Chapter_63

Back
Book Balakandamu
Chapter No 69
Pages 6
Read Time 10 Minutes

Chapter_63

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ త్రిషష్టితమః సర్గః

విశ్వామిత్రుడు ‘‘మహర్షిత్వమును’’ పొందుట. మేనక ఆతని తపస్సుకు భంగము కలిగించుట. ‘‘బ్రహ్మర్షిత్వము’’ సంపాదించుటకై విశ్వామిత్రుడు ఘోరతపస్సు చేయుట.

మూ. పూర్ణే వర్షసహస్రే తు వ్రతస్నాతం మహామునిమ్,

అభ్యాగచ్ఛన్ సురాః సర్వే తపఃఫలచికీర్షవః. 1

ప్ర. అ. వర్షసహస్రే = వేయిసంవత్సరముల కాలము, పూర్ణే = నిండిన దగుచుండగా, సర్వే = సమస్త మైన, సురాః = దేవతలు, తపఃఫలచికీర్షవః = తపస్సునకు ఫలమును ఇవ్వగోరినవారై, వ్రతస్నాతమ్ = వ్రతాంతమునందు స్నానము చేసిన, మహామునిమ్ = విశ్వామిత్రుని, అభ్యాగచ్ఛన్ = సమీపించిరి.

తా. వేయి సంవత్సరములు గడచిన పిమ్మట ఆ మహాముని వ్రతము పూర్తి చేసికొని యుండగా దేవత లందరును అతని తపస్సునకు ఫలము ఇవ్వగోరి వచ్చిరి.

మూ. అబ్రవీత్సుమహాతేజా బ్రహ్మా సురుచిరం వచః,

ఋషిస్త్వమసి భద్రం తే స్వార్జితైః కర్మభిః శుభైః. 2

ప్ర. అ. సుమహాతేజాః = గొప్ప తేజస్సు గల, బ్రహ్మా = బ్రహ్మ, సురుచిరమ్ = చాల అంద మైన, వచః = వాక్యమును, అబ్రవీత్ = పలికెను. త్వమ్ = నీవు, స్వార్జితైః = నీచేత సంపాదింపబడిన, శుభైః కర్మభిః = పుణ్య కర్మలచే, ఋషిః అసి = ఋషి అయితివి. తే = నీకు, భద్రమ్ = మంగళ మగుగాక.

తా. మహాతేజస్సు గల బ్రహ్మ - ‘‘నీవు ఆచరించిన శుభకర్మలచేత, ఋషి వయినావు. నీకు క్షేమ మగుగాక’’ అని విశ్వామిత్రునితో మధుర మైన వాక్యమును పలికెను.

మూ. తమేవముక్త్వా దేవేశస్త్రిదివం పునరభ్యగాత్,

విశ్వామిత్రో మహాతేజా భూయస్తే పే మహత్తపః. 3

ప్ర. అ. దేవేశః = దేవతల ప్రభు వైన బ్రహ్మ, తమ్ = ఆతనిని గూర్చి, ఏవమ్ = ఈ విధముగా, ఉక్త్వా = పలికి, పునః = తిరిగి, త్రిదివమ్ = స్వర్గమునుగూర్చి, అభ్యగాత్ = వెళ్లెను. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, భూయః = మరల, మహత్ = గొప్ప, తపః = తపస్సును, తేపే = చేసెను.

తా. బ్రహ్మదేవుడు విశ్వామిత్రునితో ఇట్లు పలికి స్వర్గమునకు వెళ్లిపోయెను. గొప్ప తేజస్సు గల విశ్వామిత్రుడు మరల గొప్ప తపస్సు చేసెను.

మూ. తతః కాలేన మహతా మేనకా పరమాప్సరాః,

పుష్కరేషు నరశ్రేష్ఠ స్నాతుం సముపచక్రమే. 4

ప్ర. అ. నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా!, తతః = పిమ్మట, మహతా = గొప్ప, కాలేన = కాలముచేత, మేనకా = మేనక యనెడు, పరమాప్సరాః = గొప్ప అప్సరస్త్రీ, పుష్కరేషు = పుష్కరమునందు, స్నాతుమ్ = స్నానముచేయుటకు, సముపచక్రమే = ప్రారంభించెను.

