Chapter_59

Back
Book Balakandamu
Chapter No 65
Pages 5
Read Time 8 Minutes

Chapter_59

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ ఏకోనషష్టితమః సర్గః

విశ్వామిత్రుడు త్రిశంకువునకు ధైర్యము చెప్పి ఆతనిచే యజ్ఞము చేయించుటకై ఋషుల నాహ్వానించుట. తనను అధిక్షేపించిన మహోదయుని, వసిష్ఠపుత్రులను శపించుట.

మూ. ఉక్తవాక్యం తు రాజానం కృపయా కుశికాత్మజః,

అబ్రవీన్మధురం వాక్యం సాక్షాచ్చణ్డాలరూపిణమ్. 1

ప్ర. అ. ఉక్తవాక్యం = పలకబడిన వాక్యము కలవాడును, సాక్షాత్ = ప్రత్యక్షముగా, చణ్డాలరూపిణమ్ = చండాలరూపము గలవాడును అగు, రాజానమ్ = రాజును గూర్చి, కృపయా = జాలితో, కుశికాత్మజః = విశ్వామిత్రుడు, మధురమ్ = మధురమైన, వాక్యమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. పూర్తిగా చండాలరూపు డైన ఆ రాజు మాటలు విని విశ్వామిత్రుడు జాలిచెంది, అతనితో మధుర మైన వాక్యము పలికెను.

మూ. ఐక్ష్వాక స్వాగతం వత్స జానామి త్వాం సుధార్మికమ్,

శరణం తే భవిష్యామి మా భైషీర్నృపపుఙ్గవ. 2

ప్ర. అ. ఐక్ష్వాక = ఇక్ష్వాకువంశమునందు పుట్టిన, వత్స = ఓ వత్సా!, స్వాగతమ్ = నీకు స్వాగత మగుగాక. త్వామ్ = నిన్ను, సుధార్మికమ్ = మంచి ధార్మికునిగా, జానామి = నే నెరుగుదును. నృపపుఙ్గవ = ఓ రాజశ్రేష్ఠా! మాభైషీః = భయపడకుము. తే = నీకు, శరణమ్ = రక్షకుడను, భవిష్యామి = కాగలను.

తా. ఇక్ష్వాకువంశసంజాతుడ వైన ఓ వత్స్ఙా నీకు స్వాగతము. నీవు ధార్మికుడ వని నాకు తెలియును. ఓ రాజశ్రేష్ఠా నేను నీకు రక్ష నొసగెదను; భయపడకుము.

మూ. అహమామన్త్రయే సర్వాన్మహర్షీన్ పుణ్యకర్మణః,

యజ్ఞసాహ్యకరాన్ రాజన్ తతో యక్ష్యసి నిర్వృతః. 3

ప్ర. అ. అహమ్ = నేను, పుణ్యకర్మణః = పుణ్యమైన కర్మలుగల, యజ్ఞసాహ్యకరాన్ = యజ్ఞమునందు సాహాయ్యము చేయు, సర్వాన్ = సమస్త మైన, మహర్షీన్ = మహర్షులను, ఆమన్త్రయే = ఆహ్వానించెదను. నిర్వృతః = ఆనందము కలవాడవై, యక్ష్యసి = యాగము చేయగలవు.

తా. రాజా! పుణ్యాత్ము లైన మహర్షులను యజ్ఞములో సాహాయ్యము చేయుటకై నేను ఆహ్వానించెదను. నీవు నిశ్చింతగ యజ్ఞము చేయగలవు.

మూ. గురుశాపకృతం రూపం యదిదం త్వయి వర్తతే,

అనేన సహ రూపేణ సశరీరో గమిష్యసి. 4

ప్ర. అ. గురుశాపకృతమ్ = గురువుయొక్క శాపముచేత చేయబడిన, యత్ = ఏ, ఇదమ్ = ఈ, రూపమ్ = రూపము, త్వయి = నీయందు, వర్తతే = ఉన్నదో, అనేన = ఈ, రూపేణ సహ = రూపముతో కూడ, సశరీరః = శరీరసహితుడవై, గమిష్యసి = వెళ్లగలవు.

తా. గురుశాపముచే ఏర్పడిన ఈ రూపముతో, సశరీరుడవై స్వర్గమునకు వెళ్లగలవు.

