Chapter_46

Back
Book Balakandamu
Chapter No 52
Pages 6
Read Time 9 Minutes

Chapter_46

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ షట్చత్వారింశః సర్గః

పుత్రమరణముచే దుఃఖితురా లగు దితి ఇంద్రుని చంపగల పుత్రుడు లభించుటకై తపస్సు చేయుటకు కశ్యపుని అనుజ్ఞపొంది, కుశప్లవమునందు తపస్సుచేయుట, ఇంద్రుడు ఆమెకు పరిచర్య చేయుట. ఆమె అశుచిగా ఉన్న అదను చూచి అతడు ఆమె గర్భములో ప్రవేశించి గర్భస్థశిశువును ఏడు ముక్కలుగా ఖండించుట.

మూ. హతేషు తేషు పుత్రేషు దితిః పరమదుఃఖితా,

మారీచం కాశ్యపం రామ భర్తారమిదమబ్రవీత్. 1

ప్ర. అ. రామ = రామా!, తేషు = ఆ, పుత్రేషు = పుత్రులు, హతేషు = చంపబడినవారగు చుండగా, దితిః = దితి, పరమదుఃఖితా = మిక్కిలి దుఃఖించి నదై, భర్తారమ్ = భర్త యైన, మారీచమ్ = మరీచిపుత్రు డైన, కాశ్యపమ్ = కాశ్యపుని గూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. రామా! ఈ విధముగ కుమారు లందరును చంపబడుట చూచి దితి చాల దుఃఖించుచు, మరీచి కుమారుడును, తన భర్తయు అగు కాశ్యపునితో ఇట్లనెను.

మూ. హతపుత్రాస్మి భగవంస్తవ పుత్రైర్మహాబలైః,

శక్రహన్తారమిచ్ఛామి పుత్రం దీర్ఘతపోర్జితమ్. 2

ప్ర. అ. భగవన్ = పూజ్యుడా! మహాబలైః = మహాబలులైన, పుత్రైః = నీకుమారులైన దేవతలచేత, హతపుత్రా = చంపబడిన పుత్రులు కలదానను, అస్మి = అయితిని. శక్రహన్తారమ్ = దేవేంద్రుని చంపగల, దీర్ఘతపోర్జితమ్ = దీర్ఘతపస్సుచేత బలము గల, పుత్రమ్ = పుత్రుని, ఇచ్ఛామి = కోరుచున్నాను.

తా. భగవంతుడా! మహాబలు లైన నీ కుమారు లైన దేవతలు నా పుత్రులను చంపివేసినారు. నాకు దీర్ఘతపస్సుచే బలము గలవాడును దేవేంద్రుని చంపగలవాడును అగు కుమారుడు కావలెను.

మూ. సాహం తపశ్చరిష్యామి గర్భం మే దాతుమర్హసి,

ఈశ్వరం శక్రహన్తారం త్వమనుజ్ఞాతుమర్హసి. 3

ప్ర. అ. సా, అహమ్ = అట్టి నేను, తపః = తపస్సును, చరిష్యామి = ఆచరించెదను. త్వమ్ = నీవు, ఈశ్వరమ్ = లోకనాయకుడును, శక్రహన్తారమ్ = దేవేంద్రుని చంపువాడును అగు, గర్భమ్ = గర్భమును (పుత్రుని), మే = నాకు, దాతుమ్ = ఇచ్చుటకు, అర్హసి = తగి యున్నావు.

తా. నాకు లోకములకు నాయకుడును, ఇంద్రుని చంపువాడును అగు కుమారుని ఇమ్ము. నేను తపస్సు చేసెదను. అనుజ్ఞ ఇమ్ము.

