Chapter_66

Back
Book Balakandamu
Chapter No 72
Pages 6
Read Time 10 Minutes

Chapter_66

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ షట్షష్టితమః సర్గః

విశ్వామిత్రుని, రామలక్ష్మణులను తగు రీతి గౌరవించి జనకుడు వారికి శివధనుర్వృ త్తాంతము చెప్పుట. శ్రీరాముడు ధనుస్సునకు నారి కట్టినచో ఆతనికి సీత నిచ్చెద నని జనకుడు తన నిశ్చయమును ప్రకటించుట.

మూ. తతః ప్రభాతే విమలే కృతకర్మా నరాధిపః,

విశ్వామిత్రం మహాత్మానమాజుహావ సరాఘవమ్. 1

ప్ర. అ. తతః = పిమ్మట, విమలే = తెల్లవారిన, ప్రభాతే = ప్రాతః కాలమునందు, నరాధిపః = రాజు, కృతకర్మా = చేయబడిన ప్రాతఃకాలకృత్యములు కలవాడై, సరాఘవమ్ = రాఘవులతో కూడిన, మహాత్మానమ్ = మహాత్ము డైన, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని, ఆజుహావ = పిలచెను.

తా. తెల్లవారిన పిమ్మట జనకమహారాజు ప్రాతఃకాలకృత్యములను దీర్చుకొని, రామలక్ష్మణసమేతు డైన, మహాత్ము డైన విశ్వామిత్రుని పిలిపించెను.

మూ. తమర్చయిత్వా ధర్మాత్మా శాస్త్రదృష్టేన కర్మణా,

రాఘవౌ చ మహాత్మానౌ తదా వాక్యమువాచ హ. 2

ప్ర. అ. ధర్మాత్మా = ధర్మాత్ము డైన జనకుడు, తమ్ = ఆ విశ్వామిత్రుని, మహాత్మానౌ = మహాత్ము లైన, రాఘవౌ చ = రామలక్ష్మణులను, శాస్త్రదృష్టేన = శాస్త్రమునందు చూడబడిన, కర్మణా = కర్మచేత, అర్చయిత్వా = పూజించి, తదా = అప్పుడు, వాక్యమ్ = వాక్యమును, ఉవాచ హ = పలికెను.

తా. జనకుడు, విశ్వామిత్రుని, రామలక్ష్మణులను యథావిధిగా పూజించి ఇట్లు పలికెను.

మూ. భగవన్ స్వాగతం తేఽస్తు కిం కరోమి తవానఘ,

భవానాజ్ఞాపయతు మామాజ్ఞాప్యో భవతా హ్యహమ్. 3

ప్ర. అ. భగవన్ = పూజ్యుడా!, తే = నీకు, స్వాగతమ్ = స్వాగతము, అస్తు = అగుగాక. అనఘ = పాపములు లేనివాడా! తవ = నీకు, కిమ్ = ఏమి, కరోమి = చేయుదును ? భవాన్ = నీవు, మామ్ = నన్ను, ఆజ్ఞాపయతు = ఆజ్ఞాపింతువుగాక. అహమ్ = నేను, భవతా = నీచేత, ఆజ్ఞాప్యః హి = ఆజ్ఞాపింపదగినవాడను కదా.

తా. పూజ్యుడా! నీకు స్వాగత మగుగాక. పాపరహితుడా! నీ కేమి చేయుదును? నేను నీచే ఆజ్ఞాపింపదగినవాడను. ఆజ్ఞాపింపుము.

మూ. ఏవముక్తస్స ధర్మాత్మా జనకేన మహాత్మనా,

ప్రత్యువాచ మునిర్వీరం వాక్యం వాక్యవిశారదః. 4

ప్ర. అ. మహాత్మనా = మహాత్ముడైన, జనకేన = జనకునిచేత, ఏవమ్ = ఇట్లు, ఉక్తః = పలుకబడిన, ధర్మాత్మా = ధర్మాత్ము డైన, వాక్యవిశారదః = మాటలలో నేర్పు గల, సః = ఆ, మునిః = విశ్వామిత్రుడు, వీరమ్ = ఆ వీరుని గూర్చి, వాక్యమ్ = వాక్యమును, ప్రత్యువాచ = తిరిగి పలికెను.

తా. మహాత్ము డగు జనకుని మాటలు విని, ధర్మాత్ముడును మాటలలో నేర్పరియు అగు ఆ విశ్వామిత్రు డిట్లు పలికెను.

