Chapter_62

Back
Book Balakandamu
Chapter No 68
Pages 7
Read Time 10 Minutes

Chapter_62

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ ద్విషష్టితమః సర్గః

విశ్వామిత్రుడు శునఃశేఫుని రక్షించుట, మరల తపస్సు చేయుట.

మూ. శునఃశేఫం నరశ్రేష్ఠ గృహీత్వా తు మహాయశాః,

వ్యశ్రామ్యత్పుష్కరే రాజా మధ్యాహ్నే రఘునన్దన. 1

ప్ర. అ. నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడ వైన, రఘునన్దన = రామా!, మహాయశాః = గొప్ప కీర్తి గల, రాజా = ఆ రాజు, శునఃశేఫమ్ = శునశ్శేఫుని, గృహీత్వా = గ్రహించి, మధ్యాహ్నే = మధ్యాహ్నమునందు, పుష్కరే = పుష్కరమునందు, వ్యశ్రామ్యత్ = విశ్రమించెను.

తా. రామా! ఆ రాజు శునఃశేఫుని తీసికొని వెళ్లుచు, మద్యాహ్నసమయమునందు పుష్కర క్షేత్రమున విశ్రాంతి తీసికొనెను.

మూ. తస్య విశ్రమమాణస్య శునఃశేఫో మహాయశాః,

పుష్కరక్షేత్రమాగమ్య విశ్వామిత్రం దదర్శ హ, 2

తప్యన్తమృషిభిస్సార్ధం మాతులం పరమాతురః.

ప్ర. అ. తస్య = ఆతడు, విశ్రమమాణస్య = విశ్రాంతి తీసికొనుచుండగా, మహాయశాః = గొప్ప కీర్తి గల, శునఃశేఫః = శునఃశేఫుడు, పరమాతురః = మిక్కిలి బాధపడుచున్నవాడై, పుష్కరక్షేత్రమ్ = పుష్కరక్షేత్రమును గూర్చి, అగమ్య = వచ్చి, ఋషిభిఃసార్ధమ్ = ఋషులతో కూడ, తప్యన్తమ్ = తపస్సు చేయుచున్న, మాతులమ్ = తన మేనమామ యైన, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని, దదర్శ హ = చూచెను.

తా. ఆ రాజు విశ్రాంతి తీసికొనుచున్న సమయమున మహాయశస్వియగు ఆశునఃశేఫుడు మనస్సులో చాల బాధపడుచు, ఆ పుష్కరక్షేత్రమునందు ఇతర ఋషులతో కలిసి తపస్సు చేసుకొనుచున్న మేనమామ యగు విశ్వామిత్రుని దర్శనము చేసెను.

మూ. వివర్ణవదనో దీనస్తృష్ణయా చ శ్రమేణ చ,

పపాతాఙ్కే మునేరాశు వాక్యం చేదమువాచ హ. 3

ప్ర. అ. తృష్ణయా చ = దప్పికచేతను, శ్రమేణ చ = శ్రమచేతను, వివర్ణవదనః = రంగు మారిన ముఖము కలవాడై, దీనః = దీనుడై, ఆశు = శీఘ్రముగా, మునేః = మునియొక్క, అఙ్కే = ఒడిలో, పపాత = పడెను. ఇదమ్ = ఈ, వాక్యమ్ = వాక్యమును, ఉవాచ హ = పలికెను.

తా. దప్పికచేతను, అలసటచేతను ఎండిపోయిన ముఖముతో, శీఘ్రముగా విశ్వామిత్రుని ఒడిలో పడి ఇట్లు పలికెను.

