| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 74 |
| Pages | 5 |
| Read Time | 8 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ అష్టషష్టితమః సర్గః
జనకుడు పంపిన వార్త విని దశరథుడు మంత్రిసమేతుడై మిథిలకు వెళ్లుటకై బయలుదేరుట.
మూ. జనకేన సమాదిష్టా దూతాస్తే క్లాన్తవాహనాః,
త్రిరాత్రముషితా మార్గే తేఽయోధ్యాం ప్రావిశన్ పురీమ్. 1
ప్ర. అ. జనకేన = జనకునిచేత, సమాదిష్టాః = ఆజ్ఞాపింపబడిన, తే = ఆ, దూతాః = దూతలు, మార్గే = మార్గమునందు, త్రిరాత్రమ్ = మూడురాత్రులు, ఉషితాః = ఉన్నవారై, క్లాన్తవాహనాః = అలసిపోయిన అశ్వములు కలవారై, అయోధ్యాం పురీమ్ = అయోధ్యా నగరమును, ప్రావిశన్ = ప్రవేశించిరి.
తా. జనకు డాజ్ఞాపించిన దూతలు మూడు దినములు ప్రయాణము చేసి, అలసిపోయిన గుఱ్ఱములతో అయోధ్యానగరము చేరిరి.
మూ. రాజ్ఞో భవనమాసాద్య ద్వారస్థానిదమబ్రువన్,
శీఘ్రం నివేద్యతాం రాజ్ఞే దూతాన్నో జనకస్య చ. 2
ప్ర. అ. రాజ్ఞః = రాజుయొక్క, భవనమ్ = భవనమును, ఆసాద్య = పొంది, ద్వారస్థాన్ = ద్వారపాలకులను గూర్చి, ఇదమ్ = ఈ వాక్యము, అబ్రువన్ = పలికిరి. జనకస్య = జనకమహారాజుయొక్క, దూతాన్ = దూతల మైన, నః = మమ్ములను గూర్చి, శీఘ్రమ్ = శీఘ్రముగా, రాజ్ఞే = రాజుకు, నివేద్యతామ్ = తెలుపబడుగాక.
తా. అచట రాజభవనమునకు వెళ్లి, ద్వారపాలకులతో ‘‘జనకమహారాజు దూతలు వచ్చినా రని దశరథమహారాజుతో చెప్పుడు’’ అని పల్కిరి.
మూ. ఇత్యుక్తా ద్వారపాలాస్తే రాఘవాయ న్యవేదయన్,
తే రాజవచనాద్దూతా రాజవేశ్మ ప్రవేశితాః, 3
దదృశుర్దేవసఙ్కాశం వృద్ధం దశరథం నృపమ్.
ప్ర. అ. ఇతి = ఇట్లు, ఉక్తాః = పలుకబడిన, తే = ఆ, ద్వారపాలాః = ద్వారపాలులు, రాఘవాయ = దశరథునకు, న్యవేదయన్ = తెలిపిరి. తే = ఆ, దూతాః = దాతలు, రాజవచనాత్ = రాజుయొక్క వచనమువలన, రాజవేశ్మ = రాజుయొక్క గృహమును, ప్రవేశితాః = ప్రవేశపెట్టబడినవారై, దేవసంకాశమ్ = దేవతలతో సమానుడును, వృద్ధమ్ = వృద్ధుడును అగు, దశరథం నృపమ్ = దశరథమహారాజును, దదృశుః = చూచిరి.
తా. వారి మాటలు విని ద్వారపాలురు దశరథునకు నివేదించిరి. పిమ్మట రాజాజ్ఞ ప్రకారము రాజభవనములో ప్రవేశించిన ఆ దూతలు దేవతాసదృశుడును, వృద్ధుడును అగు దశరథుని చూచిరి.
మూ. బద్ధాఞ్జలిపుటాః సర్వే దూతా విగతసాధ్వసాః,
రాజానం ప్రయతా వాక్యమబ్రువన్ మధురాక్షరమ్. 4
ప్ర. అ. సర్వే = సమస్తమైన, దూతాః = దూతలు, బద్ధాఞ్జలిపుటాః = కట్టబడిన దోసిళ్లు కలవారై, విగతసాధ్వసాః = పోయిన భయము కలవారై, ప్రయతాః = నియమసంపన్నులై, రాజానమ్ = రాజును గూర్చి, మధురాక్షరమ్ = మధురమైన అక్షరములు గల, వాక్యమ్ = వాక్యమును, అబ్రువన్ = పలికిరి.