మూ. తస్యాస్తద్వచనం శ్రుత్వా మారీచః కాశ్యపస్తదా,

ప్రత్యువాచ మహాతేజా దితిం పరమదుఃఖితామ్. 4

ప్ర. అ. తదా = అప్పుడు, మారీచః = మరీచియొక్క కుమారుడును, మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును అగు, కాశ్యపః = కాశ్యపుడు, తస్యాః = ఆమెయొక్క, తత్ వచనమ్ = ఆ వచనమును, శ్రుత్వా = విని, పరమదుఃఖితామ్ = మిక్కిలి దుఃఖించిన, దితిమ్ = దితిని గూర్చి, ప్రత్యువాచ = తిరిగి పలికెను.

తా. మహాతేజశ్శాలి, మరీచికుమారుడును అయిన కాశ్యపుడు ఆమె వచనమును విని, అతిదుఃఖితురా లగు ఆమెతో ఇట్లనెను.

మూ. ఏవం భవతు భద్రం తే శుచిర్భవ తపోధనే,

జనయిష్యసి పుత్రం త్వం శక్రహన్తారమాహవే. 5

ప్ర. అ. తపోధనే = ఓ తపోధనురాలా! ఏవమ్ = ఇట్లే, భవతు = అగుగాక. తే = నీకు, భద్రమ్ = క్షేమము (అగుగాక) శుచిః = పవిత్రురాలవు, భవ = అగుము. త్వమ్ = నీవు, ఆహవే = యుద్ధమునందు, శక్రహన్తారమ్ = దేవేంద్రుని చంప గల, పుత్రమ్ = పుత్రుని, జనయిష్యసి = కనగలవు.

తా. తపోధనురాలా! అట్లే అగుగాక. నీకు క్షేమ మగు గాక. యుద్ధములో దేవేంద్రుని చంపగల కుమారుని కనగలవు.

మూ. పూర్ణే వర్షసహస్రే తు శుచిర్యది భవిష్యసి,

పుత్రం త్రైలోక్యభర్తారం మత్తస్త్వం జనయిష్యసి. 6

ప్ర. అ. త్వమ్ = నీవు, శుచిః = పవిత్రురాలవుగా, భవిష్యసి యది = ఉన్నట్లయితే, వర్షసహస్రే = వేయి సంవత్సరముల కాలము, పూర్ణే = నిండిన దగుచుండగా, మత్తః = నావలన, త్రైలోక్యభర్తారమ్ = మూడు లోకములకును ప్రభువైన, పుత్రమ్ = పుత్రుని, జనయిష్యసి = కనగలవు.

తా. నీవు పవిత్రముగా ఉన్నచో, వేయి వర్షములు నిండగనే, మూడు లోకములకును ప్రభు వైన కుమారుని నావలన కనగలవు.

మూ. ఏవముక్త్వా మహాతేజాః పాణినా స మమార్జ తామ్,

సమాలభ్య తతః స్వస్తీత్యుక్త్వా స తపసే యయౌ. 7

ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, సః = ఆ కాశ్యపుడు, ఏవమ్ = ఇట్లు, ఉక్త్వా = పలికి, తామ్ = ఆమెను, పాణినా = హస్తముతో, మమార్జ = తుడిచెను. సమాలభ్య = స్పృశించి, తతః = పిమ్మట, స్వస్తి ఇతి = క్షేమ మగుగాక అని, ఉక్త్వా = పలికి, సః = అతడు, తపసే = తపస్సుకొరకు, యయౌ = వెళ్లెను.

తా. ఆ మహాతేజఃశాలి, ఈ విధముగా పలికి దితిని హస్తముతో స్పృశించి, శరీర మంతయు తడవి క్షేమ మగుగాక అని పలికి తపస్సు చేసుకొనుటకై వెడలిపోయెను.

మూ. గతే తస్మిన్నరశ్రేష్ఠ దితిః పరమహర్షితా,

కుశప్లవనమాసాద్య తపస్తేపే సుదారుణమ్. 8

ప్ర. అ. నరశ్రేష్ఠ = ఓ నరశ్రేష్ఠుడా!, తస్మిన్ = ఆ కాశ్యపుడు, గతే సతి = వెళ్లగా, దితిః = దితి, పరమహర్షితా = చాల సంతోషించినదై, కుశప్లవనమ్ = కుశప్లవన మను క్షేత్రమును, ఆసాద్య = పొంది, సుదారుణమ్ = చాల తీవ్ర మైన, తపః = తపస్సును, తేపే = చేసెను.