మూ. న మేఽస్తి మాతా న పితా జ్ఞాతయో బాన్ధవాః కుతః,

త్రాతుమర్హసి మాం సౌమ్య ధర్మేణ మునిపుఙ్గవ. 4

ప్ర. అ. సౌమ్య = శాంతుడ వైన, మునిపుఙ్గవ = ఓ మునిశ్రేష్ఠా!, మే = నాకు, మాతా = తల్లి, నాస్తి = లేదు. పితా = తండ్రి, న = లేడు. జ్ఞాతయః = జ్ఞాతులును, బాన్ధవాః = బంధువులును, కుతః = ఎక్కడ ? మామ్ = నన్ను, ధర్మేణ = ధర్మముచేత, త్రాతుమ్ = రక్షించుటకు, అర్హసి = తగియున్నావు.

తా. ఓ మహామునీ! నాకు తల్లి లేదు. తండ్రి లేడు. ఇంక జ్ఞాతు లైన ఇతర బంధువు లెక్కడ ? అందుచే నన్ను ధర్మానుసారముగా రక్షింపుము.

మూ. త్రాతా త్వం హి మునిశ్రేష్ఠ సర్వేషాం త్వం హి భావనః. 5

రాజా చ కృతకార్యః స్యాదహం దీర్ఘాయురవ్యయః,

స్వర్గలోకముపాశ్నీయాం తపస్తప్త్వా హ్యనుత్తమమ్. 6

ప్ర. అ. మునిశ్రేష్ఠ = ఓ మునిశ్రేష్ఠుడా!, త్వమ్ = నీవు, సర్వేషామ్ = అందరికిని, త్రాతా హి = రక్షకుడవు కదా ? త్వమ్ = నీవు, భావనః హి = హితము చేయువాడవు కదా ? రాజా చ = రాజు, కృతకార్యః = చేయబడిన కార్యము కలవాడు, స్యాత్ = అగుగాక. అహమ్ = నేను, దీర్ఘాయుః = దీర్ఘాయుర్దాయము కలవాడనై, అవ్యయః = నాశనము లేనివాడనై, అనుత్తమమ్ = గొప్ప, తపః = తపస్సు, తప్త్వా = చేసి, స్వర్గలోకమ్ = స్వర్గలోకమును, ఉపాశ్నీయామ్ = అనుభవించెదను గాక.

తా. ఓ మహామునీ! నీవు అందరిని రక్షించువాడవు. అందరికిని హితము చేకూర్చువాడవు. రాజు కార్యము సఫల మగునట్లును, నేను దీర్ఘాయుర్దాయవంతు డనై, తపస్సు చేసి స్వర్గము చేరకల్గు నట్లును చేయుము.

మూ. త్వం మే నాథో హ్యనాథస్య భవ భవ్యేన చేతసా,

పితేవ పుత్రం ధర్మాత్మంస్త్రాతుమర్హసి కిల్బిషాత్. 7

ప్ర. అ. అనాథస్య = రక్షకుడు లేని, మే = నాకు, త్వమ్ = నీవు, భవ్యేన = మంగళకర మైన, చేతసా = చిత్తముతో, నాథః = రక్షకుడవుగా, భవ = అగుము. ధర్మాత్మన్ = ధర్మాత్ముడా!, పితా = తండ్రి, పుత్రమివ = పుత్రుని వలె, కిల్పిషాత్ = పాపమునుండి, త్రాతుమ్ = రక్షించుటకు, అర్హసి = తగియున్నావు.

తా. ఓ ధర్మాత్మా! మంగళకర మైన చిత్తముతో, నాథుడు లేని నాకు నాథుడ వగుము. తండ్రి కుమారుని రక్షించి నట్లు నన్నీ ఆపదనుండి రక్షింపుము.

మూ. తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహాతపాః,

సాన్త్వయిత్వా బహువిధం పుత్రానిదమువాచ హ. 8

ప్ర. అ. మహాతపాః = గొప్ప తేజస్సు గల, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, తస్య = అతనియొక్క, తత్ వచనమ్ = ఆ వచనమును, శ్రుత్వా = విని, బహువిధమ్ = అనేక విధములుగా, సాన్త్వయిత్వా = ఓదార్చి, పుత్రాన్ = పుత్రులను గూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, ఉవాచ హ = పలికెను.

