| Book | Balakandamu |
|---|---|
| Chapter No | 78 |
| Pages | 6 |
| Read Time | 9 Minutes |
శ్రీః
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
బాలానన్దినీ సహితమగు

శ్రీమద్రామాయణము : బాలకాండము
అథ ద్విసప్తతితమః సర్గః
విశ్వామిత్రుడు భరతశత్రుఘ్నులకొరకై కుశధ్వజుని కన్యలను వరించగా జనకు డందుకు అంగీకరించుట. దశరథుడు పుత్రుల మంగళముకొరకై నాందీశ్రాద్ధగోదానాదు లనుష్ఠించుట.
మూ. తముక్తవన్తం వైదేహం విశ్వామిత్రో మహామునిః,
ఉవాచ వచనం వీరం వసిష్ఠసహితో నృపమ్. 1
ప్ర. అ. మహామునిః = మహాముని యైన, విశ్వామిత్రః = విశ్వామిత్రుడు, వసిష్ఠసహితః = వసిష్ఠునితో కూడినవాడై, ఉక్తవన్తమ్ = ఇట్లు పలికిన, వీరమ్ = వీరు డైన, వైదేహమ్ = విదేహాధిపతి యైన, నృపమ్ = జనకమహారాజును గూర్చి, వచనమ్ = వచనమును, ఉవాచ = పలికెను.
తా. విదేహాధిపతి యగు జనకమహారాజు పలికిన మాటలు విని వసిష్ఠ విశ్వామిత్రు లాతనితో ఇట్లు పలికిరి.
మూ. అచిన్త్యాన్యప్రమేయాని కులాని నరపుఙ్గవ,
ఇక్ష్వాకూణాం విదేహానాం నైషాం తుల్యోఽస్తి కశ్చన. 2
ప్ర. అ. నరపుఙ్గవ = నరశ్రేష్ఠుడా ! ఇక్ష్వాకూణామ్ = ఇక్ష్వాకురాజుల యొక్కయు, విదేహానాం చ = విదేహరాజులయొక్కయు, కులాని = కులములు, అచిన్త్యాని = ఊహింప శక్యముకానివి. అప్రమేయాని = కొలత పెట్టరానివి. ఏషామ్ = ఈ ఇక్ష్వాకు విదేహరాజులకు, తుల్యః = సమాన మైనవాడు, కశ్చన = ఎవ్వడును, నాస్తి = లేడు.
తా. జనకమహారాజా! ఇక్ష్వాకువిదేహవంశములు ఊహింపరాని, కొలత పెట్టశక్యము కాని, ప్రభావము కలవి. ఏతద్వంశీయులతో సమాను లెవ్వరును లేరు.
మూ. సదృశో ధర్మసంబన్ధః సదృశో రూపసమ్పదా,
రామలక్ష్మణయో రాజన్ సీతా చోర్మిళయా సహ. 3
ప్ర. అ. రాజన్ = రాజా! ఊర్మిళయా సహ = ఊర్మిళతో గూడ, సీతా = సీత, రామలక్ష్మణయోః = రామలక్ష్మణులకు (ఇవ్వబడుచున్నది. ఇది), సదృశః = తగిన, ధర్మసంబన్ధః = వివాహరూప మైన ధర్మసంబంధము, రూపసమ్పదా చ = రూపసంపదచేత కూడ, సదృశః = తగినది.
తా. రాజా! సీతా, ఊర్మిళలను రామలక్ష్మణుల కిచ్చి వివాహము చేయుట అనునది పరస్పరకులగౌరవాదులకును, రూపసంపదకును తగిన సంబంధము.
మూ. వక్తవ్యం చ నరశ్రేష్ఠ శ్రూయతాం వచనం మమ,
భ్రాతా యవీయాన్ ధర్మజ్ఞ ఏష రాజా కుశధ్వజః. 4
ప్ర. అ. నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా!, మమ = నాయొక్క, వక్తవ్యం చ = చెప్పదగిన, వచనమ్ = వచనము, శ్రూయతామ్ = వినబడుగాక, యవీయాన్ భ్రాతా = నీ తమ్ము డైన, ఏషః = ఈ, రాజా = రాజైన, కుశధ్వజః = కుశధ్వజుడు, ధర్మజ్ఞః = ధర్మము లెరిగినవాడు.
