| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 55 |
| Pages | 5 |
| Read Time | 8 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు
శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ ఏకోనపఞ్చాశః సర్గః
శాపముచే అండములు పోయిన ఇంద్రునకు పితృదేవతలు మేషాండములు కూర్చుట. శ్రీరాముడు అహల్యను శాపవిముక్తురాలిని చేయుట. అహల్యాగౌతములు శ్రీరాముని సత్కరించుట.
మూ. అఫలస్తు తతః శక్రో దేవానగ్నిపురోగమాన్,
అబ్రవీత్త్రస్తవదనః సర్షిసఙ్ఘాన్ సచారణాన్. 1
ప్ర. అ. తతః = పిమ్మట, అఫలః = వృషణములు లేని, శక్రః = దేవేంద్రుడు, త్రస్తవదనః = భయపడిన ముఖము కలవాడై, సర్షిసఙ్ఘాన్ = ఋషి సంఘములతో కూడినవారును, సచారణాన్ = చారణులతో కూడినవారును అగు, అగ్నిపురోగమాన్ = అగ్ని మొదలైన, దేవాన్ = దేవతలను గూర్చి, అబ్రవీత్ = పలికెను.
తా. వృషణములు పడిపోవుటచే దిగులు చెందిన దేవేంద్రుడు, అగ్ని మొదలగు దేవతలతోను, ఋషిసంఘములతోను, చారణులతోను ఇట్లు పలికెను.
మూ. కుర్వతా తపసో విఘ్నం గౌతమస్య మహాత్మనః,
క్రోథముత్పాద్య హి మయా సురకార్యమిదం కృతమ్. 2
ప్ర. అ. మహాత్మనః = మహాత్ము డైన, గౌతమస్య = గౌతమునకు, క్రోధమ్ = కోపమును, ఉత్పాద్య = పుట్టించి, తపసః = తపస్సునకు, విఘ్నమ్ = విఘ్నమును, కుర్వతా = చేసిన, మయా = నాచేత, ఇదమ్ = ఈ, సురకార్యమ్ = దేవతలకార్యము, కృతమ్ = చేయబడినది.
తా. మహాత్ము డైన గౌతమునకు కోపము కలిగించి అతని తపస్సునకు విఘ్నము చేయుట ద్వారా నేను దేవతాకార్యమును సాధించితిని.
మూ. అఫలోఽస్మి కృతస్తేన క్రోధాత్సా చ నిరాకృతా,
శాపమోక్షేణ మహతా తపోఽస్యాపహృతం మయా. 3
ప్ర. అ. తేన = అతనిచేత, క్రోధాత్ = కోపమువలన, అఫలః = వృషణములు లేనివాడను, కృతః అస్మి = చేయబడితిని. సా చ = ఆ అహల్య కూడ, నిరాకృతా = నిరాకరింపబడినది. మహతా = గొప్ప దైన, శాపమోక్షేణ = శాపము నిచ్చుటచేత, అస్య = ఈతనియొక్క, తపః = తపస్సు, మయా = నా చేత, అపహృతమ్ = అపహరింపబడినది.
తా. కోపముతో నన్నాతడు వృషణములు లేనివానినిగా చేసి, ఆ అహల్యనుకూడ పరిత్యజించినాడు. ఈ విధముగ అతడు గొప్ప శాపము నిచ్చునట్లు చేసి నే నాతని తపస్సును హరించితిని.
మూ. తస్మాత్సురవరాః సర్వే సర్షిసంఘాః సచారణాః,
సురసాహ్యకరం సర్వే సఫలం కర్తుమర్హథ. 4
ప్ర. అ. తస్మాత్ = ఆ కారణమువలన, సర్షిసంఘాః = ఋషిసంఘములతో కూడిన, సచారణాః = చారణులతో కూడిన, సర్వే = సమస్త మైన, సురవరాః = దేవతాశ్రేష్ఠులారా!, సురసాహ్యకరమ్ = దేవతలకు సహాయము చేసిన నన్ను, సఫలమ్ = వృషణములు కలవానినిగా, కర్తుమ్ = చేయుటకు, అర్హథ = తగి యున్నారు.
తా. అందుచేత, ఓ దేవతాశ్రేష్ఠులారా! ఋషులారా! చారణులారా! మీరందరును, దేవకార్యము చేసిన నాకు మరల వృషణములు వచ్చు నట్లు చేయుడు.
