Chapter_70

Back
Book Balakandamu
Chapter No 76
Pages 11
Read Time 17 Minutes

Chapter_70

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ సప్తతితమః సర్గః

జనకుడు దూతలను పంపి సాంకాశ్యమునుండి తమ్ముడైన కుశధ్వజుని రప్పించుట. దశరథుని కోరిక ననుసరించి వసిష్ఠుడు సూర్యవంశీయరాజులను వర్ణించి రామలక్ష్మణులకొరకై సీతా ఊర్మిళలను వరించుట.

మూ. తతః ప్రభాతే జనకః కృతకర్మా మహర్షిభిః,

ఉవాచ వాక్యం వాక్యజ్ఞః శతానన్దం పురోహితమ్. 1

ప్ర. అ. తతః = పిమ్మట, ప్రభాతే = ప్రాతఃకాలమున, మహర్షిభిః = మహర్షులచేత, కృతకర్మా = చేయబడినకర్మలు గల, వాక్యజ్ఞః = మాటలలో నేర్పరి యైన, జనకః = జనకుడు, పురోహితమ్ = పురోహితు డైన, శతానన్దమ్ = శతానందుని గూర్చి, వాక్యమ్ = వాక్యమును, ఉవాచ = పలికెను.

తా. ప్రాతఃకాలమున మహర్షులు కర్తవ్యకర్మ లన్నియు చేయించిన పిమ్మట వాక్యకుశలు డైన జనకుడు పురోహితు డైన శతానందునితో ఇట్లనెను.

మూ. భ్రాతా మమ మహాతేజా యవీయానతిధార్మికః,

కుశధ్వజ ఇతి ఖ్యాతః పురీమధ్యవసచ్ఛుభామ్. 2

వార్యాఫలకపర్యన్తాం పిబన్నిక్షుమతీం నదీమ్,

సాఙ్కాశ్యాం పుణ్యసంకాశాం విమానమివ పుష్పకమ్. 3

ప్ర. అ. అతిధార్మికః = మిక్కిలిధార్మికుడును, కుశధ్వజః ఇతి = కుశధ్వజుడని, ఖ్యాతః = ప్రసిద్ధుడును అగు, మహాతేజాః = గొప్ప తేజస్సు గల, మమ = నాయొక్క, యవీయాన్ = చిన్న, భ్రాతా = సోదరుడు, ఇక్షుమతీమ్ = ఇక్షుమతి అనెడు, నదీమ్ = నదిని, పిబన్ = త్రాగుచు, వార్యాఫలకపర్యన్తామ్ = నీటిలో నాటబడిన శూలములు సరిహద్దుగా గల, శుభామ్ = శుభ మైన, పుణ్యసంకాశామ్ = పుణ్యముతో సమాన మైన (పరిశుద్ధమైన), సాంకాశ్యామ్ = సాంకాశ్య మనెడు, పురీమ్ = పట్టణమును, పుష్పకమ్ = పుష్పక మనెడు, విమానమివ = విమానమును వలె, అధ్యవసత్ = నివసించియున్నాడు.

తా. మహాతేజశ్శాలియు, అతిధార్మికుడను అగు నా తమ్ము డగు కుశధ్వజుడు, ఇక్షుమతీజలమును త్రాగుచు (ఇక్షుమతీనదీతీరమున) నీటిలో పాతిన ఇనుప శూలములు సరిహద్దుగా గలదియు, పరిశుద్ధ మైనదియు, పుష్పక విమానము వంటిదియు అగు శుభమైన సాంకాశ్యనగరములో నివసించుచున్నాడు.

మూ. తమహం ద్రష్టుమిచ్ఛామి యజ్ఞగోప్తా స మే మతః,

ప్రీతిం సోఽపి మహాతేజా ఇమాం భోక్తా మయా సహ. 4

ప్ర. అ. అహమ్ = నేను, తమ్ = ఆతనిని, ద్రష్టుమ్ = చూచుటకు, ఇచ్ఛామి = కోరుచున్నాను. సః = ఆతడు, మే = నాయొక్క, యజ్ఞగోప్తా = యజ్ఞమును రక్షించువాడుగా, మతః = అంగీకరింపబడినవాడు. మహాతేజాః = గొప్ప తేజస్సు గల, సోఽపి = అతడు కూడ, మయా సహ = నాతో కూడ, ఇమామ్ = ఈ, ప్రీతిమ్ = ఆనందమును, భోక్తా = అనుభవింపగలడు.

తా. అతడు సంభారములను సమకూర్చుట మొదలగు పనుల ద్వారా నాకు యజ్ఞ సంరక్షణ చేసినవాడు. ఆతనిని చూడవలె నని అనుకొనుచున్నాను. ఆ మహాతేజస్వి కూడ నాతో ఈ ఆనందమును అనుభవించవలెను.

మూ. ఏవముక్తే తు వచనే శతానన్దస్య సన్నిధౌ,

ఆగతాః కేచిదవ్యగ్రా జనకస్తాన్ సమాదిశత్. 5

ప్ర. అ. శతానన్దస్య = శతానందునియొక్క, సన్నిధౌ = సంనిధియందు, ఏవమ్ = ఇట్లు, వచనే = వచనము, ఉక్తే సతి = పలుకబడిన దగుచుండగా, అవ్యగ్రాః = తొందరపాటు లేని, కేచిత్ = కొంతమంది, ఆగతాః = వచ్చిరి. జనకః = జనకుడు, తాన్ = వారిని, సమాదిశత్ = ఆజ్ఞాపించెను.

తా. జనకుడు శతానందునితో ఇట్లు చెప్పగా అచటికి శతానందుడు పిలువ నంపగా వచ్చిన కొందరు ఉత్సాహవంతు లగు దూతలను జనకుడాజ్ఞాపించెను.

