Chapter_53

Back
Book Balakandamu
Chapter No 59
Pages 6
Read Time 10 Minutes

Chapter_53

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ త్రిపఞ్చాశః సర్గః

కామధేనువు సృజించిన అన్నపానాదులచే విశ్వామిత్రుడును, ఆతని సైన్యమును బాగుగ సంతృప్తి చెందిన పిమ్మట విశ్వామిత్రుడు కామధేనువును తన కిమ్మని వసిష్ఠుని కోరుట. వసిష్ఠు డాతని కోరికను నిరాకరించుట.

మూ. ఏవముక్తా వరిష్ఠేన శబలా శత్రుసూదన,

విదధే కామధుక్కామాన్యస్య యస్య యథేప్సితమ్. 1

ప్ర. అ. శత్రుసూదన = శత్రువులను సంహరించు రామా ! వసిష్ఠేన = వసిష్ఠునిచేత, ఏవమ్ = ఈ విధముగా, ఉక్తా = పలకబడిన, కామధుక్ = కోరిన వస్తువులను పిదికెడు, శబలా = చిత్రవర్ణము గల ఆ ధేనువు, యస్య యస్య = ఎవనికి ఎవనికి, యథా = ఎట్లు, ఈప్సితమ్-ఇష్టమో, ఆ విధముగా, కామాన్ = కామములను, విదధే = సమకూర్చెను.

తా. రామా! ఆ కామధేనువు వసిష్ఠుడు చెప్పిన విధముగ ఎవరెవరికి ఏది ఇష్టమో దాని నంతయు సమకూర్చెను.

మూ. ఇక్షూన్మధూంస్తథా లాజాన్ మైరేయాంశ్చ వరాసనాన్,

పానాని చ మహార్హాణి భక్ష్యాంశ్చోచ్చావచాం స్తథా. 2

ప్ర. అ. ఇక్షూన్ = చెరకుగడలను, మధూన్ = తేనెలను, తథా = మరియు, లాజాన్ = పేలాలను, వరాసనాన్ = మంచి పాత్రలు గల, మైరేయాన్ చ = మద్యములను, మహార్హాణి = శ్రేష్ఠ మైన, పానాని చ = పానములను, ఉచ్చావచాన్ = అనేక భేదములు గల, భక్ష్యాంశ్చ = తినుబండారములను, సృజించెను.

తా. ఆ కామధేనువు, చెఱకు గడలు, తేనెలు, పేలాలు, మంచి పాత్రలలో పోసిన మద్యములు, శ్రేష్ఠము లైన పానీయములు, అనేక విధములైన భక్ష్యములు సృజించెను.

మూ. ఉష్ణాఢ్యస్యోదనస్యాత్ర రాశయః పర్వతోపమాః,

మృష్టాన్నాని చ సూపాశ్చ దధికుల్యాస్తథైవ చ. 3

నానాస్వాదురసానాం చ షాడబానాం తథైవ చ,

భాజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశః. 4

ప్ర. అ. అత్ర = ఇచట, ఉష్ణాఢ్యస్య = వేడితో కూడిన, ఓదనస్య = అన్నముయొక్క, పర్వతోపమాః = పర్వతముల వంటి, రాశయః = రాశులును, మృష్టాన్నాని చ = శ్రేష్ఠము లైన అన్నములును, సూపాశ్చ = పప్పులును, తథైవ = మరియు, దధికుల్యాః = పెరుగు కాలువలును, నానాస్వాదురసానామ్ = అనేక విధము లైన మధురమైన రసము గల, షాడబానామ్ = షడ్రసభక్ష్యములయొక్క, సుపూర్ణాని = బాగుగా నిండిన, భాజనాని = పాత్రలును, గౌడాని చ = బెల్లముతో వేసిన పదార్థములును, సహస్రశః = వేలకొలది, (ఏర్పడినవి).

తా. అచట పర్వతముల వంటి వేడిగా ఉన్న అన్నరాశులును, మధురాన్నములును, సూపములును, పెరుగు కాలువలును, వివిధ రసములను చేర్చి వండిన పదార్థములతో నింపబడిన పాత్రలును, బెల్లముతో చేసిన పదార్థములును వేలకొలది ఏర్పడినవి.

