Chapter_65

Back
Book Balakandamu
Chapter No 71
Pages 10
Read Time 15 Minutes

Chapter_65

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ పఞ్చషష్టితమః సర్గః

విశ్వామిత్రుడు ఘోరతపస్సు చేయగా ఆతనికి బ్రాహ్మణత్వము లభించుట. జనక మహారాజు విశ్వామిత్రుని ప్రశంసించి, ఆతని అనుజ్ఞ గైకొని తన నివాసమునకు వెళ్లుట.

మూ. అథ హైమవతీం రామ దిశం త్యక్త్వా మహామునిః,

పూర్వాం దిశమనుప్రాప్య తపస్తేపే సుదారుణమ్. 1

ప్ర. అ. రామ = రామా!, అథ = పిమ్మట, మహామునిః = విశ్వామిత్రుడు, హైమవతీమ్= హిమవత్పర్వతముతో సంబంధించిన, దిశమ్ = దిక్కును, త్యక్త్వా = విడచి, పూర్వాం దిశమ్ = తూర్పు దిక్కును, అనుప్రాప్తః = చేరిన వాడై, సుదారుణమ్ = చాల తీవ్ర మైన, తపః = తపస్సును, తేపే = చేసెను.

తా. రామా! అటుపిమ్మట విశ్వామిత్రమహాముని ఉత్తరదిక్కు విడచి తూర్పుదిక్కునకు వెళ్లి అచట అతితీవ్ర మైన తపస్సు చేసెను.

మూ. మౌనం వర్షసహస్రస్య కృత్వా వ్రతమనుత్తమమ్,

చకారాప్రతిమం రామ తపః పరమదుష్కరమ్. 2

ప్ర. అ. రామ = రామా!, వర్షసహస్రస్య = వేయి సంవత్సరముల యొక్క, అనుత్తమమ్ = గొప్ప దైన, మౌనం వ్రతమ్ = మౌనవ్రతమును, కృత్వా = చేసి, అప్రతిమమ్ = సాటి లేని, పరమదుష్కరమ్ = మిక్కిలి చేయ శక్యముకాని, తపః = తపస్సును, చకార = చేసెను.

తా. రామా! వేయి సంవత్సరముల పాటు చాల గొప్ప దైన మౌన వ్రతము నవలంబించి, చేయ శక్యము కానిదియు, సాటి లేనిదియు అగు తపస్సు చేసెను.

మూ. పూర్ణే వర్షసహస్రే తు కాష్ఠభూతం మహామునిమ్,

విఘ్నైర్బహుభిరాధూతం క్రోధో నాన్తర ఆవిశత్, 3

స కృత్వా నిశ్చయం రామ తప ఆతిష్ఠదవ్యయమ్.

ప్ర. అ. వర్షసహస్రే = వేయి సంవత్సరముల కాలము, పూర్ణే = నిండగా, కాష్ఠభూతమ్ = కట్టె వలె అయిన, మహామునిమ్ = మహామునిని, బహుభిః = అనేకమైన, విఘ్నైః = విఘ్నములచేత, ఆధూతమ్ = కదల్చి వేయబడినను, క్రోధః = క్రోధము, అన్తరే = హృదయమునందు, న అవిశత్ = ప్రవేశించలేదు. రామ = రామా!, సః = ఆతడు, నిశ్చయమ్ = నిశ్చయమును, కృత్వా = చేసి, అవ్యయమ్ = నాశములేని, తపః = తపస్సును, ఆతిష్ఠత్ = చేసెను.

తా. వేయి సంవత్సరములు నిండుసరికి విశ్వామిత్రుడు కట్టె వలె ఆయెను. ఎన్ని విఘ్నములు వచ్చినను ఆతని మనస్సులో క్రోధము కలుగలేదు. అతడు దృఢనిశ్చయముతో నాశము లేని తపస్సు చేసెను.

మూ. తస్య వర్షసహస్రస్య వ్రతే పూర్ణే మహావ్రతః, 4

భోక్తుమారబ్ధవానన్నం తస్మిన్ కాలే రఘూత్తమ,

ఇన్ద్రో ద్విజాతిర్భూత్వా తం సిద్ధమన్నమయాచత. 5

ప్ర. అ. రఘూత్తమ = రామా!, తస్య = ఆ, వర్షసహస్రస్య = వేయి సంవత్సరముల, వ్రతే = వ్రతము, పూర్ణే = పూర్ణ మైన దగుచుండగా, మహావ్రతః = గొప్ప నియమము గల ఆ విశ్వామిత్రుడు, అన్నమ్ = అన్నమును, భోక్తుమ్ = తినుటకు, ఆరబ్ధవాన్ = ప్రారంభించినాడు. తస్మిన్ = ఆ, కాలే = సమయమునందు, ఇన్ద్రః = ఇంద్రుడు, ద్విజాతిః = బ్రాహ్మణుడుగా, భూత్వా = అయి, తమ్ = ఆతనిని, సిద్ధమ్ = సిద్ధమై యున్న, అన్నమ్ = అన్నమును, అయాచత = కోరెను.

