Chapter_48

Back
Book Balakandamu
Chapter No 54
Pages 8
Read Time 13 Minutes

Chapter_48

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ అష్టచత్వారింశః సర్గః

ఆ రాజు సత్కారముల నందికొని రామలక్ష్మణాదిసహితు డగు విశ్వామిత్రుడు ఆ రాత్రి అచట ఉన్న జనశూన్య మైన ఆశ్రమమును గూర్చి రాముడు ప్రశ్నించగా విశ్వామిత్రుడు గౌతముని భార్యయైన అహల్యకు శాపము ప్రాప్తించిన వృత్తాంతము చెప్పుట.

మూ. పృష్ట్వా తు కుశలం తత్ర పరస్పరసమాగమే,

కథాన్తే సుమతిర్వాక్యం వ్యాజహార మహామునిమ్. 1

ప్ర. అ. తత్ర = అచట, పరస్పరసమాగమే = పరస్పరముతో (ఒండొరులతో) సమాగమమునందు, సుమతిః = సుమతి, కుశలమ్ = క్షేమమును, పృష్ట్వా = అడిగి, కథాన్తే = కథాంతమునందు, మహామునిమ్ = మహామునిని గూర్చి, వాక్యమ్ = వాక్యమును, వ్యాజహార = పలికెను.

తా. అచట వారు పరస్పరము కలిసి నపుడు సుమతి క్షేమసమాచారములను అడిగి, కొంత సంభాషణము జరిగిన పిమ్మట మహామునితో ఇట్లు పలికెను.

మూ. ఇమౌ కుమారౌ భద్రం తే దేవతుల్యపరాక్రమౌ,

గజసింహగతీ వీరౌ శార్దూలవృషభోపమౌ. 2

పద్మపత్రవిశాలాక్షౌ ఖడ్గతూణీధనుర్ధరౌ,

అశ్వినావివ రూపేణ సముపస్థితయౌవనౌ. 3

యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ దేవలోకాదివామరౌ,

కథం పద్భ్యామిహ ప్రాప్తౌ కిమర్థం కస్య వా మునే. 4

ప్ర. అ. మునే = విశ్వామిత్రమహామునీ!, తే = నీకు, భద్రమ్ = మంగళము అగు గాక, దేవతుల్య పరాక్రమౌ = దేవతలతో సమానమైన పరాక్రమము కలవారును, గజసింహగతీ= గజసింహములవంటి గమనము కలవారును, వీరౌ = వీరులును, శార్దూలవృషభోపమౌ= శార్దూలవృషభముల వలె ఉన్నవారును, పద్మపత్రవిశాలాక్షౌ = తామరపూవుల రేకుల వలె విశాల మైన నేత్రములు కలవారును, ఖడ్గతూణీధనుర్ధరౌ = ఖడ్గములను, అంబులపొదులను, ధనుస్సులను ధరించినవారును, రూపేణ = రూపముచేత, అశ్వినావివ = అశ్వినీదేవతల వలె ఉన్నవారును, సముపస్థితయౌవనౌ = సమీపించిన యౌవనము కలవారును, దేవలోకాత్ = దేవలోకమునుండి, యదృచ్ఛయైవ = ఇచ్ఛానుసారముగనే, గామ్ = భూమిని, ప్రాప్తౌ = పొందిన, అమరావివ = దేవతల వలె ఉన్న, ఇమౌ = ఈ, కుమారౌ = కుమారులు, ఇహ = ఇచటికి, పద్భ్యామ్ = పాదములచేతనే (నడచి), కథమ్ = ఎట్లు, కిమర్థమ్ = ఎందుకు, అనుప్రాప్తౌ = వచ్చినారు ? కస్య వా = ఎవనికి సంబంధించినవారు ?