మూ. శాసనాత్తు నరేన్ద్రస్య ప్రయయుః శీఘ్రవాజిభిః,

సమానేతుం నరవ్యాఘ్రం విష్ణుమిన్ద్రాజ్ఞయా యథా. 6

ప్ర. అ. నరేన్ద్రస్య = జనకమహారాజుయొక్క, శాసనాత్ = ఆజ్ఞవలన, ఇన్ద్రాజ్ఞయా = ఇంద్రుని ఆజ్ఞచేత, విష్ణుం యథా = విష్ణువును వలె, నరవ్యాఘ్రమ్ = నరశ్రేష్ఠు డైన కుశధ్వజుని, సమానేతుమ్ = తీసికొని వచ్చుటకు, శీఘ్రవాజిభిః = శీఘ్రముగా నడచు గుఱ్ఱములచే, ప్రయయుః = వెళ్లిరి.

తా. ఆ దూతలు జనకుని ఆజ్ఞ ప్రకారము, ఇంద్రుని ఆజ్ఞ ప్రకారము విష్ణువును వలె, ఆ కుశధ్వజుని తీసికొని వచ్చుటకై శీఘ్రముగా పరుగెత్తు అశ్వములధిరోహించి వెళ్లిరి.

మూ. సాఙ్కాశ్యాం తే సమాగత్య దదృశుశ్చ కుశధ్వజమ్,

న్యవేదయన్యథావృత్తం జనకస్య చ చిన్తితమ్. 7

ప్ర. అ. తే = ఆ దూతలు, సాఙ్కాశ్యామ్ = సాంకాశ్యనగరమును, సమాగమ్య = చేరి, కుశధ్వజమ్ = కుశధ్వజుని, దదృశుశ్చ = చూచిరి. యథావృత్తమ్ = జరిగిన విషయము నంతను, జనకస్య = జనకునియొక్క, చిన్తితమ్ = ఆలోచనను, న్యవేదయన్ చ = తెలిపిరికూడ.

తా. వారు సాంకాశ్యమునకు వెళ్లి కుశధ్వజుని చూచి, జరిగిన విషయము నంతను తెలిపి జనకుని అభిప్రాయమును నివేదించిరి.

మూ. తద్వృత్తం నృపతిః శ్రుత్వా దూతశ్రేష్ఠైర్మహాబలైః,

ఆజ్ఞయాథ నరేన్ద్రస్య ఆజగామ కుశధ్వజః. 8

ప్ర. అ. నృపతిః = రాజైన, కుశధ్వజః = కుశధ్వజుడు, మహాబలైః = గొప్పబలము గల, దూతశ్రేష్ఠైః = శ్రేష్ఠు లైన దూతలచే చెప్పబడిన, తత్ = ఆ, వృత్తమ్ = వృత్తాంతమును, శ్రుత్వా = విని, అథ = పిమ్మట, నరేన్ద్రస్య = జనక మహారాజుయొక్క, ఆజ్ఞయా = ఆజ్ఞచేత, ఆజగామ = వచ్చెను.

తా. కుశధ్వజుడు మహాబలవంతు లగు ఆ దూతలు చెప్పిన వృత్తాంతమును విని జనకుని ఆజ్ఞ ననుసరించి మిథిలానగరమునకు వచ్చెను.

మూ. స దదర్శ మహాత్మానం జనకం ధర్మవత్సలమ్,

సోఽభివాద్య శతానన్దం రాజానం చాపి ధార్మికమ్, 9

రాజార్హం పరమం దివ్యమాసనం చాధ్యరోహత.

ప్ర. అ. సః = ఆతడు, ధర్మవత్సలమ్ = ధర్మమునందు ఆసక్తి గల, మహాత్మానమ్ = మహాత్ముడైన, జనకమ్ = జనకుని, దదర్శ = చూచెను. సః = ఆతడు, శతానన్దమ్ = శతానందుని, ధార్మికమ్ = ధార్మికు డైన, రాజానం చ = జనకుని, అభివాద్య = నమస్కరించి, రాజార్హమ్ = రాజుకు తగిన, పరమమ్ = గొప్ప దైన, దివ్యమ్ = శ్రేష్ఠమైన, ఆసనమ్ = ఆసనమును, అధ్యరోహత = అధిష్ఠించెను.

తా. ఆ కుశధ్వజుడు, ధర్మనిరతుడును, మహాత్ముడును అగు జనకుని చూచెను. శతానందునకును, ధార్మికు డైన జనకునకును అభివాదనము చేసి, రాజోచిత మగు శ్రేష్ఠ మైన ఆసనమును అధిష్ఠించెను.

మూ. ఉపవిష్టావుభౌ తౌ తు భ్రాతరావతితేజసౌ,

ప్రేషయామాసతుర్వీరౌ మన్త్రిశ్రేష్ఠం సుదామనమ్. 10

ప్ర. అ. అతితేజసౌ = గొప్ప తేజస్సు గల, తౌ = ఆ, వీరౌ = వీరు లైన, ఉభౌ = ఇద్దరు, భ్రాతరౌ = సోదరులు, ఉపవిష్టౌ = కూర్చున్న వారై, మన్త్రిశ్రేష్ఠమ్ = మంత్రులలో శ్రేష్ఠుడైన, సుదామనమ్ = సుదామనుని, ప్రేషయామాసతుః = పంపిరి.

తా. మహాతేజఃశాలులును, వీరులును అగు ఆ సోదరు లిరువురును కూర్చుండి మంత్రులలో శ్రేష్ఠు డైన సుదామనుని (దశరథుని వద్దకు) పంపిరి.

