Chapter_55

Back
Book Balakandamu
Chapter No 61
Pages 7
Read Time 11 Minutes

Chapter_55

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ పఞ్చపఞ్చాశః సర్గః

విశ్వామిత్రుని నూర్గురు పుత్రులతో సహా సైన్యమంతయు నశించగా ఆతడు తపస్సుచే శివుని ప్రసన్నుని చేసికొని, ఆ శివునివలన దివ్యాస్త్రములు సంపాదించి వాటిని వసిష్ఠాశ్రమముపై ప్రయోగించుట. ఆ అస్త్రములను వారించుటకై వసిష్ఠుడు బ్రహ్మదండమును చేత ధరించి విశ్వామిత్రుని ఎదుటకు వచ్చి నిలచుట.

మూ. తతస్తానాకులాన్ దృష్ట్వా విశ్వామిత్రాస్త్రమోహితాన్,

వసిష్ఠశ్చోదయామాస కామధుక్సృజ యోగతః. 1

ప్ర. అ. తతః = పిమ్మట, వసిష్ఠః = వసిష్ఠుడు, విశ్వామిత్రాస్త్రమోహితాన్ = విశ్వామిత్రుని అస్త్రములచే మోహము చెందింపబడిన, ఆకులాన్ = వ్యాకులు లైన, తాన్ = వారిని, దృష్ట్వా = చూచి, కామధుక్ = ఓ కామధేనువా! యోగతః = యోగబలమువలన, సృజ = సృజించుము అని, చోదయామాస = ప్రేరేపించెను.

తా. వారందరును విశ్వామిత్రుని అస్త్రములచే మోహితులై చెల్లాచెదరై పోవుట చూచి వసిష్ఠుడు - ‘‘ఓ కామధేనువా! యోగశక్తిచేత ఇంకను సృజింపుము.’’ అని ఆ ధేనువును ప్రేరేపించెను.

మూ. తస్యా హుమ్భారవాజ్జాతాః కామ్భోజా రవిసన్నిభాః,

ఊధసస్త్వథ సంజాతాః పప్లవాః శస్త్రపాణయః. 2

యోనిదేశాచ్చ యవనాః శకృద్దేశాచ్ఛకాస్తథా,

రోమకూపేషు చ మ్లేచ్ఛా హారీతాః సకిరాతకాః. 3

ప్ర. అ. తస్యాః = ఆ కామధేనువుయొక్క, హుమ్భారవాత్ = హుంభాధ్వనినుండి, రవిసన్నిభాః = సూర్యునితో సమాను లైన, కామ్భోజాః = కాంభోజులు, జాతాః = పుట్టిరి. అథ = మరియు, ఊధసః = పొదుగునుండి, శస్త్రపాణయః = ఆయుధములు హస్తములందు గల, పప్లవాః = పప్లవులు, సంజాతాః = పుట్టిరి. యోనిదేశాత్ చ = యోనినుండి, యవనాః = యవనులు, తథా = మరియు, శకృద్దేశాత్ = గోమయ ప్రదేశమునుండి, శకాః = శకులును, రోమకూపేషు = రోమకూపములనుండి, మ్లేచ్ఛాః = మ్లేచ్ఛులును, సకిరాతాః = కిరాతులతో కూడిన, హారీతాః = హారీతులును (పుట్టిరి).

తా. ఆ కామధేనువు హుంభాధ్వని చేయగా దానినుండి సూర్యుని వంటి కాంతి గల కాంభోజులు పుట్టిరి. పొదుగునుండి ఆయుధములను హస్తములందు ధరించిన పప్లవులును, యోనినుండి యవనులును, గోమయప్రదేశమునుండి శకులును, రోమకూపములనుండి మ్లేచ్ఛులు, హారీతులు, కిరాతులును పుట్టిరి.

