| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 66 |
| Pages | 8 |
| Read Time | 12 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ షష్టితమః సర్గః
త్రిశంకువుచే యజ్ఞము చేయింపు డని విశ్వామిత్రుడు కోరగా ఋషులు యజ్ఞము నారంభించుట. త్రిశంకుడు సశరీరముగ స్వర్గమునకు వెళ్లుట. ఇంద్రుడు త్రిశంకువును స్వర్గమునుండి క్రిందికి త్రోసివేయగా కుపితుడైన విశ్వామిత్రుడు మరొక స్వర్గలోకమును సృజించుటకు ఉద్యమించుట. దేవతలు ప్రార్థింపగా ఆతడా ఉద్యమమునుండి విరమించుట.
మూ. తపోబలహతాన్ కృత్వా వాసిష్ఠాన్ సమహోదయాన్,
ఋషిమధ్యే మహాతేజా విశ్వామిత్రోఽభ్యభాషత. 1
ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, సమహోదయాన్ = మహోదయునితో కూడిన, వాసిష్ఠాన్ = వసిష్ఠకుమారులను, తపోబలహతాన్ = తపోబలముచేత చంపబడిన వారినిగా, కృత్వా = చేసి, ఋషి మధ్యే = ఋషుల మధ్యయందు, అభ్యభాషత = పలికెను.
తా. మహాతేజస్సు గల విశ్వామిత్రుడు మహోదయుని, వసిష్ఠకుమారులను ఈ విధముగ శపించి ఋషులతో ఇట్లు పలికెను.
మూ. అయమిక్ష్వాకుదాయాదస్త్రిశఙ్కురితి విశ్రుతః,
ధర్మిష్ఠశ్చ వదాన్యశ్చ మాం చైవ శరణం గతః. 2
తేనానేన శరీరేణ దేవలోకజిగీషయా.
ప్ర. అ. ఇక్ష్వాకుదాయాదః = ఇక్ష్వాకువంశమునందు పుట్టినవాడును, త్రిశఙ్కురితి = త్రిశంకువు అని, విశ్రుతః = ప్రసిద్ధి చెందినవాడును, ధర్మిష్ఠః = ధర్మాత్ముడును, వదాన్యశ్చ = దాతయు అగు, అయమ్ = ఇతడు, తేన = అట్టి, అనేన = ఈ, శరీరేణ = శరీరముతో, దేవలోక జిగీషయా = దేవలోకమును జయించవలె ననెడు కోరికతో, మామ్ = నన్ను, శరణం గతః = శరణుజొచ్చినాడు.
తా. ఇతడు ఇక్ష్వాకువంశమునకు చెందిన త్రిశంకువు. ధర్మిష్ఠుడు. దాతృత్వము కలవాడు. ఈ శరీరముతోనే స్వర్గమునకు వెళ్లవలె నను కోరికతో నా సాహాయ్య మర్థించినాడు.
మూ. యథాయం సృశరీరేణ స్వర్గలోకం గమిష్యతి,
తథా ప్రవర్త్యతాం యజ్ఞో భవద్భిశ్చ మయా సహ. 3
ప్ర. అ. అయమ్ = ఈతడు, స్వశరీరేణ = తన శరీరముతో, స్వర్గలోకమ్ = స్వర్గలోకమును గూర్చి, యథా = ఎట్లు, గమిష్యతి = వెళ్లగలడో, తథా = ఆ విధముగా, భవద్భిః = మీచేత, మయా సహ = నాతో కలిసి, యజ్ఞః = యజ్ఞము, ప్రవర్త్యతామ్ = చేయబడుగాక.
తా. ఈతడు శరీరముతో స్వర్గమును చేరుటకై నేను చేయు యజ్ఞమునందు మీరు సహాయపడవలెను.
మూ. విశ్వామిత్రవచః శ్రుత్వా సర్వ ఏవ మహర్షయః,
ఊచుః సమేత్య సహితా ధర్మజ్ఞా ధర్మసంహితమ్. 4
ప్ర. అ. ధర్మజ్ఞాః = ధర్మము తెలిసినవారును, సహితాః = అచట సమావేశమైనవారును అగు, సర్వే ఏవ = సమస్త మైన, మహర్షయః = మహర్షులు, విశ్వామిత్రవచః = విశ్వామిత్రుని వాక్యమును, శ్రుత్వా = విని, సమేత్య = కలిసి, ధర్మసంహితమ్ = ధర్మయుక్తముగా, ఊచుః = పలికిరి.
