప్రశాంత మైన ప్రాతఃకాలమునందు, ఆహ్నికకృత్యము లన్నియు పూర్తి చేసికొని కూర్చున్న విశ్వామిత్రునితో ఇట్లనెను.

మూ. గతా భగవతీ రాత్రిః శ్రోతవ్యం పరమం శ్రుతమ్,

క్షణభూతేవ నౌ రాత్రిః సంవృత్తేయం మహాతపః. 5

ఇమాం చిన్తయతోః సర్వాం నిఖిలేన కథాం తవ.

ప్ర. అ. మహాతపః = గొప్ప తపస్సు కలవాడా!, పరమమ్ = గొప్ప దైన, శ్రోతవ్యమ్ = వినదగినది, శ్రుతమ్ = వినబడినది. భగవతీ = పూజ్యురాలైన, రాత్రిః = రాత్రి, గతా = కడచినది. తవ = నీయొక్క, ఇమామ్ = ఈ, సర్వామ్ = సమస్త మైన, కథామ్ = కథనుగూర్చి, చిన్తయతోః = ఆలోచించుచున్న, నౌ = మా ఇద్దరికిని, ఇయమ్ = ఈ, రాత్రిః = రాత్రి, క్షణభూతేవ = ఒక్క క్షణ మాత్రము వలె, సంవృత్తా = కడచిపోయినది.

తా. ఓ మహాతపఃశాలీ! వినదగిన గొప్ప ఉపాఖ్యానమును వింటిమి. పూజ్యురా లైన రాత్రి కడచినది. నీవు చెప్పిన ఈ కథ నంతను ఆలోచించుచుండగా, మా ఇద్దరికిని ఈ రాత్రి ఒక్క క్షణము వలె కడచిపోయినది.

మూ. తరామ సరితాం శ్రేష్ఠాం పుణ్యాం త్రిపథగాం నదీమ్, 6

నౌరేషా హి సుఖాస్తీర్ణా ఋషీణాం పుణ్యకర్మణామ్,

భగవన్తమిహ ప్రాప్తం జ్ఞాత్వా త్వరితమాగతా. 7

ప్ర. అ. సరితామ్ = నదులతో, శ్రేష్ఠామ్ = శ్రేష్ఠ మైన, పుణ్యామ్ = పుణ్య మైన, త్రిపథగామ్ = మూడు మార్గములలో ప్రవహించు, నదీమ్ = గంగానదిని, తరామ = దాటుదము. సుఖాస్తీర్ణా = సుఖముగా కప్పబడిన, పుణ్యకర్మణామ్ = పుణ్యకర్మ గల, ఋషీణామ్ = ఋషులయొక్క, ఏషా = ఈ, నౌః = నావ, భగవన్తమ్ = పూజ్యుడవైన నిన్ను, ఇహ = ఇచటికి, ప్రాప్తమ్ = వచ్చిన వానినిగా, జ్ఞాత్వా = తెలిసికొని, త్వరితమ్ = శీఘ్రముగా, ఆగతా హి = వచ్చియున్నది కదా.

తా. నదులలో శ్రేష్ఠ మైన, పుణ్య మైన, ఈ గంగానదిని దాటుదము. నీవు ఇచటికి వచ్చినట్లు తెలియగనే, ఈ పుణ్యాత్ము లైన ఋషీశ్వరుల నావను, చక్కగా మెత్తని చాప మొదలైనవాటిచే కప్పి తీసికొని వచ్చినారు.

మూ. తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః,

సంతారం కారయామాస సర్షిసంఘః సరాఘవః. 8

ప్ర. అ. తస్య = ఆ, మహాత్మనః = మహాత్ముడై, రాఘవస్య = రాముని యొక్క, తత్ = ఆ, వచనమ్ = వచనమును, శ్రుత్వా = విని, సర్షిసంఘః = ఋషిసంఘముతో కూడినవాడై, సరాఘవః = రామలక్ష్మణులతో కూడినవాడై, సంతారం = దాటుటను, కారయామాస = చేయించెను.

తా. విశ్వామిత్రుడు మహాత్ముడైన రాముని మాటలు విని ఋషులతోను, రామలక్ష్మణులతోను తాను నదిని దాటుటకు ఏర్పాటు చేయించెను.

మూ. ఉత్తరం తీరమాసాద్య సంపూజ్యర్షిగణం తదా,

గఙ్గాకూలే నివిష్టాస్తే విశాలాం దదృశుః పురీమ్. 9

ప్ర. అ. ఉత్తరం తీరమ్ = ఉత్తరమున నున్న ఒడ్డును, ఆసాద్య = పొంది, తదా = అప్పుడు, ఋషిగణమ్ = ఋషిసముదాయమును, సంపూజ్య = పూజించి, గఙ్గా కూలే = గంగా తీరమునందు, నివిష్టాః = విడిదిచేసియున్న, తే = వారు, విశాలాం పురీమ్ = విశాల అను పురమును, దదృశుః = చూచిరి.

