| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 56 |
| Pages | 6 |
| Read Time | 9 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ పఞ్చాశః సర్గః
శ్రీరామాదులు మిథిలాపురి చేరుట. జనకుడు విశ్వామిత్రుని పూజించుట. జనకుడు రామలక్ష్మణులను గూర్చి అడుగగా విశ్వామిత్రుడు వారి విషయము చెప్పుట.
మూ. తతః ప్రాగుత్తరాం గత్వా రామః సౌమిత్రిణా సహ,
విశ్వామిత్రం పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్. 1
ప్ర. అ. తతః = పిమ్మట, రామః = రాముడు, సౌమిత్రిణా సహ = లక్ష్మణునితో కూడ, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని, పురస్కృత్య = పురస్కరించుకొని, ప్రాగుత్తరామ్ = ఈశాన్య దిక్కును గూర్చి, గత్వా = వెళ్లి, యజ్ఞవాటమ్ = యజ్ఞవాటికను, ఉపాగమత్ = పొందెను.
తా. పిమ్మట, లక్ష్మణసమేతు డైన రాముడు విశ్వామిత్రుని వెంట నడుచుచు ఈశాన్యదిక్కు వైపు ప్రయాణము చేసి, (జనకుని) యజ్ఞవాటమును చేరెను.
మూ. రామస్తు మునిశార్దూలమువాచ సహలక్ష్మణః,
సాధ్వీ యజ్ఞసమృద్ధిర్హి జనకస్య మహాత్మనః. 2
ప్ర. అ. సహలక్ష్మణః = లక్ష్మణసమేతు డైన, రామస్తు = రాము డైతే, మునిశార్దూలమ్ = మునిశ్రేష్ఠుని గూర్చి, ఉవాచ = పలికెను. మహాత్మనః = మహాత్ముడైన, జనకస్య = జనకునియొక్క, యజ్ఞసమృద్ధిః = యజ్ఞముయొక్క సంభారముల సంపద, సాధ్వీ = మంచిది కదా?
తా. లక్ష్మణసహితు డైన రాముడు విశ్వామిత్రునితో ఇట్లు పలికెను. మహాత్ము డైన జనకుని యజ్ఞసంభారాదులు చాల ఉత్తమముగా ఉన్నవి.
మూ. బహూనీహ సహస్రాణి నానాదేశనివాసినామ్,
బ్రాహ్మణానాం మహాభాగ వేదాధ్యయనశాలినామ్. 3
ఋషివాటాశ్చ దృశ్యన్తే శకటీశతసంకులాః,
దేశో విధీయతాం బ్రహ్మన్ యత్ర వత్స్యామహే వయమ్. 4
ప్ర. అ. మహాభాగ = పూజ్యుడా!, ఇహ = ఇచట, నానాదేశనివాసినామ్ = నానాదేశములందు నివసించువారును, వేదాధ్యయనశాలినామ్ = వేదాధ్యయనముతో ప్రకాశించు వారును అగు, బ్రాహ్మణానామ్ = బ్రాహ్మణులయొక్క, సహస్రాణి = సహస్రములును, శకటీశతసంకులాః = వందలకొలది బండ్లతో ఇరుకైన, ఋషివాటాశ్చ = ఋషుల నివాసప్రదేశములు, దృశ్యన్తే = చూడబడుచున్నవి. బ్రహ్మన్ = ఓ మహామునీ! వయమ్ = మనము, యత్ర = ఎచట, వత్స్యామహే = నివసించగలమో, అట్టి, దేశః = ప్రదేశము, విధీయతామ్ = నిర్ణయింపబడుగాక.
తా. మహామునీ! ఇచట, నానాదేశములనుండి వచ్చిన, అధ్యయనసంపన్నులైన బ్రాహ్మణులు వేలకొలది ఉన్నారు. వందల కొలది శకటములతో ఇరుకుగా ఉన్న ఋషివాటికలు కనబడుచున్నవి. ఇచట మనము నివసించుటకు అనువగు ప్రదేశమును నిర్ణయింపుము.