తా. ఓ మునీ! నీకు క్షేమ మగు గాక. ఈ కుమారు లిరువురును, దేవతలతో సమాన మైన పరాక్రమము కలవారుగా కనబడుచున్నారు. ఏనుగువలె, సింహము వలె నడచుచున్నారు. వీరులు, శార్దూలము వలెను, వృషభము వలెను ఉన్నారు. వీరి నేత్రములు పద్మపత్రముల వలె విశాలముగ నున్నవి. ఖడ్గములను, అంబులపొదు లను, ధనుస్సులను ధరించి ఉన్నారు. యౌవనము ప్రారంభ మగుచున్నది. సౌందర్యమున అశ్వినీదేవతలను పోలి యున్నారు. స్వేచ్ఛగా దేవలోకమునుండి భూలోకమునకు దిగి వచ్చిన అశ్వినీదేవతల వలె ఉనారు. వీరు ఎవరి కుమారులు? కాలి నడకతో ఇచటకు ఎట్లు వచ్చినారు ? ఎందుకు వచ్చినారు ?

మూ. భూషయన్తావిమం దేశం చన్ద్రసూర్యావివామ్బరమ్,

పరస్పరస్య సదృశౌ ప్రమాణేఙ్గితచేష్టితైః. 5

కిమర్థం చ మునిశ్రేష్ఠ సంప్రాప్తౌ దుర్గమే పథి,

వరాయుధధరౌ వీరౌ శ్రోతుమిచ్ఛామి తత్త్వతః. 6

ప్ర. అ. మునిశ్రేష్ఠ = ఓ మునిశ్రేష్ఠుడా!, ప్రమాణేఙ్గితచేష్టితైః = ప్రమాణముచేతను, భావములచేతను, చేష్టలచేతను, పరస్పరస్య = ఒండొరులకు, సదృశౌ = సమానులును, చన్ద్రసూర్యౌ = చంద్రసూర్యులు, అమ్బరమివ = ఆకాశమును వలె, ఇమామ్ = ఈ, దేశమ్ = దేశమును, భూషయన్తౌ = అలంకరించు చున్నవారును, వరాయుధధరౌ = శ్రేష్ఠము లైన ఆయుధములను ధరించిన వారును అగు, వీరౌ = ఈ వీరులు, దుర్గమే = నడవ శక్యము కాని, పథి = మార్గమునందు, కిమర్థమ్ = ఎందునిమిత్తమై, సంప్రాప్తౌ = వచ్చినారు? తత్త్వతః = యథార్థముగా, శ్రోతుమ్ = వినుటకు, ఇచ్ఛామి = కోరుచున్నాను.

తా. మునిశ్రేష్ఠా! వీరి ప్రమాణములు, భావములు, చేష్టలు ఒకే విధముగ నున్నవి. చంద్రసూర్యులు ఆకాశమును అలంకరించి నట్లు ఈ ప్రదేశమును అలంకరించు చున్నారు. శ్రేష్ఠములైన ఆయుధములు ధరించిన ఈ వీరులు, దుర్గమ మైన మార్గమునందు ప్రయాణము చేసి ఎందుకు వచ్చినారు ? పూర్తిగ విన గోరుచున్నాను.

మూ. తస్య తద్వచనం శ్రుత్వా యథావృత్తం న్యవేదయత్,

సిద్ధాశ్రమనివాసం చ రాక్షసానాం వధం తథా. 7

ప్ర. అ. తస్య = అతనియొక్క, తత్ వచనమ్ = ఆ వాక్యమును, శ్రుత్వా = విని, సిద్ధాశ్రమ నివాసం చ = సిద్ధాశ్రమమునందు నివాసమును, తథా = మరియు, రాక్షసానామ్ = రాక్షసులయొక్క, వధమ్ = వధను, యథావృత్తమ్ = జరిగినది జరిగినట్లుగా, న్యవేదయత్ = తెలిపెను.

తా. విశ్వామిత్రుడు అతని మాటలు విని, సిద్ధాశ్రమనివాసము, రాక్షస వధము మొద లైన వృత్తాంతమును జరిగినది జరిగినట్లుగా తెలిపెను.

మూ. విశ్వామిత్రవచః శ్రుత్వా రాజా పరమహర్షితః,

అతిథీ పరమౌ ప్రాప్తౌ పుత్రౌ దశరథస్య తౌ, 8

పూజయామాస విధివత్సత్కారార్హౌ మహాబలౌ.

