Chapter_56

Back
Book Balakandamu
Chapter No 62
Pages 6
Read Time 8 Minutes

Chapter_56

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ షట్పఞ్చాశః సర్గః

విశ్వామిత్రుడు వసిష్ఠునిపై వివిధాస్త్రములను ప్రయోగింపగా వసిష్ఠుడు తన బ్రహ్మదండముతో ఆ అస్త్రముల నన్నింటిని శమింపచేయుట. బ్రాహ్మణత్వమును సంపాదించుటకై విశ్వామిత్రుడు తపస్సు చేయ నిశ్చయించుకొనుట.

మూ. ఏవముక్తో వసిష్ఠేన విశ్వామిత్రో మహాబలః,

ఆగ్నేయమస్త్రముత్క్షిప్య తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్. 1

ప్ర. అ. మహాబలః = గొప్ప బలము గల, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, వసిష్ఠేన = వసిష్ఠునిచేత, ఏవమ్ = ఇట్లు, ఉక్తః = పలకబడిన వాడై, ఆగ్నేయమ్ అస్త్రమ్ = అగ్నేయాస్త్రమును, ఉత్క్షిప్య = ఎత్తి, తిష్ఠ తిష్ఠ ఇతి = నిలుపుము, నిలుపుము అని అబ్రవీత్ చ = పలికెను కూడ.

తా. వసిష్ఠుని వాక్యములు విన్న మహాబలశాలి యగు విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రమును ప్రయోగించుచు, ‘‘నిలువుము, నిలువుము’’ అని పలికెను.

మూ. బ్రహ్మదణ్డం సముత్క్షిప్య కాలదణ్డమివాపరమ్,

వసిష్ఠో భగవాన్ క్రోధాదిదం వచనమబ్రవీత్. 2

ప్ర. అ. భగవాన్ = పూజ్యు డైన, వసిష్ఠః = వసిష్ఠుడు, పరమ్ = రెండవ, కాలదణ్డమివ = యమదండము వలె నున్న, బ్రహ్మదణ్డమ్ = బ్రహ్మదండమును, సముత్క్షిప్య = ఎత్తి, క్రోధాత్ = కోపముతో, ఇదమ్ = ఈ, వచనమ్ = వచనమును, అబ్రవీత్ = పలికెను.

తా. పూజ్యు డైన వసిష్ఠుడు రెండవ కాలదండము వలె నున్న బ్రహ్మదండము నెత్తి కోపముతో ఇట్లు పలికెను.

మూ. క్షత్రబన్ధో స్థితోఽస్మ్యేష యద్బలం తద్విదర్శయ,

నాశయామ్యద్య తే దర్పం శస్త్రస్య తవ గాధిజ. 3

ప్ర. అ. క్షత్రబన్ధో = ఓ దుష్టక్షత్రియా! ఏషః = ఈ నేను, స్థితః అస్మి = నిలచి ఉన్నాను. యత్ = ఏ, బలమ్ = బల మున్నదో,తత్ = దానిని, విదర్శయ = చూపుము. గాధిజ = ఓ గాధికుమారుడా!, అద్య = ఇప్పుడు, తే = నీయొక్క, దర్పమ్ = దర్పమును, తవ = నీయొక్క, శస్త్రస్య = ఆయుధముయొక్క, దర్పమును, నాశయామి = నశింపచేసెదను.

తా. ఓ దుష్టక్షత్రియా! నీ కున్న బల మేదియో చూపుము. ఇపుడు నీ దర్పమును, నీ శస్త్రముల దర్పమును నశింపచేసెదను.

మూ. క్వ చ తే క్షత్రియబలం క్వ చ బ్రహ్మబలం మహత్,

పశ్య బ్రహ్మబలం దివ్యం మమ క్షత్రియపాంసన. 4

ప్ర. అ. క్షత్రియపాంసన = ఓ క్షత్రియాధమా!, తే = నీయొక్క,క్షత్రియబలమ్ = క్షత్రియ బలము, క్వ = ఎక్కడ మహత్ = గొప్ప దైన, బ్రహ్మబలమ్ = బ్రహ్మబలము, క్వ చ = ఎక్కడ? మమ = నాయొక్క, దివ్యమ్ = దివ్య మైన, బ్రహ్మబలమ్ = బ్రహ్మబలమును, పశ్య = చూడుము.