మూ. సర్వమాసీత్సుసంతుష్టం హృష్టపుష్టజనాయుతమ్,

విశ్వామిత్రబలం రామ వసిష్ఠేనాభితర్పితమ్. 5

ప్ర. అ. రామ = రామా! విశ్వామిత్రబలమ్ = విశ్వామిత్రసైన్యము, సర్వమేవ = అంతయు, వసిష్ఠేన = వసిష్ఠునిచేత, అభితర్పితమ్ = తృప్తిపొందింపబడినదై, సుసంతుష్టమ్ = బాగుగా సంతోషించినది గాను, హృష్టపుష్టజనాయుతమ్ = బాగుగా తిని సంతసించిన జనులతో నిండినదిగాను, ఆసీత్ = ఆయెను.

తా. రామా! ఈ విధముగా వసిష్ఠుని ఆతిథ్యముచే విశ్వామిత్రుని సైన్యములోనివా రందరును భుజించి, సంతృప్తి చెంది, ఆనందించిరి.

మూ. విశ్వామిత్రోఽపి రాజర్షిర్హష్టః పుష్టస్తదాఽభవత్,

సాన్తఃపురవరో రాజా సబ్రాహ్మణపురోహితః. 6

ప్ర. అ. తదా = అప్పుడు, సాన్తఃపురవరః = శ్రేష్ఠ మైన అంతఃపురముతో కూడిన, సబ్రాహ్మణపురోహితః = బ్రాహ్మణపురోహితులతో కూడిన, రాజర్షిః = ఋషి వంటి రాజైన, విశ్వామిత్రః రాజాపి = విశ్వామిత్ర మహారాజు కూడ, హృష్టః = సంతసించినాడును, పుష్టః = తృప్తిచెందినవాడును, అభవత్ = ఆయెను.

తా. రాజర్షి యైన విశ్వామిత్రుడును, ఆతని అంతఃపురకాంతలును, అతనితో వచ్చిన బ్రాహ్మణపురోహితాదులును, తృప్తి చెంది ఆనందించిరి.

మూ. సామాత్యో మన్త్రిసహితః సభృత్యః పూజితస్తదా,

యుక్తః పరమహర్షేణ వసిష్ఠమిదమబ్రవీత్. 7

ప్ర. అ. తదా = అప్పుడు, పూజితః = పూజింపబడినవాడును, సామాత్యః = అమాత్యులతో కూడినవాడును, మన్త్రిసహితః = మంత్రులతో కూడినవాడును, సభృత్యః = భృత్యులతో కూడినవాడును అగు విశ్వామిత్రుడు, పరమహర్షేణ = గొప్ప సంతోషముతో, యుక్తః = కూడినవాడై, వసిష్ఠమ్ = వసిష్ఠుని గూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. అమాత్య-మంత్రి-భృత్యసమేతముగ వసిష్ఠుని పూజ లందుకొన్న విశ్వామిత్రుడు సంతోషించి వసిష్ఠునితో ఇట్లు పలికెను.

మూ. పూజితోఽహం త్వయా బ్రహ్మన్ పూజార్హేణ సుసత్కృతః,

శ్రూయతామభిధాస్యామి వాక్యం వాక్యవిశారద. 8

ప్ర. అ. బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణోత్తమా! పూజార్హేణ = పూజింప దగిన, త్వయా = నీచేత, అహమ్ = నేను, పూజితః = పూజింపబడితిని. సుసత్కృతః = బాగుగా సత్కరింపబడితిని. వాక్యవిశారద = వాక్యములందు నేర్పు గలవాడా! వాక్యమ్ = వాక్యమును, అభిధాస్యామి = చెప్పగలను; శ్రూయతామ్ = వినబడుగాక.

తా. ఓ బ్రాహ్మణోత్తమా! పూజార్హుడ వైన నీవు నన్ను పూజించి సత్కరించినావు. ఓ వాక్యవిశారదుడా! నే నొక మాట చెప్పెదను. వినుము.

మూ. గవాం శతసహస్రేణ దీయతాం శబలా మమ,

రత్నం హి భగవన్నేతద్రత్నహరీ చ పార్థివః, 9

తస్మాన్శే శబలాం దేహి మమైషా ధర్మతో ద్విజ.