తా. ఆతని మాటలు విన్న విశ్వామిత్ర మహాముని అతనిని బహు విధముల ఓదార్చి తన పుత్రులతో ఇట్లనెను.

మూ. యత్కృతే పితరః పుత్రాన్ జనయన్తి శుభార్థినః,

పరలోకహితార్థాయ తస్య కాలోఽయమాగతః. 9

ప్ర. అ. శుభార్థినః = శుభమును కోరు, పితరః = తల్లిదండ్రులు, యత్కృతే = దేనికొరకై, పరలోకహితార్థాయ = పరలోకమునందు హిత మనెడు ప్రయోజనముకొరకై, పుత్రాన్ = పుత్రులను, జనయన్తి = కనుచుందురో, తస్య = దానికి, అయమ్ = ఈ, కాలః = కాలము, ఆగతః = వచ్చినది.

తా. మంగళమును కోరు తలిదండ్రులు ఏ పరలోకహితమును కోరి పుత్రులను కనుచుందురో దానిని సాధించు సమయము ఇప్పుడు వచ్చినది.

మూ. అయమ్ బాలో మునిసుతో మత్తః శరణమిచ్ఛతి,

అస్య జీవితమాత్రేణ ప్రియం కురుత పుత్రకాః. 10

ప్ర. అ. మునిసుతః = మునికుమారు డైన, అయమ్ = ఈ, బాలః = బాలుడు, మత్తః = నానుండి, శరణమ్ = శరణమును, ఇచ్ఛతి = కోరుచున్నాడు. పుత్రకాః = పుత్రులారా! అస్య = వీనికి, జీవితమాత్రేణ = జీవితమును మాత్ర మిచ్చుటచేత, ప్రియమ్ = ప్రియమును, కురుత = చేయుడు.

తా. మునిసుతు డైన ఈ బాలుడు రక్షింపు మని నన్ను వేడుచున్నాడు. పుత్రులారా! ఈతనికి జీవితదానము చేసి ప్రియము చేకూర్చుడు.

మూ. సర్వే సుకృతకర్మాణః సర్వే ధర్మపరాయణాః,

పశుభూతా నరేన్ద్రస్య తృప్తిమగ్నేః ప్రయచ్ఛత. 11

ప్ర. అ. సర్వే = మీరందరును, సుకృతకర్మాణః = పుణ్యకర్మ కలవారు. సర్వే = మీరందరును, ధర్మపరాయణాః = ధర్మమునందాసక్తి కలవారు. నరేన్ద్రస్య = రాజునకు, పశుభూతాః = యజ్ఞపశువులై, అగ్నేః = అగ్నికి, తృప్తిమ్ = తృప్తిని, ప్రయచ్ఛత = ఇవ్వండి.

తా. ధర్మపరాయణు లైన మీ రందరును పుణ్యకర్మలు చేసి ఉన్నారు. మీరు రాజునకు యజ్ఞపశువులుగా అయి అగ్నికి తృప్తి కలిగింపుడు.

మూ. నాథవాంశ్చ శునఃశేఫో యజ్ఞశ్చావిఘ్నితో భవేత్,

దేవతాస్తర్పితాశ్చస్యుర్మమ చాపి కృతం వచః. 12

ప్ర. అ. శునఃశేఫః = శునశ్శేఫుడు, నాథవాన్ చ = రక్షకుడు కలవాడు (అగును), యజ్ఞశ్చ = యజ్ఞము కూడ, అవిఘ్నితః = విఘ్నము లేనిది, భవేత్ = అగును, దేవతాః = దేవతలు, తర్పితాః = తృప్తి పొందింపబడినవారు, స్యుః = అగుదురు. మమ = నాయొక్క, వచః చ = మాట కూడ, కృతమ్ = చేయబడినదగును.

తా. మీ రట్లు చేసినచో శునఃశేఫునకు రక్షణ ఇచ్చి నట్లగును; యజ్ఞము నిర్నిఘ్నముగ కొనసాగును; దేవతలకు తృప్తి లభించును; నే నిచ్చిన మాట నిలబెట్టుకొని నట్లగును.

