Chapter_47

Back
Book Balakandamu
Chapter No 53
Pages 6
Read Time 9 Minutes

Chapter_47

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ సప్తచత్వారింసర్గము

ఆ విధముగ ఖండింపబడిన తన గర్భస్థశిశువును ఏడుగురు మరుత్తులుగ చేసి స్వర్గమునందు రక్షింపు మని దితి ఇంద్రుని కోరగా అతడు అందులకు అంగీకరించుట. ఆ దితి తపస్సు చేసిన వనమునందే ఇక్ష్వాకుకుమారుడైన విశాలుడు విశాల అను నగరిని నిర్మించుట. ఆ కాలమునందు అక్కడ రాజుగా నున్న సుమతి విశ్వామిత్రుని పూజించుట.

మూ. సప్తధా తు కృతే గర్భే దితిః పరమదుఃఖితా,

సహస్రాక్షం దురాధర్షం వాక్యం సానునయాఽబ్రవీత్. 1

ప్ర. అ. గర్భే = గర్భము, సప్తధా = ఏడు ముక్కలుగా, కృతే = చేయబడిన దగుచుండగా, దితిః = దితి, దుఃఖితా = మిక్కిలి దుఃఖించినదై, దురాధర్షమ్ = ఎదిరింప శక్యముకాని, సహస్రాక్షమ్ = దేవేంద్రుని గూర్చి, సానునయా = అనునయముతో కూడినదై, వాక్యమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. ఈ విధముగ గర్భము ఏడు ముక్కలుగ ఖండింపబడినందులకు దుఃఖించుచు దితి, ఎదిరింప శక్యము కానివా డైన దేవేంద్రునితో అనునయ పూర్వకముగా ఇట్లు పలికెను.

మూ. మమాపరాధాద్గర్భోఽయం సప్తధా విఫలీకృతః,

నాపరాధోఽస్తి దేవేశ తవాత్ర బలసూదన. 2

ప్ర. అ. బలసూదన = బలాసురుని సంహరించిన, దేవేశ = దేవేంద్రా!, మమ = నాయొక్క, అపరాధాత్ = అపరాధమువలన, అయమ్ = ఈ, గర్భః = గర్భము, సప్తధా = ఏడు భాగములుగా, విఫలీకృతః = వ్యర్థము చేయబడినది. అత్ర = ఈ విషయమున, తవ = నీయొక్క, అపరాధః = అపరాధము, నాస్తి = లేదు.

తా. బలాసురుని సంహరించిన ఓ దేవేంద్రా! నా అపరాధముచేతనే నా గర్భము ఏడు ముక్కలు చేయబడి వ్యర్థ మైనది. ఇందులో నీ అపరాధము లేదు.

మూ. ప్రియం తు కర్తుమిచ్ఛామి మమ గర్భవిపర్యయే,

మరుతాం సప్త సప్తానాం స్థానపాలా భవిన్త్విమే. 3

ప్ర. అ. గర్భవిపర్యయే = గర్భమునకు కలిగిన ఈ ఆపద విషయమున, మమ = నాకు, ప్రియమ్ = ప్రియము, కర్తుమ్ = చేయుటకు, ఇచ్ఛామి = కోరుచున్నాను. ఇమే = ఈ, సప్త = ఏడు ఖండములు, సప్తానామ్ = ఏడుగు రైన, మరుతామ్ = మరుత్తుల, స్థానపాలాః = స్థానపాలకులుగా, భవన్తు = అగుగాక.

తా. గర్భము విషయమున అనుకున్న దానికి వ్యతిరేకముగ జరిగినది. అందుచే నీవు నాకొక ప్రియమును చేయవలె నని కోరుచున్నాను. ఈ గర్భ ఖండములు ఏడును ఏడు మారుతస్థానములకు పాలకు లగు గాక.