ప్ర. అ. గవామ్ = గోవులయొక్క, శతసహస్రేణ = నూరువేలచేత, శబలా = శబల, మమ = నాకు, దీయతామ్ = ఇవ్వబడుగాక. భగవన్ = ఓ పూజ్యుడా!, ఏతత్ = ఇది, రత్నం హి = రత్నము కదా. పార్థివః = రాజు, రత్నహారీ = రత్నములను తీసికొనువాడు. ద్విజ = ఓ బ్రాహ్మణుడా! తస్మాత్ = ఆ కారణమువలన, శబలామ్ = ఈ శబలను, మే = నాకు, దేహి = ఇమ్ము. ఏషా = ఇది, ధర్మతః = ధర్మానుసారముగా, మమ = నాకు చెందినది.

తా. లక్షగోవుల నిచ్చెదను; ఈ శబలను నా కిమ్ము. ఓ పూజ్యుడా! ఈ ధేనువు రత్నము వంటిది. రత్నములు రాజు సొమ్ము. అందుచే ఇది నాకు చెందవలసి యున్నది. కావున ఈ ధేనువును నా కిమ్ము.

మూ. ఏవముక్తస్తు భగవాన్ వసిష్ఠో మునిసత్తమః,

విశ్వామిత్రేణ ధర్మాత్మా ప్రత్యువాచ మహీపతిమ్. 10

ప్ర. అ. విశ్వామిత్రేణ = విశ్వామిత్రునిచేత, ఏవమ్ = ఇట్లు, ఉక్తః = పలకబడిన, భగవాన్ = పూజ్యు డైన, ధర్మాత్మా = ధర్మాత్ముడైన, మునిసత్తమః = మునులలో శ్రేష్ఠు డైన, వసిష్ఠః = వసిష్ఠుడు, మహీపతిమ్ = రాజునుగూర్చి, ప్రత్యువాచ = తిరిగి పలికెను.

తా. ధర్మాత్ము డైన వసిష్ఠమహాముని, విశ్వామిత్రుని మాటలు విని అతని కిట్లు బదులు చెప్పెను.

మూ. నాహం శతసహస్రేణ నాపి కోటిశతైర్గవామ్,

రాజన్ దాస్యామి శబలాం రాశిభీ రజతస్య చ. 11

ప్ర. అ. రాజన్ = రాజా! అహమ్ = నేను, గవామ్ = గోవులయొక్క, శతసహస్రేణ = లక్షలకు, శబలామ్ = శబలను, న దస్యామి = ఇవ్వను. కోటి శతైః అపి = వందల కొలది కోటుల ఆవులకు బదులుగా కూడ, న = ఇవ్వను. రజతస్య = వెండియొక్క, రాశిభిః చ = రాశులచేత కూడ, (ఇవ్వను).

తా. రాజా! నీవు లక్షలకొలది ఆవు లిచ్చినను, కొన్ని వందల కోట్లు ఆవు లిచ్చినను, వెండి రాశు లిచ్చినను నే నీ శబలను ఇవ్వను.

మూ. న పరిత్యాగమర్హేయం మత్సకాశాదరిందమ,

శాశ్వతీ శబలా మహ్యం కీర్తిరాత్మవతో యథా. 12

ప్ర. అ. అరిందమ = శత్రువులను పీడించువాడా! ఇయమ్ = ఈ ధేనువు, మత్సకాశాత్ = నా సమీపమునుండి, పరిత్యాగమ్ = విడచుటను గూర్చి, న అర్హా = తగినది కాదు. ఆత్మవతః = బుద్ధిశాలికి లేదా ధైర్యశాలికి, కీర్తిః యథా = కీర్తి వలె, శబలా = శబల, మహ్యమ్ = నాకు, శాశ్వతీ = శాశ్వత మైనది.

తా. శత్రుసంహారకుడ వైన ఓ విశ్వామిత్రా! ఈ ధేనువు నానుండి దూరమగుటకు వీలు లేదు. ఈ ధేనువునకును నాకును ఉన్న సంబంధము బుద్ధిమంతునకును కీర్తికిని గల సంబంధము వలె శాశ్వత మైనది.