తా. ధర్మజ్ఞులైన ఆ మహర్షు లందరును విశ్వామిత్రుని మాటలు విని, (తమలో తాము) ఒక్కుమ్మడిగా, ధర్మసంమత మైన మాట పలికిరి.
మూ. అయం కుశికదాయాదో మునిః పరమకోపనః, 5
యదాహ వచనం సమ్యగేతత్కార్యం న సంశయః,
అగ్నికల్పో హి భగవాన్ శాపం దాస్యతి రోషితః. 6
ప్ర. అ. కుశికదాయాదః = కుశికుని వంశమునందు పుట్టిన, పరమకోపనః = ఎక్కువ కోపస్వభావము గల, అయమ్ = ఈ, మునిః = ముని, యత్ = ఏ, వచనమ్ = వచనమును, ఆహ = పలుకుచున్నాడో, ఏతత్ = ఇది, సమ్యక్ = బాగుగా, కార్యమ్ = చేయదగినది. న సంశయః = సంశయము లేదు. అగ్నికల్పః = అగ్నితో సమాను డైన, భగవాన్ = పూజ్యు డైన ఇతడు, రోషితః = కోపగింపచేయబడినవాడై, శాపమ్ = శాపమును, దాస్యతి = ఇవ్వగలడు.
తా. ఈ కౌశికుడు చాల కోపస్వభావము కలవాడు. ఈతడు చెప్పిన విధముగ చేయవలెను. ఇతడు అగ్నివలె తీవ్రస్వభావుడు. కోపము కలిగించినచో శపించును.
మూ. తస్మాత్ప్రవర్త్యతాం యజ్ఞః సశరీరో యథా దివమ్,
గచ్ఛేదిక్ష్వాకుదాయాదో విశ్వామిత్రస్య తేజసా, 7
తథా ప్రవర్త్యతాం యజ్ఞః సర్వే సమధితిష్ఠత.
ప్ర. అ. తస్మాత్ = ఆ కారణమువలన, యజ్ఞః = యజ్ఞము, ప్రవర్త్యతామ్ = జరుపబడుగాక. ఇక్ష్వాకుదాయాదః = ఇక్ష్వాకువంశీయు డైన ఈ త్రిశంకువు, విశ్వామిత్రస్య = విశ్వామిత్రునియొక్క, తేజసా = తేజస్సుచేత, సశరీరః = సశరీరుడై, యథా = ఎట్లు, దివమ్ = స్వర్గమును గూర్చి, గచ్ఛేత్ = వెళ్లునో, తథా = ఆవిధముగా, యజ్ఞః = యజ్ఞము, ప్రవర్త్యతామ్ = జరుపబడుగాక, సర్వే = అందరును, సమధితిష్ఠత = ప్రారంభింపుడు.
తా. ఈ త్రిశంకువు విశ్వామిత్రుని తపఃప్రభావముచే సశరీరముగ స్వర్గమునకు వెళ్లుటకై యజ్ఞము చేయుడు. అందరును ప్రారంభింపుడు.
మూ. ఏవముక్త్వా మహర్షయశ్చక్రుస్తాస్తాః క్రియాస్తదా,
యాజకశ్చ మహాతేజా విశ్వామిత్రోఽభవత్క్రతౌ. 8
ప్ర. అ. మహర్షయః = మహర్షులు, ఏవమ్ = ఈ విధముగా, ఉక్త్వా = పలికి, తదా = అప్పుడు, తాస్తాః = ఆయా, క్రియాః = క్రియలను, చక్రుః = చేసిరి. క్రతౌ = ఆ యజ్ఞమునందు, మహాతేజాః = గొప్ప తేజస్సు గల, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, యాజకః = యజ్ఞము చేయించు ప్రధానఋత్విక్కుగా, అభవత్ = ఆయెను.
