| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 73 |
| Pages | 7 |
| Read Time | 11 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ సప్తషష్టితమః సర్గః
శ్రీరాముడు నారి కట్టి ధనుస్సును లాగగా అది విరిగిపోవుట. విశ్వామిత్రుని ఆజ్ఞచే జనకుడు దశరథుని తీసికొనివచ్చుటకై మంత్రులను పంపుట.
మూ. జనకస్య వచః శ్రుత్వా విశ్వామిత్రో మహామునిః,
ధనుర్దర్శయ రామాయ ఇతి హోవాచ పార్థివమ్. 1
ప్ర. అ. మహామునిః = మహామునియైన, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, జనకస్య = జనకునియొక్క, వచః = వాక్యమును, శ్రుత్వా = విని, రామాయ = రామునకు, ధనుః = ధనుస్సును, దర్శయ = చూపుము, ఇతి = అని, పార్థివమ్ = రాజును గూర్చి, ఉవాచ హ = పలికెను.
తా. విశ్వామిత్రమహాముని జనకుని మాటలు విని, ‘‘రామునకు ఆ ధనుస్సును చూపుము’’అని ఆతనితో పల్కెను.
మూ. తతః స రాజా జనకః సామన్తాన్వ్యాదిదేశ హ,
ధనురానీయతాం దివ్యం గన్ధమాల్యవిభూషితమ్. 2
ప్ర. అ. తతః = పిమ్మట, సః = ఆ, రాజా = రాజైన, జనకః = జనకుడు, సామన్తాన్ = సామంతరాజులను, వ్యాదిదేశ హ = ఆజ్ఞాపించెను. గన్ధమాల్యవిభూషితమ్ = గంధ మాల్యములచే అలంకరింపబడిన, దివ్యమ్ = దివ్య మైన, ధనుః = ధనుస్సు, ఆనీయతామ్ = తీసికొనిరాబడుగాక.
తా. విశ్వామిత్రుని వాక్యము విని జనకమహారాజు గంధమాల్యాదులచే అలంకరించిన ఆ దివ్యధనుస్సును తీసికొని రండు అని సామంతులను ఆజ్ఞాపించెను.
మూ. జనకేన సమాదిష్టాః సచివాః ప్రావిశన్ పురీమ్,
తద్ధనుః పురతః కృత్వా నిర్జగ్ముః పార్థివాజ్ఞయా. 3
ప్ర. అ. జనకేన = జనకునిచేత, సమాదిష్టాః = ఆజ్ఞాపించబడిన, సచివాః = మంత్రులు, పురీమ్ = పట్టణమును, ప్రావిశన్ = ప్రవేశించిరి. తద్ధనుః = ఆ ధనుస్సును, పార్థివాజ్ఞయా = రాజుయొక్క ఆజ్ఞచేత, పురతః = ఎదుట, కృత్వా = ఉంచుకొని, నిర్జగ్ముః = బయలుదేరిరి.
తా. జనకుని ఆజ్ఞ ప్రకారము మంత్రులు నగరమును ప్రవేశించి ఆ ధనుస్సును ముందిడుకొని బయలుదేరి వచ్చిరి.
మూ. నృణాం శతాని పఞ్చాశద్వ్యాయతానాం మహాత్మనామ్,
మఞ్జూషామష్టచక్రాం తాం సమూహుస్తే కథంచన. 4
ప్ర. అ. మహాత్మనామ్ = గొప్ప బలము కలవారును, వ్యాయతానామ్ = పొడగరులును అగు, నృణామ్ = పురుషుల, పఞ్చాశత్ = ఏబది, శతాని = వందలు, అష్టచక్రామ్ = ఎనిమిది చక్రములు గల, మఞ్జూషామ్ = పెట్టెను, సమూహుః = లాగికొని వచ్చిరి. తే = వారు, తామ్ = ఆ పెట్టెను, కథంచన = అతికష్టముగ, (లాగికొనివచ్చిరి).