వి. అంతరిక్షమునందు ఆవహ- ప్రవహ- సంవహ- ఉద్వహ- వివహ- పరివహ- వరావహము లనే ఏడు వాతస్కంధములున్న వనియు అవి నక్షత్ర మండలాదులకు ఆదారములై ఉన్న వనియు పౌరాణిక సంప్రదాయము.

మూ. వాతస్కంధా ఇమే సప్త చరస్తు దివి పుత్రక,

మారుతా ఇతి విఖ్యాతా దివ్యరూపా మమాత్మజాః. 4

ప్ర. అ. పుత్రక = కుమారుడా!, సప్త = ఏడుగు రైన, ఇమే = ఈ, మమ = నాయొక్క, ఆత్మజాః = కుమారులు, దివ్యరూపాః = దివ్య రూపములు కలవారై, వాతస్కంధాః = వాతస్కంధములకు అధిష్ఠానదేవతలై, మారుతాః ఇతి = మారుతులు అని, విఖ్యాతాః = ప్రసిద్ధులై, దివి = అంతరిక్షమునందు, చరన్తు = సంచరింతురుగాక.

తా. కుమాడా! నా ఏడుగురు కుమారులును దివ్యరూపములు ధరించి, వాతస్కంధము లకు అధిష్ఠానదేవతలై, మారుతు లను పేరుతో అంతరిక్షమునందు సంచరించెదరు గాక.

మూ. బ్రహ్మలోకం చరత్వేక ఇన్ద్రలోకం తథాపరః,

దివి వాయురితి ఖ్యాతాస్తృతీయోఽపి మహాయశాః. 5

ప్ర. అ. ఏకః = ఒకడు, బ్రహ్మలోకమ్ = బ్రహ్మలోకమును (నందు), చరతు = సంచరించుగాక. తథా = అట్లే, అపరః = మరియొకడు, ఇన్ర్దలోకమ్ = ఇంద్రలోకమునందును, మహాయశాః = గొప్పకీర్తి గల, తృతీయోఽపి = మూడవవాడు కూడ, వాయురితి = వాయువు అని, ఖ్యాతః = ప్రసిద్ధుడై, దివి = అంతరిక్షమునందు, తిరుగుగాక.

తా. వీరిలో ఒకడు బ్రహ్మలోకమునందును, ఒకడు ఇంద్రలోకము నందును, మహాకీర్తిశాలి యగు మూడవవాడు వాయు వను పేరుతో అంతరిక్షము నందును సంచరించుగాక.

మూ. చత్వారస్తు సురశ్రేష్ఠ దిశో వై తవ శాసనాత్,

సంచరిష్యన్తి భద్రం తే దేవభూతా మమాత్మజాః. 6

ప్ర. అ. సురశ్రేష్ఠ = దేవతలలో శ్రేష్ఠుడ వైన ఇంద్రా!, చత్వారః = నలుగురు, మమ ఆత్మజాః = నా కుమారులు, తవ = నీయొక్క, శాసనాత్ = ఆజ్ఞవలన, దేవభూతాః = దేవతలుగా అయి, దిశః = దిక్కులను, సంచరిష్యన్తి = సంచరింపగలరు.

తా. ఓ దేవేంద్రా! మిగిలిన నా నలుగురు కుమారులు నీ ఆజ్ఞ ప్రకారము దేవతలై, నాలుగు దిక్కులందును సంచరింతురు గాక.

మూ. త్వత్కృతేనైవ నామ్నా చ మారుతా ఇతి విశ్రుతాః.

ప్ర. అ. త్వత్కృతేనైవ = నీచేతనే చేయబడిన, నామ్నా = పేరుతో, మారుతాః ఇతి = మారుతులు అని, విశ్రుతాః = ప్రసిద్ధి పొందినవా రగుదురు గాక.

తా. నీవు ఖండించుచున్నప్పుడు వీళ్లు ఏడ్చుచుండగా మా రుదః’ (ఏడ్వకుము) అని నీవు అని ఉంటివి. లందుచే అదే పేరుతో వీరు మారుతఅని ప్రసిద్ధి చెందగలరు.

