Chapter_51

Back
Book Balakandamu
Chapter No 57
Pages 7
Read Time 10 Minutes

Chapter_51

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ ఏకపఞ్చాశః సర్గః

శతానందుడు అడుగగా విశ్వామిత్రుడు అతనికి శ్రీరాముడు అహల్యాశాపవిముక్తి కలిగించిన వృత్తాంతము చెప్పుట. మిక్కిలి సంతసించిన శతానందుడు శ్రీరాముని అభినందించి విశ్వామిత్రుని పూర్వవృత్తాంతమును వర్ణించి చెప్పుట.

మూ. తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రస్య ధీమతః,

హృష్టరోమా మహాతేజాః శతానన్దో మహాతపాః. 1

గౌతమస్య సుతో జ్యేష్ఠస్తపసా ద్యోతితప్రభః,

రామసందర్శనాదేవ పరం విస్మయమాగతః. 2

ప్ర. అ. ధీమతః = బుద్ధిమంతు డైన, తస్య = ఈ, విశ్వామిత్రస్య = విశ్వామిత్రునియొక్క, తద్ = ఈ, వచనమ్ = వచనమును, శ్రుత్వా = విని, మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును, మహాతపాః = గొప్ప తపస్సు కల వాడును, గౌతమస్య = గౌతమునియొక్క, జ్యేష్ఠః సుతః = పెద్దకుమారుడును, తపసా = తపస్సుచేత, ద్యోతితప్రభః = ప్రకాశించుచున్న కాంతి కలవాడును అగు, శతానన్దః = శతానందుడు, హృష్టరోమాః = గగుర్పాటు చెందినవాడై, రామసందర్శనాదేవ = రాముని చూడగనే, పరమ్ = గొప్ప, విస్మయమ్ = ఆశ్చర్యమును, ఆగతః = పొందినాడు.

తా. మహాతేజశ్శాలియు, మహాతపస్వియు, తపస్సుతో ప్రకాశించుచున్న వాడును అగు గౌతమజ్యేష్ఠపుత్రు డైన శతానందుడు, బుద్ధిమంతు డగు విశ్వామిత్రుని మాటలు విని, గగుర్పాటు చెందిన శరీరముతో, రాముని చూడగనే అత్యాశ్చర్యవంతు డయ్యెను.

మూ. స తౌ నిషణ్ణౌ సంప్రేక్ష్య సుఖాసీనౌ నృపాత్మజౌ,

శతానన్దో మునిశ్రేష్ఠం విశ్వామిత్రమథాబ్రవీత్. 3

ప్ర. అ. అథ = పిమ్మట, సః = ఆ, శతానన్దః = శతానందుడు, నిషణ్ణౌ = సమీపమునం దున్నవారును, సుఖాసీనౌ = సుఖముగా కూర్చున్నవారును అగు, తౌ = ఆ, నృపాత్మజౌ = రాజకుమారులను, సంప్రేక్ష్య = చూచి, మునిశ్రేష్ఠమ్ = మునులలో శ్రేష్ఠు డైన, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి, అబ్రవీత్ = పలికెను.

తా. శతానందుడు సమీపమునందే సుఖముగా కూర్చున్న ఆ రాజకుమారులను చూచి మునిశ్రేష్ఠు డైన విశ్వామిత్రునితో ఇట్లు పలికెను.

మూ. అపి తే మునిశార్దూల మమ మాతా యశస్వినీ,

దర్శితా రాజపుత్రాయ తపో దీర్ఘముపాగతా. 4

ప్ర. అ. మునిశార్దూల = మునిశ్రేష్ఠుడా!, దీర్ఘమ్ = దీర్ఘ మైన, తపః = తపస్సును, ఉపాగతా = పొందినదియు, యశస్వినీ = యశస్సుకలదియు అగు, మమ = నాయొక్క, మాతా = తల్లి, తే = నీచేత, రాజపుత్రాయ = రాజకుమారునకు, అపి దర్శితా = చూపబడినదా?

తా. ఓ మునిశ్రేష్ఠా! తీవ్రతపస్సు చేయుచున్న, యశస్విని యగు మా తల్లిని రామునకు చూపితివా?

