| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 63 |
| Pages | 5 |
| Read Time | 8 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ సప్తపఞ్చాశః సర్గః
విశ్వామిత్రుడు తపస్సు చేయుట. సశరీరస్వర్గము పొందుటకై తనచే యజ్ఞము చేయింపవలె నని త్రిశంకువు వసిష్ఠుని ప్రార్థించుట. ఆతడందులకు నిరాకరింపగా త్రిశంకుడు గురుపుత్రులవద్దకు వెళ్ళి తన అభిప్రాయము చెప్పుట.
మూ. తతః సంతప్తహృదయః స్మరన్నిగ్రహమాత్మనః,
వినిశ్శ్వస్య వినిశ్శ్వస్య కృతవైరో మహాత్మనా. 1
స దక్షిణాం దిశం గత్వా మహిష్యా సహ రాఘవ,
తతాప పరమం ఘోరం విశ్వామిత్రో మహత్తపః, 2
ఫలమూలాశనో దాన్తశ్చకార సుమహత్తపః.
ప్ర. అ. రాఘవ = రామా! తతః = పిమ్మట, మహాత్మనా = మహాత్ము డైన వసిష్ఠునితో, కృతవైరః = చేయబడిన వైరము గల, సః = ఆ, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, సంతప్తహృదయః = తపింపచేయబడిన హృదయము కలవాడై, ఆత్మనః = తనయొక్క, నిగ్రహమ్ = పరాభవమును, స్మరన్ = స్మరించుచు, వినిశ్శ్వస్య వినిశ్శ్వస్య = మాటిమాటికి నిట్టూర్చి, మహిష్యా సహ = జ్యేష్ఠభార్యతో కూడ, దక్షిణాం దిశమ్ = దక్షిణదిక్కును గూర్చి, గత్వా = వెళ్లి, పరమం ఘోరమ్ = మిక్కిలి ఘోర మైన, మహత్ = గొప్ప, తపః = తపస్సును, తతాప = చేసెను. ఫలమూలాశనః = ఫలమూలములను ఆహారముగ గ్రహించుచు, దాన్తః = ఇంద్రియనిగ్రహము గలవాడై, సుమహత్ = గొప్ప, తపః = తపస్సు, చకార = చేసెను.
తా. ఈ విధముగ మహాత్ము డైన వసిష్ఠునితో వైరము పెట్టుకొనిన ఆ విశ్వామిత్రుడు తనకు కలిగిన పరాభవమును స్మరించుచు, బాధపడు చున్న మనస్సుతో మాటి మాటికి నిట్టూర్చుచు, జ్యేష్ఠభార్యతో కూడ దక్షిణదిక్కునకు వెళ్లి, ఫలములు మూలములు మాత్రమే ఆహారముగా గొనుచు, ఇంద్రియములను నిగ్రహించుకొని అతి తీవ్ర మైన తపస్సు చేసెను.
మూ. అథాస్య జజ్ఞిరే పుత్రాస్సత్యధర్మపరాయణాః,
హవిష్యన్దో మధుస్యన్దో దృఢనేత్రో మహారథః. 3
ప్ర. అ. అథ = పిమ్మట, అస్య = ఈతనికి, హవిష్యన్దః = హవిష్యందుడు, మధుస్యన్దః = మధుస్యందుడు, దృఢనేత్రః = దృఢనేత్రుడు, మహారథః = మహారథుడు అను, సత్యధర్మ పరాయణాః = సత్యధర్మములం దాసక్తి గల, పుత్రాః = పుత్రులు, జజ్ఞిరే = పుట్టిరి.
తా. పిమ్మట, ఈ విశ్వామిత్రునకు హవిష్యందుడు, మధుస్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అను సత్యధర్మపరాయణు లైన నలుగురు కుమారులు పుట్టిరి.
మూ. పూర్ణే వర్షసహస్రే తు బ్రహ్మా లోకపితామహః,
అబ్రవీన్మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనమ్. 4
ప్ర. అ. వర్షసహస్రే = వేయి సంవత్సరములు, పూర్ణే = నిండగా, లోకపితామహః = లోకములకు పితామహు డైన, బ్రహ్మా = బ్రహ్మదేవుడు, తపోధనమ్ = తపస్సే ధనముగా గల, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి, మధురమ్ = మధురమైన, వాక్యమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.
తా. వేయి సంవత్సరములు పూర్తి యైనవి. అపుడు సర్వలోకములకును పితామహు డైన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తపోధను డైన విశ్వామిత్రునితో మధుర మైన వాక్యము పలికెను.