మూ. శతక్రతోర్వచః శ్రుత్వా దేవాః సాగ్నిపురోగమాః,
పితృదేవానుపేత్యాహుస్సహ సర్వైర్మరుద్గణైః. 5
ప్ర. అ. సాగ్నిపురోగమాః = అగ్ని మొదలైన, దేవాః = దేవతలు, శతక్రతోః = దేవేంద్రునియొక్క, వచః = వాక్యమును, శ్రుత్వా = విని, సర్వైః = సమస్త మైన, మరుద్గణైః సహ = దేవగణములతో కూడ, పితృదేవాన్ = పితృదేవతలను, ఉపేత్య = సమీపించి, ఆహుః = పలికిరి.
తా. అగ్ని మొదలైన దేవతలు ఇంద్రుని మాటలు విని, మరుద్గణములతో కలిసి పితృదేవతల దగ్గరకు వెళ్లి ఈ విధముగ పలికిరి.
మూ. అయం మేషః సవృషణః శక్రో హ్యవృషణః కృతః,
మేషస్య వృషణే గృహ్య శక్రాయాశు ప్రయచ్ఛత. 6
ప్ర. అ. అయమ్ = ఈ, మేషః = మేషము, (గొఱ్ఱె), సవృషణః = వృషణములతో కూడినది. శక్రః = దేవేంద్రుడు, అవృషణః = వృషణములు లేనివాడుగా, కృతః హి = చేయబడినాడు కదా. మేషస్య = మేషముయొక్క, వృషణౌ = వృషణములను, గృహ్య = స్వీకరించి, ఆశు = వెంటనే, శక్రాయ = దేవేంద్రునకు, ప్రయచ్ఛత = ఇవ్వండి.
తా. యజ్ఞములో మీ భాగముగా లభించు మేషమున కున్న వృషణములను తీసి వృషణములు లేని దేవేంద్రునకు ఇవ్వండి.
మూ. అఫలస్తు కృతో మేషః పరాం తుష్టిం ప్రదాస్యతి,
భవతాం హర్షణార్థాయ యే చ దాస్యన్తి మానవాః. 7
ప్ర. అ. అఫలః = వృషణములు లేనిదిగా, కృతః = చేయబడినను, మేషః = మేషము, భవతామ్ = మీకు, పరామ్ = గొప్ప, తుష్టిమ్ = ఆనందమును, ప్రదాస్యతి = ఇవ్వగలదు. యే మానవాః = ఏ మానవులు, దాస్యన్తి = ఇచ్చెదరో, (వారికి), హర్షణార్థాయ = సంతోష పెట్టుటకు, (సమర్థము కాగలదు).
తా. మేషము వృషణములు తీసివేసినను అది మీకు చాల సంతోషమును ఇవ్వగలదు. మీకు అట్టి మేషమును సమర్పించు మానవులకు కూడ సంతోషప్రదము కాగలదు. అనగా అట్టి మేషమును మీకు సమర్పించి మానవులు ఇష్ట ఫలమును పొందగలరు.
మూ. అగ్నేస్తు వచనం శ్రుత్వా పితృదేవాః సమాగతాః,
ఉత్పాట్య మేషవృషణౌ సహస్రాక్షే న్యవేశయన్. 8
ప్ర. అ. సమాగతాః = వచ్చిన, పితృదేవాః = పితృదేవతలు, అగ్నేః = అగ్నియొక్క, వచనమ్ = వచనము, శ్రుత్వా = విని, మేషవృషణౌ = మేషముయొక్క వృషణములను, ఉత్పాట్య = పెకలించి, సహస్రాక్షే = దేవేంద్రునియందు, న్యవేశయన్ = ఉంచిరి.
తా. అగ్ని మాటలు విన్న పితృదేవత లందరును కలిసి, మేషవృషణములు తీసి సహస్రాక్షునకు అతికించిరి.
మూ. తదా ప్రభృతి కాకుత్స్థ పితృదేవాః సమాగతాః,
అఫలాన్ భుఞ్జతే మేషాన్ ఫలైస్తేషామయోజయన్. 9
ప్ర. అ. కాకుత్థ్స = రామా! సమాగతాః = కలిసిన, పితృదేవాః = పితృదేవతలు, తదాప్రభృతి = అది మొదలు, అఫలాన్ = వృషణములు లేని, మేషాన్ = మేషములను, భుఞ్జతే = భుజించుచున్నారు. తేషామ్ = ఆ మేషముల యొక్క, ఫలైః = వృషణములతో, అయోజయన్ = (దేవేంద్రుని) కూర్చిరి.