తా. రామా! పిమ్మట చాలకాలమునకు మేనక యనెడు గొప్ప అప్సరస పుష్కరమునందు స్నాన మాడ మొదలిడెను.

మూ. తాం దదర్శ మహాతేజా మేనకాం కుశికాత్మజః,

రూపేణాప్రతిమాం తత్ర విద్యుతం జలదే యథా. 5

ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, కుశికాత్మజః = విశ్వామిత్రుడు, తత్ర = ఆ పుష్కరమునందు, జలదే = మేఘమునందు, విద్యుతం యథా = మెరుపు వలె నున్న, రూపేణ = రూపముచేత, అప్రతిమామ్ = సాటి లేని, తామ్ = ఆ, మేనకామ్ = మేనకను, దదర్శ = చూచెను.

తా. మహాతేజశ్శాలి యగు విశ్వామిత్రుడు, ఆ పుష్కరతీర్థములో, మేఘములో మెరుపు వలె నున్న, సాటి లేని రూపము గల ఆ మేనకను చూచెను.

మూ. దృష్ట్వా కన్దర్పవశగో మునిస్తామిదమబ్రవీత్,

అప్సరః స్వాగతం తేఽస్తు వస చేహ మమాశ్రమే, 6

అనుగృహ్ణీష్వ భద్రం తే మదనేన సుమోహితమ్.

ప్ర. అ. దృష్ట్వా = చూచి, మునిః = ముని, కన్దర్పవశగః = మన్మథునకు వశమైనవాడై, తామ్ = ఆమెను గూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను. అప్సరః = ఓ అప్సరసా!, తే = నీకు, స్వాగతమ్ అస్తు = స్వాగత మగు గాక. మమ = నాయొక్క, ఇహ = ఈ, ఆశ్రమే = ఆశ్రమమునందు, వస చ = నివసింపుము. మదనేన = మన్మథునిచేత, సుమోహితమ్ = అధికముగా మోహితుడ నైన నన్ను, అనుగృహ్ణీష్వ = అనుగ్రహింపుము. తే = నీకు, భద్రమ్ = క్షేమ మగుగాక.

తా. ఆమెను చూడగనే కామపరవశు డైన విశ్వామిత్రుడు ఆమెతో ఇట్లనెను — ఓ అప్సరసా! నీకు స్వాగతము. నా యీ ఆశ్రమములో నివసింపుము. మన్మథునిచే మిక్కిలి మోహితుడ నైన నన్ను అనుగ్రహింపుము. నీకు క్షేమ మగుగాక.’’

మూ. ఇత్యుక్తా సా వరారోహా తత్ర వాసమథాకరోత్. 7

తస్యాం వసన్త్యాం వర్షాణి పఞ్చ పఞ్చ చ రాఘవ,

విశ్వామితాశ్రమే రామ సుఖేన వ్యతిచక్రముః. 8

ప్ర. అ. రాఘవ = రామా!, సా = ఆ, వరారోహా = స్త్రీ, ఇతి = ఇట్లు, ఉక్తా = పలుకబడినదై, అథ = పిమ్మట, తత్ర = అచట, వాసమ్ = నివాసమును, అకరోత్ = చేసెను. రామ = రామా! తస్యామ్ = ఆమె, విశ్వామిత్రాశ్రమే = విశ్వామిత్రుని ఆశ్రమమునందు, వసన్త్యామ్ = నివసించుచుండగా, పఞ్చ పఞ్చ చ = పది, వర్షాణి = సంవత్సరములు, సుఖేన = సుఖముగా, వ్యతిచక్రముః = గడచి పోయినవి.

తా. విశ్వామిత్రు డిట్లు పలుకగా ఆ అప్సరస అచట నివసించెను. ఆమె విశ్వామిత్రాశ్రమములో నివసించుచుండగా పది సంవత్సరములు సుఖముగ గడచిపోయినవి.

మూ. అథ కాలే గతే తస్మిన్విశ్వామిత్రో మహామునిః,

సవ్రీళ ఇవ సంవృత్తశ్చిన్తాశోకపరాయణః. 9

ప్ర. అ. అథ = పిమ్మట, తస్మిన్ కాలే = ఆ (పది సంవత్సరముల) కాలము, గతే = గడచిపోయిన దగుచుండగా, మహామునిః = మహాముని యైన, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, చిన్తాశోకపరాయణః = చింతాశోకములతో కూడినవాడై, సవ్రీళ ఇవ = సిగ్గు కలవాడుగా, సంవృత్తః = అయినాడు.