తా. మంచి బలము కలవారును, దీర్ఘకాయులును అగు ఏబది వందల మంది పురుషులు ఆ ధనుస్సు ఉంచిన ఎనిమిది చక్రాలు ఉన్న పెట్టెను అతి కష్టముగ లాగికొని వచ్చిరి.
మూ. తామాదాయ తు మఞ్జూషామాయసీం యత్ర తద్ధనుః,
సురోపమం తే జనకమూచుర్నృపరిమన్త్రిణః. 5
ప్ర. అ. తే = ఆ, నృపతిమన్త్రిణః = రాజుయొక్క మంత్రులు, యత్ర = ఏ పెట్టెయందు, తత్ = ఆ, ధనుః = ధనుస్సు ఉన్నదో, తామ్ = ఆ, ఆయసీమ్ = ఇనుప దైన, మఞ్జూషామ్ = పెట్టెను, ఆదాయ = గ్రహించి, సురోపమమ్ = దేవతలతో సమాను డైన, జనకమ్ = జనకమహారాజును గూర్చి, ఊచుః = పలికిరి.
తా. జనకుని మంత్రులు ధనుస్సు ఉన్న ఆ ఇనుప పెట్టెను తీసికొనివచ్చి, దేవతా సమాను డైన ఆతనితో ఇట్లనిరి.
మూ. ఇదం ధనుర్వరం రాజన్ పూజితం సర్వరాజభిః,
మిథిలాధిప రాజేన్ద్ర దర్శనీయం యదిచ్ఛసి. 6
ప్ర. అ. రాజేన్ద్ర = రాజశ్రేష్ఠుడా! మిథిలాధిప = మిథిలాప్రభువైన, రాజన్ = ఓ రాజా! యత్ = దేనిని, దర్శనీయమ్ = చూపదగినదానినిగా, ఇచ్ఛసి = కోరుచున్నావో, అట్టి, సర్వరాజభిః = సమస్తరాజులచేతను, పూజితమ్ = పూజింపబడిన, ధనుర్వరమ్ = శ్రేష్ఠమైన ధనుస్సు, ఇదమ్ = ఇదిగో.
తా. రాజులలో శ్రేష్ఠుడ వైన ఓ మిథిలాధిపతీ! నీవు దేనిని రామునకు చూపదలచు చున్నావో అట్టి, సర్వరాజపూజిత మగు శ్రేష్ఠధనుస్సు ఇదిగో.
మూ. తేషాం నృపో వచః శ్రుత్వా కృతాఞ్జలిరభాషత,
విశ్వామిత్రం మహాత్మానం తౌ చోభౌ రామలక్ష్మణౌ. 7
ప్ర. అ. నృపః = రాజు, తేషామ్ = వారియొక్క, వచః = వాక్యమును, శ్రుత్వా = విని, కృతాఞ్జలిః = చేయబడిన దోసిలికలవాడై, మహాత్మానమ్ = మహాత్ముడైన, విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చియు, తౌ = ఆ, ఉభౌ = ఇద్ద రైన, రామలక్ష్మణౌ = రామలక్ష్మణులను గూర్చియు, అభాషత = పలికెను.
తా. రాజు వారి వాక్యము విని, కరములు జోడించి, మహాత్ము డైన, విశ్వామిత్రునితోను, రామలక్ష్మణులతోను ఇట్లు పలికెను.
మూ. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ జనకైరభిపూజితమ్,
రాజభిశ్చ మహావీర్యైరశక్తైః పూరితుం పురా. 8
ప్ర. అ. బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణోత్తమా!, జనకైః = జనకవంశీయులచేతను, పురా = పూర్వము, పూరితుమ్ = ఎక్కు పెట్టుటకు, అశక్తైః = అసమర్థులైన, మహావీర్యైః = గొప్ప పరాక్రమము గల, రాజభిశ్చ = రాజులచేతను, అభిపూజితమ్ = పూజింపబడిన, ధనుర్వరమ్ = శ్రేష్ఠ మైన, ధనుస్సు, ఇదమ్ = ఇదే.