మూ. తస్యాస్తద్వచనం శ్రుత్వా సహస్రాక్షః పురన్దరః,

ఉవాచ ప్రాంజలిర్వాక్యం దితిం బలనిఘాదనః. 7

ప్ర. అ. సహస్రాక్షః = వేయి నేత్రములు గలవాడును, బలనిషూదనః = బలాసురుని సంహరించినవాడును అగు, పురన్దరః = దేవేంద్రుడు, తస్యాః = ఆమెయొక్క, తత్ = ఆ, వచనమ్ = వాక్యమును, శ్రుత్వా = విని, ప్రాఞ్జలిః = కట్టబడిన దోసిలి కలవాడై, దితిమ్ = దితి దేవిని గూర్చి, వాక్యమ్ = వాక్యమును, ఉవాచ = పలికెను.

తా. బలాసురసంహారియు, సహస్రాక్షుడును అగు దేవేంద్రుడు ఆ దితి వాక్యములు విని, దోసిలి ఒగ్గి నమస్కరించుచు ఇట్లనెను.

మూ. సర్వమేతద్యథోక్తం తే భవిష్యతి న సంశయః,

విచరిష్యన్తి భద్రం తే దేవభూతాస్తవాత్మజాః. 8

ప్ర. అ. తే = నీకు (నీచేత), యథా = ఏ విధముగా, ఉక్తమ్ = చెప్పబడినదో, ఏతత్ = ఇది, సర్వమ్ = అంతయు, భవిష్యతి = కాగలదు. సంశయః = సంశయము, న = లేదు. తవ = నీయొక్క, ఆత్మజాః = కుమారులు, దేవభూతాః = దేవతలై, విచరిష్యన్తి = సంచరించ గలరు. తే = నీకు, భద్రమ్ = మంగళము అగు గాక.

తా. అంతయు నీవు చెప్పిన విధముననే జరుగగలదు. సంశయము లేదు. నీ కుమారులు దేవతలై సంచరించగలరు. నీకు క్షేమ మగుగాక.

మూ. ఏవం తౌ నిశ్చయం కృత్వా మాతాపుత్రౌ తపోవనే,

జగ్మతుస్త్రిదివం రామ కృతార్థావితి నః శ్రుతమ్. 9

ప్ర. అ. రామ = శ్రీరామా!, తౌ = ఆ, మాతాపుత్రౌ = తల్లియు కుమారుడును, తపోవనమునందు, ఏవమ్ = ఈ విధముగా, నిశ్చయమ్ = నిశ్చయమును, కృత్వా = చేసి, కృతార్థౌ = కృతార్థులై, దివమ్ = స్వర్గమును గూర్చి, జగ్మతుః = వెళ్లిరి. ఇతి = ఈ విధముగ, నః = మాకు (మాచేత) శ్రుతమ్ = వినబడినది.

తా. శ్రీరామా! ఆ తల్లియు కుమారుడును, తపోవనమునందు ఈ విధముగ నిశ్చయము చేసి, కృతార్థులై, స్వర్గమునకు వెళ్లి రని విని యున్నాము.

మూ. ఏష దేశస్స కాకుత్థ్స మహేంద్రాధ్యుషితః పురా,

దితిం యత్ర తపఃసిద్ధామేవం పరిచచార సః. 10

ప్ర. అ. కాకుత్థ్స = శ్రీరామా!, ఏషః = ఇది, పురా = పూర్వము, మహేన్ర్దాధ్యుషితః = మహేంద్రునిచే అధిష్ఠింపబడిన (మహేంద్రుడు నివసించిన), నః = ఆ, దేశః = దేశము. యత్ర = ఎచట, సః = అతడు, తపఃసిద్ధామ్ = తపస్సునందు ప్రసిద్ధురా లగు, దితిమ్ = దితిని, ఏవమ్ = ఈ విధముగా, ఉపచచార = ఉపచరించెనో.