మూ. జితా రాజర్షిలోకాస్తే తపసా కుశికాత్మజ,
అనేన తపసా త్వాం తు రాజర్షిరితి విద్మహే. 5
ప్ర. అ. కుశికాత్మజ = విశ్వామిత్రా! తే = నీయొక్క, తపసా = తపస్సుచేత, రాజర్షిలోకాః = రాజర్షిలోకములు, జితాః = జయింపబడినవి. అనేన = ఈ, తపసా = తపస్సుచేత, త్వామ్ = నిన్ను, రాజర్షిః ఇతి = రాజర్షి అని, విద్మహే = గుర్తించుచున్నాము.
తా. కుశికనందనా! నీవు తపస్సుచేత రాజర్షులు చేర గల్గిన లోకాలను జయించినావు. ఈ తపస్సుచే నీవు రాజర్షి వైనావు.
మూ. ఏవముక్త్వా మహాతేజా జగామ సహ దైవతైః,
త్రివిష్టపం బ్రహ్మలోకం లోకానాం పరమేశ్వరః. 6
ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును, లోకానామ్ః = లోకములకు, పరమేశ్వరః = పరమేశ్వరుడును అయిన బ్రహ్మదేవుడు, ఏవమ్ = ఈ విధముగా, ఉక్త్వా = పలికి, దైవతైః = దేవతలతో కూడ, బ్రహ్మలోకమ్ = బ్రహ్మలోక మైన, త్రివిష్టపమ్ = స్వర్గమునుగూర్చి, జగామ = వెళ్లెను.
తా. మహాతేజఃశాలియు, లోకములకు అధిపతియు అగు బ్రహ్మ ఈ విధముగ పలికి, దేవతలతో కూడ తన నివాసస్థాన మైన స్వర్గమునకు వెళ్లెను.
మూ. విశ్వామిత్రోఽపి తచ్ఛ్రుత్వా హ్రియా కిఞ్చిదవాఙ్ముఖః,
దుఃఖేన మహతావిష్టః సమన్యు రిదమబ్రవీత్. 7
ప్ర. అ. విశ్వామిత్రోఽపి = విశ్వామిత్రుడు కూడ, తత్ = ఆ వాక్యమును, శ్రుత్వా = విని, హ్రియా = సిగ్గుతో, కిఞ్చిత్ = కొంచెము, అవాఙ్ముఖః = వంచబడిన ముఖము కలవాడై, మహతా = గొప్ప దైన, దుఃఖేన = దుఃఖముతో, ఆవిష్టః = కూడిన వాడై, సమన్యుః = కోపముతో కూడిన వాడై, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను.
తా. విశ్వామిత్రుడు ఈ మాటలు విని, సిగ్గుతో తలవంచుకొని, గొప్ప దుఃఖముతో కూడిన వాడై, కోపముతో ఇట్లనెను.
మూ. తపశ్చ సుమహత్తప్తం రాజర్షిరితి మాం విదుః,
దేవాః సర్షిగణాః సర్వే నాస్తి మన్యే తపఃఫలమ్. 8
ప్ర. అ. సుమహత్ = చాల అధిక మైన, తపః = తపస్సు, తప్తమ్ = చేయబడినది. మామ్ = నన్ను, రాజర్షిరితి = రాజర్షి యని, సర్షిగణాః = ఋషి గణములతో కూడిన, సర్వే = సమస్త మైన, దేవాః = దేవతలు, విదుః = గుర్తించుచున్నారు. తపఃఫలం = తపస్సుకు ఫలము, నాస్తి = లేదు అని, మన్యే = తలచుచున్నాను.
తా. ఇంత తపస్సు చేసినాను; అయినను, దేవతలును, ఋషిగణములును రాజర్షి యని మాత్రమే నన్ను గుర్తించుచున్నారు. ఇంత తపస్సు చేసి ఫలితమేమియు లేదని తలచుచున్నాను.
మూ. ఇతి నిశ్చిత్య మనసా భూయ ఏవ మహాయశాః,
తపశ్చకార కాకుత్థ్స పరమం పరమాత్మవాన్. 9
ప్ర. అ. కాకుత్థ్స = రామా! మహాయశాః = గొప్ప కీర్తి కలవాడును, పరమాత్మవాన్ = మంచి బుద్ధి కలవాడును అగు ఆ విశ్వామిత్రుడు, ఇతి = ఈ విధముగా, మనసా = మనస్సుచేత, నిశ్చిత్య = నిశ్చయించి, భూయః ఏవ = మరల, పరమమ్ = గొప్ప, తపః = తపస్సును, చకార = చేసెను.