తా. రామా! వేయి సంవత్సరముల వ్రతము పూర్తి యైన పిమ్మట, మహావ్రతుడైన విశ్వామిత్రుడు అన్నము తినవలె నని అనుకొనుచుండగా ఇంద్రుడు బ్రాహ్మణ వేషమున వచ్చి, ఆ సిద్ధాన్నమును యాచించెను.

మూ. తస్మై దత్త్వా తదా సిద్ధం సర్వం విప్రాయ నిశ్చితః,

నిశ్శేషితేఽన్నే భగవానభుక్త్వైవ మహాతపాః, 6

న కించిదవదద్విప్రం మౌనవ్రతముపాస్థితః,

అథ వర్షసహస్రం వై నోచ్ఛ్యసన్మునిపుఙ్గవః. 7

ప్ర. అ. భగవాన్ = పూజ్యుడును, మహాతపాః = గొప్ప తపస్సు కలవాడును, మౌనవ్రతమ్ = మౌనవ్రతమును, ఉపాస్థితః = అవలంబించినవాడును అగు విశ్వామిత్రుడు, నిశ్చితః = దృఢ నిశ్చయము కలవాడై, తదా = అప్పుడు, సిద్ధమ్ = సిద్ధముగా నున్న, సర్వమ్ = ఆ అన్నమునంతను, తస్మె = ఆ, విప్రాయ = బ్రాహ్మణునకు, దత్త్వా = ఇచ్చి, అన్నే = అన్నము, నిశ్శేషితే = శేషములేకుండ భుజింపబడగా, అభుక్త్వైవ = తాను తినకుండగనే ఉండి, విప్రమ్ = ఆ బ్రాహ్మణుని గూర్చి, కించిత్ = ఏమియు, న అవదత్ = పలకలేదు. అథ = అటు పిమ్మట, మునిపుఙ్గవః = ఆ మునిశ్రేష్ఠుడు, వర్షసహస్రం = వేయి సంవత్సరముల పాటు, నోచ్ఛ్వసత్ = ఊపిరి పీల్చలేదు.

తా. మౌనవ్రత మవలంబించిన మహాతపఃశాలి యైన ఆ విశ్వామిత్రుడు సిద్ధాన్నము నంతను ఆ బ్రాహ్మణున కిచ్చివేసెను. అతడు పూర్తిగా భుజించెను. విశ్వామిత్రుడు భోజనము లేకయే ఉండిపోయెను. ఆ బ్రాహ్మణుని మాత్రము ఏమియు అనలేదు. పిదప వేయి సంవత్సరముల పాటు ఉచ్ఛ్వాసనిఃశ్వాసములను బంధించి తపస్సు చేసెను.

మూ. తస్యానుచ్ఛ్వసమానస్య మూర్ధ్ని ధూమో వ్యజాయత,

త్రైలోక్యం యేన సంభ్రాన్తమాదీపితమివాభవత్. 8

ప్ర. అ. అనుచ్ఛ్వసమానస్య = ఊపిరి పీల్చకుండ ఉన్న, తస్య = విశ్వామిత్రుని యొక్క, మూర్ధ్ని = శిరస్సుపై, ధూమః = ధూమము, వ్యజాయత = పుట్టెను, యేన = దేనిచేత, త్రైలోక్యమ్ = ముల్లోకములును, సంభ్రాన్తమ్ = భయపడినదై, ఆదీపితమివ = కాల్చబడినది వలె, అభవత్ = ఆయెను.

తా. విశ్వామిత్రు డా విధముగ ఉచ్ఛ్వాసనిశ్శ్వాసములను బంధించియుండగా ఆతని శిరస్సునుండి ధూమము బయలుదేరెను. దానిచే ముల్లోకములును దహింపబడి నట్లు అయి భయపడిపోయినవి.

మూ. తతో దేవాః సగన్ధర్వాః పన్నగాసురరాక్షసాః,

మోహితాస్తేజసా తస్య తపసా మన్దరశ్మయః, 9

కశ్మలోపహతాస్సర్వే పితామహమథాబ్రువన్.

ప్ర. అ. తతః = పిమ్మట, దేవాః = దేవతలును, సగన్ధర్వాః = గంధర్వులతో కూడిన, పన్నగాసురరాక్షసాః = పన్నగులు, అసురులు, రాక్షసులును, తస్య = తేజస్సుచేత, మోహితాః = మోహితులై, తపసా = తపస్సుచేత, మన్దరశ్మయః = మంద మైన కాంతి గలవారై, కశ్మలోపహతాః = దుఃఖముచే పీడితులై, అథ = పిమ్మట, సర్వే = అందరును, పితామహమ్ = బ్రహ్మదేవుని గూర్చి, అబ్రువన్ = పలికిరి.

తా. అపుడు దేవగంధర్వ పన్నగాసుర రాక్షసులు ఆ విశ్వామిత్రుని తేజస్సుచే తెలివి తప్పినవారై, ఆతని తపస్సుచే కాంతి తొలగినవారై, పీడితులై బ్రహ్మవద్దకు వెళ్లి ఇట్లు పలికిరి.