తా. ఉత్తరతీరమును చేరి, నావచే తమను దాటించిన ఋషులను పూజించి గంగాకూలమున విడిసి యున్న వారు విశాలానగరమును చూచిరి.

మూ. తతో మునివరస్తూర్ణం జగామ సహ రాఘవః,

విశాలాం నగరీం రమ్యాం దివ్యాం స్వర్గోపమాం తతా. 10

ప్ర. అ. తతః = పిమ్మట, మునివరః = మహాముని, సహ రాఘవః = రామలక్ష్మణులతో కూడినవాడై, తదా = అప్పుడు, రమ్యామ్ = సుందర మైనదియు, దివ్యామ్ = ప్రకాశించు చున్నదియు, స్వర్గోపమామ్ = స్వర్గముతో సమాన మైనదియు అగు, విశాలానగరీమ్ = విశాల యనెడు నగరమును గూర్చి, తూర్ణమ్ = శీఘ్రముగా, జగామ = వెళ్లెను.

తా. పిమ్మట, విశ్వామిత్రుడు, రామలక్ష్మణసమేతుడై, రమ్యము, దివ్యము, స్వర్గతుల్యము అగు విశాలానగరమునకు శీఘ్రముగ వెళ్లెను.

మూ. అథ రామో మహాప్రాజ్ఞో విశ్వామిత్రం మహామునిమ్,

పప్రచ్ఛ ప్రాఞ్జలిర్భూత్వా విశాలాముత్తమాం పురీమ్. 11

ప్ర. అ. అథ = పిమ్మట, మహాప్రాజ్ఞః = గొప్ప బుద్ధిమంతుడైన, రామః = రాముడు, ప్రాఞ్జలిః = కట్టబడిన దోలిసికలవాడు, భూత్వా = అయి, మహామునిమ్ = మహాముని యైన, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని, ఉత్తమామ్ = ఉత్తమమైన, విశాలాం పురీమ్ = విశాలానగరమునుగూర్చి, పప్రచ్ఛ = అడిగెను.

తా. మహాబుద్ధిశాలి యగు రాముడు విశాలానగరమును గూర్చి విశ్వామిత్రుని సవినయముగ ప్రశ్నించెను.

మూ. కతరో రాజవంశోఽయం విశాలాయాం మహామునే,

శ్రోతుమిచ్ఛామి భద్రం తే పరం కౌతూహలం హి మే. 12

ప్ర. అ. మహామునే = ఓ మహామునీ!, విశాలాయామ్ = ఈ విశాలానగరమునందు, అయమ్ = ఈ, రాజవంశః = రాజవంశము, కతరః = ఏది ? శ్రోతుమ్ = వినుటకు, ఇచ్ఛామి = ఇచ్ఛయించుచున్నాను, తే = నీకు, భద్రమ్ = మంగళ మగుగాక, మే = నాకు, పరమ్ = గొప్ప, కౌతూహలం హి = ఆసక్తి ఉన్నది కదా.

తా. మహామునీ! ఇపుడు ఈ విశాలానగరమును ఏ రాజవంశమునకు చెందిన వారు పాలించుచున్నారో వినగోరుచున్నాను. నాకు చాల విన వేడుకగా ఉన్నది. నీకు మంగళ మగుగాక.

మూ. తస్య తద్వచనం శ్రుత్వా రామస్య మునిపుఙ్గవః,

ఆఖ్యాతుం తత్సమారేభే విశాలస్య పురాతనమ్. 13

ప్ర. అ. మునిపుఙ్గవః = మునిశ్రేష్ఠుడు, తస్య = ఆ, రామస్య = రామునియొక్క, తత్ = ఆ, వచనమ్ = వచనమును, శ్రుత్వా = విని, విశాలస్య = విశాలనగరముయొక్క, పురాతనమ్ = ప్రాచీన మైన, తత్ = ఆ ఆఖ్యానమును, ఆఖ్యాతుమ్ = చెప్పుటకు, సమారేభే = ప్రారంభించెను.

తా. విశ్వామిత్రుడు రాముని వచనము విని ప్రాచీన మైన విశాలపుర వృత్తాంతమును చెప్పుటకు ప్రారంభించెను.

మూ. శ్రూయతాం రామ శక్రస్య కథాం కథయతః శుభామ్,

అస్మిన్ దేశే తు యద్వృత్తం తదపి శృణు రాఘవ. 14

ప్ర. అ. రాఘవ = రామా! శక్రస్య = దేవేంద్రునియొక్క, శుభామ్ = శుబమైన కథామ్ = కథను, కథయతః = చెప్పుచున్న నానుండి, శ్రూయతామ్ = వినబడుగాక, అస్మిన్ దేశే = ఈ దేశమునందు, యత్ = ఏది, వృత్తమ్ = జరిగినదో, తదపి = దానిని కూడ, శృణు = వినుము.

తా. రామా! శుభ మైన దేవేంద్రుని కథ చెప్పెదను, వినుము. ఈ ప్రదేశములో ఏమి జరిగినదో వినుము.