మూ. గచ్ఛ మన్త్రిపతే శీఘ్రమైక్ష్వాకుమమితప్రభమ్,

ఆత్మజైః సహ దుర్ధర్షమానయస్వ సమన్త్రిణమ్. 11

ప్ర. అ. మన్త్రిపతే = మన్త్రిశ్రేష్ఠుడా, శీఘ్రమ్ = శీఘ్రముగా, అమితప్రభమ్ = సాటి లేని కాంతి గలవాడగు, ఐక్ష్వాకుమ్ = దశరథమహారాజును గూర్చి, గచ్ఛ = వెళ్లుము. దుర్ధర్షమ్ = ఎదిరింప శక్యము కానివాడును, సమన్త్రిణమ్ = మంత్రులతో కూడిన వాడును అగు ఆతనిని, ఆత్మజైః సహ = కుమారులతో కూడ, సమానయస్వ = తీసికొని రమ్ము.

తా. మహామంత్రీ! ఎదిరింప శక్యము కానివాడును, అమిత మైన తేజస్సు కలవాడును అగు దశరథుని వద్దకు వెళ్లి, పుత్రమంత్రి సమేతముగ ఆతనిని తీసికొని రమ్ము.

మూ. ఔపకార్యం స గత్వా తు రఘూణాం కులవర్ధనమ్,

దదర్శ శిరసా చైనమభివాద్యేదమబ్రవీత్. 12

ప్ర. అ. సః = ఆతడు, ఔపకార్యమ్ = విడిదిని గూర్చి, గత్వా = వెళ్లి, రఘూణామ్ = రఘువంశీయుల, కులవర్ధనమ్ = కులమును వృద్ధి పొందించు ఆ దశరథుని, దదర్శ = చూచెను. ఏనమ్ = ఈతనిని, శిరసా = శిరస్సుచేత, అభివాద్య = నమస్కరించి, ఇదమ్ = ఈ వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. ఆతడు విడిదికి వెళ్ళి, అచట రఘువంశవర్ధను డైన దశరథుని చూచి, తల వంచి నమస్కరించి ఇట్లు చెప్పెను.

మూ. అయోధ్యాధిపతే వీర వైదేహో మిథిలాధిపః,

స త్వాం ద్రష్టుం వ్యవసితః సోపాధ్యాయపురోహితమ్. 13

ప్ర. అ. వీర = వీరుడ వైన, అయోధ్యాధిపతే = అయోధ్యాధీశా! మిథిలాధిపః = మిథిలారాజైన, సః = ఆ, వైదేహః = జనకుడు, సోపాధ్యాయపురోహితమ్ = ఉపాధ్యాయులతోడను పురోహితులతోడను కూడిన, త్వామ్ = నిన్ను, ద్రష్టుమ్ = చూచుటకు, వ్యవసితః = నిశ్చయించినాడు.

తా. మహావీరుడ వైన దశరథమహారాజా! మిథిలాధిపతి యైన జనక మహారాజు, ఉపాధ్యాయపురోహితసమేతుడ వైన నిన్ను చూడవలె నని అనుకొనుచున్నాడు.

మూ. మన్త్రిశ్రేష్ఠవచః శ్రుత్వా రాజా సర్షిగణస్తదా,

సబన్ధురగమత్తత్ర జనకో యత్ర వర్తతే. 14

ప్ర. అ. తదా = అప్పుడు, రాజా = దశరథుడు, మన్త్రిశ్రేష్ఠవచః = మంత్రి శ్రేష్ఠుని వచనమును, శ్రుత్వా = విని, సర్షిగణః = ఋషిగణముతో కూడిన వాడై, సబన్ధుః = బంధువులతో కూడినవాడై, జనకః = జనకుడు, యత్ర = ఎచట, వర్తతే = ఉంటున్నాడో, తత్ర = అచటికి, అగమత్ = వెళ్లెను.

తా. దశరథమహారాజు మంత్రి మాటలు విని, ఋషులతోను, బంధువులతోను కలిసి జనకు డున్న చోటికి వెళ్లెను.

మూ. స రాజా మన్త్రిసహితః సోపాధ్యాయః సబాన్ధవః,

వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠో వైదేహమిదమబ్రవీత్. 15

ప్ర. అ. మన్త్రిసహితః = మంత్రులతో కూడిన, సబాన్ధవః = బంధువులతో కూడిన, సః = ఆ, వాక్యవిదామ్ = వాక్యవేత్తలలో, శ్రేష్ఠః = శ్రేష్ఠు డైన, రాజా = రాజు, వైదేహమ్ = జనకమహారాజును గూర్చి, ఇదమ్ = ఈ, వాక్యమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.

తా. బంధువులతోడను, ఉపాధ్యాయులతోడను కూడినవాడును, మాటలో నేర్పరియు అగు దశరథుడు జనకునితో ఇట్లు పలికెను.

మూ. విదితం తే మహారాజ ఇక్ష్వాకుకులదైవతమ్,

వక్తా సర్వేషు కృత్యేషు వసిష్ఠో భగవానృషిః. 16

ప్ర. అ. మహారాజ = మహారాజా!, భగవాన్ = పూజ్యు డైన, వసిష్ఠః = వసిష్ఠమహర్షి, ఇక్ష్వాకుకులదైవతమ్ = ఇక్ష్వాకువంశీయులకు దేవత యనియు, సర్వేషు = సమస్త మైన, కృత్యేషు = కార్యములందు, వక్తా = మాటలాడువాడనియు, తే = నీకు, విదితమ్ = తెలియును కదా.

తా. మహారాజా! పూజ్యు డైన వసిష్ఠమహర్షి మా వంశమువారి కందరికిని దేవత అనియు, అన్ని పనులందును మా పక్షమున మాటలాడువాడనియు నీకు తెలియును గదా?