ప్ర. అ. రాజా = రాజైన సుమతి, విశ్వామిత్రవచః = విశ్వామిత్రుని వాక్యమును, శ్రుత్వా = విని, పరమహర్షితః = మిక్కిలి సంతసించినవాడై, పరమౌ = శ్రేష్ఠులైన, అతిథీ = అతిథులుగా ప్రాప్తౌ = వచ్చినవారును, సత్కారార్హౌ = సత్కారమునకు తగినవారును, మహాబలౌ = గొప్ప బలము కల వారును అగు, తౌ = ఆ, దశరథస్య పుత్రౌ = దశరథసుతులను, విధివత్ = యథాశాస్త్రముగా, పూజయామాస = పూజించెను.

తా. సుమతి విశ్వామిత్రుని మాటలు విని చాల సంతోషించి, గొప్ప బలము కలవారును, సత్కారము చేయదగినవారును, ఉత్తమాతిథులుగా వచ్చినవారును అగు ఆ దశరథ కుమారులను యథావిధిగా పూజించెను.

మూ. తతః పరమసత్కారం సుమతేః ప్రాప్య రాఘవౌ,

ఉష్య తత్ర నిశామేకాం జగ్మతుర్మిథిలాం తతః. 9

ప్ర. అ. రాఘవౌ = రామలక్ష్మణులు, తతః = ఆ, సుమతేః = సుమతినుండి, పరమసత్కారమ్ = గొప్ప సత్కారమును, ప్రాప్య = పొంది, తత్ర = అచట, ఏకామ్ = ఒక, నిశామ్ = రాత్రి, ఉష్య = ఉండి, తతః = పిమ్మట, మిథిలామ్ = మిథిలను గూర్చి, జగ్మతుః = వెళ్లిరి.

తా. రామలక్ష్మణులు ఆ సుమతి చేసిన సత్కారము లందికొని, ఒక రాత్రి అచట నివసించి, పిమ్మట మిథిలకు వెళ్లిరి.

మూ. తాం దృష్ట్వా మునయః సర్వే జనకస్య పురీం శుభామ్,

సాధు సాధ్వితి శంసన్తో మిథిలాం సమపూజయన్. 10

ప్ర. అ. సర్వే = సమస్త మైన, మునయః = మునులు, జనకస్య = జనకమహారాజుయొక్క, తామ్ = ఆ, శుభామ్ = శుభ మైన, పురీమ్ = పట్టణమును, దృష్ట్వా = చూచి, సాధు సాధు ఇతి = బాగున్నది బాగున్నది అని, శంసన్తః = ప్రశంసించుచు, మిథిలామ్ = ఆ మిథిలను, సమపూజయన్ = పూజించిరి.

తా. విశ్వామిత్రాది మును లందరును శుభ మైన ఆ జనకరాజపురిని చూచి బాగున్నది, బాగున్నది అని మెచ్చుకొనుచు ఆ మిథిలను పూజించిరి.

మూ. మిథిలోపవనే శూన్యమాశ్రమం దృశ్య రాఘవః,

పురాణం నిర్జనం రమ్యం పప్రచ్ఛ మునిపుఙ్గవమ్. 11

ప్ర. అ. రాఘవః = రాముడు, మిథిలోపవనే = మిథిలాసమీపమున నున్న వనమునందు, పురాణమ్ = ప్రాచీన మైనదియు, నిర్జనమ్ = జనులు లేనిదియు, రమ్యమ్ = సుందర మైనదియు, శూన్యమ్ = శూన్యమును అగు, ఆశ్రమమ్ = ఆశ్రమమును, దృశ్య = చూచి, మునిపుఙ్గవమ్ = మునిశ్రేష్ఠు డైన విశ్వామిత్రుని, పప్రచ్ఛ = అడిగెను.

తా. రాముడు, మిథిలాసమీపమునం దున్న వనమునందు, ప్రాచీనము, నిర్జనము, సుందరము, శూన్యము అయిన ఆశ్రమమును చూచి మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుని ప్రశ్నించెను.