మూ. అపి రామే మహాతేజా మమ మాతా యశస్వినీ,

వన్యైరుపాహరత్పూజాం పూజార్హే సర్వదేహినామ్. 5

ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు కలదియు, యశస్వినీ = కీర్తికలదియు అగు, మమ మాతా = నా తల్లి, సర్వదేహినామ్ = సకలప్రాణులకును, పూజార్హే = పూజించుటకు తగిన, రామే = రామునియందు, వన్యైః = వనమునందు లభ్యము లగు వస్తువులచే, పూజామ్ = పూజను, అపి ఉపాహరత్ = చేసినదా?

తా. గొప్ప తేజస్సు, యశస్సు గల మా తల్లి సర్వప్రాణులచేతను పూజింపదగిన రాముని ఫలమూలాదు లర్పించి పూజించినదా?

మూ. అపి రామాయ కథితం యథావృత్తం పురాతనమ్,

మమ మాతుర్మహాతేజో దైవేన దురనుష్ఠితమ్. 6

ప్ర. అ. మహాతేజః = గొప్ప తేజస్సు కలవాడా!, మమ = నాయొక్క, మాతుః = తల్లి విషయమున, దైవేన = దైవముచేత, దురనుష్ఠితమ్ = చెడ్డగా చేయబడిన, పురాతనమ్ = పూర్వము జరిగిన విషయము, యథావృత్తమ్ = జరిగినది జరిగినట్లుగా, రామాయ = రామునకు, అపి కథితమ్ = చెప్పబడినదా?

తా. మహాతేజశ్శాలి వైన విశ్వామిత్రా! విధిబలముచే మా తల్లి విషయమున జరిగిన వృత్తాంతము నంతను రామునకు యథాతథముగ చెప్పినావా?

మూ. అపి కౌశిక భద్రం తే గురుణా మమ సంగతా,

మమ మాతా మునిశ్రేష్ఠ రామసందర్శనాదితః. 7

ప్ర. అ. కౌశిక = విశ్వామిత్రుడా! తే = నీకు, భద్రమ్ = మంగళమగుగాక. మునిశ్రేష్ఠ = మునిశ్రేష్ఠుడా! మమ మాతా = నా తల్లి, రామసందర్శనాదితః = రామునియొక్క దర్శనాదికమువలన, మమ గురుణా = నా తండ్రితో, అపి సంగతా = కలిసినదా?

తా. మునిశ్రేష్ఠుడ వైన విశ్వామిత్రా! రాముని చూచి ఆతిథ్యాదులిచ్చుటచే పవిత్రురా లైన మా తల్లి మా తండ్రిగారిని చేరినదా?

మూ. అపి మే గురుణా రామః పూజితః కుశికాత్మజ,

ఇహాగతో మహాతేజాః పూజాం ప్రాప్తో మహాత్మనః. 8

ప్ర. అ. కుశికాత్మజ = విశ్వామిత్రా! రామః = రాముడు, మే గురుణా = నా తండ్రిచేత, అపి పూజితః = పూజింపబడినాడా? ఇహ = ఇచటికి, ఆగతః = వచ్చిన, మహాతేజాః = గొప్ప తేజస్సు గల నా తండ్రి, మహాత్మనః = మహాత్ముడైన రామునినుండి, పూజామ్ = పూజను, అపి ప్రాప్తః = పొందినాడా ?

తా. కుశికనందనా! నా తండ్రి రాముని పూజించినాడా ? అచటికి వచ్చిన నా తండ్రిని ఈ మహాత్ముడు గౌరవించినాడా ?

మూ. అపి శాన్తేన మనసా గురుర్మే కుశికాత్మజ,

ఇహాగతేన రామేణ ప్రయతేనాభివాదితః. 9

ప్ర. అ. కుశికాత్మజ = విశ్వామిత్రా!, ఇహ = ఇచటికి, ఆగతేన = వచ్చిన, ప్రయతేన = పరిశుద్ధు డైన, రామేణ = రామునిచేత, మే గురుః = నా తండ్రి, శాన్తేన = శాంత మైన, మనసా = మనస్సుతో, అపి అభివాదితః = నమస్కరింప బడినాడా ?

తా. విశ్వామిత్రా! ఆ ఆశ్రమమును చేరిన పరిశుద్ధు డగు రాముడు శాంత మైన మనస్సుతో నా తండ్రిని పూజించినాడా?

మూ. తచ్ఛ్రుత్వా వచనం తస్య విశ్వామిత్రో మహామునిః,

ప్రత్యువాచ శతానన్దం వాక్యజ్ఞో వాక్యకోవిదమ్. 10

ప్ర. అ. మహామునిః = మహామునియైన, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, తస్య = అతనియొక్క, తత్ = ఆ, వచనమ్ = వచనమును, శ్రుత్వా = విని, వాక్యజ్ఞః = వాక్యజ్ఞానము కల అతడు, వాక్యకోవిదమ్ = వాక్యము నెరిగిన, శతానన్దమ్ = శతానందుని గూర్చి, ప్రత్యువాచ = తిరిగి పలికెను.