మూ. తైస్తైర్నిషూదితం సర్వం విశ్వామిత్రస్య తత్క్షణాత్,

సపదాతిగజం సాశ్వం సరథం రఘునన్దన. 4

ప్ర. అ. రఘునన్దన = రామా! తైస్తైః = ఆ యా కాంభోజాదులచేత, తత్క్షణాత్ = వెంటనే, విశ్వామిత్రస్య = విశ్వామిత్రునియొక్క, సపదాతిగజమ్ = కాలిబంటులతోను ఏనుగులతోను కూడినదియు, సాశ్వమ్ = అశ్వములతో కూడినదియు, సరథమ్ = రథములతో కూడినదియు అగు, సర్వమ్ = సైన్య మంతయు, నిషూదితమ్ = నశింపచేయబడినది.

తా. రామా! ఈ విధముగ జనించి కాంభోజాదు లందరును పదాతి-గజ-అశ్వ- రథములతో కూడిన విశ్వామిత్రసైన్యము నంతను క్షణములో నశింపచేసిరి.

మూ. దృష్ట్వా నిషూదితం సైన్యం వసిష్ఠేన మహాత్మనా,

విశ్వామిత్రసుతానాం చ శతం నానావిధాయుధమ్. 5

అభ్యధావత్ససంక్రుద్ధం వసిష్ఠం జపతాం వరమ్,

హుంకారేణైవ తాన్ సర్వాన్ దదాహ భగవానృషిః. 6

ప్ర. అ. మహాత్మనా = మహాత్ముడైన, వసిష్ఠేన = వసిష్ఠునిచేత, నిషూదితమ్ = నశింప చేయబడిన, సైన్యమ్ = సైన్యమును, దృష్ట్వా = చూచి, విశ్వామిత్ర సుతానామ్ = విశ్వామిత్రుని కుమారులయొక్క, శతమ్ = శతము, నానావిధాయుధమ్ = నానావిధము లైన ఆయుధములు కలదై, సుసంక్రుద్ధమ్ = చాల కోపించినదై, జపతాం వరమ్ = మునులలో శ్రేష్ఠు డైన, వసిష్ఠమ్ = వసిష్ఠుని గూర్చి, అభ్యధావత్ = పరుగెత్తెను. భగవాన్ = భగవంతు డైన, ఋషిః = వసిష్ఠమహర్షి, తాన్ = ఆ, సర్వాన్ = అందరిని, హుంకారేణైవ = హుంకారముచేతనే, దదాహ = కాల్చివేసెను.

తా. మహాత్ము డైన వసిష్ఠుడు తమ సైన్యమును నశింపచేయుటను చూచి, విశ్వామిత్రుని నూర్గురు కుమారులు మిక్కిలి కోపించినవారై, అనేకవిధములైన ఆయుధములను ధరించి, వసిష్ఠమహాముని పైకి దుమికిరి. అతడు వారి నందరిని, హుంకారము చేసి, భస్మము చేసెను.

మూ. తే సాశ్వరథపాదాతా వసిష్ఠేన మహాత్మనా,

భస్మీకృతా ముహూర్తేన విశ్వామిత్రసుతాస్తదా. 7

ప్ర. అ. తదా = అప్పుడు, సాశ్వరథపాదాతాః = అశ్వములతోడను, రథములతోడను, కాలిబంటులతోడను కూడిన, తే = ఆ, విశ్వామిత్రసుతాః = విశ్వామిత్రుని కుమారులు, మహాత్మనా = మహాత్ముడైన, వసిష్ఠేన = వసిష్ఠునిచేత, ముహూర్తేన = క్షణకాలములో, భస్మీకృతాః = భస్మము చేయబడినారు.

తా. ఆ విశ్వామిత్రకుమారుల నందరిని మహాత్ము డైన వసిష్ఠుడు, అశ్వ రథపదాతులతో సహా క్షణములో భస్మము చేసెను.