తా. ఓ క్షత్రియాధమా! నీ క్షత్రియబల మెక్కడ, గొప్ప దైన బ్రహ్మ బల మెక్కడ? దివ్య మైన నా బ్రహ్మబలమును చూడుము.

మూ. తస్యాస్త్రం గాధిపుత్రస్య ఘోరమాగ్నేయముద్యతమ్,

బ్రహ్మదణ్డేన తచ్ఛాన్తమగ్నేర్వేగ ఇవామ్భసా. 5

ప్ర. అ. తస్యా = ఆ, గాధిపుత్రస్య = విశ్వామిత్రునియొక్క, ఉద్యతమ్ = ప్రయెగింపబడిన, తత్ = ఆ, ఆగ్నేయమ్ = ఆగ్నేయ మను, అస్త్రమ్ = అస్త్రము, అమ్భసా = నీటిచేత, అగ్నేః = అగ్నియొక్క, వేగః ఇవ = వేగము వలె, బ్రహ్మదణ్డేన బ్రహ్మదండముచేత, శాన్తమ్ = శాంతించినది.

తా. విశ్వామిత్రుడు ప్రయోగించిన భయంకరమైన ఆ బ్రహ్మాస్త్రము అగ్నివేగము ఉదకముచే శాంతించి నట్లు బ్రహ్మదండముచే శాంతించెను.

మూ. వారుణం చైవ రౌద్రం చ ఐన్ద్రం పాశుపతం తథా,

ఐషీకం చాపి చిక్షేప కుపితో గాధినన్దనః 6

ప్ర. అ. కుపితః = కోపించిన, గాధినన్దనః = విశ్వామిత్రుడు, వారుణం చైవ = వారుణాస్త్రమును, రౌద్రం చ = రౌద్రాస్త్రమును, ఐన్ద్రం చ = ఐంద్రాస్త్రమును, తథా = మరియు, పాశుపతమ్ = పాశుపతాస్త్రమును, ఐషీకం చాపి = ఐషీకాస్త్రమును, చిక్షేప = ప్రయోగించెను.

తా. విశ్వామిత్రుడు కోపించి వారుణ-రౌద్ర-ఐంద్ర-పాశుపత-ఐషీకాస్త్రములను ప్రయోగించెను.

మూ. మానవం మోహనం చైవ గాన్ధర్వం స్వాపనం తథా,

జృమ్భణం మాదనం చైవ సన్తాపనవిలాపనే. 7

శోషణం దారణం చైవ వజ్రమస్త్రం సుదుర్జయమ్,

బ్రహ్మపాశం కాలపాశం వారుణం పాశమేవ చ. 8

పైనాకాస్త్రం చ దయితం శుష్కార్ద్రే అశనీ ఉభే,

దణ్డాస్త్రమథ పైశాచం క్రౌఞ్చమస్త్రం తథైవ చ. 9

ధర్మచక్రం కాలచక్రం విష్ణుచక్రం తథైవ చ,

వాయవ్యం మథనం చైవ అస్త్రం హయశిరస్తథా. 10

శక్తిద్వయం చ చిక్షేప కఙ్కాళం ముసలం తథా,

వైద్యాధరం మహాస్త్రం చ కాలాస్త్రమథ దారుణమ్. 11

త్రిశూలమస్త్రం ఘోరం చ కాపాలమథ కఙ్కణమ్,

ఏతాన్యస్త్రాణి చిక్షేప సర్వాణి రఘునన్దన. 12

వసిష్ఠే జపతాం శ్రేష్ఠే తదద్భుతమివాభవత్.