తా. రామా! పితృదేవత లందరును మేషముల వృషణములను ఇంద్రునకు అతికించినారు గాన, అది మొదలు వృషణములు లేని మేషములనే భుజించు చున్నారు.
మూ. ఇన్ద్రన్తు మేషవృషణ స్తదాప్రభృతి రాఘవ,
గౌతమస్య ప్రభావేణ తపసశ్చ మహాత్మనః. 10
ప్ర. అ. రాఘవ = రామా!, మహాత్మనః = మహాత్ము డైన, గౌతమస్య = గౌతమునియొక్క, తపసః = తపస్సుయొక్క, ప్రభావేణ = ప్రభావముచేత, ఇన్ద్రఃతు = ఇంద్రు డైతే, తదాప్రభృతి = అది మొదలు, మేషవృషణః = మేషవృషణములు కలవా డైనాడు.
తా. రామా! మహాత్ము డైన గౌతముని తపఃప్రభావముచే, అది మొదలు ఇంద్రుడు మేషవృషణు డైనాడు.
మూ. తదాగచ్ఛ మహాతేజ ఆశ్రమం పుణ్యకర్మణః,
తారయైనాం మహాభాగామహల్యాం దేవరూపిణీమ్. 11
ప్ర. అ. మహాతేజః = గొప్ప తేజస్సు కలవాడా! తత్ = ఆ కారణమువలన, పుణ్యకర్మణః = పుణ్యకర్మ గల గౌతమునియొక్క, ఆశ్రమమ్ = ఆశ్రమమును గూర్చి, ఆగచ్ఛ = రమ్ము. మహాభాగామ్ = గొప్ప భాగ్యము కలదియు, దేవరూపిణీమ్ = దేవతల వంటి రూపము కలదియు అగు, ఏనామ్ = ఈ, అహల్యామ్ = అహల్యను, తారయ = తరింపచేయుము.
తా. మహాతేజఃశాలి వైన రామా! పుణ్యాత్ము డైన గౌతముని ఆశ్రమము ప్రవేశించి, మహాభాగ్యవంతురాలును, దేవతల వంటి రూపము కలదియు అగు ఈ అహల్యను తరింపచేయుము.
మూ. విశ్వామిత్రవచః శ్రుత్వా రాఘవః సహలక్ష్మణః,
విశ్వామిత్రం పురస్కృత్వ తమాశ్రమమథావిశత్. 12
ప్ర. అ. సహలక్ష్మణః = లక్ష్మణునితో కూడిన, రాఘవః = రాముడు, విశ్వామిత్రవచః = విశ్వామిత్రుని వాక్యమును, శ్రుత్వా = విని, అథ = పిమ్మట, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని, పురస్కృత్య = ముందిడుకొని, తమ్ = ఆ, ఆశ్రమమ్ = ఆశ్రమమును, అవిశత్ = ప్రవేశించెను.
తా. లక్ష్మణసమేతు డైన రాముడు, విశ్వామిత్రుని మాటలు విని అతని వెనుక నడచుచు ఆ ఆశ్రమములో ప్రవేశించెను.
మూ. దదర్శ చ మహాభాగాం తపసా ద్యోతితప్రభామ్,
లోకైరపి సమాగమ్య దుర్నిరీక్ష్యాం సురాసురైః, 13
ప్రయత్నాన్మిర్మితాం ధాత్రా దివ్యాం మాయామయీమివ,
సతుషారావృతాం సాభ్రాం పూర్ణచన్దప్రభామివ, 14
మధ్యేంఽభసో దురాధర్షాం దీప్తాం సూర్యప్రభామివ.