మూ. విశ్వామిత్రాభ్యనుజ్ఞాతః సహ సర్వైర్మహర్షిభిః,

ఏష వక్ష్యతి ధర్మాత్మా వసిష్ఠో మే యథాక్రమమ్. 17

ప్ర. అ. సర్వైః = సమస్త మైన, మహర్షిభిః = సహ = మహర్షులతో కూడ, విశ్వామిత్రాభ్యనుజ్ఞాతః = విశ్వామిత్రునిచే అనుజ్ఞ ఇవ్వబడినవాడై, ధర్మాత్మా = ధర్మాత్ము డైన, ఏషః = ఈ, వసిష్ఠః = వసిష్ఠుడు, యథాక్రమమ్ = క్రమానుసారముగా, మే = నాయొక్క (వంశమును గూర్చి), వక్ష్యతి = చెప్పగలడు.

తా. విశ్వామిత్రుని అనుజ్ఞను, సకలమహర్షుల అనుజ్ఞను పొంది ధర్మాత్ముడైన వసిష్ఠుడు నా వంశములోని పూర్వపురుషులను గూర్చి యథాక్రమముగా చెప్పగలడు.

మూ. ఏవముక్త్వా నరశ్రేష్ఠే రాజ్ఞాం మధ్యే మహాత్మనామ్, 18

తూష్ణీంభూతే దశరథే వసిష్ఠో భగవానృషిః,

ఉవాచ వాక్యం వాక్యజ్ఞో వైదేహం సపురోధసమ్. 19

ప్ర. అ. నరశ్రేష్ఠే = నరులలో శ్రేష్ఠుడైన, దశరథే = దశరథుడు, మహాత్మనామ్ = మహాత్ములైన, రాజ్ఞామ్ = రాజులయొక్క, మధ్యే = మధ్యయందు, ఏవమ్ = ఇట్లు, ఉక్త్వా = పలికి, తూష్ణీంభూతే = మౌనముగా నుండగా, వాక్యజ్ఞః = వాక్యముల నెరిగినవాడును, భగవాన్ = పూజ్యుడును అగు, వసిష్ఠః ఋషిః = వసిష్ఠమహర్షి, సపురోధసమ్ = పురోహితులతో గూడిన, వైదేహమ్ = జనకుని గూర్చి, వాక్యమ్ = వాక్యమును, ఉవాచ = పలికెను.

తా. నరులలో శ్రేష్ఠు డగు దశరథుడు ఈ విధముగ పలికి ఊరకుండెను. అపుడు మాటలలో నేర్పరి యగు పూజ్యు డైన వసిష్ఠమహర్షి, పురోహితులతో గూడిన జనకమహారాజుతో ఇట్లనెను.

మూ. అవ్యక్తప్రభవో బ్రహ్మా శాశ్వతో నిత్య అవ్యయః,

తస్మాన్మరీచిః సంజజ్ఞే మరీచేః కాశ్యపః సుతః. 20

ప్ర. అ. అవ్యక్తప్రభవః = అవ్యక్తమునుండి పుట్టినవాడును, శాశ్వతః = ఎల్లప్పుడు ఉండువాడును, నిత్యః = నిత్యుడును, అవ్యయః = వినాశము లేని వాడును అగు, బ్రహ్మా = బ్రహ్మదేవుడు (ఉన్నాడు). తస్మాత్ = అతనినుండి, మరీచిః = మరీచిమహర్షి, సంజజ్ఞే = పుట్టెను. మరీచేః = మరీచినుండి, కాశ్యపః = కాశ్యపు డను, సుతః = కుమారుడు (జనించెను).

తా. అవ్యక్తమునుండి పుట్టినవాడును, ఎల్లప్పుడు ఉండువాడును, నిత్యుడును, వినాశరహితుడును అగు బ్రహ్మదేవుని నుండి మరీచియు, మరీచినుండి కాశ్యపు డనెడు కుమారుడును పుట్టెను.

మూ. వివస్వాన్ కాశ్యపాద్ జజ్ఞే మనుర్వైవస్వతః స్మృతః,

మనుః ప్రజాపతిః పూర్వమిక్ష్వాకుస్తు మనోస్సుతః. 21

ప్ర. అ. కాశ్యపాత్ = కాశ్యపునినుండి, వివస్వాన్ = సూర్యుడు, జజ్ఞే = పుట్టెను. వైవస్వతః = సూర్యుని కుమారుడు, మనుః = మనువు అని, స్మృతః = చెప్పబడినాడు. మనుః = మనువు, పూర్వమ్ = పూర్వము, ప్రజాపతిః = ప్రజాపతిగా ఉండెను. ఇక్ష్వాకుః = ఇక్ష్వాకువు, మనోః = మనువుయొక్క, సుతః = కుమారుడు.

తా. కాశ్యపునకు సూర్యుడు జనించెను. సూర్యుని కుమారుడు మనువు. పూర్వము ప్రజాపతిగ ఉన్న మనువునకు ఇక్ష్వాకువు అను పుత్రుడు జనించెను.

మూ. తమిక్ష్వాకుమయోధ్యాయాం రాజానం విద్ధి పూర్వకమ్,

ఇక్ష్వాకోస్తు సుతః శ్రీమాన్ కుక్షిరిత్యేవ విశ్రుతః. 22

ప్ర. అ. తమ్ = ఆ, ఇక్ష్వాకుమ్ = ఇక్ష్వాకువును, అయోధ్యాయామ్ = అయోధ్యయందు, పూర్వకమ్ = మొదటి వాడైన, రాజానమ్ = రాజునుగా, విద్ధి = తెలుసుకొనుము. శ్రీమాన్ = శ్రీమంతు డైన, కుక్షిరిత్యేవ = కుక్షి అని, విశ్రుతః = ప్రసిద్ధ మైనవాడు, ఇక్ష్వాకోః = ఇక్ష్వాకువుయొక్క, సుతః = కుమారుడు.