తా. విశ్వామిత్రమహామునీ! మా జనకవంశీయులును, పూర్వము దీనిని ఎక్కుపెట్టపోయి విఫలు లైన మహావీర్యవంతు లగు రాజులును పూజించిన శ్రేష్ఠ మైన ధనుస్సు ఇదియే.
మూ. నైతత్సురగణాః సర్వే నాసురా న చ రాక్షసాః,
గన్ధర్వయక్షప్రవరాస్సకిన్నరమహోరగాః. 9
ప్ర. అ. ఏతత్ = దీనిని (ఎక్కు పెట్టుటకు) సర్వే = సమస్త మైన, సురగణాః = దేవతాగణములు, న = సమర్థులు కాలేదు. అసురాః = అసురులు, న = సమర్థులు కాలేదు. రాక్షసాః = రాక్షసులును, సకిన్నరమహోరగాః = కింనరులతోడను, మహోరగులతోడను కూడిన, గన్ధర్వయక్షప్రవరాః = గంధర్వయక్షశ్రేష్ఠులును, న = సమర్థులు కాలేదు.
తా. సురగణములు కాని, అసురులు కాని, రాక్షసులు కాని, గంధర్వ-యక్ష-కిన్నర- మహోరగులు గాని దీనిని ఎక్కు పెట్టజాలకపోయిరి.
మూ. క్వ గతిర్మానుషాణాం చ ధనుషోఽస్య ప్రపూరణే.
ఆరోపణే సమాయోగే వేపనే తోలనేఽపి వా. 10
ప్ర. అ. అస్య = ఈ ధనుస్సుయొక్క, ప్రపూరణే = వంచుటయందుగాని, ఆరోపణే = నారిని ఎక్కించుటయందు గాని, సమాయోగే = బాణమును సంధించుటయందు గాని, వేపనే = నారిని లాగుటయందు గాని, తోలనేఽపి వా = కదల్చుటయందు గాని, మానుషాణామ్ = మనుష్యులకు, గతిః = గతి, క్వ = ఎక్కడ.
తా. ఈ ధనుస్సును వంచుటకు గాని, నారి కట్టుటకు గాని, బాణము సంధించుటకు గాని, నారిని లాగుటకు గాని, కదల్చుటకు గాని మనుష్యులకు శక్తి ఎక్కడిది?
మూ. తదేతద్ధనుషాం శ్రేష్ఠమానీతం మునిపుఙ్గవ,
దర్శయైతన్మహాభాగ అనయో రాజపుత్రయోః. 11
ప్ర. అ. మునిపుఙ్గవ = మునిశ్రేష్ఠా, తత్ = అట్టి, ఏతత్ = ఈ, ధనుషామ్ = ధనుస్సులలో, శ్రేష్ఠమ్ = శ్రేష్ఠ మైన ధనుస్సు, ఆనీతమ్ = తీసికొనిరాబడినది. మహాభాగ = మహాభాగ్యవంతుడా!, ఏతత్ = దీనిని, అనయోః = ఈ, రాజపుత్రయోః = రాజపుత్రులకు, దర్శయ = చూపుము.
తా. ఓ మునిశ్రేష్ఠా! అట్టి ఈ ధనుస్సును తీసికొని వచ్చినారు. దీనిని ఈ రాజపుత్రులకు చూపుము.
మూ. విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనకభాషితమ్,
వత్స రామ ధనుః పశ్య ఇతి రాఘవమబ్రవీత్. 12
ప్ర. అ. ధర్మాత్మా = ధర్మాత్ము డైన, విశ్వామిత్రస్తు = విశ్వామిత్రు డైతే, జనకభాషితమ్ = జనకునిమాటను, శ్రుత్వా = విని, వత్స = నాయనా!, రామ = రామా! ధనుః = ధనుస్సును, పశ్య = చూడుము, ఇతి = అని, రాఘవమ్ = రామునిగూర్చి, అబ్రవీత్ = పలికెను.
