Chapter_52

Back
Book Balakandamu
Chapter No 58
Pages 6
Read Time 9 Minutes

Chapter_52

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ ద్విపఞ్చాశః సర్గః

వసిష్ఠుడు విశ్వామిత్ర మహారాజును సత్కరించుటకై కావలసిన వస్తువుల నన్నింటిని సృజింపు మని కామధేనువును ఆదేశించుట.

మూ. స దృష్ట్వా పరమప్రీతో విశ్వామిత్రో మహాబలః,

ప్రణతో వినయా ద్వీరో వసిష్ఠం జపతాం వరమ్. 1

ప్ర. అ. మహాబలః = గొప్ప బలము కలవాడును, వీరః = వీరుడును అగు, సః = ఆ, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, జపతామ్ = జపము చేయు మునులలో, వరమ్ = శ్రేష్ఠుడైన, వసిష్ఠమ్ = వసిష్ఠుని, దృష్ట్వా = చూచి, పరమప్రీతః = చాల సంతసించినవాడై, వినయాత్ = వినయము వలన, ప్రణతః = నమస్కరించెను.

తా. గొప్ప బలము కలవాడును, వీరుడును అగు ఆ విశ్వామిత్రుడు మునులలో శ్రేష్ఠు డైన వసిష్ఠుని చూచి చాల సంతసించి, సవినయముగా నమస్కరించెను.

మూ. స్వాగతం తవ చేత్యుక్తో వసిష్ఠేన మహాత్మనా,

ఆసనం చాస్య భగవాన్ వసిష్ఠోఽస్యాదిదేశ హ. 2

ప్ర. అ. తవ = నీకు, స్వాగతమ్ = స్వాగతమ్, ఇతి = అని, మహాత్మనా = మహాత్ముడైన, వసిష్ఠేన = వసిష్ఠునిచేత, ఉక్తశ్చ = పలకబడెను కూడ. భగవాన్ = భగవంతుడైన, వసిష్ఠః = వసిష్ఠుడు, అస్య = ఈతనికి, ఆసనం చ = ఆసనమును కూడ, వ్యాదిదేశ హ = ఇచ్చెను.

తా. మహాత్ముడును, పూజ్యుడును అగు వసిష్ఠుడు అతనికి స్వాగతము పలికి ఆసన మిచ్చెను.

మూ. ఉపవిష్టాయ చ తదా విశ్వామిత్రాయ ధీమతే,

యథాన్యాయం మునివరః ఫలమూలముపాహరత్. 3

ప్ర. అ. తదా = అప్పుడు, మునివరః = మునిశ్రేష్ఠుడు, ఉపవిష్టాయ = కూర్చున్న, ధీమతే = బుద్ధిమంతు డైన, విశ్వామిత్రాయ = విశ్వామిత్రునకు, యథాన్యాయమ్ = న్యాయానుసారముగా, ఫలమూలమ్ = ఫలమూలములను, ఉపాహరత్ = సమర్పించెను.

తా. అప్పుడు మునిశ్రేష్ఠు డైన వసిష్ఠుడు కూర్చున్న, బుద్ధిమంతు డైన విశ్వామిత్రునకు న్యాయానుసారముగా ఫలమూలములను సమర్పించెను.

మూ. ప్రతిగృహ్య తు తాం పూజాం వసిష్ఠాద్రాజసత్తమః,

తపోగ్నిహోత్రశిష్యేషు కుశలం పర్యపృచ్ఛత. 4

విశ్వామిత్రో మహాతేజా వనస్పతిగణే తథా,

సర్వత్ర కుశలం చాహ వసిష్ఠో రాజసత్తమమ్. 5

ప్ర. అ. రాజసత్తమః = రాజులలో శ్రేష్ఠుడును, మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును అగు, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, వసిష్ఠాత్ = వసిష్ఠునినుండి, తామ్ = ఆ, పూజామ్ = పూజను, ప్రతిగృహ్య = స్వీకరించి, తపోగ్నిహోత్రశిష్యేషు = తపస్సునందు, అగ్నిహోత్రము నందును, శిష్యులందును, తథా = మరియు, వనస్పతిగణే = వృక్షసముదాయమునందును, కుశలమ్ = కుశలమును, పర్యపృచ్ఛత = అడిగెను. వసిష్ఠః చ = వసిష్ఠుడు కూడ, సర్వత్ర = అన్నింటియందును, కుశలమ్ = కుశలమును, రాజసత్తమమ్ = ఆ రాజశ్రేష్ఠుని గూర్చి, ఆహ = చెప్పెను.

