| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 60 |
| Pages | 6 |
| Read Time | 9 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ చతుఃపఞ్చాశః సర్గః
విశ్వామిత్రుడు బలాత్కారమున వసిష్ఠుని ధేనువును అపహరించుటకై ప్రయత్నించుట. తనను విడచుట వసిష్ఠునకు సంమతము కాదను విషయము తెలిసిన కామధేనువు అతని ఆజ్ఞచే శకయవనాదులను సృజింపగా వారు విశ్వామిత్రసైన్యమును సంహరించుట.
మూ. కామధేనుం వసిష్ఠోఽసి యదా న త్యజతే మునిః,
తదాస్య శబలాం రామ విశ్వామిత్రోఽన్వకర్షత. 1
ప్ర. అ. రామ = రామా! వసిష్ఠః మునిః అపి = వసిష్ఠముని, కామధేనుమ్ = కామధేనువును, యదా = ఎప్పుడు, న త్యజతే = ఇవ్వలేదో, తదా = అప్పుడు, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, శబలామ్ = శబలను, అన్వకర్షత = లాగెను.
తా. రామా! ఈ విధముగా వసిష్ఠుడు కామధేనువు నిచ్చుటకు నిరాకరించగా విశ్వామిత్రుడు ఆ ధేనువును బలాత్కారముగా లాగికొనిపోయెను.
మూ. నీయమానా తు శబలా రామ రాజ్ఞా మహాత్మనా,
దుఃఖితా చిన్తయామాస రుదన్తీ శోకకర్శితా. 2
ప్ర. అ. రామ = రామా! మహాత్మనా = మహాత్ముడైన, రాజ్ఞా = రాజుచేత, నీయమానా = తీసికొనివెళ్లబడుచున్న, శబలా = శబల, దుఃఖితా = దుఃఖించినదై, శోకకర్శితా = శోకముచే కృశించినదై, రుదన్తీ = ఏడ్చుచున్నదై, చిన్తయామాస = చింతించెను.
తా. రామా! బలశాలి యగు ఆ రాజు తన నీ విధముగ లాగికొని పోవుచుండగా ఆ శబల దుఃఖార్తురాలై, ఏడ్చుచు ఇట్లు ఆలోచించెను.
మూ. పరిత్యక్తా వసిష్ఠేన కిమహం సుమహాత్మనా,
యాహం రాజభటైర్దీనా హ్రియేయ భృశదుఃఖితా. 3
ప్ర. అ. దీనా = దీనురాలును, భృశదుఃఖితా = మిక్కిలి దుఃఖితురాలును అగు, యా అహమ్ = ఏ నేను, రాజభటైః = రాజభటులచేత, హ్రియేయ = హరింపబడుచున్నానో, అహమ్ = అట్టి నేను, మహాత్మనా = మహాత్ము డైన, వసిష్ఠేన = వసిష్ఠునిచేత, పరిత్యక్తా కిమ్ = విడువబడితినా?
తా. మిక్కిలి దుఃఖముతో దీనురాల నైన నన్ను ఈ రాజభటులు ఈ విధముగా తీసికొని పోవుచున్నారు. నన్నీ మహాత్ము డైన వసిష్ఠుడు విడిచివేసినాడా యేమి?
మూ. కిం మయాపకృతం తస్య మహర్షేర్భావితాత్మనః,
యన్మామనాగసం భక్తామిష్టాం త్యజతి ధార్మికః. 4
ప్ర. అ. ధార్మికః = ధార్మికుడైన ఈ వసిష్ఠుడు, అనాగసమ్ = అపరాధము లేనిదానను, భక్తామ్ = భక్తురాలను, ఇష్టామ్ = ఇష్టురాలను అయిన, మామ్ = నన్ను, యత్ త్యజతి = విడిచి పెట్టుచున్నాడే, భావితాత్మనః = పవిత్ర మైన అంతఃకరణము గల, తస్య = ఆ, మహర్షేః = మహర్షికి, మయా = నాచేత, కిమ్ = ఏమి, అపకృతమ్ = అపకారము చేయబడినది?
