Chapter_71

Back
Book Balakandamu
Chapter No 77
Pages 6
Read Time 9 Minutes

Chapter_71

శ్రీః

శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః

బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము

అథ ఏకసప్తతితమః సర్గః

జనకుడు తన వంశమును గూర్చి వర్ణించి చెప్పి శ్రీరామలక్ష్మణులకు సీతా- ఊర్మిళలను ఇచ్చెద నని అంగీకరించుట.

మూ. ఏవం బ్రువాణం జనకః ప్రత్యువాచ కృతాఞ్జలిః,

శ్రోతుమర్హసి భద్రం తే కులం నః పరికీర్తితమ్. 1

ప్ర. అ. ఏవమ్ = ఇట్లు, బ్రువాణమ్ = పలుకుచున్న వసిష్ఠుని గూర్చి, జనకః = జనకుడు, కృతాఞ్జలిః = చేయబడిన దోసిలి కలవాడై, ప్రత్యువాచ = తిరిగి పలికెను. తే = నీకు, భద్రమ్ = క్షేమ మగుగాక. పరికీర్తితమ్ = చెప్పబడిన, నః = మాయొక్క, కులమ్ = కులమును గూర్చి, శ్రోతుమ్ = వినుటకు, అర్హసి = తగియున్నావు.

తా. ఈ విధముగ దశరథుని వంశమును వర్ణించి చెప్పిన వసిష్ఠునితో జనకుడు, చేతులు జోడించి ఇట్లు పలికెను. నీకు మంగళ మగుగాక. నా వంశమును గూర్చి చెప్పుచున్నాను; వినుము.

మూ. ప్రదానే హి మునిశ్రేష్ఠ కులం నిరవశేషతః,

వక్తవ్యం కులజాతేన తన్నిబోధ మహామునే. 2

ప్ర. అ. మునిశ్రేష్ఠ = మునులలో శ్రేష్ఠుడ వైన, మహామునే = ఓ మహామునీ!, కులజాతేన = సత్కులమునందు పుట్టినవానిచేత, ప్రదానే = కన్యాదాన సమయము నందు, నిరవశేషతః = పూర్తిగా, కులమ్ = కులము, వక్తవ్యం హి = చెప్పదగినది కదా. తత్ = దానిని గూర్చి, నిబోధ = తెలుసుకొనుము.

తా. మహామునీ సత్కులప్రసూతు లైనవారు, కన్యాదానసమయమున తమ కులమును గూర్చి పూర్తిగా చెప్పవలెను. దానిని వినుము.

మూ. రాజాఽభూత్త్రిషు లోకేషు విశ్రుతః స్వేన కర్మణా,

నిమిః పరమధర్మాత్మా సర్వసత్త్వవతాం వరః. 3

ప్ర. అ. స్వేన = తనసంబంధ మైన, కర్మణా = కర్మచేత, త్రిషు = మూడు, లోకేషు = లోకములందు, విశ్రుతః = ప్రసిద్ధుడును, పరమధర్మాత్మా = మిక్కిలి ధర్మాత్ముడును, సర్వసత్త్వవతామ్ = బలము కలవా రందరిలో, వరః = శ్రేష్ఠుడును అగు, నిమిః = నిమి చక్రవర్తి, అభూత్ = ఉండెను.

తా. తన పనులచే మూడు లోకములందును ప్రసిద్ధుడును, పరమ ధర్మాత్ముడును, బలము కలవా రందరిలోను శ్రేష్ఠుడును అగు నిమిచక్రవర్తి ఉండెను.

మూ. తస్య పుత్రో మిథిర్నామ మిథిలా యేన నిర్మితా,

ప్రథమో జనకో నామ జనకాదప్యుదావసుః. 4

ప్ర. అ. మిథిర్నామ = మిథి అను పేరు గలవాడు, తస్య = అతనియొక్క, పుత్రః = పుత్రుడు; యేన = ఎవనిచేత, మిథిలా = మిథిల, నిర్మితా = నిర్మింపబడినదో, ఆతడు, ప్రథమః = మొదటి, జనకః నామ = జనకుడు. జనకాత్ = జనకునినుండి, ఉదావసుః = ఉదావసువు పుట్టెను.