మూ. అస్యాం హవ్యంచ కవ్యం చ ప్రాణయాత్రా తథైవ చ,

ఆయత్తమగ్నిహోత్రం చ బలిర్హోమస్తథైవ చ. 13

ప్ర. అ. హవ్యం చ = (దేవతల కీయదగిన) హవ్యము, కవ్యం చ = (పితృదేవతల కీయ దగిన) కవ్యము, తథైవ చ = మరియు, ప్రాణయాత్రా = నా ప్రాణయాత్రయు, అగ్నిహోత్రం చ = అగ్నిహోత్రము, బలిః = భూతబలియు, తథైవ చ = మరియు, హోమః = హోమము, అస్యామ్ = ఈ ధేనువునందు, ఆయత్తమ్ = ఆధారపడి యున్నది.

తా. హవ్యము, కవ్యము, నా ప్రాణయాత్ర, అగ్నిహోత్రము, భూతబలి, హోమము - ఇవి అన్నియు ఈ ధేనువు పై ఆధారపడి యున్నవి.

మూ. స్వాహాకారవషట్కారౌ విద్యాశ్చ వివిధాస్తథా,

ఆయత్తమత్ర రాజర్షే సర్వమేతన్న సంశయః. 14

ప్ర. అ. రాజర్షే = ఓ రాజర్షీ, స్వాహాకారవషట్కారౌ = స్వాహా’ ‘‘వషట్’’ అనునవియు, తథా = మరియు, వివిధాః = అనేకవిధము లైన, విద్యాః = విద్యలును, ఏతత్ సర్వమ్ = ఇది అంతయు, అత్ర = ఈ ధేనువునందు, ఆయత్తమ్ = ఆధారపడి యున్నది. సంశయః = సంశయము, న = లేదు.

తా. ఓ రాజర్షీ స్వాహాకారవషట్కారములు, (అనగా దేవతాదులకు హవిరాదులు అర్పించుట అని అర్థము) నానావిధము లైన విద్యలు, ఇవన్నియు ఈ కామధేనువు మీదనే ఆధారపడి యున్నవి. సందేహము లేదు.

మూ. సర్వస్వమేతత్సత్యేన మమ తుష్టికరీ సదా,

కారణైర్బహుభీ రాజన్న దాస్యే శబలాం తవ. 15

ప్ర. అ. ఏతత్ = ఇది, సత్యేన = నిజముగ, మమ = నాయొక్క, సర్వస్వమ్ = సర్వస్వము. సదా = ఎల్లప్పుడును, తుష్టికరీ = ఆనందము కలిగించునది. రాజన్ = రాజా! బహుభిః = అనేక మైన, కారణైః = కారణములచేత, శబలామ్ = శబలను, తవ = నీకు, న దాస్యే = ఇవ్వను.

తా. రాజా! నిజముగ ఈ ధేనువు నా సర్వస్వము. నాకు ఆనందము కలిగించునది. ఇంకను అనేక కారణములను బట్టి కూడ ఈ ధేనువును నీకు ఇవ్వను.

మూ. వసిష్ఠేనైవముక్తస్తు విశ్వామిత్రోఽబ్రవీత్తతః,

సంరబ్ధతరమత్యర్థం వాక్యం వాక్యవిశారదః. 16

ప్ర. అ. వాక్యవిశారదః = మాటలలో నేర్పరి యైన, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, వసిష్ఠేన = వసిష్ఠునిచేత, ఏవమ్ = ఈ విధముగా, ఉక్తః = పలకబడిన వాడై, తతః = అటుపిమ్మట, అత్యర్థమ్ = మిక్కిలి, సంరబ్ధతరమ్ = తొందరబాటుతో కూడిన, వాక్యమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. మాటలలో నేర్పరి యైన విశ్వామిత్రుడు వసిష్ఠుని మాటలు విని, మిక్కిలి తొందరబాటుతో ఇట్లు పలికెను.

