Chapter_58

Back
Book Balakandamu
Chapter No 64
Pages 6
Read Time 10 Minutes

Chapter_58

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ అష్టపఞ్చాశః సర్గః

వసిష్ఠుని కాదని తమవద్దకు వచ్చినందుకు వా రాతనిని నిందించి ఇంటికి వెళ్లు మని చెప్పుట. మరొక గురువు నాశ్రయింతు నని అతడు పలుకగా వారు ఆతనిని శపించుట. వారి శాపముచే చండాలత్వము పొందిన త్రిశంకువు విశ్వామిత్రు నాశ్రయించుట.

మూ. తతస్త్రిశఙ్కోర్వచనం శ్రుత్వా క్రోధసమన్వితమ్,

ఋషిపుత్రశతం రామ రాజానమిదమబ్రవీత్. 1

ప్ర. అ. రామ = శ్రీరామా! త్రిశఙ్కోః = త్రిశంకువుయొక్క, వచనమ్ = వచనమును, శ్రుత్వా = విని, తతః = పిమ్మట, ఋషిపుత్రశతమ్ = ఋషిపుత్రుల శతము, క్రోధ సమన్వితమ్ = కోపముతో కూడినదై, రాజానమ్ = రాజును గూర్చి, ఇదమ్ = ఈ వాక్యము, అబ్రవీత్ = పలికెను.

తా. రామా! త్రిశంకుని వచనములు విన్న నూరుగురు ఋషికుమారులును, కోపావిష్టులై రాజుతో ఇట్లు పలికిరి.

మూ. ప్రత్యాఖ్యాతో హి దుర్బుద్ధే గురుణా సత్యవాదినా,

తం కథం సమతిక్రమ్య శాఖాన్తరముపేయివాన్. 2

ప్ర. అ. దుర్బుద్ధే = ఓ చెడ్డబుద్ధి కలవాడా, సత్యవాదినా = సత్యమును పలికెడు, గురుణా = గురువుచేత, ప్రత్యాఖ్యాతః = నిరాకరింప బడినవాడవై, తమ్ = ఆ గురువును, అతిక్రమ్య = అతిక్రమించి, శాఖాన్తరమ్ = మరి యొక శాఖను, కథమ్ = ఎట్లు, ఉపేయివాన్ = పొందినావు?

తా. ఓ దుర్బుద్ధీ! సత్యవాది యైన గురువు నిరాకరించిన పిమ్మట, అతనిని కాదని మరొకరిని ఎట్లు ఆశ్రయించుచున్నావు?

మూ. ఇక్ష్వాకూణాం హి సర్వేషాం పురోధాః పరమో గురుః,

న చాతిక్రమితుం శక్యం వచనం సత్యవాదినః. 3

ప్ర. అ. సర్వేషామ్ = సమస్త మైన, ఇక్ష్వాకూణామ్ = ఇక్ష్వాకువంశ రాజులకు, పురోధాః = పురోహితుడు, పరమః = గొప్ప, గురుః = పూజ్యుడు. సత్యవాదినః = సత్యవాదియైన ఆ గురువుయొక్క, వచనమ్ = వాక్యము, అతిక్రమితుమ్ = అతిక్రమించుటకు, న శక్యమ్ = శక్యము కాదు.

తా. ఇక్ష్వాకువంశీయు లందరికిని పురోహితుడే పరమపూజ్యుడు. సత్యవాది యైన గురువుయొక్క వాక్యము అతిక్రమింపరానిది.

మూ. అశక్యమితి చోవాచ వసిష్ఠో భగవాన్ ఋషిః,

తం వయం వై సమాహర్తుం క్రతుం శక్తాః కథం తవ. 4

ప్ర. అ. భగవాన్ = పూజ్యుడైన, వసిష్ఠః ఋషిః = వసిష్ఠమహర్షి, అశక్యమితి = అశక్య మైనది అని, ఉవాచ = చెప్పి ఉన్నాడు. తమ్ = అట్టి, క్రతుమ్ = యజ్ఞమును, తవ = నీకు, సమాహర్తుమ్ = చేయుటకు, వయమ్ = మేము, కథమ్ = ఎట్లు, శక్తాః = సమర్థులము ?