మూ. బహుభిః కారణైర్దేవ విశ్వామిత్రో మహామునిః,

లోభితః క్రోధితశ్చైవ తపసా చాభివర్ధతే. 10

ప్ర. అ. దేవ = బ్రహ్మదేవా! మహామునిః = మహాముని యైన, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, బహుభిః = అనేక మైన, కారణైః = కారణములచేత, లోభితః = లోభపెట్ట బడినను, క్రోధితశ్చెవ = కోపపెట్టబడినను, తపసా = తపస్సుచే, అభివర్ధతే = వృద్ధిపొందుచునే ఉన్నాడు.

తా. ప్రభూ! ఈ విశ్వామిత్ర మహామునిని అనేక విధముల లోభపెట్టినను, కోపము కలిగించినను, ఈతని తపస్సు వృద్ధిపొందుచునే ఉన్నది.

మూ. న హ్యస్య వృజినం కించిద్దృశ్యతే సూక్ష్మమప్యథ, 11

న దీయతే యది త్వస్య మనసా యదభీప్సితమ్,

వినాశయతి త్రైలోక్యం తపసా సచరాచరమ్. 12

ప్ర. అ. అథ = ఇంక, అస్య = ఈతనియొక్క, సూక్ష్మమపి = సూక్ష్మ మైన దైనను, వృజినమ్ = పాపము, కించిత్ = ఏదియు, న దృశ్యతే = కనబడుట లేదు. అస్య = ఇతని యొక్క, మనసా = మనస్సుచేత, యత్ = ఏది, అభీప్పితమ్ = కోరబడినదో అది, న దీయతే యది = ఇవ్వబడక పోయినచో, తపసా = తపస్సుచేత, సచరాచరమ్ = చరాచరములతో కూడిన, త్రైలోక్యమ్ = మూడులోకములను, వినాశయతి = నశింపచేయును.

తా. ఈతనిలో కొంచె మైనను పాపము కనబడుటలేదు. ఈతడు కోరిన వరము నీయకున్నచో తపస్సుచేత చరాచరాత్మక మగు లోకత్రయమును దహించివేయగలడు.

మూ. వ్యాకులాశ్చ దిశః సర్వా న చ కించిత్ప్రకాశతే,

సాగరాః క్షుభితాః సర్వే విశీర్యన్తే పర్వతాః. 13

ప్ర. అ. సర్వాః = సమస్తమైన, దిశః = దిక్కులు, వ్యాకులాః = వ్యాకుల మైనవి. కించిత్ = ఏమియు, న ప్రకాశతే = ప్రకాశించుటలేదు. సర్వే = సమస్త మైన, సాగరాః = సాగరములు, క్షుభితాః = క్షోభపడుచున్నవి. పర్వతాః = పర్వతములు, విశీర్యన్తే = బ్రద్దలగుచున్నవి.

తా. దిక్కు లన్నియు వ్యాకుల మైనవి. ఏమియు ప్రకాశించుటలేదు. సాగరములు క్షోభ చెందుచున్నవి. పర్వతములు బ్రద్దలగుచున్నవి.

మూ. ప్రకమ్పతే చ పృథివీ వాయుర్వాతి భృశాకులః,

బ్రహ్మన్న ప్రతిజానీమో నాస్తికో జాయతే జనః. 14

ప్ర. అ. బ్రహ్మన్ = ఓ బ్రహ్మదేవా!, పృథివీ చ = భూమి కూడ, ప్రకమ్పతే = కంపించు చున్నది. వాయుః = వాయువు, భృశాకులః = చాల వ్యాకుల మైనదై, వాతి = వీచుచున్నది. న ప్రతిజానీమః = ఏమి చేయవలెనో తెలియజాలకున్నాము. జనః = జనులు, నాస్తికః = నాస్తికులుగా, జాయతే = అగుచున్నారు.

తా. బ్రహ్మదేవా! భూమి కంపించుచున్నది. వాయువు చాల వ్యాకులముగ వీచుచున్నది. జనులందరును నాస్తికు లగుచున్నారు. మా కేమియు తోచకున్నది.

మూ. సంమూఢమివ త్రైలోక్యం సంప్రక్షుభితమానసమ్,

భాస్కరో నిష్ప్రభశ్చెవ మహర్షేస్తస్య తేజసా. 15

ప్ర. అ. త్రైలోక్యమ్ = మూడు లోకముల సముదాయము, సంప్రక్షుభిత మానసమ్ = క్షోభచెందిన మనస్సు కలదై, సంమూఢమివ = మూర్ఛ పొందినట్లున్నది. తస్య మహర్షేః = ఆ మహర్షియొక్క, తేజసా = తేజస్సుచేత, భాస్కరశ్చ = సూర్యుడు కూడ, నిష్ప్రభః = కాంతి విహీనుడుగా ఉన్నాడు.

తా. క్షోభించిన మనస్సుతో మూడు లోకములును మార్పు చెంది నట్లున్నవి. ఆ మహర్షి తేజస్సుచేత సూర్యుడు కాంతివిహీను డైనాడు.