మూ. హైరణ్యకక్ష్యాగ్రైవేయాన్ సువర్ణాఙ్కుశభూషితాన్,

దదామి కుఞ్జరాంస్తేషాం సహస్రాణి చతుర్దశ. 17

ప్ర. అ. హైరణ్యకక్షాగ్రైవేయాన్ = బంగారు నడుము త్రాళ్లును మెడత్రాళ్ళును గల, సువర్ణాఙ్కుశభూషితాన్ = బంగారు అంకుశములచే అలంకరింపబడిన, కుఞ్జరాన్ = ఏనుగులను, తేషామ్ = అట్టి ఏనుగులయొక్క, చతుర్దశసహస్రాణి = పదునాలుగు వేలను, దదామి = ఇచ్చెదను.

తా. బంగారు నడుముత్రాళ్లును మెడత్రాళ్లును గలవియు, బంగారు అంకుశములు కలవియు అగు పదునాలుగు వేల ఏనుగులను ఇచ్చెదను.

మూ. హైరణ్యానాం రథానాం చ శ్వేతాశ్వానాం చతుర్యుజామ్,

దదామి తే శతాన్యష్టౌ కిఙ్కిణీకవిభూషితాన్. 18

ప్ర. అ. శ్వేతాశ్వానామ్ = తెల్లని గుఱ్ఱములు కలవియు, చతుర్యుజామ్ = నాలుగు గుఱ్ఱములు కట్ట వీలైనవియు అగు, హైరణ్యానామ్ = బంగారు వికారమైన, రథానాం = రథములయొక్క, కిఙ్కిణీకవిభూషితాన్ = చిరు గంటలచేత అలంకరించబడిన, అష్టౌ శతాన్ = ఎనిమిది వందలను, తే = నీకు, దదామి = ఇచ్చెదను.

తా. తెల్లని గుఱ్ఱములు కలవియు, నాలుగేసి గుఱ్ఱములు కట్టదగినవియు, చిరు గంటలచే అలంకరించబడినవియు అగు ఎనిమిది వందల బంగారురథములను నీ కిచ్చెదను.

మూ. హయానాం దేశజాతానాం కులజానాం మహౌజసామ్,

సహస్రమేకం దశ చ దదామి తవ సువ్రత. 19

ప్ర. అ. సువ్రత = మంచి వ్రతము కలవాడా! దేశజాతానామ్ = మంచి దేశమునందు పుట్టినవియు, కులజానామ్ = మంచి కులమునందు పుట్టినవియు, మహౌజసామ్ = గొప్ప శక్తికలవియు అగు, హయానామ్ = అశ్వములయొక్క, ఏకం దశ చ = పదకొండు, సహస్రమ్ = సహస్రమును, తవ = నీకు, దదామి = ఇచ్చెదను.

తా. మంచి నియమములు కల ఓ మహర్షీ! మంచి దేశమునందు, మంచి జాతియందు పుట్టిన గొప్ప బలము గల పదకొండువేల అశ్వములను నీ కిచ్చెదను.

మూ. నానావర్ణవిభక్తానాం వయస్థానాం తథైవ చ,

దదామ్యేకాం గవాం కోటిం శబలా దీయతాం మమ. 20

ప్ర. అ. నానావర్ణవిభక్తానామ్ = అనేక వర్ణములచే వేరువేరుగా ఉన్నవియు, తథైవ చ = మరియు, వయస్థానామ్ = మంచి వయస్సులో ఉన్న, గవామ్ = గోవుల యొక్క, ఏకామ్ = ఒక, కోటిమ్ = కోటిని, దదామి = ఇచ్చెదను. మమ = నాకు, శబలా = ఈ శబల, దీయతామ్ = ఇవ్వబడుగాక.

తా. వివిధ వర్ణములు గల, మంచివయస్సులో ఉన్న ఒక కోటి గోవులను ఇచ్చెదను. నాకీ శబలను ఇమ్ము.

మూ. యావదిచ్ఛసి రత్నం వా హిరణ్యం వా ద్విజోత్తమ,

తావద్దదామి తత్సర్వం శబలా దీయతాం మమ. 21

ప్ర. అ. ద్విజోత్తమ = ఓ బ్రాహ్మణశ్రేష్ఠుడా! రత్నం వా = రత్నములను కాని, హిరణ్యం వా = బంగారమును గాని, యావత్ = ఎంత, ఇచ్ఛసి = కోరుచున్నావో, తత్పర్వమ్ = దాని నంతను, తావత్ = అంత, దదామి = ఇచ్చెదను. శబలా = శబల, మమ = నాకు, దీయతామ్ = ఇవ్వబడుగాక.