తా. రామా! ఆ మహర్షి వెళ్లిన తరువాత, దితి చాల సంతసించి, కుశప్లవన మనెడు క్షేత్రము చేరి అతితీవ్ర మైన తపస్సు చేసెను.

మూ. తపస్తస్యాం హి కుర్వన్త్యాం పరిచర్యాం చకార హ,

సహస్రాక్షో నరశ్రేష్ఠ పరయా గుణసంపదా. 9

ప్ర. అ. నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా!, తస్యామ్ = ఆమె, తపఃచరన్త్యామ్ = తపస్సు చేయుచుండగా, సహస్రాక్షః = దేవేంద్రుడు, పరయా = గొప్ప, గుణసంపదా = గుణసంపదతో, పరిచర్యామ్ = సేవను, చకార హ = చేసెను.

తా. రామా! ఆమె తపస్సు చేయుచున్నప్పుడు దేవేంద్రుడు ఉత్తమ మైన గుణసంపదతో సేవ చేసెను.

మూ. అగ్నిం కుశాన్ కాష్ఠమపః ఫలం మూలం తథైవ చ,

న్యవేదయత్సహస్రాక్షో యచ్చాన్యదపి కాంక్షితమ్. 10

ప్ర. అ. సహస్రాక్షః = దేవేంద్రుడు, అగ్నిమ్ = అగ్నిని, కుశాన్ = కుశలను, కాష్ఠమ్ = కట్టెలను, అపః = ఉదకమును, ఫలమ్ = ఫలమును, తథైవ చ = మరియు, మూలమ్ = దుంపలను, కాంక్షితమ్ = కోరబడిన, అన్యత్ = ఇతర మైనది, యచ్చ = ఏది యుండునో, దానిని, న్యవేదయత్ = ఆమెకు సమకూర్చెను.

తా. దేవేంద్రుడు అగ్ని, కుశములు, సమిధలు, ఉదకము, ఫలములు, మూలములు, మొదలైన కావలసిన పదార్థముల నన్నింటిని ఆమెకు సమకూర్చుచు సేవ చేయుచుండెను.

మూ. గాత్రసంవహనైశ్చైవ శ్రమాపనయనైస్తథా,

శక్రః సర్వేషు కాలేషు దితిం పరిచచార హ. 11

ప్ర. అ. శక్రః = దేవేంద్రుడు, గాత్రసంవహనైః చ ఏవ = ఒళ్ళు పట్టుటచేతను, తథా = మరియు, శ్రమాపనయనైః = శ్రమను తొలగించుటచేతను, సర్వేషు కాలేషు = సమస్తకాలములందును, దితిమ్ = దితిని, పరిచచార హ = ఉపచరించెను.

తా. ఒడలు పట్టుట, శ్రమ దీర్చుట మొదలగు పనులు చేయుచు దేవేంద్రుడు అన్ని కాలములందును దితికి ఉపచారములు చేసెను.

మూ. అథ వర్షసహస్రే తు దశోనే రఘునన్దన,

దితిః పరమసంప్రీతా సహస్రాక్షమథాబ్రవీత్. 12

ప్ర. అ. రఘునన్దన = రామా!, అథ = పిమ్మట, వర్షసహస్రే = వేయి సంవత్సరముల కాలము, దశోనే = పది తక్కువగా ఉండగా, దితిః = దితి, పరమ సంప్రీతా = చాల సంతసించినదై, సహస్రాక్షమ్ = దేవేంద్రుని గూర్చి, అబ్రవీత్ = పలికెను.

తా. రామా! ఈ విధముగ తొమ్మిదివందలతొంభై సంవత్సరములు గడచినవి. అపుడు దితి చాల సంతసించినదై దేవేంద్రునితో ఇట్లు పలికెను.