తా. ధర్మాత్ము డైన విశ్వామిత్రుడు జనకుని మాటలు విని - ‘‘వత్సా! రామా! ఆ ధనుస్సును చూడు’’ అని రామునితో పలికెను.
మూ. బ్రహ్మర్షేర్వచనాద్రామో యత్ర తిష్ఠతి తద్ధనుః,
మఞ్జూషాం తామపావృత్య దృష్ట్వా ధనురథాబ్రవీత్. 13
ప్ర. అ. రామః = రాముడు, బ్రహ్మర్షేః = బ్రహ్మర్షియొక్క, వచనాత్ = వచనమువలన, తత్ = ఆ, ధనుః = ధనుస్సు, యత్ర = దేనియందు, తిష్ఠతి = ఉన్నదో, తామ్ = అట్టి, మఞ్జూషామ్ = పెట్టెను. అపాకృత్య = తెరచి, ధనుః = ధనుస్సును, దృష్ట్వా = చూచి, అథ = పిమ్మట, అబ్రవీత్ = పలికెను.
తా. ఆ బ్రహ్మర్షి ఆదేశానుసారము రాముడు ధనుస్సు ఉన్న ఆ పెట్టెను తెరచి, ధనుస్సును చూచి, ఇట్లు పలికెను.
మూ. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామీహ పాణినా,
యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పూరణేఽపి వా. 14
ప్ర. అ. బ్రహ్మన్ = బ్రహ్మర్షీ! ఇహ = ఇప్పుడు, ఇదమ్ = ఈ, ధనుర్వరమ్ = శ్రేష్ఠమైన ధనుస్సును, పాణినా = హస్తముచేత, సంస్పృశామి = స్పశింతును. తోలనే = కదల్చుట యందు గాని, పూరణేఽపి వా = ఎక్కు పెట్టుటయందు గాని, యత్నవాన్ = ప్రయత్నము కలవాడను, భవిష్యామి = కాగలను.
తా. బ్రహ్మర్షీ! ఇపు డీ శ్రేష్ఠ మైన ధనుస్సును హస్తముతో స్పృశించెదను. దానిని కదల్చుటకు గాని, శక్య మైనచో ఎక్కుపెట్టుటకు గాని ప్రయత్నించెదను.
మూ. బాఢమిత్యేవ తం రాజా మునిశ్చ సమభాషత,
లీలయా స ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునేః. 15
ప్ర. అ. రాజా = రాజును, మునిశ్చ = మునియు, బాఢమ్ ఇత్యేవ = సరే అని, తమ్ = ఆ రాముని గూర్చి, సమభాషత = పలికెను. సః = రాముడు, మునేః = మునియొక్క, వచనాత్ = వచనమువలన, ధనుః = ధనుస్సును, మధ్యే = మధ్యయందు, లీలయా = అనాయాసముగా, జగ్రాహ = పట్టుకొనెను.
తా. ‘‘అటులే చేయుము’’ అని జనకమహారాజును, విశ్వామిత్రుడును పలికిరి. విశ్వామిత్రుని ఆజ్ఞ ప్రకారము రాముడు అనాయాసముగా ఆ ధనుస్సును మధ్యయందు పట్టుకొనెను.
మూ. పశ్యతాం నృసహస్రాణాం బహూనాం రఘునన్దనః,
ఆరోపయత్స ధర్మాత్మా సలీలమివ తద్ధనుః. 16
ప్ర. అ. ధర్మాత్మా = ధర్మాత్ముడైన, సః = ఆ, రఘునన్దనః = రాముడు, బహూనామ్ = అనేకులైన, నృసహస్రాణామ్ = వేలకొలది జనులు, పశ్యతామ్ = చూచుచుండగా, తత్ = ఆ, ధనుః = ధనుస్సును, సలీలమివ = అనాయాసముగా, ఆరోపయత్ = ఎక్కు పెట్టెను.