మూ. పుత్రౌ దశరథస్యేమౌ క్షత్రియో లోకవిశ్రుతౌ,

ద్రష్టుకామౌ ధనుఃశ్రేష్ఠం యదేతత్త్వయి తిష్ఠతి. 5

ప్ర. అ. దశరథస్య = దశరథునియొక్క, పుత్రౌ = పుత్రులును, క్షత్రియౌ = క్షత్రియులును, లోకవిశ్రుతౌ = లోకములో ప్రసిద్ధులును అగు, ఇమౌ = వీరిరువురు, యత్ = ఏ, ధనుఃశ్రేష్ఠమ్ = శ్రేష్ఠ మైన ధనుస్సు, త్వయి = నీయందు, తిష్ఠతి = ఉన్నదో, ఏతత్ = దానిని, ద్రష్టుకామౌ = చూడ కోరిక గలవారు.

తా. దశరథుని పుత్రులును, క్షత్రియులును, లోకప్రసిద్ధులును అగు ఈ రామలక్ష్మణులు నీవద్ద నున్న శ్రేష్ఠ మైన ధనుస్సును చూడ దలచు చున్నారు.

మూ. ఏతద్దర్శయ భద్రం తే కృతకామౌ నృపాత్మజౌ,

దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యతః. 6

ప్ర. అ. ఏతత్ = ఈ ధనుస్సును, దర్శయ = చూపుము. తే = నీకు, భద్రమ్ = క్షేమ మగుగాక. అస్య = ఈ, ధనుషః = ధనుస్సుయొక్క, దర్శనాత్ = దర్శనమువలన, కృతకామౌ = తీరిన కోరిక గలవారై, నృపాత్మజౌ = ఈ రాజకుమారులు, యథేష్టమ్ = ఇష్టమువచ్చి నట్లుగా, ప్రతియాస్యతః = తిరిగి వెళ్లగలరు.

తా. ఆ ధనుస్సును చూపుము. నీకు భద్ర మగుగాక. ఈ రాజకుమారులు దానిని చూచి, కోరిక తీరినవారై వారి ఇష్టము ప్రకారము తిరిగి వెళ్లెదరు.

మూ. ఏవముక్తస్తు జనకః ప్రత్యువాచ మహామునిమ్,

శ్రూయాతామస్య ధనుషో యదర్థమిహ తిష్ఠతి. 7

ప్ర. అ. ఏవమ్ = ఇట్లు, ఉక్తః = పలుకబడిన, జనకః = జనకుడు, మహామునిమ్ = మహామునిని గూర్చి, ప్రత్యువాచ = తిరిగి పలికెను. ఇహ = ఇచట, యదర్థమ్ = ఎందు నిమిత్తమై, తిష్ఠతి = ఉన్నదో, అస్య = ఈ, ధనుషః = ధనుస్సునకు సంబంధించిన ఆ వృత్తాంతము, శ్రూయతామ్ = వినబడుగాక.

తా. విశ్వామిత్రుని మాటలు విని జనకు డీ విధముగ ప్రతివచనము పలికెను. ‘‘ఈ ధనుస్సు ఇచట ఎందువలన ఉన్నదో ఆ వృత్తాంతమును చెప్పెదను, వినుము.’’

మూ. దేవరాత ఇతి ఖ్యాతో నిమేః షష్ఠో మహీపతిః,

న్యాసోఽయం తస్య భగవన్ హస్తే దత్తో మహాత్మనా. 8

ప్ర. అ. భగవన్ = పూజ్యుడా!, నిమేః = నిమినుండి, షష్ఠః = ఆరవవాడైన, దేవరాతః ఇతి = దేవరాతు డని, ఖ్యాతః = ప్రసిద్ధు డైన, మహీపతిః = రాజు (ఉండెను). సః అయమ్ = ఆ యీ ధనుస్సు, తస్య = ఆ రాజుయొక్క, హస్తే = హస్తమునందు, న్యాసః = దాచి మరల ఇవ్వవలసిన వస్తువుగా, మహాత్మనా = మహాత్ము డైన శివునిచేత, దత్తః = ఇవ్వబడినది.

తా. ఈ ధనుస్సును మహాత్ము డైన శివుడు నిమిచక్రవర్తికి ఆరవవాడైన దేవరాతు డనెడు రాజువద్ద న్యాసముగా ఉంచెను.