తా. నరశ్రేష్ఠుడ వైన జనకమహారాజా! మేము చెప్పదలచిన వచనమును వినుము. నీ తమ్ము డైన ఈ కుశధ్వజుడు ధర్మము నెరిగినవాడు.
మూ. అస్య ధర్మాత్మనో రాజన్ రూపేణాప్రతిమం భువి,
సుతాద్వయం నరశ్రేష్ఠ పత్న్యర్థం వరయామహే. 5
ప్ర. అ. రాజన్ = రాజా!, నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా! రూపేణ = సౌందర్యముచేత, భువి = భూలోకమునందు, అప్రతిమమ్ = సాటి లేని, అస్య ధర్మాత్మనః = ఈ ధర్మాత్ముని యొక్క, సుతాద్వయమ్ = పుత్రికాద్వయమును, పత్న్యర్థమ్ = భరతశత్రుఘ్నుల భార్య లగుటకై, వరయామహే = వరించుచున్నాము.
తా. జనకనరేంద్రా! భూలోకమునందు సాటి లేని రూపము గలవారగు ఈ ధర్మాత్ముని ఇరువురు పుత్రికలను భరతశత్రుఘ్నులకు భార్యలనుగా వరించుచున్నాము.
మూ. భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః,
వరయామః సుతే రాజన్ తయోరర్థే మహాత్మనోః. 6
ప్ర. అ. రాజన్ = రాజా! కుమారస్య = కుమారుడైన, భరతస్య = భరతునికొరకును, ధీమతః = బుద్ధిమంతుడైన, శత్రుఘ్నస్య చ = శత్రుఘ్నునికొరకును, మహాత్మనోః = మహాత్ములైన, తయోరర్థే = వారిరువురికొరకును, సుతే = మీ తమ్ముని కుమార్తెలను, వరయామః = వరించుచున్నాము.
తా. రాజా! భరతకుమారుని కొరకును, ధీమంతు డైన శత్రుఘ్నుని కొరకును నీ తమ్ముని కుమార్తెలను కోరుచున్నాము.
మూ. పుత్రా దశరథస్యేమే రూపయౌవనశాలినః,
లోకపాలసమాః సర్వే దేవతుల్యపరాక్రమాః 7
ప్ర. అ. ఇమే = ఈ, దశరథస్య పుత్రాః = దశరథునిపుత్రులు, సర్వే = అందరును, రూపయౌవనశాలినః = సౌందర్యముతోడను యౌవనముతోడను ప్రకాశించుచున్నారు. లోకపాలసమాః = లోకపాలురతో సమానులు, దేవతుల్యపరాక్రమాః = దేవతలతో సమానమైన పరాక్రమము గలవారు.
తా. ఈ దశరథకుమారు లందరును రూపయౌవనములతో ప్రకాశించు చున్నవారు. లోకపాలులతో సమానులు. దేవతల వంటి పరాక్రమము గలవారు.
మూ. ఉభయోరపి రాజేన్ద్ర సంబన్ధేనానుబధ్యతామ్,
ఇక్ష్వాకోః కులమవ్యగ్రం భవతః పుణ్యకర్మణః. 8
ప్ర. అ. రాజేన్ద్ర = మహారాజా!, ఇక్ష్వాకోః = ఇక్ష్వాకువుయొక్కయు, పుణ్యకర్మణః = పుణ్యమైన కర్మగల, భవతః = నీయొక్కయు, ఉభయోరపి = ఇద్దరియొక్కయు, కులమ్ = కులము, సమ్బన్ధేన = వివాహసంబంధముచేత, అవ్యగ్రమ్ = దృఢముగా, అను బధ్యతామ్ = కట్టబడుగాక.
తా. జనకమహారాజా! పుణ్యకర్మ గల నీ కులమునకును, ఇక్ష్వాకుకులమునకును ఈ వివాహసంబంధముచే దృఢమైన బంధము ఏర్పడుగాక.
మూ. విశ్వామిత్రవచః శ్రుత్వా వసిష్ఠస్య మతే తదా,
జనకః ప్రాఞ్జలిర్వాక్యమువాచ మునిపుఙ్గవౌ. 9
ప్ర. అ. తదా = అప్పుడు, వసిష్ఠస్య = వసిష్ఠునియొక్క, మతే = అనుజ్ఞప్రకారము, విశ్వామిత్రవచః = విశ్వామిత్రుని వాక్యమును, శ్రుత్వా = విని, జనకః = జనకుడు, ప్రాఞ్జలిః = కట్టబడిన దోసిలి కలవాడై, మునిపుఙ్గవౌ = మునిపుంగవులను గూర్చి, వాక్యమ్ = వాక్యమును, ఉవాచ = పలికెను.