తా. మహాతేజఃశాలి యగు ఆ విశ్వామిత్రమహారాజు వసిష్ఠుడు చేసిన ఆ పూజను స్వీకరించి - ‘‘మీ తపస్సునకును, అగ్నిహోత్రమునకును, శిష్యులకును వృక్ష సముదాయమునకును క్షేమమా’’ అని ప్రశ్నించెను. ‘‘అన్నియు క్షేమముగా నున్నవి’’ అని వసిష్ఠుడు ఆతనికి చెప్పెను.

మూ. సుఖోపవిష్టం రాజానం విశ్వామిత్రం మహాతపాః,

పప్రచ్ఛ జపతాం శ్రేష్ఠో వసిష్ఠో బ్రహ్మణః సుతః. 6

ప్ర. అ. జపతామ్ = జపము చేయువారిలో, శ్రేష్ఠః = శ్రేష్ఠుడును, మహాతపాః = గొప్ప తపస్సు కలవాడును, బ్రహ్మణః = బ్రహ్మయొక్క, సుతః = కుమారుడును అగు, వసిష్ఠః = వసిష్ఠుడు, సుఖోపవిష్టమ్ = సుఖముగా కూర్చున్న, రాజానమ్ = రాజైన, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని, పప్రచ్ఛ = అడిగెను.

తా. మహాతపశ్శాలియు, మునులలో శ్రేష్ఠుడును, బ్రహ్మపుత్రుడును అగు వసిష్ఠుడు సుఖాసీనుడై ఉన్న విశ్వామిత్రమహారాజును ఇట్లు అడిగెను.

మూ. కచ్చిత్తే కుశలం రాజన్ కచ్చిద్ధర్మేణ రఞ్జయన్,

ప్రజాః పాలయసే వీర రాజవృత్తేన ధార్మిక. 7

ప్ర. అ. రాజన్ = ఓ రాజా! తే = నీకు, కుశలం కచ్చిత్ = క్షేమమే కదా! ధార్మిక = ధార్మికుడ వైన, వీర = వీరుడా! ప్రజాః = ప్రజలను, ధర్మేణ = ధర్మముచేత, రఞ్జయన్ = రంజింపచేయుచు, రాజవృత్తేన = రాజధర్మానుసారముగా, పాలయసే కచ్చిత్ = పరిపాలించుచున్నావా?

తా. రాజా! నీకు క్షేమమే కదా ? ధార్మికుడ వైన ఓ వీరుడా! ధర్మముచే ప్రజలను రక్షింపచేయుచు, వారిని రాజవృత్తానుసారముగా పాలించుచున్నావా ?

వి.‘‘న్యాయేనార్జన మర్థస్య వర్ధనం పాలనం తథా,

సత్పాత్రే ప్రతిపత్తిశ్చ రాజవృత్తం చతుర్విధమ్’’

అని చెప్పినట్లు, ధనమును న్యాయముగా ఆర్జించుట, దానిని వృద్ధిపొందించుట, రక్షించుట, సత్పాత్రములకు ఇచ్చుట అనునది ‘‘రాజవృత్తము’’.