తా. మహర్షు లీ విధముగ పలికి యజ్ఞమునకు కావలసిన ఆ యా పనులను చేసిరి. మహాతేజశ్శాలి యగు విశ్వామిత్రుడు ఆ క్రతువులో యాజకుడుగా ఉండెను.
మూ. ఋత్విజశ్చానుపూర్వ్యేణ మన్త్రవన్మన్త్రకోవిదాః,
చక్రుః కర్మాణి సర్వాణి యథాకల్పం యథావిధి. 9
ప్ర. అ. మన్త్రకోవిదాః = మంత్రములందు ప్రవీణు లైన, ఋత్విజశ్చ = ఋత్విక్కులు కూడ, మన్త్రవత్ = మంత్రసహితముగా, యథాకల్పమ్ = కల్పోక్త ప్రకారముగా, యథావిధి = యథాశాస్త్రముగా, సర్వాణి = సమస్త మైన, కర్మాణి = కర్మలను, ఆనుపూర్వ్యేణ = క్రమానుసారముగా, చక్రుః = చేసిరి.
తా. మంత్రము లెరిగిన ఋత్విక్కులు కల్పోక్తప్రకారమున, యథావిధిగా సర్వకర్మలును క్రమము తప్పక మంత్రపూర్వకముగా నిర్వహించిరి.
మూ. తతః కాలేన మహతా విశ్వామిత్రో మహాతపాః,
చకారావాహనం తత్ర భాగార్థం సర్వదేవతాః. 10
ప్ర. అ. తతః = పిమ్మట, మహాతపాః = గొప్ప తపస్సు గల, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, మహతా కాలేన = చాల కాలమునకు, తత్ర = అచట, సర్వదేవతాః = సర్వదేవతలను, భాగార్థమ్ = భాగములకొరకు, ఆవాహనం చకార = ఆవాహనము చేసెను.
తా. ఈ విధముగా చాల దినములు గడచిన పిమ్మట మహాతపఃశాలి యగు విశ్వామిత్రుడు సమస్తదేవతలను వారివారి యజ్ఞ భాగములను స్వీకరించుటకై ఆహ్వానించెను.
మూ. నాభ్యాగమంస్తదాహూతా భాగార్థం సర్వదేవతాః, 11
తతః క్రోధసమావిష్టో విశ్వామిత్రో మహామునిః,
స్రువముద్యమ్య సక్రోధస్త్రిశఙ్ముమిదమబ్రవీత్. 12
ప్ర. అ. తదా = అప్పుడు, ఆహూతాః = పిలవబడిన, సర్వదేవతాః = సకలదేవతలును, భాగార్థమ్ = భాగముల కొరకై, నాభ్యాగమన్ = రాలేదు. తతః = పిమ్మట, క్రోధసమావిష్టః = క్రోధముతోకూడిన, విశ్వామిత్రః మహామునిః = విశ్వామిత్రమహాముని, స్రువమ్ = స్రువమును, ఉద్యమ్య = ఎత్తి, సక్రోధః = క్రోధముతో కూడిన వాడై, త్రిశఙ్కుమ్ = త్రిశంకువును గూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను.
తా. ఈ విధముగ ఆహ్వానించినను తమ భాగములు గ్రహించుటకై దేవతలు రాకుండుట జూచి, విశ్వామిత్రమహాముని, కోపోద్దీపితుడై, స్రువ మనెడు హోమసాధనమును చేత ఎత్తి, త్రిశంకునితో ఇట్లనెను.
మూ. పశ్య మే తపసో వీర్యం స్వార్జితస్య నరేశ్వర,
ఏష త్వాం సశరీరేణ నయామి స్వర్గమోజసా. 13
దుష్ప్రాపం సశరీరేణ దివం గచ్ఛ నరాధిప.
ప్ర. అ. నరేశ్వర = రాజా! స్వార్జితస్య = స్వయముగా సంపాదింపబడిన, మే = నాయొక్క, తపసః = తపస్సుయొక్క, వీర్యమ్ = వీర్యమును, పశ్య = చూడుము, ఏషః = ఈ నేను, ఓజసా = నా తేజస్సుచేత, త్వామ్ = నిన్ను, సశరీరేణ = శరీరసహితముగా, స్వర్గమ్ = స్వర్గమును, నయామి = పొందించెదను. నరాధిప = రాజా! దుష్ప్రాపమ్ = పొంద శక్యము కాని, దివమ్ = స్వర్గమునుగూర్చి, సశరీరేణ = శరీరముతో, గచ్ఛ = వెళ్లుము.