తా. మాట లాడుటలో నేర్పు గల విశ్వామిత్రమహాముని ఆ మాటలు విని, మాటలలో నేర్పు గల ఆ శతానందునితో ఇట్లు పలికెను.

మూ. నాతిక్రాన్తం మునిశ్రేష్ఠ యత్కర్తవ్యం కృతం మయా,

సంగతా మునినా పత్నీ భార్గవేణేవ రేణుకా. 11

ప్ర. అ. మునిశ్రేష్ఠ = మునిశ్రేష్ఠుడా! న అతిక్రాన్తమ్ = (ఏ పనియు) విడువబడలేదు. మయా = నాచేత, యత్ = ఏది, కర్తవ్యమ్ = చేయదగినదో, కృతమ్ = చేయబడినది. రేణుకా = రేణుకాదేవి, భార్గవేణేవ = జమదగ్నితో వలె, పత్నీ = (భార్య) అహల్య, మునినా గౌతమునితో, సంగతా = కలినినది

తా. మునిశ్రేష్ఠుడ వైన శతానందా! చేయదగిన దంతయ చేసినాను. ఏమియు విడువలేదు. రేణుకాదేవి జమదగ్నిని చేరినట్లు అహల్య గౌతముని చేరినది.

మూ. తచ్ఛ్రుత్వా వచనం తస్య విశ్వామిత్రస్య భాషితమ్,

శతానన్దో మహాతేజా రామం వచనమబ్రవీత్. 12

ప్ర. అ. తస్య = ఆ, విశ్వామిత్రస్య = విశ్వామిత్రునియొక్క, భాషితమ్ = పలకబడిన, తత్ = ఆ, వచనమ్ = వాక్యమును, శ్రుత్వా = విని, మహాతేజాః = గొప్ప తేజస్సు గల, శతానన్దః = శతానందుడు, రామమ్ = రాముని గూర్చి, వచనమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. విశ్వామిత్రుని మాటలను విని మహాతేజశ్శాలి యగు శతానందుడు రామునితో ఇట్లనెను.

మూ. స్వాగతం తే నరశ్రేష్ఠ దిష్ట్యా ప్రాప్తోఽసి రాఘవ,

విశ్వామిత్రం పురస్కృత్య మహర్షిమపరాజితమ్. 13

ప్ర. అ. నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడ వైన, రాఘవ = రామా!, అపరాజితమ్ = పరాజయము లేని, మహర్షిమ్ = మహర్షి యైన, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని, పురస్కృత్య = పురస్కరించుకొని, దిష్ట్యా = దైవవశముచేత, ప్రాప్తః అసి = వచ్చితివి. తే = నీకు, స్వాగతమ్ = స్వాగతము.

తా. నరశ్రేష్ఠుడ వైన రామా! అడ్డు లేని మహిమ గల విశ్వామిత్ర మహర్షిని అనుసరించి దేవవశముచే (మా అదృష్టముచే) ఇచటికి వచ్చితివి. నీకు స్వాగతము.

మూ. అచిన్త్యకర్మా తపసా బ్రహ్మర్షిరతులప్రభః,

విశ్వామిత్రో మహాతేజా వేత్స్యేనం పరమాం గతిమ్. 14

ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, అచిన్త్యకర్మా = ఊహింప శక్యము కాని పనులు కలవాడు. తపసా = తపస్సు చేత, బ్రహ్మర్షిః = బ్రహ్మర్షి, అతులప్రభః = సాటి లేని కాంతి కలవాడు. ఏనమ్ = ఈతనిని, పరమామ్ = గొప్ప, గతిమ్ = గతినిగా, వేత్సి = ఎరుగుదువు.

తా. గొప్ప తేజస్సు గల ఈ విశ్వామిత్రుని కార్యములు మనస్సుతో కూడ ఊహింప శక్యము కానివి. తపస్సుచేత బ్రహ్మర్షి యైనాడు. ఈతని ప్రభావము సాటిలేనిది. ఈతనినే ఉత్తమగతిగా గ్రహించినావు.