తా. వసిష్ఠుని అనుమతి ననుసరించి విశ్వామిత్రుడు పలికిన ఈ మాటలు విని, జనకమహారాజు, అంజలి ఘటించి, ఆ వసిష్ఠవిశ్వామిత్రులతో నిట్లనెను.
మూ. కులం ధన్యమిదం మన్యే యేషాం నో మునిపుఙ్గవౌ,
సదృశం కులసమ్బన్ధం యదాజ్ఞాపయథః స్వయమ్. 10
ప్ర. అ. యేషామ్ = ఏ, నః = మాకు, సదృశమ్ = తగిన, కులసంబన్ధమ్ = కుల సంబంధమును, మునిపుఙ్గవౌ = మునిపుంగవు లైన, మీకు, స్వయమ్ = స్వయముగా, యత్ = ఏ కారణమువలన, ఆజ్ఞాపయథః = ఆజ్ఞాపించుచున్నారో అట్టి, ఇదమ్ = ఈ, కులమ్ = కులమును, ధన్యమ్ = ధన్య మైనదానినిగా, మన్యే = తలచుచున్నాను.
తా. మునిశ్రేష్ఠు లైన మీరు మాకు తగిన కులసంబంధమును గూర్చి స్వయముగ ఆజ్ఞాపించుచున్నారు. అందుచే మా కులము ధన్య మైనది.
మూ. ఏవం భవతు భద్రం వః కుశధ్వజసుతే ఇమే,
పత్న్యౌ భజేతాం సహితౌ శత్రుఘ్నభరతావుభౌ. 11
ప్ర. అ. ఏవమ్ = ఇట్లు, భవతు = అగుగాక; వః = మీకు, భద్రమ్ = కుశల మగు గాక. ఇమే = ఈ, కుశధ్వజసుతే = శత్రుఘ్నభరతులను, ఉభౌ = ఇద్దరిని, పత్న్యౌ = భార్యలుగా, భజేతామ్ = సేవింతురు గాక.
తా. అట్లే అగుగాక. మీకు భద్ర మగుగాక. ఈ కుశధ్వజుని కుమార్తెలగు మాండవీ శ్రుతకీర్తులు, కలిసి సంచరించెడు ఈ భరతశత్రుఘ్నులకు (వరుసగ) భార్యలై వారిని సేవింతురుగాక.
మూ. ఏకాహ్నా రాజపుత్రీణాం చతసౄణాం మహామునే,
పాణీన్ గృహ్ణస్తు చత్వారో రాజపుత్రా మహాబలాః. 12
ప్ర. అ. మహామునే = ఓ మహామునీ!, మహాబలాః = గొప్ప బలము గల, చత్వారః = నలుగురు, రాజపుత్రాః = రాజపుత్రులు, ఏకాహ్నా = ఒకేదివసమున, చతసౄణామ్ = నలుగురు, రాజపుత్రీణామ్ = రాజపుత్రికలయొక్క, పాణీన్ = హస్తములను, గృహ్ణస్తు = గ్రహింతురుగాక.
తా. మహామునీ! మహాబలశాలు లగు నలుగురు రాజపుత్రులును ఒకే దివసమున నలుగురు రాజపుత్రికలను వివాహ మాడుదురు గాక.
మూ. ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫల్గునీభ్యాం మనీషిణః,
వైవాహికం ప్రశంసన్తి భగో యత్ర ప్రజాపతిః. 13
ప్ర. అ. బ్రహ్మన్ = బ్రాహ్మణోత్తమా!, ఫల్గునీభ్యామ్ = పూర్వఫల్గుని, ఉత్తరఫల్గుని అను రెండు ఫల్గునీనక్షత్రములతో కూడిన దినములలో, యత్ర = ఏ దినమునందు, ప్రజాపతిః = ప్రజాపతి యైన (సంతానదాత యైన), భగః = భగుడు, (దేవతా = దేవతయో), అట్టి, ఉత్తరే దివసే = ఉత్తరఫల్గునీనక్షత్రముతో కూడిన దివసమున, వైవాహికమ్ = వివాహకృత్యమును, మనీషిణః = విద్వాంసులు, ప్రశంసన్తి = ప్రశంసించుచున్నారు.