మూ. రామస్య వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహామునిః,
నివేశమకరోద్దేశే వివిక్తే సలిలాన్వితే. 5
ప్ర. అ. మహామునిః = మహామునియైన, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, రామస్య = రామునియొక్క, వచనమ్ = వచనమును, శ్రుత్వా = విని, సలిలాన్వితే = నీటితో కూడినదియు, వివిక్తే = జనసంమర్ద రహితమును అగు, దేశే = ప్రదేశము నందు, నివేశమ్ = విడిదిని, అకరోత్ చేసెను.
తా. విశ్వామిత్రుడు రాముని మాటలు విని, జలసమృద్ధమై, జనసంమర్దము లేని ప్రదేశమునందు విడిది చేసెను.
మూ. విశ్వామిత్రమనుప్రాప్తం శ్రుత్వా స నృపతిస్తదా,
శతానన్దం పురస్కృత్య పురోహితమనిన్దితమ్. 6
ప్రత్యుజ్జగామ సహసా వినయేన సమన్వితః.
ప్ర. అ. సః = ఆ, నృపతిః = రాజు, తదా = అప్పుడు, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని, అనుప్రాప్తమ్ = వచ్చినవానినిగా, శ్రుత్వా = విని, అనిన్దితమ్ = దోషరహితుడును, పురోహితమ్ = పురోహితుడును అగు, శతానన్దమ్ = శతానందుని, పురస్కృత్య = ఎదుట ఉంచుకొని, వినయేన = వినయముతో, సమన్వితః = కూడినవాడై, సహసా = వెంటనే, ప్రత్యుజ్జగామ = ఎదురు వెళ్లెను.
తా. జనకమహారాజు విశ్వామిత్రుడు వచ్చినట్లు విని, పుణ్యాత్ముడును, పురోహితుడును అయిన శతానందుని ముం దిడికొని, సవినయముగా ఎదురేగెను.
మూ. ఋత్విజోఽపి మహాత్మానస్త్వర్ఘ్యమాదాయ సత్వరమ్,
విశ్వామిత్రాయ ధర్మేణ దదుర్మన్త్రపురస్కృతమ్. 7
ప్ర. అ. మహాత్మానః = మహాత్ములైన, ఋత్విజోఽపి = ఋత్విక్కులు కూడ, సత్వరమ్ = శీఘ్రముగా, అర్ఘ్యమ్ = పూజాద్రవ్యమును, ఆదాయ = గ్రహించి, మంత్ర పురస్కృతమ్ = మంత్రపూర్వకముగా, ధర్మేణ = ధర్మము చేత, విశ్వామిత్రాయ = విశ్వామిత్రునకు, దదుః = ఇచ్చిరి.
తా. మహాత్ము లైన ఋత్విక్కులు శీఘ్రముగా పూజాద్రవ్యములు తీసికొని వచ్చి మంత్రపూర్వకముగా, ధర్మానుసారముగా విశ్వామిత్రునకు సమర్పించిరి.
మూ. ప్రతిగృహ్య చ తాం పూజాం జనకస్య మహాత్మనః,
పప్రచ్ఛ కుశలం రాజ్ఞో యజ్ఞస్య చ నిరామయమ్. 8
ప్ర. అ. మహాత్మనః = మహాత్ముడైన, జనకస్య = జనకునియొక్క, తామ్ = ఆ, పూజామ్ = పూజను, ప్రతిగృహ్య = స్వీకరించి, రాజ్ఞః = రాజు యొక్క, కుశలమ్ = కుశలమును, యజ్ఞస్య = యజ్ఞముయొక్క, నిరామయం చ = ఎట్టి బాధలు లేకుండుటను, పప్రచ్ఛ = అడిగెను.
తా. విశ్వామిత్రుడు, మహాత్ముడైన, ఆ జనకుడు చేసిన పూజలను అందికొని, ‘‘నీవు కుశలముగా నున్నవా ? యజ్ఞము ఎట్టి లోపములును లేక జరుగు చున్నదా ?’’ అని ప్రశ్నించెను.