మూ. యాచితేన సురశ్రేష్ఠ తవ పిత్రా మహాత్మనా,

వరో వర్షసహస్రాన్తే దత్తో మమ సుతం ప్రతి. 13

ప్ర. అ. సురశ్రేష్ఠ = ఓ దేవతాశ్రేష్ఠుడా! యాచితేన = కోరబడిన, మహాత్మనా = మహాత్ముడైన, తవ = నీయొక్క, పిత్రా = తండ్రిచేత, వర్షసహస్రాన్తే = వేయిసంవత్సరముల అంతమున, సుతంప్రతి = కుమారుని గూర్చి, మమ = నాకు, వరః = వరము, దత్తః = ఇవ్వబడినది.

తా. దేవతలలో శ్రేష్ఠుడ వైన ఓ ఇంద్రుడా! నేను కోరగా, నీ తండ్రి వేయి సంవత్సరముల తరువాత కుమారుడు కలుగగల డని నాకొక వరము నిచ్చెను.

మూ. తపశ్చరన్త్యా వర్షాణి దశ వీర్యవతాం వర,

అవశిష్టాని భద్రం తే భ్రాతరం ద్రక్ష్యసే తతః. 14

ప్ర. అ. వీర్యవతామ్ = పరాక్రమవంతులలో, వర = శ్రేష్ఠుడ వైన ఓ ఇంద్రా, తపః = తపస్సు, చరన్త్యాః = ఆచరించుచున్న నాకు, దశ = పది, వర్షాణి = సంవత్సరములు, అవశిష్టాని = మిగిలినవి. తతః = అటుపిమ్మట, భ్రాతరమ్ = సోదరుని, ద్రక్ష్యసే = చూడగలవు. తే = నీకు, భద్రమ్ = మంగళ మగుగాక.

తా. వీర్యవంతులలో శ్రేష్ఠుడ వైన ఓ దేవేంద్రా! నేను తపస్సు చేయ ప్రారంభించిన తరువాత వేయి సంవత్సరములు పూర్తి అగుటకు ఇంకను పది సంవత్సరములు ఉన్నవి. పది సంవత్సరముల తరువాత సోదరుని చూడగలవు. నీకు శుభ మగుగాక.

మూ. తమహం త్వత్కృతే పుత్ర సమాధాస్యే జయోత్సుకమ్,

త్రైలోక్యవిజయం పుత్ర సహ భోక్ష్యసి విజ్వరః. 15

ప్ర. అ. పుత్ర = కుమారా!, తమ్ = ఆతనిని, త్వత్కృతే = నీకొరకై, జయోత్సుకమ్ = జయమునందు వేడుక కలవానినిగా, సమాధాస్యే = చేయగలను. పుత్ర = కుమారా!, విజ్వరః = దుఃఖము లేని వాడవై, త్రైలోక్య విజయమ్ = మూడు లోకముల విజయమును, సహ భోక్ష్యసి = కలిసి అనుభవింపగలవు.

తా. కుమారా! నీకొరకై ఆతనియందు జయాభిలాషను కలిగించెదను. నీవు అతనితో కలిసి, ఎట్టి బాధలును లేక, మూడు లోకములను జయించి ఆ విజయానందమును అనుభవింపగలవు.

మూ. ఏవముక్త్వా దితిః శక్రం ప్రాప్తే మధ్యం దివాకరే,

నిద్రయాపహృతా దేవీ పాదౌ కృత్వాథ శీర్షతః. 16

ప్ర. అ. దితిః దేవీ = దితిదేవి, శక్రమ్ = దేవేంద్రుని గూర్చి, ఏవమ్ = ఈ విధముగా, ఉక్త్వా = పలికి, దివాకరే = సూర్యుడు, మధ్యమ్ = ఆకాశ మధ్యమును, ప్రాప్తే = పొందినవా డగుచుండగా, అథ = పిమ్మట, పాదౌ = పాదములను, శీర్షతః = శిరస్సు వైపు, కృత్వా = చేసి, (ఉంచి), నిద్రయా = నిద్రచేత, అపహృతా = అపహరింపబడినది.