తా. బ్రాహ్మణోత్తమా! సంతానదాత యగు భగుడు దేవతగా గల ఉత్తర నక్షత్రముతో కూడిన దివసమున వివాహకృత్యము శ్రేష్ఠ మని బుద్ధిమంతులు చెప్పుదురుకదా?
మూ. ఏవముక్త్వా వచః సౌమ్యం ప్రత్యుత్థాయ కృతాఞ్జలిః,
ఉభౌ మునివరౌ రాజా జనకో వాక్యమబ్రవీత్. 14
ప్ర. అ. జనకః రాజా = జనకమహారాజు, ఏవమ్ = ఇట్లు, సౌమ్యమ్ = మధురమైన, వచః = వచనమును, ఉక్త్వా = పలికి, ప్రత్యుత్థాయ = లేచి, కృతాఞ్జలిః = చేయబడిన దోసిలి కలవాడై, ఉభౌ = ఇద్దరు, మునివరౌ = మునివరులను గూర్చి, వాక్యమ్ = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.
తా. జనకమహారాజు ఈ విధముగ సౌమ్య మగు వాక్యము పలికి, లేచి, దోసిలి కట్టి, ఆ మహామును లిరువురితో మరల ఇట్లనెను.
మూ. పరో ధర్మః కృతో మహ్యం శిష్యోఽస్మి భవతోః సదా,
ఇమాన్యాసనముఖ్యాని ఆసాతాం మునిపుఙ్గవౌ. 15
ప్ర. అ. మహ్యమ్ = నాకు, పరః = గొప్ప, ధర్మః = ధర్మము, కృతః = చేయబడినది. సదా = ఎల్లప్పుడును, భవతోః = మీ ఇద్దరికిని, శిష్యః అస్మి = శిష్యుడ నై యున్నాను. మునిపుఙ్గవౌ = ముని శ్రేష్ఠు లైన మీరు, ఇమాని = ఈ, ఆసనముఖ్యాని = సింహాసనము లను, ఆసాతామ్ = అధిష్ఠింతురుగాక.
తా. మీరు నాకు గొప్ప ధర్మకార్యమును నెరవేర్చినారు. నేను ఎల్లప్పుడును మీ శిష్యుడనే. మునిపుంగవు లైన మీ రిరువురును ఈ మూడుసింహాసనములను (జనక-దశరథ- కుశధ్వజుల సింహాసనములను) అధిష్ఠింతురు గాక.
వి. సింహాసనమును నధిష్ఠించుట యనగా లక్షణచే అధికారము నిర్వహించుట అని అర్థము. మీ రిరువురును మా ముగ్గురి రాజ్యములపై అధికారము నిర్వహింతురు గాక అని భావము.
మూ. యథా దశరథస్యేయం తథాయోధ్యా పురీ మమ,
ప్రభుత్వే నాస్తి సన్దేహో యథార్హం కర్తుమర్హథ. 16
ప్ర. అ. ఇయమ్ = ఈ మిథిల, దశరథస్య = దశరథునకు, యథా = ఎట్లో, అయోధ్యా పురీ = అయోధ్యానగరము, మమ = నాకు, తథా = అట్లే, ప్రభుత్వే = ప్రభుత్వము విషయమున, సన్దేహః = సందేహము, నాస్తి = లేదు, యథార్హమ్ = తగు విధముగ, కర్తుమ్ = చేయుటకు, అర్హథ = తగియున్నారు.
తా. దశరథునకు మిథిలపై అధికార మున్నట్లే నాకును అయోధ్యపై అధికార మున్నది. అందుచేతనే దశరథుని రాజ్యముపై కూడ మీకు అధికారము నిచ్చుచున్నాను. ప్రభుత్వవిషయమున సందేహము లేదు. తగు విధముగ కార్యము నిర్వహింపుడు.
మూ. తథా బ్రువతి వైదేహే జనకే రఘునన్దనః,
రాజా దశరథో హృష్టః ప్రత్యువాచ మహీపతిమ్. 17
ప్ర. అ. వైదేహే = విదేహదేశ రాజైన, జనకే = జనకుడు, తథా = అట్లు, బ్రువతి = పలుకుచుండగా, రఘునన్దనః = రఘువంశానందకరు డైన, రాజా దశరథః = దశరథ మహారాజు, హృష్టః = సంతసించిన వాడై, మహీపతిమ్ = జనకమహారాజును గూర్చి, ప్రత్యువాచ = తిరిగి పలికెను.
