Chapter_61

Back
Book Balakandamu
Chapter No 67
Pages 5
Read Time 9 Minutes

Chapter_61

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ ఏకషష్టితమః సర్గః

విశ్వామిత్రుడు పుష్కరతీర్థమునందు తపస్సు చేయుట. అంబరీషుడు ఋచీకు డను మునియొక్క మధ్యమపుత్రుని యజ్ఞపశువుగా వెల యిచ్చి కొని తీసికొని వెళ్లుట.

మూ. విశ్వామిత్రో మహాత్మాథ ప్రస్థితాన్ ప్రేక్ష్య తాన్ ఋషీన్,

అబ్రవీన్నరశార్దూల సర్వాంస్తాన్వనవాసినః. 1

ప్ర. అ. నరశార్దూల = ఓ నరశ్రేష్ఠుడా!, అథ = పిమ్మట, మహాత్మా = మహాత్ముడైన, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, ప్రస్థితాన్ = ప్రయాణ మైన, వనవాసినః = వనములందు నివసించు, తాన్ = ఆ, సర్వాన్ = సమస్త మైన, ఋషీన్ = ఋషులను, ప్రేక్ష్య = చూచి, అబ్రవీత్ = పలికెను.

తా. రామా! మహాత్ము డైన విశ్వామిత్రుడు, ప్రయాణ మైన ఆ ఋషులందరిని చూచి ఇట్లు పలికెను.

మూ. మహావిఘ్నః ప్రవృత్తోఽయం దక్షిణామాస్థితో దిశమ్,

దిశమన్యాం ప్రపత్స్యామస్తత్ర తప్స్యామహే తపః. 2

ప్ర. అ. దక్షిణాం దిశమ్ = దక్షిణ దిక్కును, ఆస్థితః = అవలంబించినదై, అయమ్ = ఈ, మహాన్ = గొప్ప, విఘ్నః = విఘ్నము, ప్రవృత్తః = ఏర్పడినది. అన్యామ్ = మరియొక, దిశమ్ = దిక్కును, ప్రపత్స్యామః = పొందెదము. తత్ర = అచట, తపః = తపస్సు, తప్స్యామహే = తపించెదము.

తా. ఈ దక్షిణపు దిక్కున గొప్ప విఘ్నము సంభవించినది. మరొక దిక్కునకు వెళ్లి అచట తపస్సు చేసెదము.

మూ. పశ్చిమాయాం విశాలాయాం పుష్కరేషు మహాత్మనః,

సుఖం తపశ్చరిష్యామః పరం తద్ధి తపోవనమ్. 3

ప్ర. అ. మహాత్మనః = ఓ మహాత్ములారా! విశాలాయామ్ = విశాలమైన, పశ్చిమాయామ్ = పశ్చిమదిక్కునందు, పుష్కరేషు = పుష్కరక్షేత్రమునందు, సుఖమ్ = సుఖముగా, తపః = తపస్సు, చరిష్యామః = చేసెదము. తత్ = అది, పరమ్ = శ్రేష్ఠ మైన, తపోవనం హి = తపోవనము కదా ?

తా. ఓ మహాత్ములారా! విశాల మైన పశ్చిమదిక్కునకు పోయి, అచట పుష్కరక్షేత్రమునందు తపస్సు చేయుదము. అది ఉత్తమ మైన తపోవనము.

మూ. ఏవముక్త్వా మహాతేజాః పుష్కరేషు మహామునిః,

తప ఉగ్రం దురాధర్షం తేపే మూలఫలాశనః. 4

ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, మహామునిః = ఆ మహాముని, ఏవమ్ = ఇట్లు, ఉక్త్వా = పలికి, పుష్కరేషు = పుష్కరమునందు, మూలఫలాశనః = దుంపలను ఫలములను మాత్రము భుజించుచు, దురాధర్షమ్ = ఎదిరింప శక్యము కాని, ఉగ్రమ్ = ఉగ్ర మైన, తపః = తపస్సును, తేపే = చేసెను.

తా. మహాతేజశ్శాలి యైన ఆ విశ్వామిత్రుడు ఇట్లు పలికి, పుష్కర క్షేత్రము చేరి, అచట, మూలఫలములను మాత్రమే భుజించుచు ఉగ్ర మైన తపస్సు చేసెను.