తా. రాజా! నా తపఃప్రభావమును చూడుము. నా తపఃశక్తిచే నిన్ను సశరీరముగా స్వర్గమునకు పంపెదను. సశరీరుడవై ఇతరు లెవ్వరును వెళ్లజాలని స్వర్గమునకు వెళ్లుము.
మూ. స్వార్జితం కిం చిదప్యస్తి మయా హి తపసః ఫలమ్,
రాజన్ స్వతేజసా తస్య సశరీరో దివం వ్రజ. 14
ప్ర. అ. రాజన్ = రాజా! మయా = నాచేత, స్వార్జితమ్ = స్వయముగా సంపాదింపబడిన, తపసః ఫలమ్ = తపస్సుయొక్క ఫలము, కించిదపి = కొంచెమైనను, అస్తి హి = ఉన్నది కదా. తస్య = దానియొక్క, స్వతేజసా = తేజస్సుచేత, సశరీరః = శరీరముతో కూడినవాడవై, దివమ్ = స్వర్గమును గూర్చి, వ్రజ = వెళ్లుము.
తా. రాజా! నేను స్వయముగా సంపాదించిన తపఃఫలము కొంత ఉన్నది. దాని తేజస్సుచే, సశరీరుడవై స్వర్గమునకు వెళ్లుము.
మూ. ఉక్తవాక్యే మునౌ తస్మిన్ సశరీరో నరేశ్వరః,
దివం జగామ కాకుత్స్థ మునీనాం పశ్యతాం తదా. 15
ప్ర. అ. కాకుత్థ్స = రామ! తస్మిన్ = ఆ, మునౌ = ముని, ఉక్తవాక్యే = పలకబడిన వాక్యము కలవా డగుచుండగా, నరేశ్వరః = రాజు, సశరీరః = శరీరముతో కూడినవాడై, తదా = అప్పుడు, మునీనామ్ = మునులు, పశ్యతామ్ = చూచుచుండగా, దివమ్ = స్వర్గమును గూర్చి, జగామ = వెళ్లెను.
తా. విశ్వామిత్రు డీవిధముగా పలికి వెంటనే ఆ రాజు, ఆ మునులందరును చూచుచుండగా, సశరీరుడై స్వర్గమునకు వెళ్లెను.
మూ. దేవలోకగతం దృష్ట్వా త్రిశఙ్కుం పాకశాసనః,
సహ సర్వైస్సురగణైరిదం వచనబ్రవీత్. 16
ప్ర. అ. దేవలోకగతమ్ = దేవలోకమునకు వచ్చిన, త్రిశఙ్కుమ్ = త్రిశంకువును, దృష్ట్వా = చూచి, సర్వైః = సమస్త మైన, సురగణైః సహ = దేవతాగణములతో కూడిన, పాకశాసనః = దేవేంద్రుడు, ఇదమ్ = ఈ, వచనమ్ = వచనమును, అబ్రవీత్ = పలికెను.
తా. దేవతాగణములతోకూడిన దేవేంద్రుడు త్రిశంకువు స్వర్గములో ప్రవేశించుట చూచి ఇట్లనెను.
మూ. త్రిశఙ్కో గచ్ఛ భూయస్త్వం నాసి స్వర్గకృతాలయః,
గురుశాపహతో మూఢ పత భూమిమవాక్ఛిరాః. 17
ప్ర. అ. త్రిశఙ్కో = ఓ త్రిశంకూ! స్వర్గకృతాలయః = స్వర్గనివాసివి, న అసి = కావు. త్వమ్ = నీవు, భూయః = మరల, గచ్ఛ = వెళ్లుము. గురుశాపహతః = గురుశాపముచే హతుడవైన, మూఢ = మూఢుడా! అవాక్ఛిరాః = తలక్రిందుగా ఉన్నవాడవై, భూమిమ్ = భూమివైపు, పత = పడుము.