తా. ఆ దూత లందరును చేతులు జోడించి, కంగారు పడనివారై, నియమబద్ధులై దశరథునితో మధురాక్షరములు గల వాక్యమును పలికిరి.
మూ. మైథిలో జనకో రాజా సాగ్నిహోత్రపురస్కృతమ్,
కుశలం చావ్యయం చైవ సోపాధ్యాయపురోహితమ్, 5
ముహుర్ముహుర్మధురయా స్నేహసంయుక్తయా గిరా,
జనకస్త్వాం మహారాజ పృచ్ఛతే సపురస్సరమ్. 6
ప్ర. అ. మహారాజ = ఓ మహారాజా! మైథిలః = మిథిలాధిపతి యైన, జనకః రాజా = జనకమహారాజు, సాగ్నిహోత్రపురస్కృతమ్ = అగ్నిహోత్రాదికర్మలను పురస్కరించువాడవును, సోపాధ్యాయపురోహితమ్ = ఉపాధ్యాయులతోడను పురోహితులతోడను కూడినవాడవును, సపురస్సరమ్ = ముందు నడచు పరివారజనముతో కూడినవాడవును అగు, త్వామ్ = నిన్ను, మధురయా = మధుర మైనదియు, స్నేహ సంయుక్తయా = స్నేహముతో కూడినదియు అగు, గిరా = వాక్కుతో, కుశలం చ = కుశలమును, అవ్యయం చైవ = నాశము లేకుండుటను, ముహుః = మాటిమాటికిని, పృచ్ఛతే = అడుగుచున్నాడు.
తా. ‘‘మహారాజా! మిథిలాధిపతి యైన, జనకమహారాజు, స్నేహపూర్ణమగు మధుర మైన వాక్కుతో, అగ్నిహోత్రాదినిరతుడ వగు నీ యొక్కయు, నీ ఉపాధ్యాయుల యొక్కయు, పురోహితులయొక్కయు, పరివారజనముయొక్కయు యోగక్షేమము లను విచారించుచున్నాడు.’’
మూ. పృష్ట్వా కుశలమవ్యగ్రం వైదేహో మిథిలాధిపః,
కౌశికానుమతే వాక్యం భవన్తమిదమబ్రవీత్. 7
ప్ర. అ. మిథిలాధిపః = మిథిలాధిపతి యగు, వైదేహః = జనకుడు, అవ్యగ్రమ్ = చిత్త విక్షేపము లేకుండగ, కుశలమ్ = క్షేమమును, పృష్ట్వా = అడిగి, కౌశికానుమతే = విశ్వామిత్రుని అనుమతి ప్రకారము, భవన్తమ్ = నిన్ను గూర్చి, ఇదమ్ = ఈ, వాక్యమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.
తా. మిథిలాధీశు డగు జనకమహారాజు శ్రద్ధాపూర్వకముగా నిన్ను కుశల ప్రశ్న చేసి, కౌశికుని అనుమతి పొంది, నీతో ఈ మాట చెప్పుచున్నాడు.
మూ. పూర్వం ప్రతిజ్ఞా విదితా వీర్యశుల్కా మమాత్మజా,
రాజానశ్చ కృతామర్షా నిర్వీర్యా విముఖీకృతాః. 8
ప్ర. అ. ఆత్మజా = నా కుమార్తె, వీర్యశుల్కా = వీర్యశుల్కము కలది అను, పూర్వమ్ = పూర్వము చేయబడిన, ప్రతిజ్ఞా = ప్రతిజ్ఞ, విదితా = అందరికిని తెలిసినదే, కృతామర్షాః = చేయబడిన అమర్షము గల, నిర్వీర్యాః = వీర్యరహితులైన, రాజానః చ = రాజులు కూడ, విముఖీకృతాః = విముఖులుగా చేయబడినారు.
తా. నా పుత్రిక వీర్యశుల్క యని నేను పూర్వము చేసిన ప్రతిజ్ఞ ప్రసిద్ధమే కదా. కోపించి వచ్చిన రాజులు నిర్వీర్యులై పరాజితులై పోయిరి.