తా. పది సంవత్సరములు గడచిన తరువాత విశ్వామిత్రమహాముని చింతాదుఃఖములతో నిండినవాడై సిగ్గుపడెను.

మూ. బుద్ధిర్మునేః సముత్పన్నా సామర్షా రఘునన్దన,

సర్వం సురాణాం కర్మైతత్తపోపహరణం మహత్. 10

ప్ర. అ. రఘునన్దన = రామా!, మునేః = మునికి, సామర్షా = కోపముతో కూడిన, బుద్ధిః = బుద్ధి, సముత్పన్నా = పుట్టినది. ఏతత్ సర్వమ్ = ఇది యంతయు, మహత్ = గొప్ప దైన, తపోపహరణమ్ = తపస్సును అపహరించు, సురాణామ్ = దేవతలయొక్క, కర్మ = కర్మ.

తా. రామా! అపుడు విశ్వామిత్రునకు కోపముతో కూడిన ఆలోచన ఒకటి కలిగినది -- ‘‘ఇది అంతయు, నా తపస్సు హరించుటకై దేవతలు చేసిన పని.’’

మూ. అహోరాత్రాపదేశేన గతాః సంవత్సరా దశ,

కామమోహాభిభూతస్య విఘ్నోఽయం సముపస్థితః. 11

ప్ర. అ. కామమోహాభిభూతస్య = కామమోహములచేత ఆవహింపబడిన నాకు, దశ సంవత్సరాః = పది సంవత్సరములు, అహోరాత్రాపదేశేన = పగళ్లు రాత్రులు అను మిషచేత, గతాః = గడచిపోయినవి. ఆయమ్ = ఈ, విఘ్నః = విఘ్నము, సముపస్థితః = వచ్చినది.

తా. పగలు, రాత్రి అని అనుకొనుచుండగనే కామమోహములో చిక్కుకొనియున్న నాకు పది సంవత్సరములు గడచిపోయినవి. ఈ విధముగ పెద్ద విఘ్నము వచ్చి పడినది.

మూ. వినిశ్శ్వసన్మునివరః పశ్చాత్తాపేన దుఃఖితః,

భీతామప్సరసం దృష్ట్వా వేపన్తీం ప్రాఞ్జలిం స్థితామ్. 12

మేనకాం మధురైర్వాకైర్విసృజ్య కుశికాత్మజః,

ఉత్తరం పర్వతం రామ విశ్వామిత్రో జగామ హ. 13

ప్ర. అ. రామ = రామా!, మునివరః = మునిశ్రేష్ఠుడైన, కుశికాత్మజః = కుశికుని కుమారు డైన, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, పశ్చాత్తాపేన = పశ్చాత్తాపముచేత, దుఃఖితః = దుఃఖించిన వాడై, వినిశ్శ్వసన్ = నిట్టూర్చుచు, భీతామ్ = భయపడినదియు, ప్రాఞ్జలిం స్థితామ్ = దోసిలికట్టి నిలచినదియు, వేపన్తీమ్ = వణకుచున్నదియు, అప్సరసమ్ = అప్సరస యైన, మేనకామ్ = మేనకను, దృష్ట్వా = చూచి, మధురైః = మధురము లైన, వాక్యైః = వాక్యముల చేత, విసృజ్య = విడచి, ఉత్తరం పర్వతమ్ = హిమవత్పర్వతమును గూర్చి, జగామ హ = వెళ్లెను.

తా. రామా! విశ్వామిత్రమహాముని పశ్చాత్తాపముచే పీడితుడై, నిట్టూర్చుచున్నవాడై, తన ఎదుట అంజలి ఘటించి వణకుచు నిలచిన మేనక భయపడినదని గ్రహించి, ఆమెని తీయని మాటలతో పంపివేసి, హిమవత్పర్వతమునకు వెళ్లెను.

