| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 70 |
| Pages | 5 |
| Read Time | 8 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ చతుఃషష్టితమః సర్గః
తన తపస్సుకు భంగము చేయుటకై వచ్చిన రంభను శపించి విశ్వామిత్రుడు ఘోరతపస్సు చేసెద నని శపథము చేయుట.
మూ. సురకార్యమిదం రమ్భే కర్తవ్యం సుమహత్త్వయా,
లోభనం కౌశికస్యేహ కామమోహసమన్వితమ్. 1
ప్ర. అ. రమ్భే = ఓ రంభా!, ఇహ = ఇప్పుడు, కౌశికస్య = విశ్వామిత్రునియొక్క, (విశ్వామిత్రుని), కామమోహసమన్వితమ్ = కామముచే కలిగిన మోహముతో కూడుకున్నట్లుగా, లోభనమ్ = లోభపెట్టుట యనెడు, సుమహత్ = చాల గొప్ప దైన, ఇదమ్ = ఈ, సురకార్యమ్ = దేవతాకార్యము, త్వయా = నీచేత, కర్తవ్యమ్ = చేయదగినది.
తా. రంభా! విశ్వామిత్రుని కామమోహితుని చేసి ఆశ కల్పించ వలెను. ఈ గొప్ప దేవతాకార్యమును నీవు చేయవలెను.
మూ. తథోక్తా సాప్సరా రామ సహస్రాక్షేణ ధీమతా,
వ్రీళితా ప్రాఞ్జలిర్వాక్యం ప్రత్యువాచ సురేశ్వరమ్. 2
ప్ర. అ. రామ = రామా!, ధీమతా = బుద్ధిమంతు డైన, సహస్రాక్షేణ = దేవేంద్రునిచేత, తథా = ఆ విధముగా, ఉక్తా = పలుకబడిన, సా = ఆ, అప్సరాః = అప్సరస, వ్రీళితా = సిగ్గుపడు చున్నదై, ప్రాఞ్జలిః = కట్టబడిన దోసిలి కలదై, సురేశ్వరమ్ = దేవేంద్రుని గూర్చి, వాక్యమ్ = వాక్యమును, ప్రత్యువాచ = తిరిగి పలికెను.
తా. రామా! ధీమంతు డైన దేవేంద్రుని మాటలు విని రంభ సిగ్గుపడుచు, చేతులు జోడించి ఆతనితో ఇట్లు పలికెను.
మూ. అయం సురపతే ఘోరో విశ్వామిత్రో మహామునిః,
ఘోరముత్సృజతే క్రోధం మయి దేవ న సంశయః. 3
తతో హి మే భయం దేవ ప్రసాదం కర్తు మర్హసి.
ప్ర. అ. సురపతే = ఓ దేవేంద్రా!, అయమ్ = ఈ, మహామునిః = మహాముని యైన, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, ఘోరః = భయంకరుడు. దేవ = ప్రభూ! మయి = నా యందు, ఘోరమ్ = భయంకర మైన, క్రోధమ్ = క్రోధమును, ఉత్సృజతే = విడచును. సంశయః = సంశయము, న = లేదు, తతః = ఆ కారణమువలన, మే = నాకు, భయమ్ = భయము. దేవ = ప్రభూ!, ప్రసాదమ్ = అనుగ్రహమును, కర్తుమ్ = చేయుటకు, అర్హసి = తగియున్నావు.
తా. ఓ సురాధీశా! విశ్వామిత్రమహాముని చాల కోపస్వభావుడు. నాపై తప్పక తన క్రోధమును చూపి నన్ను శపించగలడు. అందుచే నాకు భయము కలుగుచున్నది. నన్ను అనుగ్రహింపుము.