మూ. దృష్ట్వా వినాశితాన్ పుత్రాన్ బలం చ సమహాయశాః,

సవ్రీడశ్చిన్తయావిష్టో విశ్వామిత్రోఽభవత్తదా. 8

ప్ర. అ. తదా = అప్పుడు, సుమహాయశాః = గొప్ప కీర్తి గల, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, వినాశితాన్ = నశింపచేయబడిన, పుత్రాన్ = పుత్రులను, బలం చ = సైన్యమును, దృష్ట్వా = చూచి, సవ్రీడః = సిగ్గుతో కూడినవాడై, చిన్తయా = విచారముతో, ఆవిష్టః = కూడినవాడు, అభవత్ = ఆయెను.

తా. ఆ విధముగ తన సైన్య మంతయు, కుమారులును నశించిపోవుట చూచి విశ్వామిత్రుడు సిగ్గుతో చింతాక్రాంతు డయ్యెను.

మూ. సముద్ర ఇవ నిర్వేగో భగ్నదంష్ట్ర ఇవోరగః,

ఉపరక్త ఇవాదిత్యః సద్యో నిష్ప్రభతాం గతః. 9

ప్ర. అ. నిర్వేగః = వేగము లేని, సముద్రః ఇవ = సముద్రము వలె, భగ్నదంష్ట్రః = విరిగిపోయిన కోరలు గల, ఉరగః ఇవ = సర్పము వలె, ఉపరక్తః = రాహువుచే మ్రింగబడిన, ఆదిత్యః ఇవ = సూర్యుడు వలె, సద్యః = వెంటనే, నిష్ప్రభతామ్ = కాంతి రహితత్వమును, గతః = పొందెను.

తా. వేగము లేని సముద్రము వలె, కోరలు తీసిన పాము వలె, రాహువు మ్రింగిన సూర్యుడు వలె కాంతివిహీను డయ్యెను.

మూ. హతపుత్రబలో దీనో లూనపక్ష ఇవ ద్విజః,

హతదర్పో హతోత్సాహో నిర్వేదం సమపద్యత. 10

ప్ర. అ. హతపుత్రబలః = చంపబడిన పుత్రులును సైన్యమును గల అతడు, లూనపక్షః = ఖండింపబడిన రెక్కలు గల, ద్విజః ఇవ = పక్షి వలె, దీనః = దీనుడై, హతదర్పః = తొలగిన దర్పముకలవాడై, హతోత్సాహః = తొలగిన ఉత్సాహము కలవాడై, నిర్వేదమ్ = దుఃఖమును, సమపద్యత = పొందెను.

తా. పుత్రులును సైన్యమును నశించుటచే అతడు రెక్కలు తెగగొట్టిన పక్షి వలె, దీనుడై దర్పోత్సాహములు అడగి దుఃఖమును పొందెను.

మూ. స పుత్రమేకం రాజ్యాయ పాలయేతి నియుజ్య చ,

పృథివీం క్షత్రధర్మేణ వనమేవాన్వపద్యత. 11

ప్ర. అ. సః = అతడు, పృథివీమ్ = భూమిని, క్షత్రధర్మేణ = క్షత్రియ ధర్మానుసారముగా, పాలయ = పాలించుము, ఇతి = అని, ఏకమ్ = ఒక, పుత్రమ్ = పుత్రుని, రాజ్యాయ = రాజ్యమునకై, నియుజ్య = నియమించి, వనమేవ = వనమునే, అన్వపద్యత = చేరెను.

తా. విశ్వామిత్రుడు, ‘‘ఈ భూమిని క్షత్రియధర్మానుసారముగా పాలింపుము’’ అని ఒక కుమారుని నియమించి వనమునకు వెళ్లిపోయెను.

మూ. స గత్వా హిమవత్పార్శ్వం కిన్నరోరగసేవితమ్,

మహాదేవప్రసాదార్థం తపస్తేపే మహాతపాః. 12

ప్ర. అ. మహాతపాః = గొప్ప తపస్సు గల, సః = అతడు, కిన్నరోరగసేవితమ్ = కిన్నరులచేతను సర్పములచేతను సేవింపబడిన (ఉరగు లనువారు ఒక జాతి కావచ్చును). హిమవత్పార్శ్వమ్ = హిమవత్పర్వతప్రాంతమును గూర్చి, గత్వా = వెళ్లి, మహాదేవ ప్రసాదార్థమ్ = మహాదేవుని అనుగ్రహముకొరకై, తపః = తపస్సును, తేపే = తపించెను.