మూ. శ్రీమదాశ్రమసంకాశం కిం న్విదం మునివర్జితమ్,

శ్రోతుమిచ్ఛామి భగవన్ కస్యాయం పూర్వ ఆశ్రమః. 12

ప్ర. అ. భగవన్ = ఓ పూజ్యుడా!, శ్రీమత్ = శోభాయుక్త మైనదియు, ఆశ్రమసంకాశమ్ = ఆశ్రమముతో సమాన మైనదియు, మునివర్జితమ్ = మునులతో శూన్య మైనదియు అగు, ఇదమ్ = ఇది, కింను = ఏమి ? పూర్వః = ప్రాచీన మైన, అయమ్ = ఈ, ఆశ్రమః = ఆశ్రమము, కస్య = ఎవరిది ? శ్రోతుమ్ = వినుటకు, ఇచ్ఛామి = కోరుచున్నాను.

తా. ఓ పూజ్యుడా! ఇది ఆశ్రమము వలె కనబడుచున్నది. ఇందు మును లెవ్వరును లేరు. ఇది ఏమి ? ప్రాచీన మైన ఈ ఆశ్రమము ఎవరిది ? వినగోరుచున్నాను.

మూ. తచ్ఛ్రుత్వా రాఘవేణోక్తం వాక్యం వాక్యవిశారదః,

ప్రత్యువాచ మహాతేజా విశ్వామిత్రో మహామునిః. 13

ప్ర. అ. వాక్యవిశారదః = వాక్యములందు నేర్పు గలవాడును, మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును అగు, విశ్వామిత్రః మహామునిః = విశ్వామిత్రమహాముని, రాఘవేణ = రామునిచేత, ఉక్తమ్ = పలకబడిన, వాక్యమ్ = వాక్యమును, శ్రుత్వా = విని, ప్రత్యువాచ = తిరిగి పలికెను.

తా. మాటలలో నేర్పు గల మహాతేజఃశాలి యగు విశ్వామిత్ర మహాముని రాముని మాటలు విని ఇట్లు పలికెను.

మూ. హన్త తే కథయిష్యామి శృణు తత్త్వేన రాఘవ,

యస్యేదమాశ్రమపదం శప్తం కోపాన్మహాత్మనా. 14

ప్ర. అ. రాఘవ = రామా!, మహాత్మనా = మహాత్ముడైన, (ఎవనిచేత) కోపాత్ = కోపమువలన, శప్తమ్ = శపింపబడిన, ఇదమ్ = ఈ, ఆశ్రమపదమ్ = ఆశ్రమము, యస్య = ఎవనిదో, తత్త్వేన = యథార్థముగా, తే = నీకు, కథయిష్యామి = చెప్పగలను. శృణు = వినుము, హన్త = ఎంత ఆనందము.

తా. రామా! చాల సంతోషము! ఆ ఆశ్రమము ఎవ్వరిదో, ఏ మహాత్ముడు కోపముచే దీనిని శపించెనో యథార్థముగా, చెప్పెదను, వినుము.

మూ. గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వమాసీన్మహాత్మనః,

ఆశ్రమో దివ్యసంకాశః సురైరపి సుపూజితః. 15

ప్ర. అ. నరశ్రేష్ఠ = ఓ నరశ్రేష్ఠా!, దివ్యసంకాశః = దేవలోకాశ్రమముతో సమాన మైన, సురైరపి = దేవతలచేత గూడ, సుపూజితః = బాగుగా పూజింపబడిన, ఆశ్రమః = ఈ ఆశ్రమము, పూర్వమ్ = పూర్వము, మహాత్మనః = మహాత్ము డైన, గౌతమస్య = గౌతమునిదిగా, ఆసీత్ = ఉండెను.

తా. రామా! దేవతలు కూడా పూజించు దివ్య మైన ఆ ఆశ్రమము పూర్వము మహాత్ము డైన గౌతమునిదై యుండెను.

మూ. స చేహ తప ఆతిష్ఠదహల్యాసహితః పురా,

వర్షపూగాననేకాంశ్చ రాజపుత్ర మహాయశః. 16

ప్ర. అ. మహాయశః = గొప్ప కీర్తి గల, రాజపుత్ర = రాజకుమారా!, పురా = పూర్వము, సః = అతడు, అహల్యాసహితః = అహల్యాసమేతుడై, అనేకాన్ = అనేకము లైన, వర్షపూగాన్ = సంవత్సర సముదాయములను, ఇహ = ఇచట, తపః = తపస్సు, ఆతిష్ఠత్ = ఆచరించెను.