తా. పవిత్రహృదయు డైన ఈ మహర్షికి నే నేమి అపకారము చేసినాను? భక్తురాలను, ఇష్టురాలను, ఏ అపరాధము ఎరుగనిదానను అయిన నన్నీ విధముగ విడచివేయుచున్నాడు?
మూ. ఇతి సా చిన్తయిత్వా తు వినిఃశ్వస్య పునః పునః,
నిర్ధూయ తాం స్తదా భృత్యాన్ శతశః శత్రుసూదన,
జగామానిలవేగేన పాదమూలం మహాత్మనః. 5
ప్ర. అ. శత్రుసూదన = శత్రుసంహారకుడ వైన రామా!, సా = ఆ ధేనువు, ఇతి = ఈ విధముగా, చిన్తయిత్వా = ఆలోచించి, పునః పునః = మాటి మాటికి, వినిఃశ్వస్య = నిట్టూర్చి, తదా = అప్పుడు, తాన్ = ఆ, శతశః = వందలకొలది ఉన్న, భృత్యాన్ = భృత్యులను, నిర్ధూయ = విదిలించి, అనిలవేగేన = వాయువేగముతో, మహాత్మనః = మహాత్ముడైన వసిష్ఠునియొక్క, పాదమూలమ్ = పాదసమీపమును గూర్చి, జగామ = వెళ్లెను.
తా. రామా! ఆ ధేనువు ఈ విధముగ ఆలోచించి, మాటిమాటికి నిట్టూర్చుచు, వందలకొలది ఉన్న ఆ భృత్యులను విదల్చుకొని వాయువేగముతో వసిష్ఠుని దగ్గరకు పోయెను.
మూ. శబలా సా రుదన్తీ చ క్రోశన్తీ చేదమబ్రవీత్,
వసిష్ఠస్యాగ్రతః స్థిత్వా మేఘదున్దుభిరావిణీ. 6
ప్ర. అ. సా = ఆ, శబలా = శబల, రుదన్తీ చ = ఏడ్చుచున్నదై, క్రోశన్తీ చ = అరచుచున్నదై, వసిష్ఠస్య = వసిష్ఠునియొక్క, అగ్రతః = ఎదుట, స్థిత్వా = నిలచి, మేఘదున్దుభిరావిణీ = మేఘమువలెను దుందుభివలెను ధ్వని చేయుచున్నదై, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను.
తా. ఆ శబల, ఏడ్చుచు, అరచుచు వసిష్ఠుని ఎదుట నిలచి మేఘదుందుభుల వంటి ధ్వనితో ఇట్లు పలికెను.
మూ. భగవన్ కిం పరిత్యక్తా త్వయాహం బ్రహ్మణః సుత,
యస్మాద్రాజభృతా మాం హి నయన్తే త్వత్సకాశతః. 7
ప్ర. అ. బ్రహ్మణః = బ్రహ్మయొక్క, సుత = కుమారుడా!, భగవన్ = ఓ పూజ్యుడా! అహమ్ = నేను, త్వయా = నీచేత, పరిత్యక్తా కిమ్ = విడువబడితినా ? యస్మాత్ = ఏ కారణమువలన, రాజభృతాః = రాజభృత్యులు, త్వత్సకాశతః = నీ సమీపమునుండి, మామ్ = నన్ను, నయన్తే హి = తీసికొనిపోవుచున్నారు.
తా. బ్రహ్మపుత్రుడ వైన ఓ పూజ్యుడా! ఈ రాజభృత్యులు నన్ను నీ వద్దనుండి తీసికొని పోవుచున్నారు; నీవు నన్ను విడిచివేసితివా?