మూ. కచ్చిత్తే సంభృతా భృత్యాః కచ్చిత్తిష్ఠన్తి శాసనే,

కచ్చిత్తే విజితాః సర్వే రిపవో రిపుసూదన. 8

ప్ర. అ. తే = నీయొక్క, భృత్యాః = పోష్యవర్గములోనివారు, సంభృతాః = బాగుగా పోషింపబడుచున్నారా? శాసనే = నీ ఆజ్ఞయందు, తిష్ఠన్తి కచ్చిత్ = ఉంటున్నారా ? రిపుసూదన = శత్రువులను సంహరించు వాడా!, తే = నీయొక్క, రిపవః = శత్రువులు, సర్వే = అందరును, విజితాః కచ్చిత్ = జయింపబడినారా ?

తా. నీవు నీ భృత్యులను చక్కగా పోషించుచున్నరా ? వారు నీ ఆజ్ఞను అతిక్రమించక ఉన్నావా ? ఓ శత్రుసంహారకా! నీ శత్రువుల నందరిని జయించితివా ?

మూ. కచ్చిద్బలేషు కోశేషు మిత్రేషు చ పరంతప,

కుశలం తే నరవ్యాఘ్ర పుత్రపౌత్రే తవానఘ. 9

ప్ర. అ. పరంతప = శత్రువులను పీండించువాడా! అనఘ = పాపములు లేనివాడా! నరవ్యాఘ్ర = నరశ్రేష్ఠుడా! బలేషు = సేనలయందును, కోశేషు = ధనాగారములందును, మిత్రేషు = మిత్రులందును, తవ = నీయొక్క, పుత్రపౌత్రే = పుత్రపౌత్రులందును, తే = నీకు, కుశలమ్ = కుశలమా ?

తా. శత్రుసంహారకు డవు, పాపరహితు డవు అయిన ఓ పురుష శ్రేష్ఠుడా! నీ సేనలు, కోశములు, మిత్రులు, పుత్రపౌత్రాదులును కుశలమా?

మూ. సర్వత్ర కుశలం రాజా వసిష్ఠం ప్రత్యుదాహరత్,

విశ్వామిత్రో మహాతేజా వసిష్ఠం వినయాన్వితః. 10

ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, రాజా = రాజైన, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, వసిష్ఠమ్ = వసిష్ఠుని గూర్చి, వినయాన్వితః = వినయముతో కూడినవాడై, వసిష్ఠం ప్రతి = వసిష్ఠుని గూర్చి, సర్వత్ర = అంతటను, కుశలమ్ = కుశలమును, ఉదాహరత్ = చెప్పెను.

తా. మహాతేజశ్శాలి యైన విశ్వామిత్రమహారాజు అంతటను కుశలమే అని వసిష్ఠునకు సవినయముగ నివేదించెను.

మూ. కృత్వోభౌ సుచిరం కాలం ధర్మిష్టౌ తాః కథాః శుభాః,

ముదా పరమయా యుక్తౌ ప్రీయేతాం తౌ పరస్పరమ్. 11

ప్ర. అ. ధర్మిష్ఠౌ = ధర్మతత్పరు లైన, తౌ ఉభౌ = వారిరువురును, పరమయా = గొప్ప, ముదా = సంతోషముతో, యుక్తౌ = కూడిన వారై, సుచిరం కాలమ్ = చాలాకాలము, శుభాః = శుభ మైన, తాః కథాః = ఆ యా విషయము లను గూర్చిన సంభాషణములను, కృత్వా = చేసి, పరస్పరమ్ = ఒండొరులను, ప్రీయేతామ్ = సంతసింపచేసికొనిరి.

తా. ధర్మనిష్ఠు లైన వారిరువురును మిక్కిలి ఆనందముతో చాల సేపు ఆయా విషయములను గూర్చి సంభాషణలు చేసికొని ఒకరి నొకరు సంతోష పెట్టుకొనిరి.

మూ. తతో వసిష్ఠో భగవాన్ కథాన్తే రఘునన్దన,

విశ్వామిత్రమిదం వాక్యమువాచ ప్రహసన్నివ. 12

ప్ర. అ. రఘునన్దన = రామా! తతః = పిమ్మట, భగవాన్ = పూజ్యుడైన, వసిష్ఠః = వసిష్ఠుడు, కథాన్తే = సంభాషణము ముగిసిన తరువాత, ప్రహసన్నివ = నవ్వుచు, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి, ఇదమ్ = ఈ, వాక్యమ్ = వాక్యమును, ఉవాచ = పలికెను.