తా. మిథిలను నిర్మించిన మిథి ఆ నిమిచక్రవర్తి కుమారుడు. ఇతడే మొట్టమొదటి జనకుడు. ఆతని కుమారుడు ఉదావసువు.

మూ. ఉదావసోస్తు ధర్మాత్మా జాతో వై నన్దివర్ధనః,

నన్దివర్ధనపుత్రస్తు సుకేతుర్నామ నామతః. 5

ప్ర. అ. ఉదావసోః తు = ఉదావసువునకు, ధర్మాత్మా = ధర్మాత్ముడైన, నన్దివర్ధనః = నందివర్ధనుడు, జాతః = పుట్టెను. నన్దివర్ధనపుత్రః తు = నందివర్ధనుని పుత్రుడు, నామతః = పేరుచే, సుకేతుర్నామ = సుకేతు వను ప్రసిద్ధి గలవాడు.

తా. ఉదావసువునకు ధర్మాత్ము డైన నందివర్ధను డను కుమారుడు కలిగెను. అతని కుమారుడు సుకేతువు.

మూ. సుకేతోరపి ధర్మాత్మా దేవరాతో మహాబలః,

దేవరాతస్య రాజర్షేర్బృహద్రథ ఇతి స్మృతః. 6

ప్ర. అ. సుకేతోః అపి = సుకేతువునకు, ధర్మాత్మా = ధర్మాత్ముడును, మహాబలః = గొప్ప బలము కలవాడును అగు, దేవరాతః = దేవరాతుడు పుట్టెను. రాజర్షేః = రాజర్షి యైన, దేవరాతస్య = దేవరాతునకు, బృహద్రథః ఇతి = బృహద్రథుడని, స్మృతః = చెప్పబడిన కుమారుడు పుట్టెను.

తా. సుకేతువునకు ధర్మాత్ముడును, మహాబలుడును అగు దేవరాతుడు పుట్టెను. రాజర్షి యైన దేవరాతునకు బృహద్రథు డను పుత్రుడు జనించెను.

మూ. బృహద్రథస్య శూరోఽభూన్మహావీరః ప్రతాపవాన్,

మహావీరస్య ధృతిమాన్ సుధృతిః సత్యవిక్రమః. 7

ప్ర. అ. బృహద్రథస్య = బృహద్రథునకు, శూరః = శూరుడును, ప్రతాపవాన్ = ప్రతాపవంతుడును అగు, మహావీరః = మహావీరు డను పుత్రుడు కల్గెను. మహావీరస్య = మహావీరునకు, ధృతిమాన్ = ధైర్యము కలవాడును, సత్యవిక్రమః = సత్యమైన పరాక్రమము కలవాడును అగు, సుధృతిః = సుధృతి పుట్టెను.

తా. బృహద్రథునకు శూరుడును ప్రతాపవంతుడును అగు మహావీరుడు పుట్టెను. మహావీరునకు ధైర్యవంతుడును, సత్య మైన పరాక్రమము కలవాడును, అగు సుధృతి జన్మించెను.

మూ. సుధృతేరపి ధర్మాత్మా దృష్టకేతుస్సుధార్మికః,

దృష్టకేతోస్తు రాజర్షేర్హర్యశ్వ ఇతి విశ్రుతః. 8

ప్ర. అ. సుధృతేః = సుధృతికి, ధర్మాత్మా = ధర్మమునందు బుద్ధి కలవాడును, సుధార్మికః = బాగుగా ధార్మికుడును అయిన, దృష్టకేతుః = దృష్టకేతువు, రాజర్షేః = రాజర్షి యైన, దృష్టహేతోః = దృష్టకేతువునకు, హర్యశ్వః ఇతి = హర్యశ్వుడని, విశ్రుతః = ప్రసిద్ధుడైన కుమారుడును జన్మించెను.

తా. ధర్మబుద్ధి కలవాడును, ధర్మాచరణశీలుడును అగు దృష్టకేతువు సుధృతికి కుమారుడుగ జన్మించెను. రాజర్షి యైన దృష్టకేతువునకు హర్యశ్వుడని ప్రసిద్ధుడైన పుత్రుడు జనించెను.