మూ. బుద్ధిం న కురుతే యావన్నాశే దేవ మహామునిః,

తావత్ప్రసాద్యో భగవానగ్నిరూపో మహాద్యుతిః. 16

ప్ర. అ. దేవ = దేవా!, మహామునిః = ఈ మహాముని, నాశే = మూడు లోకములను నశింపచేయుటయందు, యావత్ = ఎంతలో, బుద్ధిం న కురుతే = నిర్ణయము చేయడో, తావత్ = అంతలో, అగ్నిరూపః = అగ్నితుల్యుడును, మహాద్యుతిః = గొప్ప కాంతికలవాడును అగు, భగవాన్ = ఈ పూజ్యు డైన విశ్వామిత్రుడు, ప్రసాద్యః = సంతోషింపచేయదగినవాడు.

తా. అగ్నితుల్యుడును, మహాకాంతిమంతుడును అగు ఈ పూజ్యు డైన మహాముని లోకత్రయనాశము చేయ నిర్ణయించుటకు ముందుగా ఇతనికి కోరిన వరము లిచ్చి ప్రసన్నుని చేయుము.

మూ. కాలాగ్నినా యథా పూర్వం త్రైలోక్యం దహ్యతేఽఖిలమ్,

దేవరాజ్యం చికీర్షేత దీయతామస్య యన్మతమ్. 17

ప్ర. అ. అఖిలమ్ = సమస్త మైన, త్రైలోక్యమ్ = మూడు లోకముల సముదాయము, పూర్వమ్ = పూర్వము, కాలాగ్నినా = కాలాగ్నిచేత, యథా = ఎట్లు దహింపబడెనో, అట్లు, దహ్యతే = దహింపబడుచున్నది. దేవరాజ్యమ్ = దేవరాజ్యమును, చికీర్షేత (యది) = చేయదలచినట్లెతే, అస్య = ఇతనికి, యత్ = ఏది, మతమ్ = ఇష్టమో అది, దీయతామ్ = ఇవ్వబడుగాక.

తా. ముల్లోకములును, పూర్వము ప్రలయాగ్నిచే దహింపబడినట్లు దహింప బడుచున్నవి. ఇతడు దేవలోకరాజ్యము చేయ వలె నని కోరినను ఈతని కేది కావలెనో అది ఇమ్ము.

మూ. తతః సురగణాః సర్వే పితామహపురోగమాః,

విశ్వామిత్రం మహాత్మానం మధురం వాక్యమబ్రువన్. 18

ప్ర. అ. తతః = పిమ్మట, పితామహపురోగమాః = బ్రహ్మదేవుడు మొదలైన, సర్వే = సమస్త మైన, సురగణాః = దేవతలు, మహాత్మానమ్ = మహాత్ము డైన, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి, మధురమ్ = మధుర మైన, వాక్యమ్ = వాక్యమును, అబ్రువన్ = పలికిరి.

తా. పిమ్మట బ్రహ్మదేవుడు మొదలగు దేవత లందరును మహాత్ము డైన విశ్వామిత్రునితో మధుర మైన వాక్యము పలికిరి.

మూ. బ్రహ్మర్షే స్వాగతం తేఽస్తు తపసా స్మ సుతోషితాః,

బ్రాహ్మణ్యం తపసోగ్రేణ ప్రాప్తవానసి కౌశిక. 19

ప్ర. అ. బ్రహ్మర్షే = ఓ బ్రహ్మర్షీ!, తే = నీకు, స్వాగతమ్ = స్వాగతము, అస్తు = అగుగాక. తపసా = తపస్సుచేత, సుతోషితాః = బాగుగా సంతోషపెట్ట బడినవారము, స్మః = అయినాము. కౌశిక = విశ్వామిత్రా, ఉగ్రేణ = ఉగ్రమైన, తపసా = తపస్సుచేత, బ్రాహ్మణ్యమ్ = బ్రాహ్మణత్వమును, ప్రాప్తవాన్ = పొందినవాడవు, అసి = అయితివి.

తా. ఓ బ్రహ్మర్షీ! నీకు స్వాగత మగుగాక. నీ తపస్సుచేత చాల సంతోషించినాము. ఓ విశ్వామిత్రా! ఉగ్ర మైన తపస్సుచేత బ్రాహ్మణత్వమును పొందితివి.

మూ. దీర్ఘమాయుశ్చ తే బ్రహ్మన్ దదామి సమరుద్గణః,

స్వస్తి ప్రాప్నుహి భద్రం తే గచ్ఛ సౌమ్య యథాసుఖమ్. 20

ప్ర. అ. బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణా!, సమరుద్గణః = దేవతాగణములతో కూడిన నేను, తే = నీకు, దీర్ఘమ్ = దీర్ఘ మైన, ఆయుశ్చ = ఆయుర్దాయమును కూడ, దదామి = ఇచ్చుచున్నాను. స్వస్తి = క్షేమమును, ప్రాప్నుహి = పొందుము. తే = నీకు, భద్రమ్ = భద్ర మగుగాక. సౌమ్య = ఓ సౌమ్యుడా! యథాసుఖమ్ = సుఖముగా, గచ్ఛ = వెళ్ళుము.

తా. ఓ బ్రాహ్మణా! దేవతాగణముతో కూడిన నేను నీకు దీర్ఘాయుర్దాయము కూడ ఇచ్చుచున్నాను. క్షేమమును పొందుము. నీకు భద్రమగును. ఓ సౌమ్యుడా! నీకు సుఖము కలుగువిధముగ సంచరించుము.