మూ. నాస్తి ధన్యతరో రామ త్వత్తోఽన్యో భువి కశ్చన,

గోప్తా కుశికపుత్రస్తే యేన తప్తం మహత్తపః. 15

ప్ర. అ. రామ = రామా!, భువి = ఈ భూలోకమునందు, త్వత్తః = నీకంటె, ధన్యతరః = ఎక్కువ ధన్యుడు, అన్యః = మరి యొకడు, కశ్చన = ఒక్కడును, నాస్తి = లేడు. యేన = ఎవనిచేత, మహత్ = గొప్ప, తపః = తపస్సు, తప్తమ్ = చేయబడినదో, అట్టి, కుశికపుత్రః = విశ్వామిత్రుడు, తే = నీకు, గోప్తా = రక్షకుడు.

తా. రామా! గొప్ప తపస్సు చేసిన విశ్వామిత్రుడు నీకు రక్షకుడుగా ఉన్నాడు. అందుచే నీకంటె ధన్యుడు మరెవ్వడును ఈ లోకములో లేడు.

మూ. శ్రూయతాం చాభిధాస్యామి కౌశికస్య మహాత్మనః,

యథాబలం యథావృత్తం తన్మే నిగదతః శృణు. 16

ప్ర. అ. మహాత్మనః = మహాత్ము డైన, కౌశికస్య = విశ్వామిత్రుని, బలమ్ = బలము, యథా = ఎట్లో, వృత్తమ్ = చరిత్రము, యథా = ఎట్లో, అభిధాస్యామి = చెప్పెదను, తత్ = దానిని, నిగదతః = చెప్పుచున్న, మే = నా నుండి, శృణు = వినుము.

తా. విశ్వామిత్రుని బల మెంతటిదో, అతని చరిత్ర ఎట్టిదో చెప్పెదను, వినుము.

మూ. రాజాభూదేష ధర్మాత్మా దీర్ఘకాలమరిన్దమః,

ధర్మజ్ఞః కృతవిద్యశ్చ ప్రజానాం చ హితే రతః. 17

ప్ర. అ. ఏషః = ఇతడు, ధర్మాత్మా = ధర్మాత్ముడును, అరిన్దమః = శత్రువులను అణచివేయువాడును, ధర్మజ్ఞః = ధర్మములు తెలిసినవాడును, కృతవిద్యః = విద్యల నభ్యసించినవాడును, ప్రజానామ్ = ప్రజలయొక్క, హితే = హితమునందు, రతః = ఆసక్తి కలవాడును అగు, రాజా = రాజుగా, దీర్ఘకాలమ్ = చాల కాలము, అభూత్ = ఉండెను.

తా. ఈ విశ్వామిత్రుడు, చాలాకాలము పాటు, ధర్మాత్ముడను, శత్రు వినాశకుడును, ధర్మవేత్తయు, సకలవిద్యలను అభ్యసించిన వాడును, ప్రజల మేలు కోరువాడును అగు రాజుగా ఉండెను.

మూ. ప్రజాపతిసుతశ్చాసీత్కుశో నామ మహీపతిః,

కుశస్య పుత్రో బలవాన్ కుశనాభస్సుధార్మికః. 18

ప్ర. అ. ప్రజాపతిసుతః = ప్రజాపతియొక్క కుమారు డైన, కుశోనామ = కుశుడను పేరు గల, మహీపతిః = రాజు, ఆసీత్ = ఉండెను. బలవాన్ = బలవంతుడును, సుధార్మికః = మంచి ధర్మాత్ముడును అగు, కుశనాభః = కుశనాభుడు, కుశస్య = కుశునియొక్క, పుత్రః = పుత్రుడు.

తా. బ్రహ్మపుత్రు డైన కుశు డనెడు రాజు ఉండెను. ఆ కుశునకు, బలవంతుడును, ధార్మికుడును అగు కుశనాభు డను కుమారు డుండెను.

మూ. కుశనాభసుతస్త్వాసీద్గాధిరిత్యేవ విశ్రుతః,

గాధేః పుత్రో మహాతేజా విశ్వామిత్రో మహామునిః. 19

ప్ర. అ. గాధిః ఇత్యేవ = గాధి అని, విశ్రుతః = ప్రసిద్ధు డైన, కుశనాభసుతః తు = కుశనాభుని కుమారుడు, ఆసీత్ = ఉండెను. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, మహామునిః = మహాముని యైన, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, గాధేః = గాధియొక్క, పుత్రః = కుమారుడు.