మూ. మునేస్తు వచనం శ్రుత్వా మధుష్యన్దాదయః సుతాః,

సాభిమానం నరశ్రేష్ఠ సలీలమిదమబ్రువన్. 13

ప్ర. అ. నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా!, మధుష్యన్దాదయః = మధుష్యందుడు మొదలైన, సుతాః = కుమారులు, మునేః = మునియొక్క, వచనమ్ = వచనమును, శ్రుత్వా = విని, సాభిమానమ్ = అహంకారపూర్వకముగా, సలీలమ్ = పరిహాసపూర్వకముగా, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రువన్ = పలికిరి.

తా. రామా! విశ్వామిత్రుని మాటలు విని ఆతని కుమారు లైన మధుష్యందాదులు అహంకారముతో పరిహాసపూర్వకముగా ఇట్లనిరి.

మూ. కథమాత్మసుతాన్హిత్వా త్రాయసేఽన్యసుతం విభో,

అకార్యమివ పశ్యామః శ్వమాంసమివ భోజనే. 14

ప్ర. అ. విభో = ఓ ప్రభూ!, ఆత్మసుతాన్ = తన కుమారులను, హిత్వా = విడచి, అన్యసుతమ్ = ఇతరుల కుమారుని, కథమ్ = ఎట్లు, త్రాయసే = రక్షించుచున్నావు ? భోజనే = భోజనమునందు, శ్వమాంసమివ = కుక్కమాంసమును వలె, అకార్యమివ = చేయకూడని కార్యముగా, పశ్యామః = చూచుచున్నాము.

తా. తండ్రీ! తన కుమారులను త్యజించి ఇతరుల కుమారుని రక్షించుట శ్వమాంసము భుజించుటవంటి దని మా అభిప్రాయము.

మూ. తేషాం తద్వచనం శ్రుత్వా పుత్రాణాం మునిపుఙ్గవః,

క్రోధసంరక్తనయనో వ్యాహర్తుముపచక్రమే. 15

ప్ర. అ. మునిపుఙ్గవః = ఆ మునిశ్రేష్ఠుడు, తేషామ్ = ఆ, పుత్రాణామ్ = పుత్రులయొక్క, తద్ వచనమ్ = ఆ వచనమును, శ్రుత్వా = విని, క్రోధసంరక్తనయనః = క్రోధముతో ఎఱ్ఱనైన నేత్రములు కలవాడై, వ్యాహర్తుమ్ = పలుకుటకు, ఉపచక్రమే = ప్రారంభించెను.

తా. విశ్వామిత్రుడు పుత్రుల మాటలు విని, క్రోధముచే ఎఱ్ఱబారిన కనులతో వారితో నిట్లనెను.

మూ. నిస్సాధ్వసమిదం ప్రోక్తం ధర్మాదపి విగర్హితమ్,

అతిక్రమ్య తు మద్వాక్యం దారుణం రోమహర్షణమ్. 16

ప్ర. అ. మద్వాక్యమ్ = నామాటను, అతిక్రమ్య = అతిక్రమించి, ధర్మాదపి = ధర్మానుసారముగా కూడ, విగర్హితమ్ = నింద్య మైనదియు, దారుణమ్ = భయంకర మైనదియు, రోమహర్షణమ్ = గగుర్పాటు కలిగించునదియు, అగు, ఇదమ్ = ఈ వాక్యము, నిస్సాధ్వసమ్ = భయము లేకుండగా, ప్రోక్తమ్ = పలకబడినది.

తా. మీరు నా మాటను అతిక్రమించుటయే కాక, ఎట్టి సంకోచము లేక ధర్మ విరుద్ధమును, భయంకరమును అగు ఈ వాక్యమును పలికినారు.