మూ. పితామహవచః శ్రుత్వా సర్వేషాం చ దివౌకసామ్,

కృత్వా ప్రణామం ముదితో వ్యాజహార మహామునిః. 21

ప్ర. అ. మహామునిః = విశ్వామిత్రమహాముని, పితామహవచః = బ్రహ్మయొక్క వచనమును, సర్వేషామ్ = సమస్తమైన, దివౌకసాం చ = దేవతల వచనమును, శ్రుత్వా = విని, ముదితః = సంతసించినవాడై, ప్రణామమ్ = నమస్కారమును, కృత్వా = చేసి, వ్యాజహార = పలికెను.

తా. విశ్వామిత్రుడు బ్రహ్మాదిదేవతల మాటలు విని, సంతసించి, నమస్కరించి ఇట్లు పలికెను.

మూ. బ్రాహ్మణ్యం యది మే ప్రాప్తం దీర్ఘమాయుస్తథైవ చ,

ఓంకారశ్చ వషట్కారో వేదాశ్చ వరయన్తు మామ్. 22

ప్ర. అ. మే = నాకు, బ్రాహ్మణ్యమ్ = బ్రాహ్మణ్యము, ప్రాప్తం యది = లభించినట్లెతే, తథైవ చ = మరియు, దీర్ఘమ్ = దీర్ఘ మైన, ఆయుశ్చ = ఆయుర్దాయము కూడ లభించినట్లెతే, ఓంకారశ్చ = ఓంకారము, వషట్కారశ్చ = వషట్కారము, వేదాశ్చ = వేదములును, మామ్ = నన్ను, వరయన్తు = వరించుగాక.

తా. నాకు బ్రాహ్మణత్వము, దీర్ఘాయుర్దాయము లభించినచో, ఓంకార వషట్కారములును, వేదములును నన్ను వరించుగాక. నాకు వేదములను ఇతరులకు బోధించు అధికారము, యజ్ఞయాగాదులు చేయించు అధికారము లభించుగాక.

మూ. క్షత్రవేదవిదాం శ్రేష్ఠో బ్రహ్మవేదవిదామపి,

బ్రహ్మపుత్రో వసిష్ఠో మామేవం వదతు దేవతాః. 23

యద్యయం పరమః కామః కృతో యాన్తు సురర్షభాః.

ప్ర. అ. దేవతాః = దేవతలారా!, క్షత్రవేదవిదామ్ = క్షత్రియులకు యోగ్యము లైన ధనుర్వేదాదివిద్యల నెరిగినవారిలోను, బ్రహ్మవేదవిదామపి = బ్రాహ్మణులకు యోగ్యము లైన వేదములను ఎరిగినవారిలోను, శ్రేష్ఠః = శ్రేష్ఠుడును, బ్రహ్మపుత్రః = బ్రహ్మపుత్రుడును అయిన, వసిష్ఠః = వసిష్ఠుడు, మామ్ = నన్ను గూర్చి, ఏవమ్ = ఇట్లు, వదతు = పలుకు గాక. అయమ్ = ఈ, పరమః = గొప్ప దైన, కామః = కోరిక, కృతఃయది = చేయబడినట్లెతే, సురర్షభాః = సురశ్రేష్ఠు లైన మీరు, యాన్తు = వెళ్లుదురుగాక.

తా. క్షత్రియుల విద్యలను, బ్రాహ్మణుల వేదములను ఎరిగినవారిలో శ్రేష్ఠుడును, బ్రహ్మపుత్రుడును అగు వసిష్ఠుడు నన్ను బ్రహ్మర్షి యని అంగీకరించు గాక. నాకీ శ్రేష్ఠ మైన వరమును ఇచ్చినచో మీరందరు వెళ్లవచ్చును.

మూ. తతః ప్రసాదితో దేవైర్వసిష్ఠో జపతాం వరః

సఖ్యం చకార బ్రహ్మర్షిరేవమస్త్వితి చాబ్రవీత్. 24

ప్ర. అ. తతః = పిమ్మట, దేవైః = దేవతలచేత, ప్రసాదితః = అనుగ్రహింప చేసికొనబడిన, జపతాం వరః = మునులలో శ్రేష్ఠు డైన, వసిష్ఠః = వసిష్ఠుడు, సఖ్యమ్ = స్నేహమును, చకార = చేసెను. ఏవమ్ = ఇట్లు, బ్రహ్మర్షిః = బ్రహ్మర్షి, అస్తు = అగుగాక, ఇతి = అని, అబ్రవీత్ చ = పలికెను కూడ.

తా. పిమ్మట దేవతలు బ్రతిమాలుకొనగా వసిష్ఠమహాముని వచ్చి, విశ్వామిత్రునితో మైత్రి చేసికొని, ‘నీవు బ్రహ్మర్షివిఅని పలికెను.