మూ. సేయం మమ సుతా రాజన్ విశ్వామిత్రపురస్సరైః,
యదృచ్ఛయా గతైర్వీరైర్నిర్జితా తవ పుత్రకైః. 9
ప్ర. అ. రాజన్ = రాజా! సా = ఆ, ఇయమ్ = ఈ, మమ = నాయొక్క, సుతా = కుమార్తె, విశ్వామిత్రపురస్సరైః = విశ్వామిత్రుడు ముందు నడచుచుండగా గల, యదృచ్ఛయా = దేవవశముచేత, ఆగతైః = వచ్చిన, తవ = నీయొక్క, వీరైః = వీరుడైన, పుత్రకైః = చిన్న పుత్రునిచేత, నిర్జితా = జయింపబడినది.
తా. దశరథమహారాజా! అట్టి నా ఈ పుత్రికను విశ్వామిత్రుని వెంట దైవవశముచే మిథిలకు వచ్చిన, వీరు డైన నీ చిన్నికుమారుడు, సంపాదించు కొన్నాడు.
వి. రాముడు వయస్సుచే చిన్నవాడు గావున ‘‘పుత్రకైః’’ అని కప్రత్యయము, గౌరవసూచకముగా బహువచనము ప్రయోగింపబడినవి. ‘‘సేయం మమ సుతా రాజన్ విశ్వామిత్రస్య శాసనాత్. పురీమిమాం సమాగత్య తవ పుత్రేణ నిర్జితా’’ అని ప్రాచ్య పాఠం బాగున్నది.
మూ. తచ్చ రాజన్ ధనుర్దివ్యం మధ్యే భగ్నం మహాత్మనా,
రామేణ హి మహారాజ మహత్యాం జనసంసది. 10
ప్ర. అ. మహారాజ = రాజులలో గొప్పవాడ వైన, రాజన్ = దశరథా!, తత్ = ఆ, దివ్యమ్ = దివ్య మైన, ధనుః = ధనుస్సు, మహత్యామ్ = గొప్పదైన, జనసంసది = జనుల సభయందు, మహాత్మనా = మహాత్ము డైన, రామేణ = రాముని చేత, మధ్యే = నడుమ, భగ్నమ్ = విరవబడినది.
తా. దశరథమహారాజా! గొప్ప సభలో, మహాత్ము డైన రాముడు, ఆ దివ్యధనుస్సును మధ్యకు విరచెను.
మూ. అస్మై దేయా మయా సీతా వీర్యశుల్కా మహాత్మనే,
ప్రతిజ్ఞాం కర్తుమిచ్ఛామి తదనుజ్ఞాతుమర్హసి. 11
ప్ర. అ. వీర్యశుల్కా = వీర్యశుల్క యైన, సీతా = సీత, అస్మై = ఈ, మహాత్మనే = మహాత్మునకు, మయా = నాచేత, దేయా = ఇవ్వదగినది, ప్రతిజ్ఞామ్ = ప్రతిజ్ఞను, కర్తుమ్ = చేయుటకు, (నిలుపుకొనుటకు), ఇచ్ఛామి = కోరుచున్నాను. తత్ = ఆ కారణమువలన, అనుజ్ఞాతుమ్ = అనుజ్ఞ ఇచ్చుటకు, అర్హసి = తగియున్నావు.
తా. వీర్యశుల్క యైన సీతను ఈ మహాత్మున కిచ్చి నా ప్రతిజ్ఞను నెరవేర్చుకొనవలెను గాన అందులకు అనుజ్ఞ ఇమ్ము.
మూ. సోపాధ్యాయో మహారాజ పురోహితపురఃసరః,
శీఘ్రమాగచ్ఛ భద్రం తే ద్రష్టుమర్హసి రాఘవౌ. 12
ప్ర. అ. మహారాజ = మహారాజా!, సోపాధ్యాయః = ఋత్విక్కులతో కూడినవాడవై, పురోహితపురఃసరః = పురోహితుడు ముందు నడచువాడుగా కలవాడవై, (పురోహితుని ముందిడుకొని), శీఘ్రమ్ = శీఘ్రముగా, ఆగచ్ఛ = రమ్ము. తే = నీకు, భద్రమ్ = క్షేమ మగుగాక. రాఘవౌ = రామలక్ష్మణులను, ద్రష్టుమ్ = చూచుటకు, అర్హసి = తగియున్నావు.