మూ. పూర్వం కృతయుగే రామ దితేః పుత్రా మహాబలాః,

అదితేశ్చ మహాభాగ వీర్యవన్తః సుధార్మికాః. 15

ప్ర. అ. మహాభాగ = మహాభాగ్యవంతుడా! రామ = రామా!, పూర్వమ్ = పూర్వము, కృతయుగే = కృతయుగమునందు, దితేః = దితియొక్క, పుత్రాః = పుత్రులును, అదితేశ్చ = అదితియొక్క పుత్రులును, మహాబలాః = గొప్ప బలము కలవారుగను, వీర్యవన్తః = వీర్యవంతులుగను, సుధార్మికాః = చాల ధార్మికులుగను, ఉండెడివారు.

తా. మహాభాగ్యశాలి వగు రామా! పూర్వము కృతయుగమునందు దితిపుత్రులును, అదితిపుత్రులును మహాబలవంతులైన, వీర్యవంతులై, పరమధార్మికులై ఉండెడివారు.

మూ. తతస్తేషాం నరశ్రేష్ఠ బుద్ధిరాసీన్మహాత్మనామ్,

అమరా అజరాశ్చైవ కథం స్యామ నిరామయాః. 16

ప్ర. అ. తతః = పిమ్మట, నరశ్రేష్ఠ = ఓ నరశ్రేష్ఠుడా!, మహాత్మనామ్ = మహాత్ము లైన, తేషామ్ = వారికి, అజరాః = ముసలితనము లేనివారమై, అమరాశ్చైవ = మరణము లేనివారమై, నిరామయాః = రోగములు లేనివారము, కథమ్ = ఎట్లు, స్యామ = అగుదుము అని, బుద్ధిః = బుద్ధి, ఆసీత్ = ఆయెను.

తా. నరశ్రేష్ఠుడ వైన రామా! ‘‘మనకు ముసలితనము, మరణము, రోగములు లేకుండ ఉండవలెను. ఇందుకు ఉపాయ మేమి’’ అని ఆ మహాత్ములు ఆలోచింపసాగిరి.

మూ. తేషాం చిన్తయతాం రామ బుద్ధిరాసీన్మహాత్మనామ్,

క్షీరోదమథనం కృత్వా రసం ప్రాప్స్యామ తత్ర వై. 17

ప్ర. అ. రామ = రామా!, చిన్తయతామ్ = ఈ విధముగా ఆలోచించుచున్న, తేషామ్ = ఆ, మహాత్మనామ్ = మహాత్ములకు, బుద్ధిః = బుద్ధి, ఆసీత్ = కలిగెను. క్షీరోదమథనమ్ = క్షీర సముద్రమథనమును, కృత్వా = చేసి, తత్ర = దానియందు, రసమ్ = అమృతమును, ప్రాప్స్యామ = పొందెదము.

తా. ఈ విధముగ ఆలోచింపగా ఆలోచింపగా, వారికి, ‘‘మనము క్షీర సముద్రమును మథించి, అచట అమృతమును పొందెదము’’ అను అభిప్రాయము కలిగినది.

మూ. తతో నిశ్చిత్య మథనం యోక్త్రం కృత్వా చ వాసుకిమ్,

మన్థానం మన్దరం కృత్వా మమన్థురమితౌజసః. 18

ప్ర. అ. తతః = పిమ్మట, అమితౌజసః = గొప్ప తేజస్సు గల ఆ దైత్యాదిత్యులు, మథనమ్ = మథించుటను, నిశ్చిత్య = నిశ్చయించి, వాసుకిమ్ = వాసుకిని, యోక్త్రమ్ = త్రాడునుగా, కృత్వా = చేసి, మన్దరమ్ = మందర పర్వతమును, మన్థానమ్ = కవ్వమునుగా, కృత్వా = చేసి, మమన్థుః = మథించిరి.

తా. పిమ్మట, అమిత మైన తేజస్సు గల వారందరును మథనము చేయ వలె నని నిశ్చయించి, వాసుకిని త్రాడుగా చేసి, మందరపర్వతమును కవ్వముగా చేసి మథింపసాగిరి.

మూ. అథ వర్షసహస్రేణ యోక్త్రసర్పశిరాంసి చ,

వమన్త్యతివిషం తత్ర దదంశుర్దశనైః శిలాః. 19

ప్ర. అ. అథ = పిమ్మట, వర్షసహస్రేణ = వేయి సంవత్సరములకు, యోక్త్రసర్పశిరాంసి = త్రాడుగా ఉన్న సర్పముయొక్క శిరస్సులు, తత్ర = అచట, అతివిషమ్ = అధిక మైన విషమును, వమన్తి = కక్కుచున్నవి. శిలాః = శిలలను, దశనైః = దంతములచేత, దదంశుః = కరచినవి.

తా. పిమ్మట వేయి సంవత్సరములు గడచినవి. అపుడు త్రాడుగా ఉన్న వాసుకి శిరస్సులు విషమును కక్కుచు దంతములచే శిలలను కరవ ప్రారంభించినవి.