ప్ర. అ. మహాభాగామ్ = గొప్ప భాగ్యము కలదియు, తపసా = తపస్సుచేత, ద్యోతిత ప్రభామ్ = ప్రకాశింపచేయబడినకాంతికలదియు, లోకైరపి = జనులచేతను, సురాసురైః = దేవతలచేతను అసురులచేతను, సమాగమ్య = సమీపించి, దుర్నిరీక్ష్యామ్ = చూడ శక్యము కానిదియు, ధాత్రా = బ్రహ్మచేత, ప్రయత్నాత్ = ప్రయత్నమువలన, నిర్మితామ్ = సృజింపబడినదియు, దివ్యామ్ = దివ్య మైనదియు, మాయామయీమివ = మాయారూప మైనది వలె ఉన్నదియు, తుషారావృతామ్ = మంచుచేత కప్పబడినదియు, సాభ్రామ్ = మేఘములతో కూడినదియు అగు, పూర్ణచన్ర్దప్రభామివ = పూర్ణచంద్రకాంతి వలె ఉన్నదియు, అమ్భసః = నీటియొక్క, మధ్యే = మధ్యయందు, దురాధర్షామ్ = ఎదిరింపరాని, దీప్తామ్ = ప్రకాశించుచున్న, సూర్యప్రభామివ = సూర్యకాంతి వలె ఉన్నదియు అగు ఆ అహల్యను, సః = ఆ రాముడు, దదర్శ చ = చూచెను.
తా. రాముడు, తపస్సుచేత వృద్ధిపొందిన తేజస్సు గల, మహాభాగ్యవతి యగు, ఆ అహల్యను చూచెను. ఆమె మానవులు కాని, దేవతలు గాని, అసురులు గాని సమీపించి చూడజాలని విధముగ నుండెను. బ్రహ్మ ఆమెను ప్రయత్నపూర్వకముగ సృజించెనా అన్నట్లు దివ్యరూపవంతురాలై ఉండెను. మాయాస్వరూపిణి వలె ఉండెను. మంచు, మేఘములు కప్పిన పూర్ణచంద్రకాంతి వలెను, జలమధ్యమునందు ప్రతిబింబించిన సూర్యకాంతివలెను పైకి స్పష్టముగ కనబడకున్నను ఎదిరింపరాని తేజస్సుతో ప్రకాశించుచుండెను.
మూ. సా హి గౌతమవాక్యేయన దుర్నిరీక్ష్యా బభూవ హ,
త్రయాణామపి లోకానాం యావద్రామస్య దర్శనమ్. 15
ప్ర. అ. సా = ఆమె, గౌతమవాక్యేన = గౌతమునియొక్క వాక్యముచేత, రామస్య = రామునియొక్క, దర్శనం యావత్ = దర్శన మగునంత వరకు, త్రయాణామపి లోకానామ్ = మూడు లోకములకును, దుర్నిరీక్ష్యా = చూడ శక్యము కానిది, బభూవ హ = అయినది.
తా. గౌతమవాక్యముచే ఆమె, రామదర్శన మగునంత వరకును, మూడు లోకములలో నివసించువారి కెవ్వరికిని కూడ చూడ శక్యము కాకుండెను.
మూ. శాపస్యాన్తముపాగమ్య తేషాం దర్శనమాగతా,
రాఘవౌ త తతస్తస్యాః పాదౌ జగృహతుస్తదా. 16
ప్ర. అ. శాపస్య = శాపముయొక్క, అన్తమ్ = అంతమును, ఉపాగమ్య = పొంది, తేషామ్ = వారియొక్క, దర్శనమ్ = దర్శనమును, ఆగతా = పొందినది. తతః = పిమ్మట, రాఘవౌ = రామలక్ష్మణులు, తదా = అప్పుడు, తస్యాః = ఆమెయొక్క, పాదౌ = పాదములను, జగృహతుః = గ్రహించిరి.
తా. ఆ శాపము అంత మగుటచే ఆమె వారికి కనబడెను. పిమ్మట రామలక్ష్మణులు ఆమె పాదములు స్పశించి నమస్కరించిరి.
మూ. స్మరన్తీ గౌతమవచః ప్రతిజగ్రాహ సా చ తౌ, 17
పాద్యమర్ఘ్యం తథాతిథ్యం చకార సుసమాహితా,
మూ. ప్రతిజగ్రాహ కాకుత్థ్సో విధిదృష్టేన కర్మణా. 18
ప్ర. అ. సా చ = ఆమె కూడ, గౌతమవచః = గౌతముని వాక్యమును, స్మరన్తీ = స్మరించుచున్నదై, తౌ = వారిని, ప్రతిజగ్రాహ = సగౌరవముగా ఆహ్వానించెను. సుసమాహితా = సావధానచిత్తురాలై, పాద్యమ్ = పాద్యమును, అర్ఘ్యమ్ = అర్ఘ్యమును, తథా = మరియు, ఆతిథ్యమ్ = ఆతిథ్యమును, విధిదృష్టేన = శాస్త్రదృష్ట మైన, కర్మణా = విధానముచే, చకార = చేసెను. కాకుత్థ్సః = రాముడు, ప్రతితజగ్రాహ = స్వీకరించెను.