తా. పూజ్యు డైన వసిష్ఠమహర్షి అశక్య మని చెప్పిన యజ్ఞమును మేము చేయించగలమా?

మూ. బాలిశస్త్వం నరశ్రేష్ఠ గమ్యతాం స్వపురం పునః,

యాజనే భగవాన్ శక్తస్త్రైలోక్యస్యాపి పార్థివ. 5

అవమానం చ తత్కర్తుం తస్య శక్ష్యామహే కథమ్.

ప్ర. అ. నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా! త్వమ్ = నీవు, బాలిశః = మూఢుడవు. పునః = మరల, స్వపురమ్ = నీపురమును గూర్చి, గమ్యతామ్ = వెళ్లెదవు గాక. పార్థివ = రాజా! భగవాన్ = పూజ్యు డైన వసిష్ఠుడు, త్రైలోక్యస్య = మూడు లోకములయొక్క, యాజనేఽపి = యజ్ఞము చేయించుటలో కూడ, శక్తః = సమర్థుడు. తత్ = ఆ కారణమువలన, తస్య = ఆతనియొక్క, అవమానమ్ = అవమానమును, కర్తుమ్ = చేయుటకు, కథమ్ = ఎట్లు, శక్ష్యామహే = సమర్థులము కాగలము.

తా. ఓ నరశ్రేష్ఠుడా! నీవు మూఢుడవు. నీ నగరమునకు తిరిగి వెళ్లుము. పూజ్యు డైన వసిష్ఠుడు ముల్లోకములలో ఉన్న ఎవ్వరిచేత నైనను యాగము చేయించ సమర్థుడు. ఆయన కాదనిన తరువాత యాగము చేయించి ఆయనను మేము అవమానించ గలమా?

మూ. తేషాం తద్వచనం శ్రుత్వా క్రోధపర్యాకులాక్షరమ్,

స రాజా పునరేవైతానిదం వచన మబ్రవీత్. 6

ప్ర. అ. సః = ఆ, రాజా = రాజు, క్రోధపర్యాకులేక్షణమ్ = క్రోధముచేత వ్యాకుల మైన అక్షరములు గల, తత్ = ఆ, వచనమ్ = వచనమును, శ్రుత్వా = విని, పునరేవ = మరల, ఇదమ్ = ఈ, వచనమ్ = వచనమును, అబ్రవీత్ = పలికెను.

తా. క్రోధముచే అక్షరములు తడబడు చున్న, వారు పలికిన, మాటలు విని ఆ రాజు మరల ఇట్లనెను.

మూ. ప్రత్యాఖ్యాతోఽస్మి గురుణా గురుపుత్రైస్తథైవ చ,

అన్యాం గతిం గమిష్యామి స్వస్తి వోఽస్తు తపోధనాః. 7

ప్ర. అ. తపోధనాః = ఓ తపోధనులారా! గురుణా = గురువుచేతను, తథైవ చ = మరియు, గురుపుత్రైశ్చ = గురుపుత్రులచేతను, ప్రత్యాఖ్యాతః అస్మి = నిరాకరింపబడితిని. అన్యామ్ = మరి యొక, గతిమ్ = గతిని, గమిష్యామి = పొంద గలను. వః = మీకు, స్వస్తి అస్తు = క్షేమమగుగాక.

తా. ఓ తపోధనులారా! నా గురువు, గురుపుత్రులు కూడ నా కోరికను నిరాకరించినారు. మరొకగతి చూచుకొనెదను. మీకు క్షేమ మగుగాక.

మూ. ఋషిపుత్రాస్తు తచ్ఛ్రుత్వా వాక్యం ఘోరాభిసంహితమ్,

శేపుః పరమసంక్రుద్ధాశ్చణ్డాలత్వం గమిష్యసి. 8

ప్ర. అ. ఋషిపుత్రాస్తు = ఋషిపుత్రులైతే, ఘోరాభిసంహితమ్ = ఘోరమైన అభిప్రాయము గల, తత్ = ఆ, వాక్యమ్ = వాక్యమును, శ్రుత్వా = విని, పరమసంక్రుద్ధాః = చాల కోపించినవారై, చణ్డాలత్వమ్ = చండాలత్వమును, గమిష్యసి = పొందగలవు అని, శేపుః = శపించిరి.