మూ. ఏవముక్తస్తు బ్రహ్మర్షిరిదం వచనమబ్రవీత్,
శోకసన్తప్తహృదయాం స్వసారమివ దుఃఖితామ్. 8
ప్ర. అ. ఏవమ్ = ఈ విధముగా, ఉక్తః = పలకబడిన, బ్రహ్మర్షిః = బ్రహ్మర్షి, శోకసంతప్త హృదయామ్ = శోకముచే తప్త మైన హృదయము గల ఆ ధేనువును గూర్చి, దుఃఖితామ్ = దుఃఖించిన, స్వసారమివ = సోదరిని గూర్చి వలె, ఇదమ్ = ఈ, వచనమ్ = వచనమును, అబ్రవీత్ = పలికెను.
తా. ఈ మాటలు విని ఆ బ్రహ్మర్షి, శోకముచే తపించుచున్న మనస్సుగల, ఆ ధేనువుతో, దుఃఖించుచున్న సోదరితో పలికి నట్లు ఇట్లు పలికెను.
మూ. న త్వాం త్యజామి శబలే నాపి మేఽపకృతం త్వయా,
ఏష త్వాం నయతే రాజా బలాన్మత్తో మహాబలః. 9
ప్ర. అ. శబలే = ఓ శబలా! త్వామ్ = నిన్ను, న త్యజామి = విడచుట లేదు. త్వయా = నీ చేత, మే = నాకు, న అపకృతమపి = అపకారము కూడ చేయబడలేదు. మహాబలః = గొప్ప బలము గల, ఏషః = ఈ, రాజా = రాజు, మత్తః = నా నుండి, బలాత్ = బలాత్కారముగా, త్వామ్ = నిన్ను, నయతే = తీసికొని వెళ్లుచున్నాడు.
తా. ఓ శబలా! నేను నిన్ను విడచుటలేదు. నీవు నా కేమియు అపకారము చేయలేదు. మహాబలవంతుడైన ఈ రాజు నిన్ను నా వద్దనుంచి బలాత్కారముగ తీసికొని పోవుచున్నాడు.
మూ. న హి తుల్యం బలం మహ్యం రాజా త్వద్య విశేషతః,
బలీ రాజా క్షత్రియశ్చ పృథివ్యాః పతిరేవ చ. 10
ప్ర. అ. మహ్యమ్ = నాయొక్క, బలమ్ = బలము, తుల్యమ్ = ఈతని బలముతో తుల్య మైనది, న హి = కాదు కదా. అద్య = ఇపుడు, విశేషతః = విశేషముగా, రాజా తు = రాజుగా ఉన్నాడు. రాజా = రాజైన ఇతడు, బలీ = బలవంతుడు, క్షత్రియశ్చ = క్షత్రియుడు. పృథివ్యాః = భూమియొక్క, పతిరేవ చ = ప్రభువుగా కూడా ఉన్నాడు.
తా. నా బలము ఈతని బలముతో తుల్యము కాదు. విశేషించి ఇతడు రాజుగా ఉన్నాడు. రాజైన ఇతడు బలవంతు డైన క్షత్రియుడు, పృథివి కంతకును ప్రభువు కూడ.
మూ. ఇయమక్షౌహిణీ పూర్ణా సవాజిరథసఙ్కులా,
హస్తిధ్వజసమాకీర్ణా తేనాసౌ బలవత్తరః. 11
ప్ర. అ. సవాజిరథసంకులా = అశ్వములతో కూడిన రథములతో ఇరుకుగా నున్నదియు, హస్తిధ్వజసమాకీర్ణా = ఏనుగులతో ధ్వజములతో వ్యాప్తమైనదియు అగు, ఇయమ్ = ఈ, అక్షౌహిణీ = అక్షౌహిణి, పూర్ణా = నిండియున్నది. తేన = ఆ కారణముచేత, అసౌ = ఇతడు, బలవత్తరః = చాలా బలము కలవాడు.
తా. ఇతనికి అశ్వములతోను, రథములతోను, గజములతోను, ధ్వజములతోను, వ్యాప్త మైన పూర్తి అక్షౌహిణి సేన ఉన్నది. అందుచేత ఇతడు ఎక్కువ బలము కలవాడు.