తా. ఆ ఇక్ష్వాకువు అయోధ్యలో మొదటి రాజుగా ఉండెను. శ్రీమంతుడగు కుక్షి ఇక్ష్వాకుని పుత్రుడు.

మూ. కుక్షేరథాత్మజః శ్రీమాన్ వికుక్షిరుదపద్యత,

వికుక్షేస్తు మహాతేజా బాణః పుత్రః ప్రతాపవాన్. 23

ప్ర. అ. అథ = పిమ్మట, కుక్షేః = కుక్షికి, శ్రీమాన్ = శ్రీమంతు డైన, వికుక్షిః = వికుక్షి, ఆత్మజః = కుమారుడుగా, ఉదపద్యత = పుట్టెను. మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును, ప్రతాపవాన్ = ప్రతాపము కలవాడును అగు, బాణః = బాణుడు, వికుక్షేః = వికుక్షియొక్క, పుత్రః = పుత్రుడుగా, పుట్టెను.

తా. పిమ్మట కుక్షికి వికుక్షి అను నతడు కుమారుడుగా పుట్టెను. వికుక్షి కుమారుడు, మహాతేజఃశాలియు ప్రతాపవంతుడును అగు బాణుడు.

మూ. బాణస్య తు మహాతేజా అనరణ్యః ప్రతాపవాన్,

అనరణ్యాత్పృథుర్జజ్ఞే త్రిశఙ్కుస్తు పృథోః సుతః. 24

ప్ర. అ. మహాతేజాః = గొప్ప తేజస్సు కల, ప్రతాపవాన్ = ప్రతాపవంతుడైన, అనరణ్యః = అనరణ్యుడు, బాణస్య = బాణుని కుమారుడు, అనరణ్యాత్ = అనరణ్యునినుండి, పృథుః = పృథువు, జజ్ఞే = పుట్టెను. త్రిశఙ్కుః తు = త్రిశంకువు, పృథోః = పృథువుయొక్క, సుతః = కుమారుడు.

తా. మహాతేజస్వి, ప్రతాపవంతుడు అయిన అనరణ్యుడు బాణుని కుమారుడు. అనరణ్యునకు పృథువు, పృథువునకు త్రిశంకువు కుమారుడుగా జనించెను.

మూ. త్రిశఙ్కోరభవత్పుత్రో దున్దుమారో మహాయశాః,

యువనాశ్వసుతస్త్వాసీన్మాన్ధాతా పృథివీపతిః. 25

ప్ర. అ. త్రిశఙ్కోః = త్రిశంకువునకు, మహాయశాః = గొప్ప కీర్తి గల, దున్దుమారః = దుందుమారుడను, పుత్రః = పుత్రుడు, అభవత్ = పుట్టెను. మాన్ధాతా = మాంధాత అను, పృథివీపతిః = రాజు, యువనాశ్వసుతః = యువనాశ్వుని కుమారుడుగా, ఆసీత్ = పుట్టెను.

తా. త్రిశంకువునకు దుందుమారు డను గొప్ప కీర్తి గల కుమారుడు పుట్టెను. ఆతనికి యువనాశ్వు డని కూడ పేరు. మాంధాతచక్రవర్తి యువనాశ్వుని కుమారుడు.

మూ. మాన్ధాతుస్తు సుతః శ్రీమాన్ సుసంధిరుదపద్యత,

సుసన్ధేరపి పుత్రౌ ద్వౌ ధ్రువసన్ధిః ప్రసేనజిత్. 26

ప్ర. అ. మాన్ధాతుః = మాంధాతకు, సుసన్ధిః = సుసంధి అను, శ్రీమాన్ = శ్రీమంతు డైన, సుతః = కుమారుడు, ఉదపద్యత = పుట్టెను. సుసన్ధేరపి = సుసంధికి కూడ, ధ్రువసన్ధిః = ధ్రువసంధి అనియు, ప్రసేనజిత్ = ప్రసేనజిత్తు అనియు, ద్వౌ = ఇరువురు, పుత్రౌ = పుత్రులు జనించిరి.

తా. మాంధాతకు సుసంధి యను శ్రీమంతు డగు కుమారుడు జనించెను. ఆతనికి ధ్రువసంధి, ప్రసేనజిత్తు అను ఇరువురు కుమారులు జనించిరి.

మూ. యశస్వీ ధ్రువసన్ధేస్తు భరతో నామ నామతః,

భరతాత్తు మహాతేజా అసితో నామ జాతవాన్. 27

ప్ర. అ. ధ్రువసన్ధేః తు = ధ్రువసంధికి, నామతః = పేరుచే, భరతః నామ = భరతు డను, యశస్వీ = కీర్తిశాలియు, భరతాత్ తు = భరతునినుండి, మహాతేజాః = గొప్ప తేజస్సు గల, అసితో నామ = అసితు డను పేరు గలవాడు, జాతవాన్ = పుట్టెను.

తా. ధ్రువసంధికి కీర్తిమంతు డగు భరతు డను కుమారుడు పుట్టెను. భరతునకు గొప్ప తేజస్సు గల అసితు డను కుమారుడు పుట్టెను.

మూ. యస్యైతే ప్రతిరాజాన ఉదపద్యన్త శత్రవః,

హైహయాస్తాలజఙ్ఘాశ్చ శూరాశ్చ శశిబిన్దవః. 28

ప్ర. అ. యస్య = ఏ అసితునకు, హైహయాః = హైహయులును, తాలజఙ్ఘాశ్చ = తాలజంఘులును, శూరాః = శూరు లైన, శశిబిన్దవశ్చ = శశిబిందువులును అను, ఏతే = ఈ, ప్రతిరాజానః = ఎదిరించే రాజులు, శత్రవః = శత్రువులుగా, ఉదపద్యన్త = అయిరో.