తా. రామా! పూర్వము మహేంద్రుడు నివసించిన ఆ దేశమిదియే. ఇచటనే దితి తపస్సు చేయుచుండగా అతడు ఆమెకు ఉపచారములు చేసెను.

మూ. ఇక్ష్వాకోస్తు నరవ్యాఘ్ర పుత్రః పరమధార్మికః, 11

అలంబుసాయాముత్పన్నో విశాల ఇతి విశ్రుతః,

తేన చాసీదిహ స్థానే విశాలేతి పురీ కృతా. 12

ప్ర. అ. నరవ్యాఘ్ర = పురుషశ్రేష్ఠుడ వైన శ్రీరామా!, ఇక్ష్వాకోః = ఇక్ష్వాకువునకు, అలంబుసాయామ్ = అలంబుసయందు, పరమధార్మికః = ఎక్కువ ధార్మికుడును, విశాల ఇతి = విశాలు డని, విశ్రుతః = ప్రసిద్ధి పొందిన వాడును అగు, పుత్రః = పుత్రుడు, ఉత్పన్నః = పుట్టినాడు. తేన = అతనిచేత, ఇహ = ఈ, స్థానే = స్థానమునందు, విశాలేతి = విశాల అను, పురీ = పట్టణము, కృతా = చేయబడినది, ఆసీత్ = ఆయెను.

తా. రామా! ఇక్ష్వాకునకు అలంబుసయందు జనించిన విశాలు డనే పరమధార్మికు డైన కుమారుడు, ఈ ప్రదేశమునందు విశాల అను పురిని నిర్మించెను.

మూ. విశాలస్య సుతో రామ హేమచన్ద్రో మహాబలః,

సుచంద్ర ఇతి విఖ్యాతః హేమచంద్రాదనన్తరః. 13

ప్ర. అ. రామ = రామా!, మహాబలః = మహాబలశాలి యగు, హేమచన్ద్రః = హేమచంద్రుడు, విశాలస్య = విశాలునియొక్క, సుతః = కుమారుడు, హేమచన్ద్రాత్ = హేమచంద్రునికంటె, అనన్తరః = తరువాతివాడు, సుచన్ద్ర ఇతి = సుచంద్రు డని, విఖ్యాతః = ప్రసిద్ధుడు.

తా. రామా! మహాబలిశాలి యగు హేమచంద్రుడు విశాలుని కుమారుడు. హేమచంద్రుని తరువాత (అతని కుమారుడు), సుచంద్రు డని ప్రసిద్ధి చెందెను.

మూ. సుచంద్రతనయో రామ ధూమ్రాశ్వ ఇతి విశ్రుతః,

ధూమ్రాశ్వతనయశ్చాపి సృంజయః సమపద్యత. 14

ప్ర. అ. రామ = రామా! సుచన్ద్రతనయః = సుచంద్రుని కుమారుడు, ధూమ్రాశ్వ ఇతి = ధూమ్రాశ్వు డని, విశ్రుతః = ప్రసిద్ధి పొందెను. సృఞ్జయః = సృంజయు డనెడు వాడు, ధూమ్రాశ్వతనయః = ధూమ్రాశ్వుని కుమారుడుగా, సమపద్యత = జనించెను.

తా. రామా! సుచంద్రుని కుమారుడు ధూమ్రాశ్వుడు. అతని కుమారుడు సృంజయుడు.

మూ. సృఞ్జయస్య సుతః శ్రీమాన్ సహదేవః ప్రతాపవాన్,

కుశాశ్వః సహదేవస్య పుత్రః పరమధార్మికః. 15

ప్ర. అ. శ్రీమాన్ = శ్రీమంతుడును, ప్రతాపవాన్ = ప్రతాపవంతుడును అగు, సహదేవః = సహదేవుడు, సృఞ్జయస్య = సృంజయునియొక్క, సుతః = కుమారుడు. పరమధార్మికః = గొప్ప ధర్మాత్ము డైన, కుశాశ్వః = కుశాశ్వుడు, సహదేవస్య = సహదేవుని యొక్క, పుత్రః = కుమారుడు.