మూ. హర్యశ్వస్య మరుః పుత్రో మరోః పుత్రఃప్రతిన్ధకః,

ప్రతిన్ధకస్య ధర్మాత్మా రాజా కీర్తిరథః సుతః. 9

ప్ర. అ. హర్యశ్వస్య = హర్యశ్వునకు, మరుః = మరువు, పుత్రః = పుత్రుడు. మరోః = మరువునకు, ప్రతిన్ధకః = ప్రతింధకుడు, పుత్రః = పుత్రుడు. ధర్మాత్మా = ధర్మాత్ముడైన, రాజా = రాజైన, కీర్తిరథః = కీర్తిరథుడు, ప్రతిన్ధకస్య = ప్రతింధకునియొక్క, సుతః = కుమారుడు.

తా. హర్యశ్వునకు మరుడు అను పుత్రుడు జనించెను. మరుని పుత్రుడు ప్రతింధకుడు. ధర్మాత్ము డైన కీర్తిరథమహారాజు ప్రతింధకుని కుమారుడు.

మూ. పుత్రః కీర్తిరథస్యాపి దేవమీఢ ఇతి స్మృతః,

దేవమీఢస్య విబుధో విబుధస్య మహీధ్రకః. 10

ప్ర. అ. కీర్తిరథస్యాపి = కీర్తిరథునియొక్క, పుత్రః = పుత్రుడు, దేవమీఢః ఇతి = దేవమీఢు డని, స్మృతః = చెప్పబడినాడు. దేవమీఢస్య = దేవమీఢుని కుమారుడు, విబుధః = విబుధుడు. విబుధస్య = విబుధునకు, మహీధ్రకః = మహీధ్రకుడు కుమారుడు.

తా. కీర్తిరథునికి దేవమీఢుడు, దేవమీఢునకు విబుధుడు, ఆతనికి మహీధ్రకుడును పుట్టెను.

మూ. మహీధ్రకసుతో రాజా కీర్తిరాతో మహాబలః,

కీర్తిరాతస్య రాజర్షేర్మహారోమో వ్యజాయత. 11

ప్ర. అ. మహాబలః = గొప్ప బలము గల, రాజా = రాజైన, కీర్తిరాతః = కీర్తిరాతుడు, మహీధ్రకసుతః = మహీధ్రకుని కుమారుడు, రాజర్షేః = రాజర్షి యైన, కీర్తిరాతస్య = కీర్తి రాతునకు, మహారోమః = మహారోముడు, వ్యజాయత = పుట్టెను.

తా. మహీధ్రకునకు మహాబలు డైన కీర్తిరాతు డను కుమారుడు జనించెను. రాజర్షి యైన కీర్తిరాతునకు మహారోముడు పుట్టెను.

మూ. మహారోమ్ణస్తు ధర్మాత్మా స్వర్ణరోమా వ్యజాయత,

స్వర్ణరోమ్ణస్తు రాజర్షేర్హ్రస్వరోమా వ్యజాయత. 12

ప్ర. అ. మహారోమ్ణః తు = మహారోమునకు, స్వర్ణరోమా = స్వర్ణరోముడు, అజాయత = జనించెను, రాజర్షేః = రాజర్షి యైన, స్వర్ణరోమ్ణస్తు = స్వర్ణరోమునకు, హ్రస్వరోమా = హ్రస్వరోముడు, వ్యజాయత = పుట్టెను.

తా. మహారోమునకు ధర్మాత్ము డైన స్వర్ణరోముడు పుట్టెను. రాజర్షి యైన స్వర్ణరోమునకు హ్రస్వరోముడు పుట్టెను.

మూ. తస్య పుత్రద్వయం జజ్ఞే ధర్మజ్ఞస్య మహాత్మనః,

జ్యేష్ఠోఽహమనుజో భ్రాతా మమ వీరః కుశధ్వజః. 13

ప్ర. అ. ధర్మజ్ఞస్య = ధర్మజ్ఞు డైన, తస్య = ఆ, మహాత్మనః = మహాత్మునకు, పుత్రద్వయమ్ = పుత్రద్వయము, జజ్ఞే = పుట్టెను; అహమ్ = నేను, జ్యేష్ఠః = పెద్దవాడను, వీరః = వీరు డైన, కుశధ్వజః = కుశధ్వజుడు, మమ = నాయొక్క, అనుజః భ్రాతా = తమ్ముడు.