తా. మహాతపశ్శాలి యగు ఆ విశ్వామిత్రుడు కిన్నరులతోడను ఉరగులతోడను కూడిన హిమవత్పర్వతసమీపము చేరి మహాదేవుని అనుగ్రహము కోరుచు తపస్సు చేసెను.

మూ. కేన చిత్త్వథ కాలేన దేవేశో వృషభధ్వజః,

దర్శయామాస వరదో విశ్వామిత్రం మహాబలమ్. 13

ప్ర. అ. అథ = పిమ్మట, కేన చిత్ కాలేన = కొంతకాలమునకు, దేవేశః = దేవతా ప్రభు వైన, వృషభధ్వజః = వృషభము ధ్వజముగా గల శివుడు, వరదః = వరముల నిచ్చువాడై, మహాబలమ్ = గొప్ప బలము గల, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రునకు, దర్శయామాస = తనను చూపించెను.

తా. అంత కొంతకాలమునకు దేవాధీశుడైన పరమేశ్వరుడు మహాబలశాలి యగు విశ్వామిత్రునకు వరముల నిచ్చుటకై ప్రత్యక్ష మాయెను.

మూ. కిమర్థం తప్యసే రాజన్ బ్రూహి యత్తే వివక్షితమ్,

వరదోఽస్మి వరో యస్తే కాఙ్క్షితః సోఽభిధీయతామ్. 14

ప్ర. అ. రాజన్ = రాజా!, కిమర్థమ్ = ఎందుకు, తప్యసే = తపస్సుచేయుచున్నావు ? తే = నీకు, యత్ = ఏది, వివక్షితమ్ = చెప్ప నుద్దేశింపబడినదో, తత్ = దానిని, బ్రూహి = చెప్పుము. వరదః = వరములనిచ్చువాడను, అస్మి = అయి ఉన్నాను. యః = ఏ, వరః = వరము, తే = నీచేత, కాఙ్క్షితః = కోరబడినదో, సః = అది, అభిధీయతామ్ = చెప్పబడుగాక.

తా. రాజా! ఎందుకు తపస్సు చేయుచున్నావు? నీవు చెప్పదలచిన దేదియో చెప్పుము. నీకు వరముల నిచ్చెదను. నీవు కోరెడు కోరిక ఏదియో చెప్పుము.

మూ. ఏవముక్తస్తు దేవేన విశ్వామిత్రో మహాతపాః,

ప్రణిపత్య మహాదేవమిదం వచనమబ్రవీత్. 15

ప్ర. అ. దేవేన = ఈశ్వరునిచేత, ఏవమ్ = ఈ విధముగా, ఉక్తః = పలకబడిన, మహాతపాః = గొప్ప తపస్సు గల, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, మహాదేవమ్ = మహాదేవుని, ప్రణిపత్య = నమస్కరించి, ఇదమ్ = ఈ, వచనమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. మహాదేవు డిట్లు పలుకగా విని మహాతపశ్శాలి యగు విశ్వామిత్రుడు అతనికి నమస్కరించి ఇట్లు పలికెను.

మూ. యది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానఘ,

సాఙ్గోపాఙ్గోపనిషదః సరహస్యః ప్రదీయతామ్. 16

ప్ర. అ. అనఘ = దోషములు లేని, మహాదేవ = మహాదేవుడా!, తుష్టః యది = సంతసించి నట్లైతే, సాఙ్గోపాఙ్గోపనిషదః = అంగములతోడను, ఉపాంగములతోడను ఉపనిషత్తులతోడను కూడినదియు, సరహస్యః = రహస్యములతో కూడినదియు అగు, ధనుర్వేదః = ధనుర్వేదము, మమ = నాకు, ప్రదీయతామ్ = ఇవ్వబడుగాక.