మూ. ఉత్పపాతాగ్నిసంకాశం హాలాహలమహావిషమ్,

తేన దగ్ధం జగత్సర్వం సదేవాసురమానుషమ్. 20

ప్ర. అ. అగ్నిసంకాశమ్ = అగ్నితో సమానమైన, హాలాహలమహావిషమ్ = హాలాహల మనెడు మహావిషము, ఉత్పపాత = బయలుదేరెను. తేన = దానిచేత, సదేవాసురమానుషమ్ = దేవాసురమనుష్యసహిత మైన, సర్వం జగత్ = జగత్తు అంతయు, దగ్ధమ్ = కాల్చబడినది.

తా. అగ్నితో సమాన మైన హాలాహలమహావిషము బయలుదేరి దేవాసుర మనుష్యసహితముగా జగత్తు నంతను కాల్చివేయ మొదలిడినది.

మూ. అథ దేవా మహాదేవం శఙ్కరం శరణార్థినః,

జగ్ముః పశుపతిం రుద్రం త్రాహి త్రాహీతి తుష్టువుః. 21

ప్ర. అ. అథ = పిమ్మట, దేవాః = దేవతలు, శరణార్థినః = శరణము కోరుచు, మహాదేవమ్ = గొప్ప దేవుడును, శంకరమ్ = సుఖమును కలిగించువాడును, పశుపతిమ్ = సమస్తజీవులకు ప్రభువైనవాడును అగు, రుద్రమ్ = రుద్రుని గూర్చి, జగ్ముః = వెళ్లిరి. త్రాహి త్రాహి = రక్షింపుము రక్షింపుము, ఇతి = అని, తుష్టువుః = స్తుతించిరి.

తా. అంత దేవత లందరును శరణువేడుచు మహాదేవుడును, సర్వజీవులకు పతియు అగు శంకరుని దగ్గరకు వెళ్లి ‘‘రక్షింపుము రక్షింపుము’’ అని పల్కుచు స్తుతించిరి.

మూ. ఏవముక్తస్తతో దేవైర్దేవదేవేశ్వరః ప్రభుః,

ప్రాదురాసీత్తతోఽత్రైవ శంఖచక్రధరో హరిః. 22

ప్ర. అ. తతః = పిమ్మట, ప్రభుః = ప్రభు వైన, దేవదేవేశ్వరః = దేవదేవేశ్వరుడు, దేవైః = దేవతలచేత, ఏవమ్ = ఈ విధముగ, ఉక్తః = పలకబడెను. తతః = పిమ్మట, శంఖచక్రధరః = శంఖచక్రములను ధరించిన, హరిః = విష్ణువు, అత్రైవ = ఇచటనే, ప్రాదురాసీత్ = ప్రత్యక్ష మాయెను.

తా. దేవత లందరును సర్వరక్షణసమర్థు డగు ఆ దేవదేవేశ్వరునితో ఈ విధముగ పలికిరి. ఇంతలో శంఖచక్రధారి యైన హరి అచటనే ప్రత్యక్ష మాయెను.

మూ. ఉవాచైనం స్మితం కృత్వా రుద్రం శూలభృతం హరిః,

దైవతైర్మథ్యమానే తు యత్పూర్వం సముపస్థితమ్. 23

త్వదీయం హి సురశ్రేష్ఠ సురాణామగ్రజోఽసి యత్,

అగ్రపూజామిమాం మత్వా గృహాణేదం విషం ప్రభో. 24

ప్ర. అ. హరిః = విష్ణుమూర్తి, స్మితం కృత్వా = చిరునవ్వు నవ్వి, శూలభృతమ్ = శూలమును ధరించిన, ఏనమ్ = ఈ, రుద్రమ్ = రుద్రుని గూర్చి, ఉవాచ = పలికెను. సురశ్రేష్ఠ = దేవతలలో శ్రేష్ఠుడా!, దైవతైః = దేవతలచేత, మథ్యమానే = మథనము చేయబడుచుండగా, యత్ = ఏది, పూర్వమ్ = ముందుగా, సముపస్థితమ్ = వచ్చినదో, అది, త్వదీయం హి = నీది కదా. యత్ = ఏ కారణమువలన, సురాణామ్ = దేవతలలో, అగ్రజః = ముందు పుట్టినవాడవుగా, అసి = అయి ఉన్నావో ప్రభో = ఓ సమర్థుడా! ఇమామ్ = దీనిని, అగ్రపూజామ్ = అగ్రపూజనుగా, మత్వా = తలచి, ఇదమ్ = ఈ, విషమ్ = విషమును, గృహాణ = గ్రహించుము.

తా. హరి చిరునవ్వు నవ్వుచు, శూలపాణి యైన శివునితో ఇట్లనెను. ‘‘ఓ సురశ్రేష్ఠుడా! నీవు దేవత లందరికన్నను ముందు పుట్టినవాడవు. అందుచేత దేవతలు మథించు చున్నపుడు ముందుగ పుట్టినది నీకే చెందవలెను. కావున, ఓ సమర్థుడా! దీనిని అగ్రపూజగా ఎంచి ఈ విషమును గ్రహింపుము.’’