మూ. ఏతస్మిన్నేవ కాలే తు అయోధ్యాధిపతిర్నృపః,

అమ్బరీష ఇతి ఖ్యాతో యష్టుం సముపచక్రమే. 5

ప్ర. అ. ఏతస్మిన్ = ఈ, కాలే ఏవ = కాలమునందే, అమ్బరీషః ఇతి = అంబరీషుడు అని, ఖ్యాతః = ప్రసిద్ధు డైన, అయోధ్యాధిపతిః = అయోధ్యాప్రభు వైన, నృపః = రాజు, యష్టుమ్ యాగముచేయుటకు, సముపచక్రమే = ప్రారంభించెను.

తా. ఈ కాలమునందే అయోధ్యాధిపతి యైన అంబరీషు డను రాజు యాగము చేయ ప్రారంభించెను.

మూ. తస్య వై యజమానస్య పశుమిన్ద్రో జహార హ,

ప్రణష్టే తు పశౌ విప్రో రాజానమిదమబ్రవీత్. 6

ప్ర. అ. యజమానస్య = యాగము చేయుచున్న, తస్య = అతనియొక్క, పశుమ్ = పశువును, ఇన్ద్రః = ఇంద్రుడు, జహార హ = అపహరించెను. పశౌ = పశువు, ప్రణష్టే సతి = కనబడకపోగా, విప్రః = పురోహితుడు, రాజానమ్ = రాజును గూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. అతడు యాగముచేయుచుండగా ఇంద్రుడు పశువును హరించెను. యజ్ఞపశువు కనబడకపోయినతోడనే పురోహితుడు రాజుతో ఇట్లు పలికెను.

మూ. పశురద్య హృతో రాజన్ ప్రణష్టస్తవ దుర్నయాత్,

అరక్షితారం రాజానం ఘ్నన్తి దోషా నరేశ్వర. 7

ప్ర. అ. రాజన్ = రాజా! అద్య = ఇపుడు, పశుః = పశువు, హృతః = హరింపబడినది. తవ = నీ యొక్క, దుర్నయాత్ = అధర్మమువలన, ప్రణష్టః = కనబడకుండపోయినది. నరేశ్వర = రాజా! అరక్షితారమ్ = రక్షించని, రాజానమ్ = రాజును, దోషాః = దోషములు, ఘ్నన్తి = చంపును.

తా. రాజా! పశువు నెవరో హరించినారు. నీ అధర్మముచే ఇది పోయినది. పశువును రక్షింపజాలని రాజును దోషములు చంపివేయును.

మూ. ప్రాయశ్చిత్తం మహద్ధ్యేతన్నరం వా పురుషర్షభ,

ఆనయస్వ పశుం శీఘ్రం యావత్కర్మ ప్రవర్తతే. 8

ప్ర. అ. పురుషర్షభ = పురుషశ్రేష్ఠుడా!, ఏతత్ = ఇది, మహత్ = గొప్ప దైన, ప్రాయశ్చిత్తమ్ = ప్రాయశ్చిత్తము. నరం వా = మనుష్యు నైనను, పశుమ్ = పశువునుగా, శీఘ్రమ్ శీఘ్రముగా, ఆనయస్వ = తీసికొనిరమ్ము. కర్మ = కర్మ, యావత్ ప్రవర్తతే = జరగగలదు.

తా. రాజా! దీనికి చాల పెద్ద ప్రాయశ్చిత్తము చేయవలసి యున్నది. పశువు లభించనిచో మనుష్యు నైనను పశువుగా తీసికొని రమ్ము. అపుడు యజ్ఞము జరుగగలదు.

మూ. ఉపాధ్యాయవచః శ్రుత్వా స రాజా పురుషర్షభ,

అన్వియేష మహాబుద్ధిః పశుం గోభిః సహస్రశః 9

ప్ర. అ. పురుషర్షభ = ఓ పురుషశ్రేష్ఠుడా! మహాబుద్ధిః = గొప్ప బుద్ధి గల, సః = ఆ, రాజా = రాజు, ఉపాధ్యాయవచః = ఉపాధ్యాయునివాక్యమును, శ్రుత్వా = విని, సహస్రశః = వేలకొలది, గోభిః = గోవులచే, పశుమ్ = పశువును, అన్వియేష = అన్వేషించెను.

తా. పురుషశ్రేష్ఠుడ వైన ఓ రామా! మహాబుద్ధిశాలి యగు ఆ రాజు ఉపాధ్యాయుని మాటలు విని, వేలకొలది ఆవుల నిచ్చి నరపశువును సంపాదించుటకు ప్రయత్నించెను.