మూ. శ్వమాంసభోజినః సర్వే వాసిష్ఠా ఇవ జాతిషు,

పూర్ణం వర్షసహస్రం తు పృథివ్యామనువత్స్యథ. 17

ప్ర. అ. సర్వే = మీరందరును, శ్వమాంసభోజినః = కుక్కమాంసమును తినుచు, పూర్ణం వర్షసహస్రమ్ = పూర్తిగా వేయి సంవత్సరములు, పృథివ్యామ్ = భూమియందు, వాసిష్ఠాః ఇవ = వసిష్ఠకుమారులు వలె, జాతిషు = ముష్టికు లను జాతులలో, అనువత్స్యథ = ఉండగలరు.

తా. మీ రందరును వసిష్ఠకుమారుల వలె ముష్టికజాతులందు పుట్టి, కుక్కమాంసమును తినుచు పూర్తిగా వేయి సంవత్సరముల పాటు భూమిపై సంచరించగలరు.

మూ. కృత్వా శాపసమాయుక్తాన్ పుత్రాన్ మునివరస్తదా,

శునఃశేఫమువాచార్తం కృత్వా రక్షాం నిరామయమ్. 18

ప్ర. అ. మునివరః = ఆ మునిశ్రేష్ఠుడు, పుత్రాన్ = పుత్రులను, శాపసమాయుక్తాన్ = శాపముతో కూడినవారినిగా, కృత్వా = చేసి, తదా = అప్పుడు, నిరామయమ్ = బాధ లేని విధముగా, రక్షామ్ = రక్షను, కృత్వా = చేసి, ఆర్తమ్ = దుఃఖితు డైన, శునఃశేఫమ్ = శునఃశేఫుని గూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, ఉవాచ = పలికెను.

తా. విశ్వామిత్రుడు పుత్రులను ఈ విధముగ శపించి, దుఃఖితు డైన శునఃశేఫునకు ఎట్టి బాధయు లేకుండు నట్లు మంత్రాదులచే రక్ష చేసి ఆతనితో ఇట్లనెను.

మూ. పవిత్రపాశైరాసక్తో రక్తమాల్యానులేపనః,

వైష్ణవం యూపమాసాద్య వాగ్భిరగ్నిముదాహర. 19

ప్ర. అ. వైష్ణవం యూపమ్ = విష్ణుదేవతాక మైన యూపస్తంభమును, ఆసాద్య = పొంది, పవిత్రపాశైః = పవిత్ర మైన పాశములచే, ఆసక్తః = కట్టబడిన, రక్తమాల్యానులేపనః = ఎఱ్ఱని మాలలు, మైపూతయు గల నీవు, వాగ్భిః = (నే చెప్పబోవు) వాక్కులతో, అగ్నిమ్ = అగ్నిని, ఉదాహర = చెప్పుము (స్తుతింపుము).

తా. నీకు ఎఱ్ఱని పుష్పమాలలు వేసి, ఎఱ్ఱని మైపూత పూసి, పవిత్రము లైన పాశములతో వైష్ణవయూపస్తంభమునకు కట్టుదురు. అప్పుడు ఈ మంత్రములతో అగ్నిని స్తుతింపుము.

మూ. ఇమే తు గాథే ద్వే దివ్యే గాయేథా మునిపుత్రక,

అమ్బరీషస్య యజ్ఞేఽస్మిం స్తతస్సిద్ధిమవాప్స్యసి. 20

ప్ర. అ. మునిపుత్రక = మునికుమారా! అమ్బరీషస్య = అంబరీషునియొక్క, అస్మిన్ = ఈ, యజ్ఞే = యజ్ఞమునందు, ఇమే = ఈ, ద్వే = రెండు, దివ్యే = దివ్య మైన, గాథే = గాథలను, గాయేథాః = గానము చేయుము. తతః = పిమ్మట, సిద్ధిమ్ = సిద్ధిని, అవాప్స్యసి = పొందగలవు.

తా. ఓ మునికుమారా! అంబరీషుని యజ్ఞములో శ్రేష్ఠము లైన ఈ రెండు మంత్రములను పఠించినచో నీకు కార్యసిద్ధి లభించును.