తా. అహల్య గౌతముని మాటలు స్మరించి, వారిని సగౌరవముగా ఆదరించుచు, శాస్త్రోక్తప్రకారమున, సావధాన మైన మనస్సుతో అర్ఘ్యపాద్యాదులు సమర్పించి అతిథిపూజ చేసెను. రాముడు ఆ సత్కారముల లన్నింటిని స్వీకరించెను.
మూ. పుష్పవృష్టిర్మహత్యాసీద్దేవదున్దుభినిస్స్వనైః,
గన్ధర్వాప్సరసాం చైవ మహానా సీత్సమాగమః. 19
ప్ర. అ. దేవదున్దుభినిస్స్వనైః = దేవతల దుందుభిధ్వనులతో కూడ, మహతీ = గొప్ప, పుష్పవృష్టిః = పుష్పవర్షము, ఆసీత్ = ఆయెను. గన్ధర్వాప్సరసాం చైవ = గంధర్వులయొక్కయు అప్సరసలయొక్కయు, మహాన్ = గొప్ప, సమాగమః = సమాగమము, ఆసీత్ = ఆయెను.
తా. దేవతలు దుందుభులు మ్రోగించి పుష్పవృష్టి కురిపించిరి. గంధర్వులు పాటలు పాడగా అప్సరసలు నాట్యము చేసిరి.
మూ. సాధు సాధ్వితి దేవాస్తామహల్యాం సమపూజయన్,
తపోబలవిశుద్ధాఙ్గీం గౌతమస్య వశానుగామ్. 20
ప్ర. అ. గౌతమస్య = గౌతమునియొక్క, వశానుగామ్ = వశములో ఉన్నదియు, తపో బలవిశుద్ధాఙ్గీమ్ = తపోబలముచే విశుద్ధ మైన శరీరముగలదియు అగు, తామ్ = ఆ, అహల్యామ్ = అహల్యను, దేవాః = దేవతలు, సాధు సాధు ఇతి = బాగు బాగు అని, సమపూజయన్ = పూజించిరి.
తా. గౌతముని ఆదేశము ప్రకారము ఘోరతపస్సు చేయుటచే పరిశుద్ధమైన శరీరము గల ఆ అహల్యను దేవత లందరును బాగు బాగు అని మెచ్చ
క
న
రి.
మూ. గౌతమోఽపి మహాతేజా అహల్యాసహితః సుఖీ,
రామం సంపూ
్య విధివత్తపస్తేపే మహాతపాః. 21
ప్ర. అ. మహాతపాః = గొప్ప తపస్సు గల, మహాతేజాః = గొప్ప తేజస్సు గల, గౌతమోఽపి = గౌతముడు కూడా, అహల్యాసహితః = అహల్యతో కూడినవాడై, సుఖీ = సుఖవంతుడై, రామమ్ = రాముని, విధివత్ = యథాశాస్త్రముగా, సంపూజ్య = పూజించి, తపః తేపే = తపస్సు చేసెను.
తా. గొప్ప తపస్తేజస్సులు గల గౌతముడు కూడ అహల్యను స్వీకరించి, సంతోషించిన వాడై, రాముని యథావిధిగా పూజించి తపస్సు చేసికొనుచుండెను.
మూ. రామోఽపి పరమాం పూజాం గౌతమస్య మహామునేః,
సకాశాద్విధివత్ప్రాప్య జగామ మిథిలాం తతః. 22
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే ఏకోనపంచాశః సర్గః
ప్ర. అ. రామోఽపి = రాముడు కూడ, గౌతమస్య మహామునేః = గౌతమమహామునియొక్క, సకాశాత్ = సమీపమునుండి, పరమామ్ = గొప్ప, పూజామ్ = పూజను, విధివత్ = యథాశాస్త్రముగ, ప్రాప్య = పొంది, తతః = అచటనుండి, మిథిలామ్ = మిథిలను గూర్చి, జగామ = వెళ్లెను.
తా. రాముడు ఆ గౌతమమహాముని యథావిధిగా చేసిన పూజను అందుకొని మిథిలకు వెళ్లెను.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో నలభై తొమ్మిదవ సర్గ సమాప్తము.