మూ. ఏవముక్తస్తయా రామ రమ్భయా భీతయా తదా,
తామువాచ సహస్రాక్షో వేపమానాం కృతాఞ్జలిమ్. 4
ప్ర. అ. రామ = రామా!, భీతయా = భయపడిన, తయా = ఆ రమ్భయా = రంభచేత, తదా = అప్పుడు, ఏవమ్ = ఇట్లు, ఉక్తః = పలుకబడిన, సహస్రాక్షః = దేవేంద్రుడు, వేపమానామ్ = వణకుచున్నదియు, కృతాఞ్జలిమ్ = కట్టబడిన దోసిలి గలదియు అగు, తామ్ = ఆమెను గూర్చి, ఉవాచ = పలికెను.
తా. రామా! రంభ భయముతో వణకుచు, చేతులు జోడించి పలికిన మాటలు విని దేవేంద్రు డిట్లు పలికెను.
మూ. మాభైషీ రమ్భే భద్రం తే కురుష్వ మమ శాసనమ్, 5
కోకిలో హృదయగ్రాహీ మాధవే రుచిరద్రుమే,
అహం కన్దర్పసహితః స్థాస్యామి తవ పార్శ్వతః. 6
ప్ర. అ. రమ్బే = ఓ రంభా! మా భైషీః = భయపడకుము. తే = నీకు, భద్రమ్ = క్షేమ మగుగాక, మమ = నాయొక్క, శాసనమ్ = ఆజ్ఞను, కురుష్వ = చేయుము. అహమ్ = నేను, రుచిరద్రుమే = అంద మైన వృక్షములు గల, మాధవే = వసంతర్తువునందు, హృదయగ్రాహీ = హృదయము నాకర్షించు, కోకిలః = కోకిలగా అయి, కన్దర్పసహితః = మన్మథసమేతుడనై, తవ = నీ యొక్క, పార్శ్వతః = పార్శ్వమునందు, స్థాస్యామి = ఉండగలను.
తా. ఓ రంభా! భయపడకుము. నీకు క్షేమ మగును. నా శాసనమును చేయుము. అంద మైన వృక్షములు గల వసంతర్తువునందు కోకిల రూపము ధరించి, నేను మన్మథునితో కూడ నీ ప్రక్కనే ఉందును.
మూ. త్వం హి రూపం బహుగుణం కృత్వా పరమభాస్వరమ్,
తమృషిం కౌశికం రమ్భే భేదయస్వ తపస్వినమ్. 7
ప్ర. అ. రమ్భే = రంభా!, త్వమ్ = నీవు, బహుగుణమ్ = అనేక శృంగార చేష్టాదిగుణములు గల, పరమభాస్వరమ్ = మిక్కిలి ప్రకాశించుచున్న, రూపమ్ = రూపమును, కృత్వా = చేసికొని, తపస్వినమ్ = తపశ్శాలి యైన, తమ్ = ఆ, ఋషిమ్ = ఋషియైన, కౌశికమ్ = విశ్వామిత్రుని, భేదయస్వ = (తపస్సునుండి) విడదీయుము.
తా. ఓ రంభా! అనేక శృంగారచేష్టాదిగుణములు గల, చాల ప్రకాశించు రూపము వహించి విశ్వామిత్రమహర్షి తపస్సుకు భంగము చేయుము.
మూ. సా శ్రుత్వా వచనం తస్య కృత్వా రూపమనుత్తమమ్,
లోభయామాస లలితా విశ్వామిత్రం శుచిస్మితా. 8
ప్ర. అ. సా = ఆమె, తస్య = అతనియొక్క, వచనమ్ = వచనమును, శ్రుత్వా = విని, అనుత్తమమ్ = అత్యుత్తమ మైన, రూపమ్ = రూపమును, కృత్వా = చేసి, లలితా = సుందర మైనదై, శుచిస్మితా = తెల్లని చిరునవ్వు గలదై, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని, లోభయామాస = లోభపెట్టెను.