తా. రామా! సంభాషణాంతమునందు, పూజ్యు డైన వసిష్ఠుడు నవ్వుచు విశ్వామిత్రునితో ఇట్లనెను.

మూ. ఆతిథ్యం కర్తుమిచ్ఛామి బలస్యాస్య మహాబల,

తవ చైవాప్రమేయస్య యథార్హం సంప్రతీచ్ఛ మే. 13

ప్ర. అ. మహాబల = గొప్ప బలము కలవాడా! అస్య = ఈ, బలస్య = సైన్యమునకును, అప్రమేయస్య = సాటిలేని, తవ చైవ = నీకును, యథార్హమ్ = తగు విధముగా, ఆతిథ్యమ్ = ఆతిథ్యమును, కర్తుమ్ = చేయుటకు, ఇచ్ఛామి = ఇచ్ఛయించుచున్నాను. మే = నానుండి, సంప్రతీచ్ఛ = అంగీకరింపుము.

తా. సాటి లేనివాడ వైన ఓ విశ్వామిత్రా! మహాబల శాలి వైన నీకును, నీ సైన్యమునకును యథోచితముగ అతిథిసత్కారము చేయ గోరుచున్నాను. దీనిని స్వీకరింపుము.

మూ. సత్క్రియాం తు భవానేతాం ప్రతీచ్ఛతు మయోద్యతామ్,

రాజా త్వమతిథిశ్రేష్ఠః పూజనీయః ప్రయత్నతః. 14

ప్ర. అ. భవాన్ = నీవు, మయా = నాచేత, ఉద్యతామ్ = ఇవ్వబడుచున్న, సత్ర్కియామ్ = సత్కారమును, ప్రతీచ్ఛతు = అంగీకరింతువుగాక. రాజా = రాజు వైన, త్వమ్ = నీవు, ప్రయత్నతః = ప్రయత్నపూర్వకముగా, పూజనీయః = పూజించ దగిన, అతిథిశ్రేష్ఠః = శ్రేష్ఠాతిథివి.

తా. నీవు నేనిచ్చుచున్న ఈ సత్కారమును స్వీకరింపుము. రాజు వైన నీవు ఉత్తము డైన అతిథివి. అందుచే నిన్ను ప్రయత్నపూర్వకముగా పూజింపవలసి యున్నది.

మూ. ఏవముక్తో వసిష్ఠేన విశ్వామిత్రో మహామతిః,

కృతమిత్యబ్రవీద్రాజా ప్రియవాక్యేన మే త్వయా. 15

ప్ర. అ. వసిష్ఠేన = వసిష్ఠునిచేత, ఏవమ్ = ఈ విధముగా, ఉక్తః = పలకబడిన, మహామతిః = గొప్పబుద్ధి గల, రాజా = రాజైన, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, త్వయా = నీచేత, ప్రియవాక్యేన = ప్రియవాక్యముచేతనే, కృతమ్ = ఆతిథ్యము చేయబడినది, ఇతి = అని, అబ్రవీత్ = పలికెను.

తా. వసిష్ఠుని మాటలు విన్న బుద్ధిశాలి యగు విశ్వామిత్రుడు ఇట్లు పలికెను : ‘‘నీవు ప్రియ మైన మాటలు పలికితివి. ఇదియే నాకు ఆతిథ్యము’’.