ప్ర. అ. రఘునన్దన = రామా!, మానవమ్ = మానవాస్త్రమును, మోహనం చైవ = మోహము కలిగించు అస్త్రమును, గాన్ధర్వమ్ = గాంధర్వమును, తథా = మరియు, స్వాపనమ్ = నిద్ర కలిగించు అస్త్రమును, జృమ్భణమ్ = ఆవులింతలు కలిగించు అస్త్రమును, మాదనం చైవ = మత్తు కలిగించు అస్త్రమును, సన్తాపన విలాపనే = తాపమును విలాపమును కలిగించు అస్త్రములను, శోషణమ్ = ఎండింపచేయు అస్త్రమును, దారణం చైవ = చీల్చివేయు అస్త్రమును, సుదుర్జయమ్ = ఏ మాత్రము జయింపశక్యము కాని, వజ్రమ్ అస్త్రం చ = వజ్రాస్త్రమును, బ్రహ్మపాశమ్ = బ్రహ్మపాశమును, కాలపాశమ్ = కాలపాశమును, వారుణం పాశమేవ చ = వరుణపాశమును, పైనాకాస్త్రమ్ = పైనాకాస్త్రమును, దయితం చ = దయితాస్త్రమును, శుష్కార్ద్రే = శుష్కము (ఎండినది) ఆర్ద్రమ్ (తడిసినది) అను, ఉభే = రెండు, అశనీ = వజ్రములను, అథ = మరియు, దణ్డాస్త్రమ్ = దండాస్త్రమును, పైశాచమ్ = పైశాచమును, తథైవ చ = మరియు, క్రౌఞ్చమస్త్రమ్ = క్రౌంచాస్త్రమును, ధర్మచక్రమ్ = ధర్మచక్రమును, కాలచక్రమ్ = కాలచక్రమును, తథైవ చ = మరియు, విష్ణుచక్రమ్ = విష్ణుచక్రమును, వాయవ్యమ్ = వాయవ్యమును, మథనం చైవ = మథనమును, తథా = మరియు, హయశిరః అస్త్రమ్ = హయశిరస్సు అను అస్త్రమును, కఙ్కాళమ్ = కంకాళము, తథా = మరియు, ముసలమ్ = ముసలము అనెడు, శక్తి ద్వయం చ = రెండు శక్తులను, చిక్షేప = ప్రయోగించెను. వైద్యాధరమ్ = వైద్యాధర మనెడు, మహాస్త్రం చ = మహాస్త్రమును, అథ = అటుపిమ్మట, దారుణమ్ = భయంకర మైన, కాలాస్త్రమ్ = కాలాస్త్రమును, ఘోరమ్ = ఘోర మైన, త్రిశూలమ్ అస్త్రమ్ = త్రిశూలాస్త్రమును, అథ = మరియు, కాపాలమ్ = కాపాలమును, కఙ్కణమ్ = కంకణాస్త్రమును, ఏతాని = ఈ, సర్వాణి = సమస్త మైన, అస్త్రాణి = అస్త్రములను, జపతాం శ్రేష్ఠే = మునులలో శ్రేష్ఠు డైన, వసిష్ఠే = వసిష్ఠునిపై, చిక్షేప = ప్రయోగించెను. తత్ = అది, అద్భుతమివ = చాల ఆశ్చర్యకరము, అభవత్ = ఆయెను.

తా. రామా! ఆ విశ్వామిత్రుడు, మానవ-మోహన-గాంధర్వ-స్వాపన-జృంభణ- మాదన-సంతాపన-విలాపన-శోషణ-దారణ-వజ్రాస్త్రములను, బ్రహ్మపాశవరుణ పాశములను, పైనాక-దయితాస్త్రములను, శుష్కము, ఆర్ద్రము అను రెండు వజ్రములను, దండ- పైశాచ క్రౌంచాస్త్రములను, ధర్మచక్ర-కాలచక్ర-విష్ణుచక్రములను, వాయవ్య-మథన- హయశిరోస్త్రములను, కంకాళ-ముసలము లను రెండు శక్తులను, వైద్యాధర-కాల- త్రిశూల-కాపాల-కంకణాస్త్రములను ప్రయోగించెను.