మూ. దక్షయజ్ఞవధే పూర్వం ధనురాయమ్య వీర్యవాన్,

రుద్రస్తు త్రిదశాన్ రోషాత్సలీలమిదమబ్రవీత్. 9

ప్ర. అ. పూర్వమ్ = పూర్వము, దక్షయజ్ఞవధే = దక్షయజ్ఞవినాశనము చేయు సమయమున, వీర్యవాన్ = పరాక్రమవంతుడైన, రుద్రః = రుద్రుడు, ధనుః = ధనుస్సును, ఆయమ్య = వంచి, త్రిదశాన్ = దేవతలను గూర్చి, రోషాత్ = కోపమువలన, సలీలమ్ = విలాసముతో కూడినట్లుగా, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. పూర్వము దక్షయజ్ఞధ్వంసము చేయుచు వీర్యవంతు డైన రుద్రుడు ధనుస్సును వంచి, కుపితుడై దేవతలతో ఇట్లనెను.

మూ. యస్మాద్భాగార్థినో భాగాన్నాకల్పయత మే సురాః,

వరాఙ్గాణి మహార్హాణి ధనుషా శాతయామి వః. 10

ప్ర. అ. సురాః = దేవతలారా!, భాగార్థినః = యజ్ఞభాగమును కోరుచున్న, మే = నాకు, యస్మాత్ = ఏ కారణమువలన, భాగాన్ = భాగములను, నాకల్పయత = కల్పింపలేదో, అందువలన, వః = మీ యొక్క, మహార్హాణి = విలువైన, వరాఙ్గాణి = శ్రేష్ఠ మైన అవయవములను, ధనుషా = ఈ ధనుస్సుతో, శాతయామి = ఖండించెదను.

తా. దేవతలారా! యజ్ఞభాగముల నపేక్షించుచున్న నాకు మీరు యజ్ఞ భాగములను కల్పింపలేదు గాన ఈ ధనుస్సుతో మీ శిరస్సులను ఖండించెదను.

మూ. తతో విమనసః సర్వే దేవా వై మునిపుఙ్గవ,

ప్రసాదయన్తి దేవేశం తేషాం ప్రీతోఽభవద్భవః. 11

ప్ర. అ. మునిపుఙ్గవ = ఓ మునిశ్రేష్ఠా!, తతః = పిమ్మట, సర్వే = సమస్త మైన, దేవాః = దేవతలు, విమనసః = వ్యాకుల మైన మనస్సు కలవారై, దేవేశమ్ = దేవేశు డైన శివుని, ప్రసాదయన్తి = అనుగ్రహింపచేసికొనిరి. భవః = శివుడు, తేషామ్ = వారి విషయమున, ప్రీతః = సంతసించినవాడు, అభవత్ = ఆయెను.

తా. మహామునీ! పిమ్మట, ఆ దేవత లందరును భయపడి మహేశ్వరుని అనుగ్రహింపచేసుకొనగ ఆ మహేశ్వరుడు వారి విషయమున అనుగ్రహించెను.

మూ. ప్రీతియుక్తస్స సర్వేషాం దదౌ తేషాం మహాత్మనామ్,

తదేతద్దేవదేవస్య ధనూరత్నం మహాత్మనః 12

న్యాసభూతం తదా న్యస్తమస్మాకం పూర్వకే విభో.

ప్ర. అ. సః = మహేశ్వరుడు, ప్రీతియుక్తః = ఆనందముతో కూడినవాడై, తేషామ్ = ఆ, మహాత్మనామ్ = మహాత్ములకు, దదౌ = ఇచ్చెను, విభో = ప్రభూ!, మహాత్మనః = మహాత్ము డైన, దేవదేవస్య = దేవాధిదేవుడైన శివునియొక్క, తత్ = ఆ, ఏతత్ = ఈ, ధనూరత్నమ్ = శ్రేష్ఠ మైన ధనుస్సు, తదా = అప్పుడు, అస్మాకమ్ = మా యొక్క, పూర్వకే = పూర్వపురుషునియందు, న్యాసభూతమ్ = న్యాసముగా, న్యస్తమ్ = ఉంచబడినది.

తా. శివుడు దేవతల విషయమున అనుగ్రహించి ఆ ధనుస్సును వారికి ఇచ్చివేయగా దానిని దేవతలు మా పూర్వపురుషుని వద్ద న్యాసముగా ఉంచిరి.