మూ. స కృత్వా నైష్ఠికీం బుద్ధిం జేతుకామో మహాయశాః,

కౌశికీతీరమాసాద్య తపస్తేపే సుదారుణమ్. 14

ప్ర. అ. మహాయశాః = గొప్ప కీర్తి గల, సః = ఆతడు, నైష్ఠికీమ్ = నిష్ఠకు సంబంధించిన, బుద్ధిమ్ = బుద్ధిని, కృత్వా = చేసి, జేతుకామః = జయింపవలె నను కోరిక గలవాడై, కౌశికీతీరమ్ = కౌశికీనదీతీరమును, ఆసాద్య = పొంది, సుదారుణమ్ = మిక్కిలి భయంకర మైన, తపః = తపస్సును, తేపే = చేసెను.

తా. విశ్వామిత్రుడు నిష్ఠ నవలంబింపవలె నని దృఢనిశ్చయము చేసికొని, ఇంద్రియములను (లేదా వసిష్ఠుని) జయింపగోరుచున్నవాడై, కౌశికీనదీతీరము చేరి అతితీవ్ర మైన తపస్సు చేసెను.

మూ. తస్య వర్షసహస్రం తు ఘోరం తప ఉపాసతః,

ఉత్తరే పర్వతే రామ దేవతానామభూద్భయమ్. 15

ప్ర. అ. రామ = రామా!, తస్య = అతడు, ఉత్తరే పర్వతే = హిమవత్పర్వతముమీద, వర్షసహస్రమ్ = వేయిసంవత్సరములు, ఘోరమ్ = ఘోర మైన, తపః = తపస్సు, ఉపాసతః = చేయుచుండగా, దేవతానామ్ = దేవతలకు, భయమ్ = భయము, అభూత్ = కలిగెను.

తా. విశ్వామిత్రుడు హిమవత్పర్వతముపై వేయి సంవత్సరముల పాటు ఘోరమైన తపస్సు చేయుచుండగా దేవతలకు భయము కలిగెను.

మూ. ఆమన్త్రయన్ సమాగమ్య సర్వే సర్షిగణాః సురాః,

మహర్షిశబ్దం లభతాం సాధ్వయం కుశికాత్మజః. 16

ప్ర. అ. సర్షిగణాః = ఋషిగణములతో కూడిన, సర్వే = సమస్త మైన, సురాః = దేవతలు, సమాగమ్య = కలిసి, అయమ్ = ఈ, కుశికాత్మజః = విశ్వామిత్రుడు, సాధు = బాగుగా, మహర్షిశబ్దమ్ = మహర్షి అను పేరును, లభతామ్ = పొందుగాక అని, ఆమంత్రయన్ = ఆలోచించిరి.

తా. ఋషులును, దేవత లందరును కలిసి ఈ విశ్వామిత్రుని ‘‘మహర్షి’’ అనవచ్చును అని నిశ్చయించిరి.

మూ. దేవతానాం వచః శ్రుత్వా సర్వలోకపితామహః,

అబ్రవీన్మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనమ్. 17

ప్ర. అ. సర్వలోకపితామహః = బ్రహ్మదేవుడు, దేవతానామ్ = దేవతలయొక్క, వచః = వాక్యమును, శ్రుత్వా = విని, తపోధనమ్ = తపస్సే ధనముగా గల, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి, మధురమ్ = మధుర మైన, వాక్యమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. దేవతల అభిప్రాయము ననుసరించి బ్రహ్మదేవుడు, విశ్వామిత్రునితో మధుర మైన వాక్యము పలికెను.

మూ. మహర్షే స్వాగతం వత్స తపసోగ్రేణ తోషితః,

మహత్త్వమృషిముఖ్యత్వం దదామి తవ కౌశిక. 18

ప్ర. అ. మహర్షే = మహర్షీ!, వత్స = నాయనా! స్వాగతమ్ = స్వాగతమగుగాక. ఉగ్రేణ = ఉగ్ర మైన, తపసా = తపస్సుచేత, తోషితః = సంతోషింప చేయబడితిని. కౌశిక = విశ్వామిత్రా!, తవ = నీకు, మహత్త్వమ్ = గొప్పతనమును, ఋషిముఖ్యత్వమ్ = ఋషులలో శ్రేష్ఠత్వమును, దదామి = ఇచ్చుచున్నాను.

తా. మహర్షీ! నీవు చేసిన ఉగ్ర తపస్సుకు సంతోషించినాను. నీకు మహత్త్వమును, ఋషిత్వమును, (అనగా మహర్షిత్వమును) ఇచ్చుచున్నాను.