తా. ధర్మాత్ము డైన ఆ రఘునందనుడు, వేలకొలది జనులు చూచుచుండగా ఆ ధనుస్సును అనాయాసముగ ఎక్కుపెట్టెను.
మూ. ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధనుః,
తద్బభఞ్జ ధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశాః. 17
ప్ర. అ. ధర్మాత్మా = ధర్మాత్ము డైన ఆ రాముడు, తత్ = ఆ, ధనుః = ధనుస్సును, ఆరోపయిత్వా = ఎక్కు పెట్టి, పూరయామాస = ఆకర్ణాంతము లాగెను. మహాయశాః = గొప్ప కీర్తి గల, నరశ్రేష్ఠః = ఆ నరశ్రేష్ఠుడు, తత్ = ఆ, ధనుః = ధనుస్సును, మధ్యే = మధ్యయందు, బభఞ్జ = విరచెను.
తా. ధర్మాత్ముడును, మహాయశఃశాలియు, నరశ్రేష్ఠుడును అగు ఆ రాముడు ఆ ధనుస్సును ఎక్కుపెట్టి, నారిని ఆకర్ణాంతము లాగి దానిని విరచి వేసెను.
మూ. తస్య శబ్దో మహానాసీన్నిర్ఘాతసమనిస్వనః,
భూమికమ్పశ్చ సుమహాన్ పర్వతస్యేవ దీర్యతః. 18
ప్ర. అ. తస్య = దానియొక్క, శబ్దః = శబ్దము, నిర్ఘాతసమనిస్వనః = పిడుగుతో సమానమైన ధ్వని కలది గాను, మహాన్ = చాల పెద్దదిగాను, ఆసీత్ = ఆయెను. పర్వతస్య = పర్వతము, దీర్యతః ఇవ = బ్రద్దలగుచున్నపుడు వలె, సుమహాన్ = చాల పెద్దదైన, భూమికమ్ఫశ్చ = భూకంపము గూడ కలిగెను.
తా. ఆ ధనుస్సు విరిగి నపుడు పిడుగు ధ్వనితో సమాన మైన గొప్ప ధ్వని వచ్చెను. పర్వతము బ్రద్దలగు చున్నపుడు అదరినట్లు భూమి అదరెను.
మూ. నిపేతుశ్చ నరాః సర్వే తేన శబ్దేన మోహితాః,
వర్జయిత్వా మునివరం రాజానం తౌ చ రాఘవౌ. 19
ప్ర. అ. తేన = ఆ, శబ్దేన = శబ్దముచేత, మోహితాః = మూర్ఛితులై, మునివరం = విశ్వామిత్రుని, రాజానమ్ = జనకుని, తౌ = ఆ, రాఘవౌ చ = రాఘవులను, వర్జయిత్వా = విడచి, సర్వే = సమస్త మైన, నరాః = మనుష్యులు, నిపేతుః = పడిరి.
తా. విశ్వామిత్ర-జనక-రామలక్ష్మణులు తప్ప మిగిలిన జను లందరును ఆ ధ్వనికి మూర్ఛితులై క్రింద పడిరి.
మూ. ప్రత్యాశ్వస్తే జనే తస్మిన్రాజా విగతసాధ్వసః,
ఉవాచ ప్రాఞ్జలిర్వాక్యం వాక్యజ్ఞో మునిపుఙ్గవమ్. 20
ప్ర. అ. తస్మిన్ = ఆ, జనే = జనము, ప్రత్యాశ్వస్తే = ఊరడిల్లినదగుచుండగా, వాక్యజ్ఞః = మాటలలో నేర్పుగల, రాజా = రాజు, విగతసాధ్వసః = భయము లేనివాడై, ప్రాఞ్జలిః = కట్టబడిన దోసిలికలవాడై, మునిపుఙ్గవమ్ = మునిశ్రేష్ఠుని గూర్చి, వాక్యమ్ = వాక్యమును, ఉవాచ = పలికెను.