మూ. తాని సర్వాణి దణ్డేన గ్రసతే బ్రహ్మణః సుతః,

తేషు శాన్తేషు బ్రహ్మాస్త్రం క్షిప్తవాన్ గాధినన్దనః. 13

ప్ర. అ. బ్రహ్మణః సుతః = బ్రహ్మకుమారు డైన వసిష్ఠుడు, తాని సర్వాణి = వాటి నన్నింటిని, దణ్డేన = దండముచేత, గ్రసతే = మ్రింగివేసెను. తేషు = ఆ అస్త్రములు, శాన్తేషు = శాంతించగా, గాధినన్దనః = విశ్వామిత్రుడు, బ్రహ్మాస్త్రమ్ = బ్రహ్మాస్త్రమును, క్షిప్తవాన్ = ప్రయోగించినాడు.

తా. వసిష్ఠుడు ఆ అస్త్రములు నన్నింటిని దండముచే మ్రింగివేసెను. ఆ అస్త్రము లన్నియు శాంతింపగా, విశ్వామిత్రుడు బ్రహాస్త్రము ప్రయోగించెను.

మూ. తదస్త్రముద్యతం దృష్ట్వా దేవాః సాగ్నిపురోగమాః. 14

దేవర్షయశ్చ సంభ్రాన్తా గన్ధర్వాః సమహోరగాః,

త్రైలోక్యమాసీత్సంతప్తం బ్రహ్మాస్త్రే సముదీరితే. 15

ప్ర. అ. ఉద్యతమ్ = ప్రయోగించబడిన, తత్ = ఆ, అస్త్రమ్ = అస్త్రమును, దృష్ట్వా = చూచి, సాగ్నిపురోగమాః = అగ్నితో కూడిన, దేవాః = దేవతలును, దేవర్షయః చ = దేవర్షులును, సమహోరగాః = మహోరగులతో కూడిన, గన్ధర్వాః = గంధర్వులును, సమ్భ్రాన్తాః = కలతచెందిరి. బ్రహ్మాస్త్రే = బ్రహ్మాస్త్రము, సముదీరితే = ప్రయోగింపబడిన దగుచుండగా, త్రైలోక్యమ్ = మూడు లోకములు, సంతప్తమ్ = తపింపబడినవి, ఆసీత్ = ఆయెను.

తా. ఆ అస్త్రము ప్రయోగించుటను చూచి అగ్న్యాదిదేవతలును, దేవర్షులును, గంధర్వులును, మహోరగులును, కలత చెందిరి. బ్రహ్మాస్త్రము ప్రయోగింపగనే ముల్లోకములును బాధ చెందెను.

మూ. తదప్యస్త్రం మహాఘోరం బ్రాహ్మం బ్రాహ్మేణ తేజసా,

వసిష్ఠో గ్రసతే బ్రహ్మదణ్డేన రాఘవ. 16

ప్ర. అ. రాఘవ = రామా!, వసిష్ఠః = వసిష్ఠుడు, బ్రాహ్మేణ తేజసా = బ్రహ్మతేజస్సుచేత, బ్రహ్మదణ్డేన = బ్రహ్మదండముచేత, మహాఘోరమ్ = అతి భయంకరమైన, తత్ = ఆ, బ్రాహ్మమ్ అస్త్రమపి = బ్రహ్మాస్త్రమును కూడ, సర్వమ్ = పూర్తిగా, గ్రసతే = మ్రింగివేసెను.

తా. రామా! వసిష్ఠుడు, బ్రహ్మతేజః ప్రభావముచే, బ్రహ్మదండముచేత, ఆ అతిభయంకర మైన బ్రహ్మాస్త్రమును కూడ పూర్తిగా మ్రింగివేసెను.