తా. హైహయ-తాలజంఘ-శశిబిందు వంశములకు చెందిన రాజులు ఈ అసితునకు శత్రువు లైరి.

మూ. తాంస్తు స ప్రతియుధ్యన్ వై యుద్ధే రాజా ప్రవాసితః,

హిమవన్తముపాగమ్య భృగుపస్రవణేఽవసత్. 29

అసితోఽల్పబలో రాజా మన్త్రిభిః సహితస్తదా.

ప్ర. అ. సః = ఆ, రాజా = రాజు, తాన్ = వారిని, యుద్ధే = యుద్ధమునందు, ప్రతియుధ్యన్ = ఎదిరించి యుద్ధము చేయుచు, ప్రవాసితః = రాజ్యమునుండి తొలగింపబడినాడు. రాజా = రాజైన, అసితః = అసితుడు, అల్పబలః = అల్పమైన సేన కలవాడై, మన్త్రిభిః = మంత్రులతో, సహితః = కూడిన వాడై, తదా = అపుడు, హిమవన్తమ్ = హిమవత్పర్వతమును, ఉపాగమ్య = చేరి, భృగుప్రస్రవణే = భృగుపస్రవణ మను ప్రదేశమునందు, అవసత్ = నివసించెను.

తా. ఆ అసితమహారాజు శత్రువులతో యుద్ధము చేసి, పరాజితుడై రాజ్యభ్రష్టు డయ్యెను. అల్ప మైన సైన్యముతోడను, మంత్రులతోడను, కలిసి హిమవత్పర్వతమునకు వెళ్లి అచట భృగుప్రస్రవణ మను ప్రదేశమున నివసించెను.

మూ. ద్వే చాస్య భార్యే గర్భిణ్యౌ బభూవతురితి శ్రుతమ్,

ఏకా గర్భవినాశాయ సపత్న్యై సగరం దదౌ. 30

ప్ర. అ. అస్య = ఇతనియొక్క, ద్వే = ఇరువురు, భార్యే = భార్యలు, గర్భిణ్యౌ = గర్భవతులై, బభూవతుః = ఉండిరి. ఏకా = ఒక భార్య, గర్భవినాశాయ = గర్భము నశించుటకై, సపత్న్యై = సవతికి, సగరమ్ = విషముతో కూడిన ఆహారమును, దదౌ = ఇచ్చెను, ఇతి = అని, శ్రుతమ్ = వినబడినది.

తా. ఆ సమయమున అతని భార్యలలో ఇద్దరు గర్భవతులై యుండిరి వారిలో ఒకతె సవతి గర్భము నష్ట మగుటకై ఆమెకు విషముతో కూడిన ఆహార మిచ్చినదట.

మూ. తతః శైలవరం రమ్యం బభూవాభిరతో మునిః,

భార్గవశ్చ్యవనో నామ హిమవన్తముపాశ్రితః. 31

ప్ర. అ. తతః = అటుపిమ్మట, రమ్యమ్ = రమ్య మైన, శైలవరమ్ = శైలశ్రేష్ఠమును గూర్చి, అభిరతః = అభిరుచి గల, భార్గవః = భృగువంశోద్భవు డైన, చ్యవనో నామ = చ్యవను డను ఋషి, హిమవన్తమ్ = హిమవత్పర్వతమును, ఉపాశ్రితః = ఆశ్రయించినాడు.

తా. ఆ దివసములలో రమ్య మైన పర్వతశ్రేష్ఠమునందు అభిరుచి గల, భృగువంశ సంజాతు డగు చ్యవనుడు హిమవత్పర్వతమునకు వచ్చెను.

మూ. తత్రైకా తు మహాభాగా భార్గవం దేవవర్చసమ్,

వవన్దే పద్మపత్రాక్షీ కాఙ్క్షన్తీ సుతమాత్మనః. 32

ప్ర. అ. మహాభాగా = గొప్ప భాగ్యము కలదియు, పద్మపత్రాక్షీ = పద్మపత్రముల వంటి కన్నులు కలదియు అగు, తయోః ఏకా = ఆ ఇరువురు రాజ భార్యలలో ఒకతె, ఆత్మనః = తనకు, సుతమ్ = పుత్రుని, కాఙ్క్షన్తీ = కోరుచున్నదై, దేవవర్చసమ్ = దేవతల వంటి కాంతి గల, భార్గవమ్ = చ్యవనుని, వవన్దే = నమస్కరించెను.

తా. గొప్ప భాగ్యము కలదియు, పద్మపత్రాక్షియు అగు ఒక రాజభార్య తనకు కుమారుడు కావలె నని కోరుచు, దేవతల వంటి కాంతి గల ఆ చ్యవనుని నమస్కరించెను.

మూ. తమృషిం సాభ్యుపాగమ్య కాళిన్దీ చాభ్యవాదయత్,

స తామభ్యవదద్విప్రః పుత్రేప్సుం పుత్రజన్మని. 33

ప్ర. అ. సా = ఆ, కాళిన్దీ చ = కాళింది అను పేరు గల విషము పెట్టిన భార్యకూడ, తమ్ = ఆ, ఋషిమ్ = ఋషిని, అభ్యుపాగమ్య = సమీపించి, అభ్యవాదయత్ = నమస్కరించెను, సః = ఆ, విప్రః = బ్రాహ్మణుడు, తామ్ = ఆ, పుత్రేప్సుమ్ = పుత్రుని కోరు భార్యను గూర్చి, పుత్రజన్మని = పుత్రజన్మవిషయమున, అభ్యవదత్ = పలికెను.

తా. సవతికి విషము పెట్టిన కాళింది కూడ ఆ మునివద్దకు వెళ్లి నమస్కరించెను. అతడు పుత్రాభిలాషిణి యగు రాజభార్యతో ఇట్లు చెప్పెను.