మూ. ఇత్యుక్వ్తా చ సురశ్రేష్ఠస్తత్రైవాన్తరధీయత,

దేవతానాం భయం దృష్ట్వా శ్రుత్వా వాక్యం తు శార్ఙ్గిణః,

హాలాహలవిషం ఘోరం స జగ్రాహామృతోపమమ్. 25

ప్ర. అ. సురశ్రేష్ఠః = దేవతాశ్రేష్ఠు డైన విష్ణువు, ఇతి = ఈ విధముగా, ఉక్త్వా = పలికి, తత్రైవ = అచటనే, అన్తరధీయత = అంతర్ధానము చెందెను. సః = ఆ శివుడు, దేవతానామ్ = దేవతలయొక్క, భయమ్ = భయమును, దృష్ట్వా = చూచి, శార్ఙ్గిణః = విష్ణువుయొక్క, వాక్యమ్ = వాక్యమును, శ్రుత్వా = విని, ఘోరమ్ = భయంకరమైన, హాలాహలవిషమ్ = హాలాహలవిషమును, అమృతోపమమ్ = అమృతతుల్యమునుగా, జగ్రాహ = గ్రహించెను.

తా. విష్ణువు ఈ విధముగా పలికి అచటనే అంతర్ధానము చెందెను. శివుడు దేవతలకు కలిగిన భయమును చూచి, విష్ణువు చెప్పిన ప్రకారము, ఘోర మైన ఆ హాలాహలమును అమృతమును వలె గ్రహించెను.

మూ. దేవాన్విసృజ్య దేవేశో జగామ భగవాన్ హరః,

తతో దేవాసురాస్సర్వే మమన్థూ రఘునన్దన. 26

ప్ర. అ. దేవేశః = దేవతాప్రభు వైన, భగవాన్ = భగవంతు డైన, హరః = శివుడు, దేవాన్ = దేవతలను, విసృజ్య = విడచి, జగామ = వెళ్లెను. రఘునన్ధన = రామా!, తతః = పిమ్మట, సర్వే = సమస్త మైన, దేవాసురాః = దేవతలును అసురులును, మమన్థుః = మథించిరి.

తా. రామా! దేవాధిపతియు, భగవంతుడును అయిన శివుడు, దేవతలను వీడ్కొని వెళ్లిపోగా దేవాసురు లందరును మరల మథింపమొదలిడిరి.

మూ. ప్రవివేశాథ పాతాళం మన్థానః పర్వతోఽనఘ,

తతో దేవాః సగన్ధర్వాస్తుష్టువుర్మధుసూదనమ్. 27

ప్ర. అ. అనఘ = దోషములు లేనివాడా!, అథ = పిమ్మట, మన్థానః పర్వతః = కవ్వముగా ఉన్న పర్వతము, పాతాళమ్ = పాతాళమును, ప్రవివేశ = ప్రవేశించెను. తతః = పిమ్మట, సగన్ధర్వాః = గంధర్వులతో కూడిన, దేవాః = దేవతలు, మధుసూదనమ్ = విష్ణువును, తుష్టువుః = స్తుతించిరి.

తా. ఎట్టి దోషములును లేని ఓ రామా! కవ్వముగా ఉన్న ఆ పర్వతము పాతాళమును ప్రవేశించెను. పిమ్మట దేవతలును, గంధర్వులును విష్ణువును స్తుతించిరి.

మూ. త్వం గతిః సర్వభూతానాం విశేషేణ దివౌకసామ్,

పాలయాస్మాన్మహాబాహో గిరిముద్ధర్తుమర్హసి. 28

ప్ర. అ. మహాబాహో = గొప్ప బాహువులు కలవాడా!, త్వమ్ = నీవు, సర్వభూతానామ్ = అన్ని భూతములకును, గతిః = గతివి. విశేషేణ = ప్రధానముగా, దివౌకసామ్ = దేవతలకు గతివి. అస్మాన్ = మమ్ములను, పాలయ = పాలించుము. గిరిమ్ = పర్వతమును, ఉద్ధర్తుమ్ = ఎత్తుటకు, అర్హసి = తగియున్నావు.

తా. ఓ మహాబాహూ! నీవే సర్వభూతములకును గతి యైనవాడవు. ప్రధానముగ దేవతలకు నీవే గతి. పర్వతము నెత్తి మమ్ము రక్షింపుము.

మూ. ఇతి శ్రుత్వా హృషీకేశః కామఠం రూపమాస్థితః,

పర్వతం పృష్ఠతః కృత్వా శిశ్యే తత్రోదధౌ హరిః. 29

ప్ర. అ. హృషీకేశః = ఇంద్రియములకు అధిపతి యైన (ప్రవర్తకు డైన), హరిః = విష్ణువు, ఇతి = ఈ వాక్యమును, శ్రుత్వా = విని, కామఠం రూపమ్ = తాబేలు రూపమును, ఆస్థితః = ధరించినవాడై, పర్వతమ్ = పర్వతమును, పృష్ఠతః = వీపుపై, కృత్వా = ఉంచి, తత్ర = అచట, ఉదధౌ = సముద్రమునందు, శిశ్యే = శయనించెను.