తా. ధర్మము నెరిగిన ఆ మహాత్మునకు ఇద్దరు పుత్రులు జనించిరి. నేను పెద్దవాడను. వీరు డైన కుశధ్వజుడు నా తమ్ముడు.

మూ. మాం తు జ్యేష్ఠం పితా రాజ్యే సోఽభిషిచ్య నరాధిపః,

కుశధ్వజం సమావేశ్య భారం మయి వనం గతః. 14

ప్ర. అ. పితా = మా తండ్రి యైన, సః నరాధిపః = ఆ రాజు, జ్యేష్ఠమ్ = పెద్దవాడ నైన, మామ్ = నన్ను, రాజ్యే = రాజ్యమునందు, అభిషిచ్య = అభిషేకించి, కుశధ్వజమ్ = కుశధ్వజుని, భారమ్ = పోషింపవలసినవానినిగా, మయి = నాయందు, సమావేశ్య = ఉంచి, వనమ్ = వనమునుగూర్చి, గతః = వెళ్లినాడు.

తా. మా తండ్రి యైన హ్రస్వరోమమహారాజు జ్యేష్ఠుడ నైన నన్ను రాజ్యాభిషిక్తుని చేసి, కుశధ్వజుని పోషణభారమును నాపై ఉంచి వనమునకు పోయెను.

మూ. వృద్ధే పితరి స్వర్యాతే ధర్మేణ ధురమావహమ్,

భ్రాతరం దేవసంకాశం స్నేహాత్పశ్యన్ కుశధ్వజమ్. 15

ప్ర. అ. వృద్ధే = వృద్ధు డైన, పితరి = తండ్రి, స్వర్యాతే సతి = స్వర్గమునకు వెళ్లగా, భ్రాతరమ్ = సోదరు డైన, దేవసంకాశమ్ = దేవతలతో సమాను డైన, కుశధ్వజమ్ = కుశధ్వజుని, స్నేహాత్ = స్నేహమువలన, పశ్యన్ = చూచుచు, ధర్మేణ = ధర్మముతో, ధురమ్ = రాజ్యభారమును, ఆవహమ్ = వహించితిని.

తా. వృద్ధు డైన తండ్రి స్వర్గస్థు డైన పిమ్మట, దేవసదృశు డైన నా తమ్ముడు కుశధ్వజుని స్నేహముతో చూచుకొనుచు, ధర్మానుసారముగా రాజ్యభారము వహించితిని.

మూ. కస్య చిత్త్వథ కాలస్య సాఙ్కాశ్యాదగమత్పురాత్,

సుధన్వా వీర్యవాన్రాజా మిథిలామవరోధకః. 16

ప్ర. అ. అథ = పిమ్మట, కస్యచిత్ కాలస్య = కొంత కాలమునకు, వీర్యవాన్ = పరాక్రమవంతుడైన, సుధన్వా = సుధన్వు డను, రాజా = రాజు, మిథిలామ్ = మిథిలానగరమును, అవరోధకః = ముట్టడింప నున్నవాడై, సాఙ్కాశ్యాత్ = సాంకాశ్యమనెడు, పురాత్ = పురమునుండి (మిథిలను) అగమత్ = పొందెను.

తా. కొంత కాలమునకు, పరాక్రమవంతు డగు సుధన్వు డను రాజు సాంకాశ్యపురము నుండి మిథిల పైకి దండెత్తివచ్చెను.

మూ. స చ మే ప్రేషయామాస శైవం ధనురనుత్తమమ్,

సీతా కన్యా చ పద్మాక్షీ మహ్యం వై దీయతామితి. 17

ప్ర. అ. అనుత్తమమ్ = శ్రేష్ఠ మైన, శైవం ధనుః = శివధనుస్సు, పద్మాక్షీ = పద్మముల వంటి నేత్రములు గల, కన్యా = నీ కుమార్తె యైన, సీతా చ = సీతయు, మహ్యమ్ = నాకు, దీయతామ్ = ఇవ్వబడుగాక. ఇతి = అని, సః = ఆతడు, మే = నాకు, ప్రేషయామాస = కబురుపంపెను.