తా. ‘‘మహాదేవా! నీవు అనుగ్రహించి నట్లైతే, నాకు ధనుర్వేదము నంతను సాంగోపాంగముగా సరహస్యముగా ఇమ్ము’’.

మూ. యాని దేవేషు చాస్త్రాణి దానవేషు మహర్షిషు,

గన్ధర్వయక్షరక్షస్సు ప్రతిభాన్తు మమానఘ. 17

ప్ర. అ. అనఘ = దోషరహితుడా! దేవేషు = దేవతలయందు, దానవేషు = దానవులయందును, మహర్షిషు = మహర్షులయందును, గన్ధర్వయక్షరక్షస్సు = గంధర్వులందును, యక్షులందును, రాక్షసులందును, యాని = ఏ, అస్త్రాణి = అస్త్రములున్నవో, అవి, మమ = నాకు, ప్రతిభాన్తు = స్ఫురించుగాక.

తా. ‘‘పాపరహితుడ వైన ఓ మహాదేవా! దేవతలకును, దానవులకును, మహర్షులకును, గంధర్వయక్షరక్షస్సులకును తెలిసిన అస్త్రము లన్నియు నాకు స్ఫురించుగాక’’.

మూ. తవ ప్రసాదాద్భవతు దేవదేవ మమేప్సితమ్,

ఏవమస్త్వితి దేవేశో వాక్యముక్త్వా గతస్తదా. 18

ప్ర. అ. దేవదేవ = దేవతలకు దేవుడ వైన మహాదేవా! తవ = నీ యొక్క, ప్రసాదాత్ = అనుగ్రహమువలన, మమ = నాయొక్క, ఈప్సితమ్ = కోరిక, భవతు = సిద్ధించుగాక. ఏవమ్ = ఇటులనే, అస్తు = అగుగాక, ఇతి = అని, దేవేశః = మహాదేవుడు, ఉక్త్వా = పలికి, తదా = అప్పుడు, గతః = వెళ్లినాడు.

తా. ‘‘దేవాధిదేవా! నీ అనుగ్రహమువలన నా కోరిక తీరుగాక’’. ఈ వాక్యమును విని మహాదేవుడు - ‘‘అటులనే అగును’’ అని పలికి వెడలి పోయెను.

మూ. ప్రాప్య చాస్త్రాణి రాజర్షిర్విశ్వామిత్రో మహాబలః,

దర్పేణ మహతా యుక్తో దర్పపూర్ణోఽభవత్తదా. 19

ప్ర. అ. మహాబలః = గొప్ప బలము కలవాడును, రాజర్షిః = రాజర్షియు, మహతా = గొప్ప, దర్పేణ = దర్పముతో, యుక్తః = కూడినవాడును అగు, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, తదా = అప్పుడు, అస్త్రాణి = అస్త్రములను, ప్రాప్య = పొంది, దర్పపూర్ణః = దర్పముతో నిండినవాడు, అభవత్ = ఆయెను.

తా. మహాబలశాలి యగు విశ్వామిత్రుడు స్వతః దర్పము కలవాడు. ఆ అస్త్రములు లభించగనే అతని దర్పము ఇనుమడించెను.

మూ. వివర్ధమానో వీర్యేణ సముద్ర ఇవ పర్వణి,

హతమేవ తదా మేనే వసిష్ఠమృషిసత్తమమ్. 20

ప్ర. అ. పర్వణి = పర్వమునందు, సముద్ర ఇవ = సముద్రము వలె, వీర్యేణ = వీర్యముచేత, వివర్ధమానః = వృద్ధిపొందుచున్న వాడై, ఋషిసత్తమమ్ = ఋషి శ్రేష్ఠు డైన, వసిష్ఠమ్ = వసిష్ఠుని, తదా = అప్పుడు, హతమేవ = చంపబడినవానినిగానే, మేనే = తలచెను.

తా. పూర్ణిమాపర్వమునందు సముద్రము పొంగి నట్లు వీర్యముచేత వృద్ధి పొందుచున్న వాడై, విశ్వామిత్రుడు -- ‘‘ఇపు డిక ఈ వసిష్ఠుడు తప్పక నశింపగలడు’’ అని భావించెను.