తా. ఇంద్రియములకు శక్తిని కూర్చువా డగు హరి ఈ వాక్యమును విని, కూర్మ రూపమును ధరించి, ఆ పర్వతమును వీపుపై మోయుచు సముద్రములో శయనించెను.

మూ. పర్వతాగ్రే తు లోకాత్మా హస్తేనాక్రమ్య కేశవః,

దేవానాం మధ్యతః స్థిత్వా మమన్థ పురుషోత్తమః. 30

ప్ర. అ. లోకాత్మా = సకలలోకస్వరూపుడైన, పురుషోత్తమః = పురుషులలో ఉత్తముడైన, కేశవః = విష్ణువు, దేవానామ్ = దేవతలయొక్క, మధ్యతః = మధ్యయందు, స్థిత్వా = ఉండి, పర్వతాగ్రే = పర్వతముయొక్క అగ్రమునందు, హస్తేన = హస్తముచేత, ఆక్రమ్య = ఆక్రమించి, మమన్ధ = మథించెను.

తా. సకలలోకాత్ముడును, పురుషోత్తముడును అగు ఆ కేశవుడు, తాను దేవతల మధ్య కూడ నిలచి, పర్వతాగ్రమును ఆన్చి పట్టుకొని మథించెను.

మూ. అథ వర్షసహస్రేణ సదణ్డః సకమణ్డలుః,

పూర్వం ధన్వన్తరిర్నామ అప్సరాశ్చ సువర్చసః. 31

ప్ర. అ. అథ = పిమ్మట, వర్షసహస్రేణ = వేయి సంవత్సరముల తరువాత, సదణ్డః = దండముతో కూడినవాడును, సకమణ్డలుః = కమండలువుతో కూడినవాడును అగు, ధన్వన్తరిర్నామ = ధన్వంతరి అను నతడును, సువర్చసః = మంచి తేజస్సు గల, అప్సరాశ్చ = అప్సరలును, పూర్వమ్ = ముందుగా, (బైటకు వచ్చిరి).

తా. ఈ విధముగా వేయి సంవత్సరములు కడచినవి. అంతట ముందుగా, దండక మండలువులతో కూడిన ధన్వంతరియు, మంచి కాంతి గల అప్సరఃస్త్రీలును బైటకు వచ్చిరి.

మూ. అప్సు నిర్మథనాదేవ రసాత్తస్మాద్వరస్త్రియః,

ఉత్పేతుర్మనుజశ్రేష్ఠ తస్మాదప్సరసోఽభవన్. 32

ప్ర. అ. మనుజశ్రేష్ఠ = మనుష్యులలో శ్రేష్ఠుడ వైన రామా!, అప్సు = ఉదకమునందు, నిర్మథనాత్ = మథించుటవలన, తస్మాత్ = ఆ, రసాత్ = రసమునుండి, వరస్త్రియః = ఉత్తమ మైన స్త్రీలు, ఉత్పేతుః = బయలువెడలిరి. తస్మాత్ = ఆ కారణమువలన, అప్సరసః = అప్సరసలుగా, అభవన్ = అయిరి.

తా. మనుజశ్రేష్ఠుడ వైన రామా! జలమును మథింపగా ఆ రసమునుండి ఆవిర్భవించుటచే ఆ స్త్రీలకు అప్సరస లను పేరు వచ్చినది.

మూ. షష్టిః కోట్యోఽభవంస్తాసామప్సరాణాం సువర్చసామ్,

అసంఖ్యేయాస్తు కాకుత్స్థ యాస్తాసాం పరిచారికాః. 33

ప్ర. అ. కాకుత్థ్స = రామా!, సువర్చసామ్ = మంచి కాంతి గల, తాసామ్ = ఆ, అప్సరాణామ్ = అప్సరస్త్రీల, షష్టిః కోట్యః = అరువది కోట్లు, అభవన్ = అయిరి. తాసామ్ = వారియొక్క, యాః = ఏ, పరిచారికాః = పరిచారికలు గలరో వారు, అసంఖ్యేయాః = లెక్కింప శక్యము కానివారు.

తా. రామా! మంచి కాంతి గల అరువది కోట్లమంది అప్సరస్త్రీలు పుట్టిరి. వారికి లెక్కింప శక్యము కాని పరిచారిక లుండిరి.

మూ. న తాః స్మ పరిగృహ్ణన్తి సర్వే తే దేవదానవాః,

అప్రతిగ్రహణాత్తాశ్చ సర్వాః సాధారణాః స్మృతాః. 34

ప్ర. అ. సర్వే = సమస్త మైన, తే = ఆ, దేవదానవాః = దేవదానవులు, తాః = ఆస్త్రీలను, న పరిగృహ్ణన్తి స్మ = వివాహమాడ రైరి. అప్రతిగ్రహణాత్ = వివాహమాడక పోవుటవలన, తాః = ఆ, సర్వాః = అందరును, సాధారణాః = సాధారణ స్త్రీలుగా, స్మృతాః = చెప్పబడిరి.