తా. దితిదేవి దేవేంద్రునితో ఇట్లు పలికి మధ్యాహ్నసమయమునందు, తల వైపు పాదము లుంచుకొని నిద్రాపరవశ ఆయెను.

వి. ఎక్కువ నిద్ర రాగా ముందుకు వంగుటచే శిరస్సు పాదములకు తగిలి అపరిశుద్ధురాలయ్యె నని కొందరు వ్యాఖ్యాతలును, శయ్యపై తలవైపు కాళ్లు పెట్టుకొని నిద్రించుటచే అట్లయ్యె నని కొందరును, మధ్యాహ్నసమయమున వ్రతమును మరచి నిద్రించుటచే అట్లయ్యె నని కొందరును వ్యాఖ్యానించిరి.

మూ. దృష్ట్వా తామశుచిం శక్రః పాదతః కృతమూర్ధజామ్,

శిరఃస్థానే కృతౌ పాదౌ జహాస చ ముమోద చ. 17

ప్ర. అ. శక్రః = దేవేంద్రుడు, పాదతః = పాదముల వైపు, కృతమూర్ధజామ్ = ఉంచబడిన కేశములు గల, అశుచిమ్ = అపవిత్రురా లైన, తామ్ = ఆమెను, దృష్ట్వా = చూచి, శిరఃస్థానే = శిరస్సు ఉంచు స్థానమునందు, కృతౌ = ఉంచబడిన, పాదౌ = పాదములను, (చూచి), జహాస = నవ్వెను. ముమోద చ = ఆనందించెను కూడ.

తా. శిరఃస్థానమునందు పాదము లుంచి, పాదములపై కేశములు పడునట్లు వంగి నిద్రించుచున్న అపరిశుద్ధురా లగు ఆమెను చూచి, దేవేంద్రుడు ఆనందముతో నవ్వుకొనెను.

మూ. తస్యాః శరీరవివరం వివేశ చ పురందరః,

గర్భం చ సప్తధా రామ బిభేద పరమాత్మవాన్. 18

ప్ర. అ. రామ = రామా! పురన్దరః = ఇంద్రుడు, తస్యాః = ఆమెయొక్క, శరీరవివరమ్ = శరీరరంధ్రమును, వివేశ చ = ప్రవేశించెను. పరమ్ = మిక్కిలి, ఆత్మవాన్ = బుద్ధి గల (ధైర్యము గల) ఆతడు, గర్భమ్ = గర్భమును, సప్తధా = ఏడు విధములుగా, బిభేద = భేదించెను.

తా. రామా! మిక్కిలి ధైర్యము గల ఆ ఇంద్రుడు ఆమె శరీరవివరమును ప్రవేశించి, గర్భమును ఏడు ముక్కలుగ ఖండించెను.

మూ. భిద్యమానస్తతో గర్భో వజ్రేణ శతపర్వణా,

రురోద సుస్వరం రామ తతో దితిరబుధ్యత. 19

ప్ర. అ. రామ = రామా!, తతః = పిమ్మట, శతపర్వణా = నూరు అంచులు గల, వజ్రేణ = వజ్రముచేత, భిద్యమానః = ఖండింపబడుచున్న, గర్భః = గర్భము, సుస్వరమ్ = అధిక మైన స్వరము కలుగునట్లుగా, రురోద = ఏడ్చెను. తతః = పిమ్మట, దితిః = దితి, అబుధ్యత = లేచెను.

తా. రామా! నూరంచులు గల వజ్రముచే ఖండింపబడిన ఆ గర్భము బిగ్గరగా ఏడ్చెను. దితి మేల్కొనెను.