మూ. తవ కుక్షౌ మహాభాగే సుపుత్రః సుమహాబలః, 34

మహావీర్యో మహాతేజా అచిరాత్సంభవిష్యతి,

గరేణ సహితః శ్రీమాన్మా శుచః కమలేక్షణే. 35

ప్ర. అ. మహాభాగే = గొప్ప భాగ్యము కలదానా!, తవ = నీయొక్క, కుక్షౌ = కుక్షియందు, సుమహాబలః = చాల గొప్ప బలము కలవాడును, మహావీర్యః = గొప్ప వీర్యము కలవాడును, మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును అగు, సుపుత్రః = సుపుత్రుడు, (ఉన్నాడు). శ్రీమాన్ = శ్రీమంతు డైన అతడు, గరేణ = విషముతో, సహితః = కూడిన వాడై, అచిరాత్ = కొంచెము కాలములో, సంజనిష్యతి = పుట్టగలడు; కమలేక్షణే = పద్మముల వంటి నేత్రములు కలదానా! మా శుచః = దుఃఖింపకుము.

తా. ‘‘మహాభాగ్యవంతురాలా! మహాబలుడు, మహావీర్యుడు, మహాతేజస్వియు అగు సుపుత్రుడు నీ గర్భములో ఉన్నాడు. ఐశ్వర్యవంతు డైన ఆ కుమారుడు కొలది కాలములో విషముతో కూడ పుట్టగలడు; దుఃఖింపకుము.’’

మూ. చ్యవనం తు నమస్కృత్య రాజపుత్రీ పతివ్రతా,

పతిశోకాతురా తస్మాత్పుత్రం దేవీ వ్యజాయత. 36

ప్ర. అ. రాజపుత్రీ = రాజపుత్రియు, పతివ్రతా = పతివ్రతయు, పతిశోకాతురా = భర్తమరణ శోకముచే వ్యాకులురాలును అగు, దేవీ = ఆ పట్టమహిషి, చ్యవనమ్ = చ్యవనుని, నమస్కృత్య = నమస్కరించి, తస్మాత్ = ఆ కారణము వలన, పుత్రమ్ = పుత్రుని, వ్యజాయత = కనెను.

తా. రాజపుత్రియు, పతివ్రతియు, భర్తమరణముచే దుఃఖితురాలును అగు ఆ రాజమహిషి ఈ విధముగ చ్యవనుని అనుగ్రహముచే పుత్రుని కనెను.

మూ. సపత్న్యా తు గరస్తస్యై దత్తో గర్భజిఘాంసయా,

సహ తేన గరేణైవ జాతః స సగరోఽభవత్. 37

ప్ర. అ. సపత్న్యా = సవతిచేత, తస్యె = ఆమెకు, గర్భజిఘాంసయా = గర్భమును హింసించ వలె నను కోరికచే, గరః = విషము, దత్తః = ఇవ్వబడినది. తేన = ఆ, గరేణ సహ ఏవ = గరముతోడనే, జాతః = పుట్టిన, సః = ఆతడు, సగరః = సగరుడు, అభవత్ = ఆయెను.

తా. గర్భమును నశింపచేయవలె నను అభిప్రాయముతో సవతి ఆమెకు ఇచ్చిన గరముతో పాటు పుట్టుటచే ఆ పుత్రుడు సగరుడుఅయ్యెను.

మూ. సగరస్యాసమంజస్తు అసమంజాత్తథాంశుమాన్,

దిలీపోఽంశుమతః పుత్రో దిలీపస్య భగీరథః. 38

ప్ర. అ. అసమంజః = అసమంజుడు, సగరస్య = సగరుని కుమారుడు. తథా = మరియు, అసమంజాత్ = అసమంజునివలన, అంశుమాన్ = అంశుమంతుడు జనించెను. దిలీపః = దిలీపుడు, అంశుమతః = అంశుమంతునియొక్క, పుత్రః = పుత్రుడు. భగీరథః = భగీరథుడు, దిలీపస్య = దిలీపుని కుమారుడు.

తా. సగరుని కుమారుడు అసమంజుడు. ఆతని కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుని పుత్రుడు దిలీపుడు. అతని కుమారుడు భగీరథుడు.

మూ. భగీరథాత్ కకుత్స్థశ్చ కకుత్స్థస్య రఘుః సుతః,

రఘోస్తు పుత్రస్తేజస్వీ ప్రవృద్ధః పురుషాదకః, 39

కల్మాషపాదో హ్యభవత్తస్మాజ్జాతస్తు శఙ్ఖణః.

ప్ర. అ. భగీరథాత్ = భగీరథునినుండి, కకుత్థ్సః = కకుత్థ్సుడు పుట్టెను. రఘుః = రఘువు, కకుత్థ్సస్య = కకుత్థ్సునియొక్క, సుతః = కుమారుడు. తేజస్వీ = తేజఃశాలి యైన, ప్రవృద్ధః = ప్రవృద్ధుడు, రఘోః = రఘువుయొక్క, పుత్రః = పుత్రుడు. అతడే, పురుషాదకః = పురుషాదకుడును, కల్మాషపాదః = కల్మాషపాదుడును, అభవత్ = ఆయెను. తస్మాత్ = ఆతనినుండి, శఙ్ఖణః = శంఖణుడు, జాతః = పుట్టెను.