మూ. శునఃశేఫో గృహీత్వా తే ద్వే గాథే సుసమాహితః,

త్వరయా రాజసింహం తమమ్బరీషమువాచ హ. 21

ప్ర. అ. శునఃశేఫః = శునఃశేఫుడు, సుసమాహితః = సావధానచిత్తుడై, తే = ఆ, ద్వే = రెండు, గాథే = గాథలను, గృహీత్వా = గ్రహించి, రాజసింహమ్ = రాజశ్రేష్ఠు డైన, తమ్ = ఆ, అమ్బరీషమ్ = అంబరీషుని, త్వరయా = తొందరతో, ఉవాచ హ = పలికెను.

తా. శునఃశేఫుడు శ్రద్ధాపూర్వకముగా ఆ రెండు మంత్రములను గ్రహించి రాజశ్రేష్ఠు డైన ఆ అంబరీషుని తొందర పెట్టుచు ఇట్లనెను.

మూ. రాజసింహ మహాసత్త్వ శీఘ్రం గచ్ఛావహే సదః,

నిర్వర్తయస్వ రాజేన్ద్ర దీక్షాం చ సముపావిశ. 22

ప్ర. అ. మహాసత్త్వ = గొప్ప బలము గల, రాజసింహ = రాజశ్రేష్ఠుడా! సదః = యజ్ఞ సదస్సును గూర్చి, శీఘ్రమ్ = శీఘ్రముగా, గచ్ఛావహే = వెళ్లుదము. రాజేన్ద్ర = ఓ రాజేంద్రా! దీక్షామ్ = దీక్షను, నిర్వర్తయన్వ = నడిపింపుము. సముపావిశ = దీక్షలో కూర్చుండుము.

తా. గొప్ప బలము గల రాజశ్రేష్ఠా! యజ్ఞశాలకు శీఘ్రముగా వెళ్లుదుము. దీక్షలో కూర్చుండి యజ్ఞము జరిపింపుము.

మూ. తద్వాక్యమృషిపుత్రస్య శ్రుత్వా హర్షసముత్సుకః,

జగామ నృపతిః శీఘ్రం యజ్ఞవాటమతన్ద్రితః. 23

ప్ర. అ. నృపతిః = రాజు, ఋషిపుత్రస్య = ఋషిపుత్రునియొక్క, తత్ = ఆ, వాక్యమ్ = వాక్యమును, శ్రుత్వా = విని, హర్షసముత్సుకః = సంతోషముతో ఉత్సాహవంతుడై, అతన్ద్రితః = ఆలస్యము లేనివాడై, యజ్ఞవాటమ్ = యజ్ఞవాటమును గూర్చి, జగామ = వెళ్లెను.

తా. ఋషిపుత్రుని మాటలు విన్న ఆ రాజు సంతోషోత్సాహభరితుడై, మాంద్యము లేనివాడై, శీఘ్రముగా యజ్ఞవాటికను వెళ్లెను.

మూ. సదస్యానుమతే రాజా పవిత్రకృతలక్షణమ్,

పశుం రక్తామ్బరం కృత్వా యూపే తం సమబన్ధయత్. 24

ప్ర. అ. రాజా = రాజు, సదస్యానుమతే = సభ్యుల అనుమతి ప్రకారము, తమ్ = ఆశునఃశేఫుని, పవిత్రకృతలక్షణమ్ = దర్భపవిత్రముచే ఏర్పరుపబడిన గుర్తు గల, రక్తామ్బరమ్ = ఎఱ్ఱని వస్త్రములు గల, పశుమ్ = పశువునుగా, కృత్వా = చేసి, యూపే = యూపస్తంభమునందు, సమబన్ధయత్ = కట్టించెను.

తా. ఆ రాజు సదస్యుల అనుమతి పొంది, ఆ శునఃశేఫునకు దర్భపవిత్రముచే గుర్తు లుంచి, ఎఱ్ఱని వస్త్రము కట్టి, యజ్ఞపశువునుగా ఆతనిని యూపస్తంభమున బంధింపచేసెను.

