Chapter_69

Back
Book Balakandamu
Chapter No 75
Pages 4
Read Time 7 Minutes

Chapter_69

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ ఏకోనసప్తతితమః సర్గః

సేనాసమేతు డైన దశరథుడు మిథిల చేరగా జనకు డాతనిని సత్కరించుట.

మూ. తతో రాత్య్రాం వ్యతీతాయాం సోపాధ్యాయః సబాన్ధవః,

రాజా దశరథో హృష్టః సుమన్త్రమిదమబ్రవీత్. 1

ప్ర. అ. సోపాధ్యాయః = ఉపాధ్యాయులతో గూడిన, సబాన్ధవః = బంధువులతో గూడిన, రాజా = రాజైన, దశరథః = దశరథుడు, హృష్టః = సంతసించినవాడై, తతః = పిమ్మట, రాత్య్రామ్ = రాత్రి, వ్యతీతాయామ్ = గడచిన దగుచుండగా, సుమన్త్రమ్ = సుమంత్రుని గూర్చి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. రాత్రి గడచిన పిమ్మట, బంధువులతోను, ఉపాధ్యాయులతోను, కూడిన దశరథ మహారాజు సంతసించి సుమంత్రునితో ఇట్లు పలికెను.

మూ. అద్య సర్వే ధనాధ్యక్షా ధనమాదాయ పుష్కలమ్,

వ్రజన్త్వగ్రే సువిహితా నానారత్నసమన్వితాః. 2

ప్ర. అ. అద్య = ఇప్పుడు, సర్వే = సమస్త మైన, ధనాధ్యక్షాః = ధనాగారాధ్యక్షులు, పుష్కలమ్ = అత్యధిక మైన, ధనమ్ = ధనమును, ఆదాయ = గ్రహించి, నానారత్నసమన్వితాః = అనేకవిధము లైన రత్నములతో కూడినవారై, సువిహితాః = బాగుగా సిద్ధులై, అగ్రే = ముందు, యాన్తు = వెళ్లెదరుగాక.

తా. ధనాధ్యక్షు లందరును పుష్కలముగా ధనము తీసికొని, వివిధ రత్నములను గూడ గ్రహించి, బాగుగా సంసిద్ధులై ముందుగా వెళ్లెదరుగాక.

మూ. చతురఙ్గబలం చాపి శీఘ్రంనిర్యాతు సర్వశః,

మమాజ్ఞాసమకాలం చ యానయుగ్యమనుత్తమమ్. 3

ప్ర. అ. మమ = నాయొక్క, ఆజ్ఞాసమకాలమ్ = ఆజ్ఞ వెంటనే, చతురఙ్గబలమ్ = చతురంగసైన్యము, సర్వశః = నలువైపులనుండి, నిర్యాతు = బయలుదేరుగాక. అనుత్తమమ్ = శ్రేష్ఠమైన, యానయుగ్యమ్ = పల్లకీలు, రథములు మొదలగునవి కూడ, (బయలుదేరుగాక).

తా. నేను ఆజ్ఞాపించిన క్షణమునందే చతురంగ బలసైన్యము, శ్రేష్ఠమైన పల్లకీలు రథములు మొదలగునవియు బయలుదేరుగాక.

మూ. వసిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః,

మార్కణ్డేయశ్చ దీర్ఘాయుః ఋషిః కాత్యాయనస్తథా. 4

ఏతే ద్విజాః ప్రయాన్త్వగ్రే స్యన్దనం యోజయస్వ మే,

యథా కాలాత్యయో న స్యాద్దూతా హి త్వరయన్తి మామ్. 5

ప్ర. అ. వసిష్ఠః = వసిష్ఠుడును, వామదేవశ్చ = వామదేవుడును, అథ = మరియు, జాబాలిః = జాబాలియు, కాశ్యపః = కాశ్యపుడును, దీర్ఘాయుః = దీర్ఘాయుర్దాయవంతుడగు, మార్కణ్డేయశ్చ = మార్కండేయుడును, తథా = మరియు, ఋషిః = ఋషి యైన, కాత్యాయనః = కాత్యాయనుడు, ఏతే = ఈ, ద్విజాః = బ్రాహ్మణులు, అగ్రే = ముందు, ప్రయాన్తు = నడచెదరుగాక. మే = నాయొక్క, స్యన్దనమ్ = రథమును, యోజయస్వ = కూర్చుము. కాలాత్యయః = కాలము గడచిపోవుట, యథా = ఎట్లు, న స్యాత్ = కాకుండునో, (అట్లు చేయుము). దూతాః = దూతలు, మామ్ = నన్ను, త్వరయన్తి హి = తొందర పెట్టుచున్నారు కదా.