తా. ఓ త్రిశంకూ! నీవు స్వర్గనివాసమునకు అర్హుడవు కావు. తిరిగి పొమ్ము. గురు శాపహతుడ వైన ఓ మూఢాత్మా! తలక్రిందులుగా భూమిపై పడుము.
మూ. ఏవముక్తో మహేన్ద్రేణ త్రిశఙ్కురపతత్పునః,
విక్రోశమానస్త్రాహీతి విశ్వామిత్రం తపోధనమ్. 18
ప్ర. అ. మహేన్ద్రేణ = మహేంద్రునిచేత, ఏవమ్ = ఇట్లు, ఉక్తః = పలకబడిన, త్రిశఙ్కుః = త్రిశంకువు, త్రాహి ఇతి = రక్షించుము అని, తపోధనమ్ = మహర్షి యైన, విశ్వామిత్రం = విశ్వామిత్రుని గూర్చి, విక్రోశమానః = అరచుచు, పునః = మరల, అపతత్ = పడెను.
తా. మహేంద్రుడు ఇట్లు పలుకగా, త్రిశంకువు, రక్షింపు మని విశ్వామిత్రునితో మొరపెట్టుచు మరల క్రిందికి పడెను.
మూ. తచ్ఛ్రుత్వా వచనం తస్య క్రోశమానస్య కౌశికః,
రోషమాహారయత్తీవ్రం తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్. 19
ప్ర. అ. కౌశికః = విశ్వామిత్రుడు, క్రోశమానస్య = అరచుచున్న, తస్య = అతనియొక్క, తత్ = ఆ, వచనమ్ = వచనమును, శ్రుత్వా = విని, తీవ్రమ్ = తీవ్రమైన, రోషమ్ = కోపమును, ఆహారయత్ = తెప్పించుకొనెను. తిష్ఠ తిష్ఠ ఇతి = ఆగుము ఆగుము అని, అబ్రవీత్ చ = పలికెను.
తా. విశ్వామిత్రుడు, ఆ విధముగా అరచుచున్న అతని మాటలు విని, తీవ్ర మైన కోపముతో ఆగుము, ఆగుము అని పలికెను.
మూ. ఋషిమధ్యే స తేజస్వీ ప్రజాపతిరివాపరః,
సృజన్ దక్షిణమార్గస్థాన్ సప్తర్షీనపరాన్ పునః, 20
నక్షత్రమాలామపరామసృజత్క్రోధమూర్ఛితః,
దక్షిణాం దిశమాస్థాయ మునిమధ్యే మహాయశాః. 21
ప్ర. అ. ఋషిమధ్యే = ఋషులమధ్యయందున్న, సః = ఆ, తేజస్వీ = తేజశ్శాలియైన విశ్వామిత్రుడు, అపరః = రెండవ, ప్రజాపతిః ఇవ = బ్రహ్మ వలె, దక్షిణ మార్గస్థాన్ = దక్షిణ మార్గమునందున్న, అపరాన్ = వేరైన, సప్తర్షీన్ = సప్తర్షులను, సృజన్ = సృజించుచు, మునిమధ్యే = మునుల మధ్యయందు, క్రోధమూర్ఛితః = కోపముచే వ్యాపింపబడినవాడై, దక్షిణాం దిశమ్ = దక్షిణదిక్కును, ఆస్థాయ = ఆశ్రయించి, మహాయశాః = గొప్ప కీర్తి గల ఆతడు, అపరామ్ = మరియొక, నక్షత్రమాలామ్ = నక్షత్రపంక్తిని, అసృజత్ = సృజించెను.
తా. ఋషుల మధ్య నున్న ఆ విశ్వామిత్రుడు కోపోద్దీపితుడై, రెండవ బ్రహ్మ వలె, దక్షిణ దిక్కునందు, ఇతరు లైన సప్తర్షులను, మరియొక నక్షత్రమాలను సృజించెను.