మూ. హస్తప్రాప్తమహం మన్యే స్వర్గం తవ నరాధిప,

యస్త్వం కౌశికమాగమ్య శరణ్యం శరణాగతః. 5

ప్ర. అ. నరాధిప = రాజా!, యః = ఏ, త్వమ్ = నీవు, శరణ్యమ్ = శరణుపొంద దగిన, కౌశికమ్ = విశ్వామిత్రుని, ఆగమ్య = చేరి, శరణాగతః = శరణు చొచ్చితివో, తవ = అట్టి నీకు, స్వర్గమ్ = స్వర్గమును, హస్తప్రాప్తమ్ = చేతికి అందినదానినిగా, మన్యే = తలచెదను.

తా. రాజా! శరణాగతరక్షకు డైన విశ్వామిత్రుని శరణు జొచ్చితివి. ఇక స్వర్గము నీ చేతిలో నున్నది.

మూ. ఏవముక్త్వా మహాతేజాః పుత్రాన్ పరమధార్మికాన్,

వ్యాదిదేశ మహాప్రాజ్ఞాన్ యజ్ఞసంభారకారణాత్. 6

ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు గల ఆ విశ్వామిత్రుడు, ఏవమ్ = ఈ విధముగా, ఉక్త్వా = పలికి, పరమధార్మికాన్ = మిక్కిలి ధార్మికులును, మహాప్రాజ్ఞాన్ = గొప్ప బుద్ధి కలవారును అగు, పుత్రాన్ = పుత్రులను, యజ్ఞసంభార కారణాత్ = యజ్ఞసంభారములను సమకూర్చుటకై, వ్యాదిదేశ = ఆజ్ఞాపించెను.

తా. గొప్ప తేజస్సు గల ఆ విశ్వామిత్రుడు ఈ విధముగ పలికి యజ్ఞ సంభారములను సమకూర్చు డని, పరమధార్మికులును, గొప్ప బుద్ధిమంతులును అగు కుమారులను ఆజ్ఞాపించెను.

మూ. సర్వాన్ శిష్యాన్ సమాహూయ వాక్యమేతదువాచ హ,

సర్వానృషిగణాన్వత్సా ఆనయధ్వం మమాజ్ఞయా, 7

సశిష్యసుహృదశ్చైవ సర్త్విజః సబహుశ్రుతాన్.

ప్ర. అ. సర్వాన్ = సమస్తమైన, శిష్యాన్ = శిష్యులను, సమాహూయ = పిలచి, ఏతత్ = ఈ, వాక్యమ్ = వాక్యమును, ఉవాచ హ = పలికెను. వత్సాః = ఓ శిష్యులారా! మమ = నాయొక్క, ఆజ్ఞయా = ఆజ్ఞచేత, సశిష్యసుహృదశ్చైవ = శిష్యులతోడను స్నేహితులతోడను కూడిన, సర్త్విజః = ఋత్విక్కులతో కూడిన, సబహుశ్రుతాన్ = బహువిద్యావంతులతో కూడిన, సర్వాన్ = సమస్త మైన, ఋషిగణాన్ = ఋషిగణములను, ఆనయధ్వమ్ = తీసికొనిరండి.

తా. విశ్వామిత్రుడు శిష్యు లందరిని పిలచి ఇట్లు పలికెను. ‘‘ఓవత్సలారా! నా ఆజ్ఞానుసారముగా వెళ్లి శిష్యులతోడను, స్నేహితులతోడను, ఋత్విక్కులతోడను, విద్యావంతులతోడను కూడిన ఋషుల నందరిని తీసికొనిరండు.’’

మూ. యదన్యో వచనం బ్రూతే మద్వాక్యబలచోదితః,

తత్సర్వమఖిలేనోక్తం మమాఖ్యేయమనాదృతమ్. 8

ప్ర. అ. అన్యః = ఇతరుడు, మద్వాక్యబలచోదితః = నా వాక్యముయొక్క బలముచేత ప్రేరేపింపబడిన వాడై, యత్ = ఏ, వచనమ్ = వచనమును, బ్రూతే = పలుకునో, అఖిలేన = అందరిచేతను, ఉక్తమ్ = పలకబడిన, అనాదృతమ్ = అనాదరపూర్వకమైన, తత్ = ఆ, సర్వమ్ = అంతయు, మమ = నాకు, ఆఖ్యేయమ్ = చెప్పదగినది.

తా. నా సందేశమును విని ఎవరెవరు అనాదరపూర్వకముగా ఏ మాటలు పలుకుదురో ఆ మాట లన్నియు నాకు చెప్పవలెను.