తా. రామా! గొప్ప కీర్తి కలవాడును, గొప్ప బుద్ధి కలవాడును అగు ఆ విశ్వామిత్రుడు మనస్సుచే ఈ విధముగా నిశ్చయించి మరల తీవ్ర మైన తపస్సు చేయ నారంభించెను.
మూ. ఏతస్మిన్నేవ కాలే తు సత్యవాదీ జితేన్ద్రియః,
త్రిశఙ్కురితి విఖ్యాత ఇక్ష్వాకుకులవర్ధనః. 10
ప్ర. అ. ఏతస్మిన్నేవ కాలే = ఈ కాలమునందే, సత్యవాదీ = సత్యమును పలుకువాడును, జితేన్ద్రియః = జయింపబడిన ఇంద్రియములు కలవాడును, ఇక్ష్వాకుకులవర్ధనః = ఇక్ష్వాకుకులమును వృద్ధిపొందించువాడును, త్రిశఙ్కురితి = త్రిశంకువు అని, విఖ్యాతః = ప్రసిద్ధు డైన (రాజు ఉండెను).
తా. ఆ కాలమునందే, సత్యవాదియు, జితేంద్రియుడు, ఇక్ష్వాకు వంశీయుడును అగు త్రిశంకు వను రాజు ఉండెను.
మూ. తస్య బుద్ధిః సముత్పన్నా యజేయమితి రాఘవ,
గచ్ఛేయం స్వశరీరేణ దేవానాం పరమాం గతిమ్. 11
ప్ర. అ. రాఘవ = రామా! స్వశరీరేణ = స్వశరీరముతో, దేవానామ్ = దేవతలయొక్క, పరమాం గతిమ్ = ఉత్తమగతిని, గచ్ఛేయమ్ = పొందెదను; యజేయమ్ = యాగము చేయుదును; అని, తస్య = ఆతనికి, బుద్ధిః = బుద్ధి, సముత్పన్నా = పుట్టినది.
తా. రామా! యజ్ఞము చేసి ఈ శరీరముతోడనే స్వర్గమునకు వెళ్లవలెను అని అతనికి బుద్ధి పుట్టినది.
మూ. స వసిష్ఠం సమాహూయ కథయామాస చిన్తితమ్,
అశక్యమితి చాప్యుక్తో వసిష్ఠేన మహాత్మనా. 12
ప్ర. అ. సః = అతడు, వసిష్ఠమ్ = వసిష్ఠుని, సమాహూయ = పిలిపించి, చిన్తితమ్ = తన ఆలోచనను, కథయామాస = చెప్పెను. మహాత్మనా = మహాత్ముడైన, వసిష్ఠేన = వసిష్ఠునిచేత, అశక్యమితి = శక్యము కాదు అని, ఉక్తః అపి = పలకబడెను కూడ.
తా. అతడు వసిష్ఠుని పిలిపించి తన అభిప్రాయము తెలుపగా ఆ మహాత్ముడు ఇది శక్యము కాదు అని చెప్పెను.
మూ. ప్రత్యాఖ్యాతో వసిష్ఠేన స యయౌ దక్షిణాం దిశమ్,
తతస్తత్కర్మసిద్ధ్యర్థం పుత్రాంస్తస్య గతో నృపః. 13
ప్ర. అ. వసిష్ఠేన = వసిష్ఠునిచేత, ప్రత్యాఖ్యాతః = నిరాకరింపబడిన ఆతడు, దక్షిణామ్ దిశమ్ = దక్షిణదిక్కును గూర్చి, యయౌ = వెళ్లెను. తతః = పిమ్మట, నృపః = రాజు, తత్కర్మసిద్ధ్యర్థమ్ = ఆ కర్మయొక్క సిద్ధికొరకు, తస్య = వసిష్ఠునియొక్క, పుత్రాన్ = పుత్రులను గూర్చి, గతః = వెళ్లినాడు.
తా. వసిష్ఠుడు నిరాకరింపగా, ఆ రాజు దక్షిణముగా వెళ్లి అచట అట్టి యజ్ఞము చేయింపు డని ప్రార్థించుటకై వసిష్ఠపుత్రులవద్దకు వెళ్లెను.