తా. చెడ్డ అభిప్రాయముతో కూడిన అతని మాట విని, వసిష్ఠపుత్రులు చాల కోపించి, చండాలుడ వగుదువు గాక అని శపించిరి.

మూ. ఏవముక్త్వా మహాత్మనో వివిశుస్తే స్వమాశ్రమమ్,

అథ రాత్య్రాం వ్యతీతాయాం రాజా చణ్డాలతాం గతః. 9

ప్ర. అ. మహాత్మానః = మహాత్ములైన, తే = వారు, ఏవమ్ = ఈ విధముగా, ఉక్త్వా = పలికి, స్వమ్ = తమసంబంధ మైన, ఆశ్రమమ్ = ఆశ్రమమును, వివిశుః = ప్రవేశించిరి. అథ = పిమ్మట, రాత్య్రామ్ = రాత్రి, వ్యతీతాయామ్ = గడచిన దగుచుండగా, రాజా = రాజు, చణ్డాలతామ్ = చండాలత్వమును, గతః = పొందినాడు.

తా. ఈ విధముగ పలికి ఆ మహాత్ములు తమ ఆశ్రమములోనికి వెళ్లి పోయిరి. పిమ్మట రాత్రి గడవగానే రాజు చండాలుడై పోయెను.

మూ. నీలవస్త్రధరో నీలః పరుషో ధ్వస్తమూర్ధజః,

చిత్యమాల్యానులేపశ్చ ఆయసాభరణోభవత్. 10

ప్ర. అ. నీలవస్త్రధరః = నల్లని వస్త్రములు ధరించి, నీలః = నల్లనివాడుగను, పరుషః = సౌకుమార్యము లేనివాడుగను, ధ్వస్తమూర్ధజః = తగ్గిపోయిన కేశములు కలవాడుగను, చిత్యమాల్యానులేపశ్చ = శ్మశానములోని మాలలను బూడిదను ధరించివాడుగను, ఆయసాభరణః = ఇనుప అలంకారములు కలవాడుగను, అభవత్ = ఆయెను.

తా. ఆతడు నల్లనివాడై, నల్లని వస్త్రములు ధరించి, సౌకుమార్యము తొలగి, కురుచలైన కేశములతో, శ్మశానమునందలి మాలలను ధరించి, బూడిదను పూసికొని, ఇనుప ఆభరణములను ధరించి ఉండెను. తెల్లవారుసరికి ఆతని రాజవస్త్రభూషణాదు లన్నియు ఈ విధముగా మారిపోయెను.

మూ. తం దృష్ట్వా మన్త్రిణః సర్వే త్యజ్య చణ్డాలరూపిణమ్,

ప్రాద్రవన్ సహితా రామ పౌరా యేఽస్యానుగామినః. 11

ప్ర. అ. రామ = రామా!, చణ్డాలరూపిణమ్ = చండాలరూపము గల, తమ్ = ఆతనిని, దృష్ట్వా= చూచి, సర్వే = సమస్త మైన, మన్త్రిణః = మంత్రులును, పౌరాః = పౌరులును, యే = ఎవరు, అస్య = ఇతనియొక్క, అనుగామినః = అనుసరించి ఉండువారలో వారును, సహితాః = కలసిన వారై, ప్రాద్రవన్ = పారి పోయిరి.

తా. రామా! చండాలరూపము గల అతనిని చూచి, మంత్రులును, పౌరులును, అతని అనుచరులును, అందరును కలిసి దూరముగ పారిపోయిరి.

మూ. ఏకో హి రాజా కాకుత్స్థ జగామ పరమాత్మవాన్,

దహ్యమానో దివారాత్రం విశ్వామిత్రం తపోనిధిమ్. 12

ప్ర. అ. కాకుత్థ్స = రామా! పరమ్ = మిక్కిలి, ఆత్మవాన్ = ధైర్యము గల, రాజా = రాజు, ఏకః = ఒక్కడే, దివారాత్రమ్ = రాత్రులందును పగటి యందును, దహ్యమానః = దుఃఖముచే దహింపబడుచు, తపోనిధిమ్ = తపస్సుకు నిధి యైన, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి, జగామ = వెళ్లెను.