తా. వసిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, దీర్ఘాయుర్దాయవంతుడైన మార్కండేయుడు, కాత్యాయనఋషి - ఈ బ్రాహ్మణు లందరును ముందు వెళ్లెదరుగాక. నా రథమును కూర్చి శీఘ్రముగ తీసికొని రమ్ము. విలంబము చేయవలదు. జనకుని దూతలు నన్ను తొందర పెట్టుచున్నారు.

మూ. వచనాత్తు నరేన్ద్రస్య సా సేనా చతురఙ్గిణీ,

రాజానమృషిభిః సార్ధం వ్రజన్తం పృష్ఠతోఽన్వగాత్. 6

ప్ర. అ. నరేన్ద్రస్య = దశరథమహారాజుయొక్క, వచనాత్ = ఆజ్ఞవలన, చతురఙ్గిణీ = నాలుగు అంగములు గల, సా = ఆ, సేనా = సేన, ఋషిభిః సార్ధమ్ = ఋషులతో కూడ, వ్రజన్తమ్ = వెళ్లుచున్న, రాజానమ్ = రాజును, పృష్ఠతః = వెనుకనే, అన్వగాత్ = అనుసరించి వెళ్లెను.

తా. దశరథమహారాజు ఋషులతో కలిసి వెళ్లుచుండగా, ఆతని ఆజ్ఞానుసారము చతురంగబలము అతని వెనుకనే వెళ్లెను.

మూ. గత్వా చతురహం మార్గం విదేహానభ్యుపేయివాన్,

రాజా తు జనకః శ్రీమాన్ శ్రుత్వా పూజామకల్పయత్. 7

ప్ర. అ. చతురహమ్ = నాల్గుదినముల, మార్గమ్ = మార్గమును, గత్వా = ప్రయాణము చేసి, విదేహాన్ = విదేహదేశమును, అభ్యుపేయివాన్ = చేరినాడు. రాజా = రాజైన, శ్రీమాన్ = శ్రీమంతు డైన, జనకః = జనకుడు, శ్రుత్వా = విని, పూజామ్ = పూజను, అకల్పయత్ = చేసెను.

తా. నాల్గు దివసముల మార్గప్రయాణము చేసి, దశరథుడు విదేహ దేశము చేరగా జనకమహారాజు ఆ విషయము విని, దశరథునకు ఆయా ప్రాంతములలో తగు విధముగ సత్కారముల నేర్పరచెను.

మూ. తతో రాజానమాసాద్య వృద్ధం దశరథం నృపమ్,

జనకో ముదితో రాజా హర్షం చ పరమం యయౌ. 8

ప్ర. అ. తతః = పిమ్మట, రాజా = రాజైన, ముదితః = సంతసించిన, జనకః = జనకుడు, నృపమ్ = మనుష్యులకు పాలకుడును, రాజానమ్ = రాజును, వృద్ధమ్ = వృద్ధుడును, అగు, దశరథమ్ = దశరథుని, ఆసాద్య = సమీపించి, పరమమ్ = గొప్ప, హర్షమ్ = ఆనందమును, యయౌ = పొందెను.

తా. పిమ్మట జనకమహారాజు వృద్ధు డైన దశరథమహారాజును కలిసికొని చాల సంతోషించెను.

మూ. ఉవాచ చ నరశ్రేష్ఠో నరశ్రేష్ఠం ముదాన్నితః,

స్వాగతం తే మహారాజ దిష్ట్వా ప్రాప్తోఽసి రాఘవ, 9

పుత్రయోరుభయోః ప్రీతిం లప్స్యసే వీర్యనిర్జితామ్.

ప్ర. అ. నరశ్రేష్ఠః = నరశ్రేష్ఠుడైన జనకుడు, ముదా = ఆనందముతో, అన్వితః = కూడినవాడై, నరశ్రేష్ఠమ్ = నరశ్రేష్ఠు డైన దశరథుని గూర్చి, ఉవాచ = పలికెను. రాఘవ = రఘువంశమునందు పుట్టిన, మహారాజ = దశరథ మహారాజా!, తే = నీకు, స్వాగతమ్ = స్వాగత మగుగాక. దిష్ట్యా = భాగ్యవశముచేత, ప్రాప్తః అసి = వచ్చినావు. ఉభయోః = ఇద్దరు, పుత్రయోః = పుత్రులయొక్క, వీర్యనిర్జితామ్ = పరాక్రమముచే జయింపబడిన, ప్రీతిమ్ = ఆనందమును, లప్స్యసే = పొందగలవు.

తా. దశరథమహారాజా! నీకు స్వాగతము. నా భాగ్యవశముచే వచ్చినావు. నీ ఇరువురి కుమారుల పరాక్రమముచే ప్రాప్తించిన ఆనందమును పొందగలవు.