తా. గొప్ప కీర్తి గల ఓ రాజకుమారా! పూర్వ మాతడు అహల్యా సమేతుడై, ఇచట, అనేక సంవత్సరముల పాటు తపస్సు చేసెను.

మూ. తస్యాన్తరం విదిత్వా తు సహస్రాక్షః శచీపతిః,

మునివేషధరోఽహల్యామిదం వచనమబ్రవీత్. 17

ప్ర. అ. శచీపతిః = శచీదేవికి భర్త యైన, సహస్రాక్షః = దేవేంద్రుడు, తస్య = అతనియొక్క, అంతరమ్ = అవకాశమును, విదిత్వా = తెలిసికొని, మునివేషధరః = ఆ గౌతమమునియొక్క వేషమును ధరించినవాడై, అహల్యామ్ = అహల్యను గూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. శచీపతి యైన దేవేంద్రుడు ఆ ముని లేని సమయము చూచి అతని వేషము ధరించి అహల్యతో ఇట్లు పలికెను.

మూ. ఋతుకాలం ప్రతీక్షన్తే నార్థినః సుసమాహితే,

సంగమం త్వహమిచ్ఛామి త్వయా సహ సుమధ్యమే. 18

ప్ర. అ. సుసమాహితే = చక్కగా సృష్టింపబడినదానా!, అర్థినః = భోగమును కోరువారు, ఋతుకాలమ్ = ఋతుకాలమును, న ప్రతీక్షన్తే = ఎదురుచూడరు. సుమధ్యమే = మంచి నడుము కలదానా!, అహమ్ = నేను, త్వయా సహ = నీతో కూడ, సంగమమ్ = సంగమమును, ఇచ్ఛామి = కోరుచున్నాను.

తా. సుందరీ! కాముకులు ఋతుకాలమునకై వేచి యుండరు. మంచి నడుము కలదానా! నీ సంగమమును కోరుచున్నాను.

మూ. మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునన్దన,

మతిం చకార దుర్మేధా దేవరాజకుతూహలాత్. 19

ప్ర. అ. రఘునన్దన = రామా!, దుర్మేధాః = దుర్బుద్ధి గల ఆమె, మునివేషమ్ = మునివేషధారి యగు వానిని, సహస్రాక్షమ్ = దేవేంద్రునిగా, విజ్ఞాయ = తెలుసుకొని, దేవరాజకుతూహలాత్ = దేవతాప్రభు వైన ఆ యింద్రునియందు ఆసక్తివలన, మతిం చకార = అంగీకరించెను.

తా. మునివేషధారి యగు ఆతడు దేవేంద్రు డని తెలిసి కూడ, దుర్బుద్ధి యైన ఆమె దేవరాజు కదా అను మక్కువచే సమ్మతించెను.

మూ. అథాబ్రవీన్నరశ్రేష్ఠ కృతార్థేనాన్తరాత్మనా, 20

కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్ఛ శీఘ్రమితః ప్రభో,

ఆత్మానం మాం చ దేవేశ సర్వథా రక్ష గౌతమాత్. 21

ప్ర. అ. నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా!, అథ = పిమ్మట, ఆమె, కృతార్థేన = నెరవేరిన పని గల, అన్తరాత్మనా = అంతఃకరణముతో, అబ్రవీత్ = పలికెను. సురశ్రేష్ఠ = ఓ దేవతాశ్రేష్ఠుడా! కృతార్థా = కృతార్థురాలను, అస్మి = అయితిని, ప్రభో = ఓ ప్రభూ! ఇతః = ఇచటినుండి, శీఘ్రమ్ = శీఘ్రముగా, గచ్ఛ = వెళ్లుము. దేవేశ = దేవరాజా!, ఆత్మానం చ = తనను, మాం చ = నన్నును, సర్వథా = అన్ని విధముల, గౌతమాత్ = గౌతమునినుండి, రక్ష = రక్షింపుము.