మూ. సృష్ట్వా నక్షత్రవంశం చ క్రోధేన కలుషీకృతః, 22
అన్యమిన్ద్రం కరిష్యామి లోకో వా స్యాదనిన్ద్రకః,
దేవతాన్యపి స క్రోధాత్స్రష్టుం సముపచక్రమే. 23
ప్ర. అ. నక్షత్రవంశం చ = నక్షత్రవంశమును కూడ, సృష్ట్వా = సృజించి, క్రోధేన = క్రోధముచేత, కలుషీకృతః = కలుషముగా చేయబడినవాడై, అన్యమ్ = మరియొక, ఇన్ద్రమ్ = ఇంద్రుని, కరిష్యామి = చేసెదను; లోకః = లోకము, అనిన్ద్రకః వా = ఇంద్రుడు లేని దైనను, స్యాత్ = అగుగాక, (అని పలుకుచు), సః = అతడు, దైవతాన్యపి = దేవతలను కూడ, క్రోధాత్ = కోపమువలన, స్రష్టుమ్ = సృజించుటకు, సముపచక్రమే = ఉపక్రమించెను.
తా. ఆ విశ్వామిత్రుడు క్రోధముతో నక్షత్రవంశమును కూడ సృజించి, ‘‘మరొక ఇంద్రు నైనను సృజించెదను; లేదా లోకములో ఇంద్రు డైన లేకుండ వలెను’’ అని పలుకుచు, దేవతాసృష్టి కూడ చేయ ప్రారంభించెను.
మూ. తతః పరమసంభ్రాన్తాస్సర్షిసఙ్ఘాస్సురాసురాః,
విశ్వామిత్రం మహాత్మానమూచుస్సానునయం వచః. 24
ప్ర. అ. తతః = పిమ్మట, పరమసంభ్రాన్తాః = మిక్కిలి భయపడిన, సర్షిసఙ్ఘాః = ఋషి సంఘములతో కూడిన, సురాసురాః = దేవతలును అసురులును, మహాత్మానమ్ = మహాత్ము డైన, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి, సానునయమ్ = అనునయముతో కూడినట్లుగా, వచః = వాక్కును, ఊచుః = పలికిరి.
తా. పిమ్మట మిక్కిలి భయపడిన దేవాసురులును, ఋషులును మహాత్ము డైన విశ్వామిత్రుని అనునయించుచు ఇట్లు పలికిరి.
మూ. అయం రాజా మహాభాగ గురుశాపపరిక్షతః,
సశరీరో దివం యాతుం నార్హత్యేవ తపోధన. 25
ప్ర. అ. తపోధన = ఓ మహర్షీ! మహాభాగ = ఓ పూజ్యుడా!, గురుశాపపరిక్షతః = గురుశాపముచేత కొట్టబడిన, అయమ్ = ఈ, రాజా = రాజు, సశరీరః = శరీరసహితుడై, దివమ్ = స్వర్గమును గూర్చి, యాతుమ్ = వెళ్లుటకు, నార్హత్యేవ = అర్హుడు కానే కాడు.
తా. మహాప్రభావశాలి వగు ఓ తపోధనా! గురుశాపముచేత దెబ్బతిన్న ఈ రాజు సశరీరముగా స్వర్గమునకు వెళ్లుటకు అనర్హుడు.
మూ. తేషాం తద్వచనం శ్రుత్వా దేవానాం మునిపుఙ్గవః,
అబ్రవీత్సుమహద్వాక్యం కౌశికః సర్వదేవతాః. 26
ప్ర. అ. మునిపుఙ్గవః = మునిశ్రేష్ఠు డైన, కౌశికః = విశ్వామిత్రుడు, తేషామ్ = ఆ, దేవానామ్ = దేవతలయొక్క, తత్ = ఆ, వచనమ్ = వచనమును, శ్రుత్వా = విని, సర్వదేవతాః = ఆ సకలదేవతలను గూర్చి, సుమహత్ = చాల గొప్పదైన, వాక్యమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.
తా. మునిశ్రేష్ఠు డైన ఆ విశ్వామిత్రుడు దేవతల మాటలు విని వారితో ప్రశంసనీయ మగు ఒక వచనము పలికెను.