మూ. బ్రహ్మణః స వచః శ్రుత్వా సర్వలోకేశ్వరస్య హ,

న విషణ్ణో న సన్తుష్టో విశ్వామిత్రస్తపోధనః. 19

ప్ర. అ. తపోధనః = తపోధనుడైన, సః = ఆ, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, సర్వలోకేశ్వరస్య = సర్వలోకాధిపతి యైన, బ్రహ్మణః = బ్రహ్మయొక్క, వచః = వాక్కును, శ్రుత్వా = విని, న విషణ్ణః = విషాదము పొందలేదు, న సన్తుష్టః = సంతోషించ లేదు.

తా. సర్వలోకాధీశ్వరు డైన బ్రహ్మ మాటలను విన్న ఆ విశ్వామిత్ర మహామునికి విషాదము కలుగలేదు. సంతోషము కలుగలేదు.

మూ. ప్రాఞ్జలిః ప్రణతో భూత్వా సర్వలోకపితామహమ్,

ప్రత్యువాచ తతో వాచం విశ్వామిత్రో మహామునిః. 20

ప్ర. అ. తతః = పిమ్మట, మహామునిః = మహాముని యైన, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, ప్రాఞ్జలిః = కట్టబడిన దోసిలి కలవాడై, ప్రణతః = నమ్రుడుగా, భూత్వా = అయి, సర్వలోకపితామహమ్ = బ్రహ్మదేవుని గూర్చి, వాచమ్ = వాక్యమును, ప్రత్యువాచ = తిరిగి పలికెను.

తా. పిమ్మట ఆ విశ్వామిత్ర మహాముని అంజలి ఘటించి, నమ్రుడై బ్రహ్మదేవునితో ఇట్లనెను.

మూ. మహర్షిశబ్దమతులం స్వార్జితైః కర్మభిః శుభైః,

యది మే భగవానాహ తతోఽహం విజితేన్ద్రియః. 21

ప్ర. అ. భగవాన్ = పూజ్యుడ వైన నీవు, స్వార్జితైః = నాచే చేయబడిన, శుభైః = శుభములైన, కర్మభిః = కర్మలచేత, అతులమ్ = సాటిలేని, మహర్షి శబ్దమ్ = మహర్షిఅను పేరును, మే = నాకు, ఆహ యది = చెప్పినట్లయితే, తతః = అందువలన, అహమ్ = నేను, విజితేన్ర్దియః = జయింపబడిన ఇంద్రియములు కలవాడను.

తా. నేను చేసిన శుభకర్మలచే నాకు మహర్షిత్వము లభించిన దని పూజ్యుడ వైన నీవు చెప్పుచున్నావు కదా. అందుచే నేను జితేంద్రియుడ నైతిని.

మూ. తమువాచ తతో బ్రహ్మా న తావత్త్వం జితేన్ద్రియః,

యతస్వ మునిశార్దూల ఇత్యుక్త్వా త్రిదివం గతః. 22

ప్ర. అ. తతః = పిమ్మట, బ్రహ్మా = బ్రహ్మ, తమ్ = ఆతనిని, గూర్చి, ఉవాచ = పలికెను. త్వమ్ = నీవు, జితేన్ద్రియస్తావత్ = ఇంద్రియములను జయించినవాడవు మాత్రము, న = కాదు. మునిశార్దూల = ఓ మునిశ్రేష్ఠుడా! యతస్వ = ఇంకను ప్రయత్నింపుము. ఇతి = ఇట్లు, ఉక్త్వా = పలికి, త్రిదివమ్ = స్వర్గమును గూర్చి, గతః = వెళ్లెను.

తా. ‘‘నీవు జితేంద్రియుడవు మాత్రము కావు. ఇంకను ప్రయత్నింపుము’’ అని బ్రహ్మ విశ్వామిత్రునితో పలికి స్వర్గమునకు వెళ్లెను.