తా. రామా! పిమ్మట, అహల్య, కృతార్థ మైన అంతఃకరణముతో ఇట్లు పలికెను. దేవతలలో శ్రేష్ఠుడా! కృతార్థురాల నైతిని. ఓ ప్రభూ! ఇచటినుండి శీఘ్రముగా వెళ్లిపొమ్ము. ఓ దేవరాజా! నిన్ను, నన్ను కూడ గౌతమమునినుండి అన్ని విధముల రక్షించుము.

మూ. ఇన్ద్రస్తు ప్రహసన్ వాక్యమహల్యామిదమబ్రవీత్,

సుశ్రోణి పరితుష్టోఽస్మి గమిష్యామి యథాగతమ్. 22

ప్ర. అ. ఇన్ద్రస్తు = ఇంద్రు డైతే, ప్రహసన్ = నవ్వుచు, అహల్యామ్ = అహల్యను గూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను. సుశ్రోణి = అంద మైన పిరుదులు గలదానా!, పరితుష్టః అస్మి = సంతసించినాను, యథాగతమ్ = వచ్చినట్లుగానే, గమిష్యామి = వెళ్లగలను.

తా. ఇంద్రుడు నవ్వుచు, అహల్యతో - ‘‘ఓ సుందరీ! సంతోషించితిని, వచ్చినట్లే వెళ్లెదను’’ అని పలికెను.

మూ. ఏవం సంగమ్య తు తయా నిశ్చక్రామోటజాత్తతః,

స సంభ్రామాత్త్వరన్ రామ శఙ్కితో గౌతమం ప్రతి. 23

ప్ర. అ. రామ = రామా! ఏవమ్ = ఈ విధముగా, తయా = ఆమెతో, సంగమ్య = సంగమము చేసి, సః = ఆతడు, సంభ్రమాత్ = భయమువలన, త్వరన్ = తొందరపడుచు, గౌతమం ప్రతి = గౌతముని గూర్చి, శఙ్కితః = శంకించుచున్న వాడై, ఉటజాత్ = పర్ణశాలనుండి, నిశ్చక్రామ = బయలుదేరెను.

తా. రామా! ఆతడీ విధముగ అహల్యాసంగమము చేసి, గౌతము డెక్కడ వచ్చునో యని శంకించుచు, భయమువలన తొందరపడుచు, పర్ణశాల నుండి బైటకు వచ్చెను.

మూ. గౌతమం సందదర్శాథ ప్రవిశన్తం మహామునిమ్,

దేవదానవదుర్ధర్షం తపోబలసమన్వితమ్, 24

తీర్థోదకపరిక్లిన్నం దీప్యమానమివానలమ్,

గృహీతసమిధం తత్ర సకుశం మునిపుఙ్గవమ్. 25

ప్ర. అ. అథ = పిమ్మట, దేవదానవదుర్ధర్షమ్ = దేవతలచేత గాని దానవులచేత గాని ఎదిరింప శక్యము కానివాడును, తపోబలసమన్వితమ్ = తపోబలముతో కూడినవాడును, తీర్థోదకపరిక్లిన్నమ్ = తీర్థోదకముచేత తడిసిన వాడును, దీప్యమానమ్ = ప్రజ్వలించుచున్న, అనలమివ = అగ్ని వలె నున్న వాడును, గృహీతసమిధమ్ = గ్రహింపబడిన సమిధలు కలవాడును, సకుశమ్ = కుశలతో కూడినవాడును, మునిపుఙ్గవమ్ = మునులలో శ్రేష్ఠుడును అగు, గౌతమం మహామునిమ్ = గౌతమమహామునిని, తత్ర = అచట, ప్రవిశన్తమ్ = ప్రవేశించుచుండగా, సందదర్శ = చూచెను.

తా. అంతట, దేవదానవులచే ఎదిరింప శక్యము కానివాడును, తపోబలవంతుడును, తీర్థోదకముచే తడిసి ఉన్నవాడును, అగ్ని వలె ప్రకాశించు చున్నవాడును, మునులలో శ్రేష్ఠుడును అగు గౌతమమహాముని సమిధలను కుశలను గ్రహించి ఉటజమునందు ప్రవేశించుచుండగా చూచెను.