తా. రంభ దేవేంద్రుని మాటలు విని అత్యుత్తమ మైన రూపమును ధరించి, సౌందర్యవతియై తెల్లని చిరునవ్వు నవ్వుచు విశ్వామిత్రుని లోభింప చేసెను
మూ. కోకిలస్య చ శుశ్రావ వల్గు వ్యాహరతః స్వనమ్,
సంప్రహృష్టేన మనసా తత ఏనాముదైక్షత. 9
ప్ర. అ. వల్గు = మధురముగా, వ్యాహరతః = కూయుచున్న, కోకిలస్య = కోకిలయొక్క, స్వనమ్ = ధ్వనిని, శుశ్రావ = వినెను. తతః = పిమ్మట, సంప్రహృష్టేన = సంతసించిన, మనసా = మనస్సుతో, ఏనామ్ = ఈమెను, ఉదైక్షత = చూచెను.
తా. విశ్వామిత్రుడు కోకిలయొక్క మధురధ్వనిని విని, సంతసించిన మనస్సుతో రంభను చూచెను.
మూ. అథ తస్య చ శబ్దేన గీతేనాప్రతిమేన చ,
దర్శనేన చ రమ్భాయా మునిస్సన్దేహమాగతః. 10
ప్ర. అ. అథ = పిమ్మట, తస్య = ఆ కోకిలయొక్క, శబ్దేన = కూతచేతను, అప్రతిమేన = సాటిలేని, గీతేన = గానముచేతను, రమ్భాయాః = రంభయొక్క, దర్శనేన చ = దర్శనము చేతను, మునిః = ముని, సన్దేహమ్ = సందేహమును, ఆగతః = పొందెను.
తా. కోకిలధ్వనియు, మధుర మైన సంగీతధ్వనియు వినబడిన పిమ్మట రంభ కనబడగనే విశ్వామిత్రునకు సందేహము కలిగెను.
మూ. సహస్రాక్షస్య తత్కర్మ విజ్ఞాయ మునిపుఙ్గవః,
రమ్భాం క్రోధసమావిష్టః శశాప కుశికాత్మజః. 11
ప్ర. అ. మునిపుఙ్గవః = మునిశ్రేష్ఠుడైన, కుశికాత్మజః = విశ్వామిత్రుడు, తత్ = దానిని, సహస్రాక్షస్య = ఇంద్రునియొక్క, కర్మ = పనినిగా, విజ్ఞాయ = తెలుసుకొని, క్రోధసమావిష్టః = క్రోధముతో కూడినవాడై, రమ్భామ్ = రంభను, శశాప = శపించెను.
తా. ఇదంతయు ఇంద్రుడు చేసిన పని యని తెలిసికొని విశ్వామిత్ర మహాముని రంభను ఇట్లు శపించెను.
మూ. యన్మాం లోభయసే రమ్భే కామక్రోధజయైషిణమ్,
దశవర్షసహస్రాణి శైలీ స్థాస్యసి దుర్భగే. 12
ప్ర. అ. దుర్భగే = దౌర్భాగ్యవంతురాలైన, రమ్భే = ఓ రంభా!, కామక్రోధ జయైషిణమ్ = కామక్రోధములను జయింపవలె నని కోరుచున్న, మామ్ = నన్ను, యత్ = ఎందువలన, లోభయసే = లోభపెట్టుచున్నావో, అందువలన, దశ = పది, వర్షసహస్రాణి = వేల సంవత్సరములు, శైలీ = ఱాయిగా, స్థాస్యసి = ఉండగలవు.
తా. దౌర్భాగ్యవంతురాల వైన ఓ రంభా! కామక్రోధములను జయించవలె నని కోరుచున్న నన్ను లోభపెట్టుటకు ప్రయత్నించితివి గాన పదివేల సంవత్సరములు ఱాతిబండవై పడియుందువుగాక.