మూ. స తాంశ్చాపి మునీన్ పృష్ట్వా సోపాధ్యాయపురోధసః,
యథాన్యాయం తతః సర్వైః సమాగచ్ఛత్ ప్రహృష్టవత్. 9
ప్ర. అ. సః = విశ్వామిత్రుడు, సోపాధ్యాయపురోధసః = ఉపాధ్యాయులతోను పురోహితులతోను కూడిన, మునీన్ = మునులను, యథాన్యాయమ్ = న్యాయానుసారముగా, పృష్ట్వా = కుశలాదికమును అడిగి, తతః = పిమ్మట, ప్రహృష్టవత్ = సంతోషించినవాడై, సర్వైః = వారి అందరితోడను, సమాగచ్ఛత్ = కలిసి ఉండెను.
తా. విశ్వామిత్రుడు ఉపాధ్యాయులను, పురోహితుని, మునులను న్యాయానుసారముగ కుశలప్రశ్నము చేసి వారందరితో కలిసి, ఆనందముతో నుండెను.
మూ. అథ రాజా మునిశ్రేష్ఠం కృతాఞ్జలిరభాషత,
ఆసనే భగవానాస్తాం సహైభిర్మునిపుఙ్గవైః. 10
ప్ర. అ. అథ = పిమ్మట, రాజా = రాజు, కృతాంజలిః = దోసిలి కట్టిన వాడై, మునిశ్రేష్ఠమ్ = మునిశ్రేష్ఠుని గూర్చి, అభాషత = పలికెను. భగవాన్ = పూజ్యుడ వైన నీవు, ఏభిః = ఈ, మునిపుఙ్గవైః సహ = మునిశ్రేష్ఠులతో కూడ, ఆసనే = ఆసనమునందు, ఆస్తామ్ = కూర్చుందువుగాక.
తా. పిమ్మట జనకుడు అంజలి ఘటించి విశ్వామిత్రునితో ఇట్లు పలికెను - ‘‘ఓ పూజ్యుడా! మునులతో గూడ నీవు ఆసనముపై కూర్చుండుము.’’
మూ. జనకస్య వచః శ్రుత్వా నిషసాద మహామునిః,
పురోధా ఋత్విజశ్చెవ రాజా చ సహ మన్త్రిభిః. 11
ప్ర. అ. జనకస్య = జనకునియొక్క, వచః = వాక్కును, శ్రుత్వా = విని, మహామునిః = మహాముని, నిషసాద = కూర్చుండెను. పురోధాః = పురోహితుడును, ఋత్విజశ్చైవ = ఋత్విక్కులును, మన్త్రిభిః సహ = మంత్రులతో కూడ, రాజా చ = రాజును, (కూర్చుండిరి).
తా. జనకుని వాక్యము విని విశ్వామిత్రుడు కూర్చుండెను. పిమ్మట, పురోహితు డైన శతానందుడును, ఋత్విక్కులును, రాజును, మంత్రులును కూర్చుండిరి.
మూ. ఆసనేషు యథాన్యాయముపవిష్టాన్ సమన్తతః,
దృష్ట్వా స నృపతిస్తత్ర విశ్వామిత్రమథాబ్రవీత్. 12
ప్ర. అ. అథ = పిమ్మట, సః = ఆ, నృపతిః = రాజు, తత్ర = అచట, సమన్తతః = నలువైపుల, యథాన్యాయమ్ = న్యాయానుసారముగా, ఆసనేషు = ఆసనములయందు, ఉపవిష్టాన్ = కూర్చున్న వారినందరిని, దృష్ట్వా = చూచి, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి, అబ్రవీత్ = పలికెను.
తా. వారందరును న్యాయానుసారముగ ఉచితాసనములపై కూర్చున్న పిమ్మట జనకుడు విశ్వామిత్రునితో ఇట్లు పలికెను.
మూ. అద్య యజ్ఞసమృద్ధిర్మే సఫలా దైవతైః కృతా,
అద్య యజ్ఞఫలం ప్రాప్తం భగవద్దర్శనాన్మయా. 13
ప్ర. అ. అద్య = ఈనాడు, మే = నాయొక్క, యజ్ఞసమృద్ధిః = యజ్ఞసంపద, సఫలా = ఫలము కలదిగా, దైవతైః = దేవతలచేత, కృతా = చేయబడినది. అద్య = ఈనాడు, భగవద్దర్శనాత్ = పూజ్యుడ వైన నీయొక్క దర్శనమువలన, మయా = నాచేత, యజ్ఞఫలమ్ = యజ్ఞముయొక్క ఫలము, ప్రాప్తమ్ = పొందబడినది.