మూ. ఏవముక్తా వసిష్ఠేన ప్రత్యువాచ వినీతవత్,
వచనం వచనజ్ఞా సా బ్రహ్మర్షిమమితప్రభమ్. 12
ప్ర. అ. వసిష్ఠేన = వసిష్ఠునిచేత, ఏవమ్ = ఈ విధముగా, ఉక్తా = పలకబడిన, వచనజ్ఞా = మాటలందు నేర్పు గల, సా = ఆ ధేనువు, అమితప్రభమ్ = అనంతమైన కాంతి గల, బ్రహ్మర్షిమ్ = బ్రహ్మర్షిని గూర్చి, వచనమ్ = వచనమును, వినీతవత్ = వినయవంతురాలుగా ఉండి ప్రత్యువాచ = తిరిగి పలికెను.
తా. వసిష్ఠుని వాక్యమును విని వాక్యములందు నేర్పు గల ఆ ధేనువు అమిత మైన కాంతి గల ఆ బ్రహ్మర్షిని గూర్చి, సవినయముగా ఇట్లు పలికెను.
మూ. న బలం క్షత్రియస్యాహుర్బ్రాహ్మణో బలవత్తరః,
బ్రహ్మన్ బ్రహ్మబలం దివ్యం క్షత్రాత్తు బలవత్తరమ్. 13
ప్ర. అ. క్షత్రియస్య = క్షత్రియుని బలమును, బలమ్ = బలమునుగా, నాహుః = చెప్పరు. బ్రాహ్మణః = బ్రాహ్మణుడు, బలవత్తరః = ఎక్కువ బలము కలవాడు. బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణోత్తమా! క్షత్రాత్ తు = క్షత్రియ బలము కంటె, బ్రహ్మబలమ్ = బ్రాహ్మణ బలము, దివ్యమ్ = శ్రేష్ఠ మైనది, బలవత్తరమ్ = అధికబలయుక్తము.
తా. బ్రాహ్మణోత్తమా! క్షత్రియబలము బలము కాదు; బ్రాహ్మణుడు ఎక్కువ బలముకలవాడు. క్షత్రియబలము కంటె బ్రహ్మబలము దివ్య మైనది; అధిక మైనది.
మూ. అప్రమేయబలం తుభ్యం న త్వయా బలవత్తరః,
విశ్వామిత్రో మహావీర్యస్తేజస్తవ దురాసదమ్. 14
ప్ర. అ. తుభ్యమ్ = నీకు, అప్రమేయబలమ్ = లెక్క పెట్ట రాని బలమున్నది. మహావీర్యః = మహావీర్య వంతు డైన, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, త్వయా = నీ కంటె, బలవత్తరః = ఎక్కువ బలము కలవాడు, న = కాడు. తవ = నీయొక్క, తేజః = తేజస్సు, దురాసదమ్ = సమీపింప శక్యముకానిది.
తా. నీ బలము అంతము లేనిది. ఎంతటి మహావీర్యవంతు డైనను విశ్వామిత్రుడు నీ కంటె అధికబలము కలవాడు కాదు. నీ తేజస్సు సమీపింప శక్యము కానిది.
మూ. నియుఙ్క్ష్వ మాం మహాభాగ త్వద్బ్రహ్మబలసంభృతామ్,
తస్య దర్పబలం యత్తన్నాశయామి దురాత్మనః. 15
ప్ర. అ. మహాభాగ = ఓ మహాభాగ్యవంతుడా!, త్వద్ద్రహ్మబలసంభృతామ్ = నీయొక్క బ్రహ్మబలముతో నిండిన, మామ్ = నన్ను, నియుఙ్క్ష్వ = నియమించుము. దురాత్మనః = దుర్బుద్ధి యైన, తస్య = ఆతనియొక్క, యత్ = ఏ, దర్పబలమ్ = దర్పము బలము ఉన్నదో, తత్ = దానిని, నాశయామి = నశింపచేసెదను.
తా. మహాత్మా! నీ బ్రహ్మబలముతో నిండిన నన్ను ఆజ్ఞాపించుము. ఆ దురాత్ముని దర్పమును, బలమును నశింపచేసెదను.