తా. అచట వారందరు యథాపూర్వస్థితికి వచ్చిన పిమ్మట మాటలలో నేర్పరి యైన జనకుడు, కంగారు లేనివాడై, ఆ మునిశ్రేష్ఠునితో ఇట్లు పలికెను.
మూ. భగవన్ దృష్టవీర్యో మే రామో దశరథాత్మజః,
అత్యద్భుతమచిన్త్యం చ న తర్కితమిదం మయా. 21
ప్ర. అ. భగవన్ = పూజ్యుడా!, దశరథాత్మజః = దశరథకుమారు డైన, రామః = రాముడు, మే = నాచేత, దృష్టవీర్యః = చూడబడిన పరాక్రమము కలవాడు. అత్యద్భుతమ్ = చాల ఆశ్చర్యకరము, అచిన్త్యం చ = ఊహింపరానిదియు అగు, ఇదమ్ = ఇది, మయా = నాచేత, న తర్కితమ్ = ఊహింపబడలేదు.
తా. మహామునీ! దశరథాత్మజు డైన రాముని వీర్యమును ప్రత్యక్షముగ చూచితిని. అత్యద్భుతము, ఊహింప అశక్యము అగు ఈ కార్య మిట్లు జరుగునని నేను అనుకొనలేదు.
మూ. జనకానాం కులే కీర్తిమాహరిష్యతి మే సుతా,
సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజమ్. 22
ప్ర. అ. మే = నాయొక్క, సుతా = కుమార్తె యైన, సీతా = సీత, దశరథాత్మజమ్ = దశరథునికుమారు డైన, రామమ్ = రాముని, భర్తారమ్ = భర్తనుగా, ఆసాద్య = పొంది, జనకానామ్ = జనకులయొక్క, కులే = కులమునందు, కీర్తిమ్ = కీర్తిని, ఆహరిష్యతి = తీసికొని రాగలదు.
తా. నా కుమార్తె యైన సీత దశరథుని పుత్రు డైన రాముని భర్తగా పొంది మా వంశమునకు కీర్తిని తీసికొని రాగలదు.
మూ. మమ సత్యా ప్రతిజ్ఞా చ వీర్యశుల్కేతి కౌశిక,
సీతా ప్రాణైర్బహుమతా దేయా రామాయ మే సుతా. 23
ప్ర. అ. కౌశిక = విశ్వామిత్రా!, వీర్యశుల్కేతి = వీర్యశుల్క అని, మమ = నాయొక్క, ప్రతిజ్ఞా చ = ప్రతిజ్ఞ కూడ, సత్యా = నిజ మైనది. ప్రాణైః = నాప్రాణములతో, బహుమతా = సమముగా ఆదరింపబడిన, మే = నాయొక్క, సుతా = కుమార్తె యైన, సీతా = సీత, రామాయ = రామునకు, దేయా = ఇవ్వదగినది.
తా. విశ్వామిత్ర మహామునీ! నా కుమార్తె యగు సీతను వివాహమాడుటకు వీర్యమే శుల్క మని నేను చేసిన ప్రతిజ్ఞ సత్య మైనది. నా ప్రాణములతో సమానురా లగు ఈమెను రామున కిచ్చెదను.
మూ. భవతోఽనుమతే బ్రహ్మన్ శీఘ్రం గచ్ఛన్తు మన్త్రిణః,
మమ కౌశిక భద్రం తే అయోధ్యాం త్వరితా రథైః. 24
ప్ర. అ. బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణోత్తమా! కౌశిక = విశ్వామిత్రా!, భవతః = నీయొక్క, అనుమతే = అనుమతియందు, మన్త్రిణః = మంత్రులు, త్వరితాః = తొందర గలవారై, రథైః = రథములచేత, అయోధ్యామ్ = అయోధ్యను గూర్చి, శీఘ్రమ్ = శీఘ్రముగా, గచ్ఛన్తు = వెళ్లెదరుగాక. తే = నీకు, భద్రమ్ = మంగళ మగుగాక.