మూ. తస్య తద్వచనం శ్రుత్వా దిశో జగ్ముస్తదాజ్ఞయా,

ఆజగ్మురథ దేశేభ్యః సర్వేభ్యో బ్రహ్మవాదినః. 9

ప్ర. అ. తస్య = ఆతని యొక్క, తత్ = ఆ, వచనమ్ = వచనమును, శ్రుత్వా = విని, తదాజ్ఞయా = ఆతని ఆజ్ఞచే, దిశః = దిక్కులను, గూర్చి, జగ్ముః = వెళ్లిరి. అథ = పిమ్మట, సర్వేభ్యః = సమస్త మైన, దేశేభ్యః = దేశములనుండి, బ్రహ్మవాదినః = వేదాధ్యయనసంపన్ను లైన మునులు, ఆజగ్ముః = వచ్చిరి.

తా. విశ్వామిత్రుని ఆజ్ఞ ప్రకారము శిష్యులు నలుదిక్కులకును వెళ్లి ఆహ్వానింపగా వేదాద్యయనసంపన్ను లైన బ్రాహ్మణులు అన్ని దేశములనుండియు వచ్చిరి.

మూ. తే చ శిష్యాః సమాగమ్య మునిం జ్వలితతేజసమ్,

ఊచుశ్చ వచనం సర్వే సర్వేషాం బ్రహ్మవాదినామ్. 10

ప్ర. అ. తే = ఆ, శిష్యాః = శిష్యులు, సర్వే = అందరును, సమాగమ్య = తిరిగి వచ్చి, జ్వలితతేజసమ్ = ప్రకాశించుచున్న తేజస్సు గల, మునిమ్ = విశ్వామిత్రుని గూర్చి, సర్వేషామ్ = సమస్త మైన, బ్రహ్మవాదినామ్ = వేదాధ్యయన సంపన్నుల యొక్క, వచనమ్ = వాక్యమును, ఊచుశ్చ = చెప్పిరి.

తా. తిరిగి వచ్చిన ఆ శిష్యు లందరును, తేజస్సుతో ప్రకాశించుచున్న ఆ విశ్వామిత్రునితో, వేదాధ్యయన సంపన్ను లగు బ్రాహ్మణు లందరును పలికిన మాటలను చెప్పిరి.

మూ. శ్రుత్వా తే వచనం సర్వే సమాయాన్తి ద్విజాతయః.

సర్వదేశేషు చాగచ్ఛన్ వర్జయిత్వా మహోదయమ్. 11

ప్ర. అ. తే = నీయొక్క, వచనమ్ = వచనమును, శ్రుత్వా = విని, సర్వే = సమస్తమైన, ద్విజాతయః = బ్రాహ్మణులు, సమాయాన్తి = వచ్చుచున్నారు. మహోదయం వర్జయిత్వా = మహోదయుని మినహాయించి, సర్వదేశేషు = సమస్త దేశములం దున్నవారు, ఆగచ్ఛన్ = వచ్చిరి.

తా. మీ సందేశము విని బ్రాహ్మణు లందరును వచ్చుచున్నారు. మహోదయుడు తక్క, సకలదేశముల లోని బ్రాహ్మణులును వచ్చినారు.

మూ. వాసిష్ఠం తచ్ఛతం సర్వం క్రోధపర్యాకులాక్షరమ్,

యదాహ వచనం సర్వం శృణు త్వం మునిపుఙ్గవ. 12

ప్ర. అ. మునిపుఙ్గవ = మునిశ్రేష్ఠుడా! సర్వమ్ = సమస్త మైన, తత్ = ఆ, వాసిష్ఠం శతమ్ = వసిష్ఠకుమారుల శతము, క్రోధవర్యాకులాక్షరమ్ = క్రోధముచే వ్యాకుల మైన అక్షరములు గల, యత్ = ఏ, వచనమ్ = వచనమును, ఆహ = పలికెనో, సర్వమ్ = దాని నంతనూ, త్వమ్ = నీవు, శృణు = వినుము.

తా. మునిశ్రేష్ఠా! నీ వాక్యము విని వసిష్ఠకుమారులు నూర్వురును, ఏమనిరో వినుము.

మూ. క్షత్రియో యాజకో యస్య చణ్డాలస్య విశేషతః,

కథం సదసి భోక్తారో హవిస్తస్య సురర్షయః. 13

ప్ర. అ. యస్య = ఎవనికి, క్షత్రియః = క్షత్రియుడు, యాజకః = యజ్ఞము చేయించువాడో, విశేషతః = విశేషించి, చణ్డాలస్య = చండాలుడైన, తస్య = వాని యొక్క, సదసి = యజ్ఞ సదస్సునందు, సురర్షయః = సురులును ఋషులును, హవిః = హవిస్సును, కథమ్ = ఎట్లు, భోక్తారః = భుజించగలరు ?