తా. దశరథమహారాజా! నీకు క్షేమ మగుగాక. నీవు ఉపాధ్యాయ పురోహిత సహితుడవై శీఘ్రముగా వచ్చి రామలక్ష్మణులను చూడుము.
మూ. ప్రీతిం చ మమ రాజేన్ద్ర నిర్వర్తయితుమర్హసి,
పుత్రయోరుభయోరేవ ప్రీతిం త్వమపి లప్స్యసే. 13
ప్ర. అ. రాజేన్ద్ర = రాజశ్రేష్ఠుడా!, మమ = నాకు, ప్రీతిమ్ = ఆనందమును, నిర్వర్తయితుమ్ = కలిగించుటకు, అర్హసి = తగియున్నావు. త్వమపి = నీవు కూడ, ఉభయోః = ఇరువురు, పుత్రయోః = పుత్రులయొక్క, ప్రీతిమ్ = ఆనందమును, లప్స్యసే = పొందగలవు.
తా. దశరథమహారాజా! ఇచటికి వచ్చి నాకానందమును కలిగింపుము. నీకు కూడ పుత్రవివాహోత్సవాదిదర్శనానందము కలుగగలదు.
మూ. ఏవం విదేహాధిపతిర్మధురం వాక్యమబ్రవీత్, 14
విశ్వామిత్రాభ్యనుజ్ఞాతః శతానన్దమతే స్థితః,
ఇత్యుక్త్వా విరతా దూతా రాజగౌరవశఙ్కితాః. 15
ప్ర. అ. విదేహాధిపతిః = విదేహదేశరాజు, విశ్వామిత్రాభ్యనుజ్ఞాతః = విశ్వామిత్రునిచే అనుజ్ఞ ఇవ్వబడినవాడై, శతానన్దమతే = శతానందునిమతమునందు, స్థితః = ఉన్నవాడై, ఏవమ్ = ఇట్లు, మధురమ్ = మధుర మైన, వాక్యమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను. దూతాః = దూతలు, ఇతి = ఇట్లు, ఉక్త్వా = పలికి, రాజగౌరవశఙ్కితాః = రాజుపై గౌరవముచే భయపడుచు, విరతాః = విరమించిరి.
తా. జనకమహారాజు విశ్వామిత్రుని అనుజ్ఞ పొంది, శతానందుని అనుమతి కూడ గ్రహించి ఈ విధముగ మధురవాక్యమును చెప్పినాడు. దూతలు ఈ విధముగా జనకుని సందేశమును వినిపించి రాజుపై గల గౌరవముచే అధికముగ మాటలాడ జంకి ఊరకుండిరి.
మూ. దూతవాక్యం చ తచ్ఛ్రుత్వా రాజా పరమహర్షితః,
వసిష్ఠం వామదేవం చ మన్త్రిణోఽన్యాంశ్చ సోఽబ్రవీత్. 16
ప్ర. అ. సః = ఆ, రాజా = రాజు, తత్ = ఆ, దూతవాక్యమ్ = దూతల వాక్యమును, శ్రుత్వా = విని, పరమహర్షితః = చాల సంతసించినవాడై, వసిష్ఠమ్ = వసిష్ఠుని, వామదేవం చ = వామదేవుని, అన్యాన్ = ఇతరు లైన, మన్త్రిణశ్చ = మంత్రులను గూర్చి, అబ్రవీత్ = పలికెను.
తా. దూతవాక్యములు విన్న దశరథుడు మిక్కిలి సంతసించి, వసిష్ఠ వామ దేవులతోడను, ఇతరమంత్రులతోడను ఇట్లు పలికెను.
మూ. గుప్తః కుశికపుత్రేణ కౌసల్యానన్దవర్ధనః,
లక్ష్మణేవ సహ భ్రాత్రా విదేహేషు వసత్యసౌ. 17
ప్ర. అ. అసౌ = ఈ, కౌసల్యానన్దవర్ధనః = కౌసల్యానందమును వృద్ధిపొందించురాముడు, కుశికపుత్రేణ = విశ్వామిత్రుని చేత, గుప్తః = రక్షింపబడిన వాడై, భ్రాత్రా = సోదరు డైన లక్ష్మణునితో కూడ, విదేహేషు = విదేహదేశమునందు, వసతి = నివసించుచున్నాడు.