మూ. వాసిష్ఠా దీర్ఘతపసస్తపో యత్ర హి తేపిరే,
త్రిశఙ్కుస్సుమహాతేజాశ్శతం పరమభాస్వరమ్, 14
వసిష్ఠపుత్రాన్ దదృశే తప్యమానాన్ యశస్వినః.
ప్ర. అ. దీర్ఘతపసః = దీర్ఘ మైన తపస్సు గల, వాసిష్ఠాః = వసిష్ఠపుత్రులు, యత్ర = ఎచట, తపః = తపస్సు, తేపిరే = చేసిరో, అచట, సుమహాతేజాః = గొప్ప తేజస్సు గల, త్రిశఙ్కుః = త్రిశంకువు, పరమభాస్వరమ్ = మిక్కిలి ప్రకాశించుచున్న, శతమ్ = నూరుగురు, యశస్వినః = కీర్తి గల, తప్యమానాన్ = తపస్సు చేయుచున్న, వసిష్ఠపుత్రాన్ = వసిష్ఠ కుమారులను, దదృశే = చూచెను.
తా. గొప్ప తేజస్సు గల త్రిశంకువు దీర్ఘతపస్సు గల వసిష్ఠకుమారులు తపస్సు చేయుచున్న ఆశ్రమమునకు వెళ్లి అచట తపస్సు చేయుచున్నవారును, యశస్సు కలవారును తేజస్సు కలవారును అగు నూర్గురు వసిష్ఠపుత్రులను చూచెను.
మూ. సోఽభిగమ్య మహాత్మానః సర్వానేవ గురోః సుతాన్, 15
అభివాద్యానుపూర్వ్యాణ హ్రియా కిఞ్చిదవాఙ్ముఖః,
అబ్రవీత్సుమహాభాగాన్ సర్వానేవ కృతాఞ్జలిః. 16
ప్ర. అ. సః = అతడు, మహాత్మానః = మహాత్ము లైన, సర్వానేవ = సమస్త మైన, గురోః సుతాన్ = గురుపుత్రులను, అభిగమ్య = సమీపించి, ఆనుపూర్వ్యేణ = వయఃక్రమాను సారముగా, అభివాద్య = నమస్కరించి, హ్రియా = సిగ్గుచేత, కిఞ్చిత్ = కొంచెము, అవాఙ్ముఖః = వంచబడిన ముఖము కలవాడై, కృతాఞ్జలిః = చేయబడిన దోసిలికలవాడై, సర్వానేవ = సమస్త మైన, మహాభాగాన్ = ఆ మహాత్ములను గూర్చి, అబ్రవీత్ = పలికెను.
తా. అతడు మహాత్ము లగు ఆ గురుపుత్రులను సమీపించెను. ఆ మహాత్ముల నందరిని వారి వయఃక్రమము ననుసరించి నమస్కరించి సిగ్గుతో కొంచెము తలవంచి, దోసిలి యొగ్గి, వారితో ఇట్లనెను.
మూ. శరణం వః ప్రపద్యేఽహం శరణ్యాన్ శరణాగతః,
ప్రత్యాఖ్యాతోఽస్మి భద్రం వో వసిష్ఠేన మహాత్మనా. 17
ప్ర. అ. శరణాగతః = శరణుకోసమై వచ్చిన, అహమ్ = నేను, శరణ్యాన్ = రక్షకులైన, వః = మిమ్ములను, శరణం ప్రపద్యే = శరణపొందు చున్నాను. వః = మీకు, భద్రమ్ = క్షేమ మగుగాక. మహాత్మనా = మహాత్ము డైన, వసిష్ఠేన = వసిష్ఠునిచేత, ప్రత్యాఖ్యాతః అస్మి = ప్రత్యాఖ్యానము చేయబడితిని.
తా. నేను శరణాగతరక్షకు లైన మీవద్దకు శరణము కోరి వచ్చినాను. మీకు క్షేమ మగుగాక. మహాత్ము డైన వసిష్ఠుడు నా కోరిక నిరాకరించినాడు.
మూ. యష్టుకామో మహాయజ్ఞం తదనుజ్ఞాతుమర్హథ,
గురుపుత్రానహం సర్వాన్నమస్కృత్య ప్రసాదయే. 18
ప్ర. అ. మహాయజ్ఞమ్ = గొప్ప యజ్ఞమును, యష్టుకామః = చేయు కోరిక కలవాడను. తత్ = ఆ కారణమువలన, అనుజ్ఞాతుమ్ = అనుజ్ఞ ఇచ్చుటకు, అర్హథ = తగియున్నారు. అహమ్ = నేను, గురుపుత్రాన్ = గురుపుత్రు లైన, సర్వాన్ = మిమ్ముల నందరిని, నమస్కృత్య = నమస్కరించి, ప్రసాదయే = అనుగ్రహింప చేసుకొనుచున్నాను.