మూ. దేశాన్ జనపదాంస్తాంస్తాన్నగరాణి వనాని చ,

ఆశ్రమాణి చ పుణ్యాని మార్గమాణో మహీపతిః. 10

స పుత్రసహితం తాత సభార్యం రఘునన్దన,

భృగుతుఙ్గే సమాసీనమృచీకం సందదర్శ హ. 11

ప్ర. అ. తాత = నాయనా! రఘునన్దన = రామా! సః = ఆ, మహీపతిః = రాజు, తాంస్తాన్ = ఆయా, దేశాన్ = దేశములను, జనపదాన్ = పల్లెలను, నగరాణి చ = నగరములను, వనాని చ = వనములను, పుణ్యాని = పుణ్యమైన, ఆశ్రమాణి చ = ఆశ్రమములను, మార్గమాణః = వెదకుచు, భృగుతుఙ్గే = భృగుతుంగపర్వతమునందు, పుత్రసహితమ్ = పుత్రులతో కూడినవాడును, సభార్యమ్ = భార్యాసమేతుడును అగు, సమాసీనమ్ = కూర్చుని ఉన్న, ఋచీకమ్ = ఋచీకమహర్షిని, సందదర్శ హ = చూచెను.

తా. రామా! ఆ రాజు ఆయా దేశములందును, పల్లెలందును, నగరములందును, పవిత్ర మైన ఆశ్రమములందును వెదకుచు భృగుతుంగపర్వతముపై భార్యాపుత్ర సమేతుడై సుఖముగా కూర్చుని ఉన్న ఋచీకమహర్షిని చూచెను.

మూ. తమువాచ మహాతేజాః ప్రణమ్యాభిప్రసాద్య చ,

బ్రహ్శర్షిం తపసా దీప్తం రాజర్షిరమితప్రభః. 12

పృష్ట్వా సర్వత్ర కుశలమృచీకం తమిదం వచః.

ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు గలవాడును, అమితప్రభః = అనంత మైన కాంతి కలవాడును అగు ఆ రాజు, తపసా = తపస్సుతో, దీప్తమ్ = ప్రజ్వరిల్లుచున్న, తమ్ = ఆ, బ్రహ్మర్షిమ్ = బ్రహ్మర్షిని, ప్రణమ్య = నమస్కరించి, అభిప్రసాద్య చ = అనుగ్రహింపచేసికొని, సర్వత్ర = అన్నింటియందును, కుశలమ్ = క్షేమమును, పృష్ట్వా = అడిగి, తం ఋచీకమ్ = ఆ ఋచీకుని గూర్చి, ఇదమ్ = ఈ, వచః = వచనమును, ఉవాచ = పలికెను.

తా. మహాతేజశ్శాలి యగు ఆ రాజు తపస్సుతో ప్రకాశించుచున్న ఆ ఋచీకుని నమస్కరించి, అనుగ్రహింపచేసికొని, అన్నింటను కుశలవార్త లడిగి, ఇట్లు పలికెను.

మూ. గవాం శతసహస్రేణ విక్రీణీషే సుతం యది,

పశోరర్ధే మహాభాగ కృతకృత్యోఽస్మి భార్గవ. 13

ప్ర. అ. మహాభాగ = గొప్ప భాగ్యము గల, భార్గవ = భృగువంశసంజాతుడవైన ఓ ఋచీకమునీ! గవామ్ = గోవులయొక్క, శతసహస్రేణ = నూరువేలచేత, సుతమ్ = నీ కుమారుని, పశోః అర్థే = పశువుకొరకై, విక్రీణీషే యది = అమ్మినట్లైతే, కృతకృత్యః = కృతకృత్యుడను, అస్మి = అగుదును.

తా. మహామునీ! నీవు లక్ష ఆవులను తీసికొని నీ కుమారుని యజ్ఞపశువుగా అమ్మినచో నేను చరితార్థుడ నగుదును.

మూ. సర్వే పరిసృతా దేశా యజ్ఞీయం న లభే పశుమ్,

దాతుమర్హసి మూల్యేన సుతమేకమితో మమ. 14

ప్ర. అ. సర్వే = సమస్త మైన, దేశాః = దేశములు, పరిసృతాః = సంచరించబడినవి, యజ్ఞీయమ్ = యజ్ఞసంబంధ మైన, పశుమ్ = పశువును, న లభే = పొందజాలకున్నాను, ఇతః = వీరిలోనుండి, ఏకమ్ = ఒక, సుతమ్ = కుమారుని, మూల్యేన = మూల్యముచేత, మమ = నాకు, దాతుమ్ = ఇచ్చుటకు, అర్హసి = తగియున్నావు.