తా. దశరథమహారాజు జనకుని మాటలకు సంతసించి ఆతనితో ఇట్లనెను.
మూ. యువామసఙ్ఖ్యేయగుణౌ భ్రాతరౌ మిథిలేశ్వరౌ,
ఋషయో రాజసంఘాశ్చ భవద్భ్యామభిపూజితాః. 18
ప్ర. అ. మిథిలేశ్వరౌ = మిథిలాధిపతులును, భ్రాతరౌ = సోదరులును అగు, యువామ్ = మీరిరువురును, అసంఖ్యేయగుణౌ = లెక్కింప శక్యము కాని గుణములు కలవారు. భవద్భ్యామ్ = మీచేత, ఋషయః = ఋషులును, రాజసంఘాశ్చ = రాజసముదాయములును, అభిపూజితాః = పూజింపబడినారు.
తా. ‘‘మిథిలాధిపతు లైన మీసోదరు లిరువురును లెక్కింపరాని సద్గుణములు గలవారు. మీ రెందరో ఋషులను, రాజులను పూజించి వారినుండి సద్గుణముల నలవరచుకొనినారు’’.
మూ. స్వస్తి ప్రాప్నుహి భద్రం తే గమిష్యామి స్వమాలయమ్,
శ్రాద్ధకర్మాణి సర్వాణి విధాస్యామీతి చాబ్రవీత్. 19
ప్ర. అ. స్వస్తి = క్షేమమును, ప్రాప్నుహి = పొందుము. తే = నీకు, భద్రమ్ = క్షేమ మగుగాక. స్వమ్ = నా సంబంధ మైన, ఆలయమ్ = నివాసమును గూర్చి, గమిష్యామి = వెళ్లగలను, సర్వాణి = సమస్త మైన, శ్రాద్ధకర్మాణి = శ్రాద్ధకర్మలను, విధాస్యామి చ = చేయగలను. ఇతి = అని, అబ్రవీత్ = పలికెను.
తా. ‘‘నీవు మంగళమును పొందెదవు గాక. నీకు భద్ర మగు గాక. నా నివాసమునకు వెళ్లెదను. నాందీముఖశ్రాద్ధాదికర్మలు కూడ చేసెదను’’ అని పలికెను.
మూ. తమాపృష్ట్వా నరపతిం రాజా దశరథస్తదా,
మునీన్ద్రౌ తౌ పురస్కృత్య జగామాశు మహాయశాః. 20
ప్ర. అ. తదా = అప్పుడు, మహాయశాః = గొప్ప కీర్తి గల, రాజా దశరథః = దశరథ మహారాజు, తమ్ = ఆ, నరపతిమ్ = రాజును, ఆపృష్ట్వా = అడిగి, తౌ = ఆ, మునీన్ద్రౌ = మునీంద్రులను, పురస్కృత్య = ముందిడుకొని, ఆశు = శీఘ్రముగా, జగామ = వెళ్లెను.
తా. మహాయశఃశాలి యగు దశరథమహారాజు అపుడు, జనకునివద్ద సెలవు గైకొని వసిష్ఠవిశ్వామిత్రులతో నిజనివాసమునకు వెళ్లెను.
మూ. స గత్వా నిలయం రాజా శ్రాద్ధం కృత్వా విధానతః,
ప్రభాతే కాల్యముత్థాయ చక్రే గోదానముత్తమమ్. 21
ప్ర. అ. సః = ఆ, రాజా = రాజు, నిలయమ్ = గృహమును గూర్చి, గత్వా = వెళ్లి, విధానతః = శాస్త్రానుసారముగా, శ్రాద్ధమ్ = శ్రాద్ధమును, కృత్వా = చేసి, ప్రభాతే = ప్రాతః కాలమున, ఉత్థాయ = లేచి, కాల్యమ్ = కాలోచిత మైన, ఉత్తమమ్ = ఉత్తమ మైన, గోదానమ్ = సమావర్తన (స్నాతక)వ్రతమును, చక్రే = చేసెను.
తా. దశరథమహారాజు తన నివాసగృహము చేరి యథాశాస్త్రముగ శ్రాద్ధము చేసి, మరునాడు ప్రాతఃకాలముననే లేచి అపుడు చేయవలసిన స్నాతకవ్రతమును జరిపించెను.