తా. బ్రాహ్మణోత్తమా! రత్నములు కాని, బంగారము కాని ఎంత కావలెనని కోరెదవో అంత ఇచ్చెదను. ఈ శబలను నా కిమ్ము.

మూ. ఏవముక్తస్తు భగవాన్ విశ్వామిత్రేణ ధీమతా,

న దాస్యామీతి శబలాం ప్రాహ రాజన్ కథం చన. 22

ప్ర. అ. ధీమతా = బుద్ధిమంతుడైన, విశ్వామిత్రేణ = విశ్వామిత్రునిచేత, ఏవమ్ = ఈ విధముగా, ఉక్తః = పలకబడిన, భగవాన్ = పూజ్యు డైన వసిష్ఠుడు, రాజన్ = రాజా! కథంచన = ఏమైనను, శబలామ్ = శబలను, న దాస్యామి = ఇవ్వను, ఇతి = అని, ప్రాహ = పలికెను.

తా. బుద్ధిమంతు డైన విశ్వామిత్రుడు పలికిన మాటలు విని పూజ్యుడైన వసిష్ఠుడు - ‘‘రాజా! ఏమైనను శబలను ఇవ్వను’’ అని పలికెను.

మూ. ఏతదేవ హి మే రత్నమేతదేవ హి మే ధనమ్,

ఏతదేవ హి సర్వస్వమేతదేవ హి జీవితమ్. 23

ప్ర. అ. ఏతదేవ = ఇదియే, మే = నాకు, రత్నం హి = రత్నము. ఏతదేవ = ఇదియే, మే = నాకు, ధనమ్ = ధనము. ఏతదేవ హి = ఇదియే, సర్వస్వమ్ = సర్వస్వము, ఏతదేవ = ఇదియే, జీవితమ్ = జీవితము.

తా. నా కిదియే రత్నము; ఇదే ధనము; ఇదే సర్వస్వము. ఇదే జీవితము.

మూ. దర్శశ్చ పూర్ణమాసశ్చ యజ్ఞాశ్చైవాప్తదక్షిణాః,

ఏతదేవ హి మే రాజన్ వివిధాశ్చ క్రియాస్తథా. 24

ప్ర. అ. రాజన్ = రాజా!, మే = నాకు, దర్శశ్చ = దర్శయాగము, పూర్ణమాసశ్చ = పూర్ణమాసయాగము, ఆప్తదక్షిణాః = సరి యైన దక్షిణలు గల, యజ్ఞాశ్చ = యజ్ఞములును, తథా = మరియు, వివిధాః = అనేకవిధము లైన, క్రియాశ్చ = క్రియలును, ఏతదేవ హి = ఇదియే.

తా. రాజా! నాకు దర్శపూర్ణమాసయాగములు, మంచి దక్షిణలు గల యజ్ఞములు, వివిధము లైన ఇతరక్రియలును ఈ ధేనువే.

మూ. అదోమూలాః క్రియాః సర్వా మమ రాజన్న సంశయః,

బహునా కిం ప్రలాపేన న దాస్యే కామదోహినీమ్. 25

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే త్రిపఞ్చాశః సర్గః

ప్ర. అ. రాజన్ = రాజా! మమ = నాయొక్క, సర్వాః = సమస్త మైన, క్రియాః = క్రియలు, అదోమూలాః = ఇదియే మూలముగలవి, సంశయః = సంశయము, న = లేదు. బహునా = అధిక మైన, ప్రలాపేన = నిరుపయోగమైన మాటలచేత, కిమ్ = ఏమి ప్రయోజనము ? కామదోహినీమ్ = సర్వకామములను పిదికి ఇచ్చు ఈ ధేనువును, న దాస్యే = ఇవ్వను.

తా. రాజా! నా క్రియ లన్నింటికిని ఇదియే ఆధారము. ఇంక ఉపయోగము లేని మాట లేల? ఈ కామధేనువు నివ్వను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో ఏబదిమూడవ సర్గ సమాప్తము.