మూ. ఇత్యుక్తస్తు తయా రామ వసిష్ఠస్తు మహాయశాః,
సృజస్వేతి తదోవాచ బలం పరబలారుజమ్. 16
ప్ర. అ. రామ = రామా! తయా = ఆమెచేత, ఇతి = ఇట్లు, ఉక్తః = పలకబడిన, మహాయశాః = గొప్ప కీర్తి గల, వసిష్ఠః తు = వసిష్ఠుడు, తదా = అప్పుడు, పరబలారుజమ్ = శత్రుబలమును పీడించు, బలమ్ = సేనను, సృజస్వ = సృజించుము, ఇతి = అని, ఉవాచ = పలికెను.
తా. ఆ ధేనువు మాటలు విని, మహాయశఃశాలి యగు వసిష్ఠుడు - ‘‘శత్రు సైన్యమును నశింపచేయగలిగిన సైన్యమును సృజింపుము’’ అని పలికెను.
మూ. తస్య తద్వచనం శ్రుత్వా సురభిస్సాసృజత్తదా,
తస్యా హుమ్భారవోత్సృష్టాః పప్లవాః శతశో నృప, 17
నాశయన్తి బలం సర్వం విశ్వామిత్రస్య పశ్యతః.
ప్ర. అ. తస్య = ఆతనియొక్క, తత్ = ఆ, వచనమ్ = వచనమును, శ్రుత్వా = విని, సా = ఆ, సురభిః = కామధేనువు, తదా = అప్పుడు, అసృజత్ = (సైన్యమును) సృజించెను. నృప = రామా!, తస్యాః = ఆ కామధేనువుయొక్క, హుంభారవోత్సృష్టాః = హుంభా అను ధ్వనినుండి బయలుదేరిన, పప్లవాః = పప్లవులు, శతశః = వందలకొలది, విశ్వామిత్రస్య = విశ్వామిత్రుడు, పశ్యతః = చూచుచుండగనే, సర్వమ్ = సమస్త మైన, బలమ్ = సైన్యమును, నాశయన్తి = నశింపచేసినారు.
తా. వసిష్ఠుని మాటలు విని ఆ కామధేనువు సైనికులను సృజించెను. రామా! ఆ కామధేనువు యొక్క హుంభాధ్వనినుండి పుట్టిన వందలాది పప్లవులు, విశ్వామిత్రుడు చూచుచుండగనే ఆతని సైన్యము నంతను నశింపచేసిరి.
మూ. బలం భగ్నం తతో దృష్ట్వా రథేనాక్రమ్య కౌశికః, 18
స రాజా పరమక్రుద్ధో రోషవిస్ఫారితేక్షణః
పప్లవాన్నాశయామాస శస్త్రైరుచ్చావచైరపి. 19
ప్ర. అ. తతః = పిమ్మట, సః = ఆ, రాజా = రాజైన, కౌశికః = విశ్వామిత్రుడు, భగ్నమ్ = నశింపచేయబడిన, బలమ్ = సైన్యమును, దృష్ట్వా = చూచి, పరమక్రుద్ధః = మిక్కిలి కోపగించినవాడై, రోషవిస్ఫారితేక్షణః = కోపముచేత పెద్ద వైన నేత్రములు కలవాడై, రథేన = రథముచేత, ఆక్రమ్య = ఆక్రమించి; ఉచ్చావచైః = అనేక విధము లైన, శస్స్త్రైః = ఆయుధములచేత, పప్లవాన్ = పప్లవులను, నాశయామాస అపి = నశింపచేసెను కూడ.
తా. అంతట విశ్వామిత్రమహారాజు తన సైన్యము ఈ విధముగ నశించుచుండగా చూచి, చాల కోపించి, కోపముచేత కళ్లు పెద్దవి చేసి, రథము నధిరోహించి, అనేక విధములైన ఆయుధములతో పప్లవులను నశింపచేసెను.