మూ. తతో గత్వాశ్రమపదం ముమోచాస్త్రాణి పార్థివః,

యైస్తత్తపోవనం సర్వం నిర్దగ్ధం చాస్త్రతేజసా. 21

ప్ర. అ. తతః = పిమ్మట, పార్థివః = రాజు, ఆశ్రమపదమ్ = ఆశ్రమమును గూర్చి, గత్వా = వెళ్లి, అస్త్రాణి = అస్త్రములను, ముమోచ = విడచెను. యైః = వేటిచేత, తత్ = ఆ, సర్వమ్ = సమస్త మైన, తపోవనమ్ = తపోవనము, అస్త్రతేజసా = అస్త్రముల తేజస్సుచేత, నిర్దగ్ధమ్ = కాల్చివేయబడినదో.

తా. విశ్వామిత్రుడు వసిష్ఠాశ్రమమునకు పోయి అస్త్రములను విడువగా ఆ అస్త్రముల తేజస్సుచే ఆ తపోవన మంతయు దగ్ధ మయ్యెను.

మూ. ఉదీర్యమాణమస్త్రం తద్విశ్వామిత్రస్య ధీమతః,

దృష్ట్వా విప్రద్రుతాః సర్వే మునయః శతశో దిశః. 22

ప్ర. అ. ధీమతః = బుద్ధిమంతుడైన, విశ్వామిత్రస్య = విశ్వామిత్రునియొక్క, తత్ = ఆ, ఉదీర్యమాణమ్ = విజృంభించుచున్న, అస్త్రమ్ = అస్త్రమును, దృష్ట్వా = చూచి, శతశః = వందలకొలది, మునయః = మునులు, సర్వే = అందరును, దిశః = దిక్కులను గూర్చి, విప్రద్రుతాః = పారిపోయిరి.

తా. ఆ విశ్వామిత్రాస్త్రములు విజృంభించుట చూచి అచట నున్న మును లందరును దిక్కులను పట్టి పారిపోయిరి.

మూ. వసిష్ఠస్య చ యే శిష్యాస్తథైవ మృగపక్షిణః,

విద్రవన్తి భయాద్భీతా నానాదిగ్భ్యః సహస్రశః 23

ప్ర. అ. వసిష్ఠస్య = వసిష్ఠునియొక్క, యే = ఏ, శిష్యాః = శిష్యులు కలరోవారును, తథైవ = మరియు, మృగపక్షిణః = మృగములును పక్షులును, భయాత్ = ఆ భయకారణమువలన, భీతాః = భీతులై, సహస్రశః = వేలకొలది, నానాదిగ్భ్యః = అన్నిదిక్కులకును, విద్రవన్తి = పారిపోయిరి.

తా. వసిష్ఠుని శిష్యులును, వేలకొలది మృగములును, పక్షులును భీతిచెంది నలు దిక్కులకును పారిపోయిరి.

మూ. వసిష్ఠస్యాశ్రమపదం శూన్యమాసీన్మహాత్మనః,

ముహూర్తమివ నిశ్శబ్దమాసీదిరిణసన్నిభమ్. 24

ప్ర. అ. మహాత్మనః = మహాత్ముడైన వసిష్ఠస్య = వసిష్ఠునియొక్క, ఆశ్రమ పదమ్ = ఆశ్రమము, శూన్యమ్ = శూన్యముగ, ఆసీత్ = ఆయెను. ముహూర్తమివ = క్షణకాలములో, ఇరిణసన్నిభమ్ = మరుస్థానముతో తుల్య మైనదై, నిశ్శబ్దమ్ = నిశ్శబ్దము, ఆసీత్ = ఆయెను.

తా. మహాత్ముడైన వసిష్ఠుని ఆశ్రమము, క్షణకాలములో మరుస్థలము వలె ప్రాణిశూన్యమును, నిశ్శబ్దమును ఆయెను.