తా. శ్రీమంతుడు, ప్రతాపవంతుడు అయిన సహదేవుడు సృంజయుని కుమారుడు, పరమధార్మికు డైన కుశాశ్వుడు సహదేవుని కుమారుడు.

మూ. కుశాశ్వస్య మహాతేజా సోమదత్తః ప్రతాపవాన్,

సోమదత్తస్య పుత్రస్తు కాకుత్స్థ ఇతి విశ్రుతః. 16

ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును, ప్రతాపవాన్ = ప్రతాపవంతుడును అగు, సోమదత్తః = సోమదత్తుడు, కుశాశ్వస్య = కుశాశ్వునియొక్క, (కుమారుడు). సోమదత్తస్య = సోమదత్తునియొక్క, పుత్రః = పుత్రుడు, కాకుత్థ్సః ఇతి = కాకుత్థ్సు డని, విశ్రుతః = ప్రసిద్ధుడు.

తా. కుశాశ్వునకు మహాతేజఃశాలియు, ప్రతాపవంతుడును అగు సోమదత్తుడును, సోమదత్తునకు కాకుత్థ్సుడును పుత్రులుగా జనించిరి.

మూ. తస్య పుత్రో మహాతేజాః సమ్ప్రత్యేష పురీమిమామ్,

ఆవసత్యమరప్రఖ్యః సుమతిర్నామ దుర్జయః. 17

ప్ర. అ. సంప్రతి = ఇపుడు, ఇమామ్ = ఈ, పురీమ్ = పట్టణమును (నందు), తస్య = ఆ ఇక్ష్వాకువుయొక్క, పుత్రః = పుత్రుడును, మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును, అమరప్రఖ్యః = దేవతలతో సమానుడును, దుర్జయః = జయింప శక్యము కానివాడును అగు, సుమతిర్నామ = సుమతి అనునతడు, ఆవసతి = నివసించుచున్నాడు.

తా. గొప్ప తేజస్సు కలవాడును, దేవతాసమానుడును, జయింప శక్యము కానివాడును అగు, ఇక్ష్వాకుకుమారు డగు సుమతి, ఇపుడు ఈ నగరమును పాలించుచున్నాడు.

మూ. ఇక్ష్వాకోస్తు ప్రసాదేన సర్వే వైశాలికా నృపాః,

దీర్ఘాయుషో మహాత్మానో వీర్యవన్తస్సుధార్మికాః. 18

ప్ర. అ. ఇక్ష్వాకోః = ఇక్ష్వాకువుయొక్క, ప్రసాదేన = అనుగ్రహముచేత, వైశాలికాః = విశాలనగరమునకు సంబంధించిన, నృపాః = రాజులు, సర్వే = అందరును, దీర్ఘాయుషః = దీర్ఘాయుర్దాయము కలవారు, మహాత్మానః = మహాత్ములు, వీర్యవన్తః = పరాక్రమము కలవారు, సుధార్మికాః = బాగుగా ధార్మికులు.

తా. విశాలానగరరాజు లందరును, ఇక్ష్వాకుప్రభావముచేత, దీర్ఘాయుర్దాయవంతులై, మహాత్ములై, వీర్యవంతులై, ధార్మికులై ఒప్పుచుందురు.