మూ. సశరీరస్య భద్రం వస్త్రిశఙ్కోరస్య భూపతేః,
ఆరోహణం ప్రతిజ్ఞాయ నానృతం కర్తుముత్సహే. 27
ప్ర. అ. వః = మీకు, భద్రమ్ = మంగళ మగుగాక. సశరీరస్య = శరీరముతో కూడిన, అస్య = ఈ, త్రిశఙ్కోః భూపతేః = త్రిశంకు మహారాజునకు, ఆరోహణమ్ = స్వర్గారోహణమును, ప్రతిజ్ఞాయ = ప్రతిజ్ఞ చేసి, అనృతమ్ = అసత్యమును, కర్తుమ్ = చేయుటకు, న ఉత్సహే = ఇష్టపడను.
తా. దేవతలారా! మీకు క్షేమ మగుగాక. ఈ త్రిశంకువును సశరీరముగా స్వర్గమునకు పంపెద నని ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞను అసత్యము చేయ నంగీకరింపను.
మూ. స్వర్గోఽస్తు సశరీరస్య త్రిశఙ్కోరస్య శాశ్వతః,
నక్షత్రాణి చ సర్వాణి మామకాని ధ్రువాణ్యథ. 28
యావల్లోకా ధరిష్యన్తి తిష్ఠన్త్వేతాని సర్వశః,
మత్కృతాని సురాః సర్వే తదనుజ్ఞాతుమర్హథ. 29
ప్ర. అ. అస్య = ఈ, త్రిశఙ్కోః = త్రిశంకువునకు, సశరీరస్య = శరీరముతో కూడి యుండగనే, శాశ్వతః = శాశ్వత మైన, స్వర్గః = స్వర్గము, అస్తు = అగుగాక. అథ = మరియు, మత్కృతాని = నాచేత సృజింపబడిన, ఏతాని = ఈ, సర్వాణి = సమస్తమైన, నక్షత్రాణి = నక్షత్రములు, మామకాని = నావిగా, సర్వశః = అంతటను, లోకాః = లోకములు, యావత్ = ఎంతవరకు, ధరిష్యన్తి = నిలచునో (అంతవరకు), ధ్రువాణి = స్థిరములై, తిష్ఠన్తు = ఉండుగాక. సురాః = ఓ దేవతలారా!, సర్వే = మీరందరును, తత్ = దానిని, అనుజ్ఞాతుమ్ = అనుమతించుటకు, అర్హథ = తగియున్నారు.
తా. ఈ త్రిశంకువు సశరీరుడై, శాశ్వతముగా స్వర్గమునందు నివసించవలెను. నేను సృజించిన నక్షత్రము లన్నియు ఈ లోకము లున్నంతవరకును స్థిరముగ ఉండవలెను. ఓ దేవతలారా! మీరు నాకు దీనిని అనుమతింపుడు.
మూ. ఏవముక్తాః సురాః సర్వే ప్రత్యూచుర్మునిపుఙ్గవమ్,
ఏవం భవతు భద్రం తే తిష్ఠన్త్వేతాని సర్వశః. 30
గగనే తాన్యనేకాని వైశ్వానరపథాద్బహిః,
నక్షత్రాణి మునిశ్రేష్ఠ తేషు జ్యోతిష్షు జాజ్వలన్, 31
అవాక్ఛిరాస్త్రిశఙ్కుశ్చ తిష్ఠత్వమరసన్నిభః.
ప్ర. అ. ఏవమ్ = ఈ విధముగా, ఉక్తాః = పలకబడిన, సర్వే = సమస్త మైన, సురాః = దేవతలు, మునిపుఙ్గవమ్ = మునిశ్రేష్ఠుని గూర్చి, ప్రత్యూచుః = తిరిగి పలికిరి. ఏవమ్ = ఇట్లు, భవతు = అగుగాక. మునిశ్రేష్ఠ = ఓ మునిశ్రేష్ఠుడా!, తే = నీకు, భద్రమ్ = క్షేమ మగుగాక. ఏతాని = ఈ, తాని = ప్రసిద్ధమైన, అనేకాని = అనేకమైన, నక్షత్రాణి = నక్షత్రములు, వైశ్వానరపథాత్ = జ్యోతిశ్చక్రము కంటె, బహిః = వెలుపల, గగనే = ఆకాశమునందు, సర్వశః = అన్ని వైపుల, తిష్ఠన్తు = ఉండుగాక, తేషు = ఆ, జ్యోతిష్షు = నక్షత్రములమధ్య, జాజ్వలన్ = ప్రకాశించుచు, త్రిశఙ్కుశ్చ = త్రిశంకువు కూడ, అమరసన్నిభః = దేవతలతో సమానుడై, అవాక్ఛిరాః = తలక్రిందుగ, తిష్ఠతు = ఉండుగాక.