తా. భగీరథునకు కకుత్స్థుడును, ఆతనికి రఘువును పుట్టెను. తేజఃశాలి యగు ప్రవృద్ధుడు రఘువుయొక్క కుమారుడు. ఆతడు వసిష్ఠుని శాపముచే పురుషాదకుడు (మనుష్యమాంసమును తినువాడు) అయ్యెను. అతడు వసిష్ఠునకు ప్రతిశాప మిచ్చుటకై జలము గ్రహించెను. అపుడు ఆతని భార్య నివారించుటచే ఆ శాపోదకమును తన పాదముల పైననే విడుచుటచే కల్మాషపాదుడు (కల్మషముతో కూడిన పాదములు కలవాడు) అయ్యెను. అతనికి శంఖణుడు పుట్టెను.

మూ. సుదర్శనః శఙ్ఖణస్య అగ్నివర్ణః సుదర్శనాత్, 40

శీఘ్రగస్త్వగ్నివర్ణస్య శీఘ్రగస్య మరుః సుతః,

మరోః ప్రశుశ్రుకస్త్వాసీదమ్బరీషః ప్రశుశ్రుకాత్. 41

ప్ర. అ. శఙ్ఖణస్య = శంఖణునకు, సుదర్శనః = సుదర్శనుడును, సుదర్శనాత్ = సుదర్శనునివలన, అగ్నివర్ణః = అగ్నివర్ణుడును, అగ్నివర్ణస్య = అగ్నివర్ణునకు, శీఘ్రగః = శీఘ్రగుడును, శీఘ్రగస్య = శీఘ్రగునకు, మరుః = మరువు అను, సుతః = కుమారుడును, మరోః = మరువునకు, ప్రశుశ్రుకః = ప్రశుశ్రుకుడును, ప్రశుశ్రుకాత్ = ప్రశుశ్రుకునినుండి, అంబరీషః = అంబరీషుడును, ఆసీత్ = పుట్టెను.

తా. శంఖణుని కుమారుడు సుదర్శనుడు. సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు. ఆతని కుమారుడు శీఘ్రగుడు. ఆతని కుమారుడు మరువు. ఆతని కుమారుడు ప్రశు శ్రుకుడు. ప్రశుశ్రుకుని కుమారుడు అంబరీషుడు.

మూ. అమ్బరీషస్య పుత్రోఽభూన్నహుషః పృథివీపతిః,

నహుషస్య యయాతిస్తు నాభాగస్తు యయాతిజః. 42

ప్ర. అ. పృథీవీపతిః = రాజైన, నహుషః = నహుషుడు, అమ్బరీషస్య = అంబరీషునియొక్క, పుత్రః = పుత్రుడు, అభూత్ = ఆయెను, నహుషస్య = నహుషునికి, యయాతిః = యయాతి పుట్టెను. నాభాగః తు = నాభాగుడు. యయాతిజః = యయాతివలన పుట్టినవాడు.

తా. అంబరీషుని పుత్రుడు నహుషమహారాజు. నహుషునకు యయాతి యను పుత్రుడు జనించెను. ఆతని కుమారుడు నాభాగుడు.

మూ. నాభాగస్య బభూవాజః అజాద్దశరథోఽభవత్,

అస్మాద్దశరథాజ్జాతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. 43

ప్ర. అ. నాభాగస్య = నాభాగునకు, అజః = అజు డను కుమారుడు, బభూవ = పుట్టెను. అజాత్ = అజునినుండి, దశరథః = దశరథుడు, అభవత్ = పుట్టెను. అస్మాత్ = ఈ, దశరథాత్ = దశరథునినుండి, భ్రాతరౌ = సోదరు లైన, రామలక్ష్మణౌ = రామలక్ష్మణులు, జాతౌ = పుట్టినారు.

తా. నాభాగునకు అజు డను కుమారుడు కలిగెను. అజుని కుమారుడు దశరథుడు. ఈ దశరథుని కుమారులే ఈ రామలక్ష్మణులు.

మూ. ఆదివంశవిశుద్ధానాం రాజ్ఞాం పరమధర్మిణామ్,

ఇక్ష్వాకుకులజాతానాం వీరాణాం సత్యవాదినామ్. 44

రామలక్ష్మణయోరర్థే త్వత్సుతే వరయే నృప,

సదృశాభ్యాం నృపశ్రేష్ఠ సదృశే దాతుమర్హసి. 45

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే సప్తతితమః సర్గః

ప్ర. అ. నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడ వైన, నృప = రాజా!, ఆదివంశ విశుద్ధానామ్ = మొదటినుండియు వంశముచే పరిశుద్ధులును, పరమధర్మిణామ్ = మిక్కిలి ధర్మాత్ములును, వీరాణామ్ = వీరులును, సత్యవాదినామ్ = సత్యమునే పలుకువారును అగు, ఇక్ష్వాకుకులజాతానామ్ = ఇక్ష్వాకువంశీయు లైన, రాజ్ఞామ్ = రాజులకు సంబంధించిన, రామలక్ష్మణయోరర్థే = రామలక్ష్మణులకొరకై, త్వత్సుతే = నీ కుమార్తెలను, వరయే = వరించుచున్నాను, సదృశాభ్యామ్ = తగిన ఈ రామలక్ష్మణులకు, సదృశే = తగిన నీ పుత్రికలను, దాతుమ్ = ఇచ్చుటకు, అర్హసి = తగి యున్నావు.

తా. నరశ్రేష్ఠుడ వైన జనకమహారాజా! ఆదినుండియు పరిశుద్ధమైన వంశము కలవారును, పరమధార్మికులును, వీరులును, సత్యవాదులును అగు ఇక్ష్వాకు వంశీయరాజుల వంశములో జనించిన ఈ రామలక్ష్మణులకొరకై నీ కుమార్తెలను వరించుచున్నాను. నీ కుమార్తెలకు తగిన వరు లైన ఈ రామలక్ష్మణులకు, వీరికి తగిన వధువు లైన నీ కుమార్తెల నిచ్చి వివాహము చేయుము.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,బాలకాండములో డెబ్బదవ సర్గ సమాప్తము.