తా. కౌసల్యానందవర్ధను డైన మన రాముడు విశ్వామిత్రపరిరక్షితుడై, సోదరు డైన లక్ష్మణునితో కూడ ఇపుడు విదేహదేశమునం దున్నాడు.
మూ. దృష్టవీర్యస్తు కాకుత్స్థో జనకేన మహాత్మనా,
సంప్రదానం సుతాయాస్తు రాఘవే కర్తుమిచ్ఛతి. 18
ప్ర. అ. కాకుత్థ్సః = రాముడు, మహాత్మనా = మహాత్ము డైన, జనకేన = జనకునిచేత, దృష్టవీర్యః = చూపబడిన పరాక్రమము కలవాడు. (ఆ జనకుడు), సుతాయాః = కుమార్తె యొక్క, సంప్రదానమ్ = దానమును, రాఘవే = రాముని యందు, కర్తుమ్ = చేయుటకు, ఇచ్ఛతి = కోరుచున్నాడు.
తా. మహాత్ము డైన జనకుడు రాముని పరాక్రమమును చూచి తన కుమార్తెను ఆతని కీయ గోరుచున్నాడు.
మూ. యది వో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః,
పురీం గచ్ఛామహే శీఘ్రం మాభూత్కాలస్య పర్యయః. 19
ప్ర. అ. మహాత్మనః = మహాత్ముడైన, జనకస్య = జనకునియొక్క, వృత్తమ్ = చరితము, వః = మీకు, రోచతే యది = ఇష్టమైనట్లెతే, శీఘ్రమ్ = శీఘ్రముగా, పురీమ్ = మిథిలాపట్టణమును గూర్చి, గచ్ఛామహే = వెళ్ళుదము. కాలస్య = కాలముయొక్క, పర్యయః = జరుగుబాటు, మాభూత్ = లేకపోవుగాక.
తా. మహాత్ము డైన జనకుని ఆచారసంపత్తి మీకు నచ్చిన ట్లయితే విలంబ మేమియు చేయక శీఘ్రముగ మిథిలాపురికి వెళ్లుదము.
మూ. మన్త్రిణో బాఢమిత్యాహుః సహ సర్వైర్మహర్షిభిః,
సుప్రీతశ్చాబ్రవీద్రాజా శ్వో యాత్రేతి స మన్త్రిణః. 20
ప్ర. అ. సర్వైః = సమస్తమైన, మహర్షిభిః సహ = మహర్షులతో గూడ, మన్త్రిణః = మంత్రులు, బాఢమితి = మంచిది అని, ఆహుః = పలికిరి. సుప్రీతః = మిక్కిలి సంతసించిన, సః = ఆ, రాజా = రాజు, శ్వః = రేపు, యాత్రా = ప్రయాణము, ఇతి = అని, మన్త్రిణః = మంత్రులను గూర్చి, అబ్రవీత్ = పలికెను.
తా. మంత్రులును, మహర్షు లందరును, ‘‘తప్పక అట్లే చేయుదము’’ అని పల్కగా దశరథుడు చాల సంతసించి ‘‘రేపే ప్రయాణము’’ అని మంత్రులతో అనెను.
మూ. మన్త్రిణస్తు నరేన్ద్రస్య రాత్రిం పరమసత్కృతాః,
ఊషుస్తే ముదితాః సర్వే గుణైః సర్వైః సమన్వితాః. 21
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే అష్టషష్టితమః సర్గః
ప్ర. అ. సర్వైః = సమస్తమైన, గుణైః = గుణములతో, సమన్వితాః = కూడిన, తే = ఆ, నరేన్ద్రస్య = జనకమహారాజుయొక్క, మన్త్రిణస్తు = మంత్రులైతే, పరమసత్కృతాః = చాల సత్కరింపబడిన వారై, ముదితాః = సంతసించిన వారై, రాత్రిమ్ = ఆ రాత్రి, ఊషుః = నివసించిరి.
తా. సకలసద్గుణ సంపన్ను లగు జనకుని మంత్రులు మంచి సత్కారముల నంది, సంతసించిన వారై ఆ రాత్రి ఆ నగరముననే ఉండిపోయిరి.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో అరువది ఎనిమిదవ సర్గ సమాప్తము.