తా. రామా! మిక్కిలి ధైర్యము గల ఆ త్రిశంకుడు ఏకాకియై, దుఃఖముతో కుములుచు, విశ్వామిత్రమహామునివద్దకు వెళ్లెను.

మూ. విశ్వామిత్రస్తు తం దృష్ట్వా రాజానం విఫలీకృతమ్,

చణ్డాలరూపిణం రామ మునిః కారుణ్యమాగతః. 13

ప్ర. అ. రామ = రామా!, మునిః = ముని యైన, విశ్వామిత్రస్తు = విశ్వామిత్రుడైతే, విఫలీకృతమ్ = వ్యర్థుడుగా చేయబడిన, చణ్డాలరూపిణమ్ = చండాల రూపము ధరించిన, తమ్ = ఆ, రాజానమ్ = రాజును, దృష్ట్వా = చూచి, కారుణ్యమ్ = కారుణ్యమును, ఆగతః = పొందెను.

తా. రామా! వసిష్ఠాదులచే విఫలీకృతుడై చండాలత్వము చెందిన ఆ రాజును జూచి విశ్వామిత్రుడు జాలి చెందెను.

మూ. కారుణ్యాత్స మహాతేజా వాక్యం పరమధార్మికః,

ఇదం జగాద భద్రం తే రాజానం ఘోరరూపిణమ్. 14

ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు గలవాడును, పరమధార్మికః = మిక్కిలి ధార్మికుడును అగు, సః = ఆతడు, కారుణ్యాత్ = కారుణ్యమువలన, ఘోరరూపిణమ్ = ఘోర మైన రూపము గల, రాజానమ్ = ఆ రాజును గూర్చి, తే = నీకు, భద్రమ్ = మంగళ మగుగాక అని ముందుగ పలికి, ఇదమ్ = ఈ వాక్యమును, జగాద = పలికెను.

తా. మహాతేజశ్శాలియు పరమధార్మికుడును అగు విశ్వామిత్రుడు, ఘోర రూపము గల ఆ త్రిశంకుని చూచి, జాలిగొని, ‘‘నీకు భద్ర మగుగాక’’ అని అనుచు, ఇట్లు పలికెను.

మూ. కిమాగమనకార్యం తే రాజపుత్ర మహాబల,

అయోధ్యాధిపతే వీర శాపాచ్చణ్డాలతాం గతః. 15

ప్ర. అ. మహాబల = గొప్ప బలము గల, రాజపుత్ర = రాజా!, తే = నీయొక్క, ఆగమనకార్యమ్ = వచ్చుటలోని పని, కిమ్ = ఏమి ? అయోధ్యాధిపతే = అయోధ్యకు అధిపతి యైన, వీర = ఓ వీరుడా! శాపాత్ = శాపమువలన, చణ్డాలతామ్ = చండాలత్వమును, గతః = పొందినావు.

తా. మహాబలుడ వైన ఓ! రాజపుత్రా! నీవు ఎందుకు వచ్చినావు ? అయోధ్యాధిపతి వైన ఓ వీరుడా! పాపము శాపమువలన చండాలుడ వైతివి కదా!

మూ. అథ తద్వాక్యమాజ్ఞాయ రాజా చణ్డాలతాం గతః,

అబ్రవీత్ ప్రాఞ్జలిర్వాక్యం వాక్యజ్ఞో వాక్యకోవిదమ్. 16

ప్ర. అ. అథ = పిమ్మట, చణ్డాలతామ్ = చండాలత్వమును, గతః = పొందిన, వాక్యజ్ఞః = మాటల నెరిగిన, రాజా = రాజు, తద్వాక్యమ్ = ఆతని వాక్యమును, ఆజ్ఞాయ = విని, ప్రాఞ్జలిః = కట్టబడిన దోసిలి కలవాడై, వాక్యకోవిదమ్ = వాక్యముల నెరిగిన ఆ విశ్వామిత్రుని గూర్చి, వాక్యమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. చండాలత్వమును పొందిన ఆ త్రిశంకుడు ఆ మాటలు విని, మాటలలో నేర్పు గల ఆ విశ్వామిత్రునితో, చేతులు జోడించి, ఇట్లనెను.