మూ. విశ్వామిత్రార్దితాన్ దృష్ట్వా పప్లవాంశ్ఛతశ స్తదా,
భూయ ఏవాసృజత్కోపాచ్ఛకాన్ యవనమిశ్రితాన్. 20
ప్ర. అ. విశ్వామిత్రార్దితాన్ = విశ్వామిత్రునిచేత పీడింపబడిన, శతశః = వందలకొలది, పప్లవాన్ = పప్లవులను, దృష్ట్వా = చూచి, తదా = అప్పుడు, కోపాత్ = కోపమువలన, భూయ ఏవ = మరల, యవనమిశ్రితాన్ = యవనులతో కలసిన, శకాన్ = శకులను, అసృజత్ = సృజించెను.
తా. అప్పుడా కామధేనువు ఆ పప్లవుల నందరిని విశ్వామిత్రుడు చంపివేయుట చూచి, కోపముతో, మరల, యవనులను శకులను సృజించెను.
మూ. తైరాసీత్సంవృతా భూమిః శకైర్యవనమిశ్రితైః,
ప్రభావద్భిర్మహావీర్యైర్హే మకిఞ్జల్కసన్నిభైః. 21
ప్ర. అ. ప్రభావద్భిః = కాంతికలవారును, మహావీర్యైః = గొప్ప పరాక్రమము కలవారును, హేమకిఞ్జల్కసన్నిభైః = బంగారు కింజల్కములతో సమానులును అగు, తైః = ఆ, యవనమిశ్రితైః = యవనులతో కలిసిన, శకైః = శకులచేత, భూమిః = భూమి, సంవృతా = కప్పబడినది, ఆసీత్ = ఆయెను.
తా. కాంతి కలవారును, మహావీర్యవంతులును, బంగారు కింజల్కముల వలె నున్నవారును అగు ఆ యవనులును, శకులును, భూమిని కప్పివేసిరి.
మూ. దీర్ఘాసిపట్టసధరైర్హేమవర్ణామ్బరావృతైః,
నిర్దగ్ధం తద్బలం సర్వం ప్రదీప్తెరివ పావకైః. 22
ప్ర. అ. దీర్ఘాసిపట్టసధరైః = ధీర్ఘములైన ఖడ్గములను పట్టసములను ధరించినవారును, హేమవర్ణామ్బరావృతైః = బంగారు రంగు గల వస్త్రములచే ఆచ్ఛాదింపబడినవారును అగు ఆ శకయవనులచేత, ప్రదీప్తైః = ప్రజ్వలించుచున్న, పావకైరివ = అగ్నులచేత వలె, తత్ = ఆ, సర్వమ్ = సమస్త మైన, బలమ్ = సైన్యము, నిర్దగ్ధమ్ = దహింపబడినది.
తా. పొడ వైన ఖడ్గములను పట్టసములను చేత పట్టుకొని, బంగారు వస్త్రములను ధరించి మండుచున్న అగ్నుల వలె ఉన్న ఆ శకయవనులు ఆ సైన్యమునంతను నశింపచేసిరి.
మూ. తతోఽస్త్రాణి మహాతేజా విశ్వామిత్రో ముమోచ హ,
తైస్తైర్యవనకామ్భోజాః పప్లవాశ్చాకులీకృతాః. 23
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే చతుఃపఞ్చాశః సర్గః
ప్ర. అ. తతః = పిమ్మట, మహాతేజాః = గొప్ప తేజస్సు గల, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, అస్త్రాణి = అస్త్రములను, ముమోచ హ = విడచెను. తైస్తైః = ఆ యా అస్త్రములచేత, యవనకామ్భోజాః = యవనులు కాంభోజులును, పప్లవాశ్చ = పప్లవులను, ఆకులీకృతాః = వ్యాకులము చేయబడినారు.
తా. పిమ్మట మహాతేజఃశాలి యైన విశ్వామిత్రుడు మహాస్త్రములను ప్రయోగింపగా యవనులును, కాంభోజులును, పప్లవులును చెల్లాచెదరైపోయిరి.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో ఏబదినాల్గవ సర్గ సమాప్తము.