మూ. గవాం శతసహస్రాణి బ్రాహ్మణేభ్యో నరాధిపః,
ఏకైకశో దదౌ రాజా పుత్రానుద్దిశ్య ధర్మతః. 22
ప్ర. అ. నరాధిపః = నరులకు అధిపతి యగు, రాజా = రాజు, పుత్రాన్ = పుత్రులను, ఏకైకశః = ఒక్కొక్కరిని, ఉద్దిశ్య = ఉద్దేశించి, బ్రాహ్మణేభ్యః = బ్రాహ్మణులకొరకు, గవామ్ = గోవులయొక్క, సహస్రాణి = సహస్రములను, ధర్మతః = ధర్మానుసారముగా, దదౌ = ఇచ్చెను.
తా. దశరథమహారాజు ఒక్కొక్క కుమారు నుద్దేశించి ఒక్కొక్క లక్ష చొప్పున గోవులను బ్రాహ్మణులకు దానము చేసెను.
మూ. సువర్ణశృఙ్గాః సమ్పన్నాః సవత్సాః కాంస్యదోహనాః,
గవాం శతసహస్రాణి చత్వారి పురుషర్షభః. 23
విత్తమన్యచ్చ సుబహు ద్విజేభ్యో రఘునన్దనః,
దదౌ గోదానముద్దిశ్య పుత్రాణాం పుత్రవత్సలః. 24
ప్ర. అ. పురుషర్షభః = పురుషశ్రేష్ఠుడును, పుత్రవత్సలః = పుత్రులయందు ప్రేమ కలవాడును అగు, రఘునన్దనః = దశరథుడు, పుత్రాణామ్ = పుత్రులయొక్క, గోదానమ్ = గోదానవ్రతమును, ఉద్దిశ్య = ఉద్దేశించిన, సువర్ణశృఙ్గాః = బంగారు కొమ్ములు కలవియు, సమ్పన్నాః = క్షీరసమృద్ధి కలవియు, సవత్సాః = లేగదూడలతో కూడినవియు, కాంస్యదోహనాః = పాలు పిదుకుటకై కంచుపాత్రలు కలవియు అగు, గవామ్ = గోవులయొక్క, చత్వారి = నాలుగు, శతసహస్రాణి = లక్షలను, అన్యత్ = ఇతర మైన, సుబహు = చాల అధిక మైన, విత్తం చ = ధనమును, ద్విజేభ్యః = బ్రాహ్మణులకు, దదౌ = ఇచ్చెను.
తా. పురుషశ్రేష్ఠుడును, పుత్రులయందు అత్యధికప్రేమకలవాడును అగు దశరథమహారాజు, బంగారు కొమ్ములు కలవియు, లేగదూడలతో కూడినవియు, కంచుపాత్రలతో కూడినవియు, క్షీరసమృద్ధములును అగు నాలుగు లక్షల గోవులను, అత్యధిక మైన ఇతరద్రవ్యమును, పుత్రుల గోదానవ్రతసమయమున బ్రాహ్మణులకు దానము చేసెను.
మూ. స సుతైః కృతగోదానైర్వృతస్తు నృపతిస్తదా,
లోకపాలైరివాభాతి వృతః సౌమ్యః ప్రజాపతి. 25
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే ద్విసప్తతితమః సర్గః
ప్ర. అ. కృతగోదానైః = చేయబడిన గోదానవ్రతము గల, సుతైః = కుమారులతో, వృతః = కూడి యున్న, సః = ఆ, నృపతిః = రాజు, తదా = అప్పుడు, లోకపాలైః = లోకపాలుర చేత, వృతః = చుట్టుకొనబడి ఉన్న, సౌమ్యః = ప్రసన్ను డైన, ప్రజాపతిరివ = బ్రహ్మ వలె, ఆభాతి = ప్రకాశించు చుండెను.
తా. గోదానవ్రతము పూర్తిచేసికొనిన కుమారులు చుట్టును నిలచి యుండ ఆ దశరథమహారాజు లోకపాలుర మధ్య నున్న బ్రహ్మ వలె ప్రకాశించెను.
‘‘బాలానందిని’’ యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు,
బాలకాండములో డెబ్బదిరెండవ సర్గ సమాప్తము.