మూ. బ్రాహ్మణః సుమహాతేజాస్తపోబలసమన్వితః,
ఉద్ధరిష్యతి రమ్భే త్వాం మత్క్రోధకలుషీకృతామ్. 13
ప్ర. అ. రమ్భే = రంభా!, సమహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును, తపోబలసమన్వితః = తపోబలముతో కూడినవాడును అగు, బ్రాహ్మణః = బ్రాహ్మణుడు, మత్క్రోధకలుషీకృతామ్ = నా క్రోధముచే పీడింపబడిన, త్వామ్ = నిన్ను, ఉద్ధరిష్యతి = ఉద్ధరించగలడు.
తా. ఓ రంభా! నా కోపమునకు గురి యైన నిన్ను, గొప్ప తేజస్సు కలవాడును, తపోబల సంపన్నుడును అగు ఒక బ్రాహ్మణుడు ఉద్ధరించగలడు.
మూ. ఏవముక్త్వా మహాతేజా విశ్వామిత్రో మహామునిః,
అశక్నువన్ ధారయితుం క్రోధం సన్తాపమాగతః. 14
ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును, మహామునిః = గొప్ప మునియు అగు, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, క్రోధమ్ = క్రోధమును, ధారయితుమ్ = నిగ్రహించుకొనుటకు, అశక్నువన్ = సమర్థుడు కానివాడై, ఏవమ్ = ఇట్లు, ఉక్త్వా = పలికి, సన్తాపమ్ = చింతను, ఆగతః = పొందెను.
తా. విశ్వామిత్రమహాముని కోపము పట్టలేక రంభను ఈ విధముగ శపించి, పశ్చాత్తాపము పొందెను.
మూ. తస్య శాపేన మహతా రమ్భా శైలీ తదాభవత్,
వచః శ్రుత్వా తు కన్దర్పో మహర్షేః స చ నిర్గతః. 15
ప్ర. అ. తదా = అప్పుడు, మహతా = గొప్ప దైన, తస్య = ఆతనియొక్క, శాపేన = శాపముచేత, రమ్భా = రంభ, శైలీ = ఱాయిగా, అభవత్ = ఆయెను. మహర్షేః = మహర్షియొక్క, వచః = వచనమును, శ్రుత్వా = విని, కన్దర్పః = మన్మథుడును, సః చ = ఆ దేవేంద్రుడును, నిర్గతః = వెడలిపోయిరి.
తా. ఆతని శాపముచేత రంభ వెంటనే శిల ఐపోయెను. మహర్షి మాటలు విని మన్మథుడును, ఇంద్రుడును పారిపోయిరి.
మూ. కోపేన స మహాతేజాస్తపోపహరణే కృతే,
ఇన్ద్రియైరజితై రామ న లేభే శాన్తిమాత్మనః. 16
ప్ర. అ. రామ = రామా!, మహాతేజాః = గొప్ప తేజస్సు గల, సః = అతడు, కోపేన = కోపముచేత, తపోపహరణే = తపస్సుయొక్క హరణము, కృతే = చేయబడిన దగుచుండగా, అజితైః = జయింపబడని, ఇన్ద్రియైః = ఇంద్రియములచేత, ఆత్మనః = మనస్సుయొక్క, శాన్తిమ్ = శాంతిని, న లేభే = పొందలేదు.
తా. ఇట్లు కోపము కలుగుటచే తపస్సు క్షీణింపగా మహాతేజశ్శాలి యగు ఆ విశ్వామిత్రుడు, ఇంద్రియములను జయించకపోవుటచే మనఃశాంతి పొందజాలక పోయెను.
మూ. బభూవాస్య మనశ్చిన్తా తపోఽపహరణే కృతే,
నైవ క్రోధం గమిష్యామి న చ వక్ష్యే కథంచన. 17
ప్ర. అ. తపోపహరణే = తపస్సుయొక్క హరణము, కృతే = చేయబడినదగుచుండగా, అస్య = ఈతనికి, మనశ్చిన్తా = మనస్సులో ఆలోచన, బభూవ = ఆయెను. క్రోధమ్ = కోపమును, నైవ గమిష్యామి = పొందను. కథంచన = ఎట్లైనను, న చ వక్ష్యే = మాటలాడను కూడ.