మూ. దిష్ట్యా ప్రాప్తో మహాతేజా వసిష్ఠో భగవానృషిః,

సహ సర్వైర్ద్విజశ్రేష్ఠైర్దేవైరివ శతక్రతుః. 10

ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును, భగవాన్ = పూజ్యుడును అగు, వసిష్ఠః ఋషిః = వసిష్ఠమహర్షి, సర్వైః = సమస్త మైన, దివజశ్రేష్ఠైః = బ్రాహ్మణోత్తములతో కూడ, దేవైః = దేవతలతో, శతక్రతురివ = దేవేంద్రుడు వలె, దిష్ట్యా = భాగ్యవశముచేత, ప్రాప్తః = వచ్చినాడు.

తా. మహాతేజఃశాలియు, భగవంతుడును అగు వసిష్ఠమహర్షి, బ్రాహ్మణోత్తములతో కలిసి, దేవతలతో కలిసి దేవేంద్రుడు వలె, నా భాగ్యవశమున ఇచటికి వచ్చినాడు.

మూ. దిష్ట్యా మే నిర్జితా విఘ్నా దిష్ట్యా మే పూజితం కులమ్,

రాఘవైః సహ సమ్బన్ధాద్వీర్యశ్రేష్ఠైర్మహాత్మభిః. 11

ప్ర. అ. వీర్యశ్రేష్ఠైః = వీర్యముచేత శ్రేష్ఠులును, మహాత్మభిః = మహాత్ములును అగు, రాఘవైః సహ = రఘువంశీయులతో కూడ, సంబన్ధాత్ = సంబంధమువలన, దిష్ట్యా = భాగ్యవశముచేత, మే = నాయొక్క, విఘ్నాః = విఘ్నములు, నిర్జితాః = జయింపబడినవి. దిష్ట్యా = భాగ్యవశముచేత, మే = నాయొక్క, కులమ్ = కులము, పూజితమ్ = పూజింపబడినది.

తా. పరాక్రమముచే శ్రేష్ఠులును మహాత్ములును అగు రఘువంశరాజులతో వియ్య మందుటవలన, భాగ్యవశముచే నా విఘ్నము లన్నియు తొలగినవి. భాగ్యవశముచే నా కులము పూజనీయ మైనది.

మూ. శ్వః ప్రభాతే నరేన్దేన్ద్ర నిర్వర్తయితుమర్హసి,

యజ్ఞస్యాన్తే నరశ్రేష్ఠ వివాహమృషిసమ్మతమ్. 12

ప్ర. అ. నరశ్రేష్ఠ = నరశ్రేష్ఠుడ వైన, నరేన్ర్దేన్ద్ర = రాజాధిరాజా! శ్వః = రేపు, ప్రభాతే = ప్రాతఃకాలము, యజ్ఞస్య = యజ్ఞముయొక్క, అన్తే = అంతమునందు, ఋషిసంమతమ్ = ఋషులకు అంగీకారయోగ్యమైన, వివాహమ్ = వివాహమును, నిర్వర్తయితమ్ = జరుపుటకు, అర్హసి = తగియున్నావు.

తా. నరశ్రేష్ఠుడ వైన ఓ రాజాధిరాజా! రేపు ప్రాతఃకాలము యజ్ఞము పూర్తి యైన పిమ్మట ఋషిసంమత మైన వివాహమును నెరవేర్పుము.

మూ. తస్య తద్వచనం శ్రుత్వా ఋషిమధ్యే నరాధిపః,

వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠః ప్రత్యువాచ మహీపతిమ్. 13

ప్ర. అ. వాక్యవిదామ్ = వాక్యవేత్తలలో, వరః = శ్రేష్ఠు డగు, నరాధిపః = రాజు, తస్య = అతనియొక్క, తత్ = ఆ, వచనమ్ = వచనమును, శ్రుత్వా = విని, ఋషి మధ్యే = ఋషుల మధ్యయందు, మహీపతిమ్ = రాజునుగూర్చి, వాక్యమ్ = వాక్యమును, ప్రత్యువాచ = తిరిగి పలికెను.

తా. మాటల నేర్పరులలో శ్రేష్ఠు డగు దశరథమహారాజు జనకుని వచనము విని, అచటి ఋషు లందరును వినుచుండగా ఆతనితో ఇట్లనెను.