మూ. విప్రస్థితేషు దేవేషు విశ్వామిత్రో మహామునిః,

ఊర్ధ్వబాహుర్నిరాలమ్బో వాయుభక్షస్తపశ్చరన్. 23

ప్ర. అ. దేవేషు = దేవతలు, విప్రస్థితేషు సత్సు = ప్రయాణ మైనవా రగు చుండగా, మహామునిః = మహాముని యైన, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, ఊర్ధ్వబాహుః = పైకి ఎత్తబడిన బాహువులు కలవాడై, నిరాలంబః = ఆలంబనము (ఊత) లేనివాడై, వాయుభక్షః = వాయువును భక్షించుచున్నవాడై, తపః చరన్ = తపస్సు చేయుచు ఉండెను.

తా. దేవత లందరును వెడలిపోయిన పిమ్మట, విశ్వామిత్ర మహాముని, చేతులు పైకెత్తి ఆలంబన మేదియు లేకుండ నిలచి, వాయువును మాత్రమే ఆహారముగ గొని తపస్సు చేయ మొదలిడెను.

మూ. ఘర్మే పఞ్చతపా భూత్వా వర్షాస్వాకాశసంశ్రయః,

శిశిరే సలిలస్థాయీ రాత్య్రహాని తపోధనః. 24

ఏవం వర్షసహస్రం హి తపో ఘోరముపాగమత్.

ప్ర. అ. తపోధనః = ఆ విశ్వామిత్రమహర్షి, ఘర్మే = గ్రీష్మర్తువు నందు, పఞ్చతపాః = అయిదు అగ్నుల మధ్య తపస్సు చేయువాడు, భూత్వా = అయి, వర్షాసు = వర్షకాలమునందు, ఆకాశసంశ్రయః = బయటనే నివసించుచు, శిశిరే = శిశిరర్తువునందు, రాత్య్రహాని = రేయింబగళ్లు, సలిలస్థాయీ = నీటిలో నిలచినవాడై, ఏవమ్ = ఈ విధముగా, వర్షసహస్రమ్ = వేయి సంవత్సరములు, ఘోరమ్ = ఘోరమైన, తపః = తపస్సును, ఉపాగమత్ = పొందెను.

తా. విశ్వామిత్రమహర్షి గ్రీష్మమునందు పంచాగ్నిమధ్య తపస్సు చేయుచు, వర్షాకాలము నందు ఆరుబైటనే వసించుచు, శీతకాలమున రేయింబగళ్లు జలమునందు నిలచుచు, వేయి సంవత్సరములపాటు ఘోరతపస్సు చేసెను.

మూ. తస్మిన్ సంతప్యమానే తు విశ్వామిత్రే మహామునౌ,

సంభ్రమః సుమహానాసీత్సురాణాం వాసవస్య చ. 25

ప్ర. అ. మహామునౌ = మహాముని యైన, తస్మిమ్ = ఆ, విశ్వామిత్రే = విశ్వామిత్రుడు, సంతప్యమానే = తపము చేయుచుండగా, సురాణామ్ = దేవతలకును, వాసవస్య చ = దేవేంద్రునకును, సుమహాన్ = చాల గొప్ప దైన, సంభ్రమః = భయము, ఆసీత్ = కలిగెను.

తా. విశ్వామిత్రమహాముని ఈ విధముగ తపస్సు చేయుట చూచి దేవేంద్రుడును, దేవతలును చాల భయపడిరి.

మూ. రమ్భామప్సరసం శక్రః సహ సర్వైర్మరుద్గణైః,

ఉవాచాత్మహితం వాక్యమహితం కౌశికస్య చ. 26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే త్రిషష్టితమః సర్గః

ప్ర. అ. శక్రః = దేవేంద్రుడు, సర్వైః = సమస్త మైన, మరుద్గణైః సహ = దేవతాగణములతో కూడినవాడై, ఆత్మహితమ్ = తనకు హిత మైనదియు, కౌశికస్య = విశ్వామిత్రునకు, అహితం చ = హితము కానిదియు అగు, వాక్యమ్ = వాక్యమును, రమ్భామ్ = రంభ అనెడు, అప్సరసమ్

= అప్సరస్త్రీని గూర్చి, ఉవాచ = పలికెను.

తా. సకలదేవతాసమేతు డైన దేవేంద్రుడు రంభ యను అప్సరసతో, తనకు హితకరమును, విశ్వామిత్రునకు అహితకరమును అగు వాక్యము పలికెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో అరువది మూడవ సర్గ సమాప్తము.