మూ. వదతో వై వసిష్ఠస్య మాభైరితి ముహుర్ముహుః,

నాశయామ్యద్య గాధేయం నీహారమివ భాస్కరః. 25

ప్ర. అ. భాస్కరః = సూర్యుడు, నీహారమివ = పొగమంచును వలె, గాధేయమ్ = విశ్వామిత్రుని, అద్య = ఇప్పుడు, నాశయామి = నశింపచేయుదును. మాభైః = భయపడకుడు. ఇతి = అని, వసిష్ఠస్య = వసిష్ఠుడు, ముహుర్ముహుః = మాటిమాటికి, వదతః = పలుకుచుండగనే, (పారిపోయిరి).

తా. ‘‘సూర్యుడు మంచును నశింపచేసి నట్లు ఈ విశ్వామిత్రుని నశింపచేసెదను. భయపడకుడు’’ అని వసిష్ఠుడు అనుచుండగనే అచటి మునులును, తదితర ప్రాణులును పారిపోయిరి.

మూ. ఏవముక్త్వా మహాతేజా వసిష్ఠో జపతాం వరః,

విశ్వామిత్రం తదా వాక్యం సరోషమిదమబ్రవీత్. 26

ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, జపతాం వరః = మునులలో శ్రేష్ఠు డైన, వసిష్ఠః = వసిష్ఠుడు, ఏవమ్ = ఇట్లు, ఉక్త్వా = పలికి, తదా = అప్పుడు, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి, సరోషమ్ = రోషముతో కూడినట్లుగా, ఇదమ్ = ఈ, వాక్యమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. మునులలో శ్రేష్ఠుడును, మహాతేజశ్శాలియు అగు వసిష్ఠుడు ఈ విధముగా పలికి, క్రోధావిష్టుడై విశ్వామిత్రునితో ఇట్లనెను.

మూ. ఆశ్రమం చిరసంవృద్ధం యద్వినాశితవానసి,

దురాచారోఽసి తన్మూఢ తస్మాత్త్వం న భవిష్యసి. 27

ప్ర. అ. మూఢ = మూఢుడా!, చిరసంవృద్ధమ్ = చిరకాలమునుండి పెంచబడిన, ఆశ్రమమ్ = ఆశ్రమమును, యత్ = ఏ కారణమువలన, వినాశితవాన్ = నశింపచేసినవాడవు అసి = అయితివో, తత్ = ఆ కారణమువలన, దురాచారః = దుష్ప్రవర్తన కలవాడవు, అసి = అయితివి. తస్మాత్ = ఆ కారణము వలన, త్వమ్ = నీవు, న భవిష్యసి = ఉండవు.

తా. ‘‘ఓరీ! మూఢాత్మా! చిరకాలమునుంచి పెంచిన ఆశ్రమమును నశింపచేసితివి. ఇంతటి దుష్కార్యము చేసితివి. ఇక నీవు జీవించవు’’.

మూ. ఇత్యుక్త్వా పరమక్రుద్ధో దణ్డముద్యమ్య సత్వరః,

విధూమమివ కాలాగ్నిం యమదణ్డమివాపరమ్. 28

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే పఞ్చపఞ్చాశః సర్గః

ప్ర. అ. ఇతి = ఈ విధముగా, ఉక్త్వా = పలికి, సత్వరః = తొందర కలవాడై, పరమక్రుద్ధః = చాల కోపించిన వాడై, విధూమమ్ = ధూమము లేని, కాలాగ్నిమివ = కాలాగ్ని వలె నున్నదియు, అపరమ్ = రెండవ, యమదణ్డమివ = యమదండము వలె నున్నదియు అగు, దణ్డమ్ = దండమును, ఉద్యమ్య = ఎత్తి, (నిలచెను).

తా. మిక్కిలి కోపించిన వసిష్ఠుడు ఈ విధముగ పలికి ధూమము లేని కాలాగ్ని వలె, రెండవ యమదండము వలె ఉన్న దండమును శీఘ్రముగ చేత ధరించి నిలచెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో ఏబదియైదవ సర్గ సమాప్తము.