తా. ఇట్లు తపస్సు క్షీణించగా విశ్వామిత్రుడు ఈ విధముగ నిశ్చయించుకొనెను - ‘‘నేను కోపము చెందను. ఏమైనను మాట కూడ పలుకను.’’
మూ. అథవా నోచ్ఛ్వసిష్యామి సంవత్సరశతాన్యపి,
అహం విశోషయిష్యామి హ్యాత్మానం విజితేన్ద్రియః. 18
ప్ర. అ. అథవా = లేదా, సంవత్సరశతాన్యపి = నూరు సంవత్సరములైనను, నోచ్ఛ్వసిష్యామి = ఊపిరి విడువను, అహమ్ = నేను, విజితేన్ద్రియః = జయించబడిన ఇంద్రియములు కలవాడనై, ఆత్మానమ్ = శరీరమును, విశోషయిష్యామి = ఎండింప చేసెదను.
తా. ‘‘లేదా వందల కొలది సంవత్సరములు ఊపిరి విడవక ఉండి, జితేంద్రియుడనై శరీరమును శుష్కింపచేసెదను.’’
మూ. తావద్యావద్ధి మే ప్రాప్తం బ్రాహ్మణ్యం తపసార్జితమ్,
అనుచ్ఛ్వసన్నభుఞ్జానస్తిష్ఠేయం శాశ్వతీః సమాః. 19
న హి మే తప్యమానస్య క్షయం యాస్యన్తి మూర్తయః.
ప్ర. అ. మే = నాకు, తపసా = తపస్సుచేత, ఆర్జితమ్ = సంపాదింపబడిన, బ్రాహ్మణ్యమ్ = బ్రాహ్మణత్వము, యావత్ = ఎప్పటికి, ప్రాప్తమ్ = ప్రాప్తమగునో, తావత్ = అంతవరకు, అనుచ్ఛ్వసన్ = ఊపిరి విడవని వాడనై, అభుఞ్జానః = భుజించనివాడనై, శాశ్వతీః సమాః = శాశ్వత మైన సంవత్సరములు, తిష్ఠేయమ్ = ఉందును. తప్యమానస్య = తపస్సు చేయుచున్న, మే = నాయొక్క, మూర్తయః = అవయవములు, క్షయమ్ = క్షయమును, న యాస్యన్తి = పొందవు.
తా. ‘‘తపస్సుచేత నాకు బ్రాహ్మణ్యము లభించువరకును అనేక సంత్సరములు ఊపిరి విడవక, ఆహారమును పరిత్యజించి ఉండెదను. తపస్సు చేయునంతవరకును నా అవయవములు క్షీణింపవు.’’
మూ. ఏవం వర్షసహస్రస్య దీక్షాం స మునిపుఙ్గవః,
చకారాప్రతిమాం లోకే ప్రతిజ్ఞాం రఘునన్దన. 20
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే చతుష్షష్టితమః సర్గః
ప్ర. అ. రఘునన్దన = రామా!, సః = ఆ, మునిపుఙ్గవః = మునిశ్రేష్ఠుడు, ఏవమ్ = ఈ విధముగా, లోకే = లోకమునందు, అప్రతిమామ్ = సాటిలేని, వర్ష సహస్రస్య దీక్షామ్ = వేయి సంవత్సరములు దీక్షను గూర్చి, ప్రతిజ్ఞామ్ = ప్రతిజ్ఞను, చకార = చేసెను.
తా. రామా! ఆ విశ్వామిత్ర మహాముని, ఇట్లు, లోకములో ఎన్నడును కని విని ఎరుగని విధముగ వేయి సంవత్సరముల పాటు దీక్షను గూర్చి ప్రతిజ్ఞ చేసెను.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో అరువది నాల్గవ సర్గ సమాప్తము.