తా. ప్రసిద్ధు డగు గాధి కుశనాభుని కుమారుడు. మహాతేజశ్శాలి యైన ఈ విశ్వామిత్రముని ఆ గాధియొక్క కుమారుడు.

మూ. విశ్వామిత్రో మహాతేజాః పాలయామాస మేదినీమ్,

బహువర్షసహస్రాణి రాజా రాజ్యమకారయత్. 20

ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, మేదినీమ్ = భూమిని, పాలయామాస = పరిపాలించెను. రాజా = ఈ రాజు, బహువర్షసహస్రాణి = చాల వేల సంవత్సరములు, రాజ్యమ్ = రాజ్యమును, అకారయత్ = చేసెను.

తా. మహాతేజఃశాలి యగు విశ్వామిత్రుడు రాజై చాల వేల సంవత్సరములు రాజ్యము చేసెను.

మూ. కదాచిత్తు మహాతేజా యోజయిత్వా వరూధినీమ్,

అక్షౌహిణీపరివృతః పరిచక్రామ మేదినీమ్. 21

ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు గల ఆ విశ్వామిత్రుడు, కదాచిత్ = ఒకానొకప్పుడు, వరూధినీమ్ = సేనను, యోజయిత్వా = కూర్చుకొని, అక్షౌహిణీపరివృతః = అక్షౌహిణి ప్రమాణము గల సైన్యముతో కూడిన వాడై, మేదినీమ్ = భూమిని, పరిచక్రామ = చుట్టు తిరిగెను.

తా. మహాతేజఃశాలి యగు విశ్వామిత్రుడు ఒకప్పుడు సైన్యమును సమకూర్చుకొని, అక్షౌహిణీ ప్రమాణములో నున్న సైన్యము వెంట రాగా భూమి అంతయును తిరిగెను.