మూ. స బద్ధో వాగ్భిరగ్య్రాభిరభితుష్టావ వై సురౌ,

ఇన్ద్రమిన్ద్రానుజం చైవ యథావన్మునిపుత్రకః. 25

ప్ర. అ. బద్ధః = కట్టబడిన, సః = ఆ, మునిపుత్రకః = మునికుమారుడు, ఇన్ద్రమ్ = ఇంద్రుని, ఇన్ద్రానుజం చైవ = ఉపేంద్రుని, సురౌ = ఈ ఇద్దరు దేవతలను, అగ్య్రాభిః = శ్రేష్ఠము లైన, వాగ్భిః = వాక్కులచేత, యథావత్ = యథాశాస్త్రముగా, అభితుష్టావ = స్తుతించెను.

తా. యూపమున బంధింపబడిన ఆ మునికుమారుడు ఇంద్రుని, ఉపేంద్రుని శ్రేష్ఠము లైన వాక్కులతో యథాశాస్త్రముగా, స్తుతించెను.

మూ. తతః ప్రీతః సహస్రాక్షో రహస్యస్తుతితర్పితః,

దీర్ఘమాయుస్తదా ప్రాదాచ్ఛునఃశేఫాయ రాఘవ. 26

ప్ర. అ. రాఘవ = రామా!, తతః = పిమ్మట, రహస్యస్తుతితర్పితః = రహస్యముగా స్తుతించుటచే తృప్తిపొందింపబడిన, సహస్రాక్షః = దేవేంద్రుడు, ప్రీతః = సంతసించినవాడై, తదా = అప్పుడు, శునఃశేఫాయ = శునఃశేఫునకు, దీర్ఘమ్ = దీర్ఘమైన, ఆయుః = ఆయుర్దాయమును, ప్రాదాత్ = ఇచ్చెను.

తా. రామా! రహస్యముగా చేసిన స్తుతికి సంతసించి దేవేంద్రుడు శునఃశేఫునకు దీర్ఘాయువును ప్రసాదించెను.

మూ. స చ రాజా నరశ్రేష్ఠ యజ్ఞస్య చ సమాప్తవాన్,

ఫలం బహుగుణం రామ సహస్రాక్షప్రసాదజమ్. 27

ప్ర. అ. నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడవైన, రామ = రామా! సః = ఆ, రాజా చ = రాజు కూడ, సహస్రాక్షప్రసాదజమ్ = దేవేంద్రుని అనుగ్రహమువలన కలిగిన, బహుగుణమ్ = చాల రెట్లైన, యజ్ఞస్య = యజ్ఞముయొక్క, ఫలమ్ = ఫలమును, సమాప్తవాన్ = పొందినాడు.

తా. నరశ్రేష్ఠుడ వైన రామా! అంబరీషమహారాజునకు దేవేంద్రుని అనుగ్రహముచే ఎన్నో రెట్లు యజ్ఞఫలము లభించెను.

మూ. విశ్వామిత్రోఽపి ధర్మాత్మా భూయస్తేపే మహాతపాః,

పుష్కరేషు నరశ్రేష్ఠ దశవర్షశతాని చ. 28

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే ద్విషష్టితమః సర్గః

ప్ర. అ. నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా! ధర్మాత్మా = ధర్మాత్ముడును, మహాతపాః = గొప్పతపస్సు కలవాడును అగు, విశ్వామిత్రోఽపి = విశ్వామిత్రుడు కూడ, పుష్కరేషు = పుష్కరమునందు, దశవర్షశతాని = వేయి సంవత్సరములు, భూయః = మరల, తేపే = తపస్సు చేసెను.

తా. రామా! మహాతపఃశాలియు, ధర్మాత్ముడును అగు విశ్వామిత్రుడు పుష్కర క్షేత్రమునందు మరల వేయి సంవత్సరములపాటు తపస్సు చేసెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో అరువది రెండవ సర్గ సమాప్తము.