తా. ఈనాడు దేవతలు సర్వాంగసంపన్న మైన నా యజ్ఞమును సఫలము చేసినారు. పూజ్యుడ వైన నీ దర్శనము లభించినది గాన ఈనాడు నా యజ్ఞము సఫల మైనది.
మూ. ధన్యోఽస్మ్యనుగృహీతోఽస్మి యస్య మే మునిపుఙ్గవ,
యజ్ఞోపసదనం బ్రహ్మన్ ప్రాప్తోఽసి మునిభిః సహ. 14
ప్ర. అ. మునిపుఙ్గవ = మునిశ్రేష్ఠుడ వైన, బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణోత్తమా!, మునిభిః సహ = మునులతో కూడ, యస్య = ఏ, మే = నాయొక్క, యజ్ఞోపసదనమ్ = యజ్ఞస్థానమును గూర్చి, ప్రాప్తః అసి = వచ్చినావో, అట్టి నేను, ధన్యః అస్మి = ధన్యుడ నైతిని. అనుగృహీతః అస్మి = అనుగ్రహింపబడినవాడ నైతిని.
తా. మునిశ్రేష్ఠుడ వగు విశ్వామిత్రా! మునులతో కలిసి నీవు నా యజ్ఞ వాటమునకు వచ్చుటచే నేను ధన్యుడ నైతిని, అనుగ్రహపాత్ర మైతిని.
మూ. ద్వాదశాహం తు బ్రహ్మర్షే శేషమాహుర్మనీషిణః,
తతో భాగార్థినో దేవాన్ ద్రష్టుమర్హసి కౌశిక. 15
ప్ర. అ. బ్రహ్మర్షే = ఓ బ్రహ్మర్షీ! మనీషిణః = విద్వాంసులు, ద్వాదశాహంతు = పండ్రెండు రోజులు మాత్రమే, శేషమ్ = శేషించినదానినిగా, ఆహుః = చెప్పుచున్నారు. కౌశిక = విశ్వామిత్రా! తతః = అటుపిమ్మట, భాగార్థినః = భాగములను కోరుచున్న, దేవాన్ = దేవతలను, ద్రష్టుమ్ = చూచుటకు, అర్హసి = తగియున్నావు.
తా. బ్రహ్మర్షి వైన విశ్వామిత్రా! ఈ యజ్ఞము పూర్తి యగుటకు ఇంక పండ్రెండు దినములే ఉన్న వని పండితులు చెప్పుచున్నారు. పిమ్మట యజ్ఞభాగములకొరకు వచ్చు దేవతలను చూడగలవు.
మూ. ఇత్యుక్త్వా మునిశార్దూలం ప్రహృష్టవదనస్తదా,
పునస్తం పరిపప్రచ్ఛ ప్రాఞ్జలిః ప్రణతో నృపః. 16
ప్ర. అ. నృపః = రాజు, మునిశార్దూలమ్ = మునిశ్రేష్ఠుని గూర్చి, ఇతి = ఈ విధముగా, ఉక్త్వా = పలికి, తదా = అప్పుడు, ప్రహృష్టవదనః = సంతసించిన ముఖము కలవాడై, ప్రాఞ్జలిః = కట్టబడిన దోసిలి కలవాడై, ప్రణతః = నమస్కరించుచు, పునః = మరల, తమ్ = ఆతనిని, పరిపప్రచ్ఛ = అడిగెను.
తా. జనకమహారాజు విశ్వామిత్రునితో ఈ విధముగా పలికి, సంతోషముతో వికసించిన ముఖము కలవాడై, దోసిలి యొగ్గి నమస్కరించుచు, మరల విశ్వామిత్రుని ఈ విధముగ ప్రశ్నించెను.
మూ. ఇమౌ కుమారౌ భద్రం తే దేవతుల్యపరాక్రమౌ,
గజసింహగతీ వీరౌ శార్దూలవృషభోపమౌ, 17
పద్మపత్రవిశాలాక్షౌ ఖడ్గతూణీధనుర్ధరౌ.