మూ. బ్రహ్మర్షిస్త్వం న సన్దేహః సర్వం సంపత్స్యతే తవ,

ఇత్యుక్త్వా దేవతాశ్చాపి సర్వా జగ్ముర్యథాగతమ్. 25

ప్ర. అ. త్వమ్ = నీవు, బ్రహ్మర్షిః = బ్రహ్మర్షివి. సన్దేహః = సందేహము, న = లేదు. తవ = నీకు, సర్వమ్ = అంతయు, సంపత్స్యతే = సిద్ధించును. ఇతి = ఇట్లు, ఉక్త్వా = పలికి, సర్వాః = సమస్త మైన, దేవతాః = దేవతలు, యథాగతమ్ = వచ్చినట్లుగనే, జుగ్ముః = వెళ్లిరి.

తా. ‘‘నీవు బ్రహ్మర్షివే. సందేహము లేదు. నీకు అన్నియు సమకూరును’’ అని పలికి దేవత లందరును వచ్చిన దారినే వెళ్లిపోయిరి.

మూ. విశ్వామిత్రోఽపి ధర్మాత్మా లబ్ధ్వా బ్రాహ్మణ్యముత్తమమ్,

పూజయామాస బ్రహ్మర్షిం వసిష్ఠం జపతాం వరమ్. 26

ప్ర. అ. ధర్మాత్మా = ధర్మాత్ము డైన, విశ్వామిత్రోఽపి = విశ్వామిత్రుడు కూడా, ఉత్తమమ్ = ఉత్తమ మైన, బ్రాహ్మణ్యమ్ = బ్రాహ్మణ్యమును, లబ్ధ్వా = పొంది, బ్రహ్మర్షిమ్ = బ్రహ్మర్షియు, జపతామ్ = జపము చేయువారిలో, వరమ్ = శ్రేష్ఠుడును అగు, వసిష్ఠమ్ = వసిష్ఠుని, పూజయామాస = పూజించెను.

తా. ధర్మాత్ము డైన విశ్వామిత్రుడు ఉత్తమ మైన బ్రాహ్మణ్యమును సంపాదించి, బ్రహ్మర్షి యైన వసిష్ఠమహామునిని పూజించెను.

మూ. కృతకామో మహీం సర్వాం చచార తపసి స్థితః.

ఏవం త్వనేన బ్రాహ్మణ్యం ప్రాప్తం రామ మహాత్మనా. 27

ప్ర. అ. కృతకామః = చేయబడిన కోరికకలవాడై, తపసి = తపస్సు నందు, స్థితః = ఉన్నవాడై, సర్వామ్ = సమస్త మైన, మహీమ్ = భూమిని, చచార = సంచరించెను. రామ = రామా!, మహాత్మనా = మహాత్ము డైన, అనేన = ఇతనిచేత, ఏవమ్ = ఈ విధముగా, బ్రాహ్మణ్యమ్ = బ్రాహ్మణత్వము, ప్రాప్తమ్ = పొందబడినది.

తా. విశ్వామిత్రు డీ విధముగా కోరికను తీర్చుకొని, తపస్సు ఆచరించుచు భూమండలము నంతను సంచరించెను. రామా! ఈ మహాత్ముడు బ్రాహ్మణత్వమును ఈ విధముగ సంపాదించుకొనెను.

మూ. ఏష రామ మునిశ్రేష్ఠ ఏష విగ్రహవాంస్తపః,

ఏష ధర్మపరో నిత్యం వీర్యస్యైష పరాయణమ్. 28

ప్ర. అ. రామ = రామా!, ఏషః = ఇతడు, మునిశ్రేష్ఠః = మునులలో శ్రేష్ఠుడు. ఏషః = ఇతడు, విగ్రహవాన్ = శరీరము గల, తపః = తపస్సు. ఏషః = ఇతడు, నిత్యమ్ = ఎల్లప్పుడును, ధర్మపరః = ధర్మమునందాసక్తి గలవాడు. ఏషః = ఇతడు, వీర్యస్య = పరాక్రమమునకు, పరాయణమ్ = గొప్పస్థానము.

తా. రామా! ఈతడు మునులలో శ్రేష్ఠుడు. ఇతడు మూర్తీభవించిన తపస్సు. ఇతడు ఎల్లప్పుడును ధర్మపరుడు. ఇతడు వీర్యమునకు నివాస స్థానము.

మూ. ఏవముక్త్వా మహాతేజా విరరామ ద్విజోత్తమః, 29

శతానన్దవచః శ్రుత్వా రామలక్ష్మణసన్నిధౌ,

జనకః ప్రాఞ్జలిర్వాక్యమువాచ కుశికాత్మజమ్. 30

ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, ద్విజోత్తమః = ద్విజశ్రేష్ఠుడు, ఏవమ్ = ఇట్లు, ఉక్త్వా = పలికి, విరరామ = విరమించెను. జనకః = జనకమహారాజు, రామలక్ష్మణసన్నిధౌ = రామలక్ష్మణుల సమీపమునందు, శతానన్దవచః = శతానందుని వాక్యమును, శ్రుత్వా = విని, ప్రాఞ్జలిః = కట్టబడిన దోసిలి కలవాడై, కుశికాత్మజమ్ = విశ్వామిత్రుని గూర్చి, వాక్యమ్ = వాక్యమును, ఉవాచ = పలికెను.