మూ. అథ మే కృషతః క్షేత్రం లాఙ్గలాదుత్థితా మయా,

క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుతా. 13

ప్ర. అ. అథ = పిమ్మట, మే = నేను, క్షేత్రమ్ = యాగభూమిని, కృషతః = దున్నుచుండగా, లాఙ్గలాత్ = నాగలినుండి, ఉత్థితా = లేచినదియు, నామ్నా = పేరుచేత, సీతేతి = సీత అని, విశ్రుతా = ప్రసిద్ధురాలును అగు కన్య, క్షేత్రమ్ = ఆ క్షేత్రమును, శోధయతా = పరిశుద్ధము చేయుచున్న, మయా = నా చేత, లబ్ధా = పొందబడినది.

తా. నేనొకప్పుడు యజ్ఞభూమిని దున్ని పరిశుద్ధము చేయుచుండగా నాగలి నుండి బైటకు వచ్చిన సీత అను కన్య నాకు లభించినది.

మూ. భూతలాదుత్థితా సా తు వ్యవర్ధత మమాత్మజా,

వీర్యశుల్కేతి మే కన్యా స్థాపితేయమయోనిజా. 14

ప్ర. అ. భూతలాత్ = భూతలమునుండి, ఉత్థితా = లేచిన, సా = ఆమె, మమ = నాయొక్క, ఆత్మజా = కుమార్తెగా, వ్యవర్ధత = పెరిగెను. అయోనిజా = స్త్రీ గర్భమునుండి పుట్టని, ఇయమ్ = ఈ, కన్యా = కన్య, వీర్యశుల్కా = వీర్యమే శుల్కముగా కలది అని, మే = నాచేత, స్థాపితా = ఉంచబడినది.

తా. భూమినుండి బైటకు వచ్చిన ఆమె నా కుమార్తెగా పెరిగినది. అయోనిజ యైన ఈమెను వివాహ మాడవలె నన్న పరాక్రమమే శుల్క మని నేను నియమము చేసితిని.

మూ. భూతలాదుత్థితాం తాం తు వర్ధమానాం మమాత్మజామ్,

వరయామాసురాగమ్య రాజానో మునిపుఙ్గవ. 15

ప్ర. అ. మునిపుఙ్గవ = మునిశ్రేష్ఠా!, భూతలాత్ = భూతలమునుండి, ఉత్థితామ్ = లేచినదై, వర్ధమానామ్ = పెరుగుచున్న, తామ్ = ఆ, మమ ఆత్మజామ్ = నా కుమార్తెను, రాజానః = రాజులు, ఆగమ్య = వచ్చి, వరయామాసుః = వరించిరి.

తా. మహామునీ! భూతలమునుండి ఆవిర్భవించి, నా కుమార్తెగా పెరుగుచున్న ఈమెను వివాహ మాడదలచి ఎందరో రాజులు వచ్చిరి.

మూ. తేషాం వరయతాం కన్యాం సర్వేషాం పృథివీక్షితామ్,

వీర్యశుల్కేతి భగవన్ న దదామి సుతామహమ్. 16

ప్ర. అ. భగవన్ = పూజ్యుడా!, తేషామ్ = ఆ, సర్వేషామ్ = సమస్త మైన, మహీక్షితామ్ = రాజులు, కన్యామ్ = కన్యను, వరయతామ్ = వరించుచుండగా, వీర్యశుల్కేతి = వీర్య శుల్క యని చెప్పి, అహమ్ = నేను, సుతామ్ = కుమార్తెను, న దదామి = ఇవ్వలేదు.

తా. మహామునీ! ఆ రాజు లందరును వచ్చి కన్య నిమ్మని కోరగా, నేను, ఈమె వీర్యశుల్క యని చెప్పి వారి కీయలేదు.

మూ. తతః సర్వే నృపతయః సమేత్య మునిపుఙ్గవ,

మిథిలామభ్యుపాగమ్య వీర్యజిజ్ఞాసవస్తదా. 17

ప్ర. అ. మునిపుఙ్గవ = మునిశ్రేష్ఠా!, తతః = పిమ్మట, సర్వే = సమస్త మైన, నృపతయః = రాజులు, సమేత్య = కలిసి, తదా = అప్పుడు, వీర్యజిజ్ఞాసవః = తమ వీర్యమును తెలిసికొన దలచినవారై, మిథిలామ్ = మిథిలాపట్టణమును గూర్చి, అభ్యుపాగమ్య = వచ్చి (ఉండిరి).