మూ. ఫలమూలేన భగవన్విద్యతే యత్తవాశ్రమే,

పాద్యేనాచమనీయేన భగవద్దర్శనేన చ, 16

సర్వథా చ మహాప్రాజ్ఞ పూజార్హేణ సుపూజితః,

గమిష్యామి నమస్తేఽస్తు మైత్రేణేక్షస్వ చక్షుషా. 17

ప్ర. అ. భగవన్ = పూజ్యుడా!, యత్ = ఏది, తవ = నీయొక్క, ఆశ్రమే = ఆశ్రమమునందు, విద్యతే = ఉన్నదో అట్టి, ఫలమూలేన = ఫలమూలాదికముచేతను, పాద్యేన = పాద్యము చేతను, ఆచమనేన చ = ఆచమనముచేతను, భగవద్దర్శనేన = పూజ్యుడ వైన నీ దర్శనము చేతను, పూజార్హేణ = పూజార్హుడ వైన నీ చేత, సర్వథా = అన్ని విధముల, సుపూజితః = బాగుగా పూజింపబడితిని. మహాప్రాజ్ఞ = గొప్ప జ్ఞానము కలవాడా!, గమిష్యామి = నేను వెళ్లెదను. తే = నీకు, నమః = నమస్కారము, అస్తు = అగుగాక. మైత్రేణ = స్నేహపూర్ణ మైన, చక్షుషా = నేత్రముతో, ఈక్షస్వ = చూచుచుండుము.

తా. మహాప్రాజ్ఞుడ వైన ఓ పూజ్యుడా! నీ ఆశ్రమములో లభించు ఫల మూలాదికమును, పాద్యమును, ఆచమనమును ఇచ్చి, పూజార్హుడ వైన నీవు నన్ను సర్వవిధముల సత్కరించితివి. ఇదియే చాలును; నేను వెళ్లెదను. స్నేహపూర్ణమైన దృష్టితో చూచుచుండుము.

మూ. ఏవం బ్రువన్తం రాజానం వసిష్ఠః పునరేవ హి,

న్యమన్త్రయత ధర్మాత్మా పునః పునరుదారధీః. 18

ప్ర. అ. ఏవమ్ = ఈ విధముగా, బ్రువన్తమ్ = మాటలాడుచున్న, రాజానమ్ = రాజును, ధర్మాత్మా = ధర్మాత్ముడును, ఉదారధీః = ఉదార మైన బుద్ధి కలవాడును అగు, వసిష్ఠః = వసిష్ఠుడు, పునరేవ = మరల, పునః పునః = మాటిమాటికిని, న్యమంత్రయత = ఆహ్వానించెను.

తా. విశ్వామిత్రుడు ఇట్లు పలికినను, ధర్మాత్ముడును, ఉదారబుద్ధియు అగు వసిష్ఠుడు ఆతిథ్యము స్వీకరింపు మని అతనిని మాటిమాటికిని నిర్బంధించెను.

మూ. బాఢమిత్యేవ గాధేయో వసిష్ఠం ప్రత్యువాచ హ,

యథాప్రియం భగవతస్తథాస్తు మునిపుఙ్గవ. 19

ప్ర. అ. గాధేయః = విశ్వామిత్రుడు, వసిష్ఠమ్ = వసిష్ఠుని గూర్చి, మునిపుఙ్గవ = మునిశ్రేష్ఠుడా! బాఢమ్ = తప్పక అటులనే చేసెదను. భగవతః = పూజ్యుడవైన నీకు, యథా = ఏ విధముగా, అభిమతమ్ = సంమతమగునో, తథా = అట్లే, అస్తు = అగుగాక.

తా. చివరికి విశ్వామిత్రుడు, వసిష్ఠునితో, ‘‘మునిశ్రేష్ఠా! నీకు ఎట్లు ప్రియమో అట్లే తప్పక అగును గాక’’ అని పలికెను.

మూ. ఏవముక్తో మహాతేజా వసిష్ఠో జపతాం వరః,

ఆజుహావ తతః ప్రీతః కల్మాషీం ధూతకల్మషః. 20

ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, జపతాం వరః = మునీశ్వరులలో గొప్పవాడైన, ధూతకల్మషః = తొలగించబడిన పాపములు గల, వసిష్ఠః = వసిష్ఠుడు, ప్రీతః = సంతసించిన వాడై, తతః = పిమ్మట, కల్మాషీమ్ = చిత్రవర్ణము గల ధేనువును, ఆజుహావ = పిలచెను.