తా. ‘‘శ్రేష్ఠ మగు శివధనుస్సును, పద్మపత్రాక్షి యగు సీతను నా కిమ్ము’’ అని ఆతడు నాకు వార్త పంపెను.

మూ. తస్యాప్రదానాద్బ్రహ్మర్షే యుద్ధమాసీన్మయా సహ,

స హతోఽభిముఖో రాజా సుధన్వా తు మయా రణే. 18

ప్ర. అ. బ్రహ్మర్షే = బ్రహ్మర్షీ!, అప్రదానాత్ = ఇవ్వకపోవుటవలన, తస్య = ఆతనికి, మయా సహ = నాతో కూడ, యుద్ధమ్ = యుద్ధము, ఆసీత్ = జరిగెను. రణే = యుద్ధమునందు, అభిముఖః = నాకు ఎదురుగా వచ్చిన, సః = ఆ, సుధన్వా రాజా = సుధన్వరాజు, మయా = నాచేత, హతః = చంపబడినాడు.

తా. సీతాశివధనుస్సులను ఇవ్వక పోవుటచే ఆతనికిని నాకును యుద్ధము జరుగగా, రణరంగమున నే నాతనిని వధించితిని.

మూ. నిహత్య తం మునిశ్రేష్ఠ సుధన్వానం నరాధిపమ్,

సాఙ్కాశ్యే భ్రాతరం వీరమభ్యషిఞ్చం కుశధ్వజమ్. 19

ప్ర. అ. మునిశ్రేష్ఠ = ఓ మునిశ్రేష్ఠుడా! నరాధిపమ్ = రాజైన, తమ్ = ఆ, సుధన్వానమ్ = సుధన్వుని, నిహత్య = చంపి, భ్రాతరమ్ = నా సోదరుడైన, వీరమ్ = వీరు డైన, కుశధ్వజమ్ = కుశధ్వజుని, సాఙ్కాశ్యే = సాకాశ్యమునందు, అభ్యషిఞ్చమ్ = అభిషేకించితిని.

తా. వసిష్ఠమహామునీ! ఆ సుధన్వుని సంహరించి, నా సోదరు డైన ఈ కుశధ్వజుని సాంకాశ్యపురమున రాజ్యాభిషిక్తుని చేసితివి.

మూ. కనీయానేష మే భ్రాతా అహం జ్యేష్ఠో మహామునే,

దదామి పరమప్రీతో వధ్వౌ తే మునిపుఙ్గవ. 20

సీతాం రామాయ భద్రం తే ఊర్మిళాం లక్ష్మణాయ చ.

ప్ర. అ. మహామునే = ఓ మహామునీ! ఏషః = ఇతడు, మే = నాయొక్క, కనీయాన్ = చిన్నవాడైన, భ్రాతా = సోదరుడు. అహమ్ = నేను, జ్యేష్ఠః = పెద్దవాడను. మునిపుఙ్గవ = ఓ మునిశ్రేష్ఠా! పరమప్రీతః = మిక్కిలి సంతసించిన వాడనై, తే = ఆ, వధ్వౌ = కన్యలను, దదామి = ఇచ్చుచున్నాను. సీతామ్ = సీతను, రామాయ = రామునకును, ఊర్మిళామ్ = ఊర్మిళను, లక్ష్మణాయ చ = లక్ష్మణునకును ఇచ్చుచున్నాను. తే = నీకు, భద్రమ్ = మంగళ మగు గాక.

తా. మునిశ్రేష్ఠుడ వైన వసిష్ఠ్ఙా! సోదరులలో నేను పెద్దవాడను. ఇతడు చిన్నవాడు. కన్య లిద్దరిని ఆనందపూర్వకముగ ఇచ్చెదను. సీతను రామునకును, ఊర్మిళను లక్ష్మణునకును ఇచ్చెదను.