తా. మునిశ్రేష్ఠా! పిమ్మట ఆ రాజు లందరును కలిసి తమ బల మెంత యున్నదో పరీక్షించుకొన గోరి మిథిలకు వచ్చిరి.

మూ. తేషాం జిజ్ఞాసమానానాం వీర్యం ధనురుపాహృతమ్,

న శేకుర్గ్రహణే తస్య ధనుషస్తోలనేఽపి వా. 18

ప్ర. అ. వీర్యమ్ = బలమును, జిజ్ఞాసమానానామ్ = తెలియగోరుచున్న, తేషామ్ = వారికి, ధనుః = ధనుస్సు, ఉపాహృతమ్ = తేబడినది. తస్య = ఆ, ధనుషః = ధనుస్సుయొక్క, గ్రహణే = గ్రహించుటయందు గాని, తోలనేఽపి = కదల్చుటయందుగాని, న శేకుః = సమర్థులు కాకపోయిరి.

తా. తమ బలమును పరీక్షించ దలచిన వారికి ధనుస్సును చూపగా దానిని పట్టుకొనుటకు గాని, కదల్చుటకు గాని వారికి శక్యము కాలేదు.

మూ. తేషాం వీర్యవతాం వీర్యమల్పం జ్ఞాత్వా మహామునే,

ప్రత్యాఖ్యాతా నృపతయస్తన్నిబోధ తపోధన. 19

ప్ర. అ. మహామునే = మహామునీ, తేషామ్ = ఆ, వీర్యవతామ్ = రాజులయొక్క, వీర్యమ్ = బలమును, అల్పమ్ = అల్పమైనదానినిగా, జ్ఞాత్వా = తెలిసికొని, నృపతయః = ఆ రాజులు, ప్రత్యాఖ్యాతాః = నిరాకరింపబడినారు. తపోధన = విశ్వామిత్రమహర్షీ!, తత్ = ఆ విషయమును, నిబోధ = తెలిసికొనుము.

తా. ఆ రాజుల బలము అల్ప మైన దని తెలిసికొని నేను వారికి సీత నీయ నిరాకరించితిని. విశ్వామిత్రమహర్షీ! ఈ విషయము తెలిసికొనుము.

మూ. తతః పరమకోపేన రాజానో మునిపుఙ్గవ,

న్యరున్ధన్ మిథిలాం సర్వే వీర్యసన్దేహమాగతాః. 20

ప్ర. అ. మునిపుఙ్గవ = మునిశ్రేష్ఠుడా!, తతః = పిమ్మట, సర్వే = సమస్త మైన, రాజానః = రాజులు, వీర్యసన్దేహమ్ = తమ బలమును గూర్చిన సందేహమును, ఆగతాః = పొందినవారై, పరమకోపేన = ఎక్కువ కోపముతో, మిథిలామ్ = మిథిలానగరమును, న్యరున్ధన్ = ముట్టడించిరి.

తా. మహామునీ! ఈ విధముగ తమ బలము విషయమున సందేహము కలుగగా రాజు లందరును మిక్కిలి కోపించి మిథిలానగరమును ముట్టడించిరి.

మూ. ఆత్మానమవధూతం తే విజ్ఞాయ నృపపుఙ్గవాః,

రోషేణ మహతావిష్టాః పీడయన్ మిథిలాం పురీమ్. 21

ప్ర. అ. తే = ఆ, నృపపుఙ్గవాః = రాజశ్రేష్ఠులు, ఆత్మానమ్ = తమను, అవధూతమ్ = తిరస్కరింపబడినవారినిగా, విజ్ఞాయ = తెలుసుకొని, మహతా = గొప్ప, కోపేన = కోపముతో, ఆవిష్టాః = కూడినవారై, మిథిలాం పురీమ్ = మిథిలానగరమును, పీడయన్ = బాధించిరి.

తా. ఆ రాజు లందరును ఇది ఒక అవమాన మని భావించి, కోపముతో మిథిలాపురిని బాధించిరి.