తా. అన్ని దేశములు తిరిగితిని కాని యజ్ఞపశువు లభించలేదు. నీ కుమారులలో ఒకనిని నాకు మూల్యమున కిమ్ము.

మూ. ఏవముక్తో మహాతేజా ఋచీకస్త్వబ్రవీద్వచః,

నాహం జ్యేష్ఠం నరశ్రేష్ఠ విక్రీణీయాం కథం చన. 15

ప్ర. అ. ఏవమ్ = ఇట్లు, ఉక్తః = పలకబడిన, మహాతేజాః = గొప్ప తేజస్సు గల, ఋచీకస్తు = ఋచీకమహర్షి యైతే, వచః = వచనమును, అబ్రవీత్ = పలికెను. నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా!, అహమ్ = నేను, కథం చన = ఎట్లైనను, జ్యేష్ఠమ్ = పెద్దవానిని, న విక్రీణీయామ్ = అమ్మను.

తా. రాజు మాటలు విని ఋచీకుడు - ‘‘నే నే విధమున నైనను జ్యేష్ఠపుత్రుని అమ్మజాలను’’ అని పలికెను.

మూ. ఋచీకస్య వచః శ్రుత్వా తేషాం మాతా మహాత్మనామ్,

ఉవాచ నరశార్దూలమమ్బరీషం తపస్వినీ. 16

ప్ర. అ. ఋచీకస్య = ఋచీకునియొక్క, వచః = వచనమును, శ్రుత్వా = విని, మహాత్మనామ్ = మహాత్ము లైన, తేషామ్ = వారియొక్క, మాతా = తల్లి యైన, తపస్వినీ = తాపసి, నరశార్దూలమ్ = నరులలో శ్రేష్ఠు డైన, అమ్బరీషమ్ = అంబరీషుని గూర్చి, ఉవాచ = పలికెను.

తా. ఆ మహాత్ముల తల్లి యైన తపోధనురాలు ఋచీకుని మాటలు విని అంబరీషునితో ఇట్లనెను.

మూ. అవిక్రేయం సుతం జ్యేష్ఠం భగవానాహ భార్గవః. 17

మమాపి దయితం విద్ధి కనిష్ఠం శునకం నృప,

తస్మాత్కనీయసం పుత్రం న దాస్యే తవ పార్థివ. 18

ప్ర. అ. భగవాన్ = పూజ్యు డైన, భార్గవః = ఋచీకమహాముని, జ్యేష్ఠమ్ = జ్యేష్ఠుడైన, సుతమ్ = కుమారుని, అవిక్రేయమ్ = అమ్మకూడని వానినిగా, ఆహ = చెప్పుచున్నాడు. నృప = రాజా!, శునకమ్ = శునకుడనే, కనిష్ఠమ్ = చిన్నపిల్లవానిని, మమ = నాకు, దయితమ్ = ఇష్టునిగా, విద్ధి = తెలుసుకొనుము. పార్థివ = రాజా!, తస్మాత్ = ఆ కారణమువలన, కనీయసం పుత్రమ్ = చిన్న కుమారుని, తవ = నీకు, న దాస్యే = ఇవ్వను.

తా. ఋచీకమహాముని పెద్దకుమారుని అమ్మ నని చెప్పుచున్నాడు. రాజా! చిన్న కుమారు డైన శునకుడు నాకు ఇష్టుడు. అందుచేత ఆతనిని నీకు ఇవ్వను.

మూ. ప్రాయేణ హి నరశ్రేష్ఠ జ్యేష్ఠాః పితృషు వల్లభాః,

మాతౄణాం తు కనీయాంసస్తస్మాద్రక్షే కనీయసమ్. 19

ప్ర. అ. నరశ్రేష్ఠ = ఓ నరశ్రేష్ఠుడా! ప్రాయేణ = సాధారణముగా, జ్యేష్ఠాః = పెద్దవాళ్లు, పితృషు = తండ్రులయందు, వల్లభాః = ప్రియులు, మాతౄణాం తు = తల్లులకైతే, కనీయాంసః = చిన్నవాళ్లు ప్రియులు, తస్మాత్ = ఆ కారణమువలన, కనీయసమ్ = చిన్నవానిని, రక్షే = రక్షించెదను.