మూ. ఇహాద్య రజనీం రామ సుఖం వత్స్యామహే వయమ్,

శ్వః ప్రభాతే నరశ్రేష్ఠ జనకం ద్రష్టుమర్హసి. 19

ప్ర. అ. రామ = రామా! అద్య = నేడు రజనీమ్ = రాత్రి, వయమ్ = మనము, ఇహ = ఇచటనే, సుఖమ్ = సుఖముగా, వత్స్యామహే = నివసించెదము. నరశ్రేష్ఠ = ఓ నరశ్రేష్ఠుడ్ఙా శ్వః = రేపు, ప్రభాతే = ప్రాతఃకాలమున, జనకమ్ = జనకుని, ద్రష్టుమ్ = చూచుటకు, అర్హసి = తగి ఉన్నావు.

తా. రామా! ఈ రాత్రి మనము ఇచటనే సుఖముగ నివసించెదము. రేపు ఉదయమున జనకమహారాజును చూచెదము.

మూ. సుమతిస్తు మహాతేజా విశ్వామిత్రముపాగతమ్,

శ్రుత్వా నరవరశ్రేష్ఠః ప్రత్యుద్గచ్ఛన్మహాయశాః. 20

ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును, మహాయశాః = గొప్ప యశస్సు కలవాడును, నరవరశ్రేష్ఠః = నరవరులలో శ్రేష్ఠుడును అగు, సుమతిస్తు = సుమతి యైతే, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని, ఉపాగతమ్ = వచ్చినవానినిగా, శ్రుత్వా = విని, ప్రత్యుద్గచ్ఛత్ = ఎదురుగా వెళ్లెను.

తా. మహాతేజుడు, మహాయశుడు, నరవరశ్రేష్ఠుడు అగు సుమతి విశ్వామిత్రుడు వచ్చిన వార్త విని, స్వాగతము చెప్పుటకై ఎదురుగా వెళ్లెను.

మూ. పూజాం చ పరమాం కృత్వా సోపాధ్యాయః సబాన్ధవః,

ప్రాఞ్జలిః కుశలం పృష్ట్వా విశ్వామిత్రమథాబ్రవీత్. 21

ప్ర. అ. సోపాధ్యాయః = పురోహితునితో కూడినవాడును, సబాన్ధవః = బంధుసమేతుడును అగు ఆ సుమతి, వరమామ్ = గొప్ప, పూజామ్ = పూజను, కృత్వా = చేసి, ప్రాఞ్జలిః = కట్టబడిన దోసిలి కలవాడై, కుశలమ్ = కుశలమును, పృష్ట్వా = అడిగి, అథ = పిమ్మట, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి, అబ్రవీత్ = పలికెను.

తా. బంధుపురోహితాది సమేతు డైన ఆ సుమతి విశ్వామిత్రుని అధికముగ పూజించి, అంజలి ఘటించి, కుశలప్రశ్నపూర్వకముగ ఇట్లు పలికెను.

మూ. ధన్యోస్మ్యనుగృహీతోఽస్మి యస్య మే విషయం మునిః,

సంప్రాప్తో దర్శనం చైవ నాస్తి ధన్యతరో మమ. 22

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే సప్తచత్వారింశః సర్గః

ప్ర. అ. యస్య = ఏ, మే = నాయొక్క, విషయమ్ = దేశమును, మునిః = ముని (నీవు), సంప్రాప్తః = వచ్చినావో, దర్శనం చైవ = దర్శనము కూడ (ఇచ్చినావో), అట్టి నేను, ధన్యః = ధన్యుడను, అస్మి = అయి ఉన్నాను. అనుగృహీతః = అనుగ్రహింపబడిన వాడను, అస్మి = అయి ఉన్నాను. మమ = నాకంటే, ధన్యతరః = ఎక్కువ ధన్యుడు, నాస్తి = లేడు.

తా. నీవు మా దేశమునకు వచ్చి దర్శనమిచ్చినందులకు నేను చాల ధన్యుడ నైతిని. అనుగ్రహింపబడినవాడ నైతిని. నన్ను మించిన ధన్యాత్ముడెవ్వడును లేడు.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో నలభైఏడవ సర్గ సమాప్తము.