మూ. తతఃసంవత్సరే పూర్ణే క్షయం యాతాని సర్వశః,

సాధనాని మునిశ్రేష్ఠ తతోఽహం భృశదుఃఖితః. 22

ప్ర. అ. మునిశ్రేష్ఠ = మునిశ్రేష్ఠుడా! తతః = పిమ్మట, సంవత్సరే = సంవత్సరము, పూర్ణే = నిండిన దగుచుండగా, సర్వశః = అంతటను, సాధనాని = జీవనోపకరణములు, క్షయం యాతాని = క్షయము పొందినవి. తతః = అందువలన, అహమ్ = నేను, భృశదుఃఖితః = చాల దుఃఖితుడ నైతిని.

తా. ఈ విధముగా సంవత్సరము గడవగా నగరములో నున్న జీవనోపకరణము లన్నియు తరిగిపోయినవి. దానితో నాకు చాల దుఃఖము కలిగెను.

మూ. తతో దేవగణాన్ సర్వాంస్తపసాఽహం ప్రసాదయమ్,

దదుశ్చ పరమప్రీతాశ్చతురఙ్గబలం సురాః. 23

ప్ర. అ. తతః = పిమ్మట, అహమ్ = నేను, తపసా = తపస్సుచేత, సర్వాన్ = సమస్తమైన, దేవగణాన్ = దేవగణములను, ప్రసాదయమ్ = అనుగ్రహింపచేసికొంటిని. సురాః = దేవతలు, పరమప్రీతాః = చాల సంతసించిన వారై, చతురఙ్గబలమ్ = చతురంగ సైన్యమును, దదుః = ఇచ్చిరి.

తా. అప్పుడు నేను తపస్సుచే దేవతల నందరిని అనుగ్రహింపచేసికొనగా వారు నాకు చతురంగబలమును ఇచ్చిరి.

మూ. తతో భగ్నా నృపతయో హన్యమానా దిశో యయుః,

అవీర్యా వీర్యాసన్దిగ్ధాః సామాత్యాః పాపకర్మణః. 24

ప్ర. అ. తతః = పిమ్మట, అవీర్యాః = బలము లేనివారును, వీర్యసన్దిగ్ధాః = బలము విషయమున సందేహము కలవారును, పాపకర్మణః = పాపకర్మ కల వారును అగు, నృపతయః = రాజులు, హన్యమానాః = కొట్టబడుచున్నవారై, భగ్నాః = ఓడిపోయినవారై, సామాత్యాః = పరివారసమేతులై, దిశః = దిక్కులనుగూర్చి, యయుః = పారిపోయిరి.

తా. తమ బలమును గూర్చి సందేహము గల ఆ వీర్యశూన్యు లగు పాపాత్ము లైన రాజులు యుద్ధమునందు పరాజితులై, నపరివారముగా దిక్కులు పట్టి పారిపోయిరి.

మూ. తదేతన్మునిశార్దూల ధనుః పరమభాస్వరమ్,

రామలక్ష్మణయోశ్చాపి దర్శయిష్యామి సువ్రత. 25

ప్ర. అ. సువ్రత = మంచి వ్రతము గల, మునిశార్దూల = మునిశ్రేష్ఠుడా!, తత్ = ఆ, ఏతత్ = ఈ, పరమభాస్వరమ్ = మిక్కిలి ప్రకాశించుచున్న, ధనుః = ధనుస్సును, రామలక్ష్మణయోశ్చాపి = రామలక్ష్మణులకు కూడ, దర్శయిష్యామి = చూపగలను.

తా. ఓ మునిశ్రేష్ఠా! మిక్కిలి ప్రకాశించు అట్టి ఈ ధనుస్సును రామలక్ష్మణులకు కూడ చూపగలను.

మూ. యద్యస్య ధనుషో రామః కుర్యాదారోపణం మునే,

సుతామయోనిజాం సీతాం దద్యాం దాశరథేరహమ్. 26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే షట్షష్టితమః సర్గః

ప్ర. అ. మునే = ఓ మునీ! రామః = రాముడు, అస్య = ఈ, ధనుషః = ధనుస్సుయొక్క, ఆరోపణమ్ = ఎక్కు పెట్టుటను, కుర్యాద్యది = చేసినట్లయితే, అయోనిజామ్ = అయోనిజ యైన, సుతామ్ = కుమార్తె యగు, సీతమ్ = సీతను, అహమ్ = నేను, దాశరథేః = రామునకు. దద్యామ్ = ఇచ్చెదను.

తా. మహామునీ! రాము డీ ధనుస్సును ఎక్కు పెట్టగలిగినచో, అయోనిజ యగు సీతను ఈతని కిచ్చెదను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో అరువది ఆరవ సర్గ సమాప్తము.