తా. క్షత్రియుని యాజకునిగా స్వీకరించినవాడు, విశేషించి చండాలుడు, సమర్పించు హవిస్సును యాగములో దేవతలును, ఋషులును ఎట్లు గ్రహింతురు?

మూ. బ్రాహ్మణా వా మహాత్మానో భుక్త్వా చణ్డాలభోజనమ్,

కథం స్వర్గం గమిష్యన్తి విశ్వామిత్రేణ పాలితాః. 14

ప్ర. అ. విశ్వామిత్రేణ = విశ్వామిత్రునిచేత, పాలితాః = పాలింపబడిన, మహాత్మానః = మహాత్ము లైన, బ్రాహ్మణాః వా = బ్రాహ్మణు లైనను, చణ్డాల భోజనమ్ = చండాలుని భోజనమును, భుక్త్వా = భుజించి, స్వర్గమ్ = స్వర్గమును గూర్చి, కథమ్ = ఎట్లు, గమిష్యన్తి = వెళ్లగలరు ?

తా. విశ్వామిత్రుని మాటలు విని చండాలుని అన్నము భుజించిన మహాత్ము లైన బ్రాహ్మణు లైనను స్వర్గమున కెట్లు వెళ్లెదరు?

మూ. ఏతద్వచననైష్ఠుర్యమూచుస్సంరక్తలోచనాః,

వాసిష్ఠా మునిశార్దూల సర్వే తే సమహోదయాః. 15

ప్ర. అ. మునిశార్దూల = ఓ మునిశ్రేష్ఠా!, సమహోదయాః = మహోదయునితో కూడిన, తే = ఆ, సర్వే = సమస్త మైన, వాసిష్ఠాః = వసిష్ఠకుమారులు, సంరక్తలోచనాః = ఎఱ్ఱనైన నేత్రములు కలవారై, ఏతత్ = ఈ వాక్యమును, వచననైష్ఠుర్యమ్ = వచనములో నైష్ఠుర్య ముండునట్లుగా, ఊచుః = పలికిరి.

తా. మునిశ్రేష్ఠా! మహోదయుడును, వసిష్ఠకుమారు లందరును, క్రోధముచే ఎఱ్ఱ నైన నేత్రములతో ఈ విధముగ పరుషముగా మాట్లాడిరి.

మూ. తేషాం తద్వచనం శ్రుత్వా సర్వేషాం మునిపుఙ్గవః,

క్రోధసంరక్తనయనః సరోషమిద మబ్రవీత్. 16

ప్ర. అ. మునిపుఙ్గవః = ఆ మునిశ్రేష్ఠుడు, తేషాం సర్వేషామ్ = ఆ అందరియొక్క, తత్ = ఆ, వచనమ్ = వచనమును, శ్రుత్వా = విని, క్రోధసంరక్తనయనః = క్రోధముచే ఎఱ్ఱ నైన నేత్రములు కలవాడై, సరోషమ్ = కోపముతో, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. మునిశ్రేష్ఠు డైన ఆ విశ్వామిత్రుడు వారి మాటలు విని, క్రోధముతో నేత్రములు ఎఱ్ఱబారగా, ఇట్లు పలికెను.

మూ. యే దూషయన్త్యదుష్టం మాం తప ఉగ్రం సమాస్థితమ్,

భస్మీభూతా దురాత్మానో భవిష్యన్తి న సంశయః. 17

ప్ర. అ. ఉగ్రమ్ = ఉగ్ర మైన, తపః = తపస్సును, ఆస్థితమ్ = ఆవలంబించినవాడను, అదుష్టమ్ = దుష్టుడు కానివాడను అగు, మామ్ = నన్ను, యే = ఎవరు, దూషయన్తి = దూషించుచున్నారో, అట్టి, దురాత్మానః = దురాత్ములు, భస్మీభూతాః = భస్మ మైన వారుగా, భవిష్యన్తి = కాగలరు. సంశయః = సంశయము, న = లేదు.

తా. ఎట్టి దోషములును లేక ఉగ్ర మైన తపస్సు ఆచరించుచున్న నన్ను దూషించు ఆ దురాత్ములు భస్మమై పోయెదరు. సంశయము లేదు.