అశ్వినావివ రూపేణ సముపస్థితయౌవనౌ, 18
యదృచ్ఛయైన గాం ప్రాప్తౌ దేవలోకాదివామరౌ.
కథం పద్భ్యామిహ ప్రాప్తౌ కిమర్థం కస్య వా మునే. 19
ప్ర. అ. మునే = విశ్వామిత్రా!, తే = నీకు, భద్రమ్ = మంగళ మగుగాక. దేవతుల్య పరాక్రమౌ = దేవతలతో సమాన మైన పరాక్రమము కలవారును, గజసింహగతీ = గజసింహముల గమనమువంటి గమనము కలవారును, వీరౌ = వీరులును, శార్దూలవృషభోపమౌ = శార్దూలముతోడను, వృషభముతోడను సమానులును, పద్మపత్ర విశాలాక్షౌ = తామరపూవుల రేకుల వలె విశాల మైన నేత్రములు కలవారును, ఖడ్గతూణీధనుర్ధరౌ = ఖడ్గములను, అంబులపొదులను, ధనుస్సులను ధరించినవారును, రూపేణ = రూపముచేత, అశ్వినావివ = అశ్వినీదేవతల వలె ఉన్నవారును, సముపస్థిత యౌవనౌ = సమీపించిన యౌవనము కలవారును, దేవలోకాత్ = దేవలోకమునుండి, యదృచ్ఛయా = స్వేచ్ఛానుసారముగా, గామ్ = భూమిని, ప్రాప్తౌ = చేరిన, అమరౌ ఇవ = దేవతల వలె ఉన్నవారును అగు, ఇమౌ = ఈ, కుమారౌ = బాలులు, ఇహ = ఇచటికి, కథమ్ = ఎట్లు, కిమర్థమ్ = ఎందుకు, పద్భ్యామ్ = పాదములచేత, ప్రాప్తౌ = వచ్చినారు ? కస్య వా = ఎవరికి సంబంధించినవారు ?
తా. విశ్వామిత్రా! (నీకు క్షేమ మగు గాక.) దేవతలతో సమానమైన పరాక్రమము కలవారును, గజసింహముల నడక వంటి నడక కలవారును, వీరులును, శార్దూల వృషభములతో తుల్యులును, పద్మపత్రముల వలె విశాలమైన నేత్రములు కలవారును, ఖడ్గములను అంబులపొదులను ధనుస్సులను ధరించినవారును, అశ్వినీదేవతల వంటి సౌందర్యము కలవారును, యౌవనము సమీపించుచున్నవారును, దేవలోకమునుండి భూలోకమునకు దిగి వచ్చిన దేవతల వలె ఉన్నవారును, అగు ఈ బాలురు ఎవరివారు? ఇచటికి కాలి నడకనే వచ్చినారేమి ? ఎందుకు వచ్చినారు?
మూ. వరాయుధధరౌ వీరౌ కస్య పుత్రౌ మహామునే,
భూషయన్తావిమం దేశం చన్ద్రసూర్యావివామ్బరమ్, 20
పరస్పరస్య సదృశౌ ప్రమాణేఙ్గితచేష్టితైః,
కాకపక్షధరౌ వీరౌ శ్రోతుమిచ్ఛామి తత్త్వతః. 21
ప్ర. అ. మహామునే = ఓ మహామునీ!, వరాయుధధరౌ = శ్రేష్ఠమైన ఆయుధములను ధరించిన, వీరౌ = ఈ వీరులు, కస్య = ఎవనియొక్క, పుత్రౌ = పుత్రులు. చన్ద్రసూర్యౌ = చంద్రసూర్యులు, అమ్బరమివ = ఆకాశమును వలె, ఇమమ్ = ఈ, దేశమ్ = ప్రదేశమును, భూషయన్తౌ = అలంకరించుచున్నవారును, ప్రమాణేఙ్గితచేష్టితైః = ప్రమాణముచేతను, అభిప్రాయసూచనలచేతను, చేష్టలచేతను, పరస్పరస్య = ఒకరికొకరు, సదృశౌ = పోలిక గలవారును, కాకపక్షధరౌ = జులపములను ధరిచినవారును అగు, వీరౌ = ఈ వీరులను గూర్చి, తత్త్వతః = యథార్థముగా, శ్రోతుమ్ = వినుటకు, ఇచ్ఛాి = ఇచ్ఛయించుచున్నాను.