మూ. బ్రహ్మాస్త్రం గ్రసమానస్య వసిష్ఠస్య మహాత్మనః,

త్రైలోక్యమోహనం రౌద్రం రూపమాసీత్సుదారుణమ్. 17

ప్ర. అ. బ్రహ్మాస్త్రమ్ = బ్రహ్మాస్త్రమును, గ్రసమానస్య = మ్రింగుచున్న, మహాత్మనః = మహాత్ముడైన, వసిష్ఠస్య = వసిష్ఠునియొక్క, రూపమ్ = రూపము, త్రైలోక్యమోహనమ్ = మూడు లోకములను మూర్ఛనొందించునదిగాను, రౌద్రమ్ = భయంకరమైనదిగాను, సుదారుణమ్ = చాల దారుణముగాను, ఆసీత్ = ఆయెను.

తా. బ్రహ్మాస్త్రమును మ్రింగుచున్న సమయమున ఆ మహాత్ము డైన వసిష్ఠుని రూపము రౌద్రమై, అతిదారుణమై, ముల్లోకములను మూర్ఛనొందించునదిగా ఉండెను.

మూ. రోమకూపేషు సర్వేషు వసిష్ఠస్య మహాత్మనః,

మరీచ్య ఇవ నిష్పేతురగ్నేర్ధూమాకులార్చిషః. 18

ప్ర. అ. మహాత్మనః = మహాత్ముడైన, వసిష్ఠస్య = వసిష్ఠునియొక్క, సర్వేషు = సమస్తమైన, రోమకూపేషు = రోమకూపములందును, ధూమాకులార్చిషః = ధూమముతో నిండిన జ్వాలలు గల, అగ్నేః = అగ్నియొక్క, మరీచ్యః = కిరణములు, నిష్పేతురివ = బయల్వెడలి నట్లుండెను.

తా. మహాత్ము డైన వసిష్ఠుని రోమకూపములనుండి ధూమముతో నిండిన జ్వాలలు గల అగ్నికిరణములు బయల్వెడలి నట్లు కనబడెను.

మూ. ప్రాజ్వలద్బ్రహ్మదణ్డశ్చ వసిష్ఠస్య కరోద్యతః,

విధూమ ఇవ కాలాగ్నిర్యమదణ్డ ఇవాపరః. 19

ప్ర. అ. వసిష్ఠస్య = వసిష్ఠునియొక్క, కరోద్యతః = హస్తమునందు ఎత్తబడిన, బ్రహ్మదణ్డశ్చ = బ్రహ్మదండము, విధూమః = ధూమములేని, కాలాగ్ని రివ = ప్రలయకాలాగ్ని వలె, అపరః = మరి యొక, యమదణ్డః ఇవ = యమదండము వలె, ప్రాజ్వలత్ = మండిపడెను.

తా. వసిష్ఠుని హస్తములో నున్న బ్రహ్మదండము ధూమములేని ప్రలయ కాలాగ్ని వలె, రెండవ యమదండము వలె ప్రజ్వరిల్లెను.

మూ. తతోఽస్తువన్ మునిగణా వసిష్ఠం జపతాం వరమ్,

అమోఘం తే బలం బ్రహ్మన్ తేజో ధారయ తేజసా. 20

ప్ర. అ. తతః = పిమ్మట, మునిగణాః = మునిసముదాయములు, జపతాం వరమ్ = మునులలో శ్రేష్ఠు డైన, వసిష్ఠమ్ = వసిష్ఠుని, అస్తువన్ = స్తుతించిరి. బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణా!, తే = నీయొక్క, బలమ్ = బలము, అమోఘమ్ = శ్రేష్ఠ మైనది. తేజః = తేజస్సును తేజసా = తేజస్సుచేత, ధారయ = ధరించుము.

తా. అపుడు మునిగణములు మునిశ్రేష్ఠు డైన వసిష్ఠునితో ఇట్లు పలికిరి. ‘‘మహామునీ! నీ బలము అడ్డు లేనిది. నీ తేజస్సును నీ తేజస్సునందే నిగ్రహించుము’’.