మూ. దృష్ట్వా సురపతిస్త్రస్తో వివర్ణవదనోఽభవత్,

అథ దృష్ట్వా సహస్రాక్షం మునివేషధరం మునిః 26

దుర్వృత్తం వృత్తసంపన్నో రోషాద్వచనమబ్రవీత్.

ప్ర. అ. సురపతిః = దేవేంద్రుడు, దృష్ట్వా = చూచి, త్రస్తః = భయపడినవాడై, వివర్ణవదనః = రంగుమారిన ముఖము కలవాడు, అభవత్ = ఆయెను. అథ = పిమ్మట, వృత్తసంపన్నః = మంచి నడవడిక గల, మునిః = ముని, మునివేషధరమ్ = మునివేషమును ధరించినాడును, దుర్వృత్తమ్ = చెడు నడవడిక కలవాడును అగు, సహస్రాక్షమ్ = దేవేంద్రుని, దృష్ట్వా = చూచి, రోషాత్ = కోపమువలన, వచనమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. ఆ మునిని చూడగనే దేవేంద్రుని ముఖము వెలవెలబారెను. ఉత్తమ చరిత్రశాలి యగు ఆ ముని, మునివేషములో ఉన్న దుష్టచరిత్రు డగు ఆ ఇంద్రుని చూచి కోపములో ఇట్లు పలికెను.

మూ. మమ రూపం సమాస్థాయ కృతవానసి దుర్మతే,

అకర్తవ్యమిదం తస్మాద్విఫలస్త్వం భవిష్యసి. 27

ప్ర. అ. దుర్మతే = ఓ దుర్భుద్ధీ!, మమ = నాయొక్క, రూపమ్ = రూపమును, సమాస్థాయ = గ్రహించి, ఇదమ్ = ఈ, అకర్తవ్యమ్ = చేయరానిపని, కృతవాన్ అసి = చేసినావు. తస్మాత్ = ఆ కారణమువలన, త్వమ్ = నీవు, విఫలః = వృషణములు లేనివాడవు, భవిష్యసి = కాగలవు.

తా. ఓ దుర్మతీ! నా రూపమును ధరించి ఈ విధ మైన దుష్టకార్యము నాచరించినందులకు నీ వృషణములు పడిపోవుగాక.

మూ. గౌతమేనైవముక్తస్య సరోషేణ మహాత్మనా,

పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తత్క్షణాత్. 28

ప్ర. అ. సరోషేణ = కోపముతో కూడిన, మహాత్మనా = మహాత్ము డైన, గౌతమేన = గౌతమునిచేత, ఏవమ్ = ఈ విధముగా, ఉక్తస్య = పలకబడిన, సహస్రాక్షస్య = దేవేంద్రుని యొక్క, వృషణౌ = వృషణములు, తత్ క్షణాత్ = వెంటనే, భూమౌ = భూమిపై, పేతతుః = పడినవి.

తా. గౌతముడు కోపముతో ఇట్లు పలుకగనే ఇంద్రుని వృషణములు వెంటనే నేలపై పడినవి.

మూ. తథా శప్త్వా స వై శక్రమహల్యామపి శప్తవాన్.

ఇహ వర్షసహస్రాణి బహూని త్వం వసిష్యసి, 29

వాయుభక్షా నిరాహారా తప్యన్తీ భస్మశాయినీ,

అదృశ్యా సర్వభూతానా మాశ్రమేఽస్మిన్నివత్స్యసి. 30

ప్ర. అ. సః = ఆతడు, శక్రమ్ = దేవేంద్రుని, తథా = ఆ విధముగా, శప్త్వా = శపించి, అహల్యామపి = అహల్యను కూడ, శప్తవాన్ = శపించినాడు. త్వమ్ = నీవు, ఇహ = ఇచట, బహూని = అనేకమైన, వర్షసహస్రాణి = వేల కొలది సంవత్సరములను, వనిష్యసి = నివసించగలవు. వాయుభక్షా = వాయువునే భక్షించుచున్నదానవై, నిరాహారా = ఆహారము లేనిదానవై, భస్మశాయినీ = భస్మమునందు శయనించుచున్నదానవై, తప్యన్తీ = తపస్సు చేయుచు, సర్వభూతానామ్ = సకలభూతములకును, అదృశ్యా = అదృశ్యురాలవై, అస్మిన్ = ఈ, ఆశ్రమే = ఆశ్రమమునందు, నివత్స్యసి = నివసించగలవు.