తా. విశ్వామిత్రమహర్షీ! నీ ఆజ్ఞ ప్రకారము నా మంత్రులు రథముల నధిరోహించి శీఘ్రముగా అయోధ్యకు వెళ్లెదరు గాక. నీకు భద్ర మగు గాక.
మూ. రాజానం ప్రశ్రితైర్వాక్యైరానయన్తు పురం మమ,
ప్రదానం వీర్యశుల్కాయాః కథయన్తు చ సర్వశః. 25
ప్ర. అ. వీర్యశుల్కాయాః = వీర్యశుల్క యైన సీతయొక్క, ప్రదానమ్ = రామున కిచ్చుటను, సర్వశః = పూర్తిగా, కథయన్తు = చెప్పుదురుగాక. ప్రశ్రితైః = వినయపూర్వకమైన, వాక్యైః = వాక్యములచేత, రాజానమ్ = దశరథమహారాజును, మమ = నాయొక్క, పురమ్ = పురమును గూర్చి, ఆనయన్తు = తీసికొని వచ్చెదరు గాక.
తా. వీర్యశుల్క యగు సీతను రామున కీయ నిర్ణయించుట మొదలగు వృత్తాంతము నంతను సవినయముగ దశరథునకు తెలిపి ఆతనిని నా నగరమునకు తీసికొని వచ్చెదరు గాక.
మూ. మునిగుప్తౌ చ కాకుత్స్థౌ కథయన్తు నృపాయ వై,
ప్రీయమాణం తు రాజానమానయన్తు సుశీఘ్రగాః. 26
ప్ర. అ. కాకుత్థ్సౌ = రామలక్ష్మణులను, మునిగుప్తౌ = మునిచేత రక్షింప బడినవారినిగా, నృపాయ = దశరథునకు, కథయన్తు = చెప్పెదరుగాక. సుశీఘ్రగాః = చాల శీఘ్రముగా పోయినవారై, ప్రీయమాణమ్ = ఆనందించుచున్న, రాజానమ్ = రాజును, ఆనయన్తు = తీసికొని వచ్చెదరు గాక.
తా. శీఘ్రముగ వెళ్లి, రామలక్ష్మణులు విశ్వామిత్రుని సంరక్షణలో నున్నారని దశరథునకు తెలిపి, సంతోషించిన అతనిని తీసికొనివత్తురు గాక.
మూ. కౌశికశ్చ తథేత్యాహ రాజా చాభాష్య మన్త్రిణః, 27
అయోధ్యాం ప్రేషయామాస ధర్మాత్మా కృతశాసనాన్,
యథావృత్తం సమాఖ్యాతుమానేతుం చ నృపం తదా. 28
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే సప్తషష్టితమః సర్గః
ప్ర. అ. కౌశికశ్చ = విశ్వామిత్రుడు కూడ, తథేతి = అటులనే అగుగాక అని, ఆహ = పలికెను. ధర్మాత్మా = ధర్మాత్ము డైన, రాజా చ = జనకుడు కూడ, మన్త్రిణః = మంత్రులను, ఆభాష్య = సంప్రదించి, తదా = అప్పుడు, యథావృత్తమ్ = జరిగినది జరిగినట్లుగా, సమాఖ్యాతుమ్ = చెప్పుటకును, నృపమ్ = రాజును, ఆనేతుం చ = తీసికొని వచ్చుటకును, కృతశాసనాన్ = అనుచరులను, అయోధ్యామ్ = అయోధ్యను గూర్చి, ప్రేషయామాస = పంపెను.
తా. అటులే చేయు మని విశ్వామిత్రుడు పలుకగా జనకమహారాజు మంత్రులతో సంప్రదించి, దశరథునకు జరిగిన దంతయు చెప్పి ఆతనిని తీసికొని వచ్చుటకై తన ఆజ్ఞానిర్వాహకు లగు భృత్యులను అయోధ్యకు పంపెను.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో అరవై ఏడవ సర్గ సమాప్తము.