తా. మహాతేజశ్శాలి యగు శతానందుడు ఈ విధముగా పలికి ఊరకుండెను. రామలక్ష్మణులతో శతానందుడు చెప్పిన మాటలు విని జనకమహారాజు, చేతులు జోడించి విశ్వామిత్రునితో ఇట్లనెను

మూ. ధన్యోఽస్మ్యనుగృహీతోఽస్మి యస్య మే మునిపుఙ్గవ,

యజ్ఞం కాకుత్థ్స సహితః ప్రాప్తవానసి ధార్మిక. 31

ప్ర. అ. ధార్మిక = ధర్మాత్ముడా!, మునిపుఙ్గవ = ఓ మునిశ్రేష్ఠుడా! కాకుత్థ్ససహితః = రామలక్ష్మణసమేతుడవై, యస్య = ఏ, మమ = నాయొక్క, యజ్ఞమ్ = యజ్ఞమును గూర్చి, ప్రాప్తవాన్ అసి = వచ్చినావో అట్టి నేను, ధన్యః అస్మి = ధన్యుడ నైతిని. అనుగృహీతః = అనుగ్రహింపబడినవాడను, అస్మి = అయితిని.

తా. ధార్మికుడ వైన ఓ మునిపుంగవా! రామలక్ష్మణసమేతుడవై నా యజ్ఞమునకు వచ్చితివి; నేను ధన్యుడ నైతిని. అనుగ్రహపాత్రుడ నైతిని.

మూ. పావితోఽహం త్వయా బ్రహ్మన్ దర్శనేన మహామునే,

గుణా బహువిధాః ప్రాప్తాస్తవ సందర్శనాన్మయా. 32

ప్ర. అ. మహామునే = ఓ మహామునీ! బ్రహ్మన్ = బ్రాహ్మణోత్తమా! త్వయా = నీచేత, దర్శనేన = దర్శనముచేతనే, అహమ్ = నేను, పావితః = పవిత్రింపబడితిని. తవ = నీయొక్క, సందర్శనాత్ = దర్శనమువలన, మయా = నాచేత, బహువిధాః = అనేక విధము లైన, గుణాః = గుణములు, ప్రాప్తాః = పొందబడినవి.

తా. బ్రాహ్మణోత్తముడ వైన ఓ మహామునీ! నీ దర్శనముచే నేను పవిత్రుడ నైతిని. నీ దర్శనమువలన నేను అనేకవిధము లగు లాభములను పొందితిని.

మూ. విస్తరేణ చ తే బ్రహ్మన్ కీర్త్యమానం మహత్తపః,

శ్రుతం మయా మహాతేజో రామేణ చ మహాత్మనా. 33

ప్ర. అ. మహాతేజః = గొప్ప తేజస్సు కలవాడా!, బ్రహ్మన్ = బ్రాహ్మణోత్తమా! విస్తరేణ = సవిస్తరముగా, కీర్త్యమానమ్ = చెప్పబడుచున్న, తే = నీయొక్క మహత్ = గొప్ప, తపః = తపస్సు, మయా = నాచేతను, మహాత్మనా = మహాత్ము డైన, రామేణ = రాముని చేతను, శ్రుతమ్ = వినబడినది.

తా. మహాతేజశ్శాలి వైన ఓ బ్రహ్మర్ష్ఙీ నీ తపస్సును గూర్చి సవిస్తరముగ వర్ణించి శతానంతుడు చెప్పగా నేనును, మహాత్ము డైన రాముడును వింటిమి.

మూ. సదస్యైః ప్రాప్య చ సదః శ్రుతాస్తే బహవో గుణాః,

అప్రమేయం తపస్తుభ్యమప్రమేయం చ తే బలమ్, 34

అప్రమేయా గుణాశ్చైవ నిత్యం తే కుశికాత్మజ.

ప్ర. అ. సదస్యైః = సభ్యులచేత, సదః = యజ్ఞవాటికను, ప్రాప్య = పొంది, తే = నీయొక్క, బహవః = అనేక మైన, గుణాః = గుణములు, శ్రుతాః = వినబడినవి. తుభ్యమ్ = నీయొక్క, తపః = తపస్సు, అప్రమేయమ్ = కొలత లేనిది. తే = నీయొక్క, బలమ్ = బలము, అప్రమేయమ్ = కొలవశక్యము కానిది. కుశికాత్మజ = విశ్వామిత్రా!, తే = నీయొక్క, గుణాశ్చైవ = గుణములు కూడ, నిత్యమ్ = నిత్యము, అప్రమేయాః = కొలవశక్యము కానివి.

తా. యజ్ఞసభలో ఉన్న సదస్యు లందరును నీ గుణములను వినిరి. ఓ విశ్వామిత్రా! నీ తపస్సు, నీ బలము, నీ గుణములును కొలతకు అందనివి.

మూ. తృప్తిరాశ్చర్యభూతానాం కథానాం నాస్తి మే విభో,

కర్మకాలో మునిశ్రేష్ఠ లమ్బతే రవిమణ్డలమ్. 35

ప్ర. అ. విభో = ప్రభూ!, ఆశ్చర్యభూతానామ్ = ఆశ్చర్యకరము లైన, కథానామ్ = కథల విషయమున, మే = నాకు, తృప్తిః = తృప్తి, నాస్తి = లేదు. మునిశ్రేష్ఠ = మునిశ్రేష్ఠుడా! రవిమణ్డలమ్ = సూర్యమండలము, లమ్బతే = వ్రేలాడుచున్నది. కర్మకాలః = కర్మానుష్ఠానకాలము (సమీపించినది).