తా. ఆ దేవతలు మునిపుంగవునితో ఇట్లనిరి - ‘‘ఓ మునిశ్రేష్ఠ్ఙా నీవు చెప్పినట్లే అగును. నీకు భద్ర మగుగాక. నీవు సృష్టించిన నక్షత్రము లన్నియు జ్యోతిశ్చక్రమునకు వెలుపల నుండుగాక. త్రిశంకువు ఆ నక్షత్రముల నడుమ ప్రకాశించుచు, దేవతాతుల్యుడై, తలక్రిందుగ నివసించుగాక.’’
మూ. అనుయాస్యన్తి చైతాని జ్యోతీంషి నృపసత్తమమ్,
కృతార్థం కీర్తిమన్తం చ స్వర్గలోకగతం యథా. 32
ప్ర. అ. ఏతాని = ఈ, జ్యోతీంషి చ = నక్షత్రములును, కృతార్థమ్ = నెరవేరిన పనులు గలవాడును, కీర్తిమన్తం చ = కీర్తి కలవాడును అయిన, నృపసత్తమమ్ = రాజశ్రేష్ఠుని, స్వర్గలోకగతం యథా = స్వర్గలోకములో ఉన్న వానిని వలె, అనుయాస్యన్తి = అనుసరించగలవు.
తా. ‘‘చరితార్థుడై కీర్తిమంతు డైన ఈ రాజశ్రేష్ఠుని, ఈ నక్షత్రము లన్నియు స్వర్గములో ఉన్నవానిని అనుసరించినట్లు అనుసరింపగలవు.’’
మూ. విశ్వామిత్రస్తు ధర్మాత్మా సర్వదేవైరభిష్టుతః,
ఋషిభిశ్చ మహాతేజా బాఢమిత్యాహ దేవతాః. 33
ప్ర. అ. సర్వదేవైః = సమస్త మైన దేవతలచేతను, ఋషిభిశ్చ = ఋషుల చేతను, అభిష్టుతః = స్తుతింపబడిన, మహాతేజా = గొప్ప తేజస్సు గల, ధర్మాత్మా = ధర్మాత్ము డైన, విశ్వామిత్రస్తు = విశ్వామిత్రు డైతే, దేవతాః = దేవతలను గూర్చి, బాఢమ్ ఇత్యేవ = సరే అని, ఆహ = పలికెను.
తా. ఈ విధముగా సకలదేవతలును, ఋషులను స్తుతింపగా, ధర్మాత్ముడును, తేజోవంతుడును అగు విశ్వామిత్రుడు ‘సరే’ అని అంగీకరించెను.
మూ. తతో దేవా మహాత్మానో మునయశ్చ తపోధనాః,
జగ్ముర్యథాగతం సర్వే యజ్ఞస్యాన్తే నరోత్తమ. 34
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే షష్టితమః సర్గః
ప్ర. అ. నరోత్తమ = నరులలో ఉత్తముడ వైన రామా!, తతః = పిమ్మట, యజ్ఞస్య = యజ్ఞముయొక్క, అన్తే = అంతమునందు, మహాత్మానః = మహాత్ము లైన, దేవాః = దేవతలును, తపోధనాః = తపస్సే ధనముగా గల, మునయశ్చ = మునులును, సర్వే = అందరును, యథాగతమ్ = వచ్చినట్లుగనే, జగ్ముః = వెళ్లిరి.
తా. రామా! యజ్ఞము పూర్తి యైన పిమ్మట మహాత్ము లైన దేవతలును, తపోధను లైన మునులును తమ తమ స్థానములకు వెళ్లిపోయిరి.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో అరువదవ సర్గ సమాప్తము.

51
52
53
54
55
56
57
58
59
60