మూ. వీర్యశుల్కాం మమ సుతాం సీతాం సురసుతోపమామ్,

ద్వితీయామూర్మిళాం చైవ త్రిర్దదామి న సంశయః. 21

ప్ర. అ. వీర్యశుల్కామ్ = వీర్యమే శుల్కముగా గలదియు, సురసుతోపమామ్ = దేవకన్యతో సమానురా లైన, మమ సుతామ్ = నాకుమార్తె యైన, సీతామ్ = సీతను, ద్వితీయామ్ = రెండవ కుమార్తె యైన, ఊర్మిళాం చైవ = ఊర్మిళను, త్రిః = మూడుసార్లు, దదామి = ఇచ్చుచున్నాను. సంశయః = సంశయము, న = లేదు.

తా. వీర్యశుల్కయు, దేవకన్యతో సమానురాలును అగు నా పుత్రిక యైన సీతను, రెండవ కుమార్తె యైన ఊర్మిళను ఇచ్చెద నని మూడు పర్యాయములు నొక్కి వక్కాణించుచున్నాను. ఈ విషయమున సందేహము లేదు

వి. "త్రిః దదామి" అను దానికి "మనోవాక్కాయము లను మూడు కరణముల చేత ఇచ్చుచున్నాను"అని కొంద రర్థము చెప్పినారు.

మూ. దదామి పరమప్రీతో వధ్వౌ తే రఘునన్దన, 22

రామలక్ష్మణయో రాజన్ గోదానం కారయస్వ హ,

పితృకార్యం చ భద్రం తే తతో వైవాహికం కురు. 23

ప్ర. అ. రఘునన్దన = దశరథమహారాజా! పరమప్రీతః = చాల సంతసించినవాడనై, తే = ఆ, వధ్వౌ = కన్యలను, దదామి = ఇచ్చుచున్నాను. రాజన్ = రాజా!, రామలక్ష్మణయోః = రామలక్ష్మణులకు, గోదానమ్ = గోదానవ్రతమును, కారయస్వ హ = చేయించుము. పితృకార్యం చ = నాందీశ్రాద్ధమును కూడ, కురు = చేయుము. తతః = పిమ్మట, వైవాహికమ్ = వివాహమును, (చేయుము).

తా. దశరథమహారాజా! ఈ కన్యలను ఆనందపూర్వకముగా ఇచ్చుచున్నాను. రామలక్ష్మణులకు గోదానమును (సమావర్తనవ్రతమును) చేయించుము. నాందీశ్రాద్ధము చేసిన పిమ్మట వివాహము జరిపించుము.

మూ. మఘా హ్యద్య మహాబాహో తృతీయే దివసే ప్రభో,

ఫల్గున్యాముత్తరే రాజన్ తస్మిన్ వైవాహికం కురు, 24

రామలక్ష్మణయో రాజన్ దానం కార్యం సుఖోదయమ్.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే ఏకసప్తతితమః సర్గః

ప్ర. అ. మహాబాహో = గొప్ప బాహువులు గల, ప్రభో = ఓ మహారాజా! ఆద్య = నేడు, మఘా హి = మఘానక్షత్రము కదా. రాజన్ = మహారాజా!, దివసే = నేటినుండి మూడవ దివసమున, ఫల్గున్యామ్ = ఫల్గుని యనెడు, తస్మిన్ = ఆ, ఉత్తరే = ఉత్తరనక్షత్రమునందు, వైవాహికమ్ = వివాహకార్యమును, కురు = చేయుము, రాజన్ = రాజా!, రామలక్ష్మణయోః = రామలక్ష్మణులయొక్క, సుఖోదయమ్ = సుఖమే భావిఫలముగా గల, దానమ్ = దానము, కార్యమ్ = చేయదగినది.

తా. దశరథమహారాజా! ఈ దివసమున మఘానక్షత్రము కదా. నేటికి మూడవరోజున, ఉత్తరఫల్గునీ నక్షత్రమునందు, వివాహము చేయుము. ముందుగా, రామలక్ష్మణుల భావిసుఖహేతు వగు గోహిరణ్యభూమ్యాదిదానము కూడ చేయింపవలెను.

‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,

బాలకాండములో డెబ్బదిఒకటవ సర్గ సమాప్తము.