మూ. అద్య తే కాలపాశేన నీతా వైవస్వతక్షయమ్,

సప్తజాతిశతాన్యేవ మృతపాః సన్తు సర్వశః. 18

ప్ర. అ. తే = వారు, అద్య = ఇప్పుడు, కాలపాశేన = యమపాశముచేత, వైవస్వతక్షయమ్ = యముని గృహమును గూర్చి, నీతాః = తీసికొని వెళ్లబడిన వారై, సప్తజాతిశతాన్యేవ = ఏడువందల జన్మముల పాటు, సర్వశః = అన్ని విధముల, మృతపాః = శవభక్షకులుగా, సన్తు = అగుదురుగాక.

తా. వాళ్లందరును ఈ నాడే యమపాశబద్ధులై యమలోకమునకు పోయి ఏడువందల జన్మములు పాటు శవభక్షకులుగా ఉందురుగాక.

మూ. శ్వమాంసనియతాహారా ముష్టికా నామ నిర్ఘృణాః,

వికృతాశ్చ విరూపాశ్చ లోకాననుచరన్త్విమాన్. 19

ప్ర. అ. నిర్ఘృణాః = జాలిలేని, ముష్టికాః నామ = ముష్టికు లనే జాతి వారుగా పుట్టి, శ్వమాంసనియతాహారాః = కుక్కమాంసమునే నిత్యము భక్షించుచు, వికృతాశ్చ = వికారము కలవారై, విరూపాశ్చ = చెడ్డ రూపము కలవారై, ఇమాన్ = ఈ, లోకాన్ = లోకములను (లో), అనుచరన్తు = సంచరింతురుగాక.

తా. వసిష్ఠపుత్రు లందరును జాలి లేని ముష్టికజాతిలో పుట్టి, నిత్యము కుక్కమాంసమును భక్షించుచు, వికృతరూపములతో ఈ లోకమునందు సంచరించెదరు గాక.

మూ. మహోదయస్తు దుర్భుద్ధిర్మామదూష్యం హ్యదూషయత్,

దూషితః సర్వలోకేషు నిషాదత్వం గమిష్యతి. 20

ప్ర. అ. దుర్బుద్ధిః = చెడ్డ బుద్ధి గల, మహోదయస్తు = మహోదయు డైతే, అదూష్యమ్ = దూషింపకూడని, మామ్ = నన్ను, అదూషయత్ హి = దూషించినాడు కదా. సర్వలోకేషు = సకలలోకములయందును, దూషితః = దూషింపబడినవాడై, నిషాదత్వమ్ = నిషాదత్వమును, గమిష్యతి = పొందగలడు.

తా. దూషింపరాని నన్ను దూషించిన మహోదయుడు సకలజనులును దూషించు నిషాదజాతిలో పుట్టగలడు.

మూ. ప్రాణాతిపాతనిరతో నిరనుక్రోశతాం గతః,

దీర్ఘకాలం మమ క్రోధాద్దుర్గతిం వర్తయిష్యతి. 21

ప్ర. అ. మమ = నాయొక్క, క్రోధాత్ = కోపమువలన, ప్రాణాతిపాతని రతః = ప్రాణము లను తీయుటయందు ఆసక్తి కలవాడై, నిరనుక్రోశతామ్ = దయారాహిత్యమును, గతః = పొందిన వాడై, దీర్ఘకాలమ్ = చాల కాలము, దుర్గతిమ్ = చెడ్డ జీవన విధానమును, వర్తయిష్యతి = అనుసరించగలడు.

తా. నా కోపమునకు ఫలితముగ ఆ మహోదయుడు, దయావిహీనుడై, ప్రాణములు తీయుటయందు ఆసక్తి కలవాడై, చాలకాలము దుష్ట మైన జీవికను పొందగలడు.

మూ. ఏతావదుక్త్వా వచనం విశ్వామిత్రో మహాతపాః,

విరరామ మహాతేజా ఋషిమధ్యే మహామునిః. 22

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే ఏకోనషష్టితమః సర్గః

ప్ర. అ. మహాతపాః = గొప్ప తపస్సు కలవాడును, మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును, మహామునిః = మహామునియు అగు, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, ఋషి మధ్యే = ఋషులమధ్యయందు ఏతావత్ = ఇంతమాత్రము, వచనమ్ = వచనమును, ఉక్త్వా = పలికి, విరరామ = విరమించెను.

తా. మహాతేజశ్శాలి యగు విశ్వామిత్రమహాముని, ఋషుల మధ్య ఇట్లు పలికి విరమించెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో ఏబది తొమ్మిదవ సర్గ సమాప్తము.