మూ. ప్రత్యాఖ్యాతోఽస్మి గురుణా గురుపుత్రైస్తథైవ చ,

అనవాప్యైవ తం కామం మయా ప్రాప్తో విపర్యయః. 17

ప్ర. అ. గురుణా = గురువుచేతను, తథైవ చ = మరియు, గురుపుత్రైః = గురుపుత్రులచేతను, ప్రత్యాఖ్యాతః అస్మి = నిరాకరింపబడితిని. తమ్ = ఆ, కామమ్ = కోరికను, అనవాప్యైవ = పొందకుండగనే, మయా = నాచేత, విపర్యయః = ఈ విపరీతఫలము, ప్రాప్తః = పొందబడినది.

తా. గురువు గురుపుత్రులు కూడ నా కోరికను మన్నింపలేదు. ఆ కోరిక తీరకుండగనే ఈ విపరీతఫలమును పొందితిని.

మూ. సశరీరో దివం యాయామితి మే సౌమ్య దర్శనమ్,

మయా చేష్టం క్రతుశతం తచ్చ నావాప్యతే ఫలమ్. 18

ప్ర. అ. సౌమ్య = ఓ సౌమ్యుడా! సశరీరః = శరీరముతో కూడిన వాడనై, దివమ్ = స్వర్గమును గూర్చి, యాయామ్ = వెళ్లుదును, ఇతి = అని, మే = నాయొక్క, దర్శనమ్ = అభిప్రాయము. మయా = నాచేత, క్రతుశతమ్ = క్రతువులశతము, ఇష్టమ్ = చేయబడినది. తత్ = ఆ, ఫలమ్ = ఫలము, నావాప్యతే చ = పొందబడుటలేదు.

తా. ఓ సౌమ్యుడా! ఈ శరీరముతో స్వర్గమునకు వెళ్లవలె నని నా అభిప్రాయము. నూరు యజ్ఞములు చేసితిని కాని ఆ ఫలము లభింపలేదు.

మూ. అనృతం నోక్తపూర్వం మే న చ వక్ష్యే కదాచన,

కృచ్ఛ్రేష్వపి గతః సౌమ్య క్షత్రధర్మేణ తే శపే. 19

ప్ర. అ. సౌమ్య = ఓ సౌమ్యా! మే = నాచేత, అనృతమ్ = అసత్యము, న ఉక్తపూర్వమ్ = పూర్వము పలకబడలేదు. కదాచన = ఎన్నడును, కృచ్ఛ్రేషు గతః అపి = కష్టములు చెందినను, న వక్ష్యే = పలకను. క్షత్రధర్మేణ = క్షత్రియధర్మముచేత, తే = నీకు, శపే = ఒట్టు పెట్టుచున్నాను.

తా. మహామునీ! నే నెన్నడును అసత్యము పలికి ఎరుగను. ఇటుపైన కూడ ఎన్ని కష్టములు వచ్చినను అబద్ధ మాడను. నా క్షత్రియధర్మముపై ఒట్టుపెట్టి చెప్పుచున్నాను.

మూ. యఙ్ఞైర్బహువిధైరిష్టం ప్రజా ధర్మేణ పాలితాః,

గురవైశ్చ మహాత్మానః శీలవృత్తేన తోషితాః. 20

ప్ర. అ. బహువిధైః = అనేకవిధము లైన, యఙ్ఞైః = యజ్ఞములచేత, ఇష్టమ్ = యజ్ఞము (దేవతాపూజ) చేయబడినది. ప్రజాః = ప్రజలు, ధర్మేణ = ధర్మముచేత, పాలితాః = పాలింపబడినారు. మహాత్మానః = మహాత్ములైన, గురవశ్చ = పెద్దలు కూడ, శీలవృత్తేన = శీలముచేతను నడవడికచేతను, తోషితాః = సంతోష పెట్టబడిరి.