తా. దేవదానవులలో ఎవ్వరును ఆ అప్సరసలను వివాహమాడ లేదు. అందుచే ఆ అప్సరసలు అందరకి సాధారణ (వేశ్యలు) లని చెప్పబడు చున్నారు.

మూ. వరుణస్య తతః కన్యా వారుణీ రఘునన్దన,

ఉత్పపాత మహాభాగా మార్గమాణా పరిగ్రహమ్. 35

ప్ర. అ. రఘునన్దన = రామా!, తతః = పిమ్మట, వరుణస్య = వరుణునియొక్క, కన్యా = కన్య అయిన, మహాభాగా = గొప్పభాగ్యము గల, వారుణి = వారుణి (మదిర), పరిగ్రహమ్ = స్వీకారమును, మార్గమాణా = అన్వేషించుచు, ఉత్పపాత = బైటకువచ్చెను.

తా. రామా! పిమ్మట వరుణుని కూతురును, మహాభాగ్యవతియు అగు వారుణి (మద్యదేవత) తనను ఎవరు స్వీకరించెదరా అని వెదుకుకొనుచు బైటకు వచ్చెను.

మూ. దితేః పుత్రా న తాం రామ జగృహుర్వరుణాత్మజామ్,

అదితేస్తు సుతా వీర జగృహుస్తామనిన్దితామ్. 36

ప్ర. అ. రామ = రామా!, తామ్ = ఆ, వరుణాత్మజామ్ = వారుణిని, దితేః = దితియొక్క, పుత్రాః = పుత్రులు, న జగృహుః = స్వీకరించలేదు, వీర = ఓ వీరుడా!, అనిన్దితామ్ = దోషరహిత యైన, తామ్ = ఆమెను, అదితేః = అదితియొక్క, సుతాః తు = కుమారు లైతే, జగృహుః = గ్రహించిరి.

తా. వీరుడ వైన రామా! ఆ వారుణిని దైత్యులు స్వీకరించలేదు. కాని అనిందిత యగు ఆమెను అదితిపుత్రులు స్వీకరించిరి.

మూ. అసురాస్తేన దైతేయాః సురాస్తేనాదితేః సుతాః,

హృష్టాః ప్రముదితాశ్చాసన్ వారుణీగ్రహణాత్ సురాః. 37

ప్ర. అ. తేన = ఆ కారణముచేత, దైతేయాః = దితికుమారులు, అసురాః = అసురులు (సుర = మద్యము, లేనివారు) అయినారు. అదితేః = అదితియొక్క, సుతాః = కుమారులు, సురాః = సురు లైనారు, సురాః = దేవతలు, వారుణీగ్రహణాత్ = వారుణిని స్వీకరించుటవలన, హృష్టాః = సంతసించినవారుగను, ఆసన్ = అయిరి.

తా. సురను గ్రహింపకపోవుటచే దైత్యులు అసురులైనారు; గ్రహించుటచే దేవతలు సురులైనారు. వారుణిని గ్రహించి సురులు సంతసించిరి; చాల ఆనందించిరి.

మూ. ఉచ్చెఃశ్రవా హయశ్రేష్ఠో మణిరత్నం చ కౌస్తుభమ్,

ఉదతిష్ఠన్నరశ్రేష్ఠ తథైవామృతముత్తమమ్. 38

ప్ర. అ. నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా!, ఉచ్చైఃశ్రవాః = ఉచ్చెఃశ్రవమను, హయశ్రేష్ఠః = శ్రేష్ఠ మైన అశ్వము, కౌస్తుభమ్ = కౌస్తుభ మనెడు, మణిరత్నం చ = శ్రేష్ఠ మైన మాణిక్యము, తథైవ = మరియు, ఉత్తమమ్ = ఉత్తమమైన, అమృతమ్ = అమృతము, ఉదతిష్ఠన్ = బైటకు వచ్చినవి.

తా. రామా! ఉచ్చైఃశ్రవ మనెడు శ్రేష్ఠ మైన అశ్వము, కౌస్తుభ మనెడు శ్రేష్ఠ మైన మాణిక్యము, ఉత్తమ మైన అమృతము కూడ బైటకు వచ్చినవి.

మూ. అథ తస్య కృతే రామ మహానాసీత్కులక్షయః,

అదితేస్తు తతః పుత్రా దితేః పుత్రానసూదయన్. 39

ప్ర. అ. రామ = రామా!, అథ = పిమ్మట, తస్య కృతే = ఆ అమృతము కొరకై, మహాన్ = గొప్ప, కులక్షయః = కులక్షయము, ఆసీత్ = ఆయెను. తతః = పిమ్మట, అదితేః పుత్రాః = దేవతలు, దితేః పుత్రాన్ = దైత్యులను, అసూదయన్ = నశింపచేసిరి.