మూ. నగరాణి సరాష్ట్రాణి సరితశ్చ తథా గిరీన్,

ఆశ్రమాన్ క్రమశో రామ విచరన్నాజగామ హ. 22

వసిష్ఠస్యాశ్రమపదం నానావృక్షసమాకులమ్,

నానామృగగణాకీర్ణం సిద్ధచారణ సేవితమ్. 23

దేవదానవగన్ధర్వైః కిన్నరైరుపశోభితమ్,

ప్రశాన్తహరిణాకీర్ణం ద్విజసఙ్ఘనిషేవితమ్. 24

బ్రహ్మర్షిగణసఙ్కీర్ణం దేవర్షిగణ సేవితమ్,

తపశ్చరణసంసిద్ధైరగ్నికల్పెర్మహాత్మభిః. 25

అబ్భక్షైర్వాయుభక్షైశ్చ శీర్ణపర్ణాశనైస్తథా,

ఫలమూలాశనైర్దాన్తెర్జితరోషైర్జితేన్ద్రియైః. 26

ఋషిభిర్వాలఖిల్యైశ్చ జపహోమపరాయణైః,

అన్యైర్వైఖానసైశ్చెవ సమన్తాదుపశోభితమ్. 27

ప్ర. అ. రామ = రామా! సరాష్ట్రాణి = రాష్టములతో కూడిన, నగరాణి = నగరములను, సరితః = నదులను, తథా = మరియు, గిరీన్ = పర్వతములను, ఆశ్రమాన్ = ఆశ్రమములను, క్రమశః = క్రమముగా, విచరన్ = సంచరించుచు, నానావృక్ష సమాకులమ్ = అనేకవిధము లైన వృక్షములతో ఆకులమైనదియు, నానామృగగణాకీర్ణమ్ = అనేకవిధములైన మృగగణములతో నిండినదియు, సిద్ధచారణ సేవితమ్ = సిద్ధులచేతను చారణులచేతను సేవింపబడినదియు, దేవదానవగన్ధర్వైః = దేవదానవ గంధర్వులతోను, కిన్నరైః = కిన్నరులతోను, ఉపశోభితమ్ = ప్రకాశించుచున్నదియు, ప్రశాన్తహరిణాకీర్ణమ్ = ప్రశాంతములైన లేళ్లతో కూడినదియు, ద్విజసఙ్ఘనిషేవితమ్ = పక్షుల సముదాయముచే సేవింపబడినదియు, బ్రహ్మర్షిగణసఙ్కీర్ణమ్ = బ్రహ్మర్షుల సముదాయముచే వ్యాప్త మైనదియు, దేవర్షిగణ సేవితమ్ = దేవర్షుల సముదాయములచే సేవింపబడినదియు, తపశ్చరణసంసిద్ధైః = తపస్సును ఆచరించుటచే సిద్ధి పొందిన వారును, అగ్నికల్పైః = అగ్నితుల్యులును, మహాత్మభిః = మహాత్ములును, అబ్భక్షైః = ఉదకమును మాత్రమే భక్షించువారును, వాయుభక్షైశ్చ = వాయువును మాత్రమే భక్షించువారును, తథా = మరియు, శీర్ణపర్ణాశనైః = రాలిన ఆకులే ఆహారముగా కలవారును, ఫలమూలాశనైః = ఫలములను దుంపలను తినువారును, దాన్తైః = మనోనిగ్రహము కలవారును, జితరోషైః = జయింపబడిన కోపము కలవారును, జితేన్ద్రియైః = జయించబడిన ఇంద్రియములు కలవారును అగు, ఋషిభిః = ఋషీశ్వరులతోను, జపహోమపరాయణైః = జపహోమములందు ఆసక్తులగు, వాలఖిల్యైః = వాలఖిల్యులతోను, (బ్రహ్మయొక్క వాలమునుండి పుట్టిన ఋషులు వాలఖిల్యులు), అన్యైః = ఇతరు లైన, వైఖానసైశ్చైవ = బ్రహ్మయొక్క నఖములనుండి పుట్టిన వైఖానసులతోడను, సమన్తాత్ = అంతటను, ఉపశోభితమ్ = ప్రకాశింపచేయబడిన, వసిష్ఠస్య = వసిష్ఠునియొక్క, ఆశ్రమపదమ్ = ఆశ్రమస్థానమును, ఆజగామ = చేరెను.

తా. రామా! విశ్వామిత్రుడు నగరములందును, రాష్ట్రములందును నదీగిరి ప్రాంతము లందును, ఆశ్రమములందును క్రమముగా సంచరించుచు వసిష్ఠుని ఆశ్రమమును చేరెను. ఆ ఆశ్రమము నానావిధము లగు వృక్షములతోడను, పక్షిగణములతోడను వ్యాప్త మై యుండెను. అచట సిద్ధ-చారణ-దేవ-దానవ- గంధర్వ-కిన్నరాదులు నివసించుచుండిరి. ప్రశాంతము లైన లేళ్లతోను, పక్షిసముదాయములతోను ఒప్పుచుండెను. బ్రహ్మర్షిగణములు, దేవర్షిగణములు ఆ ఆశ్రమమును ఆశ్రయించి ఉండిరి. తపస్సు నాచరించి సిద్ధి పొందిన వారును, అగ్నితో సమానులును, మహాత్ములును, మనస్సును నిగ్రహించిన వారును, రోషమును జయించినవారును జితేంద్రియులును అగు ఋషులు అచట నివసించుచుండిరి. వారిలో కొందరు నీరు మాత్రమే భక్షింప కొందరు వాయువునే భక్షించుచుండిరి. కొందరు రాలిన ఆకులను మాత్రమే ఆహారముగా తీసికొనెడివారు. మరి కొందరు పండ్లు, దుంపలు మాత్రమే ఆహారముగా తీసికొనెడివారు. జపహోమములందు ఆసక్తి గల వాలఖిల్యులు, ఇతరు లైన వైఖానసులును దీనికి శోభ కలిగించుచుండిరి.

మూ. వసిష్ఠస్యాశ్రమపదం బ్రహ్మలోకమివాపరమ్,

దదర్శ జయతాం శ్రేష్ఠో విశ్వామిత్రో మహాబలః. 28

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే ఏకపఞ్చాశః సర్గః

ప్ర. అ. జయతామ్ = జయించువారిలో, శ్రేష్ఠః = శ్రేష్ఠుడును, మహాబలః = మహాబలవంతుడును అగు, విశ్వామిత్రః = ఆ విశ్వామిత్రుడు, ఆపరమ్ = రెండవ, బ్రహ్మలోకమివ = బ్రహ్మలోకము వలె నున్న, వసిష్ఠస్య = వసిష్ఠునియొక్క, ఆశ్రమపదమ్ = ఆశ్రమమును, దదర్శ = చూచెను.

తా. విజయవంతులలో శ్రేష్ఠుడును, మహాబలశాలియు అగు విశ్వామిత్రుడు రెండవ బ్రహ్మలోకము వలె నున్న వసిష్ఠాశ్రమమును చూచెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో ఏబది ఒకటవ సర్గ సమాప్తము.