తా. గౌతముడు ఇంద్రుని ఆ విధముగ శపించి అహల్యను కూడ ఈ విధముగా శపించెను. ‘‘చాల వేలసంవత్సరముల పాటు ఇచటనే నివసించెదవు. ఎవ్వరికిని కనబడకుండగ భస్మములో పడి యుండి, ఆహార మేమియు లేక, వాయువును మాత్రమే భక్షించుచు, తపస్సు చేయుచు ఈ ఆశ్రమమునందు నివసించెదవు.’’

మూ. యదా చైతద్వనం ఘోరం రామో దశరథాత్మజః,

ఆగమిష్యతి దుర్ధర్షస్తదా పూతా భవిష్యసి. 31

ప్ర. అ. దశరథాత్మజః = దశరథుని కుమారుడును, దుర్ధర్షః = ఎదిరింప శక్యము కానివాడును అగు, రామః = రాముడు, యదా = ఎప్పుడు, ఘోరమ్ = భయంకర మైన, ఏతత్ వనమ్ = ఈ వనమును గూర్చి, ఆగమిష్యతి = రాగలడో, తదా = అప్పుడు, పూతా = పవిత్రురాలవు, భవిష్యసి = కాగలవు.

తా. దశరథకుమారు డైన రాముడు భయంకర మైన ఈ వనములో ప్రవేశించగనే నీవు శుద్ధురాలవు కాగలవు.

మూ. తస్యాతిథ్యేన దుర్వృత్తే లోభమోహవివర్జితా,

మత్సకాశే ముదా యక్తా స్వం వపుర్ధారయిష్యసి. 32

ప్ర. అ. దుర్వృత్తే = చెడ్డ నడవడిక కలదానా! ఆ రామునకు, ఆతిథ్యేన = ఆతిథ్యము చేయుటచేత, లోభమోహవివర్జితా = లోభమోహములు తొలగి పోయినదానవై, ముదా = సంతోషముతో, యుక్తా = కూడినదానవై, మత్సకాశే = నా సమీపమునందు, స్వమ్ = నీ సంబంధ మైన, వపుః = శరీరమును, ధారయిష్యసి = ధరింపగలవు.

తా.దు!వు ఆ రామునకు అతిథిసత్కారములు చేసిన తరువాత లోభమోహములు తొలగి, సంతోషవంతురాలవై, స్వరూధరించి నాతో నివసించగలవు.

మూ. ఏవముక్త్వా మహాతేజా గౌతమో దుష్టచారిణీమ్, 33

ఇమమాశ్రమముత్సృజ్య సిద్ధచారణ సేవితే,

హిమవచ్ఛిఖరే పుణ్యే తపస్తేపే మహాతపాః. 34

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే అష్టచత్వారింశః సర్గః

ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును, మహాతపాః = గొప్ప తపస్సు కలవాడును అగు, గౌతమః = గౌతముడు, దుష్టచారిణీమ్ = చెడు ప్రవర్తన గల ఆమెను గూర్చి, ఏవమ్ = ఈ విధముగా, ఉక్త్వా = పలికి, ఇమమ్ = ఈ, ఆశ్రమమ్ = ఆశ్రమమును, ఉత్సృజ్య = విడచి, సిద్ధచారణ సేవితే = సిద్ధులచేతను చారణులచేతను సేవింపబడిన, పుణ్యే = పుణ్య మైన, హిమవచ్ఛిఖరే = హిమవత్పర్వత శిఖరమునందు, తపః = తపస్సును, తేపే = చేసెను.

తా. మహాతేజఃశాలియు, మహాతపః సంపన్నుడును అగు ఆ గౌతముడు చెడ్డగా ప్రవర్తించిన ఆ అహల్యతో ఈ విధముగ పలికి, ఈ అరణ్యమును విడచి, సిద్ధులును చారణులును నివసించు హిమవత్పర్వత శిఖరమునకు పోయి, అచట తపస్సు చేసెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో నలభై ఎనిమిదవ సర్గ సమాప్తము.