తా. మహాత్మా! ఆశ్చర్యకరము లైన నీ కథలను వినుచుండగా తృప్తి కలుగుట లేదు. ఓ మునిశ్రేష్ఠా! సూర్యుడస్తాద్రికి పోవుచున్నాడు. కర్మకాలము సమీపించుచున్నది.

మూ. శ్వః ప్రభాతే మహాతేజో ద్రష్టుమర్హసి మాం పునః,

స్వాగతం తపతాం శ్రేష్ఠ మామనుజ్ఞాతుమర్హసి. 36

ప్ర. అ. మహాతేజః = గొప్ప తేజస్సు కలవాడా!, శ్వః = రేపు, ప్రభాతే = ప్రాతఃకాలమున, మామ్ = నన్ను, పునః = మరల, ద్రష్టుమ్ = చూచుటకు, అర్హసి = తగియున్నావు. తపతామ్ = తపస్సు చేసేవారిలో, శ్రేష్ఠ = శ్రేష్ఠుడా! స్వాగతమ్ = నీకు స్వాగతము. మామ్ = నన్ను, అనుజ్ఞాతుమ్ = అనుజ్ఞ ఇచ్చుటకు, అర్హసి = తగియున్నావు.

తా. గొప్ప తేజస్సు గల మునిశ్రేష్ఠుడా! రేపు ప్రాతఃకాలమున మరల నన్ను చూడుము (నా వద్దకు రమ్ము). నీకు స్వాగతము. నాకు అనుజ్ఞ ఇమ్ము.

మూ. ఏవముక్తో మునివరః ప్రశస్య పురుషర్షభమ్,

విససర్జాశు జనకం ప్రీతం ప్రీతమనాస్తదా. 37

ప్ర. అ. తదా = అప్పుడు, ఏవమ్ = ఇట్లు, ఉక్తః = పలుకబడిన, మునివరః = మునిశ్రేష్ఠుడు, ప్రీతమనాః = సంతోషించిన మనస్సు కలవాడై, ప్రీతమ్ = సంతసించిన, పురుషర్షభమ్ = పురుషశ్రేష్ఠు డైన, జనకమ్ = జనకుని, ప్రశస్య = ప్రశంసించి, ఆశు = శీఘ్రముగా, విససర్జ = విడచెను.

తా. జనకు డిట్లు పలుకగా సంతసించిన ఆ మహాముని, సంతోష యుక్తు డైన ఆ పురుషశ్రేష్ఠు డగు జనకుని ప్రశంసించి, వెంటనే అతనికి వెళ్లుటకు అనుజ్ఞ ఇచ్చెను.

మూ. ఏవముక్త్వా మునిశ్రేష్ఠం వైదేహో మిథిలాధిపః,

ప్రదక్షిణం చకారాశు సోపాధ్యాయః సబాన్ధవః. 38

ప్ర. అ. వైదేహః = విదేహదేశాధిపతి యైన, మిథిలాధిపః = మిథిలానగరరాజు, మునిశ్రేష్ఠమ్ = ఆ మునిశ్రేష్ఠుని గూర్చి, ఏవమ్ = ఇట్లు, ఉక్త్వా = పలికి, సోపాధ్యాయః = ఉపాధ్యాయునితో కూడినవాడై, సబాన్ధవః = బంధువులతో కూడినవాడై, ఆశు = శీఘ్రముగా, ప్రదక్షిణం చకార ప్రదక్షిణము చేసెను.

తా. జనకమహారాజు ఆ మహామునితో ఇట్లు పలికి ఆతనికి ప్రదక్షిణ నమస్కారములు చేసెను. ఆతని ఉపాధ్యాయులును, బంధువులును కూడ విశ్వామిత్రునకు ప్రదక్షిణ నమస్కారములు చేసిరి.

మూ. విశ్వామిత్రోఽపి ధర్మాత్మా సహరామః సలక్ష్మణః,

స్వవాటమభిచక్రామ పూజ్యమానో మహర్షిభిః. 39

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే పఞ్చషష్టితమః సర్గః

ప్ర. అ. ధర్మాత్మా = ధర్మాత్ము డైన, విశ్వామిత్రోఽ పి = విశ్వామిత్రుడు కూడ, సహరామః = రామునితో కూడినవాడై, సలక్ష్మణః = లక్ష్మణునితో కూడినవాడై, మహర్షిభిః = మహర్షులచే, పూజ్యమానః = పూజింపబడుచున్నవాడై, స్వవాటమ్ = తన నివాసస్థానమును గూర్చి, అభిచక్రామ = నడచెను.

తా. ధర్మాత్ము డగు విశ్వామిత్రుడు రామలక్ష్మణసమేతుడై, మహర్షులు పూజింప తన నివాసస్థానమునకు వెళ్లెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో అరువదియైదవసర్గ సమాప్తము.