మూ. ప్రతిగ్రహో దాతృవశః శ్రుతమేతన్మయా పురా,

యథా వక్ష్యసి ధర్మజ్ఞ తత్కరిష్యామహే వయమ్. 14

ప్ర. అ. ప్రతిగ్రహః = ప్రతిగ్రహము, దాతృవశః = దాతవశములో ఉన్నది. ఏతత్ = ఇది, పురా = పూర్వము, మయా = నాచేత, శ్రుతమ్ = వినబడినది. ధర్మజ్ఞ = ధర్మము నెరిగినవాడా! యథా = ఎట్లు, వక్ష్యసి = చెప్పగలవో, తత్ = అది, వయమ్ = మేము, కరిష్యామహే = చేయగలము.

తా. ధర్మముల నెరిగిన జనకమహారాజా! ప్రతిగ్రహ మనునది దాత చేతిలో నున్నది. దాత ఇచ్చినప్పుడే కదా ప్రతిగ్రహీత ప్రతిగ్రహించునది. నీ కన్యాదాన నిర్ణయాదికమును వినియున్నాము. నీ వెట్లు చెప్పెదవో అట్లే చేసెదము.

మూ. ధర్మిష్ఠం చ యశస్యం చ వచనం సత్యవాదినః,

శ్రుత్వా విదేహాధిపతిః పరం విస్మయమాగతః. 15

ప్ర. అ. సత్యవాదినః = సత్యవాది యైన దశరథునియొక్క, ధర్మిష్ఠం చ = ధర్మసంమతము, యశస్యం చ = యశఃకరము అగు, వచనమ్ = వచనమును, శ్రుత్వా = విని, విదేహాధిపతిః = జనకుడు, పరమ్ = మిక్కిలి, విస్మయమ్ = ఆశ్చర్యమును, ఆగతః = పొందెను.

తా. జనకమహారాజు, సత్యవాది యైన దశరథుడు పలికిన ధర్మసంమతము, యశఃకరము అగు వచనము విని చాల ఆశ్చర్యపడెను.

మూ. తతః సర్వే మునిగణాః పరస్పరసమాగమే,

హర్షేణ మహతా యుక్తాస్తాం నిశామవసన్ సుఖమ్. 16

ప్ర. అ. తతః = పిమ్మట, సర్వే = సమస్తమైన, మునిగణాః = మునిగణములు, పరస్పర సమాగమే = పరస్పరము కలియుటయందు, మహతా = గొప్ప, హర్షేణ = సంతోషముతో, యుక్తాః = కూడినవై, తామ్ = ఆ, నిశామ్ = రాత్రిని, సుఖమ్ = సుఖముగా, అవసన్ = నివసించినవి.

తా. ఆ మునీశ్వరు లందరును, పరస్పరము కలిసినందులకు చాల సంతసించిన వారై, ఆ రాత్రి సుఖముగ గడిపిరి.

మూ. రాజా చ రాఘవౌ పుత్రౌ నిశామ్య పరిహర్షితః,

ఉవాస పరమప్రీతో జనకేన సుపూజిత. 17

ప్ర. అ. రాజా చ = దశరథమహారాజు, పుత్రౌ = పుత్రు లైన, రాఘవౌ = రామలక్ష్మణులను, నిశామ్య = చూచి, పరిహర్షితః = సంతసించినవాడై, జనకేన = జనకునిచేత, సుపూజితః = బాగుగా పూజింపబడిన వాడై, పరమప్రీతః = మిక్కిలి ఆనందించిన వాడై, ఉవాస = నివసించెను.

తా. దశరథమహారాజు పుత్రు లైన రామలక్ష్మణులను జూచి ఆనందభరితుడై, జనకుని సత్కారములకు సంతుష్టుడై నివసించెను.

మూ. జనకోఽపి మహాతేజాః క్రియాం ధర్మేణ తత్త్వవిత్,

యజ్ఞస్య చ సుతాభ్యాం చ కృత్వా రాత్రిమువాస హ. 18

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే ఏకోనసప్తతితమః సర్గః

ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, తత్త్వవిత్ = ధర్మరహస్యముల నెరిగిన, జనకోఽపి = జనకుడు కూడ, యజ్ఞస్య = యజ్ఞముయొక్కయు, సుతాభ్యాం చ = కుమార్తెల కొరకును, క్రియామ్ = క్రియను, కృత్వా = చేసి, రాత్రిమ్ = రాత్రి, ఉవాస హ = నివసించెను.

తా. గొప్ప తేజస్సు కలవాడును, ధర్మరహస్యముల నెరిగినవాడును అగు జనకమహారాజు, యజ్ఞమునకు సంబంధించిన కర్మలను, కుమార్తెల వివాహమునకు సంబంధించిన అంకురారోపణాదిక్రియలను పూర్తిచేసికొని ఆ రాత్రి గడపెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో అరువది తొమ్మిదవ సర్గ సమాప్తము.