మూ. మా రుదో మా రుదశ్చేతి గర్భం శక్రోఽభ్యభాషత,

బిభేద చ మహాతేజా రుదన్తమపి వాసవః. 20

ప్ర. అ. మా రుదః = ఏడవకుము, మా రుదః = ఏడవకుము, ఇతి = అని, శక్రః = దేవేంద్రుడు, గర్భమ్ = గర్భమును, అభ్యభాషత = పలికెను, మహాతేజాః = గొప్ప తేజస్సు గల, వాసవః = దేవేంద్రుడు, రుదన్తమపి = ఏడ్చుచున్నను, బిభేద చ = భేదించెను కూడ.

తా. మహాతేజస్సు గల ఆ దేవేంద్రుడు ఏడ్చుచున్న ఆ గర్భమును ‘‘ఏడవకుము, ఏడవకుము’’ అని అనుచునే భేదించెను.

మూ. న హన్తవ్యో న హన్తవ్య ఇత్యేవం దితిరబ్రవీత్,

నిష్పపాత తతః శక్రో మాతుర్వచనగౌరవాత్. 21

ప్ర. అ. దితిః = దితి, న హన్తవ్యః న హన్తవ్యః = చంపదగదు చంపదగదు, ఇత్యేవమ్ = అని, అబ్రవీత్ = పలికెను. తతః = పిమ్మట, శక్రః = దేవేంద్రుడు, మాతుః వచనగౌరవాత్ = తల్లియొక్క వచనమునందు గౌరవము వలన, నిష్సపాత = బైటకు వచ్చెను.

తా. ‘‘చంపవద్దు చంపవద్దు’’ అని దితి పలుకగా, తల్లి మాటపై గౌరవముచే దేవేంద్రుడు బైటకు వచ్చెను.

మూ. ప్రాంజలిర్వజ్రసహితో దితిం శక్రోఽభ్యభాషత,

అశుచిర్దేవి సుప్తాసి పాదయోః కృతమూర్ధజా. 22

ప్ర. అ. వజ్రసహితః = వజ్రసహితుడైన, శక్రః = ఇంద్రుడు, ప్రాంజలిః = దోసిలి ఒగ్గినవాడై, దితిమ్ = దితిని గూర్చి, అభ్యభాషత = పలికెను. దేవి = ఓ దేవీ! పాదయోః = పాదములపై, కృతమూర్ధజా = ఉంచబడిన కేశములు కలదానవై, అశుచిః = అపవిత్రురాలవై, సుప్తా అసి = నిద్ర పోతివి.

తా. వజ్రమును ధరించిన ఇంద్రుడు దితితో ఇట్లు పలికెను. ‘‘ఓ దేవీ! నీవు కేశములు పాదములకు తగులునట్లుగా పరుండి నిద్రించితివి.’’

మూ. తదన్తరమహం లబ్ధ్వా శక్రహన్తారమాహవే,

అభిదం సప్తధా దేవి తన్మే త్వం క్షన్తుమర్హసి. 23

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే పంచచత్వారింశః సర్గః

ప్ర. అ. అహమ్ = నేను, తత్ = ఆ, అన్తరమ్ = అవకాశమును, లబ్ధ్వా = పొంది, ఆహవే = యుద్ధమునందు, శక్రహన్తారమ్ = ఇంద్రుని చంపనున్నవానిని, సప్తధా = ఏడు ఖండములుగా, అభిదమ్ = భేదించితిని. దేవి = ఓ దేవీ!, మే = నాయొక్క, తత్ = ఆ కార్యమును, త్వమ్ = నీవు, క్షన్తుమ్ = క్షమించుటకు, అర్హసి = తగియున్నావు.

తా. ఆ అవకాశమును చూచుకొని నేను, యుద్ధములో నన్ను సంహరింపనున్న ఆ పిల్లవానిని ఏడు ముక్కలుగా ఖండించితిని. ఇందులకు నన్ను క్షమింపుము.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు,బాలకాండలో నలభై ఆరవ సర్గ సమాప్తము.