మూ. నిగృహీతస్త్వయా బ్రహ్మన్ విశ్వామిత్రో మహాతపాః,

ప్రసీద జపతాం శ్రేష్ఠ లోకాస్సన్తు గతవ్యథాః. 21

ప్ర. అ. బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణా! త్వయా = నీచేత, మహాతపాః = గొప్ప తపస్సు గల, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, నిగృహీతః = నిగ్రహింపబడినాడు. జపతాం శ్రేష్ఠ = మునులలో శ్రేష్ఠుడా! ప్రసీద = అనుగ్రహింపుము. లోకాః = లోకములు, గతవ్యథాః = తొలగినవ్యథ కలవిగా, సన్తు = అగుగాక.

తా. బ్రాహ్మణోత్తమా! నీవు మహాతపఃశాలి యైన విశ్వామిత్రుని నిగ్రహించితివి. ఓ మునిశ్రేష్ఠా అనుగ్రహింపుము. లోకముల బాధ తొలగుగాక.

మూ. ఏవముక్తో మహాతేజాః శమం చక్రే మహాతపాః,

విశ్వామిత్రోఽపి నికృతో వినిఃశ్వస్యేదమబ్రవీత్. 22

ప్ర. అ. ఏవమ్ = ఈ విధముగా, ఉక్తః = పలకబడిన, మహాతేజాః = గొప్ప తేజస్సు గల, మహాతపాః = గొప్ప తపస్సు గల వసిష్ఠుడు, శమమ్ = శాంతిని, చక్రే = చేసెను. నికృతః = అవమానింపబడిన, విశ్వామిత్రః అపి = విశ్వామిత్రుడు కూడ, వినిఃశ్వస్య = నిట్టూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. మహాతేజశ్శాలియు, మహాతపశ్శాలియు అగు వసిష్ఠుడు వారి మాటలు విని శాంతించెను. ఈ విధముగ భంగపాటు చెందిన విశ్వామిత్రుడు నిట్టూర్చుచు ఇట్లు పలికెను.

మూ. ధిగ్బలం క్షత్రియబలం బ్రహ్మతేజోబలం బలమ్,

ఏకేన బ్రహ్మదణ్డేన సర్వాస్త్రాణి హతాని మే. 23

ప్ర. అ. క్షత్రియబలమ్ = క్షత్రియబలమును గూర్చి, ధిక్ = నింద అగుగాక. బ్రహ్మతేజో బలమ్ = బ్రహ్మతేజస్సుయొక్క బలమే, బలమ్ = బలము. ఏకేన = ఒక్క, బ్రహ్మదణ్డేన = బ్రహ్మదండముచేత, మే = నాయొక్క, సర్వాస్త్రాణి = అన్ని అస్త్రములును, హతాని = కొట్టబడినవి.

తా. ఛీ క్షత్రియబల మేమి బలము? బ్రహ్మతేజోబలమే నిజమైన బలము. ఒక్క బ్రహ్మదండము నా అస్త్రముల నన్నింటిని మ్రింగివేసినది కదా!

మూ. తదేతత్సమవేక్ష్యాహం ప్రసన్నేన్ద్రియమానసః,

తపో మహత్సమాస్థాస్యే యద్వె బ్రహ్మత్వకారణమ్. 24

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే షట్పఞ్చాశః సర్గః

ప్ర. అ. తత్ = ఆ కారణమువలన, ఏతత్ = ఈ విషయమును, సమవేక్ష్య = చూచి, అహమ్ = నేను, ప్రసన్నేన్ద్రియమానసః = ప్రసన్న మైన ఇంద్రియములను మనస్సును కలవాడనై, యత్ = ఏది, బ్రహ్మత్వకారణమ్ = బ్రాహ్మణత్వమునకు కారణమో అట్టి, మహత్ = గొప్ప, తపః = తపస్సును, సమాస్థాస్యే = అవలంబింపగలను.

తా. ఇపుడు నే నీ విషయమును గ్రహించితిని. అందుచేత మనస్సును ఇంద్రియము లను నిర్మలముగ ఉంచుకొని, నాకు బ్రాహ్మణత్వము నొసగు తీవ్ర తపస్సు చేసెదను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,

బాలకాండములో ఏబదిఆరవ సర్గ సమాప్తము.