తా. అనేకవిధము లైన యజ్ఞములు చేసితిని. ప్రజలను ధర్మముగా పాలించితిని. మహాత్ము లగు పెద్దలను మంచి శీలముచేతను నడవడికచేతను సంతోష పెట్టితిని.

మూ. ధర్మే ప్రయతమానస్య యజ్ఞం చాహర్తుమిచ్ఛతః,

పరితోషం న గచ్ఛన్తి గురవో మునిపుఙ్గవ. 21

ప్ర. అ. మునిపుఙ్గవ = మునిశ్రేష్ఠుడా!, ధర్మే = ధర్మమునందు, ప్రయతమానస్య = ప్రయత్నము చేయుచున్నవాడను, యజ్ఞమ్ = యజ్ఞమును, ఆహర్తుమ్ = చేయుటకు. ఇచ్ఛతశ్చ = ఇచ్చయించుచున్నవాడను అయిన, నా విషయమున, గురవః = గురువులు, పరితోషమ్ = సంతోషమును, న గచ్ఛన్తి = పొందుటలేదు.

తా. ఓ మునిశ్రేష్ఠా! నేను ధర్మాచరణమునకై ప్రయత్నించుచు యాగము చేయవలె నని అభిలషింపగా గురువులు అభినందింపకున్నారు.

మూ. దైవమేవ పరం మన్యే పౌరుషం తు నిరర్థకమ్.

దైవేనాక్రమ్యతే సర్వం దైవం హి పరమా గతిః. 22

ప్ర. అ. దైవమేవ = దైవమునే, పరమ్ = శ్రేష్ఠ (బల) మైన దానినిగా, మన్యే = తలచెదను. పౌరుషం తు = పౌరుష మైతే, నిరర్థకమ్ = వ్యర్థ మైనదే. సర్వమ్ = అంతయు, దైవేన = దైవముచేత, ఆక్రమ్యతే = ఆక్రమించబడును. దైవమ్ = దైవమే, పరమా = గొప్ప దైన, గతిః హి = గతి కదా?

తా. దైవమే బలవత్తర మైనది; పురుషప్రయత్నము వ్యర్థము. అంతయు దేవవశమే. దైవమే ఉత్తమగతి.

మూ. తస్య మే పరమార్తస్య ప్రసాదమభికాఙ్క్షతః,

కర్తుమర్హసి భద్రం తే దైవోపహతకర్మణః. 23

ప్ర. అ. పరమ్ = మిక్కిలి, ఆర్తస్య = పీడితుడను, అభికాఙ్క్షతః = ప్రార్థించుచున్నవాడను, అయిన, దైవోపహతకర్మణః = దైవముచేత కొట్టబడిన కర్మ గల, తస్య = అట్టి, మే = నాకు, ప్రసాదమ్ = అనుగ్రహమును, కర్తుమ్ = చేయుటకు, అర్హసి = తగియున్నావు. తే = నీకు, భద్రమ్ = మంగళ మగుగాక.

తా. దైవముచేత విఫలప్రయత్నుడ నైన నేను మిక్కిలి ఆర్తుడనై నీ అనుగ్రహమునకై వేడుచున్నాను. అనుగ్రహింపుము. నీకు మంగళ మగును.

మూ. నాన్యాం గతిం గమిష్యామి నాన్యః శరణమస్తి మే,

దైవం పురుషకారేణ నివర్తయితుమర్హసి. 24

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే అష్టపఞ్చాశః సర్గః

ప్ర. అ. అన్యామ్ = మరి యొక, గతిమ్ = గతిని, న గమిష్యామి = పొందను. మే = నాకు, అన్యః = మరియొకడు, శరణమ్ = రక్షకుడు, నాస్తి = లేడు. దైవమ్ = దైవమును, పురుషకారేణ = పురుషకారముచేత, నివర్తయితుమ్ = మరల్చుటకు, అర్హసి = తగియున్నావు.

తా. నేను మరి యెవ్వరి వద్దకును వెళ్లను. మరొక రక్షకు డెవ్వడును లేడు. పురుషకారముచే దైవమును నివర్తింపచేయుము.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో ఏబది యెనిమిదవ సర్గ సమాప్తము.