తా. మహాతేజశ్శాలియు, మునులలో గొప్పవాడును, పాపములను నశింప చేయువాడును అగు వసిష్ఠుడు విశ్వామిత్రుని మాటలు విని సంతోషించి, చిత్రవర్ణము గల కామధేనువును పిలిచెను.

మూ. ఏహ్యేహి శబలే క్షిప్రం శృణు చాపి వచో మమ,

సబలస్యాస్య రాజర్షేః కర్తుం వ్యవసితోఽస్మ్యహమ్. 21

భోజనేన మహార్హేణ సత్కారం సంవిధత్స్వ మే.

ప్ర. అ. శబలే = చిత్రవర్ణము గల ఓ ధేనువా! క్షిప్రమ్ = శీఘ్రముగా, ఏహి ఏహి = రమ్ము రమ్ము. మమ = నాయొక్క, వచః = వాక్కును, శృణు చ అపి = వినుము. అహమ్ = నేను, మహార్హేణ = శ్రేష్ఠ మైన, భోజనేన = భోజనముచేత, సబలస్య = సేనతో కూడిన, అస్య = ఈ, రాజర్షేః = రాజర్షికి, సత్కారమ్ = సత్కారమును, కర్తుమ్ = చేయుటకు, వ్యవసితః అస్మి = నిశ్చయించితిని. మే = నాకు, సంవిధత్స్వ = ఏర్పాట్లు చేయుము.

తా. ఓ శబలా! రమ్ము రమ్ము. నా మాట వినుము. నేను సేనాసమేతు డైన ఈ రాజర్షికి శ్రేష్ఠ మైన భోజన మొసగి సత్కరింప నిశ్చయించినాను. తగిన ఏర్పాట్లు చేయుము.

మూ. యస్య యస్య యథాకామం షడ్రసేష్వభిపూజితమ్,

తత్సర్వం కామధుక్ క్షిప్రమభివర్ష కృతే మమ. 22

ప్ర. అ. కామధుక్ = ఓ కామధేనువా! యస్య యస్య = ఎవరెవరికి, (యద్యత్ = ఏది ఏది), షడ్రసేషు = ఆరు రసములలో, అభిపూజితమ్ = ఇష్ట మైనదో, తత్సర్వమ్ = దానినంతను, యథాకామం = అతడు కోరిన విధముగ, మమ కృతే = నా నిమిత్తమై, క్షిప్రమ్ = శీఘ్రముగా, అభివర్ష = వర్షించుము.

తా. ఎవరికి ఏది ఇష్టమో దానిని అతని కోరిక ప్రకారము, నాకుగాను శీఘ్రముగా ఇమ్ము.

మూ. రసేనాన్నేన పానేన లేహ్యచోష్యేణ సంయుతమ్,

అన్నానాం నిచయం సర్వం సృజస్వ శబలే త్వర. 23

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే ద్విపఞ్చాశః సర్గః

ప్ర. అ. శబలే = ఓ శబలా! రసేన = రసముతోడను, అన్నేన = అన్నముతోడను, పానేన = త్రాగదగిన వాటితోడను, లేహ్యచోష్యేణ = నాకదగిన వాటితోడను, పీల్చదగిన దానితోడను, సంయుతమ్ = కూడిన, సర్వమ్ = సమస్త మైన, అన్నానామ్ = అన్నముల యొక్క, నిచయమ్ = సముదాయమును, సృజస్వ = సృష్టించుము, త్వర = తొందరపడుము.

తా. ఓ శబలా ! రసాయనముతోను, తినదగినవి, త్రాగదగినవి, నాకదగినవి, పీల్చదగినవి మొదలయిన పదార్థములతోను కూడిన ఆహారసముదాయమును శీఘ్రముగా సమకూర్చుము.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో ఏబదిరెండవ సర్గ సమాప్తము.