తా. మహామునీ! శ్రేష్ఠ మైన ఆయుధములను ధరించిన ఈ వీరులు ఎవని కుమారులు? జులపములను ధరించిన ఈ వీరులు ప్రమాణమునందును, ఇంగితములందును, చేష్టలందును ఒకరి నొకరు పోలియున్నారు. చంద్రసూర్యులు ఆకాశములను ప్రకాశింపచేసి నట్లు ఈ ప్రదేశమును ప్రకాశింప చేయుచున్నారు. ఈ వీరులను గూర్చి తెలిసికొన దలచుచున్నాను.
మూ. తస్య తద్వచనం శ్రుత్వా జనకస్య మహాత్మనః,
న్యవేదయన్మహాత్మానౌ పుత్రౌ దశరథస్య తౌ. 22
ప్ర. అ. మహాత్మనః = మహాత్ము డైన, తస్య = ఆ, జనకస్య = జనకుని యొక్క, తత్ = ఆ, వచనమ్ = వాక్యమును, శ్రుత్వా = విని, తౌ = ఆ, మహాత్మానౌ = మహాత్ములగు, దశరథస్య = దశరథునియొక్క, పుత్రౌ = పుత్రులనుగా, న్యవేదయత్ = తెలిపెను.
తా. విశ్వామిత్రుడు మహాత్ము డైన జనకుని మాటలు విని, ఆ మహాత్ము లిరువురును దశరథకుమారు లని తెలిపెను.
మూ. సిద్ధాశ్రమనివాసం చ రాక్షసానాం వధం తథా.
తచ్చాగమనమవ్యగ్రం విశాలాయాశ్చ దర్శనమ్, 23
అహల్యాదర్శనం చైవ గౌతమేన సమాగమమ్.
మహాధనుషి జిజ్ఞాసాం కర్తుమాగమనం తథా, 24
ఏతత్సర్వం మహాతేజా జనకాయ మహాత్మనే,
నివేద్య విరరామాథ విశ్వామిత్రో మహాముని. 25
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలక
ణ
డ
పఞ్చాశః సర్గః
ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, మహామునిః = మహాముని యైన, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, సిద్ధాశ్రమనివాసం చ = సిద్ధాశ్రమమునందు నివాసమును, తథా = మరియు, రాక్షసానామ్= రాక్షసులయొక్క, వధమ్ = వధను, అవ్యగ్రమ్ = నిర్భయముగా, తత్ = ఆ, ఆగమనమ్ = వచ్చుటను, విశాలాయాః = విశాలానగరముయొక్క, దర్శనమ్ = దర్శనమును, అహల్యా దర్శనం చైవ = అహల్యాదర్శనమును, గౌతమేన = గౌతమునితో, సమాగమమ్ = సమాగమమును, తథా = మరియు, మహాధనుషి = గొప్ప దైన శివధనుస్సునందు, జిజ్ఞాసామ్ = పరీక్షను, కర్తుమ్ = చేయుటకొరకు, ఆగమనమ్ = వచ్చుటను, ఏతత్సర్వమ్ = దీని నంతను, మహాత్మనే = మహాత్ము డైన, జనకాయ = జనకునకు, నివేద్య = తెలిపి, అథ = పిమ్మట, విరరామ = విరమించెను.
తా. మహాతేజఃశాలి యగు విశ్వామిత్రమహాముని, రామలక్ష్మణులు నిర్భయముగ సిద్ధాశ్రమమునకు వచ్చి, అచట నివసించిన రాక్షసులను సంహరించుట, విశాలానగరమును చూచుట, అహల్యాసందర్శనము, గౌతమునితో సమాగమము, శివధనుస్సును పరీక్షించుటకై మిథిలకు వచ్చుట మొదలగు విషయము లన్నియు జనకమహారాజునకు తెలిపెను.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో ఏబదవ సర్గ సమాప్తము.

  
36
37
38
64
39
40
41
42
43
44
45
46
47
48
74
49
50