తా. మహాయజ్ఞ మొకటి చేయవలె నని నాకు కోరిక ఉన్నది. అందుకు అనుజ్ఞ ఇవ్వండి. గురుపుత్రు లైన మిమ్ముల నందరిని నమస్కరించి వేడుచున్నాను.
మూ. శిరసా ప్రణతో యాచే బ్రాహ్మణాన్ తపసి స్థితాన్,
తే మాం భవన్తః సిద్ధ్యర్థం యాజయన్తు సమాహితాః. 19
సశరీరో యథాహం హి దేవలోకమవాప్నుయామ్.
ప్ర. అ. శిరసా = శిరస్సుచేత, ప్రణతః = నమస్కరించుచున్న వాడనై, తపసి స్థితాన్ = తపస్సు చేయుచున్న, బ్రాహ్మణాన్ = బ్రాహ్మణు లైన మిమ్ములను, యాచే = ప్రార్థించు చున్నాను. తే = అట్టి, భవన్తః = మీరు, సమాహితాః = సావధానచిత్తులై, మామ్ = నన్ను, సిద్ధ్యర్థమ్ = కార్యసిద్ధికొరకు, యాజయన్తు = యజ్ఞము చేయించెదరు గాక. అహమ్ = నేను, సశరీరః = శరీరముతో కూడిన వాడనై, యథా = ఎట్లు, దేవలోకమ్ = దేవలోకమును, అవాప్నుయామ్ = పొందుదునో.
తా. తపస్సు చేయుచున్న బ్రాహ్మణోత్తములు మీరు. మిమ్ములను తల వంచి నమస్కరించి ప్రార్థించుచున్నాను. నేను శరీరముతో స్వర్గమునకు వెళ్లునట్లు చేయుటకై, మీరు సావధానచిత్తులై, యజ్ఞము చేయుంచుడు.
మూ. ప్రత్యాఖ్యాతో వసిష్ఠేన గతిమన్యాం తపోధనాః,
గురుపుత్రానృతే సర్వాన్నాహం పశ్యామి కాఞ్చన. 20
ప్ర. అ. తపోధనాః = ఓ తపోధనులారా! వసిష్ఠేన = వసిష్ఠునిచేత, ప్రత్యాఖ్యాతః = నిరాకరింపబడిన, అహమ్ = నేను, సర్వాన్ = సమస్త మైన, గురుపుత్రానృతే = గురుపుత్రులు తప్ప, అన్యామ్ = మరి యొక, గతిమ్ = గతిని, కాఞ్చన = దేనినీ, న పశ్యామి = చూడను.
తా. ఓ తపోధనులారా! వసిష్ఠుడు నిరాకరించిన పిమ్మట గురుపుత్రు లైన మీరు తప్ప నాకు మరొక గతి యేమియును లేదు.
మూ. ఇక్ష్వాకూణాం హి సర్వేషాం పురోధాః పరమా గతిః, 21
పురోధసస్తు విద్వాంసస్తారయన్తి సదా నృపాన్.
తస్మాదనన్తరం సర్వే భవన్తో దైవతం మమ. 22
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే సప్తపఞ్చాశః సర్గః
ప్ర. అ. సర్వేషామ్ = సమస్త మైన, ఇక్ష్వాకూణామ్ = ఇక్ష్వాకువంశీయులకు, పురోధాః = పురోహితుడు, పరమా = గొప్ప దైన, గతిః హి = గతి కదా. విద్వాంసః = విద్వాంసు లైన, పురోధనః = పురోహితులు, సదా = ఎల్లప్పుడును, నృపాన్ = రాజులను, తారయన్తి = తరింపచేయుదురు. తస్మాత్ = ఆ వసిష్ఠుని కంటె, అనన్తరమ్ = తరువాత, భవన్తః = మీరు, సర్వే = అందరును, మమ = నాకు దైవతమ్ = దేవతలు.
తా. ఇక్ష్వాకువంశీయు లందరికిని పురోహితుడే పరమగతి. విద్వాంసులైన పురోహితులు ఎల్లప్పుడును, రాజులను తరింపచేయుచుందురు. వసిష్ఠుని తరువాత మీరే నాకు దేవతలు.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో ఏబదిఏడవ సర్గ సమాప్తము.