తా. రామా! ఆ అమృతముకొరకై గొప్ప కులక్షయము జరిగినది. దేవతలు దైత్యులను చంపివేసిరి.

మూ. ఏకతోఽభ్యాగమన్ సర్వే హ్యసురా రాక్షసైః సహ,

యుద్ధమాసీన్మహాఘోరం వీర త్రైలోక్యమోహనమ్. 40

ప్ర. అ. వీర = ఓ వీరుడా! సర్వే = సమస్త మైన, అసురాః = దైత్యులు, రాక్షసైః సహ = రాక్షసులతో కూడ, ఏకతః = ఒకవైపు, అభ్యాగమన్ = చేరిరి. త్రైలోక్య మోహనమ్ = మూడు లోకములను మోహపెట్టు, మహాఘోరమ్ = చాల భయంకరమైన, యుద్ధమ్ = యుద్ధము, ఆసీత్ = అయెను.

తా. దైత్యు లందరును, రాక్షసులును ఒక పక్షముగా చేరిరి. మూడు లోకములకు విభ్రాంతి కలిగించు అతిఘోర మైన యుద్ధము జరిగెను.

మూ. యదా క్షయం గతం సర్వం తదా విష్ణుర్మహాబలః,

అమృతం సోఽహరత్తూర్ణం మాయామాస్థాయ మోహినీమ్. 41

ప్ర. అ. యదా = ఎప్పుడు, సర్వమ్ = అంతయును, క్షయం గతమ్ = క్షయమును పొందినదో, తదా = అప్పుడు, మహాబలః = గొప్ప బలము గల, సః విష్ణుః = ఆ విష్ణువు, మోహినీమ్ = మోహినీరూప మగు, మాయామ్ = మాయను, ఆస్థాయ = అవలంబించి, తూర్ణమ్ = శీఘ్రముగా, అమృతమ్ = అమృతమును, అహరత్ = హరించెను.

తా. అంతయు క్షయ మైన తరువాత మహాబలు డైన విష్ణువు మాయా మోహినీరూపము ధరించి, శీఘ్రముగా అమృతమును హరించెను.

మూ. యే గతాభిముఖం విష్ణుమక్షయం పురుషోత్తమమ్,

సంపిష్టాస్తే తదా యుద్ధే విష్ణునా ప్రభవిష్ణునా. 42

ప్ర. అ. అక్షయమ్ = నాశరహితుడును, పురుషోత్తమమ్ = పురుషశ్రేష్ఠుడును అయిన, విష్ణుమ్ = విష్ణువునుగూర్చి, యే = ఏ దైత్యులు, యుద్ధే = యుద్ధమునందు, అభిముఖమ్ = ఎదురుగా, గతాః = వెళ్లినారో, తే = వారు, ప్రభవిష్ణునా = సమర్థు డైన, విష్ణునా = విష్ణువు చేత, సంపిష్టాః = నలిపివేయబడిరి.

తా. కొందరు దైత్యులు నాశరహితుడును, పురుషోత్తముడును అయిన విష్ణువును యుద్ధములో ఎదిరించగా వారి నందరిని సమర్థు డైన విష్ణువు సంహరించెను.

మూ. అదితేరాత్మజా వీరా దితేః పుత్రాన్నిజఘ్నిరే,

తస్మిన్ ఘోరే మహాయుద్ధే దైతేయాదిత్యయోర్భృశమ్. 43

ప్ర. అ. దైతేయాదిత్యయోః = దైత్యులయొక్క దేవతలయొక్క, తస్మిన్ = ఆ, ఘోరే = భయంకరమైన, మహాయుద్ధే = మహాయుద్ధమునందు, వీరాః = వీరు లైన, అదితేః ఆత్మజాః = అదితికుమారు లైన దేవతలు, దితేః పుత్రాన్ = దితికుమారులను, నిజఘ్నిరే = చంపిరి.

తా. దైత్యులకును దేవతలకు జరిగిన ఆ ఘోరసంగ్రామమునందు వీరు లైన దేవతలు దైత్యులను చంపిరి.

మూ. నిహత్య దితిపుత్రాంశ్చ రాజ్యం ప్రాప్య పురందరః,

శశాస ముదితో లోకాన్ సర్షిసంఘాన్ సచారణాన్. 44

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే పంచచత్వారింశః సర్గః

ప్ర. అ. పురందరః = దేవేంద్రుడు, దితిపుత్రాన్ = దైత్యులను, నిహత్య = చంపి, రాజ్యమ్ = రాజ్యమును, ప్రాప్య = పొంది, ముదితః = సంతోషించిన వాడై, సర్షిసంఘాన్ = ఋషి సంఘములతో కూడిన, సచారణాన్ = చారణులతో కూడిన, లోకాన్ = లోకములను, శశాస = పరిపాలించెను.

తా. దేవేంద్రుడు దైత్యులను సంహరించి, రాజ్యమును పొంది, సంతోషించినవాడై, ఋషులు, చారణులు మొదలైన వారితో కూడిన లోకాలను పరిపాలించెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో నలభై యైదవ సర్గ సమాప్తము.