తా. రాజా! సాధారణముగా జ్యేష్ఠుడు తండ్రికి ఇష్టుడు కాగా చిన్న వాడు తల్లికి ఇష్టు డగును. అందుచేత చిన్నవానిని రక్షించుకొందును.

మూ. ఉక్తవాక్యే మునౌ తస్మిన్ మునిపత్న్యాం తథైవ చ,

శునశ్శేఫస్స్వయం రామ మధ్యమో వాక్యమబ్రవీత్. 20

ప్ర. అ. రామ = రామా!, తస్మిన్ = ఆ, మునౌ = ముని, ఉక్తవాక్యే = పలకబడిన వాక్యము కలవా డగుచుండగా, తథైవ చ = అట్లే, మునిపత్న్యామ్ = మునిపత్ని పలకబడిన వాక్యము కలదగుచుండగా, మధ్యమః = మధ్యముడైన, శునఃశేఫః = శునశ్శేఫుడు, స్వయమ్ = స్వయముగా, వాక్యమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. మునియు, మునిపత్నియు పలికిన మాటలు విని మధ్యము డైన శునశ్శేఫుడు స్వయముగ ఇట్లు పలికెను.

మూ. పితా జ్యేష్ఠమవిక్రేయం మాతా చాహ కనీయసమ్,

విక్రీతం మధ్యమం మన్యే రాజన్ పుత్రం నయస్వ మామ్. 21

ప్ర. అ. రాజన్ = రాజా!, పితా = తండ్రి, జ్యేష్ఠమ్ = జ్యేష్ఠకుమారుని, అవిక్రేయమ్ = అమ్మ శక్యము కానివానినిగా, ఆహ = చెప్పుచున్నాడు. మాతా చ = తల్లియు, కనీయసమ్ = చిన్న వానిని అమ్మ వీలు కాని వానినిగా చెప్పుచున్నది. మధ్యమం పుత్రమ్ = మధ్యమ పుత్రుడ నైన నన్ను, విక్రీతమ్ = అమ్మబడిన వానినిగా, మన్యే = తలచుచున్నాను. మామ్ = నన్ను, నయస్వ = తీసికొని వెళ్లుము.

తా. రాజా! జ్యేష్ఠకుమారుని అమ్మజాల నని తండ్రి చెప్పుచున్నాడు. చిన్నవానిని అమ్మజాల నని తల్లి చెప్పుచున్నది. దీనిని బట్టి మధ్యముడనైన నన్ను అమ్ముచున్నా రని అనుకొనుచున్నాను. అందుచే నన్ను తీసికొని పొమ్ము.

మూ. గవాం శతసహస్రేణ శునఃశేఫం నరేశ్వరః,

గృహీత్వా పరమప్రీతో జగామ రఘునన్దన. 22

ప్ర. అ. రఘునన్దన = రామా!, నరేశ్వరః = రాజు, గవామ్ = గోవుల యొక్క, శతసహస్రేణ = నూరువేలచేత, శునఃశేఫమ్ = శునఃశేఫుని, గృహీత్వా = గ్రహించి, పరమప్రీతః = మిక్కిలి సంతసించినవాడై, జగామ = వెళ్లెను.

తా. రామా! ఆ రాజు లక్ష గోవులతో ఆ శునఃశేఫుని కొని ఆనందముతో వెళ్లెను.

మూ. అమ్బరీషస్తు రాజర్షీ రథమారోప్య సత్వరః,

శునఃశేఫం మహాతేజా జగామాశు మహాయశాః. 23

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే ఏకషష్టితమః సర్గః

ప్ర. అ. మహాతేజాః = గొప్పతేజస్సు గల, మహాయశాః = గొప్ప కీర్తి గల, రాజర్షిః = రాజర్షి యైన, అమ్బరీషస్తు = అంబరీషు డైతే, సత్వరః = తొందరతో కూడిన వాడై, శునఃశేఫమ్ = శునఃశేఫుని, రథమ్ ఆరోప్య = రథ మెక్కించి, ఆశు = శీఘ్రముగా, జగామ = వెళ్లెను.

తా. గొప్ప తేజోయశస్సులు గల రాజర్షి యైన ఆ అంబరీషుడు శునఃశేఫుని శీఘ్రముగా రథముపై కూర్చుండబెట్టుకొని వెళ్లెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో అరువది యొకటవ సర్గ సమాప్తము.